Telugu Cinema

జాతీయ పురస్కారాల నట విశారద.. నటి ఊర్వశి శారద

భారతీయ చలనచిత్ర విభాగంలో కథానాయకుడు లేదా కథానాయకి పాత్రలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ప్రతీ యేటా జాతీయ ఉత్తమ నటులుగా పురస్కారం అందజేయబడుతుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాము. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడికి ‘భరత్’ అని, ఉత్తమ నటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి తాడిపర్తి సరస్వతీ దేవి (శారద).

1967 నుండి నటీమణులకు కూడా జాతీయ పురస్కారాలు ఇవ్వడం ఆరంభించారు. తొలి పురస్కారాన్ని నర్గీస్ దత్ గారు “రాత్ ఔర్ దిన్” చిత్రానికి అందుకోగా, మరుసటి సంవత్సరమే అంటే 1968లో నటి శారద గారు మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా  తన తొలి ‘ఊర్వశి’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తరువాత “స్వయంవరం” మళయాళ చిత్రానికి 1972లో రెండవ సారి, “నిమజ్జనం” తెలుగు చిత్రం ద్వారా 1978లో మూడవ సారి శారద గారు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి “ఊర్వశి” అన్న టైటిల్ ను తన పేరు ముందు సగర్వంగా చేర్చుకున్నారు. అందుకే ఆ రోజుల్లో అందరూ తనను “ఊర్వశి” శారద అని పిలిచేవారు. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే ‘మన ఊర్వశి’ అంటూ ఆరాధించేవారు.

శారద గారు సంభాషణలు చెప్పారంటే సినిమా హాలు దద్దరిల్లిపోయేది. మీసాలు మెలేసే విలన్లకు సైతం ముచ్చెమటలు పట్టించేవారు. అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఇదేమి న్యాయం అని నిలదీసిందంటే చాలు ఎదుటివారు నీళ్లు నమలాల్సిందే. అంత కఠోరమైన పాత్రలే కాదు వెన్నెముద్దలా కరిగిపోయే ఆత్మీయ పాత్రను కూడా పోషించారు శారద గారు.

పాత్రకు ప్రాణం పోసి తూకం చెడని అభినయంతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు పొంది, సందేశాత్మక చిత్రాలతో సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టి, ప్రజా ప్రతినిధిగా సమస్యల పరిష్కారానికి చేయూతనిచ్చి నవతరం తారలకు, ఆదర్శంగా నిలిచిన మహానటి ఊర్వశి శారద గారు. అనేక జాతీయ పురస్కారాలను కూడా అలవోకగా సొంతం చేసుకున్న తాను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. ఆ పౌరుషం, ఆ ధైర్యం, ఆ లాలిత్యం, అదంతా నటనే కావచ్చు. కానీ అనటనకు పునాది ఆమె తల్లి సత్యవతీ దేవి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    తాడిపర్తి సరస్వతీ దేవి

ఇతర పేర్లు    :   శారద,  ఊర్వశి శారద 

జననం    :    25 జూన్ 1945

స్వస్థలం   :    తెనాలి , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ )

తండ్రి   :    వెంకటేశ్వర్లు 

తల్లి     :  సత్యవతీ దేవి  

భర్త        :     చలం

వృత్తి     :     నటి

అవార్డులు    :    ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డులు (3)

