CINEMAGREAT PERSONALITIES

తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు యం.యస్. రామారావు…

మోపర్తి సీతారామారావు (07 మార్చి 1921 – 20 ఏప్రిల్ 1992)…

నటులు, నటీమణులు కెమెరా ముందు పాటలు తామే పాడుతున్నట్టు నటిస్తూ పెదవులు కదిలిస్తారు. కానీ వారికి తెరవెనుక గాయకులు పాటలు పాడతారు. దీనినే నేపథ్య గానం అంటారు. తెలుగు చిత్రసీమలో శబ్దచిత్రాలు మొదలైన 1932 కొత్తలో నటీనటులు తమ పాటలను తామే పాడుకునేవారు. రానురాను నేపథ్య గాయకులు వచ్చిన తరువాత నటీనటులు నటనకే పరిమితం అయ్యారు. చిత్రసీమకు కొత్త నటీనటులను, కొత్త గొంతులను పరిచయం చేసే వాహినీ పిక్చర్స్ వారు దేవత (1941) సినిమాలో “ఈ వసంతము నిత్యము కాదో పూవు దొన్నెలో తీయతీయని యవ్వన మధువు నింపినదోయి” అనే పాట ద్వారా మోపర్తి సీతారామారావు (యం.యస్. రామారావు) అనే నేపథ్య గాయకుడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు యం.యస్. రామారావు. 1944 వ సంవత్సరంలో ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో రామారావుతో మొదటిసారిగా “ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా” అనే ఎంకి పాట పాడించారు.

రామారావు శృతిలో స్థిరత్వము, స్థాయిలో అసాంకర్యము ఉండడం వలన ఎవ్వరూ తన నేపథ్య గానాన్ని వేలెత్తి చూపించేవారు కాదు. ఆయన గొంతులో పురుష సంబంధమైన గంభీరనాదం, కొంత నాసా మాధుర్యాన్ని పూతపూసుకొని శ్రవణపేయంగా వినబడుతూ ఉంటుంది. తన గానంలో మాధుర్యాన్ని అతి కోమలత్వం నుండి, బహువిధ గంభీరతుల వరకు మార్చి మార్చి పలికించగల దిట్ట రామారావు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉన్న రామారావు ఏకసంతాగ్రాహి, చిన్నతనం నుండే  పాటలు పాడుతుండేవారు. ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 వ సంవత్సరంలో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన అడవి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని రామారావుకు సలహా ఇవ్వడంతో చదువుకు స్వస్తిచెప్పి మద్రాసు వెళ్లి చలనచిత్ర రంగప్రవేశం చేసి సుమారు ఇరవై సంవత్సరాల పాటు నేపథ్య గాయకుడిగా అనేక పాటలు పాడారు. ఈయన గొంతు ప్రముఖ కథానాయకులు సి.హెచ్.నారాయణ రావుకు సరిపడడంతో ఆయన పాటలన్నీ రామారావు పాడేవారు.

యం.యస్. రామారావు తాను స్వయంగా కర్ణాటక సంగీతం గానీ, హిందూస్థానీ సంగీతం గానీ శాస్త్రీయ పంథాలో కృషి చేయలేదు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము  అనేది యం.యస్. రామారావు సుందరకాండ గా ప్రసిద్ధమైనది. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి దానిని ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. సుందర దాసు అనే బిరుదు గల రామారావు పాడిన హనుమాన్ చాలీసాను రికార్డు చేసి ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారం చేసేవారు. తాజ్ మహల్ కోసం ఆయన వ్రాసిన పాట “ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా” పాటను కొంచెం మార్పులు చేసి తన చివరి పాటగా నీరాజనం చిత్రంలో పాడారు. తొలి ఇరవై సంవత్సరాలు సినిమాలలో నేపథ్య గాయకుడిగా గడిచిన ఆయన సినీజీవితం, తరువాత పది సంవత్సరాలు కళాశాలలో గ్రంథాలయంలో ఉద్యోగిగా, తరువాత పద్దెనిమిది సంవత్సరాలు హనుమాన్ చాలీసా, సుందరకాండ గేయ పారాయణం చేసి తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు మోపర్తి సీతారామారావు.

