CINEMATelugu Cinema

వెండి తెర పై చెరగని నవ్వుల సంతకం.. అల్లు రామ లింగయ్య..

అల్లు రామలింగయ్య (01 అక్టోబర్ 1922 – 31 జూలై 2004)

సినిమాలలో ఏ నటుడైనా, అల్లు రామ లింగయ్య ఏ నటి అయినా వివిధ రకాల పాత్రలు పోషించి తమను తాను నిరూపించుకోవడం ఒక ఎత్తైతే, హాస్యనటులకు మాత్రం సినీ రంగంలో ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. పలుమార్లు ఒకసారి ధరించిన పాత్రనే మళ్ళీ మళ్ళీ ధరించాల్సి వస్తుంది. పిసినారి, ముసలాయన, చాదస్తపు భర్త, చంఢశాసనుడైన మాస్టారు, పెళ్లిళ్ళ పేరయ్య, తాగుబోతు ఇలా ఒకే పాత్రను వివిధ సినిమాలలో పోషించాల్సి వచ్చినా ఆ పాత్రలో వైవిధ్యాన్ని ప్రదర్శించకపోతే కళాకారునికి కష్టం. ఒకే పాత్ర వివిధ సినిమాల్లో వైవిధ్యం చూపించి ప్రేక్షకులను మెప్పించిన తొలితరం హాస్యనటులలో ప్రముఖులు అల్లు రామలింగయ్య గారు. ఆయన తన మొట్టమొదటి సినిమాలో పేరుశాస్త్రిగా నటిస్తే, తర్వాత మాయాబజార్ లో తానశర్మ గా నటించారు.

అలా వరుసగా అనేక సంవత్సరాలపాటు శాస్త్రులుగా, పంతులుగా ఇటువంటి పాత్రలే కొనసాగించక తప్పలేదు. అయినా ప్రతి సినిమాలో తన వైవిధ్య నటనను ప్రదర్శించారు. కాబట్టే తరతరాల నటులతో ఐదు దశాబ్దాల పాటు నటించారు. 1953 వ సంవత్సరంలో అల్లు రామలింగయ్య గారు సినీ రంగ ప్రవేశం చేసేటప్పటికీ సినీ పరిశ్రమలో రేలంగి గారు అప్రకటిత పాత్రధారి. అంజి బాలకృష్ణ, పద్మనాభం, రమణా రెడ్డి గార్లు అప్పుడే పైకొస్తున్న హాస్యనటులు. ఆ దశలో సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య గారు మొదట్లో చిన్న చిన్న పాత్రలకు పరిమితం కాక తప్పలేదు. తెరమీద కనిపించేది కొద్దిసేపైనా ఒక మెరుపులాగా నిలవడంతో తొందరలోనే ఎక్కువ నిడివిగల పాత్రలు సొంతం చేసుకోగలిగారు. సహా నటులందరిలోనూ తనదైన ప్రత్యేకతలు నిలబెట్టుకోగలిగారు.

తాను నటించిన చిత్రాల వేగం కూడా తనలాంటి హాస్య నటుల వేగంతో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు తాను నటించిన తొలి చిత్రం 1953లో విడుదలయితే  ఎనిమిది సంవత్సరాలలో (1953 – 1960) సుమారు 108 చిత్రాలలో నటించారు. ఆ తరువాత పది సంవత్సరాలు (1961 – 70) సుమారు 254 చిత్రాల్లో నటించి అల్లు రామలింగయ్య గారు నవ్వులు పండించారు. 1969, 70, 71, 72వ సంవత్సరాలలో అయితే సంవత్సరానికి 35 నుంచి 40 చిత్రాలతో నటించడం అల్లు రామలింగయ్య గారికే చెల్లింది. అల్లు రామలింగయ్య గారిని తలుచుకోగానే చిలిపి మాటలు గుర్తొస్తాయి. బుద్ధిమంతుడులో అమ్యామ్యా అనే ఊత పదం, ముత్యాలముగ్గు లో కోతి పాత్రలో తాను చేసిన పరకాయ ప్రవేశం, ఇలాంటి పాత్రలు చాలు అల్లు రామలింగయ్య గారి హాస్య సంతకం ఏమిటో తెలుసుకోవడానికి.