రాజకీయం  :  పార్లమెంటు సభ్యురాలు

పార్టీ     :    తెలుగుదేశం పార్టీ

నియోజకవర్గం   :    తెనాలి 

జననం…

తాడిపర్తి సరస్వతీ దేవి (శారద) గారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి లో 25 జూన్ 1945 లో జన్మించారు. వీరి తల్లి సత్యవతీ దేవి, తండ్రి వెంకటేశ్వర్లు. మామూలుగానే తెనాలి ని ఆంధ్రా ప్యారిస్ గాఅని పిలుస్తూంటారు. ప్రముఖ కథానాయిక కాంచనమాల, నటులు కళావాచస్పతి కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి మహానటుల పుట్టిల్లు తెనాలి. ఆ తెనాలి లోని కొత్తపేట లో గల పాత బ్రాహ్మణ వీధిలో కాంచనమాల ఇంటి సమీపంలోనే శారద గారి ఇల్లు ఉండేది. శారద వాళ్ళ నాన్న గారిది వ్యవసాయ కుటుంబం. శారద వాళ్ళ అమ్మానాన్న లకు ఇద్దరే సంతానం. శారద మరియు తమ్ముడు ఉండేవారు. వీళ్ళ కుటుంబం ఉండే వీధులలో మొత్తం బ్రాహ్మణులు ఉండేవారు. వారు అనునిత్యం ఏదో ఒక వ్రతం, హోమం, పూజలు చేస్తుండేవారు. సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు అన్నట్టుగా ఉండేది ఆ వీధి వాతావరణం. అందుకే చదువు, నృత్యం, సంగీతం అన్ని బ్రాహ్మణుల గురువు దగ్గర నేర్చుకున్నారు శారద గారు. ఇంట్లో తనను అందరు పాపా అని ముద్దుగా పిలుస్తుండేవారు.

బాల్యం..

అప్పట్లో తెనాలి లోని కొత్తపేట లో పది, పదిహేను ఇల్లులు మాత్రమే ఉండేవి. శారద నాన్న గారి అమ్మమ్మ బాగా ధనవంతురాలు. శారద వాళ్ళ కుటుంబం ఆమెతోనే ఉండేది.

అయితే కొంత కాలం తరువాత అన్నీ పోయాయి.

తన నాన్న గారు నగలు వ్యాపారంతో పాటు మరికొన్ని రకాల వ్యాపారాలు చేస్తుండేవారు. చిన్నప్పుడు శారద గారు చాలా బలహీనంగా ఉండేవారు.

ఒకసారి తన కాళ్లకు అనారోగ్యం చేయడంతో వ్యాయామం చేయాలని వైద్యులు సూచించారు.

దాంతో తనను నృత్య శిక్షణకు పంపించారు శారద గారి అమ్మ గారు. లంక సూర్యనారాయణ రావు గారు శారద గారికి నృత్య గురువు.

ఆయన ముక్కోపి. చదువు నేర్పే గురువు గారు  కూడా అంతే. క్రమశిక్షణ తప్పితే సహించేవారు కాదు.

బాగా చదవని వారిని త్రాడుకు వ్రేలాడదీస్తుంటే భయపడేవారు. ఆడపిల్లలను మాత్రం పెద్దగా శిక్షించేవారు కారు.

అయితే బడి ముగిశాక కూడా సాయంత్రం మళ్ళీ క్లాసులకు పిలిచేవారు.

సినీ రంగ ప్రవేశం…

శారద గారి తల్లి గారు పాటలు బాగా పాడేవారు. ఆమెకు సంగీతంలో బాగా ప్రావీణ్యం ఉండేది. దాంతో శారద గారిని సంగీత శిక్షణ కు కూడా పంపించింది. తమిళనాడు నుంచి తెనాలి వచ్చి స్థిరపడ్డ సంగీత గురువు రామ్మూర్తి గారు వద్ధ సంవత్సరం పాటు తాను సంగీతం నేర్చుకున్నా ఫలితం లేదు. కనీసం సరిగమలు కూడా రాలేదు. దాంతో రామ్మూర్తి గారు ఒకరోజు శారద గారితో తల్లీ నీకు సంగీతం నేర్పడం నావల్ల కాదు, ఇక వెళ్ళండి అంటూ చేతులెత్తేశారు. అయితే  నాటక రంగం వైపు వెళ్తే ఫలితం ఉంటుందని తానే సూచించారు.

