CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో తొలి విషాదాంత ప్రేమ కథా చిత్రం… లైలా మజ్ను

ప్రేమ అనేది అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతి. అది కులం, మతం, వర్ణం, జాతి, పేద, ధనిక, ఆడ, మగ అనే బేధాలు లేకుండా పుడుతుంది. అది సఫలమైతే కలిగే ఆనందం కన్నా, విఫలమైతే కలిగే బాధ వర్ణణాతీతం. “లైలా మజ్ను” అనే విషాద ముగింపు పలికిన ప్రేమ కథను “నిజామీ గంజావి” అను 12 వ శతాబ్దపు ముస్లిం కవి అరబ్ లో వ్రాశారు. ఇది అరబ్ మూలాలు కలిగి అరబిక్ నుండి పర్షియన్ , టర్కిష్ మరియు భారతీయ భాషలకు వ్యాపించిన విఫల ప్రేమ గాథ. ఈ గాథను భరణి పిక్చర్స్ బ్యానర్‌పై పి.ఎస్.రామకృష్ణారావు “లైలా మజ్ను” (1949) గా నిర్మించి, దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరావు, భానుమతి జంటగా నటించారు. లైలామజ్ను (1949), దేవదాసు (1953), అనార్కలి (1955) ఈ మూడు చిత్రాలు విభిన్న ప్రేమ కథా నేపథ్యంలో రూపుదిద్దుకున్నవే అయినా మూడు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ మూడింటిలోనూ అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడు కావడం ఒక విశేషం అయితే ఈ మూడు సినిమాలు కూడా ఆరేళ్ల వ్యవధిలోనే విడుదల కావడం మరొక విశేషం.

పౌరాణికాలతో ప్రారంభమైన తెలుగు సినిమా చరిత్ర, రెండు దశాబ్దాల పాటు పౌరాణికాలదే పైచేయి అయ్యింది. మధ్యలో కొన్ని సాంఘిక చిత్రాలు వచ్చాయి. అందులో అధిక శాతం కుటుంబ కథా చిత్రాలే వచ్చాయి. వరకట్నం, నిరుద్యోగం, కుల వ్యవస్థ లాంటి సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చినవే. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదట విషాదాంత ప్రేమ కథా చిత్రం “లైలా మజ్ను”. 1949 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాలలో ఇది ఎన్నదగినదనడానికి ఎలాంటి సందేహం లేదు.

ప్రత్యేకం గా జానపద చిత్రాలే వెలువడుతున్న ఆ కాలంలో కొత్తదనంతో కూడుకున్న కథతో “లైలా మజ్ను” చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించింది. అరబ్బీ వాతావరణం ఈ చిత్రంలో అడుగడుగున చక్కగా చూపబడింది. భరణి పిక్చర్స్ వారు చాలా ప్రయాసపడి ఆకర్షవంతమైన సెట్టింగ్ లు వేసి ఈ సినిమాను చిత్రీకరించారు. తెలుగులో పరదేశపు నేపథ్యంతో రూపుదిద్దుకున్న తొలి చిత్రం కూడా “లైలా మజ్ను”. 1947 లో భరణి పిక్చర్స్ స్థాపించిన భానుమతి రామకృష్ణలు తమ నిర్మాణ సంస్థలో నిర్మించిన రెండవ చిత్రం “లైలా మజ్ను”. అక్కినేని నాగేశ్వరావు నటించగా విడుదలైన 9వ చిత్రం “లైలా మజ్ను”.

అక్కినేని, భానుమతి కలిసి నటించిన మూడవ చిత్రం “లైలామజ్ను”. (మొదటిది “రత్నమాల”, రెండవది రక్ష రేఖ). ట్రావెన్ కోర్ సిస్టర్స్ పద్మిని – రాగిణి లు నాట్యం చేసిన తొలి తెలుగు చిత్రం కూడా “లైలా మజ్ను” ఏకకాలంలో తమిళ, తెలుగు భాషలలో భరణి పిక్చర్స్ వారు విడుదల చేసిన తొలి చిత్రం “లైలా మజ్ను” (1949). ఘంటసాల పేరు తెరపై కనిపించిన మొదటి చిత్రం “లైలా మజ్ను” (1949). మాధవ పెద్ది సత్యం మొట్టమొదటిసారిగా పాట పాడింది “లైలా మజ్ను” సినిమాలోనే. కళాతపస్వి కె.విశ్వనాధ్ శబ్ద గ్రాహక శాఖలో సహాయకుడిగా పనిచేసిన చిత్రం “లైలా మజ్ను”. దేవదాసు, అనార్కలి చిత్రాలకు దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య “లైలా మజ్ను” చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. దేవదాసు సినిమాకు నిర్మాత ఆయన డి.ఎల్. నారాయణ లైలా మజ్ను సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. లైలా మజ్ను సినిమాకు ఛాయాగ్రహణం శాఖలో పనిచేసిన బి.ఎస్. రంగా  ఆ తరువాత రోజులలో నిర్మాతగా మారి చక్కటి తెలుగు చిత్రాలను రూపొందించారు.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :       పి.ఎస్. రామకృష్ణారావు

