
ఇప్పుడంటే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, చరవాణిలు, సామజిక మాధ్యమాలు. సినిమాలలో ఒక నటుడు కావాలంటే క్షణాల మీద ఎంతోమంది దరఖాస్తులు పెట్టుకుని, తమ ప్రతిభను చూపించడానికి దర్శక, నిర్మాతల ముందు నటించి చూపిస్తే, దర్శక నిర్మాతలు వారిలో ఏరి కోరి మంచి ప్రతిభ చూపిన వారిని నటీనటులుగా ఎంపిక చేసుకుంటున్నారు. కానీ తెలుగు సినిమా మాటలు నేర్చిన తొలినాళ్ళలో నటీనటులను వెతకడం కష్టం అయ్యేది. నాటకాలలో నటించే వారినే ఎక్కువగా నటీనటులుగా ఎంచుకునేవారు. దానికోసం ఆంధ్ర దేశంలో ఎక్కడ నాటక పోటీలు జరుగుతున్నా దర్శక, నిర్మాతలు వెళ్లి వాళ్లలో మంచి నటులను వెతుక్కుంటూ వుండేవారు. అప్పటికీ చిన్న పిల్లలు ఇంకా నాటకాలలో నటించడం తక్కువగా ఉన్న ఆ రోజులలో బాల నటులను ఎంపిక చేసుకోవడం కూడా కష్టమయ్యేది. అలాంటి సమయంలో వార్త పత్రికలలో ఇచ్చిన ప్రకటన ద్వారా, తెలిసిన బంధువుల ద్వారా, ఎరిగిన మిత్రుల ద్వారా బాల నటులను ఎంచుకునేవారు. అలా ఎంచుకున్న బాల నటులలో ఒకరు మాస్టర్ విశ్వం.
మాస్టర్ విశ్వం అలియాస్ ఉప్పాల విశ్వనాథ్. ఈయన గురించి చెప్పాలంటే రెండు సంవత్సరాలు, నాలుగు సినిమాలు, పేరు మోసిన నిర్మాణ సంస్థలు, హేమాహేమీ నటీనటులు. బాల నటుడిగా సూపర్ స్టార్ ప్రాచుర్యం. కన్నాంబ, వేమూరి గగ్గయ్య, బళ్లారి రాఘవ, లలితాదేవి, ఆర్.నాగేంద్రరావు, ఎం.వి. సుబ్బయ్యనాయుడు, సురభి కమలాబాయి, పువ్వుల సూరిబాబు, బెజవాడ రాజరత్నం, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, టి.జి. కమలాదేవి, కమలా కొట్నిస్, పుష్పవల్లి లాంటి అగ్ర నటీనటులతో అభినయించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు మాస్టర్ విశ్వం. నటించింది కేవలం నాలుగే సినిమాలు “చండికా” (1940), “భూకైలాస్” (1940), జీవన్ ముక్తి (1942), బాల నాగమ్మ (1942). ఆయినా బాల నటుడిగా సూపర్ స్టార్ వైభవం కొనసాగింది.
మాస్టర్ విశ్వం మంచి చిత్రకారులు, ఆయన సినిమాలలో నటించడం మానేసిన తర్వాత బొమ్మలను గీసి అమ్మేవారు. 1949 వ సంవత్సరం నల్గొండలో జరుగుతున్న ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బొమ్మ గీసి, 26 మార్చి 1949 నాడు నిజాం రాజు చేతులమీదుగా బంగారు పతకాన్ని బహుమతిగా అందుకున్నారు మాస్టర్ విశ్వం. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఎం. ఎ. పూర్తి చేసి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశారు మాస్టర్ విశ్వం. చిన్నపుడు తండ్రి నేర్పించిన సంగీతాన్ని అలాగే కొనసాగించిన ఆయన కొన్ని పాటలను కూడా స్వరపరిచారు. అప్పుడప్పుడు ఆయనకు ఆల్ ఇండియా రేడియో ద్వారా పాటలు పాడే అవకాశం వచ్చేది. ఆ అవకాశాన్ని వదులుకోకుండా పాటలు పాడేవారు మాస్టర్ విశ్వం. హైదరాబాద్ నగరంలోని ఆకాశవాణి కేంద్రంలో సి.నారాయణ రెడ్డి, దాశరథి రచించిన పాటలను పాడేవారు. అప్పటి భారతదేశ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ముందు పాటల ప్రదర్శన ఇచ్చి బహుమతి కూడా అందుకున్నారు మాస్టర్ విశ్వం. ఆ విధంగా మాస్టర్ విశ్వం రేడియో గాయకుడిగా కూడా మంచి కీర్తిని పొందారు మాస్టర్ విశ్వం.
“అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని” అని మనసు కవి ఆత్రేయ చెప్పినట్లు ఎవ్వరూ ఊహించని విధంగా నాలుగు సినిమాల తరువాత చలనచిత్ర సీమకు స్వస్తి చెప్పి, తండ్రి మాటకు కట్టుబడ్డ రాముడిలా తాను కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను దాటుకుని ఉపాధ్యాయుడి వృత్తి స్వీకరించి నిజ జీవితంలో కూడా మాస్టర్ విశ్వం అయ్యారు ఉప్పాల విశ్వనాథ్. ఒకవైపు సినిమాలలో బాల నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దశ ఒకటయితే, మరోవైపు సినిమా రంగానికి పూర్తిగా దూరమై వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి, వెన్నుచూపని ధీరత్వంతో నిలిచి, తండ్రి వదిలి వెళ్ళిన బాధ్యతలను నెరవేరుస్తూనే తనలోని కలను సజీవంగా నిలుపుకుంటూ డిగ్రీలు పూర్తి చేసి, పదోన్నతులు సాధించి, ఏ కోణం నుండి చూసినా ఎన్నో స్ఫూర్తి పాఠాలు తన సంతానానికి మరియు తన శిష్యులకు అందించిన పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వారు మాస్టర్ విశ్వం.
జీవిత విశేషాలు…
జన్మనామం : ఉప్పాల విశ్వనాథ్
ఇతర పేర్లు : మాస్టర్ విశ్వం
జననం : 07 జనవరి 1932
స్వస్థలం : జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి : నటులు, ఉపాధ్యాయులు
తండ్రి : ఉప్పాల పుల్లయ్య
తల్లి : కనకరత్నం
పిల్లలు : శ్రీనివాసరావు, సూర్య కుమారి, సంధ్యా రాణి, నిర్మలా దేవి.
మరణం : 08 ఏప్రిల్ 2006
నేపథ్యం…
మాస్టర్ విశ్వంగా ప్రసిద్ధికెక్కిన ఉప్పల విశ్వనాథం 07 జనవరి 1932 నాడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. తండ్రి ఉప్పల పుల్లయ్య, తల్లి కనక రత్నం. ఉప్పల పుల్లయ్య వృత్తి రీత్యా వ్యాపారవేత్త. పుల్లయ్య, కనకరత్నం దంపతులకు నలుగురు సంతానం. వాళ్లలో పెద్దబ్బాయి మాస్టర్ విశ్వం. ఈయన అసలు పేరు ఉప్పల విశ్వనాథం. వ్యాపారవేత్తగా ఉన్న ఉప్పల పుల్లయ్య కు నల్లగొండలో రెండు, సూర్యాపేటలో ఒకటి, భువనగిరిలో ఒకటి ఇలా లక్ష్మీ విలాస్ హోటళ్ళ సముదాయం ఉండేది. వాటిని నిర్వహిస్తూ ఉండేవారు పుల్లయ్య. అవే కాకుండా వాటితో పాటు షేర్ మార్కెట్ లలో పెట్టుబడులు పెడుతూండేవారు. మల్లెపూల తోటలు అద్దెకు తీసుకొని వాటిని ఆజామాయిషీ చేస్తుండేవారు.
