CINEMATelugu Cinema

తన కోపమే తనకు శత్రువై సినీరంగం నుండి వైదొలిగిన నటులు.. అమరనాథ్.

కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అన్ని ఇతర వృత్తుల కన్నా కళాకారుడిగా రాణించడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కళలు అజరామరమైనవి. కళాకారుడు కీర్తిశేషుడైనా కూడా అతనిచే సృజింపబడిన కళలు తరతరాలుగా, యుగాంతం జనాన్ని అలరిస్తూనే ఉంటాయి. అతడిని జనం ఏదో ఒక సందర్భంలో స్మరిస్తూనే ఉంటారు. అలా కళల మీద వ్యామోహంతో చిన్నతనంలోనే రంగస్థలం పై రాణించి ఆ తరువాత చిత్రరంగంలోకి ప్రవేశించి తన ప్రతిభను చాటుకున్న వారిలో అమరనాథ్ ఒకరు. అమరనాథ్ అంటే ఎవరో ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ హాస్యనటి లక్ష్మి తండ్రి అంటే మాత్రం అలాగా అనడమే కాకుండా ఆయన వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. అమరనాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. నాటక రచయితగా లబ్ద ప్రతిష్టులైన మానాపురం అప్పారావు గారి సోదరుడే ఈ అమరనాథ్.

అమరనాథ్ గారు భారత ఆహార సంస్థలో పనిచేస్తూనే సినిమాలలో అవకాశాలకోసం ప్రయత్నించారు. కొందరు నిర్మాతల సిఫారసు ఫలితంగా తనకు 1953లో “అమ్మలక్కలు”, “నా చెల్లెలు” చిత్రాలలో నటించడానికి అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నప్పుడే తన నటనాశక్తిని గమనించి నిర్మాతలు అమరనాథ్ గారిని తమ చిత్రాలలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన “అమర సందేశం” చిత్రంలో తనకి నాయకపాత్ర లభించింది. అమరనాథ్ గారు అమ్మలక్కలు, చండీరాణి, పిచ్చి పుల్లయ్య, లక్ష్మి, అమర సందేశం, చక్రపాణి, ఆడబిడ్డ, సంతానం, చెరపకురా చెడేవు, వదినగారి, గాజులు, కనకతార, చింతామణి, పెంకి పెళ్లాం, అక్కచెల్లెళ్లు, వద్దంటే పెళ్ళి, వరుడు కావాలి లాంటి చిత్రాలలో నటించారు.

నిజానికి సినిమా అనేది ఒక కళాత్మక వ్యాపారం. ఇందులో నిష్ణాతులైన వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా బాగానే వస్తుంది. కానీ ఎంత అనుభవజ్ఞులైనా కొన్ని సందర్భాలలో విఫలమైన వారు తీసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో విపరీతమైన నష్టాలను చవిచూస్తుంటారు. ఇటువంటి నష్టాల బారిన పడ్డవారు కొందరు తిరిగి కోలుకోలేనంత దెబ్బతిని సినీ రంగం నుండి కనుమరుగవ్వడం సర్వసాధారణం. నిజానికి అమరనాథ్ గారు నిర్మించిన “మగవారి మాయలు” అనే సినిమాను ఆర్థికంగా నిలదొక్కుకుంది. కానీ పంపిణీదారులు ఇచ్చిన తప్పుడు సమీక్షకు బలైపోయిన తాను ఆ సినిమా పరాజయం పాలయిందని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయమై న్యాయస్థానం వరకు వెళ్లినా, తీర్పు రావడానికి కొన్ని యేండ్లు పట్టింది. అమరచంద్ర మూవీస్ పతకంపై విజయనిర్మలతో “బాలయోగి” అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు అమరనాథ్ గారు. కానీ ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కాలక్రమంలో సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగు అయ్యారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    మానాపురం సత్యనారాయణ పట్నాయక్ 