సంభాషణలు   :    సముద్రాల 

నిర్మాణం   :     పి.ఎస్. రామకృష్ణారావు 

తారాగణం  :     అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి

సంగీతం    :     సి.ఆర్. సుబ్బురామన్

ఛాయాగ్రహణం  :   బి.ఎస్. రంగా

కూర్పు       :       పి.ఎస్. రామకృష్ణారావు

నిర్మాణ సంస్థ    :    భరణి పిక్చర్స్

నిడివి      :     169 నిమిషాలు

విడుదల తేదీ   :     25-01 అక్టోబరు 1949

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

లైలా అమీర్ సర్వార్ కూతురు, ఖైస్ అమీర్ ఉమ్రి కొడుకు. సర్వార్, ఉమ్రిలు ప్రాణ స్నేహితులు. అమీర్ ఉమ్రీ & అమీర్ సర్వార్ ఒకరినొకరు సత్సంబంధాలను కలిగివుంటారు. లైలా, ఖైస్ లు ఒక్కచోట జన్మించారు. ఒకే బడిలో చదువుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండలేరు. ఈ విచ్చలవిడి తనం లైలా తండ్రికి  నచ్చలేదు. తన కూతురు అదుపులో పెట్టి, కొడుకును మందలించుకోమని అమీర్ ఉమ్రీని హెచ్చరించాడు. అయితే అమీర్ ఉమ్రీ ఇచ్చిన సమాధానాలు అమీర్ సర్వార్ కు రుచించలేదు. తన పరిజనంతో ఆ ఊరు విడిచి మక్కకు వెళ్లిపోయినాడు అమీర్ సర్వార్. ఖైస్ వారి వెనకాలే మక్కా పయనమైనాడు. కూతురు లైలా మనసు మార్చడానికి మక్కాలో తన తండ్రి ఎన్నో మార్గాలుగా ప్రయత్నించాడు. ప్రేమమూర్తి లైలా శోకమూర్తి అయ్యింది. అహోరాత్రాలు అన్నపానాలు మాని  ప్రియుడు దర్శనం కోసం తెన్నులు చూసింది.

ఒకనాడు సర్వార్ మహల్ లో లైలా చేతుల మీదుగా దానాలు పుచ్చుకోవడానికి వస్తున్న పకీర్ల వెనుక ఖైస్ కూడా వచ్చి లైలా ఉనికిని తెలుసుకున్నాడు. మారువేషంలో మహల్లో ప్రవేశించి చెలికెత్తెలతో రాయబారం చేశాడు.  మరునాడు రాత్రి లైలా, ఖైస్ లు తోటలో సమావేశమై మనస్సు విప్పి మాట్లాడుకున్నారు. సర్వార్ ఇంట లేని వేళ లైలా దర్శనానికి మళ్లీ ఖైస్ మహల్ లో ప్రవేశించాడు. అంతలోనే సర్వార్ ఉన్నట్టుండి ఊడిపడ్డాడు. దాంతో ఖైస్ చెంపలు వాచిపోయాయి.  ఇంక లైలా ను చూసే అవకాశం కూడా లేక ఖైస్ వెర్రివాడై, వీధుల వెంట లైలా లైలా అని నామస్మరణం చేస్తూ తిరగనారంభించాడు. అల్లరి మూకలు అతడిని వెర్రివాడి క్రింద లెక్కగట్టి రాళ్లు రువ్వి రెచ్చగొట్టారు.  ఇంతలో ఇరాక్ మహారాజు ఆ నగరానికి వచ్చాడు. ప్రభువు ఖైస్ ను చూసి అతని కథ తెలుసుకున్నాడు.

