CINEMATelugu Cinema

భారతీయ సినీరంగంలో ఇప్పటివరకు ఏకైక అందాల తార.. కాంచనమాల..

స్త్రీ ఒక మాట వల్ల, చూపు వల్ల పురుషునికి సందిచ్చిందా… ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి…  నిప్పు వలె ఉండాలి”—— చలం

ఈ మాటలు అలనాటి కాంచనమాల కు సరిగ్గా అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. భారతీయ సినిమా రంగం తొలి దశకంలో తెలుగు సినిమా రంగాన్నే తన మనోహరమైన అందం, సహజనటన, కోకిల గానంతో చకచ్ఛకితం చేసిన తార “కాంచనమాల”. కాంచనమాల స్లీవ్ లెస్ జాకెట్, పెద్ద చెవి రింగులు, అందమైన కళ్ళు, చిరునవ్వు ఒలకించే పెదవులు, చేతిలో కాఫీ కప్, భుజాలమీదకు విరబోసుకున్న జుట్టుతో అందంగా వుండే ఈ అందాలరాశి బొమ్మ ఉన్న కాలండరు 1940 వ సంవత్సరములో ప్రతి ఇంటికీ అదొక అలంకారం. ఆ కాలండర్ “మాలపిల్ల” సినిమాకు సంబంధించినది. నటనా ప్రావీణ్యం లేకుండా కేవలం తన అందంతోనే ప్రసిద్ధి చెందింది కాంచనమాల.

తెలుగు సినిమాలపైన, ప్రధానంగా కథానాయికల గురించి వ్రాసేవారు అందంలో కాంచనమాలనూ, నటనలో సావిత్రినీ ప్రస్తావించకుండా ఉండలేరు. ఈ తరం వారికి  కాంచనమాల పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ తాను తొలి “సూపర్ హీరోయన్” గా గుర్తింపు పొందారు. అందం, అభినయం, మధురస్వరం కాంచనమాలను అనతికాలంలోనే అందలం ఎక్కించాయి. వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న 1940 దశకం రోజుల్లోనే ఆమె పది వేల రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు. మహానటి భానుమతి తన తొలి రోజుల్లో మద్రాసులో ఉండే సమయంలో తమ వీధి గుండా వెళ్లే “కాంచనమాల” ను చూసేందుకు ఎంతగా ఉవ్విళ్ళూరేదో తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. అదే కాంచనమాల గొప్పతనం.

కాంచనమాల తొమ్మిదేళ్ల కాలంలో నటించిన చిత్రాలు డజనుకు ఒకటి తక్కువే. అయినా కూడా శతాధిక చిత్రాలకు సరిపడా పేరు, ప్రజాదరణను కాంచనమాల సంపాదించుకున్నారు. ఆమె నటిగా ఎంతటి “గ్లామర్” సొంతం చేసుకున్నారంటే, శ్రీశ్రీ వంటి మహాకవి రాక్సీలో నార్మా షేరన్, బ్రాడ్ వేలో కాంచనమాల, ఎటకేగుటో సమస్య తగిలిందొక విద్యార్థికి అని వ్రాశారు. కెమెరా ముందు పనికిరావన్న దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం తన మాటను వెనక్కి తీసుకొని తన మాలపిల్ల సినిమాలో తనను కథనాయికగా తీసుకున్నాడు. గొంతు బాగాలేదన్న సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు ఆమె చేత పాట పాడించక తప్పలేదు. తన ప్రతిభాపాఠవాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా ప్రతీ అంశంలో తనదైన ముద్ర వేసిన “కాంచనమాల” చివరికి సినీరంగపు కుట్రలకు, కుతంత్రాలకు బలవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అదే విధి విచిత్రం.

“దుర్మోహితులు అందాన్ని నాశనం చేయాలనుకుంటే, గులాబీని ముళ్ళుకూడా రక్షించలేవు”. ఇదే ఆమె జీవితం నేర్పిన నీతి వాక్యం…!!