నేపథ్యం…

మోపర్తి సీతారామారావు (ఎమ్మెస్ రామారావు) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో గల మోపర్రు అనే పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు మోహపర్తి రంగయ్య, మంగమ్మలకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారిలో పెద్దవాడు సీతారామారావు  03 జూలై 1921 నాడు జన్మించారు. ఆయన పెద్ద తమ్ముడు భావనారాయణ (తర్వాత రోజుల్లో అగ్నిమాపక శాఖలో పనిచేశారు), రెండో తమ్ముడు కృష్ణమూర్తి తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. రామారావు చెల్లెలు పేరు సీతమ్మ. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మోపర్రులో పూర్తయ్యాక ఉన్నత పాఠశాల విద్య కోసం మేనమామ ఊరు నిడుబ్రోలు వెళ్లారు. మేనమామ భుజంగరావు చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండేవారు.

మేనమామ ఇంట్లో ఉంటూనే రామారావు ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అయితే పాఠశాల సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు రంగస్థలం నాటకాలలో ఆయనకు అవకాశాలు వచ్చేవి. హరిశ్చంద్రుడు నాటకంలో లోహితాస్యుడు లాంటి పాత్రలు దక్కేవి. ఆయన నాటకాలు వేస్తున్నప్పుడే నాటక సంస్థ వారు పద్యాలు పాడడం నేర్పించారు. ఏకసంతాగ్రహి కావడం వలన సంగీతంలో రాగం, తాళం శాస్త్రీయంగా తెలియకపోయినా కూడా ఏపాట, ఏ పద్యం విన్నా వెంటనే యధాతథంగా ఆయన తన గొంతులో పలికించేవారు. అదే తన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన అనుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఊహించలేదు.  1940 వ సంవత్సరంలో గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరిన రామారావు చుట్టుపక్కల ఎక్కడైనా పాటల పోటీలు జరిగినా ఆయన హాజరయ్యేవారు.

అంతర్ కళాశాల పోటీలో మొదటి బహుమతి అందుకుని…

రామారావు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుండగా 1941 వ సంవత్సరంలో అంతర్ కళాశాల లలిత సంగీత పోటీలు జరిగాయి. ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా ప్రముఖ రచయిత, చిత్రకారుడు, అప్పటికే సినీరంగంలో ఉన్న అడవి బాపిరాజు వచ్చారు. ఆ పోటీలో యం.యస్. రామారావు ప్రథమ బహుమతి అందుకున్నారు. అయితే రామారావు కంఠంలోని విలక్షణత, గంభీర స్వరానికి తేనెలూరే మధుర స్వరానికి మధ్యలో ఉండే ఒక రకమైన మార్ధవం, వింటుంటే ఆహ్లాదం కలిగించే గొంతు అడవి బాపిరాజుకు బాగా నచ్చింది. ఈ లక్షణాలను నిశితంగా పరిశీలించిన అడవి బాపిరాజు ఇరవై ఏళ్ల రామారావును పిలిచి నీ గొంతులో మాధుర్యం అద్భుతంగా వుంది, సినిమాలలో ప్రయత్నిస్తే మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పారు. ఆయన మాటలు విన్న రామారావు కళాశాల చదువులకు వీడ్కోలు పలికి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా మద్రాసుకు వెళ్లిపోయారు. సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న చక్రధరరావు (తెలంగాణ ప్రాంత వాసి) అప్పటికే మద్రాసులో ఉన్నారు. ఆయన రామరావుకు మద్రాసులో ఆశ్రయమిచ్చి ఆయనకు గ్రామ్ ఫోన్ రికార్డులలో పాడే అవకాశం ఇప్పించారు. 