ఇతర పేర్లు   :    అమరనాథ్ 

జననం    :    1925

స్వస్థలం   :  విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

తండ్రి  :  సన్యాసిరావు

తల్లి  :  రామాయమ్మ 

పిల్లలు   :   ఒక కుమారుడు రాజేష్, కుమార్తెలు శ్రీలక్ష్మి (హాస్యనటి), శ్రీదేవి 

వృత్తి      :   సినిమా నటుడు, నిర్మాత

క్రియాశీల సంవత్సరాలు   :    1953-1963

మరణ కారణం   :   గుండెపోటు 

మరణం   :   22 ఫిబ్రవరి 1980

నేపథ్యం…

అమరనాథ్ గారి అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. తాను విశాఖపట్టణానికి చెందిన వారు. అమరనాథ్ నాటక రచయితగా లబ్ద ప్రతిష్టులైన మానాపురం అప్పారావు గారి సోదరుడు. తాను 1925లో సన్యాసిరావు, రామాయమ్మ దంపతులకు జన్మించారు. మానాపురం సత్యనారాయణ చదువు అంతా కూడా రాజమండ్రిలోనే సాగింది. పాఠశాల దశలోనే తనకు నటన పట్ల ఆసక్తి ఏర్పడడానికి కారణం పెమ్మరాజు రామారావు గారి ప్రోత్సాహమే. ఆయన టౌన్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు. ఆయన ప్రోద్బలం తో తొలిసారి “తులాభారం నాటకం” లో సత్యభామ పాత్రను పోషించారు మానాపురం సత్యనారాయణ. తాను తొలివేశం వేయడం, అందులోనూ అది ఆడవేశం కావడంతో ముందు కొంచెం కంగారుపడ్డారు.

అది చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెన్ను తట్టడంతో తడబాటు లేకుండా వేదిక మీద అభినయించి సహ విద్యార్థుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో అమరనాథ్ కు మేకప్ చేసింది మరెవరో కాదు, “కచ దేవయాని”, “జీవనజ్యోతి” చిత్రాలకు తరువాత కాలంలో దర్శకత్వం వహించిన ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు. ఆ తర్వాత “గయోపాఖ్యానం” లో కృష్ణుడిగా, అర్జునుడిగా, “లవకుశ” నాటకంలో లవుడిగా నటించారు మానాపురం సత్యనారాయణ గారు. లవకుశ చిత్రంలో సత్యనారాయణ నటించిన తీరు చూసి ముగ్ధులైన నిర్మాత కె.వి.సుబ్బారావు శారద రాయలసీమ బ్యానర్ పై తాను నిర్మించే “జయప్రద” చిత్రంలో పురూరవ చక్రవర్తి కుమారుడి వేషం వేయించారు. దాంతో మానాపురం సత్యనారాయణ తొలిసారిగా కెమెరా ముందు నిలబడ్డారు.  అయితే ఆ తరువాత సినిమా అవకాశాలు రాకపోవడంతో రాజమండ్రి తిరిగి వచ్చేసి తన చదువును కొనసాగించారు.

నాటకాలలో…

అమరనాథ్ గారు తన ఏడవ యేట ఐదవ తరగతి చదువుతుండగా పాఠశాలలో నాటకం వేశారు. దానిపేరు “తులాభారం”. మొట్టమొదటిసారిగా అమరనాథ్ బడి పిల్లల “తులాభారం” నాటకంలో “సత్యభామ” వేషం వేశారు. ఆ నాటకానికి ముందస్తుగా వారికి శిక్షణ ఇచ్చిన ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు గారు స్వయంగా అమరనాథ్ గారికి అలంకరణ చేశారు. అలా నాటకాలకు తొలిబీజం పడింది. ఆ తరువాత పెద్ద పెద్ద నాటకాలలో వేషాలు వేస్తూ వచ్చారు అమరనాథ్ గారు. బ్రహ్మజ్యోస్యుల సుబ్బారావు గారి నాటక కంపెనీలో లోహితాస్యుడి పాత్రను ధరించారు. అలా కొనసాగుతూ సీనియర్ శ్రీరంజని, స్థానం నరసింహారావు గారి లాంటి ప్రముఖులతో కలిసి నాటకాలు వేసేవారు. స్థానం నరసింహారావు గారి “తులాభారం” నాటకంలో నారదుడి వేషం వేసేవారు. నిజానికి ఆ సమయానికి అమరనాథ్ గారికి కేవలం పదేళ్లు మాత్రమే.