ఇన్ని రకాల వ్యాపకాలు ఉండడం వలన కాబోలు తమ కుటుంబాన్ని జగ్గయ్యపేటలోనే ఉంచేసి, తాను మాత్రం ఊరూరా తిరుగుతూ ఉండేవారు. దాంతో నల్లగొండలో ఒక అద్దె ఇల్లు తీసుకుని అక్కడ ఉండేవారు. పుల్లయ్య ఇంత తీరికలేని వ్యాపారవేత్త అయినప్పటికీ ఆయనకు సంగీతం అంటే విపరీతమైన అభిమానం, సంగీతం అంటే ఎనలేని ప్రేమ. ఆ అభిమానం, ప్రేమతో సంగీతం తనకి వంటబట్టకపోయినా, తన కొడుకుకైనా సంగీతం నేర్పించాలని పట్టుబట్టి, మందపాటి వెంకట్రాజు అనే సంగీత విద్వాంసుడి దగ్గర సంగీతం నేర్పించారు. మందపాటి వెంకటరాజు ఆ తరువాత రోజులలో స్వర్ణగౌరీ (1962) అనే కన్నడ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆయన వద్ద విశ్వం హార్మోనియం వాయించడం కూడా నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం రెండింటినీ అభ్యసించారు. అలాగే వారి వద్ద త్యాగరాయ కృతులు కూడా నేర్చుకున్నారు మాస్టర్ విశ్వం.
ఎనిమిదేండ్లకే హార్మోనియంలో అనుభవం…
మందపాటి వెంకటరాజు శిక్షణలో మాస్టర్ విశ్వం ఎనిమిది సంవత్సరాల వయస్సుకే సంగీత సాధనలో తనను తాను నిరూపించుకున్నారు. కర్ణాటక, హిందుస్తానీ సంగీత బాణీలతో పాటు హార్మోనియం కూడా వాయించడంలో అనుభవం సంపాదించుకున్న విశ్వం ఎనిమిది యేండ్ల వయస్సులో వీధుల వెంబడి పాడుకుంటూ వెళుతుంటే, అది విని జనం చక్కగా పాడుతున్నావు, అందమైన ముఖం, ఉంగరాల జుట్టు కలిగి చాలా బాగా మాట్లాడుతున్నావు, సినిమాలో చేరవచ్చు కదా అని పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. కానీ ఏం చేయాల్సి వచ్చినా తండ్రి చేయాలి. ఎందుకంటే తాను చిన్న పిల్లవాడు కాబట్టి. అప్పుడప్పుడే మాటలు నేర్చిన తెలుగు సినిమాల వేగం పుంజుకుంటున్న సమయం, సంవత్సరానికి పది చిత్రాలు నిర్మాణం జరిగేవి. అక్కడక్కడా బాల నటుల చేత సినిమాలు కూడా నటింపజేస్తున్న ఆ రోజులలో సినిమాలో నటించడానికి మంచి రూపంతో బాటుగా సంగీతం కూడా వచ్చి ఉన్న విశ్వంకు అవకాశం వెతుక్కుంటూ రానే వచ్చింది.
చలన చిత్ర రంగం ప్రవేశం…
విజయవాడలో సరస్వతీ బుక్ డిపోకు యజమాని కురుకూరి సుబ్బారావు తన మిత్రుడు పారేపల్లి శేషయ్యతో కలిసి సరస్వతి టాకీస్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి తొలిప్రయత్నంగా “ద్రౌపది వస్త్రాపహరణం” చిత్రాన్ని హెచ్.ఎం.రెడ్డి బావమరిది హెచ్.వి.బాబు దర్శకత్వంలో కన్నాంబ, యడవల్లి సూర్యనారాయణ, చిలకలపూడి సీతా రామ ఆంజనేయులు, నెల్లూరు నాగరాజ రావు, వేమూరి గగ్గయ్య మొదలగు తారాగణంతో నిర్మించి ఘనవిజయం సాధించారు. అదే బ్యానరుపై హెచ్.వి.బాబు దర్శకత్వంలోనే సరస్వతి టాకీసు వారే తమ రెండో సినిమాగా పసుపులేటి కన్నాంబ,
దొమ్మేటి సూర్యనారాయణ, పి.సూరిబాబు మొదలగు తారలతో కనకతార (1937) ను నిర్మించి విడుదల చేశారు.
