CINEMATelugu CinemaTelugu Special Stories

చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి కెమెరా ముందు తొలి అనుభవం.

”బ్రతుకు పూల బాటకాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు” అని తన జీవితాన్ని ఉదాహరించి చెప్పారు మహానటి సావిత్రి. తెలుగు సినిమాకి దక్కిన ఆణిముత్యం సావిత్రి. నటిగా ఆమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు, నటిగా ఎన్నో సంచలనాలను సృష్టించారు. కథనాయకుల హవా నడిచే ఆ రోజులలోనే, కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించారు. ఒకరకంగా 1950, 60, 70 సంవత్సరాలలో అత్యధిక పారితోషికం తీసుకుని, ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు.

అప్రహితంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం ఆమె జీవితగమనాన్నే మార్చేసింది. తమిళ సినీపరిశ్రమలో అప్పటికే రెండు పెళ్ళిళైన జెమినీ గణేషన్‌ను వివాహమాడారు. కొంతమంది వద్దని ఆమెను వారించినా ఆమె వినలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఆర్థికపరమైన విషయాలు జెమినీ గణేశన్ చేతిలోకి వెళ్ళాయి. తెలుగులో అఖండ విజయం సాధించిన “మూగమనసులు” సినిమాను జెమినీ గణేషన్‌ను పెట్టి తమిళంలో పునర్నిర్మించగా అది ఆశించనంతంగా విజయవంతం అవ్వలేదు. దాంతో అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. జెమినీ గణేషన్ కూడా దూరం అవ్వడంతో తట్టుకోలేక మత్తుకి అలవాటు పడ్డారు. అప్పట్లోనే లక్షలు చూసిన నటి, కథనాయకుల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఆమె చివరి క్షణాలలో ఒక అనాధలా తనువు చాలించారు.

పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లారు. ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన కొత్తలో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన “సంసారం” సినిమాలో చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కానీ ఆ పాత్రకు తగ్గ వయస్సు లేదని ఆమెను తిరస్కరించారు. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన “పాతాళ భైరవి” లో ఒక చిన్న పాత్రలో ఆమె నటించారు. చివరికి “పెళ్ళిచేసిచూడు” ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.

అయితే ఆమె తన మొదటి సినిమాలో ఒక పాత్ర కోసం సంభాషణలు చెప్పే అవకాశం కలిగినప్పుడు ఆమె సంభాషణలు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు. అది చూసి కథానాయకులు విస్మయం చెందేవారు. అదే సమయంలో తమిళ నటులైన జెమినీ గణేశన్, నటి సావిత్రి ఫోటోలను తీసుకొని రెండు నెలల తర్వాత రమ్మని చెప్పి పంపించారు. చేసేదేమి లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించారు. ఒకరోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకుని వచ్చాడు. అలా అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది. అయితే ఆమె తొలిసారి కెమెరా ముందు నిలబడ్డప్పుడు ఆమెకు జరిగిన అనుభవాల గురించి క్రింది విధంగా చెప్పుకొచ్చారు..

పదమూడేళ్ళకే తొలి అవకాశం…

సావిత్రి తన 13 సంవత్సరాల వయస్సులో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి హిందీ నటులు, దర్శకులు, హిందీ సినిమా రంగంలో ప్రసిద్ధులైన పృధ్వీరాజ్‌కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. అదే ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె బెజవాడ లోని కస్తూరిబాయి పాఠశాలలో చదువుకున్నారు. సారథి ఫిలింస్ పతాకంపై కోవెలమూడి భాస్కరరావు నిర్మిస్తున్న అగ్నిపరీక్ష (సినిమా) లో కళ్యాణం రఘురామయ్య, లక్ష్మిరాజ్యం, మాలతి,చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటిస్తున్నారు. పి.మాణిక్యం తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఒక వేశ్య పాత్రలో నటింపజేయడానికి సావిత్రిని మద్రాసు తీసుకురావలసిందిగా 1948 లో ఆమె నాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్యకు కబురు వచ్చింది. 

