NRI News

చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా అరుదైన గౌరవం

గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, ప్రజల డాక్టర్ చందోలు నాగమల్లేశ్వరరావుకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. దళిత కుటుంబంలో పుట్టి, పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2005లో జమైకా వెళ్లిన ఆయన, అక్కడ ‘పేదల డాక్టర్‌’గా విశేషమైన పేరు సంపాదించుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా, అక్టోబర్ 20న జరిగిన జమైకా నేషనల్ హీరోస్ డే వేడుకల్లో భాగంగా, ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్’ (ఆఫీసర్ ర్యాంక్ – ఓడీ) అవార్డును జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ ఆయనకు ప్రదానం చేశారు. ఈ గౌరవం పట్ల కింగ్‌స్టన్‌లోని భారత రాయబార కార్యాలయం డాక్టర్ నాగమల్లేశ్వరరావుకు అభినందనలు తెలియజేసింది.

డాక్టర్ నాగమల్లేశ్వరరావు ‘గ్లోబల్ హెల్త్ కేర్ ప్రాక్టీస్’ను స్థాపించి అనేక ఆరోగ్య శిబిరాలు (హెల్త్ క్యాంపులు) నిర్వహించారు. దేశంలోనే అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకునే డాక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యంగా, 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయన కేవలం 500 జమైకా డాలర్లకే వైద్యం అందిస్తున్నారు.

‘వైద్యం అనేది కేవలం శాస్త్రం మాత్రమే కాదు, సేవ కూడా. పరిమిత వనరులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని నేను నమ్ముతాను’ అని ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రజా వైద్యుడిగా తన బాధ్యతలను మరింత పెంచిందని ఆయన ప్రకటించారు. ఆయన నిస్వార్థ సేవ, సమాజానికి ఆయన చేసిన కృషి ఈ ఉన్నత పురస్కారానికి కారణమయ్యాయి.

Show More
Back to top button