ఉమ్రి తన కొడుకు ఖైస్ దురవస్థను చూసి గత్యంతరం లేక సర్వార్ ను ఆశ్రయించి పుత్రభిక్ష వేడుకున్నాడు. తన కొడుకు పిచ్చివాడు కాదని నిరూపిస్తే తన కూతుర్ని ఇస్తానన్నాడు సర్వార్. పెద్దల సమక్షంలో పరీక్ష జరిగింది. ఖైస్ మంచివాడే అన్నారు. పెళ్లి సంబంధం ఖరారు కాబోతున్న సమయంలో షాజాదా సర్వార్ అల్లుడు కాదల్చుకున్నాడని సమాచారం వచ్చింది. సర్వార్ మతి మారిపోయింది. పిల్లనివ్వనని తరిమికొట్టేశాడు ఖైస్ ను. పెళ్లి వద్దని లైలా ఎదిరించింది. కానీ బలవంత వివాహం జరిగిపోయింది. ఇరాక్ ప్రభు ఎంత లాలించినా, బెదిరించినా లైలా మనసు మారలేదు. పిచ్చివాడైన ఖైస్ కోసం నిద్రాహారాలు మాని శోకిస్తుంది. ఇరక్ ప్రభువు ఆమె మనోనిశ్చయానికి ఆశ్చర్యపోయినాడు. రాజు పవిత్రమైన ప్రేమకు ముగ్దుడైనాడు. లైలాను రాజలాంఛనాలతో ఖైస్ వద్దకు సాగనంపాడు. లైలా ఖైస్ లు ఎడారిలో కలుసుకుంటారు. కానీ ఎడారు తుఫానుకు భలై ప్రాణాలు విడుస్తారు. వారి గాఢ ప్రేమ అమరగాథగా లోకం స్మరిస్తుంది.

పన్నెండవ శతాబ్దపు కథ…

“లైలా మజ్ను” ప్రేమ కథ పురాతన ఇతిహాసం. ఇది సూఫీ సాహిత్యంలో అంతర్భాగం. నిజానికి ఇది 12వ శతాబ్దానికి చెందిన కథ అరేబియన్ నైట్స్ కథలలో చోటు చేసుకుంది. నిజామీ గంజావి అనే వ్యక్తి ఈ కథను ఎక్కువగా ప్రాచర్యంలోకి తీసుకువచ్చారు. నిజామీ గంజావి వ్రాసిన “లైలా మజ్ను” కథకి ఆ తరువాత అనేక రూపాంతరాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి  హత్ఫి అనే వ్యక్తి వ్రాసిన కథ. దానిని 1788లో కలకత్తాలో సర్ విలియం జోన్స్ అనే వ్యక్తి పుస్తక రూపంలో ప్రచురించారు. అది ముద్రించబడిన అతి కొద్ది రోజులలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ కథ ఆధారంగా అనేక రంగస్థల నాటకాలు కూడా రూపుదిద్దుకున్నాయి. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ కథతో “లైలా మజ్ను” పేరుతో అనేక సినిమాలు వచ్చాయి. “లైలా మజ్ను” కథతో మొదటిసారిగా 1922లో JJ మదన్ చేత మూకీ చిత్రం నిర్మించబడింది. 19 ఆగస్టు 1922 లో విడుదలైన ఈ చిత్రంలో హెచ్.బి. వారింగ్, జీనెట్ట షర్వీన్, మిస్ డాట్ ఫోయ్ లు నటించారు. 

మొదటి విజయం “లైలా మజ్ను” (1945)..

1927 లో మణిలాల్ కాళిదాస్ జోషి దర్శక, నిర్మాణంలో మరో మూకీ సినిమా వచ్చింది. మదనరాయి వకీల్, జుబేదా, షహజాది నటీనటులుగా నటించగా  డి. డి. డబుకే ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమా 97 నిముషాల వ్యవధితో 07 ఏప్రిల్ 1927 నాడు విడుదలయ్యింది. “లైలా మజ్ను” ను 1931లో టాకీ చిత్రంగా ప్రఖ్యాత చిత్రనిర్మాత కంజీభాయ్ రాథోడ్ తెరకెక్కించగా జే.జే.మదన్ దీనిని హిందీలో పునర్నిర్మించారు. ఆ తరువాత అయిదేండ్లకు 1936లో “లైలా మజ్ను” సినిమాను పర్షియన్ భాషలో “ఈస్ట్ ఇండియా పిక్చర్స్” వారు నిర్మించారు. ఇరాన్ దేశం వారి కోసం 1936లో ఈ సినిమా నిర్మితమైంది. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకి “ధర్మవీర్ సింగ్” అనే వ్యక్తి పంజాబీలో ఇదే కథతో టాకీ సినిమా తీశాడు.