రాజబాబు, రమాప్రభ, అల్లు రామలింగయ్య కలయికలో హాస్యం అయితే చెప్పనక్కర్లేదు. కామెడీ విలన్ కలయికలో నాగభూషణం అల్లు రామలింగయ్య, రావు గోపాల రావు అల్లు రామలింగయ్య, సత్యనారాయణ అల్లు రామలింగయ్య జోడీలు విలనిజానికి హాస్యాన్ని జోడించి నవ్వులు పండించేవారు. అల్లు రామలింగయ్య గారు తన సుదీర్ఘ నట జీవితంలో పూర్తిగా హాస్య పాత్రలకే పరిమితం కాలేదు. శంకరాభరణం లాంటి సినిమాను గమనిస్తే ఎంత గొప్ప గుణ చిత్ర నటులో అర్థమవుతుంది. ఇవన్నీ తన నట జీవితంలో హైలెట్స్ అయితే సినిమాల్లోకి రాకముందే తాను రెండు సార్లు రాజకీయ ఖైదీగా జైలుకెళ్ళినటువంటి అనుభవం కూడా ఉంది. పరిశ్రమలోని ప్రతీ కళాకారుడు తన జీవితంలో ఏదో ఒకసారి అల్లు రామలింగయ్య గారి హోమియోపతి వైద్యం తీసుకున్న వాళ్ళే.

తెలుగు చిత్ర పరిశ్రమకు తనదైన పునాది వేసిన అల్లు రామలింగయ్య గారు పరిశ్రమకు ఒక శకాన్ని వదిలి వెళ్లారు. చలనచిత్ర పరిశ్రమకు పటిష్టమైన వ్యవస్థ లాంటి తన వారసుల్ని వదిలి వెళ్లారు. గీత ఆర్ట్స్, GA 2, గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్, అల్లు ఎంటర్టైన్మెంట్స్, అల్లు స్టూడియోస్ ఇలా శాఖలుగా విస్తరించిన, విస్తరిస్తున్న మహావృక్షానికి తొలి విత్తనం నాటింది అల్లు రామలింగయ్య గారు. పాలకొల్లు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, బెంగుళూరు ఇలా ఎన్నో నగరాల్లో శిలా విగ్రహాలు నెలకొల్పబడ్డ హాస్యనటులు అల్లు రామలింగయ్య గారు ఒక్కరే. 01 అక్టోబరు 2021 తేదీ నాడు అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. తన నట జీవితాన్ని ప్రారంభించి 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1000 కి పైగా చిత్రాలలో నటించారు అల్లు రామలింగయ్య గారు. ఇలాంటి కళాకారులకు మరణం ఉండదు. కోట్లాది ప్రేక్షక అభిమానుల హృదయాల్లో వాళ్ళు చిరంజీవులు, నిత్య స్మరణీయులు

@ జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    అల్లు రామలింగయ్య
  • ఇతర పేర్లు  :    సి. పుల్లయ్య
  • జననం    :     01 అక్టోబర్ 1922 
  • స్వస్థలం   :    పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు
  • వృత్తి      :   నటుడు, నిర్మాత
  • తండ్రి    :   వెంకన్న
  • తల్లి     :   సత్తెమ్మ
  • జీవిత భాగస్వామి    :    కనకరత్నం 
  • పిల్లలు   :    అల్లు అరవింద్
  • కొణిదల సురేఖ
  • మరణ కారణం  :  వృద్ధాప్యం 
  • మరణం    :   31 జూలై 2004 హైదరాబాద్, తెలంగాణ

@ జననం…

అల్లు రామలింగయ్య గారు 01 అక్టోబరు 1922 నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు. వీరి తండ్రి వెంకయ్య, తల్లి సత్తెమ్మ. వెంకయ్య గారి నాన్నగారు సుబ్బారాయుడు గారు ఆస్తిపరులు. మితిమీరిన దానధర్మాలు చేయడం వలన తన ఆస్తి మొత్తం కరిగిపోయి వెంకయ్య గారికి ఇరవై ఎకరాలు మాత్రమే మిగిలింది. వెంకన్న, సత్తెమ్మ దంపతులకు ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మగవారిలో నాలుగవ సంతానం రామలింగయ్య గారు. తన తల్లిదండ్రులు పాలకొల్లు లో ఉండే రామలింగేశ్వర స్వామి మీద భక్తితో రామలింగయ్య అనే పేరు పెట్టుకున్నారు. రామలింగయ్య గారి ప్రాథమిక విద్యాభ్యాసం పాలకొల్లు లోనే మొదలైంది.