చిత్రరంగ ప్రవేశం…

అప్పటికే గేయ రచయితగా పేరు తెచ్చుకున్న సముద్రాల వ్రాసిన   పాటలు అప్పటికీ ఇంకా చిత్రరంగ ప్రవేశం చేయని సంగీత దర్శకులు సి.ఆర్. సుబ్బరామన్ సంగీత దర్శకత్వంలో రామారావు గ్రామ్ ఫోన్ పాటలుగా పాడారు. “ఉలీలం” అనే పాట ఒకవైపు, “వల్లదంటే కోపమా” అనే పాట మరోవైపు ఉన్నాయి. ఆ పాట పాడేటప్పుడు సముద్రాల పరిచయమైనారు. ఆయనే నాగయ్యకు రామారావును పరిచయం చేశారు. ఆ సమయంలో నాగయ్య వాహినీ వారి దేవత అనే సినిమాలో నటిస్తూ సంగీతం కూడా సమకూరుస్తున్నారు. ఆ సినిమాకు పాటలు వ్రాసినది సముద్రాలనే. “ఈ వసంతము నిత్యము కాదో పూవు దొన్నెలో తీయ తీయని యవ్వన మధువు నింపినదోయి, ఏ గాలి కుదుపునకు తరలి వణుకునో తాగవోయి మధుపాయి పోయిన మరి రాదో, పూలదొన్నెలో యవ్వన మధుపాయి హాయిగా తాగవోయి మధుపాయి పోయిన మరి రాదోయి” అనే పాటలో యం.యస్.రామారావు స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పాట పాడిన సమయానికి ఆయన వయసు సరిగ్గా ఇరవై సంవత్సరాలు మాత్రమే. నేపథ్యానం అప్పుడప్పుడే చలనచిత్రాల్లోకి ప్రవేశిస్తున్న తరుణం అది. దేవత సినిమా తరువాత రామారావుకు అవకాశాలు రాలేదు.

వివాహం తరువాత పెరిగిన అవకాశాలు…

యం.యస్. రామారావు ఊరు మోపర్రు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగిపురం అనే ఊరుకు చెందిన వీరభద్ర కవి కూతురు లక్ష్మీ సామ్రాజ్యం అనే అమ్మాయితో 1942 లో రామారావు పెళ్లి జరిపించారు. అప్పటికీ లక్ష్మీ సామ్రాజ్యం వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. వివాహం తరువాత ఆమెను వంగిపురంలో అమ్మానాన్నల వద్ద వదిలేసి సినిమా అవకాశాల కోసం మళ్లీ మద్రాసుకు చేరుకున్నారు రామారావు. కొన్ని రోజులు ఆయన సినిమా అవకాశాల కోసం బొంబాయి కూడా వెళ్లారు. కానీ అక్కడ భాషా సమస్య వలన తిరిగి వెనక్కి మద్రాసుకే రావలసి వచ్చింది. 1944 వ సంవత్సరంలో తాసిల్దార్ చిత్రం కోసం “ఈ రేయి నన్నొలనేరవా రాజా యెన్నెలల సొగసంతా” అనే యెంకి పాట పాడారు.

నండూరి సుబ్బారావు వ్రాసిన ఈ పాట తెలుగు సినిమాలో ఉపయోగించిన తొలి ఎంకి పాట. ఈ పాట పాడడం ద్వారా యం.యస్. రామారావు నేపథ్య గాయకుడిగా సినీ ప్రపంచానికి తెలిశారు. ఆ సినిమాలో ఒక పాత్రలో కూడా నటించిన రామారావు, ఆ సినిమాలో పడవ నడిపే సారంగి వేషంలో నటించారు. “ఈ రేయి నన్నొలనేరవా రాజా యెన్నెలల సొగసంతా” అంటూ తాను పాడిన పాటను తన మీదనే చిత్రీకరించారు. తాసిల్దార్ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శక, నిర్మాత వై.వి.రావు ఇంట్లోనే రామారావు కొన్నాళ్లు ఉన్నారు. తాసిల్దార్ సినిమా నుండి రామారావుకు నేపథ్య గానంలో అవకాశాలు బాగా వచ్చాయి. గృహప్రవేశం (1946) చిత్రం కోసం ఎల్వి ప్రసాద్ కు పాడిన “హాలహలమెగయునో మధురామృతమె కురియునో”, ద్రోహి (1948) చిత్రంలో జి.వరలక్ష్మి తో కలిసి పాడిన “మా ప్రేమయే కదా సదా విలాసి”, వై.వి.రావు నిర్మించిన “లవంగి” (1946), “రామదాసు” (1948) చిత్రాల్లోని పాటలు రామారావు తొలివిడత నేపథ్య గానంలో పాడిన పాటలు.

