
చైత్ర శుక్ల అష్టమిని భవాని అష్టమి లేదంటే అశోకాష్టమిగా పిలుస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న వచ్చింది. పార్వతీదేవికి ఉన్న మరో పేరే భవాని.. అమ్మవారిని సేవించుకోవడానికి ఇది చాలా విశిష్టమైన రోజుగా చెప్పవచ్చు. దక్షుని కుమార్తె సతీదేవి పరమేశ్వరుని వివాహమాడిన గాథ, భవానీ దేవిని ఎలా ఆరాధించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. యుక్తవయసులో ఉన్నప్పుడు ఆమె శంకరునిపట్ల మక్కువను పెంచుకుంది. తన ప్రేమ ఫలించి.. మహాశివుడు సతిని మెచ్చి, వరించాడు. తండ్రికి సతీదేవి, పరమేశ్వరుడ్ని పెళ్లి చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అయినా ఆమె లక్ష్యపెట్టకుండా ఇష్టపడిన శివుడ్నే చేసుకుంది. శివుడు ఏమీ లేని బికారి అని, స్మశానంలో తిరుగుతాడని, శరీరంమీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు..
ఇదిలా ఉంటే.. ప్రయాగలో మునీశ్వరులు జరిపిన యాగానికి అనేకమందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. ఆయన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడిన సందర్భంలో మహాశివుడు మౌనముద్రలో ఉండి, దక్షుడ్ని పట్టించుకోలేదు. అది దక్షుడికి తీరని అవమానంగా తోచింది. బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారం ఎందువల్ల అంటూ ఆగ్రహించాడు. కోపావేశంతో విపరీతంగా నిందించాడు. దాంతో నందీశ్వరునికి కోపం ముంచుకొచ్చి దక్షుడ్ని శపించాడు. అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెట్టాడు. అయినప్పటికీ దక్షుడి కోపం తీరలేదు.
శివుడ్ని అవమానించేందుకు ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి అందర్నీ ఆహ్వానించాడు. కానీ కూతురు సతీదేవిని, అల్లుడిని పిలవలేదు. తండ్రి యజ్ఞం తలపెట్టిందే శివుని పరాభవించేందుకు అని సతీదేవికి తెలీదు పాపం.. తమను యజ్ఞానికి పిలవనందుకు ఎంతో బాధపడింది. కానీ పుట్టింటివాళ్ళు ప్రత్యేకించి పిలిచేదేమిటి అనుకుంటూ తనకు తానే సర్దిచెప్పుకుంది.
పరమేశ్వరుడు ‘సతీ, నీ తండ్రి నన్ను కాదు కదా.. కనీసం కూతురివైన నిన్ను కూడా పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు. వెళ్తే నీకు పరాభవం తప్పదు’ అంటూ వారించినా వినకుండా శివుడికే నచ్చజెప్పి వెళ్లింది.
తీరా సతీదేవిని ఎవరూ ఆదరించలేదు. కనీసం పలకరించనైనా లేదు. పైగా మహాశివుడు చెప్పినట్లుగానే ‘పిలవని పేరంటానికి తగుదునంటూ వచ్చావా?’ అంటూ అంతా అపహాస్యం చేయడమే కాక అంతకుమించి శివుడ్ని తూలనాడి, నలుగురి ముందూ ఘోరంగా హేళన చేశాడు. సతీదేవి ఆ అవమానాన్ని అసలు తట్టుకోలేకపోయింది. వెనువెంటనే యజ్ఞగుండంలోకి దూకింది.
సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నట్లు తెలిసిన మహాశివుడు కోపోద్రిక్తుడయ్యాడు. తన జటాజూటం నుంచి ఒక జటను తీసి విసిరి కొట్టాడు. అందులోంచి వీరభద్రుడు, భద్రకాళి ఉద్భవించి.. దక్షుడ్ని సంహరించారు.
అనంతరం సతీదేవి.. మరో జన్మలో హిమవంతుని కూతురిగా పుట్టింది. పర్వతుని కుమార్తె కనుక పార్వతీ అయింది. పార్వతీదేవి తపస్సు చేసి శివుడ్ని ప్రసన్నం చేసుకుని అర్థాంగి అయింది.
ఆ పార్వతీదేవే ఈ భవాని కాబట్టి.. ఆమె జన్మించిన చైత్రమాసంలో శుక్లపక్ష అష్టమినాడు అమ్మవారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రత్యేక దినాన అశోకవృక్షం కింద శివపార్వతుల చిత్రపటం లేదా విగ్రహాలను ఉంచి ఆ చెట్టును, ఆది దంపతులను పూజిస్తారు. ఇలా ఆరాధించటం వల్ల సకల పాపాలూ హరించడమే కాక అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని.. జీవితంలోని దుఃఖాలు తొలగుతాయని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.