ఆ తరువాత సంవత్సరానికి 1941లో సర్ నాథ్ పిక్చర్స్ వారు “లైలా మజ్ను” సినిమా తీశారు. వీటన్నిటి తరువాత బాక్సాఫీసు వద్ద విపరీతమైన విజయం సాధించిన చిత్రం 1945లో వచ్చిన హిందీ చిత్రం “లైలా మజ్ను”. ఇందులో స్వరన్ లత, నజీర్ మహమ్మద్ నాయికా, నాయకులు. ఈ సినిమాకు దర్శకుడు నజీర్ మహమ్మద్. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ బాహ్య ప్రపంచంలో పెళ్లి చేసుకుని స్వాతంత్రానంతరం  1947లో భారత్ – పాకిస్తాన్ విభజన అనంతరం పాకిస్తాన్ లో స్థిరపడి అక్కడ నటీనటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారు విడుదల చేసిన లైలా మజ్ను (1945) అనే సినిమాయే భారతదేశంలో వివిధ భాషలలో చిత్రీకరణ జరపడానికి నాంది అయ్యింది. ఇందులో చిన్న పాత్రలో మహమ్మద్ రఫీ కనిపిస్తారు. 1949 వ సంవత్సరంలో వచ్చిన “లైలా మజ్ను” సినిమా కంటే ముందు ఇన్ని “లైలా మజ్ను” సినిమాలు వచ్చాయి.

లైలా మజ్ను 1949 (తెలుగు) కు బీజం…

భానుమతి, పి.ఎస్. రామకృష్ణ రావును వివాహం చేసుకున్న తరువాత సినిమారంగం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ దర్శకులు బి.యన్. రెడ్డి బలవంతంపై “స్వర్గసీమ” (1945) లో నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఆమెకు అబ్బాయి జన్మించారు. దాంతో అతడికి కొంత డబ్బు సంపాదించి పెట్టాలని సదుద్దేశంతో మరికొన్ని సినిమాలలో నటించాలనుకున్నారు భానుమతి. అలా ఆ తరువాత ఆమె ఒప్పుకున్న మొట్టమొదటి తమిళ చిత్రం “రత్న కుమార్”. కృష్ణన్ – పంజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మురుగన్ టాకీస్ వారు నిర్మించారు.

1945లో చిత్రీకరణ మొదలైనా కూడా ఆలస్యంగా 1948లో ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాకు వచ్చిన పారితోషికంతో భానుమతి, రామకృష్ణలు సొంత నిర్మాణ సంస్థ 1947లో “భరణి పిక్చర్స్” ను స్థాపించారు. అప్పటికి భానుమతి వయస్సు 22 సంవత్సరాలు. “భరణి పిక్చర్స్” సంస్థ నిర్మాణంలో తొలి సినిమా రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రత్నమాల”. ఈ సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ లకు పరిచయమయ్యారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్ర కాకున్నా కూడా ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

భరణి పిక్చర్స్ రెండవ చిత్రంగా “లైలా మజ్ను”…

తమ మొదటి చిత్రమే వంద రోజులు ప్రదర్శింపబడి రామకృష్ణను దర్శకుడిగా ఉన్నత స్థానంలో నిలబెట్టింది. దాంతో భానుమతి రామకృష్ణ లకు,  అక్కినేని అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. “రత్నమాల” చిత్రం 02 జనవరి 1948లో విడుదల అయితే 26 ఫిబ్రవరి 1948 నాడు అక్కినేని బాలరాజు చిత్రం విడుదలయ్యి తనను తారాపథంలోకి చేర్చింది. ప్రేమకథా కథానాయకుడిగా పేరు వచ్చింది. “రత్నమాల”, “బాలరాజు” రెండు సినిమాలు కూడా ఒకేసారి సమాంతరంగా సినిమా హాలులో నడిచాయి. ఆ సమయంలో “భరణి పిక్చర్స్” బ్యానర్ లో రామకృష్ణ రెండో సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఒకసారి ఆయన బొంబాయి వెళ్లినప్పుడు 1945లో విడుదలైన హిందీ “లైలా మజ్ను” సినిమా చూశారు. అది బాగా నచ్చింది. దాంతో ఆ సినిమాను తెలుగులో తీద్దామనుకున్నారు. నిజానికి అది ఒక విషాదాంత చిత్రం. అందులోనూ అరబ్ నేపథ్యం ఉన్నది. మనది కాని నేపథ్యం ఉన్న కథతో తెలుగులో తీద్దాం అనుకోవడం ఒక సాహసం. అయితే “బాలరాజు” తో ప్రేమకథ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేనిని, ఈ విషాద కథకు హీరోగా మారుద్దాం అనుకున్నారు రామకృష్ణ. ఆ హిందీ చిత్రం ప్రింట్లు తెప్పించమని తమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న డీ.ఎల్. నారాయణను పురమాయించారు రామకృష్ణ.