పల్లెపడుచు (1954) చిత్రానికి సంగీత దర్శకత్వం…

ఆ రోజుల్లో ప్రముఖ హీరో సి.హెచ్.నారాయణరావు గొంతుకు యం.యస్. రామారావు గొంతు దగ్గరగా ఉండేది. అక్కినేని, నందమూరి తారకరామారావు లకు ఘంటసాల పాడినట్లుగా 1947 – 48 ప్రాంతాలలో కథానాయకులు సి.హెచ్.నారాయణ రావుకు యం.యస్. రామారావు ఎక్కువ పాటలు పాడారు. మనదేశం సినిమాలో గాయని కృష్ణవేణితో కలిసి “చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో”, “ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం” అనే రెండు యుగళగీతాలు పాడారు. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించిన లక్ష్మమ్మ (1950) చిత్రంలో “ఊయల ఊపనా సఖీ ఊయల ఊపనా సఖీ” అనే యుగళగీతం, “ఏల విషాదము నాకేల రాదు మోదము” అనే పాట రామారావుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అగ్నిపరీక్ష (1951) సినిమాకి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన రామారావు, ఆ సినిమాలో “బీదలము బాబు పేదలము నిరుపేదలము” పాటను వ్రాసి సినిమాలో పాడారు. దీక్ష (1951) సినిమాలో ఆచార్య ఆత్రేయ వ్రాసిన మొట్టమొదటి పాట “పోరా బాబు పో పోయి చూడు ఈ లోకం పోకడ” అనే పాట యం.యస్. రామారావు పాడారు. పల్లె పడుచు (1954) చిత్రానికి సంగీత దర్శకత్వం చేసిన రామారావు, ఆ సినిమాలో “ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు” అనే యుగళగీతాన్ని కూడా వ్రాశారు.

గాయకుడిగా అవకాశాలు తగ్గుముఖం…

పాండురంగ మహత్యం (1957) సినిమాలో సాధువుగా వేశం వేసి “ఓహ్ దారి కనాని ” అనే పాటను తానే పాడుకున్నారు. సీతారామ కళ్యాణం సినిమాలో లంకాపురి వర్ణన పాడింది కూడా యం.యస్. రామారావునే. 1950 – 1960 దశాబ్దాలలో ఆయన వందలాది పాటలు పాడారు. అవే సంవత్సరాలలో అనేక గ్రామ్ ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు. వాటిల్లో కొన్ని పాటలు రామారావు వ్రాసుకున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన గ్రామ ఫోన్ రికార్డు పాట “ఈ విశాల ప్రశాంత ఏకాంత భవనంబులో”. ఇదే పాటను తరువాత రోజులలో కొద్ది మార్పులతో “నీరాజనం” చిత్రంలో ఉపయోగించారు. రామారావు గ్రామ ఫోన్ రికార్డులు, సినిమాలకు సంగీతం సమకూర్చడమే కాకుండా రంగస్థలం నాటకాల్లో కూడా వేషాలు వేసి పాటలు పాడి సంగీతం సమకూర్చారు.  ఆయన నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు నాటకంలో, జే.వి. రమణమూర్తితో కలిసి కాటమరాజు నాటక ప్రదర్శనలో కొద్దికాలం పాల్గొన్నారు. అదేవిధంగా 1963 వ సంవత్సరంలో తొలిసారి “రమతే రాధిక కృష్ణ” అనే భక్తి గీతాలను ప్రైవేట్ రికార్డు ఇచ్చారు. 1960 వ సంవత్సరం వచ్చేసరికి తెలుగు చలనచిత్రపరిశ్రమలో పెను మార్పులు వచ్చాయి. కథానాయకులు సి.హెచ్.నారాయణ రావుకు అవకాశాలు తగ్గాయి. గాయకులు ఘంటసాల శకం మొదలైంది. యం.యస్. రామారావు స్వరం కొత్త తరం నటీనటులకు సరిపడలేదు.