చిత్ర రంగ ప్రవేశం…

@ గ్వాలియర్ పారిపోయి, సంగీతం నేర్చుకుని…

అమరనాథ్ గారికి 12 యేండ్లు వచ్చేసరికి సినిమాలలో మొదటి అవకాశం దొరికింది. అది కూడా “జయప్రద” చిత్రంలో పురూరవుడి కొడుకు పాత్ర. సాలూరు రాజేశ్వరరావు గారు సినిమాలకు సంగీతం ఇవ్వడం అదే మొదలు. వారు అమరనాథ్ గారి చేత ఒక పాట, ఒక పద్యం పాడించారు. సినిమాలలో కొనసాగాలంటే ఆ రోజులలో నటనతో బాటు నాట్యం, సంగీతం కూడా వచ్చి ఉండాలి. తనకు సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష పెరిగిపోయింది. దాంతో అమరనాథ్ గారు ఇంటి నుంచి పారిపోయి గ్వాలియర్ చేరుకున్నారు. సంగీతం నేర్చుకోవాలనే పట్టుదలతో అక్కడ గజానంద్ అనే సంగీత విధ్వంసుడి వద్ద సుమారు ఆరు నెలల పాటు కఠోర దీక్షతో సంగీతం అభ్యసించారు.

ఆ రోజులలో ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ముందుగా గురువు గారికి సేవ చేయాలి. అలా ఆరు మాసాలు సేవచేస్తూ సంగీతం నేర్చుకున్న అమరనాథ్ గారు ఇక సేవ చేయలేక మళ్ళీ విశాఖపట్నం వచ్చి పాఠశాలకు వెళ్లి తన చదువును కొనసాగిస్తూ పాఠశాల ఫైనల్ పాసైపోయి కళాశాలలో చేరారు. అంతకుముందు ఆరు నెలలు సంగీతం నేర్చుకున్న అనుభవం ఉంది గనుక ఆ సంగీత విద్యతో తాను రోజూ మహారాష్ట్ర సంగీతం రెండు గంటలసేపు కచేరి చేసి పాడేవారు. అప్పుడప్పుడు నిర్వహించే సంగీతపు పోటీలలో అమరనాథ్ గారి కంటే దీర్ఘకాలం సంగీతం అభ్యసించిన వారిని కూడా ఓడించి ఒకసారి మొదటి బహుమతి అందుకున్నారు అమరనాథ్ గారు.

పాటల రికార్డింగుకు మద్రాసు వెళ్లి…

అమరనాథ్ గారు కళాశాలలో ప్రవేశించాక తన మనసు అంతా సినిమాల మీదే, నాటకాల మీదనే ఉండేసరికి చదువు మీద ఆసక్తి పోయింది. ఈ సంగతి కనిపెట్టిన అమరనాథ్ గారి బావగారు రేషనింగ్ విచారణ అధికారి పనిని తనకు అప్పగించారు. ఆ తరువాత కొంతకాలానికి ప్రమోషన్ వచ్చి ఫుడ్ గ్రెయిన్స్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు, ఆ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ తరుణంలో హిజ్ మాస్టర్స్ వాయిస్ సంస్థకు చెందిన ఏ. సూర్యనారాయణ రావు గారు విశాఖపట్నం వచ్చి అమరనాథ్ పాటలు విని తన గొంతుతో పాటలు పాడించడానికి అమరనాథ్ గారిని మద్రాసు పిలిపించారు. దాంతో ఉద్యోగానికి రెండు నెలలు సెలవు తీసుకొని మద్రాసుకు వచ్చేశారు. ఒకటి లేదా రెండు పాటలు రికార్డింగు చేయిస్తారని అనుకున్నారు అమరనాథ్ గారు. కానీ సూర్యనారాయణ రావు గారు ఏకంగా 14 పాటలు రికార్డింగు చేయించారు.

