CINEMATelugu Cinema

విజయవంతమైన వైవిధ్య చిత్రాల దర్శకులు.. డి.యోగానంద్

ముప్పై సంవత్సరాల దర్శకుడు, తన సినీ జీవితం ఒక స్థిరమైన వేగంతో ప్రశాంతంగా ప్రవహించే నదిలాగా కొనసాగింది. పెద్దగా ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, గుణపాఠాలు, ఆకాశానికి చిల్లులు పడడం, పాతాళంలోకి జారిపోవడం లాంటి సంఘటనలు కానీ, అలాంటి సినిమాలు కానీ ఈ దర్శకుని జీవితంలో లేవు. ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. దానివల్ల తన సినీ జీవితం కానీ, వ్యక్తిగత జీవితం కానీ ప్రభావితమైన దాఖలాలు ఎక్కడా లేవు. 1950 – 1970 దశాబ్దాలలో చక్కని చలనచిత్రాలు రూపొందించిన ఈ దర్శకుడు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన పేరు చదివిన చాలామంది తాను తెలుగు వాడు కాదేమో అనుకుంటారు. కానీ తాను పదహారణాల ఆంధ్రుడు. తానే దర్శకులు డి.యోగానంద్.

ఎన్టీఆర్ గారి “జయసింహ”, “ఉమ్మడి కుటుంబం”, “కోడలు దిద్దిన కాపురం”, “అక్కినేని నాగేశ్వరరావు గారి “ఇలవేల్పు”, “మూగనోము”, “జై జవాన్” లాంటి సినిమాలు గుర్తుంటే మీకు యోగానంద్ గారు తెలిసినట్టే. తెలుగు సినిమా చరిత్ర, ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలు తెలిసిన వారందరికీ యోగానంద్ గారు చిరపరిచితులే. ఎన్టీఆర్ గారికి అత్యంత ఆత్మీయులలో ఒకరు డి.యోగానంద్ గారు. డి.యోగానంద్ గారు  సినీరంగంలో రంగ ప్రవేశం చేసిన కొత్తలో (1956 లో) కొద్ది సంవత్సరాలు డి.యోగానంద్ గారు, ఎన్టీఆర్ గారు, టీ.వీ.రాజు గారు, తాతినేని ప్రకాశరావు గారు, మరి కొంతమంది మిత్రులతో ఒకే రూమ్ లో ఉండేవారు. అప్పటికి ఇంకా డి.యోగానంద్ గారు దర్శకులు కాలేదు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆత్మీయ అనుబంధమై దశాబ్దాల పాటు కొనసాగింది.

ఎన్టీఆర్ గారు తిరుగులేని హీరోగా కొనసాగిన రోజులలో కూడా తన మిత్రులు, డి.యోగానంద్ గారి ప్రతిభ మీద నమ్మకంతో తన అనేక చిత్రాలకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ గారు, డి.యోగానంద్ గారు, టీ.వీ.రాజు గారు కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యోగానంద్ గారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. ఈ కోణంలో చూస్తే యోగానంద్ గారి జీవితంలో ఎన్నో మరుపురాని ఘట్టాలు, దర్శకుడిగా ఆయనకు ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి.

నందమూరి తారకరామారావు గారు తన నట జీవితంలో 93 మంది దర్శకుతో పనిచేశారు. వారిలో రామారావు గారిని అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన దర్శకులు ఎన్టీఆర్ గారే. పదిహేడు చిత్రాలు తన స్వీయ దర్శకత్వంలో రూపొందినాయి. ఎన్టీఆర్ గారిని ఒక తమిళ సినిమాతో కలుపుకొని, పదహారు సినిమాల్లో దర్శకత్వం చేసింది డి.యోగానంద్ గారు. ఆ రోజులలో యోగానంద్ గారిని ఎన్టీఆర్ గారి ఆస్థాన దర్శకుడు అనేవారు. ఎన్టీఆర్ గారిని పదహారు సినిమాలు దర్శకత్వం వహించిన ఘనత మరొక దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి కూడా దక్కుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ సొంత బ్యానర్లలో దర్శకుడుగా పనిచేసిన అరుదైన అవకాశం ఇద్దరికి దక్కిందని చెప్పవచ్చు, వారిలో ఒకరు కే.వి.రెడ్డి గారు అయితే ఇంకొకరు డి.యోగానంద్ గారు. ఏ.ఎన్.ఆర్ గారు భాగస్వామిగా ఉన్న అన్నపూర్ణ వారి జై జవాన్ సినిమాకు దర్శకత్వం వహించింది యోగానంద్ గారే.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    దాసరి యోగానంద్ 