“నవభారతి గురుకులం” లో ఉద్యోగంలో చేరి…

తెలుగు చిత్రపరిశ్రమలో మారిన పరిస్థితుల నేపథ్యంలో యం.యస్.రామారావు పాడిన ఆఖరు పాట 1960 వ సంవత్సరంలో విడుదలైన చివరికి మిగిలేది చిత్రంలోని “చెంగున అలమీద మిడిసిపోతది మేను చినవాడు ఎదురైతే” పాట. 1960 తరువాత ఆయనకు సినిమాలలో అవకాశాలు బాగా తగ్గాయి. అప్పటికి యం.యస్. రామారావుకు ముగ్గురు సంతానం. సరోజినికి 15 ఏళ్లు, బాబురావుకి 12 ఏళ్లు, నాగేశ్వరరావుకు ఏడేళ్లు. అప్పటికి ఇంకా రామారావు మద్రాసులో అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఆశ వదులుకోకుండా ఆయన మద్రాసులోనే కొనసాగారు. అవకాశాలు తగ్గడంతో తెలిసిన వారి సిఫారసుతో వైద్య ప్రతినిధి (మెడికల్ రిప్రజెంటేటివ్) గా పని చేశారు. అప్పటికే ఆయన పేరు మీద నేపథ్య గాయకులు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేవారు. ఆయన మందుల గురించి వివరించడానికి వెళితే ఆయనను గుర్తుపట్టి ముందే సానుభూతి చూపించేవారు. అందులో కూడా సంవత్సరం మించి కొనసాగలేకపోయారు.

చేసేది లేక 1963 వ సంవత్సరంలో తన కుటుంబంతో సహా మోపర్రు వచ్చేశారు. ఆయన చిన్న తమ్ముడు కృష్ణమూర్తి తెలుగు ఉపాధ్యాయులుగా రాజమండ్రిలో పనిచేసేవారు. ఆయన పనిచేసే కళాశాల పేరు “నవభారతి గురుకులం”. 1924 వ సంవత్సరంలో గురుకుల పాఠశాల లాంటిది. ఆ గురుకులంలో ఎనిమిది వందల మంది చదువుకుంటుంటే ఆరు వందల మంది విద్యార్థులు కళాశాల ఆవరణలోనే నివాసం ఉండేవారు. దాని వ్యవస్థాపకులు తన్నీరు బుల్లయ్య సంగీత ప్రియులు. రామారావు పాటలను ఆయన రేడియోలో వింటూ ఉండేవారు. అప్పుడప్పుడు కృష్ణమూర్తిని తన అన్నయ్య రామారావు క్షేమ సమాచారం అడిగి తెలుసుకుని ఖాళీగా ఉండకుండా రామారావుకు డిగ్రీ లేకున్నా ఆయనకు 1964 లో గ్రంధాలయం అధికారి, సంగీతం మాస్టారు, వార్డెన్ గా ఉద్యోగం ఇచ్చారు. దాంతో రామారావు కాపురాన్ని రాజమండ్రికి మార్చారు.