అప్పటివరకు వెర్రిగా సినిమాలను చూసే ఆమెకు, సినిమాలో వేషం వేసే అవకాశం వచ్చిందని తెలియగానే ఆమె ముందుగా నమ్మలేదు. అందరూ ఆమెను వేళాకోళం చేస్తున్నారని అనుమానించారు. కానీ ఒకవైపు ఆమెకు మనసులో మాత్రం సంతోషం వేసింది. అందుకు కారణం లేకపోలేదు. సినిమాలో చేరితే మద్రాసు పట్టణంలో ఉండొచ్చు, విద్యుత్తు రైళ్ళలో తిరగొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె అభిమాన నటీనటులను నేరుగా, ప్రత్యక్షంగా చూడొచ్చు అంటూ ఆమె మురిసిపోయారు. ఆమె కన్న కలలు, ఆమె ఉహించిన ఊహలు కొన్నైనా నిజం అవుతాయని అప్పటికి అస్సలు అనుకోలేదు కూడా. రెండు రోజుల ప్రయాణం అని నాన్న చెప్పడంతో, సావిత్రి ఆనందానికి అవధుల్లేవు. పాఠశాలలో తన స్నేహితురాళ్ళందరికీ చెప్పేసి, ఆమె మద్రాసు వెళుతున్నానని ప్రచారం చేసుకోవడంతో వారంతా ఆమెకు భారీ ఎత్తున వీడ్కోలు ఇచ్చారు. మళ్ళీ అగుపిస్తానో, లేనో అని వారందరూ ఆమెకు అప్పగింతలు చేశారు. వాళ్లందరితో ఆమె మళ్ళీ తప్పకుండా బెజవాడ వచ్చి పరీక్ష వ్రాసి పెడతానని చెప్పి, ఆవిడ నాన్నతో కలిసి చెన్న పట్నం చేరిపోయింది.

రెండు గంటలు కెమెరా టెస్టులు…

సావిత్రి చిన్నపిల్ల కనుక లంగా, జాకెట్లు ధరించేది. అందులో చూడడానికి ఆమె మరీ చిన్నపిల్లలా కనిపిస్తుందంటూ, ఆమెకు చీర కట్టి పెట్టవలసిందిగా కొంతమంది ఆమె తండ్రి కొమ్మారెడ్డి వెంకట్రామయ్యకు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం మద్రాసు పట్టణానికి సావిత్రి తన అమ్మ చీరలు, అక్క చీరలు తెచ్చుకున్నారు. వాటిలోంచి పసుపు రంగు, ఎర్ర చుక్కలు మామిడి పిందెలు అంచు ఉన్న చీర ఒకటి నానా కష్టాలు పడి ఆమె ఒంటిని చుట్టుకున్నారు. ఆ చీర కట్టులోనే స్టూడియోకు వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆమెకు మేకప్ వేశారు. మేకప్ రంగంలో నిష్ణాతులైన కీర్తిశేషులు మంగయ్య మేకప్ వేశారు. మేకప్ అంతా అయిపోయిన తరువాత “నీ వయసెంతమ్మా? అని సావిత్రిని అడిగారు. నిజానికి ఇంట్లో వాళ్ళు ఆమెను వయస్సు గురించి అడిగితే “నా వయస్సు పదహారేళ్ళు” అని చెప్పమన్నారు. కానీ సావిత్రి తన వయస్సు 13 ఏళ్లే అని చెప్పేశారు. కానీ ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. ఏం ప్రయోజనం కానీ ఇక్కడి కొత్త వాతావరణం, వింతగా అనిపించిన ఆవిడ ఆ విషయాన్నే మర్చిపోయారు. ఆమెను మేకప్ చేసి, స్టిల్ కెమెరా ముందు కూర్చోబెట్టారు. ఎవ్వరైనా వయస్సు అడిగితే 16 అని చెప్పాలన్నారు. ఆమె తన మనసులోనే 16 ఏళ్ళు, 16 ఏళ్ళు అనుఅంటూ కూర్చున్నారు. 