ఇతర పేర్లు  :  డి.యోగానంద్ 

జననం    :     16 ఏప్రిల్ 1922    

స్వస్థలం   :    మద్రాసు , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

వృత్తి      :     చిత్ర దర్శకుడు 

తండ్రి    :   వెంకటదాసు 

తల్లి     :   లక్ష్మీభాయి 

జీవిత భాగస్వామి :  హనుమాయమ్మ

పురస్కారాలు   :    1981 లో కలైమామణి అవార్డు.

మరణం  :   23 నవంబరు 2006, 

చెన్నై , తమిళనాడు , భారతదేశం

నేపథ్యం...

డి.యోగానంద్ గారు 16 ఏప్రిల్ 1922 నాడు మద్రాసులో జన్మించారు. “రజా అలీ ఖాన్ బహదూర్” (బందరు నవాబు) ఎస్టేట్ కు యోగానంద్ గారి నాన్న వెంకట దాసు గారు ఎస్టేట్ మేనేజర్ గా పనిచేస్తుండేవారు. యోగానంద్ గారి అమ్మ పేరు లక్ష్మీబాయి. వెంకట దాసు గారు స్వతహాగా ఆస్తిపరులు. వారికి వ్యాపారాలు కూడా ఉండేవి. తాను గాయకులు. మృదంగం వాయిస్తుండేవారు. చక్కగా పాటలు కూడా పాడేవారు. తల్లి లక్ష్మీబాయి గారు బాగా చదువుకున్నారు. సంస్కృతంలో మంచి పాండిత్యం ఉంది. ఆమెకు ప్రాచీన సాహిత్యం అంటే మంచి అభిలాష కూడా ఉండేది. ఆమె కొంత కాలం బాపట్లలోనూ, గుంటూరులోనూ టీచర్ గా పనిచేసి యోగానంద్ గారు పుట్టడానికి ముందే మద్రాసు చేరుకున్నారు. అక్కడ వెంకట దాసు గారితో వివాహం అయ్యింది. 1954 సంవత్సరానికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. మగ పిల్లలలో పెద్దాయన పేరు కోటేశ్వరరావు. తాను భరణి స్టూడియోలో రికార్డిస్టుగా చేరారు. రెండో అబ్బాయి యోగానంద్.

బాల్యం…

చిన్నతనంలో యోగానంద్ గారు బాగా అల్లరి చేసేవారు. ఎవ్వరూ కూడా తనని పట్టుకోలేకపోయేవారు. ఎవరి మాట వినేవాడు కాదు. దురదృష్టవశాత్తు తాను ఐదవ సంవత్సరంలో ఉండగానే వాళ్ళ అమ్మగారు మరణించారు. యోగానంద్ గారి నాన్న గారు తన పిల్లలను చూసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో బందరుకు చెందిన తన బంధువు డి.సుబ్బయ్య కు యోగానంద్ గారిని పెంపుకు ఇచ్చారు. అలా తన ఐదవ సంవత్సరంలో యోగానంద్ గారు తన పెంపుడు తండ్రి వద్దకు బందరు వెళ్లారు. అక్కడ పది సంవత్సరాలు ఉన్నారు. డి.సుబ్బయ్య కు గడియారం వర్తకం, ఫోటోగ్రఫీ వ్యాపారం ఉండేది. ఈ రెండింటిలో యోగానంద్ గారిని బాగా ఆకర్షించింది ఫోటోగ్రఫీనే. యోగానంద్ గారు పెంపుడు తండ్రి దగ్గర నుంచి మంచి అనుభవం సంపాదించారు. చిన్న వయస్సులోనే తాను పాఠశాలలో చదివే రోజులలో పిల్లలను దగ్గరికి చేర్చి ప్రహ్లాద లాంటి నాటకాలు వేయిస్తుండేవారు. అందులో తాను “నరసింహం” లాంటి బీభత్సరసమైన పాత్రను ధరిస్తుండేవారు.