జీవిత విశేషాలు…

జన్మ నామం   :    చిత్తజల్లు కాంచనమాల

ఇతర పేర్లు    :    కాంచనమాల 

జననం    :    05 మార్చి 1925   

స్వస్థలం   :   కూచిపూడి (అమృతలూరు), గుంటూరు జిల్లా,

వృత్తి      :   నటి

బాబాయి       :     వీరస్వామి

జీవిత భాగస్వామి :  గాలి వెంకయ్య

మరణ కారణం   :    సహజ మరణం 

మరణం   :   24 జనవరి 1981, చెన్నై, తమిళనాడు

నేపథ్యం..

“ఆంధ్రా ప్యారిస్” గా గుంటూరు జిల్లా తెనాలి ప్రసిద్ధి. తెనాలి దగ్గర గల ఐతావరప్పాడు గ్రామంలో 05 మార్చి 1917లో కాంచనమాల జన్మించింది. ఆమె తండ్రి దాసరి నారాయణ దాసు. కానీ ఆమె తన పినతండ్రి వీరస్వామి ఇంట్లో పెరిగి పెద్దదయ్యింది. వీరస్వామి వాయిద్య కారుడు కావడంతో చిన్నతనంలోనే కాంచనమాల కు సంగీత జ్ఞానం అలవడింది. ఆరు సంవత్సరాల వయస్సు నుండి పాడడం మొదలుపెట్టిన తాను యుక్త వయస్సు వచ్చేసరికి మధురగాయని అయ్యింది. నాటకాల్లో స్త్రీ పాత్రలు మగవారే పోషిస్తున్న 1930 ప్రాంతాల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు స్త్రీ పాత్రను స్త్రీలతో వేయించాలని నిర్ణయించుకొని దానికి సంబంధించిన ప్రకటనని ఒక దినపత్రికలో ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన కాంచనమాల తండ్రి నారాయణ దాసు కూతురుతో కలిసి రాజమండ్రి వచ్చేసి లక్ష్మీనరసింహం పంతులును కలిశాడు. దాంతో పంతులు ఎంతో సంతోషించి “సారంగధర” నాటకంలో చిత్రాంగి పాత్రకు “కాంచనమాల” తో రిహార్సల్ చేయించారు. ఈ సారంగధర నాటకం ప్రదర్శిస్తున్న రోజున “స్త్రీ పాత్రను స్త్రీ పోషిస్తున్న తొలి నాటకం” అని ప్రకటన ఇవ్వడంతో ఆ నాటకం చూడడానికి జనం బారులు తీరారు. అలా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన కాంచనమాల ఆ తరువాత కాలంలో “విప్రనారాయణ”, “సక్కుబాయి” లాంటి నాటకాలలో నటించింది.

సినీ నేపథ్యం…

కాంచనమాల తొలిసారిగా శ్రీకృష్ణతులాభారం (1935) సినిమాలో మిత్రవిందగా వేషం వేసింది. తాను వేసింది చిన్నవేశమే అయినా తన అందంతో చూపరులను కట్టిపడేసింది. ఈ చిత్రం యొక్క నిర్మాణం కలకత్తాలో   జరిగింది. సినిమా రంగం తనకు గిట్టుబాటు కాదు అని తాను నిర్ణయించుకుని తాను కేవలం నాటకాలకు పరిమితమైంది. వీరాభిమన్యు (1936) చిత్రంలో ఉత్తర పాత్రను పోషించిన కాంచనమాల తన అద్భుతమైన సౌందర్యంతో ఉత్తరాది వారిని కూడా ఆకర్షించింది. తాను బొంబాయిలో ఉండిపోతే పెద్ద హీరోయిన్ ను చేస్తామని తనకు అవకాశాలు ఇచ్చినా కూడా దానికి ఆమె అంగీకరించలేదు. తాను తెలుగుభాష మీద మమకారంతోనూ, తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వాలని నిర్ణయించుకుంది. అటు పిమ్మట తాను “విప్రనారాయణ”, “గృహలక్ష్మి” చిత్రాల్లో నటించింది.