రామలింగయ్య గారిని రెండు రంగాలు ప్రభావితం చేశాయి. ఒకటి గాంధీ గారి బోధనలు, రెండు నాటక ప్రదర్శనలు. గాంధీ గారు ఉపన్యాసాలు విని ప్రభావితులైన స్థానిక రాజకీయాలు, కార్యక్రమాలు గమనించి చాలా చిన్న వయసులోనే అంటరానితనం ఎందుకు అనే ప్రశ్న రామలింగయ్య గారిలో ఉదయించింది. ఒక్కో రోజు బడి అయిపోగానే దళిత వాడకు వెళ్లి ఆ పిల్లలతో ఆడుకుని వస్తుండేవారు. అలా వెళ్లి వస్తుండగా వాళ్ళమ్మ ఒకసారి తనపై పసుపు నీళ్లు చల్లి లోపలికి రానిచ్చింది. “నువ్వు చేసేది తప్పు కాదు అని నాకు తెలుసు, కానీ లోకం మనల్ని వెలివేస్తారు. కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది” అని వాళ్ళ అమ్మ అల్లు రామలింగయ్య గారితో అన్నది.

@ బాల్యం…

రామలింగయ్య గారు అప్పుడప్పుడు స్కూలుకు వెళుతున్నారు, అప్పుడప్పుడు నాటకాలు చూస్తున్నారు. అల్లు రామలింగయ్య గారి మీద నాటకరంగం విపరీతమైన ప్రభావం చూపింది. ఓ రోజు వాళ్ళ ఊరికి నాటకం వేసేవారు వచ్చారు. ఆ నాటకాల్లో “బృహస్పతి” వేషగాడు లేకపోయేసరికి ఆస్థానంలో తాను నటింపజూశారు రామలింగయ్య గారు. నాటకాల కాంట్రాక్టరు “మహతి హనుమంతరావు” తో మాట్లాడి ఆ బృహస్పతి వేషం తాను ధరించారు. చదువును పక్కన పెట్టిన అల్లు రామలింగయ్య గారు గాంధీ గారి ప్రసంగాలకు విపరీతంగా ముగ్దులయ్యారు.

రాజకీయ నాయకులతో తిరగడం, ప్రసంగాలను మిత్రులకు వివరించడం, మిత్రులతో కలిసి ఖద్దరు బట్టలు ధరించడం చేసేవారు. తన మిత్రులకు, తల్లిదండ్రులకు ఇది నచ్చేది కాదు. తను మితిమీరిన రాజకీయ కార్యక్రమాలను భరించలేని వారు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాంతో కుర్రాడి మీద, కార్యకర్తల మీద ఓ కన్నేసి ఉంచిన పోలీసులు 1942లో రామలింగయ్య గారిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. అప్పటికి తన వయసు 20 సంవత్సరాలు. రాజకీయ ఖైదీగా ముద్ర వేయించుకున్న రామలింగయ్య గారు జైల్లో ఉన్నప్పుడు తన తోటి ఖైదీలతో కలిసి నాటకాలు వేసేవారు. వీటన్నిటి మధ్య చదువు ఆగిపోయింది.

@ నాటకాలు…

అల్లు రామలింగయ్య గారికి చదువులేదు కనుక ఉద్యోగం లేదు. పొలానికి వెళ్లాలంటే ఆసక్తి చిన్నప్పటినుంచి లేదు. వకీలు మరియు హోమియోపతి వైద్యం చేసే “నోరి నారాయణమూర్తి” గారిని నరసాపురంలో కలుసుకున్నారు. వారి వద్ద కొన్ని నెలలు హోమియోపతి వైద్యం నేర్చుకున్నారు రామలింగయ్య గారు. గ్రంథాలయంలో కొన్ని హోమియోపతి వైద్యం పుస్తకాలు చదివిన రామలింగయ్య గారు డాక్టర్ పొగరు వెంకట్రామయ్య గారి దగ్గర కొన్ని నెలలు సహాయకుడిగా కూడా పనిచేశారు.