స్వాతంత్ర్యోద్యమంలో…

తాను బందరులో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. ఆ తరువాత తనను రేడియాలజీలో శిక్షణ కోసం పెంపుడు తండ్రి బెంగళూరుకు పంపించారు. అక్కడ శిక్షణ పూర్తయ్యాక తన స్వంత తండ్రి దగ్గరకు మద్రాసుకు చేరుకున్నారు. 1939లో వాళ్ల నాన్న గారి వ్యాపారాలు చూసుకున్నారు. 1940 లో జెమిని స్టూడియో వాళ్ళు “స్టిల్ ఫోటోగ్రాఫర్” కావాలని ప్రకటన చేశారు. కానీ వాళ్ళ నాన్నగారు వద్దని వారించడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. యోగానంద్ గారు ఆ సమయంలోనే క్విట్ ఇండియా  ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో రాజాజీ, ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి లాంటి వారు పరిచయమయ్యారు. భగత్ సింగ్ ఆత్మకథ చదివి ప్రేరణ పొందిన యోగానంద్ గారు ఆ రోజుల్లో మద్రాసులోని బీచ్ స్టేషన్ కి తాంబరం స్టేషన్ కి మధ్యలో నడిచే ఎలక్ట్రికల్ రైళ్ళ వైర్లు కత్తిరించడం లాంటి ఉద్యమంలో పాల్గొనేవారు. సంవత్సరం గడిచింది. యోగానంద్ గారి నాన్న గారు చనిపోయారు.

సినీ రంగ ప్రవేశం…

రాజకీయాలలో కంటే కూడా తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీనే ఎంచుకొన్నారు. సినిమాలలో ఎవరి వద్దనైనా అసిస్టెంట్ కెమెరామెన్ గా చేరడానికి వీలు అవుతుందా అని ప్రయత్నించే క్రమంలో “న్యూ టోన్స్ స్టూడియో” లో జతిన్ బెనర్జీ గారి వద్ద అసిస్టెంట్ కెమెరామెన్ గా చేరారు. మొదట్లో తనకు జీతం ఇచ్చేవారు కాదు.

అసిస్టెంట్ ఎడిటర్ గా…

జతిన్ బెనర్జీ, రెహమాన్, పురుషోత్తం లాంటి వారి వద్ద కొంతకాలం కెమెరామెన్ గా పనిచేసిన యోగానంద్ గారు 1943 చివరలో గూఢవల్లి గారు తీస్తున్న “మాయలోకం” సినిమాకు తన దగ్గర పనిచేస్తున్న ఎడిటర్ మాణిక్యం కు అసిస్టెంట్ గా యోగానంద్ గారిని తీసుకున్నారు.  వాళ్ళు యోగానంద్ గారికి జీతం ఇవ్వడం ప్రారంభించారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి యోగానంద్ గారి పనితనం నచ్చిన గూఢవల్లి గారు తనని దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా తీసుకున్నారు.  లంక సత్యం, లంక కామేశ్వరరావు గారు తీసే “తులసీదాసు” సినిమాకి సహాయ దర్శకుడిగా ఉన్న యోగానంద్ గారు “తులసీదాసు” సినిమా పనిమీద “సేలం” వెళ్లారు. అలా మూడు సంవత్సరాలు “సేలం” లోనే ఉండిపోయారు. అక్కడ నిర్మాణం అయ్యే తెలుగు, తమిళ సినిమాలకు సహాయ దర్శకుడి గాను, అసోసియేట్ ఎడిటర్ గానూ పనిచేశారు.

