
తెలుగు సినిమా మాటలు నేర్చిన 1931 సంవత్సరం నుండి 1939 వ సంవత్సరం వరకు సుమారు ఎనిమిది సంవత్సరాల వరకు పౌరాణిక చలనచిత్రాలే రాజ్యమేలాయి. పౌరాణిక నాటకాల పట్ల అలనాటి ప్రేక్షకులకు ఉన్న మోజు, ఆనాటి వీక్షకులకు ఉన్న ఆసక్తి వారిని సినిమాలవైపు మళ్ళించడానికి పౌరాణిక కథలే శరణ్యం అని భావించడం కూడా ఒక కారణమే అని చెప్పాలి. అయితే ఎనిమిది సంవత్సరాల నుండి వరుసగా వస్తున్న పౌరాణిక చిత్రాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చలనచిత్ర నిర్మాణానికి పూనుకుని ప్రేక్షకుల మనసును జానపద చిత్రాల వైపు మళ్ళించడానికి తొలిప్రయత్నంగా “గులేబకావళి కథ” (1939) తో జానపద చిత్రాలకు ఆజ్యంపోశారు ప్రముఖ దర్శకులు కాళ్ళకూరి సదాశివరావు. ఆయన “చింతామణి”, “వరవిక్రయం”, “మధుసేవ” వంటి నాటకాలు రాసి జనాన్ని చైతన్యవంతుల్ని చేసిన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు కుమారుడు సదాశివరావు. పౌరాణిక పద్యాలు, పాటలకు భిన్నంగా జానపద చిత్రంలో తెరకెక్కించిన కత్తి యుద్ధాలు, పోరాటాలు, మంత్రాలు, మాయలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కాకినాడలో జన్మించిన కాళ్ళకూరి సదాశివరావు ఇంటర్మీడియట్ వరకు కూడా కాకినాడలో పిఠాపురం రాజావారి కళాశాలలో చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాదు, మద్రాసు లలో బ్యాంకింగ్ సంబంధించిన కోర్సు చదివారు. ఉద్యోగ వేటను ప్రారంభించి పత్రికా ప్రకటన ద్వారా 1932 లో రంగూన్ వెళ్లి అక్కడ సినిమా మెజిస్టిక్ అనే థియేటరుకు సహాయ నిర్వాహకుడిగా ఉద్యోగంలో చేరి అక్కడ నాలుగు నెలల పాటు పనిచేసాడు. ఎందుచేతనో రంగూన్ వాతావరణంలో ఇమడలేక తిరిగి సొంత ఊరు కాకినాడకు తిరిగి వచ్చేసారు సదాశివరావు. రంగూన్ నుండి వచ్చిన తరువాత చిత్తజల్లు పుల్లయ్యను కలుసుకున్న సదాశివరావు, ఆయనతో పరిచయం పెంచుకుని అతని వద్ద సహాయకుడిగా చేరారు. చిత్తజల్లు పుల్లయ్యకు ఆ రోజులలో కాకినాడలో ఒక థియేటర్, ఒక టూరింగ్ టాకీసు ఉండేవి. ఆ థియేటర్ల నిర్వహణా బాధ్యతలను సదాశివరావు చూసుకొనేవారు. ఆ విధంగా ప్రదర్శనా రంగంలో అనుభవం పొందడంతో చిత్తజల్లు పుల్లయ్య ఆయనను ప్రోత్సాహించగా సదాశివరావు కొంతమంది మిత్రులను కలుపుకొని “ఇంపీరియల్ పిక్చర్ ప్యాలస్” అనే థియేటరును ప్రారంభించారు. కాలక్రమేణా వారికి ఆధాయం పెరిగే సరికి భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడంతో స్వంతంగా “కాకినాడ ఫిలిం ఎక్చేంజి” పేరుతో మరో పంపిణీ సంస్థను నెలకొల్పి ఎనిమిదేళ్ల పాటు పంపిణీ, ప్రదర్శన రంగాలను కొనసాగించిన ఆయన ఎన్నో మూకీ చిత్రాలను తీసుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు ప్రదర్శించారు.