తాను 11 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు శారద గారి నాన్న గారు బర్మా వెళ్లడానికి మద్రాసు వెళ్లడంతో వారి కుటుంబమంతా ఆయనతో పాటు మద్రాసు వచ్చింది. ఆ సమయంలో శారద గారికి అనుకోకుండా  కన్యాశుల్కం సినిమాలో నటించే అవకాశం దొరికింది. బొమ్మల పెళ్లి లో పెళ్ళికొడుకు తల్లిగా ఎన్టీఆర్ గారి సరసన కనిపిస్తారు. అప్పట్లో నాటకాలలో ఆడవేషాలను మగవారే వేసే వాళ్ళు. అలాంటి సమయంలో అమ్మాయి గా తనకు  అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. ఆదివారం మాత్రమే నాటకాల రిహార్సల్స్ ఉండాలి, హీరో అనేవాడు మా అమ్మాయికి దూరంగా నిలబడే సంభాషణ లు చెప్పాలి అనే నిబంధనలు పెట్టేవారు శారద గారి అమ్మమ్మ గారు.

శారద గారు ఎన్టీఆర్ “కన్యాశుల్కం” లో బాలనటిగా ఓ పాటలో కనిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించిన తాను “ఇద్దరు మిత్రులు”, “ఆత్మబంధువు”, “దాగుడుమూతలు” వంటి చిత్రాలలో పద్మనాభం గారికి జోడీగా నటించారు. శారద గారు మాతృభాషలో కథానాయికగా మారడానికి ముందే మళయాళ చిత్రసీమ మాత్రం తనకు ఎర్రతివాచీ పరచింది. అక్కడే తనదైన అభినయంతో తాను మళయాళ వాసులను పరవశింపచేశారు. మళయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలవగానే, తెలుగు నిర్మాతల చూపు శారద గారి వైపు సాగింది.

మళయాళంలో ఆమెను “ఊర్వశి”గా నిలిపిన “తులాభారం” ఆధారంగా తెలుగులో తెరకెక్కిన “మనుషులు మారాలి” లోనూ తాను అభినయించారు. ఈ సినిమాతో తెలుగువారిని తాను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచీ తెలుగు చిత్రాలలోనూ తన అభినయం వెలుగులు విరజిమ్మింది. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సహా నటి గా నటించే అవకాశాలు దక్కించుకున్నారు. అయితే శోభన్ బాబుకు మాత్రం తాను హిట్ పెయిర్ గా నిలిచారు. వారిద్దరూ కలిసి నటించిన “సిసింద్రీ చిట్టిబాబు”, “కాలం మారింది”, “మానవుడు-దానవుడు”, “శారద”, “దేవుడు చేసిన పెళ్ళి”, “జీవితం”, “ఇదాలోకం”, “బలిపీఠం”, “కార్తీక దీపం”, “కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త” వంటి చిత్రాలు ప్రేక్షకులను అశేషంగా ఆకట్టుకున్నాయి.

1955 నుండి 1961 వరకు బాలనటిగా ఉన్న శారద గారు, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగింది. తాను 1975లో ఒక మలయాళీని పెళ్ళి చేసుకొని కేరళకు తరలి వెళ్ళారు. ఆ సమయములో అనేక మలయాళ సినిమాలలో నటించారు. తాను నటించిన మలయాళ చిత్రం “స్వయంవరం” లో నటనకు గాను తనకు జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో దానిని నాలుగు భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె నాలుగు వేర్వేరు భాషలలో పోషించవలసి వచ్చింది. 

హిందీ, తెలుగు భాషలలో తీసిన “స్వయంవరం” సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. ఆ తరువాత తాను మలయాళంలో నటించిన “తులాభారం” చిత్రానికి 1968 లో, తెలుగులో నటించిన “నిమజ్జనం” చిత్రానికి గాను 1978 లో రెండు సార్లు ఊర్వశి పురస్కారాన్ని అందుకొన్నారు. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత అప్పటివరకు హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారద గారికి గంభీరమైన పాత్రలు రావటం మొదలయ్యింది. ఇతర దక్షిణాది భాషల చిత్రాలలో నటిస్తూ బిజీ అయిన శారద గారు “చండశాసనుడు” సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగములో ప్రవేశించారు.