ఇంత అనుభవం వచ్చాక పెళ్లైన సంవత్సరానికి 1945లో పాలకొల్లులో హోమియో డాక్టర్ గా ప్రాక్టీసు పెట్టారు. జనాలు హోమియో మందులు కొనడానికి నరసాపురం వెళ్లాల్సి వచ్చేది. దాంతో పాలకొల్లు లోనే స్టోర్ ఉంటే బావుంటుందని హోమియో మందుల దుకాణంను స్థాపించి దానికి అరవింద్ స్టోర్స్ అని పేరు పెట్టారు. ఒకవైపు వైద్యం చేస్తూనే మరోవైపు నాటకాలు పాల్గొంటూ ఉండేవారు రామలింగయ్య గారు. గరికపాటి రాజారావు గారు స్థాపించిన ప్రజానాట్యమండలి నాటక సంస్థలో చేరిన తాను స్టంట్ శాస్త్రి, విదేశీయానం లాంటి ఏకపాత్రాభినయంతో పాటు పశ్చాత్తాపం, బ్రతుకుభారమాయే లాంటి పాత్రలు ధరిస్తుండేవారు.

1946 – 47 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం కార్యక్రమాలు చేస్తుండగా అల్లు రామలింగయ్య గారిని, గరికపాటి రాజారావు గారితో పాటు అరెస్టు చేశారు. ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. జైలు నుండి విడుదల కాగానే ఎప్పటిలాగానే హోమియోపతి వైద్యం చేస్తూ, ప్రజానాట్యమండలిలో నాటకాలు వేస్తూ ఉండేవారు. తనకు నాటకల్లో పేరు తెచ్చిన పెట్టిన నాటకం పరకాల శేషావతారం గారు వ్రాసిన “కూడు గుడ్డ” అనే నాటకం. ఆ నాటకంలో అల్లు రామలింగయ్య గారు వేసిన ఆచార్యులు పాత్ర ఎంతగానో ప్రసిద్ధి పొందింది.

ఆ నాటకంలోని రామలింగయ్య గారి పాత్రను రికార్డ్ చేసి విజయవాడ ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. ఒకసారి తెనాలిలో ప్రజానాట్యమండలి నాటక పోటీలలో ప్రదర్శించినప్పుడు డాక్టరు గరికపాటి రాజారావు గారు అల్లు రామలింగయ్య గారిని రంగస్థలం మీద చూశారు. అంతకుముందు పశ్చాతాపం నాటకంలో ఆచార్యుల పాత్ర కూడా రామలింగయ్య గారే దరించేవారని తెలుసుకున్న రాజారావు గారు నాటకం అయిపోగానే అల్లు రామలింగయ్య గారిని పరిచయం చేసుకుని తాను తొందరలోనే సినిమా నిర్మాణం ప్రారంభించబోతున్నాను. అందులో కూడా ఆచార్యుల పాత్ర నీతోనే వేయిస్తానని చెప్పారు

@ వివాహం…

రామలింగయ్య గారు జైలు నుంచి రాగానే తనకు పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మానాన్నలు నిర్ణయించుకున్నారు. అమ్మానాన్నలు పాలకొల్లుకు చెందిన ముత్తిరెడ్డి, పాపమ్మల కుమార్తె కనకరత్నం తో సంబంధం కుదిర్చారు. పెళ్లికూతురుకి రాట్నం ఒడికే పోటీల్లో మొదటి బహుమతి వచ్చిందని తెలుసుకొని వెంటనే పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నారు. 22 సంవత్సరాలు వయసున్న అల్లు రామలింగయ్య గారికి 1944లో కనకరత్నం తో పాలకొల్లు లో వివాహం జరిగింది. 1947లో అల్లు రామలింగయ్య దంపతులకు మొదటి సంతానం గా కూతురు జన్మించింది. తనకు నవ భారతి అనే పేరు పెట్టుకున్నారు. 1949లో రెండవ సంతానం గా అబ్బాయి జన్మించాడు. తనకు అరవింద్ బాబు అని పేరు పెట్టారు.