అయితే “కాకినాడ ఫిలిం ఎక్చేంజి” పేరుతో పంపిణీ సంస్థను నెలకొల్పిన కాళ్ళకూరి సదాశివరావుకు ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తారనే విషయంపై పూర్తి అవగాహన ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో శబ్దచిత్రాల నిర్మాణం ప్రారంభమైంది. దాంతో చలనచిత్ర నిర్మాణంపై సదాశివరావుకు ఆసక్తి పెరిగి కలకత్తా వెళ్ళి రాధాకిషన్ చమ్రియాను కలిశారు. సదాశివరావు సంకల్పం తెలిసిన రాధాకిషన్ తానే స్వయంగా “మదన్ పిక్చర్స్ సంస్థ” ను నెలకొల్పి దర్శకుడిగా సదాశివరావుకు అవకాశం కల్పించగా తొలిప్రయత్నంగా తన తండ్రి కాళ్ళకూరి నారాయణ రావు వ్రాసిన చింతామణి నాటకాన్ని చలనచిత్రంగా చింతామణి (1933) చిత్రాన్ని నిర్మించారు. తన సినిమాకు తానే స్వయంగా స్క్రిప్టు తయారుచేసుకొనే సదాశివరావు తొలిసారిగా “సతీ సులోచన” చిత్రంలో ద్విపాత్రాభినయం ప్రవేశపెట్టిన తాను “గులేబకావళి కథ” (1939) తో తొలి జానపద చిత్రాల్ని తెరకెక్కించారు. సువర్ణమాల సినిమా తెచ్చిన నష్టాలతో సినిమా రంగం నుండి వైదొలిగి మూడు దశాబ్దాలకు పైగా అందరికీ దూరంగా హైదరాబాదులో నివాసం ఉండి, తన 83 సంవత్సరాల వయస్సులో నిష్క్రమించారు కాళ్ళకూరి సదాశివరావు.
నేపథ్యం…
కాళ్ళకూరి సదాశివరావు ప్రముఖ నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త అయిన కాళ్ళకూరి నారాయణరావు కుమారులు. ఆయన 13 ఫిబ్రవరి 1901 నాడు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జన్మించారు. పిఠాపూరం రాజా వారి కళాశాల ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఈ కళాశాలను 1884 వ సంవత్సరంలో “శ్రీ రాజా రావు వెంకట మహిపతి, గంగాధర రామారావు బహదూర్ స్థాపించారు. మొదట దీనిని మిడిల్ స్కూల్‌గా ప్రారంభించి, తరువాత రోజులలో పూర్తి స్థాయి కళాశాలగా మార్చారు. పిఠాపూరం రాజా వారి కళాశాల ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత హైదరాబాదు, మద్రాసు లలో బ్యాంకింగ్ లో డిప్లమా కోర్సు పూర్తిచేశారు. తాను ఉద్యోగ అన్వేషణలో ఉండగానే ఒక పత్రికా ప్రకటనలో రంగూన్ లో “సినిమా మెజిస్టిక్ థియేటర్” కి సహాయక నిర్వాహకులు కావాలి అనే ప్రకటన కనిపించింది. ఆ రోజుల్లో రంగూన్ లో తెలుగు వారు ఎక్కువగా ఉండడం వలన, వర్తక వ్యాపారం కోసం పత్రికలలో ప్రకటనలు వస్తుండేవి. దానికి సదాశివరావు దరఖాస్తు చేకోగా, ఆ ఉద్యోగం తనను వరించింది. అలా ఆయన రంగూన్ లోని ఆ సినిమా థియేటర్ లో సహాయక నిర్వాహకుడిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఆ థియేటర్ లలో అన్నీ కూడా మూగ సినిమాలే ప్రదర్శింపబడేవి. ఆ చిత్ర ప్రదర్శనశాలను ప్రదర్శింపజేయడం, అందులో ప్రొజెక్టర్ మార్చడం, ఇలా అన్ని పనులలో అనుభవం సంపాదించుకున్నారు. రంగూన్ లో అనేకమంది తెలుగువారు, ఎన్నో తెలుగు హోటళ్ళు ఉన్నా కూడా ఆయన ఎందువలనో రంగూన్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. నాలుగైదులు నెలల తరువాత రంగూన్ కి వీడుకోలు చెప్పి తిరిగి తన సొంత ఊరు అయిన కాకినాడకు 1923 లో వచ్చేసారు. మళ్ళీ ఎప్పటిలాగే
“ఇంపీరియల్ పిక్చర్ ప్యాలెస్” స్థాపించి…
ఉద్యోగ అవకాశాల కోసం వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో చిత్తజల్లు పుల్లయ్య నిర్వహించే టూరింగ్ టాకీసు (సినిమా టెంట్ల నిర్వాహణ) లకు సహాయకుడిగా ఆయన వద్ద సదాశివరావు చేరారు. అక్కడ కొంతకాలం అనుభవం సంపాదించాక, తోటి మిత్రులతో కలిసి సొంతంగా ఒక థియేటర్ మొదలుపెట్టాలని సిద్ధపడ్డారు. మాములుగానే చిత్తజల్లు పుల్లయ్య ఆ రోజుల్లో థియేటర్లు కట్టడమే, ఆ రంగంలోకి మిగతావారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆయనకు సహాయకుడిగా వున్న సదాశివరావుకే ఆ ఆలోచన రావడంతో, తనకు తెలిసిన ఒకరిద్దరు మిత్రులను కూడా సదాశివరావుకు పరిచయం చేశారు. అలా వారితో కలిసి “ఇంపీరియల్ పిక్చర్ ప్యాలెస్” అనే ఒక చలనచిత్ర ప్రదర్శనశాలను ప్రారంభించారు సదాశివరావు. అది మూకీ చిత్రాల ప్రదర్శనశాల అయినప్పటికీ, మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం థియేటర్ మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలో భాగంగా “ఇంపీరియల్ ఫిలిం సర్క్యూట్ డిస్ట్రిబ్యూషన్” ప్రారంభించి సినిమాలు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఒకవైపు థియేటర్, మరోవైపు పంపిణీ విభాగం రెండూ బాగానే లాభాల బాటలో సాగుతున్నాయి. కానీ ఒకవైపు సహజంగానే లాభాలు పెరుగుతూ ఉండడంతో భాగస్వాముల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దాంతో కలిసి ఉండి కలహించుకోవడం ఎందుకని భాగస్వామ్యం నుండి బయటకు వచ్చేసిన సదాశివరావు తానే సొంతంగా “కాకినాడ ఫిలిమ్స్ ఎక్స్చేంజ్” అని సొంతంగా సినిమా పంపిణీ సంస్థను నెలకొల్పారు. ఇలా తన వ్యాపారాలన్నీ సుమారు ఏడెనిమిది సంవత్సరాలు బాగానే సాగాయి.