యన్టీఆర్ గారితో “జీవితచక్రం” లో సైడ్ హీరోయిన్ గా నటించిన శారద గారు ఏ నాడూ ఆయన సరసన ప్రధాన కథనాయికగా నటించలేకపోయారు. అలాంటి శారద గారు తరువాతి రోజులలో “సర్దార్ పాపారాయుడు”, “జస్టిస్ చౌదరి” చిత్రాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. “దానవీరశూర కర్ణ” లో తొలిసారి యన్టీఆర్ గారి దర్శకత్వంలో నటించిన శారద గారు, ఆ తరువాత ‘చండశాసనుడు’లో ఎన్టీఆర్ గారి చెల్లెలిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఆ చిత్రం తరువాత శారద కెరీర్ బ్రహ్మాండమైన మలుపు తిరిగింది.

ఆపై అనేక చిత్రాలలో రౌద్రరస పాత్రలలో శారద తనదైన అభినయంతో అలరించారు. ఇలా సాగుతున్న తన కెరీర్ ను యన్టీఆర్ గారి సొంత చిత్రం “అనసూయమ్మగారి అల్లుడు” మరో మలుపు తిప్పింది. ఆ చిత్రం లో శారద గారు హాస్యాన్ని భలేగా పండించారు. అప్పటి నుంచీ తాను పలు చిత్రాలలో హాస్యంతోనూ ఆకట్టుకోవడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద గారు, ఆ తరువాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మ గానూ నటించి మెప్పించారు.

శారద అసలు పేరు “సరస్వతీ దేవి”…

ఊర్వశి శారద గారి అసలు పేరు సరస్వతీ దేవి. వాళ్ళ నాన్న మొదటి భార్య సరస్వతీ దేవి చనిపోవడంతో ఆమెపై ఉన్న మమకారంతో తనకు ఆ పేరు పెట్టారు. అయితే తాను సినిమాలలోకి వచ్చేటప్పటికి చాలా మంది సరస్వతులు ఉండడంతో ఫ్రూట్ సుబ్బారావు అనే బ్రాహ్మణుడు, సరస్వతీ దేవి నాన్నగారు కలిసి తన పేరును శారదగా మార్చారు. శారద అన్నా సరస్వతి అన్నా ఒకటే అర్థం. శారద గారు మద్రాసుకు వచ్చాక ఎల్వి ప్రసాద్ కార్యాలయంలో నటన నేర్చుకునేవారు. అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు “ఇద్దరు మిత్రులు” సినిమాలో చెల్లి పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. చిత్రీకరణ సమయంలోనే శారద గారు అక్కినేని గారి వద్ద నటనలో మెలకువలు నేర్చుకున్నారు. అందుకే తనకు నటనలో ఓనమాలు నేర్పింది ఎల్వి ప్రసాద్ గారైతే అ,ఆ లు నేర్పించినది అక్కినేని గారని శారద గారు చెబుతుండేవారు. మొత్తం మీద శారద గారు ఎన్టీఆర్ గారి “కన్యాశుల్కం” సినిమాతో రంగ ప్రవేశం, ఏఎన్ఆర్ గారి “ఇద్దరు మిత్రులు” చిత్రంతో ప్రముఖ పాత్ర పోషణ జరిగాయి.

అల్లరి చేయడంలో అందెవేసిన చేయి..

శారద గారు ఇంటి చుట్టుపక్కల గోడలు ఎక్కడంలో తనది అందెవేసిన చేయి. చెట్లు ఎక్కి దానిమ్మ పండ్లు, నారింజ పండ్లు కోసి తన స్నేహితులందరికీ పంచేవారు. శారద వాళ్ళ ఇంటి దగ్గర మాణిక్యమ్మ అనే ఆవిడ ఉండేవారు. ఆమెకు శారద గారు అంటే ఎంతో ఇష్టం. తన స్నేహితులందరినీ దొంగలు అనేది, కానీ శారద గారిని మాత్రం ఏమీ అనేది కాదు. తాను మంచిదని ఆమె నమ్మకం. కానీ అసలు దొంగ తానే అన్న విషయం తనకు తెలియదు. చెట్టెక్కి నారింజ పండ్లు కోస్తుంటే పిల్లలందరూ క్రింద ఉండి ఏరుకునేవారు.