1953లో మూడో సంతానం పాప జన్మించింది. తన పేరు వసంత లక్ష్మి. తాను జన్మించాక 1953 లోనే తన కుటుంబాన్ని మద్రాసుకు తీసుకొచ్చారు అల్లు రామలింగయ్య గారు. అప్పటికి పెద్ద పాప వయస్సు 6 సంవత్సరాలు, పెద్దబ్బాయి వయస్సు నాలుగు సంవత్సరాలు, చిన్న పాప వయస్సు నాలుగు నెలల వయస్సు. 1955 లో నాలుగో సంతానంగా అమ్మాయి సురేఖ, 1959లో ఐదవ సంతానంగా రెండో అబ్బాయి వెంకటేశ్వరరావు జన్మించారు. తన పెద్ద కూతురు “నవ భారతి” 1956 లో ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వం విడుదలైన “ఇలవేల్పు” లో 8 ఏళ్ల బేబీ భారతి పాత్రలో నటించారు. నటి అంజలీదేవి గారు ఆ పాపని ఎత్తుకున్న స్టిల్ ఒకటి ఇలవేల్పులో ఉన్నది.

@ సినీ రంగ ప్రవేశం…

ప్రజానాట్యమండలి నాటక సంస్థ మూతపడడంతో అందులో నటించే కళాకారులు అందరూ మద్రాసు చేరుకున్నారు. ప్రజానాట్యమండలి అధ్యక్షులైన గరికపాటి రాజారావు గారు అందులో ఉన్న కళాకారులలో చాలా మందిని తన సినిమా “పుట్టిల్లు” లో తీసుకున్నారు. చిత్రం షూటింగ్ మాత్రం 1952లో ప్రారంభమైంది. బుర్రకథ కళాకారుడు నాజర్, మిక్కిలినేని, చదలవాడ, అల్లు రామ లింగయ్య లాంటి వారిని తీసుకున్నారు. అందులో కథానాయిక జమున గారు, అల్లు రామలింగయ్య గారు పెళ్లిళ్ల పేరయ్య పాత్ర. డాక్టరు గరికపాటి రాజారావు గారు తన మొదటి చిత్రం “పుట్టిల్లు” అనే సినిమాను 1953 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ సినిమా పరాజయం పాలైంది.

@ 1953 నుండి 1960 వరకు…

పుట్టిల్లు సినిమా చిత్రీకరణ జరిగేటప్పుడు అల్లు రామ లింగయ్య గారు ప్రొడక్షన్ ఆఫీసులో ఉంటూ అక్కడే భోజనం చేసేవారు. పుట్టిల్లు సినిమా చిత్రీకరణ సమయంలోనే అల్లు రామలింగయ్య గారికి ఎన్టీఆర్ గారు తీస్తున్న “పిచ్చి పుల్లయ్య” లో వేషం వచ్చింది. 1953లో “వయ్యారి భామ”, “పిచ్చి పుల్లయ్య”, “నా చెల్లెలు”, “గుమస్తా”, “బ్రతుకు తెరువు” లో వేషాలు సంపాదించుకున్నారు. రామలింగయ్య గారికి సమయపాలన, అందరితో కలివిడిగా ఉండటం లాంటి అంశాలు తనకు సినిమాలలో ఎక్కువగా అవకాశాలు వచ్చేలా చేశాయి. “తోడుదొంగలు”, “జయసింహా” లలో అవకాశాలు దక్కించుకున్నారు.

1954 లో హెచ్ ఎం రెడ్డి గారి “వద్దంటే డబ్బు” చిత్రంలో పాత్ర ధరించారు. 1955 లో అన్నపూర్ణ వారు నిర్మించిన “దొంగ రాముడు” చిత్రంలో హాస్టల్ వార్డెన్ పాత్ర ధరించారు. ఈ సినిమాలోని రామలింగయ్య గారు “అమ్యామ్యా” అనే పదాన్ని ఉపయోగించారు. 1955 లో విడుదలైన “మాయాబజార్” లో తానాశర్మగా “కంబళి”, “గింబలి”, “తల్పం”, “గిల్పం” ఇలాంటి పింగళి గారి చిత్రమైన పదకోశానికి ప్రాణం పోశారు అల్లు రామలింగయ్య గారు.  మాయాబజార్ లో అలాంటి పాత్ర రావడం, అది విజయవంతం అవ్వడం, అన్ని చిత్రాలలో అలాంటి పాత్రలు రావడం ఇలా 1960 చివరికి తాను 120 చిత్రాలు పూర్తి చేసుకున్నారు.