తండ్రి వ్రాసిన చింతామణి నాటకాన్నే సినిమాగా…
కాళ్ళకూరి సదాశివరావు తన వ్యాపార పనుల మీద నిమిత్తం కలకత్తా, బొంబాయి వెళుతూ, వస్తూ ఉండడం వలన ఆయా నగరాలలో సినిమాలలో పెట్టుబడి పెట్టే వ్యాపారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1932 వ సంవత్సరంలో భారతీయ సినిమా మాటలు నేర్వడం (టాకీ యుగం) మొదలయ్యింది. సినీ పరిశ్రమకు చెంది సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసే “రాధాకిషన్ చామ్రియా” అనే సినిమా నిర్మాణ వ్యాపారవేత్తతో పరిచయం వలన సదాశివరావు కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అధిక భాగం పెట్టుబడి పెట్టిన “రాధాకిషన్ చామ్రియా” నిర్మాణ సంస్థకు “మదన్ పిక్చర్స్” అని పేరు పెట్టారు. ఆ సినిమా రూపకల్పన బాధ్యతలన్నీ కూడా సదాశివరావుకే అప్పగించారు.
అప్పటివరకు పాదుకా పట్టాభిషేకం (1932), శకుంతల (1932), పృధ్వీపుత్ర (1933), రామదాసు (1933, ఈస్టిండియా ఫిలిమ్స్), రామదాసు (1933, కృష్ణా ఫిలిమ్స్), సావిత్రి (1933, ఈస్టిండియా), సావిత్రి (1933, కృష్ణా ఫిలిమ్స్) ఇలా అన్నీ పౌరాణిక నాటకాల ఆధారంగా నిర్మితమైన సినిమాలే వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆలోచించిన సదాశివరావు ఇన్ని పౌరాణిక చిత్రాల మధ్య, భిన్నమైన కథ ఉంటే బాగుండు అని అనుకుని తన నాన్న కాళ్ళకూరి నారాయణ రావు వ్రాసిన చింతామణి నాటకాన్ని కథగా ఎంచుకున్నారు.
అప్పటికే నాలుగైదు సార్లు పునఃముద్రణ పొందిన చింతామణి నాటక పుస్తకం వేలాది కాపీలు అమ్ముడుపోయింది. ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపుతున్న చింతామణి నాటకం 1932 చివరవరకు ఏ ఊర్లో ప్రదర్శించినా ప్రేక్షకులు, వీక్షకులు విరగబడి చూస్తున్నారు. పది సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న ఆ నాటకాన్నే సినిమాగా తీయడానికి సదాశివరావు నిర్ణయించుకున్నారు. అది అప్పటికీ రంగస్థల నాటకమే కాబట్టి పెద్దగా మార్పులుచేసే అవసరం రాలేదు. సదాశివరావు అప్పటివరకు తాను పరిశీలించిన సినిమా పరిజ్ఞానంతో స్క్రీన్ ప్లే ను తానే వ్రాసుకున్నారు.
దుర్గా కళామందిర్ లో విడుదలైన చింతామణి (1933)..