హనుమాన్ చాలీసాను గేయ రూపంలో వ్రాసి…

20 సంవత్సరాల జిలుగు వెలుగుల సంగీతంలో ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చిన యం.యస్.రామారావు సుమారు పదేళ్లపాటు మామూలు ఉద్యోగం చేయడం అంటే తనకు ఎంతో మానసిక సంసిద్ధత ఉండాలి. అలాంటి స్థితప్రజ్ఞత యం.యస్.రామారావు భవిష్యత్తుకు సహాయం చేసింది. ఆయన పిల్లలు రాజమండ్రిలోనే విద్యాభ్యాసం కొనసాగించారు. అలా దాదాపు ఏడేళ్లు ఆవిధంగా గడిచిపోయాయి. అమ్మాయికి వివాహం చేశారు. పెద్దబ్బాయి బాబురావుకు డిగ్రీ చదువుతుండగానే ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం వచ్చింది. చిన్నబ్బాయి ఇంకా అప్పటికి ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. 1971 వ సంవత్సరంలో రాజమండ్రిలో రఘువరదాస్ అనే శ్రీరామ భక్తులు రామనామ సప్తాహం నిర్వహించారు.

వందలాది భక్తులతో “హరే రామ హరే రామ హరే రామ హరే హరే” అనే పారాయణాన్ని రోజుల తరబడి పారాయణం చేయించారు. ఆ కార్యక్రమాన్ని కళ్లారా చూసిన రామారావుకు భక్తులు రామ రామ హరే హరే అనేకంటే రామాయణాన్ని గేయ రూపంలో పాడితే ఇంకా బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. 1971 లో భారత్ – పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. ఎయిర్ ఫోర్సులో ఉన్న బాబురావు నుండి సమాచారం సరిగ్గా వచ్చేది కాదు. నెలల తరబడి ఎక్కడ ఉన్నాడో తెలిసేది కాదు. ఎప్పుడో ఉత్తరం వస్తే అబ్బాయి క్షేమంగా ఉన్నాడని ఊపిరి పీల్చుకునేవారు. అలాంటి స్థితిలో గేయ రూపంలో రామాయణాన్ని రాద్దామని ఆలోచిస్తుండగా దానికంటే ముందు వాయు పుత్రుడు ఆంజనేయుని గురించి పారాయణం చేయడానికి వీలుగా హనుమాన్ చాలీసాను గేయ రూపంలో వ్రాయడం మొదలుపెట్టారు.

రామాయణాన్ని గేయరూపంలో వ్రాసిన రామారావు…

ఈ రోజుల్లో ఆంజనేయ భక్తుల ఇళ్లలో ప్రతినిత్యం వినిపిస్తున్న తెలుగు హనుమాన్ చాలీసా 1972 వ సంవత్సరంలో యం.యస్. రామారావు కలం నుండి వెలువడినదే. ఆయనకు పాటలు  వ్రాయడంలో, పాటలు స్వరకల్పనలో, గానంలో అప్పటికే మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అందువలన రామారావుకు హనుమాన్ చాలీసా రచన, స్వర కల్పన ఆయనకు ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. దానిని తెనాలిలోని సాధన గ్రంథం మండలి వాళ్ళు పుస్తక రూపంలో తీసుకువచ్చారు. హనుమాన్ చాలీసా రచించిన ఆత్మవిశ్వాసంతో ముందుగా అనుకున్న రామాయణాన్ని గేయరూపంలో వ్రాయడం ప్రారంభించారు రామారావు. అది 1973 – 1974 సంవత్సరాలలో సుందరకాండతో  అది పూర్తయింది. అలా ఆయన సంగీత జీవిత ద్వితీయ దశ మొదట్లో వ్రాసిన హనుమాన్ చాలీసా, సుందరకాండ రెండు ఆయన చిరకాల చిరునామా అవుతాయని  ఆయన కూడా అనుకొని ఉండరు. ఆ రెండు గేయరూపంలో వ్రాస్తున్న రోజులలో రాజమండ్రిలోని మల్లవరపు విశ్వేశ్వరరావుకి వినిపిస్తూ వరుస సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఆయన ఎలాంటి అంచనాలు లేకుండా వ్రాసిన భక్తి గేయ స్రవంతి రామారావును సంగీత జీవితంలో తరువాత దశకు నడిపించాయి.

