Telugu Special Stories

‘పుష్కర’ స్నానం.. పుణ్యప్రదం!

పుష్కర స్నానం అనగానే.. మనకు నదులైన.. కృష్ణా, కావేరి, తుంగభద్ర.. వంటి పన్నెండు నదీజలాలు గుర్తుకొస్తాయి.

పుష్కరం అంటే, పన్నెండు.. ప్రతి పన్నెండేళ్లకోసారి వస్తుంది. ఏ నది పేరుతో పిలిస్తే ఆ నది పేరు(గంగా, కృష్ణా)తో పుష్కరాలుగా భావిస్తున్నాం.

వీటి వెనుక అత్యంత విశిష్టత దాగి ఉంది మరీ. హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రకృతిని దైవంగా భావించడం మనకు ఆనాదిగా వస్తుంది.

దీనిలో భాగంగానే నదీస్నానాలు చేయడం,  పితృకార్యాలను నిర్వర్తించడం, పుష్కర ఘాట్ లను సందర్శించడం.. ఈ క్రతువులో భాగంగా చేస్తుంటాం.

మొత్తంగా నదిని ప్రాణదాతగా సేవిస్తాం. అసలు ‘పుష్కర’ శబ్దానికి పద్మం, పర్వతం, దేవతా కిరీటం, నదీజలం.. వంటి అనేకమైన అర్థాలు ఉన్నప్పటికీ,  పన్నెండేళ్లు అనే వాడుకలో ఉపయోగిస్తున్నాం.

ఇంతకీ పుష్కరాలు అంటే ఏమిటి..?, పనెండెళ్ళకోసారి జరగడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని, పురాణ వైశిష్టతను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

పురాణ గాథ…

తుందిలుడు.. పరమ శివభక్తుడు. అతను ఆచరించే జపతపాలు చూసి సాక్షాత్తు ఆ ముక్కంటే పొంగిపోయాడట.

ఒకనాడు కైలాసం నుంచి దిగొచ్చాడట. ఆ విధంగా ఏదేని వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందిలుడు.. ‘శివానందాన్ని మించిన పరమానందం ఏది లేదు, నాకు, నీ సన్నిధి చాలు. అదే పదివేలు’ అన్నాడట. ఆ విధేయత నచ్చి, జలాధిపత్యాన్ని ఇస్తాడు. ‘పుష్కరం’ అంటేనే పవిత్ర తీర్థం… 

ఆ ప్రకారం, పుష్కరాధిపత్యాన్ని పొంది, పుష్కరుడు అనిపించుకున్నాడు తుందిలుడు. అలా సమస్త జలరాశులన్నీ అతని ఆధీనంలోకి వచ్చాయి. దీంతో బ్రహ్మలోకంలో జపతపాలకు జలవనరులు లేకుండాపోయాయి. సాయం కోసం కైలాసానికి పరుగెత్తాడు బ్రహ్మ. పుష్కరుడు తన కమండలంలో కొలువుదీరాలని శివుడిని వేడుకున్నాడు. అలా మరికొంత కాలానికి బృహస్పతి సైతం పుష్కరుడి మీద పెత్తనం కోరాడు. ఆ కోరికనూ కాదనలేకపోయాడు శివుడు. కానీ పుష్కరుడికే ఇదంతా ఇబ్బందిగా అనిపించింది. దాంతో ‘నేను ఎక్కడికీ వెళ్లను. మీ దగ్గరే ఉంటాను’ అంటూ పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. 

‘బృహస్పతి మేషాది రాశులలో ఉన్నప్పుడు, మొదటి పన్నెండు రోజులు.. పుష్కరుడు ఆయా నదుల్లో ఉండాలనీ.. ఆ సమయంలో నాతోపాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలూ బృహస్పతి ఉన్న రాశికి అధిష్ఠానమైన నదీజలాల్లో ఉంటారు’ అని సూచించాడు. ఈ విధంగా భూలోకంలో పుష్కర సంప్రదాయం ఆరంభమైందని స్పష్టంగా తెలుస్తుంది. 

నవగ్రహాల్లో ఒకరైన గురువు(బృహస్పతి) ఏడాదికో రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇలా గురువు ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు.. ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. మనకు గంగతో మొదలుపెట్టి మొత్తం పన్నెండు పుష్కర నదులున్నాయి. మొదట గురువు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు.. ప్రారంభమవుతాయి. 