సహాయ దర్శకుడిగా…

ఈలోగా భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చింది. 1947 చివర్లో చిత్తూరు నాగయ్య గారి సొంత నిర్మాణ సంస్థ “రేణుక” తో చేరి కథా విభాగంలో రెండు సంవత్సరాలు పనిచేశారు. సి.వి.రంగనాథ దాసు గారు ఆంధ్ర నుండి మద్రాసుకు వచ్చి సినీ నిర్మాణం ప్రారంభించి, సినిమాలు తీద్దామని ఆచార్య ఆత్రేయ గారితో ఒక కథ వ్రాయించుకున్నారు. ఆ సినిమా పేరు “సంసారం”. ముందుగా ముదిగొండ లింగమూర్తిని దర్శకుడిగా ఎంచుకున్నారు. 1948లో సహాయ దర్శకుడు యోగానంద్ గారిని తీసుకున్నారు. ముదిగొండ లింగమూర్తికి, సి.వి.రంగనాథ దాసు గారికి మధ్య విభేదాలు తలెత్తడంతో దర్శకులు లింగమూర్తి ఆ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ కథతో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో సినిమా చిత్రీకరింపజేసి 29 డిసెంబరు 1950 లో విడుదల చేశారు.

ఎన్టీఆర్ గారి రూమ్ మేట్ గా…

మద్రాసు టి.నగర్ లోని విజయ రాఘవచారి రోడ్ లో రిపబ్లిక్ గార్డెన్స్ అనే ఇంట్లో అద్దెకు ఉండేవారు ఎన్టీఆర్ గారు. క్రింద ఆరు, పైన ఆరు పన్నెండు గదులుగా ఇల్లు ఉండేది. ఎన్టీఆర్ గారు ఉన్న రూమ్ లోనే డి.యోగానంద్ గారు, తాతనేని ప్రకాశరావు గారు, టీ.వి.రాజు గారు మరికొందరు ఉండేవారు. “సంసారం” చిత్రంలో ఎన్టీఆర్ గారు హీరో అయితే, యోగానంద గారు సహాయ దర్శకులు. సంసారం చిత్రం విడుదలై అత్యద్భుత విజయం సాధించింది. యోగానంద్ గారి ప్రతిభను గుర్తించిన ఎల్వి ప్రసాద్ గారు అతడిని తన దగ్గరే సహాయ దర్శకుడుగా ఉంచుకొని తాను దర్శకత్వం వహించిన అంజలి పిక్చర్స్ వారి “పరదేశి”, యల్.వి.ప్రసాద్ వారి “పెంపుడు కొడుకు” సినిమాలకు సహాయ దర్శకుడిగా కొనసాగించారు. 1950 – 1982 వరకు ఇది కొనసాగింది. ఎస్.ఎం.లక్ష్మణ చెట్టియార్ గారు, ఎం.కె.త్యాగరాజ భాగవతార్ గారి నాటకం “పావలాకోడి” ని సినిమాగా  ఇద్దరు కలిసి నిర్మించారు. ఈ సినిమా అత్యద్భుత విజయం సాధించింది.

