
మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశారు. రెగ్యులర్ తెలుగు కమర్షియల్ మూవీలా మాత్రం ఉండదని అందరికీ అర్థమైపోయింది. మరి ఈ భాస్కర్ కథ ఏంటి? లక్కీ భాస్కర్ కథలో ఎంత లక్ ఉందనేది ఓ సారి చూద్దాం.
కథేంటంటే: ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.జీతం అంతంత మాత్రానే, దానికి తోడు కుటుంబ భారమంతా ఒక్కడిపైనే. భార్య సుమతి (మీనాక్షి చౌదరి)తో పాటు, కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు… ఇలా అందరి బాధ్యతలూ తనవే. బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు.
ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదనుకుంటాడు. మరి భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏమిటి? అది అతడికి ఇబ్బందుల్ని తెచ్చిపెట్టిందా లేక కష్టాల్ని దూరం చేసిందా? అనేది మిగతా కథ.
సీబీఐ అరెస్ట్‌తో కథ ఇంటెన్స్‌గా, సీరియస్ నోట్‌లో ప్రారంభమైనప్పటికీ.. వెంటనే ఫ్యామిలీ జోన్‌లోకి తీసుకెళ్లి సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చిన విధానంతోనే కనెక్ట్ అయిపోతారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఇంటెలిజెంట్, బ్రిల్లియెంట్ స్క్రీన్ ప్లే సినిమాను ఓ రేంజ్‌కు చేర్చింది. ప్రతీ సీన్‌కు రేంజ్‌ను పెంచుకొని వెళ్లిన విధానం.. ప్రతీ సీన్‌లో ఎమోషన్స్ జొప్పించిన విధానం సినిమాకు బలంగా మారింది.
ఇక డైలాగ్స్‌తో కేక పెట్టించాడు. ఇటీవల కాలంలో బెస్ట్ రైటింగ్ మూవీ. సున్నితమైన కామెడీ, ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. లక్కీ భాస్కర్ ఈ దీపావళికి సినీ ప్రేక్షకులకు బెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. డోంట్ మిస్. మంచి అనుభూతి కోసం థియేటర్‌లోనే చూడండి. పెట్టిన ప్రతీ పైసా వసూల్‌లా ఉంటుంది.
రేటింగ్: 3.25/5