తమిళ చిత్రంకు పోటీగా…

భానుమతి, అక్కినేని, భరణీ పిక్చర్స్ యూనిట్ సభ్యులందరికీ మద్రాసులో “లైలా మజ్ను” హిందీ సినిమాను చూపించారు. సినిమా చూసిన యూనిట్ సభ్యులు రామకృష్ణ నిర్ణయానికి ముందుగా ఆశ్చర్యపోయారు, ఆ తరువాత అభినందించారు కూడా. కానీ నిజానికి భానుమతిని అక్కినేని నాగేశ్వరావు మేడం అని పిలిచేవారు. దాంతో వీళ్లిద్దరి మధ్య ప్రణయ సన్నివేశాలు చక్కగా కుదరవని మద్రాసు బీచ్ లో అక్కినేని, భానుమతి లకు ఆటలు పెట్టి వాళ్ళ కదలికలని వాళ్లకు తెలియకుండానే 16 ఎం.ఎం కెమెరాలో బంధించేవారు. ఆ తరువాత చిత్రీకరించిన సన్నివేశాలను వారికి చూపించి, వారిని ప్రశంసిస్తూ లైలా మజ్ను సినిమాకు ప్రేయసి, ప్రియులుగా హావాభావాలు ఎలా పలికించాలో తెలియజేశారు. ఆ విధంగా “లైలా మజ్ను” సినిమాకు బీజం పడింది. 

ఎఫ్.నాగూర్ దర్శకత్వంలో బాలాజీ పిక్చర్స్ పతాకంపై 1948 సంవత్సరం చివరలో టి.ఆర్.మహా లింగం, ఎం.వి.రాజమ్మ నటీనటులుగా “లైలా మజ్ను” కథతో సినిమా చిత్రీకరణ జరుపుతున్నారని భానుమతి, రామకృష్ణ లకు తెలిసింది. దానిని తెలుగులో కూడా విడుదల చేస్తారనే వదంతులు వ్యాపించాయి. దాంతో వారు పునరాలోచనలో పడ్డారు. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడమా? లేక మానేయడమా? ముందుకెళితే వారు తమిళ చిత్రంతో పోటీపడాలి.  అలాంటప్పుడు తమిళ సినిమా కంటే వేగంగా సినిమా తీసి తమిళ సినిమా కంటే ముందే విడుదల చేయాలి. అదే రోజులలో ఒకే కథతో “లక్ష్మమ్మ”, “శ్రీ లక్ష్మమ్మ కథ” చిత్రాలు ఏకకాలంలో నిర్మిస్తున్నారు. లక్ష్మమ్మ (1950) సినిమాను శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించగా,  ప్రతిభా ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో శ్రీ లక్ష్మమ్మ కథ (1950) చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించారు. ఆరు నూరైనా సరే తమిళ చిత్రాన్ని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు భానుమతి రామకృష్ణలు.

ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా…

మొదటి చిత్రం “రత్నమాల” ఇచ్చిన ఘనవిజయంతో నిండైన ఆత్మవిశ్వాసంతో రంగంలోకి దిగారు. భానుమతి అప్పటికే గొప్ప పేరున్న నటి. ఆమె చిత్రపరిశ్రమకు వచ్చి సరిగ్గా పదేళ్లు అయ్యింది. అదే సమయానికి అక్కినేని “కీలుగుఱ్ఱం” సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఇలా అనేక సానుకూలాంశాలు ఉండడంతో “లైలా మజ్ను” సినిమా నిర్మాణం శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు భరణి పిక్చర్స్ అధినేత రామకృష్ణ. ప్రొడక్షన్ మేనేజరు డి.ఎల్.నారాయణ చిత్ర నిర్మాణం వేగవంతం చేయడానికి గల సన్నాహాలు చేస్తున్నారు. ఆ సమయానికి అక్కినేని, భానుమతి “రక్ష రేఖ” అనే సినిమాలో నటిస్తున్నారు.