దర్శకుడిగా తొలి సినిమా ఎన్టీఆర్ తో…

కృష్ణ పిక్చర్స్ స్థాపించిన లీనా చెట్టియార్ గారు సుమారు 15 సినిమాలను నిర్మించారు. 1952లో “అమ్మలక్కలు” (తమిళంలో “మరుమలన్”) సినిమా నిర్మించడానికి ఎల్వీ ప్రసాద్ గారిని సంప్రదించగా లేనా చెట్టియార్ గారికి, సహాయ దర్శకులుగా ఉన్న యోగానంద్ గారిచే దర్శకత్వం చేయించాల్సిందిగా యల్వీ ప్రసాద్ గారు సూచించారు. దాంతో యోగానంద్ గారికి తొలిసారి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. తెలుగులో “అమ్మలక్కలు”,  తమిళంలో “మరుమగళ్” ఈ రెండు సినిమాలకు దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. తొలిసారిగా రెండు భాషలలో దర్శకత్వం చేసే అవకాశం లభించడం, అది కూడా ఎన్టీఆర్ గారితో చేసే అవకాశం రావడం విశేషం. ఎన్టీఆర్, పద్మిని లు హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆ సినిమా 12 మార్చి 1953 నాడు విడుదలై రెండు భాషలలో అత్యద్భుతమైన విజయం సాధించింది. తమిళంలో కంటే తెలుగులో ఘనవిజయం సాధించడానికి ముఖ్య కారణం రేలంగి గారిపై చిత్రీకరించిన పాట మరియు రేలంగి గారి హాస్యం.

తోడుదొంగలు సినిమా…

తన తొలి సినిమా విజయవంతం అవ్వడమే కాకుండా అలా తన రూమ్ మేట్ ఎన్టీఆర్ గారితో తీసిన తొలి సినిమా అనుబంధం దాదాపు 30 సంవత్సరాలు పాటు కొనసాగింది. స్నేహబంధం లో ఉన్న మాధుర్యానికి చక్కటి ఉదాహరణ.  ఈ సినిమా పూర్తవ్వగానే ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్ నేషనల్ ఆర్ట్ థియేటర్ పై రెండవ సినిమాగా “తోడుదొంగలు” సినిమాని మొదలు పెట్టినారు. ఆ రోజుల్లోనే రెండు లక్షల రూపాయలు వెచ్చించి, నెల రోజుల్లో చిత్రీకరించారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ గారి చాలా చిత్రాలకు మాటలు వ్రాసిన జూనియర్ సముద్రాల గారు, ఆ సినిమాతోనే మాటల రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా దర్శకత్వం వహించింది టి.వి.రాజు గారు. తాను ఎన్టీఆర్ గారికి ఒకప్పటి రూమ్ మేట్. “తోడుదొంగలు” సినిమా 15 ఏప్రిల్ 1954 నాడు విడుదల అయ్యింది. ఈ సినిమా ఆర్థికంగా నష్టాలను మిగిల్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల జాబితాలో 1955లో ఈ చిత్రం ప్రశంసా పత్రాన్ని అందుకుంది.

ఎన్.ఏ.టి సంస్థ తొలి రజతోత్సవ చిత్రం “జయసింహా”…

ఎన్టీఆర్ గారి నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ లో మూడవ సినిమాకు యోగానంద్ గారే దర్శకత్వం వహించారు. ఈసారి వారు జానపద చిత్రం తీశారు. సినిమా పేరు “జయసింహ”. ఈ సినిమాకు వహీదా రెహ్మాన్ గారు కాంట్రాక్ట్ సంతకం చేసి కెమెరా ముందు నిల్చున్నారు. కాకపోతే ఈ సినిమా కంటే ముందే “రోజులు మారాయి” విడుదలైంది. దాంతో వహీదా రెహ్మాన్ గారి మొదటి సినిమా “రోజులు మారాయి” అని అనుకుంటారు. అదే రోజుల్లో విఠలాచార్య గారి “కన్యదానం” లో డాన్స్ చేశారు. కొందరు “కన్యాదానం” వహీదా రెహమాన్ గారికి తొలి సినిమా అనుకుంటారు. కానీ రికార్డుల ప్రకారం ఎన్టీఆర్ గారు నిర్మించిన మూడవ చిత్రం, యోగానంద్ గారు దర్శకత్వం వహించిన “జయసింహ”. ఈ సినిమాకు టీ.వీ.రాజు గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా 21 అక్టోబర్ 1955 నాడు విడుదలై అత్యద్భుతమైన విజయం సాధించింది.