@ 1961 నుండి 1970 వరకు…

ఈ మధ్యకాలంలో అల్లు రామలింగయ్య గారు నటించిన చిత్రాల సంఖ్య 224. రామలింగయ్య గారు నటించిన సినిమాలు నెలకు రెండు విడుదలయ్యేవి. దీనిని బట్టి చెప్పవచ్చు తాను హాస్యనటుడుగా ఎంత తీరిక లేని కళాకారులో. 1963 లో కే.వీ.రెడ్డి గారి “శ్రీ కృష్ణార్జున యుద్ధం” రామలింగయ్య గారి నటనా జీవితంలో ఒక మలుపు. అప్పటి వరకు ఆమ్యామ్యా లాంటి ఊత పదాలతో నవ్వించిన రామలింగయ్య గారు, తనపై “శ్రీ కృష్ణార్జున యుద్ధం” తో ఒక పాట చిత్రీకరించే స్థాయికి ఎదిగిపోయారు. అర్జునుడి శిష్యుడు చిన్న ముని పాత్రలో అల్లు రామ లింగయ్య గారు, సుభద్ర చెలికత్తె “సురభి బాల సరస్వతి” తో పాడిన “అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టము భామిని” అనే పాట ఆరోజుల్లో పెద్ద సంచలనం.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రనటులు నటించిన ఆ సినిమాలో ఒక హాస్యనటుడు మీద అందులోను మొట్టమొదటిసారిగా ఒక డ్యూయెట్ చిత్రీకరించడం చాలా సాహసంతో కూడిన విజయం. ఆ తర్వాత ఆయన 40, 50 చిత్రాలు నటిస్తే వాటిల్లో తన మీద 15 పాటలు చిత్రీకరించేవారు. 1966లో “ఆత్మగౌరవం” సినిమాలో విశ్వనాథ్ గారు అప్పలచారి పాత్రను రామలింగయ్య గారి కోసం ప్రత్యేకించి వ్రాయించారు. అదే సంవత్సరం అల్లు రామలింగయ్య గారికి పరమానంద శిష్యుల కథలో “పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా” అనే పాట తనను ప్రత్యేకంగా నిలబెట్టింది.

@ సైకిలు నుండి కారు వరకు…

మూగమనసులు (1963) సినిమా వరకు అల్లు రామ లింగయ్య గారు సైకిలు పైనే చిత్రీకరణ కు వచ్చేవారు. మూగమనసులు సమయంలో దర్శకులు ఆదుర్తి గారు కారు కొనుక్కోమని సలహా ఇచ్చారు. దాంతో 1965లో సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. 1969 – 70 వచ్చేసరికి రామలింగయ్య గారు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. పిల్లలు హైస్కూలుకు వచ్చారు. వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కేసరి స్కూల్లో చేర్పించారు. తమిళ యాసలేని తెలుగును వాళ్ళకి నేర్పించారు రామలింగయ్య గారు. దస్తూరి మంచిగా రాయడానికి పుస్తకాలు తెప్పించేవారు. 1970 ప్రాంతంలో తాను హోమియోపతి పరీక్షలు రాసి పాసయ్యారు. అల్లు రామలింగయ్య గారి చిన్నబ్బాయి వెంకటేశ్వర్లు కూడా బాపు గారు తీసిన సాక్షి సినిమాలో వెండితెరపై కనిపించారు. సినిమా విడుదలైన ఎనిమిది సంవత్సరాల తర్వాత వెంకటేశ్వరరావు మరణించారు.

@ 1970 నుండి 1980 వరకు..

ఈ దశబ్దంలో ఆయన 388 సినిమాల్లో నటించారు. తన చిత్రాల వేగం ప్రతి పది చిత్రాలకు ఒకసారి పెరుగుతూ వచ్చింది. కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు మొదలగు అందరు దర్శకుల సినిమాలో నటించేవారు. పాలకొల్లుకే చెందిన దాసరి నారాయణరావు గారి తొలి చిత్రం “తాత మనవడు” లో కూడా చెవిటి వాడి పాత్రలో కనిపిస్తారు. దర్శకుడు, నిర్మాత అంటూ కాకుండా ప్రతి రెండు సినిమాల్లో ఒక దానిలో నటిస్తూ సినిమాలను ఒక స్థాయికి తీసుకెళ్తుండేవారు. “చెల్లెలికాపురం”, “బడిపంతులు”, “ఇల్లు ఇల్లాలు”, “శారద”, “రాధమ్మ పెళ్లి”, “బలిపీఠం”, “ముత్యాలముగ్గు”, “జమిందారు గారి అమ్మాయి”, “యమగోల”, “మన ఊరి పాండవులు”, “డ్రైవర్ రాముడు”, “వేటగాడు”, “శంకరాభరణం” ఇలా ప్రతీ సినిమాలో అల్లు రామలింగయ్య గారి పాత్ర ఒక మెరుపే. 1980 చివరికి తాను నటించిన సినిమాల సంఖ్య 719 కి చేరింది.