“రక్ష రేఖ” సినిమా చిత్రీకరణ ప్రగతి స్టూడియోస్ మరియు నెప్ట్యూన్ స్టూడియోస్ లో జరుగుతుంది. “లైలా మజ్ను” చిత్రీకరణ కోసం రామకృష్ణ “వాహినీ స్టూడియోస్ ను ఎంచుకున్నారు. రక్షరేఖ చిత్రానికి ఇబ్బంది రాకుండా, “లైలా మజ్ను” చిత్ర నిర్మాణం వేగం తగ్గకుండా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ డి.యల్. నారాయణ సినిమా నిర్మాణాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళతున్నారు. ఈ విధంగా చిత్రీకరణ జరుగుతూ ఉండగా చిత్ర పరిశ్రమలో బోలెడన్ని విమర్శలు మొదలయ్యాయి. అయినా కూడా భానుమతి రామకృష్ణ ఆత్మవిశ్వాసమే సినిమాకు పెట్టుబడిగా ముందుకు సాగిపోయారు.

తారాగణం…

“లైలా మజ్ను” సినిమా తారాగణం విషయానికి వస్తే లైలా తండ్రిగా నటించింది ఎం.కృష్ణమూర్తి. ఆయన ఎవరో కాదు తరువాత రోజులలో బాగా ప్రాచుర్యం పొందిన గుణచిత్ర నటులు “ముక్కామల”. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిన నాటికి తాను పేరున్న నటుడు కాదు. ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే, మరోవైపు నటుడిగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. నటుడిగా ఒక్క చిత్రంలో కూడా నటించని ముక్కామలను “లైలా మజ్ను” సినిమాలో ఒక ప్రధాన పాత్రకు ఎంపిక చేయడం కూడా పి.యస్.రామకృష్ణ చేసిన సాహసానికి నిదర్శనం. ఈ సినిమా విడుదలైన తరువాత లైలా మజ్ను సినిమాకి ఎంత పేరొచ్చిందో లైలా తండ్రి పాత్రధారిగా ముక్కామలకు కూడా అంతే పేరొచ్చింది.

“లైలా మజ్ను” సినిమాలో అమీర్‌ సర్వర్‌ పాత్ర ఇవ్వకపోతే నేను సినిమారంగంలో నిలదొక్కుకుని ఉండేవాడిని కాదేమో అని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాత ముక్కామలకు సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. నటి హేమలత లైలా తల్లిగా నటించారు. ఇరాక్ రాజు రక్కిన ప్రభుగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు నటించారు. ఆయన వైవిధ్యమైన విలన్ పాత్రలో నటించారు. ఆయన అప్పటికే పేరున్న నటులు. లైలాను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకునే పాత్ర ఆయనది. లైలాను విడిపించడానికి జరీనాగా శ్రీరంజని (జూనియర్) నటించారు. ఈమె ఇరాక్ రాజు ప్రియురాలు. లైలా చిన్ననాటి పాత్రలో నటించింది బేబీ కృష్ణవేణి, మాస్టర్ చిట్టిబాబు. ఆయన తరువాత రోజులలో ప్రముఖ వైణికులు వీణ చిట్టిబాబు. నృత్య పాత్రలో లలిత – పద్మిని (ట్రావెన్‌కోర్ సిస్టర్స్) లు, సూర్యకాంతం ఒక చిన్న పాత్రలో నటించారు.