అక్కినేని “ఇలవేల్పు”… 

ఎన్టీఆర్ గారి నిర్మాణ సంస్థకు తొలి రజతోత్సవం అందించిన చిత్రం యోగానంద్ గారు దర్శకత్వం వహించిన “జయసింహ” నే. అలాగే తన తొలి సినిమా కృష్ణ పిక్చర్ సంస్థకు కూడా యోగానంద్ గారు ఆస్థాన దర్శకుడు అయ్యారు. వారు నిర్మించిన అనేక చిత్రాలకు యోగానంద్ గారే దర్శకత్వం వహించారు. “జయసింహ” తర్వాత ఎల్వీ ప్రసాద్ గారి సొంత నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు దర్శకత్వం వహించాల్సిందిగా యోగానంద్ గారిని ఎల్వి ప్రసాద్ గారు కోరారు. దాంతో లక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై “ఎదిర్ పరదాతు” అనే తమిళ చిత్రాన్ని తెలుగులో “ఇలవేల్పు” గా పునర్నిర్మించారు. ఈ సినిమాకు అక్కినేని గారిని హీరోగా అనుకున్నారు. అంజలీదేవి గారు హీరోయిన్. డి.యోగానంద్ గారు ఈ సినిమాను అత్యద్భుతంగా మలిచారు. తన గురువు యల్వీ ప్రసాద్ గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ 21 జూన్ 1956 విడుదలై అత్యంత ఘనవిజయం సాధించింది. అనేక సెంటర్లలో శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా కాకినాడలోని మెజిస్టిక్ థియేటర్లలో 22 వారాల పాటు ప్రదర్శితమైంది.

సింహాళ భాషలో “సుందర పిరంద”…

“ఇలవేల్పు” సినిమా నిర్మాణంలో ఉండగానే కృష్ణ పిక్చర్స్ వారికి తమిళంలో “మదురై వీరన్” అనే సినిమాను యోగానంద్ గారి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎం.జీ.ఆర్ గారికి ఆ సినిమా రాబిన్ హుడ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం “ఇలవేల్పు” కంటే రెండు నెలల ముందే విడుదలయ్యి అత్యంత ఘనవిజయం సాధించింది. మొదటి నాలుగు సంవత్సరాలలోనే యోగానంద్ గారు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్ గార్లను దర్శకత్వం చేశారు. యోగానంద్ గారు తన సినీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. కొన్నిసార్లు ఒకేసారి నాలుగు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన రోజులు ఉన్నాయి. 1960లో సింహాళ భాషలో “సుందర పిరింద” అనే సినిమా తీశారు. దానికోసం తను “సిలోన్” వెళ్లి మూడు నెలలు ఉండి వాళ్ళ ఆచార వ్యవహారాలను దగ్గరుండి గమనించి “సుందర పిరింద” అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 1960లో శ్రీలంకలో 8 సినిమాలు విడుదలయితే అందులో మన తెలుగువాడు దర్శకత్వం వహించిన చిత్రం “సుందర పిరింద” కూడా ఒకటి. అందులో దర్శకుని పేరు డి.యోగానందన్ గా వేశారు.

నిర్మాత గా “బాగ్దాద్ గజదొంగ”..

సింహాళ భాషలో తీసిన “సుందర పిరింద” సినిమా కూడా డి.యోగానంద్ గారి సినీ జీవితంలో ఒక మైలురాయి. పార్తీబన్ కనవు (1961), రాణీ సంయుక్త (1963), కవేరియన్ కనవన్ (1965),  ఇలా తమిళంలో తీస్తూ, తెలుగులోకి అనువదిస్తూ, 1967 లో ఎన్టీఆర్ గారి హీరోగా “ఉమ్మడి కుటుంబం” తెలుగులో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. 20 ఏప్రిల్ 1967 నాడు విడుదలైంది ఉమ్మడి కుటుంబం. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు హీరోగా డి.యోగానంద్ గారు “తిక్క శంకరయ్య” (1968) తీశారు. ఎన్టీఆర్ గారు, జయలలిత గారు హీరో హీరోయిన్లు గా యోగానంద్ గారే సొంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం “బాగ్దాద్ గజదొంగ” (1968). ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. కానీ నష్టాలు అయితే తీసుకురాలేదు.