1971 – 80  లో తన జీవితంలో కీలకమైన సంఘటనలు జరిగాయి. అందులో సంతోషకరమైన సంఘటనలు ఉన్నాయి, బాధాకరమైన ఘట్టాలు ఉన్నాయి. అల్లు అరవింద్ గారు విద్యార్థి గా ఉన్నప్పుడే ఇన్కమ్ టాక్స్ వివరాలు అన్నీ నేర్పించారు. అరవింద్ గారు బిఎస్సి పూర్తి చేశాక “లా” చదివారు. 1972లో ఎరువుల పంపిణీ వ్యాపారంలో మల్లాపురాజు గారు భాగస్వామి గా చేరారు. సంవత్సరం పాటు పాలకొల్లు లో ఉండి వ్యాపారం చేసిన అరవింద్ గారు ముప్పై రెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ముప్పై ఏడు వేల రూపాయలు లాభం తీసుకురాగలిగారు. 1972లో ధూళిపాల గారు ఖాళీ చేసిన ఇంట్లో కిరాయికి ఉన్న రామలింగయ్య గారు 1972 లో 75 వేల రూపాయలకు కొనుగోలు చేశారు.

@ గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపన…

06 డిసెంబరు 1972 వ తేదీన అల్లు రామ లింగయ్య గారి తల్లి సత్తెమ్మ గారు మరణించారు. 1973 లో పాలకొల్లు మిత్రులు వేగి వీర్రాజు, దాసరి సత్యనారాయణమూర్తి, మెర్ల నారాయణమూర్తి, ఎం.వి.ఎస్.బాబురావు గార్లు సినిమా నిర్మాణం కోసం రామలింగయ్య గారి కలుసుకున్నారు. తన కొడుకు అల్లు అరవింద్ తో కలిపి గీత బ్యానర్ పై అల్లు అరవింద్ గారు భాగస్వామి నిర్మాతగా దాసరి నారాయణ గారు దర్శకత్వం లో నిర్మించిన తొలి చిత్రం “బంట్రోతు భార్య”. 1973లో చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం 1974 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. అక్కడి నుండి “బంగారు పతకం”, “దేవుడే దిగివస్తే”, “ఎత్తుకు పై ఎత్తు”, “మా ఊళ్లో మహా శివుడు” ఇలా విజయపరంపర కొనసాగింది.

కొన్నాళ్ళకు భాగస్వామ్యం నుంచి బయటికి వచ్చిన అరవింద్ గారు “గీతార్స్ బ్యానర్” కొనసాగించి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన చిత్రాల నిర్మాణాన్ని కొనసాగించారు. 06 ఏప్రిల్ 1974 నాడు అరవింద్ గారికి నిర్మల తోనూ, 06 ఏప్రిల్ 1974 నాడు రామలింగయ్య గారి కూతురు వసంత లక్ష్మి కి, డాక్టరు వెంకటేశ్వరరావు తో వివాహాలు జరిగాయి. రామలింగయ్య గారి కుమారుడు వెంకటేశ్వరరావు 1975 ఫిబ్రవరి లో రైలులో మిత్రులకు వీడ్కోలు చెబుతూ తల బయటకు పెట్టారు. అనుకోకుండా రైలు కదిరింది. వెంకటేశ్వరరావు తల ఎలక్ట్రికల్ స్తంభానికి తగిలి మరణించారు.

