
ఎండ, వాన, మంచు గాలులను లెక్కచేయకుండా తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి, కేవలం దేశ రక్షణనే తమ భుజస్కంధాలపై మోస్తున్న వీరులే మన భారత సైనికులు. వీరు భరతమాత ముద్దు బిడ్డలు. అలాంటి ఎంతో మంది వీరులు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో తమ పోరాట పటిమను ప్రదర్శిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి, నీచాతి నీచమైన పాకిస్థాన్‌ను వెంటాడి తరిమి కొట్టి, మన దేశ పతాకాన్ని రెపరెపలాడించిన చారిత్రక దినం జూలై 26.
హిమశిఖరాలపై మ్రోగిన భారత సింహగర్జన:
ద్రోహంతో దూసుకొచ్చిన పాక్ శత్రువుల ఆటకట్టించి భారత సైన్యం ధర్మ యుద్ధం చేసి సాధించిన అద్భుత విజయానికి ఇది ప్రతీక. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా శత్రువు గుండెల్లో సింహస్వప్నమై నిలిచి పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజు. కేవలం మన భూభాగాన్ని తిరిగి గెలుచుకోవడమే కాకుండా దేశ ఆత్మగౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకున్న శౌర్య చరిత్ర. అందుకే దేశ చరిత్రలో జూలై 26 ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. మన సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా అమరులైన వీర సైనికులు చేసిన వీరోచిత త్యాగాలను స్మరించుకుంటూ భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళిగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను యావత్ దేశ ప్రజలూ జరుపుకుంటారు.
కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యత:
ప్రాణాలను త్యాగం చేసిన సైనికుల శౌర్యానికి, త్యాగానికి గౌరవించే రోజిది. ఈ రోజున వీర మరణం పొందిన సైనికులకు దేశ ప్రజలు నివాళులర్పిస్తారు. యుద్ధవీరులను సత్కరించి, దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు. సైనికులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు దేశ ప్రధాని నివాళులర్పిస్తారు.
ఆపరేషన్ విజయ్ – యుద్ధం వెనుక కథ:
1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం తర్వాత మొదటిసారిగా రెండు దేశాలు నేరుగా సైనిక ఘర్షణకు దిగిన యుద్ధంగా ఇది నిలిచింది. 1998లో ఇరుదేశాలు అణు పరీక్షలు నిర్వహించాయి. భారత్ పాకిస్థాన్ మధ్య కుదిరిన లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే కుట్రతో పాకిస్థాన్ సైన్యం ‘ ఆపరేషన్ బదర్ ‘ పేరుతో ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. హిమాలయాలలోని ఎత్తైన కార్గిల్ శిఖరాలపై పాక్ చొరబాటుదారులు రహస్యంగా పాగా వేశారు. ఆ ద్రోహపు కుట్ర మన దేశానికి పెను ముప్పుగా మారింది. 1999 మే 3న జమ్మూ, కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోని బాల్టిస్తాన్ జిల్లా కార్గిల్‌లో పాకిస్థాన్ చొరబాటుదారుల ఉనికిని స్థానిక గొర్రెల కాపరులు తొలుత గుర్తించారు. మన సైన్యం మే5న ఆ ప్రాంతం వెంబడి పెట్రోలింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది.
కెప్టెన్ సౌరభ్ కాలియాతో సహా ఐదుగురు భారత పెట్రోలింగ్ సైనికులను పాక్ బలగాలు సజీవంగా బంధించి క్రూరంగా హింసించి చంపాయి. మే 9న పాకిస్థాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది. మరుసటి రోజు ద్రాస్, ముష్కో, కక్సర్ సెక్టార్లలో చొరబాట్లు జరిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఊహకందని మంచు కొండల్లో, నెత్తురు గడ్డకట్టే మైనస్ డిగ్రీల చలిలో మన వీర సైనికులు భారతమాత రుణం తీర్చుకోవడానికి ముందుకు కదిలారు. పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టారు. ఇరువైపుల నుంచి తీవ్ర స్థాయిలో పోరు కొనసాగింది. మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది. జూన్ 5న పట్టుబడిన పాకిస్థాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలను భారత సైన్యం బయటపెట్టి పాకిస్థాన్ జోక్యాన్ని బయటపెట్టింది. బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను, ద్రాస్ సెక్టారులోని టోలోలింగ్‌ను మన సైన్యం స్వాధీనపరచుకుంది.
జులై 4న పదకొండు గంటల పాటు సాగిన యుద్ధం తర్వాత భారత సైన్యం టైగర్ హిల్‌ను, మరుసటి రోజు భారత్ ద్రాస్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రచండ పోరాటంలో ప్రతి అంగుళం భూమి కోసం మన సైనికులు రక్తం చిందించారు. వారి ఉక్కు సంకల్పం, అచంచల ధైర్యం ముందు శత్రు సైన్యం నిలవలేకపోయాయి. జూలై 11న పాకిస్థాన్ తోకముడిచి పారిపోయింది. జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని అప్పటి భారత ప్రధాని వాజపాయి ప్రకటించారు. జూలై 26 నాటికి కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్థాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్ళగొట్టామని భారత సైన్యం ప్రకటించింది.ఈ యుద్ధం 1999 మే 8న ప్రారంభమై జూలై 26న విజయవంతంగా పూర్తయింది. పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడంలో భారత సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈ యుద్ధం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో జరిగింది.