1969లో వచ్చిన ఇంకో విజయవంతమైన చిత్రం “మూగనోము”. అక్కినేని గారు, జమున గారు కలిసి నటించిన ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది. “మూగనోము” తర్వాత వచ్చిన రజతోత్సవ చిత్రం “కోడలు దిద్దిన కాపురం”. ఎన్టీఆర్ గారి సొంత సినిమా ఇది. 1970లో విడుదలైంది. ఆ తర్వాత అక్కినేని గారి అన్నపూర్ణ సంస్థకు “జై జవాన్” చిత్రం తెరకెక్కించారు యోగానంద్ గారు. కానీ ఇది విజయవంతం కాలేదు. మళ్లీ ఎన్టీఆర్ గారి చిత్రాలు “డబ్బులకు లోకం దాసోహం”, “వాడే వీడు”, “కథానాయకుని కథ”, “వేములవాడ భీమకవి” (1976) చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిట్టచివరకు ఎన్టీఆర్ గారి “సింహం నవ్వింది” (1983) చిత్రాన్ని డి.యోగానంద్ గారు తన దర్శకత్వంలో చిత్రీకరించారు. ఇది సరిగ్గా ఆడలేదు.

మరణం…

యోగానంద్ గారు దర్శకత్వం వహించిన తొలి సినిమా “అమ్మలక్కలు” (ఎన్టీఆర్ గారు హీరో) 12 మార్చి 1953 విడుదలైతే, ఎన్టీఆర్ గారి హీరోగా చిట్టచివరి చిత్రం 03 మార్చి 1983 విడుదలైంది. ఎన్టీఆర్ గారితో యోగానంద్ గారికి 30 సంవత్సరాల దర్శకత్వం జీవితం కొనసాగింది. 1984లో ఎన్టీఆర్ గారు తెలుగులో నటించిన చిత్రం “చంఢశాసననుడు” ని తమిళంలో శివాజీ గణేషన్ గారితో “సరితిర నాయగన్” పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా 1984లో విడుదల అయ్యింది. డి.యోగానంద్ గారు దర్శకత్వం వహించిన చిట్ట చివరి చిత్రం అదే.

డి.యోగానంద్ గారు 1981లో తమిళనాడు ప్రభుత్వం నుండి “కలైమామణి” పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక యోగానంద్ గారికి “ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్” లో “డైరెక్టర్ ఆఫ్ ఫిలిమ్స్” అనే గౌరవప్రదమైన పదవిని ఇచ్చారు. 2004లో తనకు ప్రతిష్టాత్మకమైన రాజా షాడో పురస్కారాన్ని ఇచ్చారు. డి.యోగానంద్ గారు 1984 నుండి 2004 వరకు 20 సంవత్సరాలు సినీ రంగానికి దూరంగానే ఉన్నారు. 23 నవంబరు 2006న డి.యోగానంద్ గారు గుండెపోటుతో మరణించారు. తనకు ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. భార్య పేరు హనుమాయమ్మ.

విశేషాలు…

★ యోగానంద్ గారు తన 30 సంవత్సరాల సినీ జీవితంలో 40 నుండి 45 సినిమాల వరకు దర్శకత్వం వహిస్తే అందులో 16 ఎన్.టి.రామారావు గారితో, ఐదు సినిమాలు అక్కినేని నాగేశ్వరావు గారితో, డజనుకు పైగా తమిళ సినిమాలు దర్శకత్వం చేశారు.

★ ఆ దశాబ్దాలలో తెలుగు, తమిళ చిత్ర రంగాలలో అగ్రస్థాయి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్, ఎం.జీ.ఆర్ గార్లతో నలుగురితో కూడా విజయవంతమైన చిత్రాలు రూపొందించిన ప్రత్యేకత కూడా యోగానంద్ గారి సొంతం.