వొద్దన్న వారితోనే ఒప్పించి…

1938 వ సంవత్సరంలో రెండు సంచలన చిత్రాలలో ఆమె నటించింది. ఒకటి మాలపిల్లల్లో హీరోయిన్ గా, రెండోది గృహలక్ష్మిలో వేశ్య గా 1938 తరువాత ఆమె తిరుగులేని తార. నాటి నిర్మాతలు, దర్శకులు అంతా ఆమెతో సినిమా తీస్తే విజయం ఖాయమని నమ్మకంతో వెంటపడేవారు.  1940లో ఆంధ్రపత్రిక తొలిసారిగా సినిమా బ్యాలెట్ ప్రవేశపెట్టింది. ప్రారంభ సంవత్సరం ఉత్తమ నటిగా కాంచనమాలను తెలుగు ప్రేక్షకులు ఎంచుకున్నారు. సినీరంగంలోకి ప్రవేశించిన ఐదేళ్ల కాలంలోనే కాంచనమాల తారగా తలుక్కుమంది.

గూడవల్లి రామబ్రహ్మం ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్న రోజులలో ఒకసారి కాంచనమాలను చూసి ఈమెది సినిమాలకు పనికొచ్చే ముఖం కాదు, తాను సినిమాలకు పనికిరాదు అన్నారట. అటువంటి వ్యక్తి మాలపిల్ల (1938) సినిమా తీస్తూ కాంచనమాలని కథనాయికగా తీసుకోవడం విశేషం. ఇత్యాది పాత విషయాన్ని కాంచనమాల గుర్తు చేస్తే గూడవల్లి రామబ్రహ్మం పొరపాటైందని ఒప్పుకున్నారట. “మాలపిల్ల” సినిమా కాంచనమాల సినీ ప్రస్థానానికి భారీ కుదుపు. తాను పొట్టి చేతుల జాకెట్టుతో కాంచనమాల ఉన్న క్యాలెండర్లు ముద్రిస్తే విపరీతంగా అమ్ముడయ్యాయి. ఆ సినిమాతో ఆమె ఎందరికో కలల రాణి అయ్యింది.

వందేమాతరం (1939), మళ్లీ పెళ్లి (1939), మైరావణ (1930), ఇల్లాలు (1940), బాలనాగమ్మ (1942) అంతే.  ఇక్కడితో ఆమె సినీ ప్రస్థానం ముగిసిపోయింది. “బాలనాగమ్మ” చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత వాసన్ తో గొడవపడడం, ఇద్దరు పంతాలకు పోవడం కాంచనమాల జీవితానికి శాపంగా మారింది. ఆ తరువాత ఆమెకు మతి చలించిందని కొందరు, మనస్థాపం చెంది పరిశ్రమకు దూరమైందని మరికొందరు చెబుతారు. ఏది ఏమైనా ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ల పాటు చిత్ర రంగానికి దూరంగా ఉంటూ అనామకంగానే బ్రతికింది.

అహంభావి…

ఇల్లాలు (1940) చిత్రంలో కాంచనమాల, లక్ష్మీ రాజ్యం కలిసి నటించారు. కాంచనమాల అప్పటికే కథానాయకిగా పేరు తెచ్చుకోవడంతో చాలా అహంకారంతో ప్రవర్తించాలని ఆమె ఎవ్వరినీ లెక్క చేసేవారు కాదని చెబుతారు. బియ్యం బస్తా మూడు రూపాయలు ఉండే ఆ రోజుల్లో కాంచనమాల సినిమాకు పదివేల రూపాయల పారితోషికం తీసుకునేది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కావడంతో ఆమె మాటనే చెల్లేది. అందుకు ఉదాహరణగా చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో టైటిల్ పాత్రకి మొదట లక్ష్మీరాజ్యంను ఎంపిక చేసినా అప్పటికే పెద్ద హీరోయిన్ కావడంతో టైటిల్ పాత్రను తనే వేస్తానని కాంచనమాల పంతం పట్టింది. ఆ సమయంలో “లక్ష్మీరాజ్యం” ఎదుగుతున్న కథానాయిక. అటువంటి నటితో తాను నటించనని మొండికేసింది.