మన ఊరు పాండవులు సినిమా షూటింగ్ సమయంలో రామలింగయ్య గారికి చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. 1979లో చిన్నమ్మాయి సురేఖ కి సంబంధం వెతకడం ప్రారంభించారు. ఓ రోజు అల్లు రామలింగయ్య గారి ఇంట్లో పై వాటిలో అద్దెకు ఉంటున్న మిత్రులు సత్యనారాయణ గారిని చూడడానికి చిరంజీవి గారు వచ్చారు. ఆ కుర్రాడిని చూసిన రామలింగయ్య గారి కనక రత్నం “కుర్రాడు బాగున్నాడు మన అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం” అని అన్నారు. దాంతో 20 ఫిబ్రవరి 1980 నాడు సురేఖ ను చిరంజీవి గారికి ఇచ్చి వివాహం జరిపించారు.

@ 1981 నుండి చివరి రోజుల వరకు..

1985లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురై అల్లు అరవింద్ గారి కుమారుడు రాజేష్ గారు మరణించారు. అల్లు రామలింగయ్య తో సహా మిగతా వారికి గాయాలయ్యాయి. 1995 లో “భలే బుల్లోడు” తో అల్లు రామలింగయ్య గారు నటించిన సినిమాల సంఖ్య 1000 కి చేరింది. 1990 లో రామలింగయ్య గారు కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం పొందారు, అలాగే 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి “రఘుపతి వెంకయ్య నాయుడు” పురస్కారం దక్కించుకున్నారు. తాను నటించిన చివరి సినిమా తేజ గారి దర్శకత్వం లో వచ్చిన “జై” సినిమా.

@ దీర్ఘ నిద్ర…

అల్లు రామ లింగయ్య గారు జులై 2004 లో బాత్ రూములో కాలు జారి పడ్డారు. తలకు దెబ్బ తగిలింది. ఆసుపత్రి లో CT స్కాన్ చేసి స్కల్ కి దెబ్బ తగిలి లోపల రక్త స్రావం జరుగుతుంది అని డాక్టర్లు చెప్పారు. వైద్యులు చికిత్స చేశారు, కోలుకున్నారు అనుకునే లోపే వారం రోజులలో పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రి లోనే వుంచారు. చికిత్స లో భాగంగా శరీరానికి వివిధ ట్యూబ్ లు, మంచం చుట్టూ వైద్య పరికరాలు. రామలింగయ్య గారు అరవింద్ గారిని పిలిచి “నా పనైపోయింది, నేను వెళ్ళిపోతున్నాను” అని సంజ్ఞలు చేశారు.

ఆ తరువాత కొద్ది రోజులకే కోమాలోకి వెళ్ళిపోయారు. 31 జులై 2004 సాయంకాలనికి వైద్యులు పెదవి విరిచారు. “మరి కొద్ది గంటల్లో కీలకమైన అవయవాలు పని చేయడం మానేస్తాయి. ఏ క్షణాన్నైనా అయన ఇక లేరు అనే వార్త మీకు చెప్పాల్సి వస్తుంది” అన్నారు. రాత్రి పదకొండు గంటలకి యంత్రాలన్నీ ఆగిపోయాయి. తండ్రి దేహాన్ని చేతిలో ఉంచుకున్నారు అరవింద్ గారు. ఒక కొడుకు చేతిలో ఆనందంగా దీర్ఘ నిద్ర లోకి జారుకున్న ఒక కన్న తండ్రి. ఒక ప్రయాణం ముగిసింది.

సుదీర్ఘంగా సాగుతున్న చరిత్రలో ఒక అధ్యాయం వ్రాసుకున్నారు. ఆ చరిత్ర చిరకాలం కొనసాగే శకానికి బలీయమైన పునాది వేసి నిష్క్రమించారు అల్లు రామలింగయ్య గారు. తన జీవితన్ని మొదటి నుండి నిశితంగా గమనిస్తే, విశ్లేషిస్తే ఎన్నో వ్యక్తిత్వ వికాస పాఠాలు దొరుకుతాయి. చాలా మంది కష్టాలు పడుతారు, పడి లేస్తారు, విజయాలు సాధిస్తారు. కష్టాలు పడడం, విజయం సాధించడం, ఆ విజయాలను తరువాత తరాలకు అందించడం, వాటిని అంది పుచ్చుకుని తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా తీర్చి దిద్దడం, దానికి తగినట్టుగానే ఆ జ్యోతిని అరవింద్ గారు ముందుకు తీసుకెళ్లడం.

Show More
Back to top button