
హైదరాబాద్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది చార్మినార్. ముస్లింల పరిపాలన కాలంలో చార్మినార్ నిర్మాణం జరిగింది. కూలి కుతుబ్ షా హాయంలో చార్మినార్ నిర్మాణం చేపట్టారు. చార్మినార్ చరిత్ర అందరికీ తెలిసిందే. ఆ కాలం నాటి చరిత్రను సైతం నేటి సమాజం కూడా తెలుసుకునేలా పుస్తక రూపంలో చార్మినార్ చరిత్రను పొందుపరిచారు. చార్మినార్ ఎంత ఫేమసో చార్మినార్ కట్టడాన్ని ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు దేవాలయం కూడా హైదరాబాదులో చాలా ఫేమస్. చార్మినార్ చరిత్ర అందరికి తెలిసిందే కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి చరిత్ర చాలా మందికి తెలియదు.
ఒక ముస్లిం కట్టడం పక్కనే హిందూ దేవాలయాన్ని ఏ విధంగా నిర్మించారో ఎవరికి తెలియని విషయం. అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నిర్మించడానికి కూడా బలమైన కారణం ఉందట. చార్మినార్ ముస్లింల కట్టడం.. భాగ్యలక్ష్మి అమ్మవారు హిందూ దేవాలయం. చార్మినార్ ని చూడడానికి వచ్చిన పర్యాటకులు కచ్చితంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని వెళతారు. ఇప్పటికీ చార్మినార్ ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద కొందరు ముస్లిం మతస్థులు పులిహోర రూపంలో అమ్మవారి ప్రసాదం నైవేద్యంగా పంచి పెడతారు. కానీ చార్మినార్ కట్టించిన కాలం నుండే భాగ్యలక్ష్మి అమ్మవారు దేవాలయం ఉందా అన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు. చార్మినార్ కట్టించిన నాటి నుండే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం మాత్రం అక్కడ లేదు. తర్వాత కాలంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అసలు చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారు ఏ విధంగా కొలువుదీరారు? ఆ దేవాలయం విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజులు హైదరాబాదు నగరాన్ని పరిపాలిస్తున్న కాలం అది. అప్పుడు హైదరాబాద్ నగరం చిమ్మ చీకటిలో ఉంది. ఆ సమయంలో చార్మినార్ వద్ద రాజభటులు కాపలాగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక స్త్రీ అక్కడకు వచ్చింది. రాజ భటులు ఆవిడను ఆపి ఎవరు నీవు ఈ నగరంలో ఇంత రాత్రి వేళ నీకు ఏమి పని అని అడిగారు. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ తాను లక్ష్మీదేవి నని ఆ రాజ్యంలో ఉండడానికి వచ్చానని చెబుతుంది. అప్పుడు రాజభటులు ఈ నగరంలో కొత్త వాళ్ళు ఎవరైనా నివసించాలనుకుంటే తప్పనిసరిగా రాజు యొక్క అనుమతి తీసుకోవాలని అంటారు. అప్పుడు ఆ లక్ష్మీదేవి సరే మీరు వెళ్లి ఆ రాజు గారి యొక్క అనుమతిని తీసుకొని రండి మీరు వచ్చేంతవరకు తాను అక్కడే ఉంటానని చెబుతుంది.
ఈ విషయాన్ని రాజభటులు గోల్కొండ నవాబులకు తెలియజేస్తారు. గోల్కొండ నవాబులు అన్ని పరిశీలించి అంత రాత్రివేళ ఆ మహిళ రావడం తెలుసుకొని.. వచ్చింది మామూలు స్త్రీ కాదని లక్ష్మీదేవి అని ఎలాగో రాజ భటులు వచ్చేంత వరకు ఎదురు చూస్తానని చెప్పింది. కాబట్టి రాజబటులు రాకుండా ఉంటే ఆమె అక్కడే ఉండిపోతుందని, తన రాజ్యమంతా సిరిసంపదలతో నిండిపోతుంది అని గోల్కొండ నవాబులు భావించారు. రాజు అనుమతి కోసం వెళ్ళిన ఆ సైనికులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో లక్ష్మీదేవి అక్కడే ఉండి పోయిందట. ఇది హైదరాబాదులోని చార్మినార్ ను ఆనుకొని ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఆలయంలోని అమ్మవారి గురించి ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ. అయితే ఇది ఇలా జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవు కాని ప్రస్తుతం చార్మినార్ వద్ద ఒక గుడి ఆ గుడిలో భాగ్యలక్ష్మి అమ్మవారు రోజు పూజలు అందుకుంటుంది.
అసలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు. అందులో ఉన్న విగ్రహం నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవి యేన. లేకపోతే మానవులు ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్టించారా. అసలు ఇంతకీ అంతకుముందు అక్కడ గుడి ఉందా లేదా, తర్వాత కట్టారా అనేటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చార్మినార్ వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ శాసనాలు కానీ చరిత్రలో తెలియజేయబడలేదు. సాధారణంగా హిందూ దేవాలయాలను నిర్మించినప్పుడు కచ్చితంగా వాటికి శాసనాలు ఉంటాయి. అంటే ఆ గుడిని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు అనే విషయాలను శాసనం ద్వారా లిఖిస్తారు. ఒకవేళ ఆ గుడిని ఎవరైనా నిర్మించినటువంటి పరిస్థితి అయితే, లేకపోతే ఆ గుడికి ఎవరైనా భూములు దానం చేసినట్లయితే ఆ వివరాలు కూడా శాసనం ద్వారా లిఖించబడి ఉంటాయి. కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి శాసనాలు దొరకలేదు.
దీనిని బట్టి ఆలోచిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం పురాణ కాలం నుండి మాత్రం లేదు అనేది తెలుస్తోంది. అయితే ఈ దేవాలయాన్ని ఎప్పుడు కట్టారు అన్నదానికి సమాధానంగా కొంతమంది 1967 అని చెబుతున్నారు. ఆ కాలంలో ఆ ప్రాంతం వరకు కూడా చార్మినార్ పక్కన ఒక రాయి ఉండేదట. ఆ రాయినే హైదరాబాద్ జీరో మైల్ రాయిగా చెబుతూ ఉంటారు. అయితే 1967లో ఒక బస్సు డ్రైవర్ చూడకుండా వచ్చి ఆ రాయిని గుద్దేశాడట. అప్పుడు ఆ రాయి పగిలిపోయింది. వెంటనే అక్కడకు ఆర్య సమాజ్ వారు చేరుకొని అది రాయి కాదు భాగ్యలక్ష్మి దేవి యొక్క రూపం అని చెప్పి అప్పటికప్పుడు 4 పైపులతో రెండున్నర అడుగుల ఎత్తులో ఒక షెడ్డు ఏర్పాటు చేస్తారు. ఇదే మొట్టమొదటిసారిగా చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి దేవికి ఏర్పాటు చేసిన ఒక నిర్మాణం.
అయితే ఈ విషయాలన్నింటికీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే మనకు స్వతంత్ర భారతంలో మతకలహాలు అనే పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. ఆ పుస్తకంలో అప్పటి చార్మినార్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులను ప్రస్తావించడం జరిగింది. ఆ పుస్తకంలో ఒక మినార్ పక్కన ఒక రాయి ఉండేదని, 1965లో ఆ రాయికి కాషాయం రంగును పూసి అక్కడే ఉన్న ఒక ముసలావిడకి ఆ రాయిని చూసుకునేటువంటి బాధ్యతలను అప్పజెప్పారట. 1967 కాలంలో ఒక బస్సు వచ్చి ఆ రాయిని గుద్దేయడం వెంటనే అక్కడికి కొందరు చేరుకొని పగిలిపోయిన ఆ రాయి ప్లేసులో లక్ష్మీదేవి ఫోటోని పెట్టి గుడిని కట్టడం జరిగింది అని చెబుతున్నారు. అయితే ఇదే విషయమై అప్పటి కాలంలో గొడవలు కూడా జరిగాయి. రాత్రికి రాత్రి ఇక్కడ గుడిని ఎలా కడతారని చెప్పి హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు కూడా జరిగాయి.
అదే సమయంలో తెలంగాణలో జోరుగా ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ గుడికి సంబంధించిన వివాదాలు అంతగా బయటకు రాలేదు. దీంతో అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు ఆ రాయి ప్లేస్ లో పూజలను అందుకుంది. ఆ తర్వాత 1979లో కొందరు దుండగులు సౌదీలోని పవిత్ర మసీదులోకి చొరబడ్డారు. తర్వాతి రోజు శుక్రవారం కాబా ఘటనకు నిరసనగా హైదరాబాదులో ఆందోళనలు చేశారు. అదే సమయంలో చార్మినార్ పక్కన ఉన్నటువంటి స్థానిక ముస్లింలు అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని కట్టడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై అక్కడున్న ముస్లింలకు, హిందువులకు కూడా గొడవలు జరిగాయి. ఆ గొడవలో భాగంగా అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం పగిలిపోయింది. దీంతో వెంటనే 1979 నవంబర్లో పగిలిపోయిన చిత్రపటానికి బదులు అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆ వెంటనే అక్కడ గుడిని కూడా కట్టించారు. దేవాలయ నిర్మాణాన్ని రాను రాను క్రమక్రమంగా పెంచుకుంటూ పోయారు.