చింతామణి (1933) సినిమాలో నటించడానికి రంగస్థల నటీనటులే కావాలి. ఈస్టిండియా పిలిమ్స్ ద్వారా సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించబడిన తెలుగు సినిమా సతీ సావిత్రి (1933) సినిమాలో సావిత్రిగా నటించిన రామతిలకం ను చింతామణి పాత్రకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు పులిపాటి వెంకటేశ్వర్లును భవాని శంకరం పాత్రకు, బిల్వమంగళుడు పాత్రలో వై.భద్రాచార్యులు, శ్రీకృష్ణ పాత్రలో యస్.వీ.బాబురావు ను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంగీతాన్ని మారుతీ సీతారామయ్య అందించారు. మాములుగా అయితే ఆ రోజుల్లో ఏ సినిమా చిత్రీకరణ ప్రారంభమైతే రెండు, మూడు నెలల్లో పూర్తయిపోతుంది. కానీ చింతామణి చిత్రాన్ని కాళ్ళకూరి సదాశివరావు నాలుగైదు నెలల్లో పూర్తిచేశారు. చింతామణి సినిమా 29 జూలై 1933 నాడు తొలివిడతగా విజయవాడ లోని దుర్గా కళామందిర్ లో విడుదలైంది.
మహాకవి కాళ్ళకూరి నారాయణరావుచే రచింపబడిన బిల్వమంగళ లేదా చింతామణి అని పరిచయం చేశారు. రెండో విడతలో సెప్టెంబరు 1933 నుండి మద్రాసులోని గెయిటీ థియేటర్ లో రోజుకు రెండు ఆటలుగా విడుదల చేశారు. మనోహరమైన పాటలు, హృదయానందకరమగు సంభాషణలు, దర్శనీయమైన భరతనాట్య ప్రదర్శనం అని సినిమా ప్రచారం చేశారు. తెలుగు చలనచిత్ర వెండితెరపై మొదటిసారి భరతనాట్యం ప్రవేశపెట్టబడింది కాళ్ళకూరి సదాశివరావు తెరకెక్కించిన చింతామణి సినిమా ద్వారానే. ఈ సినిమాలోని భవానీ శంకరం పాత్రధారి పులిపాటి వెంకటేశ్వర్లు పాడిన “ఇంట రంభలవంటి ఇంతులుండ సాని సంపర్కమును కోరు చవటలారా” అనే పద్యం ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ రికార్డుల్లో మార్మోగిపోయింది. తెలుగు టాకీల విడుదల క్రమంలో గమనిస్తే, చింతామణి సినిమా అనేది ఆరవ తెలుగు టాకీ చిత్రం. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించకపోయినా కూడా దర్శకుడిగా సదాశివరావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
రెండవ చిత్రం “భక్త కుచేల” (1935)…
కాళ్ళకూరి సదాశివరావు తన తండ్రి వ్రాసిన నాటకాన్ని సమర్థవంతంగా సినిమాగా తీర్చిదిద్దారు. ఇట్టి విషయాన్ని నాటక ప్రియులు కూడా ప్రశంసించారు. అయితే ఇదే కథతో యరగుడిపాటి వరదరావు (వై.వి. రావు) దర్శకత్వంలో ఎం.కె.త్యాగరాజ భాగవతార్, కె.అశ్వతమ్మ కలయికలో చింతామణి (1937) గా తమిళంలో తెరకెక్కించారు. బిల్వమంగళుడి పాత్రలో ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నటించగా, చింతామణి పాత్రలో కె.అశ్వతమ్మ నటించగా 1937 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం సంవత్సరం పాటు ఏకధాటిగా ప్రదర్శింపబడి మంచి విజయాన్ని నమోదుచేసింది.
అదేవిధంగా నందమూరి తారక రామారావు, పి.భానుమతి, జమున తారాగణంలో పి.యస్.రామకృష్ణారావు దర్శకత్వంలో భరణి పిక్చర్స్ సంస్థ చింతామణి చిత్రాన్ని నిర్మించింది. బిళ్వమంగళుడిగా ఎన్.టి.రామారావు నటిస్తే, భానుమతి గారి భరణి సంస్థలో నిర్మాణమైన ఇదే కథ చింతామణి పాత్రలో భానుమతి నటించారు. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. చింతామణి చిత్రం తరువాత సదశివరావు దర్శకత్వంలో రెండో చిత్రం రావడానికి రెండేళ్లు పట్టింది.
రాధ ఫిల్మ్ కో పిక్చర్స్ నిర్మాణంలో కళ్యాణం రఘురామయ్య, పులిపాక వెంకటప్పయ్య, కాకినాడ రాజారత్నం, సామ్రాజ్యం నటవర్గంతో తెలుగు టాకీల వరుస క్రమంలో 12వ చిత్రం భక్త కుచేల (1935). ఈ చిత్రంలో శ్రీకృష్ణుడుగా ఈలపాటి రఘురామయ్య నటించారు. ఆయన నటజీవితంలో ఇది రెండవ సినిమా. ఆయన నట జీవితంలో మొత్తం 12 సినిమాలో శ్రీకృష్ణుడుగా నటించారు. ఆయన సినిమాలలో ధరించిన శ్రీకృష్ణుడి పాత్రకు మూలం కాళ్ళకూరి సదాశివరావు తీసిన భక్త కుచేల (1935). ఇందులో కుచేలుడిగా నటించినది పులిపాక వెంకటప్పయ్య (కే.ఎస్..రామారావు అల్లుడు), రుక్మిణిగా రాజా రత్నం నటించగా, సత్యభామగా సామ్రాజ్యం నటించారు. ఈ సినిమా కలకత్తాలో తయారయ్యింది.
