CINEMATelugu Cinema

దేవదాసు అంటే నాగేశ్వర రావు ఒక్కడే

ప్రేమ విఫలమైంది అంటే చాలు వీడు ఒక పెద్ద దేవదాసురా అని అంటుంటారు. దానికి గల పెద్ద కారణం అక్కినేని నాగేశ్వర రావు నటించిన దేవదాసు చిత్రం. ఈ చిత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన.. ఇప్పటికీ దేవదాసు అంటే అక్కినేని, పార్వతి అంటే సావిత్రి గుర్తు రావాల్సిందే. అంతలా వారు ఈ పాత్రల్లో నటించి మైమరపించారు. అసలు దేవదాసు అనే చిత్రం బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవల. దీనిని డీఎల్‌ నారాయణ తెలుగులోకి అనువదించి ఈ సినిమాను నిర్మించగా.. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. మొదట ఈ చిత్రంలో పార్వతి పాత్రకు షావుకారు జానకిని అనుకున్నా.. కాని కొన్ని కారణాలతో ఆమెను తప్పించి సావిత్రిని ఎంపిక చేశారు. అంతేకాకుండా, జానపద చిత్రాలు చేసిన నాగేశ్వరరావు దేవదాసు ఏంటని చాలా విమర్శలు, సెటైర్లు వచ్చాయి. ఇవి అక్కినేనికి తెలియడంతో.. ఆయన దేవదాసు పాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేవదాసు పాత్రలో లోతు తెలుసుకుని తాగుబోతు లుక్స్ లో, నీరసించిన కళ్లతో కనిపించడం కోసం 2 పూటలా భోజనం మానేశారు ఏఎన్నార్.

అలా నిజంగానే నీరసించిపోయి నటించారు. తర్వాత కోలుకోవడానికి 2 వారాల పైనే పట్టింది. చిత్ర షూటింగ్‌ను రాత్రిళ్లు నిద్ర మానేసి చేసేవారు. ఆ నిద్రకళ్లతో నటించడం వల్ల అక్కినేని నిజంగా తాగారని అంతా అనుకునేవారు. నిజానికి ఆ సమయానికి ఏఎన్నార్‌కు మందు అలవాటు లేదు. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే.. సినిమాలో ఎక్కడా దేవదాసు-పార్వతి ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పుకోరు. 1953 జూన్ 26న ’దేవదాసు’ విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక అక్కినేని నటనను అయితే “భారతీయ సినీ ప్రపంచంలో దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వర రావు ఒక్కడే ” అని లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ పొగిడారు. ఈ చిత్రం ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలనూ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. 7 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.

Show More
Back to top button