రచన…

భరణి పిక్చర్స్ మొట్టమొదటి చిత్రం “రత్నమాల” కు రచయిత సముద్రాల రాఘవాచార్య అవ్వడంతో “లైలా మజ్ను” చిత్రానికి కూడా సంభాషణలతో పాటుగా, మాటలు కూడా సముద్రాల రాఘవాచార్య వ్రాశారు. తెలుగు సినిమాలలోని సంభాషణలను వాడుక భాషలో వ్రాయడం ఈ సినిమా నుండే ప్రారంభించారు. “పేరుకు పెత్తనం ఇస్తే ఇంతే మరి”, “ఈ అహంకారమే ఆడవారిని ఇంతవరకు బ్రతికించింది”, “చచ్చిన పామును చంపడం సర్దారుల లక్షణం కాదు”, “పెళ్లంటే పూల పాన్పు కాదు, కాళ్లకు సంకెళ్లలాగా కంఠానికి ఉరి, స్వేచ్ఛాజీవులకు పెళ్లి వద్దు”, “ఖజానా ఎందాకే దివానా, నా కంటికి నిండుగా ఉన్నావే బనానా” లాంటి సంభాషణలతో అరేబియన్ నేపథ్యంలో ఉన్న కథకు ఆ నేపథ్యానికి తగ్గట్టుగా సముద్రాల మాటలు వ్రాశారు.

“గ్రహచారం, విధిబలీయం, ప్రేమ అమరలోకంలో ఫలించడం” వంటి సంభాషణలలతో వ్యాఖ్యలను కూడా వ్రాశారు. కేవలం మాటలే కాకుండా మొత్తం పాటలు  (సుమారు 17 పాటలు) సముద్రాలే వ్రాశారు. వ్రాసిన పాటలలో కొత్త పదాల ప్రయోగం చేశారు. లైలా, కయాస్ లు “విరితావుల లీల మనజాలినా చాలుగా” అనే పాటలో “జగజగాల సొగసు నీదే” అనే వాక్యం, “ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా” అనే పాటలో “ఏ కొరనోము నోచుకున్నానో” అనే పదాలు, “అహా ఫలియించెగా ఫలియించెను” పాటలో “పలుకువే నా జీవ సితార” పదాలు సముద్రాల చేసిన కొత్త ప్రయోగం.

సాంకేతిక నిపుణులు…

“లైలా మజ్ను” సినిమాకు నేపథ్య గాయకులుగా భానుమతి, ఘంటసాల, వక్కలంక సరళ, పి.లీల, కె. జమునారాణి, జిక్కి,  ఆర్.బాలసరస్వతి దేవి, సుసర్ల దక్షిణామూర్తి, మాధవపెద్ది సత్యం, కస్తూరి శివరావులు తమవంతుగా అద్భుతంగా ఆలపించారు. “రత్నామాల” సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులే “లైలా మజ్ను” చిత్రానికి కూడా పనిచేశారు. నృత్య దర్శకులుగా “వేదాంతం రాఘవయ్య”, సంగీత దర్శకులుగా “సి.ఆర్.సుబ్బరామన్”, ప్రొడక్షన్ మేనేజర్ గా “డి.యల్. నారాయణ” మొదలగువారు భరణి పిక్చర్స్ వారి “రత్నమాల” చిత్రానికి పనిచేసిన వారే. చిత్ర నిర్మాణంలో అత్యంత కీలకమైన ఛాయాగ్రహణం విభాగానికి “రత్నమాల” పని చేసిన పి.ఎస్. సెల్వరాజ్ ను కొనసాగించకుండా “లైలా మజ్ను” సినిమాకి ఛాయాగ్రహకులుగా 

బి.ఎస్.రంగా ను నియమించారు. అప్పటికి ఆయన ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు. ఈ సినిమా తరువాత రోజులలో ఆయన ఆర్థికంగా పుంజుకొని దర్శకుడుగా, నిర్మాతగా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగారు. “లైలా మజ్ను” చిత్రానికి శబ్ద గ్రాహక శాఖ (ఆడియో విభాగం) నిర్వహించింది శ్రీనివాస రాఘవన్.  ఆయనకు సహాయకుడిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ పనిచేశారు.