బహిరంగ సభలో సుందరకాండ గేయ రూపం…

మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో జరిగినప్పుడు దాంట్లో రామారావు గారి లలిత గేయ సంగీత కచేరి ఏర్పాటు చేశారు ప్రముఖ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి. అంతవరకు తెలుగు వారందరికీ తెలిసిన గ్రామ్ ఫోన్ రికార్థుల రూపంలో ఉన్న పాటలను, రామారావు తన పాటలను తానే పాడుకున్నారు రామారావు. అప్పటికే రామారావు అభిమాని అయిన గుడిపూడి శ్రీహరి ఆ కార్యక్రమానికి హాజరైన, హైదరాబాదులో పూర్తిస్థాయి కచేరి ఏర్పాటు చేయాలనిపించింది. రాజమండ్రిలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి శ్రీహరి వెళ్ళినప్పుడు యం.యస్. రామారావును కలుసుకున్నారు. ఆయన ఆహ్వానం మీద హైదరాబాదుకు వచ్చారు రామారావు. ఆయన మూడు నెలల పాటు గుడిపూడి శ్రీహరి ఇంట్లోనే ఉన్నారు. ముందుగా రామారావుతో లలిత సంగీత కచేరి ఏర్పాటు చేశారు. అప్పటికి ఇంకా సుందరకాండ కచేరి అనుకోలేదు. మామూలు పాటలు అన్నీ పాడిన తరువాత చివర్లో ఆయన ఇటీవల వ్రాసిన సుందరకాండ అనే గేయం నుండి కొన్ని పాటలను రామారావు పాడారు. బహిరంగ సభలో సుందరకాండ గానం చేయడం ఆయనకు అదే మొదటిసారి. హాజరైన శ్రోతలకు అంతకుముందు ఆయన పాడిన లలిత గీతాల కంటే ఈ సుందరకాండ బాగుంది అనిపించింది. రామాయణాన్ని అందులోనూ సుందరకాండను సరళమైన రూపంలో వినడం హాజరైన శ్రోతలకు కొత్త అనుభూతిని కలిగించింది. 

రాజమండ్రి నుండి హైదరాబాదుకు మకాం మార్చి…

అయితే లలిత సంగీత కచేరిలో ఆరోజు ప్రధాన కార్యక్రమంలో పది నిమిషాలు సాగిన సుందరకాండ గానానికి శ్రోతల స్పందన చూసిన గుడిపూడి శ్రీహరి మరికొందరు కళాభిమానులతో మాట్లాడి త్యాగరాయ గానసభలో యం.యస్.రామారావు సుందరకాండ సంపూర్ణ గాన కచేరిని వరుసగా వారం రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఆ సభకు తొలిరోజు 50 మంది, రెండో రోజు 200 మంది, మూడు, నాలుగు రోజులు వచ్చేసరికి హాలు కిక్కిరిసిపోయి శ్రోతలు నిలబడి కూడా విన్నారు. అదే రామారావు సుందరకాండను పూర్తి గానం చేసిన సందర్భం. తదుపరి కార్యక్రమం రామకృష్ణ మఠంలో ఏర్పాటు చేశారు. ఆ రోజు నుండి యం.యస్. రామారావు తన తుది శ్వాస వదిలే చివరి క్షణం దాకా సుందరకాండతో పాటు సంపూర్ణ రామాయణం గాన కచేరిలే తన పూర్తికాల జ్ఞాపకాలయ్యాయి. సుందరకాండ గేయం 19 75 వ సంవత్సరంలో పుస్తక రూపంలో వచ్చింది. దాని తరువాత వరుసగా మిగతా కాండలు కూడా తనదైన శైలిలో గేయరూపంలో వ్రాసి రామారావు గానం చేశారు. ఆయనకు వరుసగా గాన కచేరీలు అవకాశాలు రావడంతో తన కుటుంబాన్ని రాజమండ్రి నుండి హైదరాబాదుకు మార్చారు. చిక్కడపల్లిలో తన బంధువు అశోక్ కుమార్ ఇంట్లోనే రామారావు ఉన్నారు. త్యాగరాయ గాన సభ దగ్గరలోనే ఆయన డాక్టర్ రామకృష్ణారావు సగం కట్టి వదిలేసిన ఇల్లును కొనుక్కున్నారు. మొదటి అంతస్తు కట్టుకొని ఆయన దానిని దశలవారీగా విస్తరించారు.