ఛాయాగ్రాహకులు బోళ్ళ సుబ్బారావు, స్టిల్స్ సత్యం కలిసి లైట్లు సిద్ధం చేసి ఏది కాస్త నవ్వమ్మా అన్నారు, ఆమె నవ్వారు. ఇంకా ఇంకా అన్నారు వాళ్ళు. నోట్లో పళ్ళన్నీ బయటపడేలా నవ్వేశారు సావిత్రి. వెరీ గుడ్ వన్స్ మోర్ అన్నారు వాళ్ళు. ఈసారి ఇంకాస్త బీభత్సంగా నవ్వారామె. మరీ అంతలా అక్కర్లేదమ్మా అన్నారు వాళ్ళు. దాంతో ఆమె మూతి ముడిచేశారు. ఏది మళ్లీ నవ్వు అన్నారు. ఆమె మళ్లీ నవ్వారు. ఏది కొంచెం కోపంగా చూడమ్మా అన్నారు వాళ్ళు. ఆమె కోపంగా చూశారు. అలా కెమెరా ముందు స్టిల్స్ కార్యక్రమం రెండు గంటల పాటు సాగింది. ఏది కొంచెం ఏడుపు మొహం పెట్టు అన్నారు. అప్పటికీ ఆమె పరిస్థితి అదే. ఏడుపు మొహం పెట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. థాంక్యూ ఇక చాలు అన్నారు వాళ్ళు. దాంతో సావిత్రికి ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. ఆ రాత్రి 7:30 నిముషాలకు నాన్నతో కలిసి హోటల్ దగ్గరికి వెళ్లారు సావిత్రి. చొరవ తీసుకుని “మేకప్ చూసి ఏమన్నారు” అని ఆమె తన తండ్రిని మెల్లిగా అడిగారు. రేపు మూవీ టెస్ట్ లు కూడా చేశాక చెబుతారట అని ఆయన చెప్పారు.

వాహినీ లో అక్కినేనిని తొలిసారి చూసిన సావిత్రి…

మరుసటి రోజు మూవీ టెస్ట్ కి తయారయ్యారు సావిత్రి. కెమెరా స్విచ్ ఆన్ చేసి ఆమెను డాన్స్ చేయమన్నారు. ఆ తరువాత క్లోజ్ షాట్ అన్నారు. ఆ రోజుల్లో అది క్లోజో, లాంగో ఆమెకు ఏమి తెలుసు? లైట్లు, కెమెరా రేంజ్ వంటివి ఏవీ పట్టించుకోకుండా ఆమెకు తోచిన పద్ధతిలో నృత్యం చేశారు. ఆ తరువాత తండ్రితో కలిసి హోటల్ కు వచ్చేశారు సావిత్రి. ఆ మరునాడు కంపెనీ వాళ్ళు “మీరు బెజవాడ వెళ్ళిపోవచ్చు” సినిమా మొదలు పెట్టాక కబురు చేస్తామని చెప్పారు. ఆరోజు సాయంత్రం మెయిల్ కు ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు నాన్న. ఆమెకు మాత్రం ట్రాము ఎక్కాలని ఉండేది, ఎలక్ట్రికల్ ట్రైన్ లో తిరగాలని ఉండేది. సినిమా తారాలను కూడా చూడాలనే అభిలాష కూడా ఆమెకు ఉండేది. ఇవన్నీ తీరకుండానే వెళ్లిపోతున్నామనే భావన తనలో మొదలైంది.

నాన్నని అడగాలంటే భయం, కానీ అడగకుండా ఉండలేదు. గుండెల్లో నుండి ఆమెకు దుఃఖం ఎగదన్నుకు వస్తుంది. చివరికి ధైర్యం చేసి అడిగేసింది. నాన్న కూడా అందుకు సందేహించలేదు, సరే అన్నారు. ఇక్కడే నాలుగు రోజులుండి అన్నీ చూసి వెళదాం అన్నారు. వెంటనే ఆయన ఒక టాక్సీని పిలిపించారు. అప్పుడు కారులో వద్దు నాన్న ట్రాములో వెడదామన్నారు సావిత్రి. అలా ట్రాములో బీచ్ కి వెళ్ళారు. లైట్ హౌస్ చూసారు. ఆ మరునాడు విద్యుత్తు రైలు (ఎలక్ట్రికల్ ట్రైన్) లో వాహినీ స్టూడియోకు వెళ్ళారు. స్టూడియోలోకి వెళ్ళీ వెళ్ళగానే వారికి అక్కినేని నాగేశ్వరావు కనిపించారు.