చిత్రీకరణ…

ఇక “లైలా మజ్ను” చిత్రీకరణ ప్రస్తావనకు వస్తే ఈ చిత్రాన్ని సింహభాగం వాహనీ స్టూడియోలోనే జరిపారు. మిగతా భాగం స్టార్ కంబైన్స్ స్టూడియోలో చిత్రించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పుడప్పుడే నిర్మాణం జరుపుకుంటున్న వాహినీ స్టూడియోలో ఆ సమయానికి ఒక్కటే అంతస్తు ఉండేది. “లైలా మజ్ను” కూడా అందులోనే జరిగింది ఆ అంతస్తు లోపల మధ్య భాగంలో భవంతులు, వీధులు మొదలగు సెట్స్ వేశారు. ఒక చెరువుతో ఎడారి సెట్ వేసి తాటి చెట్లను పెట్టి ఉంచారు (ఎడారులలో కనిపించే ఖర్జూర చెట్లను పోలి ఉండడం కోసం). ఫ్లోర్ లోపల వేసిన సెట్ లలో పగటిపూట, బయట వేసిన సెట్ లలో రాత్రిపూట చిత్రీకరణ జరిపేవారు. పతాక సన్నివేశాలను కూడా స్టూడియోలో వేసిన సెట్ లలోనే చిత్రీకరించారు. ఈ సినిమాను విడుదలకు ఒకరోజు ముందుగా న్యూ గ్లోబ్ స్టూడియో (మద్రాసు) లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా సమీక్ష కోసం అన్ని రకాల పత్రికల వారిని పిలిపించార. వీరితో బాటు అక్కినేని నాగేశ్వరావు అలంకరణ విభాగంలో ప్రసిద్ధులయిన గోపాల్ రావు, ప్రతిభా శాస్త్రి, ఛాయాగ్రహకుడు శ్రీధర్ రావు లను ప్రత్యేక ప్రదర్శనకు తీసుకెళ్లారు. ప్రత్యేక ప్రదర్శన అయిపోయిన తరువాత అక్కినేని నటనను మెచ్చుకున్న ప్రతిభ శాస్త్రి ఈరోజు నుండే నీ నటనా జీవితం మొదలైంది అని ఆయనతో అన్నారట.

విడుదల..

ఎన్నో విమర్శల మధ్య, ఎన్నో అనుమానాల నడుమ చిత్రీకరణ పూర్తిచేసుకున్న “లైలా మజ్ను” సినిమాను 01 అక్టోబరు 1949 నాడు విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే తెలుగురాష్ట్రాలలో జోరుగా వానలు, వరదలు. పెను తుఫానుతో గుంటూరు, కృష్ణా  జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. అలాంటి సమయంలో విడుదలయిన “లైలా మజ్ను” సినిమా విజయవంతమైంది. సినిమాలో ఇసుక తుఫాను, బయట నిజమైన తుఫాను. ఆ ప్రకృతి వైపరిత్యం “లైలా మజ్ను” సినిమా విజయాన్ని ఆపలేకపోయింది. ప్రేక్షకులు “లైలా మజ్ను” ప్రేమతో ప్రయాణం చేశారు. వారి ప్రాణయాన్ని ఆస్వాదించారు. వాళ్ళ వియోగానికి కంటతడి పెట్టారు. లైలా మజ్ను సినిమాను అత్యంత ఘనవిజయానికి చేర్చారు.

ఆంధ్రదేశ ప్రేక్షకులు అక్కినేని నాగేశ్వరావు నటనకు జేజేలు పలికారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు “లైలా మజ్ను” చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాయి. “రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో”,   “విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా”, “ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా”, “పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా” లాంటి పాటలన్నీ సినీ అభిమానులు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు, వాటిని ఇప్పటికీ కూడా పదేపదే మననం చేసుకుంటూ ఉంటారు. ఘంటసాల, భానుమతిల గానం సి.ఆర్. సుబ్బరామన్ బాణీలు సినిమాలోని పాటలన్నీటిని కూడా అజరామరం చేశాయి.

“లైలా మజ్ను” (తెలుగు) విడుదలైన కొద్ది రోజులకు దీపావళి సమయంలో “లైలా మజ్ను” (తమిళం) విడుదలైంది. దీనితోబాటు మద్రాసులో “పారగాన్ టాకీస్” లో “లైలా మజ్ను” (తెలుగు)  ఒక కాపీ విడుదల చేశారు. తెలుగు, తమిళ సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఆ తరువాత టి.ఆర్.మహా లింగం, ఎంవి రాజమ్మ లు కలిసి నటించగా, బాలాజీ పిక్చర్స్ పతాకంపై ఎఫ్. నాగూర్ నిర్మించి, దర్శకత్వం వహించిన “లైలా మజ్ను” తమిళ సినిమా 01 మార్చి 1950 నాడు విడుదలై పరాజయం పాలైంది. భానుమతి రామకృష్ణల “లైలా మజ్ను” (1949) సినిమాను మరపురాని మధురమైన దృశ్య కావ్యం అని పత్రికలు ప్రశంసించాయి.

Show More
Back to top button