సాయంత్రం అయ్యేసరికి చెట్టంతా బోసిపోయేది. దాన్ని చూసి మాణిక్యమ్మ గగ్గోలు పెట్టేది. అలాంటి మాణిక్యమ్మ శారద గారు సినిమాలకు వచ్చిన తర్వాత కేవలం తన కోసమే మద్రాసు వస్తుండేవారు. ఆమె అంత దూరం రావడానికి కారణం మా ఊరే. అదే ఇద్దరినీ కలిపింది. తాను షూటింగ్లో బిజీగా ఉండిపోయి ఇంటికి రాకపోయినా మూడు నాలుగు రోజుల పాటు అక్కడ ఎదురు చూసేదామె. “నేను ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు వచ్చి ఎంతో కొంత డబ్బులు చేతిలో పెట్టి వెళ్లేది మాణిక్యమ్మ. నేను బాగానే సంపాదిస్తున్నానని ఆమెకు తెలుసు. ఆమె అభిమానంతో ఇచ్చేది. అలాంటి మాణిక్యమ్మ చనిపోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను” అని శారద గారు చెప్పుకొచ్చారు.

స్నేహాన్ని వదులుకోని మనస్తత్వం…

శారద గారికి నేపథ్య గాయని ఎస్.జానకి గారు మంచి స్నేహితురాలు. 50 సంవత్సరాలుగా వాళ్ళ స్నేహం అలాగే ఉంది. తన కంటే ఏడేళ్లు పెద్దదైన జానకి గారు ఎంతోమందికి పాటలు పాడారు.

అలాంటి జానకి గారు, శారద గారు పాటలు పాడుతుంటే సరదాకి నాట్యం చేసేవారు.

రావి కొండలు రావు గారి సతీమణి రాధా కుమారి శారద గారికి మంచి మిత్రురాలు. బాల్య స్నేహం ఆనందకరమైన అనుభూతి.

శారద గారు చిన్నతనంలోనే మద్రాసు చేరినా చిన్ననాటి స్నేహితులందరినీ గుర్తుపెట్టుకునేవారు.

ప్రస్తుతం హైదరాబాదులో ఉండే డాక్టర్ కృష్ణ కుమారి అంటే తనకు ఎంతో అభిమానం. భీష్మ సుజాత అనే మిత్రురాలు కూడా పాపా పాపా అంటూ శారద గారిని ఆట పట్టించేవారట.

ఓసారి శారద గారు ఊటిలో చిత్రీకరణ లో ఉన్నప్పుడు అనుకోకుండా కళ్యాణి అనే స్నేహితురాలు కలిశారు. ఎంత సంతోషమేసిందో చెప్పలేను.

ఎప్పుడో ఊర్లోని చెట్టు, పుట్టల వెంటే తిరిగే మేము అలా షూటింగ్లో కలుసుకోవడం అద్భుతం అనిపించింది అని తన బాల్యాన్ని గుర్తుచేసుకునే వారు శారద గారు.

వివాహం..

శారద గారు తన మొదటి సినిమా లో కథనాయకులు అయిన చలం గారితో ప్రేమలో పడ్డారు.

చలం గారి భార్య అగ్ని ప్రమాదం లో మరణించారు. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలు కూడా వున్నారు.

బంధువులు, మిత్రులు ఎందరు వద్దని వారించినా వినకుండా చలం గారిని తాను తన 22 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ వివాహబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.

దాంతో విడాకులు తీసుకుని కేరళకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

ఆ వైవాహిక బంధం కూడా ఎక్కువ కాలం నిలువక రెండవ భర్త తో కూడా విడాకులు తీసుకుని తన అన్నయ్య దగ్గరే ఉంటున్నారు.

శారద గారికి సంతానం లేదు. తన నట జీవితంలో మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న శారద గారు, అనేక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, గౌరవ డాక్టరేట్ లు అందుకుని, తన నటనతో ప్రేక్షకుల చేత నీరజనాలు అందుకున్నారు.