బృహస్పతి స్పర్శ వల్లే పుష్కరం మొదలు…

పూర్వం ఒకసారి తన తీరంలో తపస్సు చేస్తున్న బృహస్పతికి నదీమ తల్లి అతిథి మర్యాదలు చేయలేదట. ఇందుకు కోపించిన  బృహస్పతి పవిత్రతను కోల్పోతావంటూ శపించాడట. తిరిగి పవిత్రత ఎలా వస్తుందని ప్రశ్నిస్తే ‘నా స్పర్శతోనే అది వస్తుంది, మూడున్నరకోట్ల నదులు నాలో లీనమవుతాయి. నువ్వూ నా వెంట రా’ అన్నాడట. ఇందుకు సరేనంది నది. అప్పటినుంచి బృహస్పతి ఆ సంవత్సరం ఏ నదిలో ప్రవేశిస్తే, ఆ నదికి పుష్కరం వస్తుంది. 

‘పుష్కర’ అంటే పుష్టినిచ్చేది. ఎలాగంటే, నదీజలానికి, అందులో స్నానం ఆచరించినవారికి, ఆ నీటితో పండిన పంటలు అనుభవించినవారికి.. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి.. ఇవన్నీ కలిపి పన్నెండింటికీ పుష్టినిస్తుందని నిగూఢమవుతుంది.  

గంగ ప్రాశస్త్యం..

గంగ సహస్రముఖాలు కలది. విష్ణువు పాదాల నుంచి పుట్టి, హిమవంతుడి పుత్రికగా భూలోకంలో అవతరించింది. పార్వతికి సోదరి. దేవతల కోరిక మేరకు గంగ పాయ ఒకటి దేవలోకం వెళ్తే, మరో పాయ.. భగీరథుడి తపోఫలంగా.. శివుడి శిరస్సుపై పడింది. అటు పిమ్మట భగీరథుడి వెంటే వచ్చి భూమిని పావనం చేసింది. పాతాళంలోనూ సగర పుత్రుల భస్మం మీద ప్రవహించి వారికి సద్గతులను ప్రసాదించింది. ఇలా మూడు(దేవ, భూలోక, పాతాళ) లోకాల్లో ప్రవహించినందున త్రిపథగ పిలువబడింది. ఇక భగీరథుడు తెచ్చినందున భాగీరథి అయ్యింది. జహ్ను మహర్షి చెవులలోంచి రావడం వల్ల జాహ్నవిగా, అందరినీ పునీతం చేస్తుంది కనుక పరమపావనిగా ఇలా అనేక నామాలతో ఆ తల్లి ప్రత్యేకతను సంతరించుకుంది. జన్మస్థలమైన గంగోత్రిలో పుట్టిన గంగ… సహస్రముఖాలుగా వెళ్లి, సముద్రంలో కలుస్తుంది. మొదట దేవప్రయాగ, కర్ణప్రయాగ ప్రాంతాల్లో ఎన్నో నదులను కలుపుకుంటూ.. అనంతరం ప్రయాగ నుంచి కాశీకి చేరుకుంటుంది. ఉత్తరాన పుట్టి, తూర్పుగా ప్రవహిస్తున్న గంగ.. కాశీలో ఉత్తర వాహినిగా పరమపవిత్రమైంది. సర్వ పాపాలనూ పోగొడుతుంది. ఈ గంగాతీరం 4వేల మైళ్ల దూరం పొడవునా ఉంది. గంగాతీరంలో మనం ఎక్కడైనా స్నానాలూ.. శ్రాద్ధకర్మలూ.. పితృకార్యాలూ.. ఆచరించవచ్చు. వీరి అనుగ్రహంతోనే శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం.

పుష్కర స్నానం…

పుష్కర జలాన్ని సాప్ధారణ జలంగా భావించలేం. ప్రతి చుక్కా పవిత్రమే! అటువంటప్పుడు ఆ నదీ  తీరాల్లో.. బట్టలుతకడం, మలమూత్రాలు విసర్జించడం, ఉమ్మివేయడం, ఇతరత్రా పనులు చేయడం వల్ల ఆ తల్లిని అవమానించడమే అవుతుంది. ఆ తల్లికి ఇలా నివేదించుకోవాలి. ‘నేను, నా కుటుంబ ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం పరమాత్మను ప్రార్థిస్తూ, పుష్కర స్నానం అచరిస్తున్నాను’ అంటూ మంత్రపూర్వకంగా ఆ చల్లని తల్లిని వేడుకోవాలి. ఆ తర్వాత నదీజలాన్ని ప్రోక్షణ చేసుకోవాలి. ఎలాగంటే, నదీగర్భం నుంచి తీసిన కాస్త మట్టి(మృత్తికా లేపనం)తో శరీరాన్ని రుద్దుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఆపై, శుభ్రమైన వస్త్రాలను ధరించి, పురోహితుల సహాయంతో మూడుతరాల పెద్దల్ని తలుచుకుంటూ తర్పణాలు వదలాలి. పరమాత్మకు అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత, సమీపంలోని ఆలయాన్ని సందర్శించాలి. 