★ ఎన్టీఆర్ గారు సొంత బ్యానర్ స్థాపించిన మొదటి రెండు సినిమాలు “పిచ్చి పుల్లయ్య”, “తోడుదొంగలు” ఆర్థికంగా నష్టాలు తెచ్చిపెడితే, మొట్టమొదటిసారిగా ఎన్.ఏ.టి బ్యానర్ పై సూపర్ హిట్ చిత్రాలు రూపొందించింది డి.యోగానంద్ గారే. అదే 1955లో విడుదలైన “జయసింహ”.

★ తెలుగులో డి.యోగానంద్ గారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 1953లో విడుదలైన “అమ్మలక్కలు” అయితే, తెలుగులో ఆయన చిట్టచివరిగా దర్శకత్వం చేసిన చిత్రం 1983లో విడుదలైన “సింహం నవ్వింది”.

★ డి.యోగానంద్ గారు తమిళ చిత్రం 1953లో విడుదలైన “మరుమగల్” (తమిళ్ వర్షన్) హీరో ఎన్టీఆర్ అయితే, తమిళంలో దర్శకత్వం వహించిన చిట్టచివరి చిత్రం “సరితిర నాయగన్” హీరో శివాజీ గణేష్ గారు. కానీ ఆ సినిమా తెలుగులో ఎన్టీఆర్ గారి ‘చంఢశాసనుడు” కి రీమేక్. ఈ విధంగా యోగానంద గారి వెండితెర జీవితం ఎన్టీఆర్ గారి నట జీవితంతో అల్లుకుపోయింది.

★ వహీదా రెహమాన్ గారు మొట్టమొదటిసారిగా సినిమాకు సంతకం చేసి కెమెరా ముందు నిలబడింది యోగానంద గారు దర్శకత్వం చేసిన “జయసింహ” నే.

★ ఎల్వీ ప్రసాద్ గారు దర్శకుడుగా శరవేగంతో దూసుకుపోతున్న తొలి రోజుల్లో నిర్మాతగా మారి సినిమా తీసినప్పుడు దానికి దర్శకుడుగా ఎంపిక చేసుకుంది తన శిష్యుడైన డి.యోగానంద్ గారినే, అదే 1956లో విడుదలై అత్యంత ఘనవిజయం సాధించిన “ఇలవేల్పు” (అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో).

★ దర్శకుడిగా మారిన మూడో సంవత్సరంలోనే తమిళంలోనూ, తెలుగులోను ఒకేసారి విజయం సాధించిన ఘనత డి.యోగానంద్ గారికే దక్కుతుంది.

★ ఎన్టీఆర్ గారు సినిమాల్లో సినీ హీరోగా నటించిన ఒకే ఒక్క సినిమా 1975 లో వచ్చిన “కథానాయకుని కథ” కు దర్శకలు కూడా యోగానంద్ గారే.

★ 1960 – 1970 దశాబ్దాలలో నవలా రచయిత్రి కొవ్వలిపాటి విజయలక్ష్మి గారు వ్రాసిన “విధివిన్యాసాలు” నవల “తహసీల్దారు గారి అమ్మాయి” గా రూపొందితే, తన రెండవ నవల “అపశృతులు” సినిమాగా వచ్చిన చిత్రం పేరు “ఈ కాలం దంపతులు” (1975), ఈ చిత్రానికి దర్శకులు కూడా డి.యోగానంద్ గారే.

★ సింహళ భాషలో సినిమాకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు దర్శకులు యోగానంద్ గారే. అది 1960లో శ్రీలంకలో విడుదలైన “సుందరపిరంద” అనే చిత్రం.

★ డి.యోగానంద్ గారు నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 1968 లో వచ్చిన “బాగ్దాద్ గజదొంగ” ఎన్టీఆర్, జయలలిత హీరో హీరోయిన్లు.

Show More
Back to top button