సదాశివరావు భక్త కుచేల చిత్రంలో శ్రీకృష్ణుడి లీలలు ఘట్టాన్ని చేర్చి సినిమా పేరును కూడా “శ్రీకృష్ణలీలలతో కూడిన భక్త కుచేల (1935) అని ప్రచారం చేశారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడి మురళిని గోపికలు దాచినప్పుడు ఈలపాటతో వారిని పరవశింప చేస్తాడు శ్రీకృష్ణుడు. ఆ ఈలపాటను కూడా ప్రత్యేకంగా ప్రచార ప్రకటనలో వాడుకున్నారు కాళ్ళకూరి సదాశివరావు. ఈ ప్రచార ప్రకటన ద్వారా వచ్చిన ప్రచారంతో చింతామణి చిత్రం కంటే “భక్త కుచేల” (1935) అద్భుతమైన విజయం సాధించింది. దాంతో కాళ్ళకూరి సదాశివరావుకు కలకత్తా సినిమా నిర్మాణ వ్యవహార వర్గాల్లో మంచి పేరు వచ్చింది.
లాభాలను తెచ్చిపెట్టిన లంకాదహనం (1936)…
కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన మూడవ చిత్రం లంకాదహనం (1936). రాధా ఫిలిం కంపెనీచే నిర్మించబడిన ఈ చిత్రంలో విభీషణుడుగా కళ్యాణం రఘురామయ్య నటించగా, హనుమంతుడిగా సి.యస్.నటేశన్ అభినయించారు. అలాగే శ్రీరాముడిగా భీమరాజు గురుమూర్తిరావు, సీతగా దాసరి కోటి రత్నం, రావణుడిగా పిప్పళ్ల రామకృష్ణారావు నాయుడు నటించారు. చందాల కేశవదాసు రచన చేసిన భక్త కుచేల చిత్రానికి, డి.వి.భద్రం నిర్మాణ నిర్వాహాకుడిగా (ప్రొడక్షన్ మేనేజరు) వ్యవహారించారు. విభీషణుడుగా నటించిన కళ్యాణం రఘురామయ్య ఈ చిత్రంలో “నా మనవిని వినుమా అనూజా రామునీ కపకృతి” గేయం ఆలపించిగా జూన్ 1936 నాడు విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.
కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వం చేసిన నాలుగవచిత్రం సతీ సులోచన (1936). తెలుగు సినిమా మాటలు నేర్చిన మొదటి సినిమా “భక్త ప్రహ్లాద” (1932) లో హిరణ్యకశపుడిగా అభినయించిన మునిపల్లె సుబ్బయ్య ఈ సతీసులోచన సినిమాలో రావణుడు, ఇంద్రజిత్‌గా రెండు పాత్రలు పోషించారు. ఈ విధంగా తెలుగు చిత్రాలలో ద్విపాత్రాభినయ పాత్రలకు తొలిసారి బీజం వేశారు దర్శకులు కాళ్ళకూరి సదాశివరావు. దేవదత్తా ఫిలిమ్స్ పతాకంపై కలకత్తాకు చెందిన నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించగా 03 అక్టోబరు 1935 నాడు విడుదలైంది. ఈ చిత్రం తరువాత సదాశివరావు దర్శకత్వంలో విడుదలైన విభిన్న చిత్రం “గులేబకావళి” (1938). లిబర్టీ పిక్చర్స్ నిర్మాణంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో శకుంతల కామేశ్వరరావు , వీరారాఘవరెడ్డి తదితరులు నటించగా, ఈ చిత్రానికి మాస్టర్ వసంత కుమార్ నాయుడు సంగీతం అందించారు. ఈ చిత్రం 02 అక్టోబరు 1938 నాడు విడుదలైంది.