ప్రయోజనాలు…

ప్రవహించే నీటిలో స్నానం ఆచరించడంవల్ల ఒంట్లో తెలియని బలం, ఉత్తేజం కలుగుతాయి.

నది ఘనతను, పవిత్రతను పుష్కరాల సందర్భంగా గుర్తుచేసుకోవడంతో.. నది మీద గౌరవం, భక్తి పెరుగుతాయి.

అప్పుడు నదిని కలుషితం చేయడానికి, దుర్వినియోగపరచడానికి వెనుకాడుతాం.. అదే విషయమై ప్రతి పన్నెండేళ్లకీ పుష్కరాల పేరుతో గుర్తెరిగెదె.. పుష్కరం.  

ఈ క్రతువులో భాగంగా పుష్కర నదితోపాటు, సమీప దేవాలయాలను స్మరించుకుంటాం, దర్శించుకుంటాం.

దీనివల్ల మూడున్నరకోట్ల తీర్థాలతో కూడి బ్రహ్మాదులతోపాటు పుష్కరుడు సైతం మన సమీప నదిలో ప్రవేశించి అనుగ్రహిస్తాడట. బృహస్పతి ప్రవేశించిన రాశి అధిపతిగా కలిగిన జీవనది పుష్కరవైభవాన్ని సంతరించుకుంటుంది. 

ఆ ప్రకారం, మేషంలో గంగ, వృషభంలో నర్మద, మిథునంలో సరస్వతి, కర్కాటకంలో యమున, సింహరాశిలో గోదావరి, కన్యారాశిలో కృష్ణానది, తులారాశిలో కావేరి, వృశ్చికలో భీమ, ధనుస్సులో తపతి, మకరరాశిలో తుంగభద్ర, కుంభరాశిలో సింధు, మీనంలో ప్రాణహిత.. ఇలా మొత్తం పన్నెండు నదులకు పుష్కరవైభవం కలుగుతుంది.

*గంగాజలంతోనే తొలిసారి మన నాలుక తడుస్తుంది కాబట్టి ఆ ప్రకారం చూసుకున్న, గంగ తీర్థం పుచ్చుకున్నాకే మన శ్వాస ఆగుతుంది. గంగలో అస్తికలు కలిశాకే.. పైలోకయాత్ర ప్రారంభమవుతుంది. 

రోజుకో దానం…

పుష్కరం అంటే పోషించేది అని అర్థం. నది సమస్త జీవరాశినీ పోషిస్తుంది. మనిషి తోటి ప్రాణులను పోషించాలి. ఇది ప్రకృతి ధర్మం, పుష్కర ధర్మం కూడా. 

పుష్కరాల్లో మొదటి రోజు భూమి, ధాన్యం, బంగారం, వెండి, భోజనం.. స్తోమతను బట్టి ఏదో ఓ దానం చేయాలంటారు. 

రెండో రోజు వస్త్రదానం ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది. మూడో రోజు.. పుష్ప, ఫలదానం..

నాలుగో రోజు.. తేనె, నెయ్యి, నూనె..

ఐదో రోజు.. వ్యవసాయ పనిముట్లు దానంగా ఇవ్వాలన్నది నియమం. 

ఆరో రోజు.. ఔషధ దానం చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దల మాట. 

ఏడో రోజు.. లేనివారికి గృహోపకరణాలు ఇవ్వాలని చెబుతారు. 

ఎనిమిదో రోజు.. దుంపలు, కాయగూరలు దానంగా ఇస్తే పుణ్యలోకాల్లోని పెద్దలకు పొట్ట నిండుతుందట. తొమ్మిదో రోజు.. నిలువ నీడలేనివారికి దుప్పట్లు పంచాలని చెబుతారు. 

పదో రోజు.. పుస్తక దానం ఫలప్రదం. 

పదకొండో రోజు.. తలా పిడికెడు తిలదానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. 

పన్నెండో రోజు యోగ్యులైనవారికి సాలగ్రామాలు దానం చేస్తే.. మంచిదని విశ్వాసం.

నిజానికి, గంగమ్మ తల్లి పన్నెండేళ్లకోసారి జరుపుకొనే పెద్ద పండుగయే.. పుష్కరాలు..  ఏప్రిల్‌ 22న ఆరంభమైన గంగా పుష్కరాలు.. మే 3తో ముగుస్తాయి.

Show More
Back to top button