త్రివిధ దళాల పాత్ర:
ఇండియన్ ఆర్మీ భారీ ఫిరంగిదళాలు, వైమానిక శక్తితో పాటు ప్రధాన పదాతిదళ కార్యకలాపాలను నిర్వహించింది. భారతీయ సైన్యానికి చెందిన శతఘ్నిదళం ప్రాణాంతకమైన, ఖచ్చితమైన మందుగుండు సామాగ్రితో శత్రు దళాలపై భారీ ప్రభావం చూపడమే యుద్ధ కార్యకలాపాలను సత్వరంగా ముగించడానికి కీలక కారణమైంది. వారి చేసిన అత్యున్నత త్యాగానికి కార్గిల్ సెక్టార్‌లోని ద్రాస్ వద్ద పాయింట్ 5140కు గన్ హిల్ అని నామకరణం చేయడం జరిగింది. భారత వైమానిక దళం “ఆపరేషన్ సఫెద్ సాగర్” పేరుతో యుద్ధంలో చిరస్థాయి శౌర్య పరాక్రమాలతో వీరోచితంగా పోరాడింది. 16,000 అడుగుల ఎత్తులో పోరాటాన్ని కొనసాగించింది. దాదాపు 5000 స్ట్రైక్ మిషన్స్, 350 గూఢచారి మిషన్స్, సుమారు 800 ఎస్కార్ట్ ఫ్లైట్లు చేపట్టింది. ఆర్మీకు మద్దతుగా వైమానిక దాడులను, శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేయడంలో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించి తమ వైమానిక శక్తిని ఉపయోగించి విజయం సాధించింది. భారత నౌకాదళం ఆపరేషన్ తల్వార్ పేరుతో రంగంలోకి దిగింది. ముఖ్యంగా తూర్పు నౌకాదళం వ్యూహాత్మక పాత్ర పోషించింది. అరేబియా సముద్ర మార్గాలను సమర్థవంతంగా నిరోధించడానికి పశ్చిమ నౌకాదళంతో కలిసి పనిచేసింది.
కార్గిల్ యుద్ధం ప్రత్యేకతలు
కొన్ని యుద్ధభూములు 18,000 అడుగుల ఎత్తున ఉన్నాయి. శత్రు స్థానాలను కాల్చడానికి భారతదేశం బోఫోర్స్ హోవిట్జర్లను ఉపయోగించింది. ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ అందించిన మానవరహిత వైమానిక వాహనాలను ఉపయోగించారు. టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన మొట్టమొదటి యుద్ధం ఇది.
“యే దిల్ మాంగే మోర్” – కెప్టెన్ విక్రమ్ బాత్రా:
కార్గిల్ యుద్ధంలో భారతదేశం తన ధైర్య సైనికుల్లో ఒకరైన కెప్టెన్ విక్రమ్ బాత్రాను కోల్పోయింది. ఈయన మరణానంతరం దేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమ వీరచక్రను బహూకరించారు. యుద్ధసమయంలో తన ధైర్యసాహసాలు, సాహసోపేతమైన చర్యలకు జాతీయ హీరో అయ్యాడు. అతను ఉపయోగించిన ప్రసిద్ధ పదాలు “యే దిల్ మాంగే మోర్” ఐకానిక్‌గా మారాయి.
వీరుల త్యాగమే మనకు స్ఫూర్తి:
కార్గిల్ యుద్ధంలో ఎందరో వీర జవాన్లు తమ పరమ పవిత్ర ప్రాణాలను మాతృభూమి కోసం అర్పించారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా శత్రువును చీల్చి చెండాడారు. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే “నేను చనిపోయేలోపు మరణాన్ని కూడా చంపేస్తాను” అని శపథం చేశారు. రైఫిల్‌మ్యాన్ సంజయ్ కుమార్, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వంటి అసంఖ్యాక వీరులు తమ రుధిరాన్ని తర్పణం చేసి దేశం కోసం ఒంటి నిండా తూటాలు మోసి కనుమూశారు. ద్రోహులను మట్టి కరిపించి మువ్వన్నెల పతాకాన్ని కార్గిల్ శిఖరాలపై రెపరెపలాడించిన ఆ వీరుల త్యాగం చిరస్మరణీయం!
వారి త్యాగాలు కేవలం అమరుల కథలు కావు. అవి మన జాతి ఆత్మకు నిత్య దీపికలు. మన యువతకు కర్తవ్య మార్గదర్శకాలు! వారి ఒక్కో రక్తపు బొట్టులో భారతదేశ ఔన్నత్యం, ప్రతీ త్యాగంలో భారతమాత ఆశీర్వాదం నిక్షిప్తమై ఉన్నాయి. వారి త్యాగాన్ని స్మరిస్తూ, ఈ దేశ పౌరులుగా మన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుందాం. దేశభక్తితో మనసు నింపుకుందాం. త్యాగ నిరతిని అలవర్చుకుందాం! ప్రతి భారతీయుడి గుండెలోనూ కార్గిల్ వీరుల త్యాగం ఒక నిత్య స్ఫూర్తిగా నిలవాలి.