తెలుగులో తొలి జానపద చిత్రం “గులేబకావళి కథ” (1938)…
కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన మొదటి నాలుగు సినిమాలు చింతామణి (1933), భక్త కుచేల (1935), లంకాదహనం (1936), సతీ సులోచన (1936) సినిమాలు కలకత్తాలో నిర్మాణం అయితే, ఐదవ చిత్రం “గులేబకావళి కథ ” (1939) మాత్రం బొంబాయిలో నిర్మాణం అయ్యింది. “పారామౌంట్ ఫిలిం కంపెనీ” వారు నిర్మాతలు. ఈ సంస్థ అధినేత కిక్కూభాయ్ దేశాయ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా, ఈ సినిమా యొక్క నిర్మాణాన్ని కూడా పర్యవేక్షించారు. “గులేబకావళి కథ” (1938) సినిమా అనేది తెలుగులో తొలి జానపద చిత్రం. కత్తి యుద్ధాలు, పోరాటాలు, మంత్రాలు, మాయలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు సదాశివరావు. శకుంతల కామేశ్వరరావు, వీర రాఘవరెడ్డి, వెంకటప్పయ్య, కన్నారావు భాగవతార్, రాజా మణి, సుందరలీల మొదలైన ఈ చిత్రంలో నటించారు. అయితే కాళ్ళకూరి సదాశివరావు 1933 నుండి 1938 వరకు సుమారు ఏదేళ్లలో ఐదు చిత్రాలను రూపొందిస్తే, ఇందులో నాలుగు చిత్రాలను కలకత్తాలోనూ, ఒక చిత్రం బొంబాయి లోను నిర్మాణం జరిపారు. అంటే కాళ్ళకూరి సదాశివరావుతో పనిచేసిన నిర్మాతలందరూ ఉత్తర భారతదేశానికి చెందినవారే. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలో గల గద్దెనాపల్లికి చెందిన పంతం చిన్నారావు సినిమా నిర్మాణం కోసం తొలిసారి సదశివరావును కలిశారు.
మధ్యలోనే వదిలేసిన చంద్రహాస (1941)…
మాములుగానే తూర్పుగోదావరి జిల్లా వాసులు అంటే అభిమానం ఉన్న కాళ్ళకూరి సదాశివరావు కొత్త నిర్మాతలను ప్రోత్సహించాలని తూర్పుగోదావరి నుండి వచ్చిన పంతం చిన్నారావుతో మరొక జానపద చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కలకత్తా నుండి మద్రాసుకు వచ్చేసి మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి దేవి, వేదవల్లి మొదలైన వారు ప్రధాన పాత్రధారులుగా “చంద్రహాస” అనే సినిమాను మొదలుపెట్టారు. ఎంతో మంచివాడిగా, సౌమ్యుడుగా, అందరితో కలిసిపోయేవాడిగా పేరున్న సదాశివరావుకి చంద్రహాస సినిమా నిర్మాతలతో విభేదాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా దర్శకత్వాన్ని మధ్యలో వదిలేశారు సదాశివరావు. ఆ తరువాత చంద్రహాస సినిమాకు ఎం.ఎల్.రంగయ్య దర్శకత్వం వహించి విడుదల చేయగా అది పరాజయం పాలైంది.
సదాశివరావు మరో కొత్త సినిమా మొదలు పెడదామని అనుకుంటూ ఉండగా మద్రాసులో రెండో ప్రపంచ యుద్ధమేఘాలు అలుముకున్నాయి. అనేక చిత్ర నిర్మాణ సంస్థలు తమ తమ కార్యకలాపాలను ఆపేసి మద్రాసు విడిచి వెళ్లిపోయారు. ఆ సమయంలో సదాశివరావుకు భారత సైన్యంలో 14వ పటాలంలో వినోదశాఖలో కళాకారులను సమన్వయం చేసి, సైనికులకు యుద్ధ విరామ సమయంలో వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసే ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగంలో నాలుగు సంవత్సరాలు పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తరువాత 1946 లో మద్రాసుకు చేరుకున్నారు. అయితే చాలా కాలం సినిమా పరిశ్రమకు దూరంగా ఉండటం, అందులోనూ మద్రాసు బయట ఉండడంతో ఆయనకు సినిమా అవకాశాలు రావడం కష్టమైపోయింది. అప్పటికే చిత్ర పరిశ్రమకు చాలామంది కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు వచ్చారు.
“సువర్ణ లతా పిక్చర్స్” స్థాపన…
దర్శకుడిగా కాళ్ళకూరి సదాశివరావు అంటే చాలామందికి గౌరవం. కానీ ఆరు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ఆయనకు దర్శకత్వం అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ కుడా ముందుకు రాలేదు. దాంతో చేసేది లేక ఆయన 1946 లో తన అత్తగారి ఊరు నెల్లూరుకు వచ్చి కొంతమంది పెట్టుబడిదారులను కలుసుకుని సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించదలిచి జనవరి 1947 లో “సువర్ణ లతా పిక్చర్స్” అనే సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. నెల్లూరులోని ఉంగనూరు వారి వీధిలో నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభించి, మద్రాసులోని సైదాపేటలో చిత్ర నిర్మాణ కార్యాలయాన్ని మొదలుపెట్టారు. అయితే “సువర్ణ లతా పిక్చర్స్” నిర్మాణ సంస్థను మూలధనం రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే, అందులో తొలి విడతగా 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు, మిగతా రెండు లక్షల రూపాయలు పబ్లిక్ షేర్ (ప్రజా వాటాల భాగస్వామ్యం) గా నిర్ణయించుకున్నారు. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ వ్రాసుకున్నారు సదాశివరావు. సినిమా పేరు “సువర్ణమాల”. చిత్రీకరణ సెప్టెంబరు 1947 లో మొదలైంది. అప్పటికి ఇంకా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సూర్యనారాయణ అనే యువకుడిని కథానాయకుడిగా ఎంచుకున్నారు. అయితే సూర్యనారాయణ అంతకుముందే భరణి పిక్చర్స్ నిర్మాణంలో పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో రత్నమాల (1948) చిత్రంలో చంద్రకాంత్ పాత్రను సూర్యనారాయణ పోషించారు. ఆ అనుభవం ఉండడంతో సూర్యనారాయణ కూడా సువర్ణమాల చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు.