“మాలపిల్ల” సినిమాలో అవకాశం కల్పించి కాంచనమాల ఉన్నతికి కారకుడైన గూడవల్లి రామబ్రహ్మం గారు ఈ చిత్రానికి దర్శకులు. ఆయన మాట కూడా ఆమె వినలేదు. ఎలాగోలా నచ్చజెప్పి ఆ పాత్రను కాంచనమాలకు ఇచ్చి మరో పాత్రను లక్ష్మీరాజ్యంకు ఇచ్చారు. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో కాంచనమాల భుజం పట్టుకుని లక్ష్మీరాజ్యం కుదిపేస్తూ ఉద్రేకంగా సంభాషణ చెప్పాలి. అయితే తనని ముట్టుకోవడానికి కాంచన మాల మొదటి అంగీకరించలేదు. ఈ చిత్ర రచయిత తాపీ ధర్మారావు నచ్చచెప్పిన తరువాత అయిష్టంగానే ఆమె అంగీకరించింది.  అయితే తర్వాత కాంచనమాల లక్ష్మీరాజ్యం మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహభావంతోనే కాంచనమాల కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాలని ఎన్నోసార్లు లక్ష్మీరాజ్యం ప్రయత్నించారు.

ఇల్లాలు సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఆ సమయంలో ఆయన వయస్సు 19 యేండ్లు. అప్పటికింకా నేపథ్య గానం రాకపోవడంతో ఎవరు పాటలు వాళ్లే పాడుకునేవారు. సంగీత దర్శకుడు వాళ్లకు వరుసలు నేర్పించి రిహార్సల్ చేయించేవారు. ఇల్లాలు సినిమా కార్యాలయం కు వచ్చి రాజేశ్వరరావును చూసి ఈ కుర్రడా సినిమాకు సంగీత దర్శకుడు. ఈయన పాట నేర్పిస్తే నేను పాడాలా. కుదరదు వెంటనే మార్చేసి వేరే సంగీత దర్శకుని పెట్టండి అని కాంచనమాల వెళ్లిపోయిందట.  రామబ్రహ్మం నచ్చజెప్పడంతో ఆమె ఆ పాత్రను అంగీకరించింది. ఆ తర్వాత జెమినీ వారి బాలనాగమ్మకు సంగీత దర్శకత్వం వహించిన రాజేశ్వరరావు, ఆ సినిమాలో వద్దిరాజు పాత్ర ఆయనే చేయాల్సి వచ్చింది. అయితే బాలనాగమ్మ గా నటించే కాంచనమాల ఇంత పెద్ద కుర్రాడు నా కొడుకు ఏమిటి అని అభ్యంతర వ్యక్తం చేయడంతో ఆ పాత్రకు వేరే వాళ్ళని తీసుకున్నారు. అలా కాంచనమాల చెప్పిందే వేదంగా ఉండేది ఆ రోజుల్లో.

శూన్యంలోకి…

వెలిగే చంద్రుని కాటేసేందుకు రాహు కేతు ప్రయత్నించినట్టే, సినీ వినీలాకాశంలో తిరుగులేని తారగా ఉన్న కాంచనమాలను కబళించేందుకు జెమినీ సంస్థ స్థాపకుడు యస్.యస్.వాసన్ సిద్ధమయ్యాడు. బాలనాగమ్మ సినిమాను తీయాలనుకొని ఆ పాత్రకు తగినట్టుగా కాంచనమాలని ఎంచుకున్నాడు. అయితే ఆమెను ఏ మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడో తెలియదు. లేదా జెమినీ సంస్థ మీద ఉన్న అపార నమ్మకంతో ఒప్పందం మీద సంతకం చేసిందో తెలియదు, కానీ కాంచనమాల తన మరణ శాసనం తనే రాసుకున్నట్టయింది.

జెమినీ సంస్థ సినిమాలతో తప్పించి ఇతర సంస్థలకు సినిమాలు చేసేందుకు వీలు లేదన్నది ఆ ఒప్పందం. జెమినీ వారి అనుమతి తప్పనిసరి. బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ సమయంలో నిర్మాత వాసన్ తో అవాంఛనీయ విభేదాలు ఏర్పడ్డాయి. “బాలనాగమ్మ” విడుదలైంది. జెమినీ సంస్థకు కనకవర్షం కురిపించింది. కానీ కాంచనమాల కంట కన్నీరు నింపింది. జెమినీ ఒప్పందంలో బందీ అయ్యి ఇతర సినిమాలు అంగీకరించలేని పరిస్థితి కాంచనమాలది. జెమినీ సంస్థలో బయటపడని మరో కుట్ర జరిగింది. అక్కడి దర్శకులలో ఎవరో ఏదో మెలిక వేశారు. జెమినీ సంస్థ సినిమాలు చేసేందుకు వీలు లేకుండా పోయింది.