అక్కినేని నాగేశ్వరావుకు సావిత్రిని పరిచయం చేశారు నాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య. నమస్తే అన్నారు సావిత్రి. ఆ సమయంలో ఆయన కూడా ప్రతి నమస్కారంగా నమస్తే అని ఆయన తిరిగి సావిత్రి వాళ్ళ నాన్నతో మాట్లాడటం ఆరంభించారు. వాళ్ళిద్దరూ పది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో సావిత్రి వైపు ఒక్కసారి కూడా చూడలేదు అక్కినేని. ఒక్కసారి కూడా నా వంక చూడలేదు, నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేమీ ఈ హీరో గారు అనుకున్నారామె. ఇంతలో అయనను దర్శకుడి నుండి పిలుపు వచ్చింది. వస్తాను చౌదరి గారు అంటూ కొమ్మారెడ్డి వెంకట్రామయ్యకు చెప్పి అక్కడనుండి అక్కినేని తుర్రుమన్నారు. అంతే ఆయన తప్ప ఆరోజు అక్కడ ఒక్క తార కూడా సావిత్రికి కనిపించలేదు.

చలాకీ పిల్ల, చిలిపి కళ్ళు, కథానాయికకు సరిపోతుంది…

ఆ తరువాత రోజు జెమినీ స్టూడియో నుంచి సావిత్రికి కబురు వచ్చింది. తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళారు సావిత్రి. వెళ్ళగానే కాస్టింగ్ విభాగానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఆమె ఎత్తు, బరువు కొలతలు తీసుకున్నారు. సావిత్రి ఊరు పేరు అడిగి ఒక ఫైల్ లో వ్రాసుకున్నాడు. సాయంత్రం ఒకసారి వచ్చి కనిపించండి అంటూ ఆమెకు చెప్పారు. సాయంత్రం మళ్ళీ ఆమె తన నాన్నతో కలిసి స్టూడియోకి వెళ్ళారు. ఉదయం వచ్చిన వ్యక్తే మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి సినిమా కార్యాలయనికి తీసుకెళ్లాడు. సావిత్రి గురించి అతను తయారు చేసిన ఒక ఫైల్ ను చూపించాడు. 

ఆ ఫైలులో చలాకీ పిల్ల, చిలిపి కళ్ళు, కెమెరాకు చక్కగా సరిపడే ముఖం, కథానాయికకు సరిగ్గా సరిపోతుంది అని అందులో వ్రాసి ఉంది. అది సరే ఇంతకూ మీ యజమానులు ఏమంటున్నారు అన్నట్టు ప్రశ్నార్థకంగా ఆవిడ ముఖం పెట్టారు. అందులో భావం ఆమెకు అర్థమైంది. మీ వయస్సు చాలా తక్కువగా కనిపిస్తున్నది, ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఆగితే బాగుంటుంది అన్నారు అని అతను చెప్పాడు. అంత ఆలస్యంగా పుట్టినందుకు ఆమెపై ఆమెకే కోపం వచ్చింది. పదహారేళ్లు అప్పుడే వచ్చేయొచ్చు కదా అని కూడా ఆమెకు ఆ సమయంలో అనిపించింది. ఇదంతా గమనించిన ఆ వ్యక్తి, మీరు నిరాశ పడకండి, జెమినీ స్టూడియోలో మీకు తప్పక అవకాశం దొరుకుతుంది అని అనునయంగా చెప్పారు. అలా 

1949 లో ఆమెకు అవకాశం వచ్చినా, ఆమె చిన్నపిల్ల అని ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా, ఆ తరువాత ఆమెను వెతుక్కుంటూ “పాతాళబైరవి” రూపంలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో సావిత్రికి నృత్యం చేసే అవకాశం వచ్చింది. అలా చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ముఖ్యంగా “పెళ్లి చేసి చూడు” సినిమా ఆమె నటనా జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు. అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం “దేవదాసు” కావ్యంలో. అందులో పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది.

Show More
Back to top button