కాలగర్భంలో కలిసిపోయిన “సువర్ణమాల” (1952)…
సువర్ణమాల చిత్రంలో కథానాయికగా రావు బాల సరస్వతి, అలాగే ఇతర నటులు సి.యస్.నటేశన్, ముదిగొండ లింగమూర్తి, జోషి మొదలగు వారిని ఇతర పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. మాటలు, పాటలు దర్భా వెంకట కృష్ణమూర్తి తో వ్రాయించుకున్నారు. సంగీత దర్శకుడిగా అద్దేపల్లి రామారావును అనుకున్నారు సెప్టెంబరు 1947 లో చిత్రీకరణ మొదలుపెట్టి, మార్చి 1948 వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత విడుదల ప్రయత్నాలు ప్రారంభించారు. చివరకు 15 ఆగస్టు 1948 నాడు విడుదల తేదీగా ప్రకటించారు. మద్రాసు లోని పారమౌంట్ స్టూడియోలో 14 ఆగస్టు 1948 నాడు ముందస్తుగా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. అప్పటి రెవిన్యూ మంత్రి కళా వెంకటరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రింట్ వేయడానికి సరిపడా పాజిటివ్ ఫిల్మ్ లభ్యం కానందున నిర్మాతలు ఆశించినట్లు 15 ఆగస్టు 1948 నాడు సినిమా విడుదల కాలేదు. ముందుగా చేసుకున్న ఏర్పాట్లలో జరిగిన లోపం వలన రెండు ప్రింట్లు మాత్రమే వేయగలిగారు. అందువలన సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తరువాత కొద్ది నెలలు సినిమా త్వరలో వస్తుంది, సినిమాలోని కొన్ని లోపాలను సరి చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో థియేటర్ల వారిని సంప్రదించి, మీరు ఎన్ని ప్రింట్ లు తీసుకుంటారో చెబితే దానిని బట్టి సువర్ణమాల చిత్రాన్ని ప్రింట్లు వేస్తామని నిర్మాతలు తెలిపారు. అందుకు థియేటర్ యజమానులు ఒప్పుకోలేదు. ముందు మీరు ప్రింట్లు వేయండి, దానిని బట్టి మేము తీసుకుంటామన్నారు.
ఇలా కొంతకాలం గడిచింది. సినిమా విడుదల కష్టం అయ్యింది. సినిమా నిర్మాణానికి తెచ్చిన డబ్బుల వడ్డీలు నెలనెలకు పెరిగిపోతూ వచ్చాయి. చివరికి సువర్ణమాల చిత్రం 19 ఆగస్టు 1952 నాడు విడుదల అయ్యింది. నెల్లూరులో కేవలం మధ్యాహ్నం ఆట మాత్రమే నడిచింది. నాలుగు సంవత్సరాలు నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. ఎనిమిదేళ్ల పాటు వరుసగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన సదాశివరావు తెరకెక్కించిన చిట్టచివరి చిత్రం “సువర్ణమాల” (1952), ఎవ్వరికీ తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఆ సినిమా ప్రభావం సదాశివరావు సినిమా జీవితంపై, నిజ జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.
హత్యకు గురైన “సువర్ణమాల” కథానాయకుడు…
“సువర్ణమాల” చిత్రానికి కాళ్ళకూరి నారాయణరావు సంగీతం అందించారు. ఆయన వాహినీ స్టూడియోలో సంగీత విభాగంలో కొంతకాలం పనిచేశారు. ఆయన సదాశివరావు సొంత అన్నయ్య అయిన దక్షిణామూర్తి కుమారుడు. అదేవిధంగా కాళ్ళకూరి సదాశివరావు చెల్లెలు కాంచనమాల కుమారుడు వై.వి.రావు కూడా ఈ సినిమా ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు. ఆయన సువర్ణమాల చిత్రానికి నిర్మాణ విభాగంలో పనిచేశారు. ఆయన సినిమాలలోకి రాకముందు కొంతకాలం నేవీలో కూడా పనిచేశారు. అయితే “సువర్ణమాల” చిత్రం విడుదల అవ్వకపోవడం, కాళ్ళకూరి సదాశివరావుకు నష్టం వచ్చి తాను సినిమాల నుండి వైదొలగడం, దాంతో కాంచనమాల అబ్బాయి వై.వి.రావు పత్రికా రంగంలో ప్రచురణ విభాగం వైపు వెళ్లారు.