అయితే ఆ గుడిని కట్టడానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి రాయి రూపంలో ఉండేదని, అక్కడ ఆమెకు పసుపు కుంకుమలతో పూజలు చేసే వారని అనే విషయం కూడా మనకు తెలుస్తోంది. మరి అక్కడ రాయ పురాతన కాలం నుంచే ఉంది అనడానికి ఏదైనా ఆధారం ఉందా అంటే ఉంది. అదేంటంటే అప్పట్లో హైదరాబాదులో ఏ ప్రధాన కట్టడం నిర్మించిన ఆ కట్టడానికి రక్షణగా కచ్చితంగా ఒక అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించేవారట. హుస్సేన్ సాగర్ వద్ద కట్ట మైసమ్మ, గోల్కొండ లోని అమ్మవారి గుడి, పురాణ పూల్ వద్ద ఉన్నటువంటి అమ్మవారు ఇవన్నీ కూడా అందుకు నిదర్శనాలు. వీటన్నింటినీ పరిశీలిస్తే చార్మినార్ కూడా భారీ కట్టడమే కాబట్టి దాన్ని నిర్మించేటప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ఉంటారని కాకపోతే అది ఫోటోలు తీసినప్పుడు కనపడి ఉండకపోవచ్చు అని మరి కొంతమంది వాదిస్తున్నారు.
అప్పటివరకు అమ్మవారు రాయి రూపంలో ఉంటూ పూజలు అందుకుంటూ ఉంది. కానీ ఆమెకు ప్రత్యేక గుడి లేదు. కావాలంటే మనకు చార్మినార్ నిర్మించిన మొదట్లో ఉన్న ఫోటోలో ఎటువంటి రాయి మనకు కనిపించదు. గుడి నిర్మాణం కూడా కనిపించదు. కానీ రాయి మాత్రం పూజలు అందుకునే ఉండొచ్చని మరి కొంతమంది వాదిస్తున్నారు. చార్మినార్ నిర్మించినప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారు గుడికి సంబంధించిన కానీ, రాయికి సంబంధించి గాని ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి శాసనాలు కానీ ఎటువంటి డాక్యుమెంటరీలలో ఎటువంటి పుస్తకాలలో కూడా మనకు లభించలేదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హైదరాబాదులోని ఎన్నో పాత పాత గుళ్ళకి శాసనాలు ఉన్నాయి. కానీ భాగ్యలక్ష్మి గుడికి మాత్రం ఆ రాయికి సంబంధించి ఎలాంటి చరిత్ర కానీ, శాసనాలు కానీ లేకపోవడం. అటు పురావస్తు శాస్త్రం వారు ఈ గుడిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి ఈ కట్టడం యొక్క బాగోగులు వారే చూసుకుంటున్నారు.
1951 నుంచి చార్మినార్ కు సంబంధించిన ప్రతి రికార్డు వారి వద్ద ఉంది. కానీ ఈ గుడికి సంబంధించిన వివరాలు మాత్రం అడిగినప్పుడు వాళ్లలో ఎవరు కూడా స్పందించడం లేదు. ఏదైనా విషయం కావాలంటే ఢిల్లీలోని హెడ్ ఆఫీస్ కి వెళ్లి విషయాలను తెలుసుకోమంటున్నారు. మరి అన్ని విషయాలు వారి వద్ద ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గుడి గురించి నోరు విప్పడానికి వారు ఎందుకు భయపడుతున్నట్లు అర్థం కాని ప్రశ్న. ఏది ఏమైనా ఒక పురాతన కట్టడానికి యునెస్కో హెరిటేజ్ హోదా రావడం అనేది చాలా గొప్ప విషయం కానీ చార్మినార్ కు ఆ ట్యాగ్ రాకపోవడం కారణం ఈ గుడి అని అంటారు. ఎందుకంటే యునెస్కో ఏదైనా ఒక ప్రదేశానికి ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే ఆ ప్రదేశం అనేది ఎలాంటి ఆక్రమణ లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి. కానీ చార్మినార్ విషయానికి వస్తే భాగ్యలక్ష్మి అమ్మ వారి గుడి అందుకు అడ్డంకిగా మారింది.
ఈ గుడికి సంబంధించిన వివాదాల కారణంగానే చార్మినార్ కి హెరిటేజ్ హోదా అనేది రాలేదు. గోల్కొండ కోట విషయంలో కూడా ఇదే జరిగింది. గోల్కొండ చుట్టుపక్కల ఇల్లు ఉన్న కారణంగా గోల్కొండ కి కూడా యునెస్కో హెరిటేజ్ హోదా అనేది లభించలేదు. మొత్తానికి చార్మినార్ పక్కన ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ అనేది ఈ మధ్యనే కట్టారు అనేది వాస్తవం. కానీ ఆ గుడి కట్టక ముందు అక్కడ ఉన్నది రాయి రూపంలో అమ్మవారి విగ్రహం అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కొంతమంది రాయి అంటే మరి కొందరు దేవత విగ్రహం అంటున్నారు. మన తెలంగాణలో చాలా మంది దేవత విగ్రహాలు రాయి రూపంలోనే ఉంటాయి. గ్రామాల్లో బొడ్రాయి పేరు మీద బోనాల పండుగ కూడా జరుపుకుంటారు. కాబట్టి ఆ కాలంలో చార్మినార్ పక్కన ఉన్నటువంటి ఆ రాయి దేవత విగ్రహమేనని కొందరు వాదిస్తున్నారు.