గ్రామ్ ఫోన్ లో రికార్డు చేసిన హెచ్.యం.వి కంపెనీ…

1975 వ సంవత్సరం నుండి ఆంధ్రదేశంలో రాష్ట్రములో గల దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలో కూడా రామారావు సుందరకాండ పారాయణం సర్వసాధారణం అయిపోయాయి. ఆయన పదేళ్లు కళాశాలలో పనిచేసిన రాజమండ్రిలో కూడా ఆయన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో  ఏర్పాటు చేశారు. గుడిపూడి శ్రీహరి చొరవతోనే ఆకాశవాణి హైదరాబాదులో రికార్డు చేసి రోజు పొద్దున్నే భక్తిరంజని కార్యక్రమంలో వినిపిస్తూ ఉండేవారు. అలా దశలవారీగా రామారావు ఖ్యాతి ఆంధ్రదేశమంతట ఎల్లలు దాటింది.ఢిల్లీ, కలకత్తా, బెంగుళూరు, మద్రాసు లాంటి నగరాల్లో ప్రవాసాంధ్రులు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లండన్ లో ఉన్న ప్రవాసాంధ్రులకు కూడా రామారావు తన  రామాయణ గాన మాధుర్యాన్ని పంచిపెట్టారు. ఆయన కార్యక్రమాలకు వస్తున్న అశేష ఆదరణ చూసి హెచ్.ఎం.వి కంపెనీ వాళ్ళు రామారావును మద్రాసుకు పిలిపించి హనుమాన్ చాలీసా, సుందరకాండ రెండింటిని గ్రామ ఫోన్ రికార్డులకు విడుదల చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో సుందరకాండ ప్రతిధ్వనించడం సర్వసాధారణమైపోయింది.

గుండెపోటుతో మరణం…

1977లో బాట్టం శ్రీరామమూర్తి గారి సమక్షంలో యం.యస్.రామారావుకు సుందరదాసు అనే బిరుదును ప్రదానం చేశారు. రామారావు చివరి 18 సంవత్సరాలు వరుస కచేరీలు, మిగిలిన గేయ రచనలతో తీరిక లేకుండా గడిచాయి. 1977 వ సంవత్సరంలో “రామాంజనేయ యుద్ధం” సినిమాలో “శరణం నీవే శ్రీరామ” అనే భక్తి గీతం పాడారు. 1989లో అశోక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన “నీరాజనం” చిత్రం కోసం బొంబాయి వెళ్లి ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వంలో “ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు” అనే పాటను చిన్న చిన్న మార్పులతో పాడారు రామారావు. ఇదే ఆయన చివరి పాట. అయితే 20 ఏళ్ల సినీ నేపథ్య గాన జీవితానికి పూర్తిగా భిన్నమైన భక్తి గాన జీవితాన్ని సంతృప్తిగా గడిపిన రామారావు గుండెపోటుతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరారు. 20 ఏప్రిల్ 1992 ఉదయం మరొక్కసారి తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచారు.

ఇతర కథనాలు:

ఆధునిక మల్లయోధులు, కలియుగ భీమ కోడి రామ్మూర్తి నాయుడు.

అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని కె.మాలతి.

నృత్య జీవితం, వృత్తి జీవితం సంతులనం చేసిన నాట్యతార యల్.విజయలక్ష్మి

Show More
Back to top button