అలా కొంతకాలం గడిచిన తరువాత మళ్ళీ సినిమా రంగం వైపు వచ్చి విజయవంతమైన దర్శక, నిర్మాతగా నిలదొక్కుకున్నారు. అదేవిధంగా సువర్ణమాల సినిమాలో నటించిన కథానాయకుడు మల్లెల సూర్యనారాయణ, తాను “సువర్ణమాల” లో నటించేటప్పుడు కళాశాల విద్యార్థి. ఆయన నటించిన “సువర్ణమాల” సినిమా విడుదల కాకపోవడం, ఆయనకు ఇతర సినిమాలలలో అవకాశాలు రాకపోవడంతో ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. 1951 వ సంవత్సరంలో ఒక శాఖ నుండి మరొక శాఖకు డబ్బు తీసుకెళ్లే సమయంలో పట్టపగలే ఆయన హత్యకు గురయ్యారు. ఆ విధంగా “సువర్ణమాల” కథానాయకుడు తనను తాను వెండితెర మీద చూసుకోలేకపోయారు. ఇకపోతే “సువర్ణమాల” చిత్ర నిర్మాతలు తరువాత చిత్రం ప్రకటించారు, కానీ సహజంగానే “సువర్ణమాల” చిత్రం విడుదల కాకపోవడంతో ప్రకటించిన కొత్త చిత్రాన్ని ప్రారంభించలేకపోయారు.
కుమారుడు చంద్రమోహన్ రావు మరణం…
కాళ్ళకూరి సదాశివరావు తాను తెరకెక్కించిన “సువర్ణమాల” చిత్రం విడుదల కాకపోవడంతో నిరాశతో తిరిగి అత్తగారిల్లు అయిన నెల్లూరు వచ్చేశారు. నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన తన అన్నయ్య దక్షిణామూర్తి చాలా సంవత్సరాలు తమ్ముడు సదాశివరావు కుటుంబానికి చాలా సంవత్సరాలలు సహాయం చేశారు. సదాశివరావు చుట్టుప్రక్కల పాఠశాలకు వెళ్లి గణితశాస్త్రంలో ఉండే ఉపాయాలతో విద్యార్థులు అలరించేవారు. దానికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులు ఆయనకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తూ ఉండేవారు. సదాశివరావుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు చంద్రమోహన్ రావు. ఆయన నెల్లూరులో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక తిరుపతిలో డిగ్రీ చదవడానికి వెళ్లి, అక్కడ ర్యాగింగ్ తట్టుకోలేక కళాశాల మానేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో వెదికిన తరువాత కళాశాల నుండి వెళ్లిపోయిన ఎనిమిది సంవత్సరాలకు బొంబాయి, మద్రాసు నగరాలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, చివరకు ఒక ఎరువుల కంపెనీలో అమ్మకాల ప్రతినిధి (సేల్స్ రిప్రజెంటేటివ్) గా ఉద్యోగం తెచ్చుకున్నారు. ఆయనకు వివాహం అవ్వలేదు. ఈ మధ్యకాలంలోనే చంద్రమోహన రావు కాలం చేశారు.
నిర్యాణం…
ఇకపోతే కాళ్ళకూరి సదాశివరావు పదిహేను సంవత్సరాలు నెల్లూరులో నివసించాక, 1969 లో ఒక సంవత్సరం పాటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నివాసం ఉన్నారు. ఆ తరువాత 1971లో సదాశివరావు దంపతులు హైదరాబాదు లోని సైదాబాద్ లోని ఒక చిన్న ఇంటిలో అద్దెకు ఉన్నారు. ఒకవైపు సదాశివరావు 1933 నుండి 1939 వరకు తీసిన సినిమాలు పునఃనిర్మాణం అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ వేగవంతం అవుతుంది. ఒకప్పుడు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కాళ్ళకూరి సదాశివరావు మాత్రం అందరికీ దూరంగా హైదరాబాదులో ఒక అద్దె ఇంట్లో జీవించారు. ఆయన కొంతకాలం విద్యార్థులకు ఆంగ్లంలో వ్యాకరణ పాఠాలు కూడా చెప్పారు. జనవరి 1984 వ సంవత్సరంలో కాళ్ళకూరి సదాశివరావు తన 83 సంవత్సరాల వయస్సులో హైదరాబాదు లోనే కన్నుమూశారు. అప్పటికి ఆయన సినిమా రంగానికి దూరమై 36 సంవత్సరాలు. ఆ తరువాత కొంత కాలానికి ఆయన భార్య కూడా కన్నుమూశారు. అవివాహతుడైన వాళ్ళ అబ్బాయి చంద్రమోహన రావు ఇటీవల మరణించారు.