ఇంత వైభవోపేతమైన నట జీవితాన్ని చవిచూసిన శారద గారు తన వైవాహిక జీవితంలో మాత్రం అసంతృప్తికి లోనయ్యారు అనే చెప్పాలి.

పురస్కారములు…

★ జాతీయ చలనచిత్ర అవార్డులు..

1968 వ సంవత్సరంలో తులాభారం (మలయాళం) చిత్రానికి గానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు..

1972 వ సంవత్సరం లో స్వయంవరం (మలయాళం) చిత్రానికి గానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు.

1977 వ సంవత్సరం లో నిమజ్జనం (తెలుగు) చిత్రానికి గానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకున్నారు.

★ తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు..

తమిళ సినిమాకు చేసిన కృషికి గానూ 2013 సంవత్సరం లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదునిచ్చి సత్కరించింది.

★ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు..

1970 సంవత్సరం లో త్రివేణి & తార చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు.

★ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్

1987 sa ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – మలయాళం  : ఒరు మిన్నమినుంగింటే నురుంగువెట్టం

1997 – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

★ నంది అవార్డులు..

1984 వ సంవత్సరం లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు.

2010 వ సంవత్సరం లో జీవితకాల సాఫల్యానికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కించుకున్నారు.

★ ఇతర అవార్డులు..

1970 వ సంవత్సరం లో సమాజ్ కో బాదల్ దలో అనే చిత్రం లో నటించినందుకు గానూ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) హిందీలో ఉత్తమ నటిగా పురస్కారం అందజేశారు.

2017 వ సంవత్సరం లో ప్రేమ్ నజీర్ పురస్కారం అందుకున్నారు.

1999 వ సంవత్సరం లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.

2020 -వ సంవత్సరం లో వనిత ఫిల్మ్ అవార్డ్స్ వారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.

రాజకీయం లో పార్లమెంటు సభ్యురాలిగా…

శారద గారికి నందమూరి తారకరామారావు గారితో ఉన్న అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. నందమూరి తారకరామారావు  శారద గారిని చెల్లెలుగా చూసుకునేవారు.

ఎన్టీఆర్ గారితో తాను నటించిన చిత్రాల్లో తనకు ఎంతో ఇష్టమైనది “ఛండశాసనుడు”. ఆ చిత్రం లో శారద గారు ఎన్టీఆర్ గారికి సోదరిగా నటించారు.

ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారితో “అనసూయమ్మ గారి అల్లుడు” లో అత్తగా నటించారు. అలాంటి చెల్లెలు ఎన్టీఆర్ అవార్డు అందుకున్నప్పుడు ఎంతో ఆనందపడ్డారు.

మా అన్నయ్య వచ్చి నాకు అవార్డు ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నారు.

ఇక నాయికగా తాను ఎన్టీఆర్ గారితో నటించిన వాటిలో “జీవిత చక్రం”, “సర్దార్ పాపారాయుడు”, “జస్టిస్ చౌదరి”, “మేజర్ చంద్రకాంత్” లాంటివి చెప్పుకోదగ్గ చిత్రాలు.

ఎన్టీఆర్ గారి ఆహ్వానం తో 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవ పున్నయ్య పై గెలుపొందారు.

తాను పుట్టిన ప్రాంతం అన్న స్వార్థంతో ఒక్క తెనాలి పట్టణం గురించే ఆలోచించకుండా నియోజకవర్గ మొత్తానికి న్యాయం చేయడానికి ప్రయత్నించారు.

తాను పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలములో తన నియోజక వర్గానికి రైల్వే లైనును మంజూరు అయ్యేలా చేశారు. రోడ్లు, పాఠశాలలు కట్టించారు.

అనుకోకుండా అప్పట్లో రెండేళ్లకే లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి.

రెండవ పర్యాయం లోక్‌సభకు పోటీచేసినప్పుడు పి శివశంకర్‌ పై ఓడిపోయింది.

ఆ తరువాత 24.2.2009 మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Show More
Back to top button