తనువుకెన్ని గాయాలైనా మానిపోతాయి. కానీ హృదయానికి ఒక్క గాయమైనా మానటం కష్టమనేది కాంచనమాలకు అక్షరాల వర్తిస్తుంది. జెమినీ వాసన్ కొట్టిన దెబ్బలకు ఆమె హృదయం  కకావికలామైంది. లోకంలో ఇన్ని కుట్రలు, కుళ్ళు ఉంటాయని తెలియని ఆమె ఊహించని పరిణామాలకు కృంగిపోయింది. ఒత్తిడిలోకి వెళ్ళింది. మతి చలించింది. మతిస్థిమితం కోల్పోయిన ఆమె మద్రాసులో, ఆపైన తెనాలిలో గడిపింది. ఎవరితో మాట్లాడేది కాదు, ఆమె చూపులు ఈ లోకంలో ఉండేవి కావు.

పునః వైభవానికి సన్నిహితుల ప్రయత్నం...

కాంచనమాల చిన్నప్పటి నుండి తనకు అండదండగా నిలిచిన వెంకయ్యను ఆమె వివాహం చేసుకుంది. వెంకయ్యకు క్షయ వ్యాధి సోకితే చికిత్స కోసం ఎంతో శ్రమపడింది. అయినా కూడా ఆయన దక్కలేదు. భర్త మరణం తనను క్రుంగదీసింది. సినీరంగ ద్రోహం తనను కలచివేసింది. తాను పిచ్చిదైపోయింది. వేళకు తినడం మానేసింది. చెల్లెలు ఇంట్లోనే ఉండేది. ఎప్పుడూ చెట్టు క్రింద కూర్చుని ఆకాశంలోకి చూస్తుండేది.  తనను ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలని, ఆమెలోని నటికి పునః ప్రతిష్ట చేయాలని కొందరు ప్రయత్నించారు. దర్శకులు త్రిపురనేని గోపీచంద్ 1950లో అనాథబాల అనే సినిమాను కాంచనమాలతో తీస్తానని  ప్రకటించారు. కానీ ఆ సినిమా రూపుదిద్దుకోలేదు. ఆమెతో సక్కుబాయి నాటకం వేయించినా కూడా అది ఆదరణ పొందలేదు. నాటకాల కోసం ఆమె పడుతున్న హైరానా సహించలేక కాంచనమాల చెల్లెలు, మరిది వాటిని ఆపేశారు. ఆ తర్వాత కాంచనమాల కనుమరుగైంది.

మూతబడిన కళ్ళు…

కాంచనమాలను తిరిగి మద్రాసు తెచ్చి, సినిమా స్టూడియోలకు తీసుకెళ్తే పాత కాంచనమాల అవుతుందన్న ఆశతో “నర్తనశాల” సినిమా నిర్మాత లక్ష్మీరాజ్యం ఆమె చేత ఒక పాత్ర వేయించింది. కాంచనమాల పాత్రను యాంత్రికంగా చేసింది తప్పితే మునుపటి ఉత్సాహం లేదు. ఆమె తిరిగి వచ్చిందని తెలిసిన సినీ అభిమానులు, సినిమా రంగం వారు ఎందరో వచ్చి పలకరించేందుకు గతం గుర్తుచేసే యత్నం చేశారు.  కానీ ఆమె మనసులో నుండి గతం తుడిచివేసుకుందో లేక ఈ కుళ్ళు సినీ రంగం గురించి నాకు ఎందుకు అనుకుందో తెలియదు కానీ, తనకు ఏ ఒక్క విషయం ఆమెకు గుర్తొచ్చినట్టు ప్రవర్తించలేదు. ఒకనాడు వేలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె కళ్ళు పిచ్చి చూపులుగా మారి, అణిచి వేయబడిన కళాతృష్ణ వల్ల తల్లడిల్లిన కాంచనమాల నలభై ఏళ్ళు “చివరి రోజులు” గానే గడిచిపోగా చివరికి  24 జనవరి 1981 నాడు మద్రాసులో శాశ్వతంగా మూతపడ్డాయి.

Show More
Back to top button