అమరనాథ్ గారి వద్ద ఉన్న ప్రతిభ ఏమిటంటే తానే పాటలు వ్రాసుకుని, తానే బాణీలు సమకూర్చేవారు. అది గమనించిన హిజ్ మాస్టర్ వాయిస్ కంపెనీ వారు అమరనాథ్ గారి రికార్డింగు అయిపోయాక తనచేత పాటలు కూడా వ్రాయించుకునేవారు. అలా తాను వ్రాసిన పాటలను వైజయంతీ మాల, జిక్కీ మొదలయిన వారు పాడుతూవుండేవారు. అమరనాథ్ గారు తన ఉద్యోగానికి సెలవు పెట్టిన రెండు మాసాల గడువు పూర్తవ్వకముందే తనను మిత్రులు యోగానంద్ గారికి  పరిచయం చేశారు. యోగానంద్ గారు అమరనాథ్ గారిని ప్రముఖ దర్శకులు యల్వీ ప్రసాద్ గారికి పరిచయం చేశారు. ఆ పరిచయాల ఫలితంగా తాను కృష్ణ పిక్చర్స్ లో ఎనిమిది నెలల అగ్రిమెంటు మీద సంతకం పెట్టారు. మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అనే పేరుని కాస్త అమరనాథ్ గా మార్చుకొని “అమ్మలక్కలు” చిత్రంలో సుందర్ పాత్రను పోషించారు.

హీరోగా “నా చెల్లెలు”…

అమ్మలక్కలు చిత్రంలో నందమూరి తారకరామారావు గారి తమ్ముడిగా వేషం వేసిన తరువాత చిత్రపు నారాయణ మూర్తి రూపొందించిన “నా చెల్లెలు” సినిమాలో కథానాయకుడిగా అమరనాథ్ గారికి అవకాశం దొరికింది. చెల్లెలి సెంటిమెంట్ ప్రధానంగా తయారైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దాంతో అమరనాథ్ గారికి కూడా వ్యక్తిగతంగా బాగా కలిసి వచ్చింది. బాగా నటిస్తున్నాడు అనే పేరు చిత్ర పరిశ్రమలో వ్యాపించడంతో మరిన్ని అవకాశాలు అమరనాథ్ ను వెతుక్కుంటూ వచ్చాయి. “చండీరాణి” చిత్రంలో హీరోయిన్ తండ్రి వేషం, పిచ్చి పుల్లయ్యలో ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషించారు. అలాగే “లక్ష్మి” సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు.

ఇలా తన దగ్గరకు ఏ పాత్ర వచ్చినా, ప్రతీ పాత్రను అంగీకరిస్తూ ఒక కళాకారుడిగా తీరికలేకుండా వున్నారు. అలాగే అదుర్తి సుబ్బారావు గారి తొలి చిత్రం “అమర సందేశం” సినిమా అమరనాథ్ గారి సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ సినిమా విజయం సాధించకపోయినా అమరనాథ్ గారి నటనను అందరూ మెచ్చుకున్నవారే. ఇక అప్పటినుండి అమరనాథ్ గారికి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. “ఆడబిడ్డ”, “వదినగారు గాజులు”, “కనకధార”, “చెడపకురా చెడేవు”, “సంతానం”, “అక్క చెల్లెలు”, “వరుడు కావాలి”, “వద్దంటే పెళ్లి” లాంటి చిత్రాలలో అమరనాథ్ గారు నటించారు. సాంఘిక పాత్రలే కాకుండా “కృష్ణ గారడి చిత్రంలో “కృష్ణుడి” గా, సతీ అరుంధతి సినిమాలో “నారదుడిగా” అమరనాథ్ గారు నటించారు.

ముక్కోపి…

ఎలాంటి వారైనా చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిగత ప్రవర్తన చాలా ముఖ్యం. అమరనాథ్ గారు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా కూడా తనకు ఉన్న కోప స్వభావి కావడంతో ఆ కోపమే అమరనాథ్ గారి పాలిట శత్రువు అయ్యిందని చెబుతుంటారు. తనకున్న ముక్కోపమే తన సినీ ప్రస్థానానికి ముగింపు పలికింది. కొత్త నీరు ప్రవేశించడం వలన అవకాశాలు తగ్గడంతో సొంతంగా చిత్ర నిర్మాణసంస్థ ను నెలకొల్పి “మగవారి మాయలు” పేరుతో ఒక చిత్రాన్ని శోభనాద్రి రావు గారి దర్శకత్వంలో నిర్మించారు అమరనాథ్ గారు.

ఆ చిత్రం విజయవంతం అయినా కూడా పంపిణీదారులు సినిమా ఫ్లాప్ అంటున్నారని వారి మీద కోర్టుకు వెళ్లారు. ఏళ్ళు గడిచినా ఆ కేసు తేలలేదు. దాంతో మరింత అప్పుల పాలయ్యారు. అలాగే కొందరు నిర్మాతలపై కూడా అమరనాథ్ గారు దావాలు వేసి వారి ఆగ్రహానికి గురయ్యారు. విజయనిర్మల గారిని కథనాయికగా “బాలయోగిని” చిత్రాన్ని ప్రారంభించారు. సత్యం గారి సంగీత దర్శకత్వంలో కొన్ని పాటల కూడా రికార్డు చేశారు. కొన్ని రోజులు చిత్రీకరణ కూడా జరిపారు. అయితే ఆ తరువాత చిత్రీకరణ ముందుకు సాగలేదు.

మరణం…

అమరనాథ్ గారి వారసులు కూడా తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేస్తే పరిశ్రమ కూడా వారిని ప్రోత్సహించింది. అమరనాథ్ కుమారుడు రాజేష్. తాను ఎస్.గోపాల్ రెడ్డి గారి ద్వారా జంధ్యాలను కలుసుకున్నారు. మరియు నెలవంక (1983) సినిమాలో తొలిసారిగా నటించాడు.  అదే సంవత్సరం తాను మళ్లీ జంధ్యాలతో కలిసి రెండు జెల్ల సీత (1983), ఆనంద భైరవి (1983)లో మాళవిక సర్కార్ సరసన నటించాడు. ఆ సినిమా తనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అతని సోదరి శ్రీ లక్ష్మి అతనితో రెండు చిత్రాలలో కలిసి నటించింది. మద్యానికి బానిసైన తాను సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీకి విరాళంగా ఇచ్చాడు.

రాజేష్ దాదాపు నలభై చిత్రాలలో నటించాడు. శ్రీ లక్ష్మి పెళ్లి సందడి (1996) షూటింగ్‌లో ఉండగా తెల్లవారుజామున 2 గంటలకు కాలేయం దెబ్బతినడంతో రాజేష్ 38 సంవత్సరాల వయస్సులో మరణించాడు. నటి ఐశ్వర్య రాజేష్ ఆయన కుమార్తె. అలాగే హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుత సినిమాలలో, సీరియల్స్ లో గుణచిత్ర నటిగా చేస్తున్న శ్రీ లక్ష్మీ అమరనాథ్ పెద్ద కూతురు. చిన్న కూతురు శ్రీదేవి కూడా కొన్ని సినిమాలలో నటించి తర్వాత తెరమరుగయ్యింది. తన పిల్లల యొక్క ప్రగతిని చూసి అమరనాథ్ సంతృప్తితో 22 ఫిబ్రవరి 1980 నాడు తుది శ్వాస విడిచారు అమరనాథ్ గారు.

Show More
Back to top button