కనకతార సినిమా కూడా ఘనవిజయం సాధించింది. దాంతో బెజవాడలో ఉండే కొందరు ఔత్సాహికులు అంతా కలిసి “భవాని పిక్చర్స్” అనే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి కురుకూరి సుబ్బారావును సహయకులుగా ఉండాల్సిందిగా కోరారు. అందుకు అంగీకరించిన కురుకూరి సుబ్బారావుకు అప్పటికే రెండు చిత్రాలు నిర్మించిన అనుభవం ఉండడంతో ఆయన ఆధ్వర్యంలో “శ్రీ భవాని పిక్చర్స్” వారు రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ ను దర్శకుడిగా ఎంచుకుని నిర్మించిన చిత్రం “చండిక” (1940). ఆర్.ఎస్.ప్రకాష్ కు దర్శకుడిగా అది తొలిచిత్రం. అందులో కన్నాంబ, వేమూరి గగ్గయ్య, బళ్లారి రాఘవ, లలితాదేవి, పెద్దాపురం రాజు, అరణి సత్యనారాయణ, పువ్వుల రత్నమాల తదితరులు నటించారు.
తొలి సినిమా చండిక (1940)…
చండిక పాత్రలో కన్నంబ, ఆమె భర్తగా నటించినది పువ్వుల చంద్రమౌళీశ్వరరావు, గిరిరాజు గా వేమూరి గగ్గయ్య, వీరమల్లు గా బళ్లారి రాఘవ నటించారు. బాలరాజు, విజయేంద్రుడు పాత్రలలో నటించడానికి బాల నటులు కావాలి. వారికోసం అన్వేషిస్తూ పేపరులో ప్రకటనలు వెలువరించారు. విజయవాడలో మిత్రులు కురుకూరి సుబ్బారావును కలుసుకున్న సమయంలో పుల్లయ్యతో చండిక సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు కురుకూరి సుబ్బారావు. ఆ సందర్భంలో చండిక సినిమాలో నటించేందుకు బాల నటులు కావాలి మీకు తెలిసిన వారు ఉంటే చెప్పండి అని ఆయన పుల్లయ్యతో చెప్పారు.
అప్పుడు పుల్లయ్య మా అబ్బాయి ఉన్నాడు, తాను చక్కగా సరిపోతాడు అని కురుకూరి సుబ్బారావుతో చెప్పారు. దాంతో వాళ్ళ అబ్బాయి విశ్వంను విజయవాడ పిలిపించి ఫోటోలు తీయించారు. మద్రాసు వెళ్ళి దర్శకుడితో మాట్లాడి ఏ విషయమైంది చెబుతాను అన్నారు. అప్పటికే పత్రిక ప్రకటన చూసి కొంతమంది పంపించిన ఫోటోలను ఆర్.ఎస్. ప్రకాష్ పరిశీలించి వి. వెంకట సుబ్బారావు అనే కుర్రాడిని రాజేంద్రుడు పాత్రలో, అలాగే కురుకూరి సుబ్బారావు విజయవాడ నుండి తెచ్చిన ఫోటోలో ఉన్న మాస్టర్ విశ్వంను విజయేంద్రుడి పాత్రకు ఎంచుకున్నారు.
తొలి చిత్రంలోనే ఎక్కువ నిడివి గల పాత్రలో…
చండిక సినిమాలో సుబ్బారావుతో “ఎవరి కూడు కుడిచి ఎవరి గుడ్డను కట్టి”, “ప్రభువు ఉప్పు పులుసుల వల్ల పెంపైనట్టి” అనే రెండు పద్యాలు, విజయేంద్రుడి వేషం వేసిన విశ్వం చేత “రాచ పుండువునకు రణమందు మృతికన్న” అనే ఒక పద్యాన్ని పాడించారు. పాత్ర నిడివిపరంగా మాస్టర్ విశ్వం పోషించిన పాత్ర సినిమా ముగింపు వరకు ఉంటుంది. 1940 సంవత్సరం ప్రారంభంలో చిత్రీకరణ మొదలైంది. విశ్వం ను తీసుకొని పుల్లయ్య మద్రాసుకు వచ్చాడు. అప్పటి వరకు ఉప్పల విశ్వనాథ్ గా ఉన్న తన పేరును విశ్వం గా కుదించారు. అలాగే బాలనటుడు కనుక మాస్టర్ పేరు తగిలించి మాస్టర్ విశ్వం గా తన పేరును మార్చేశారు.
విశ్వంకు నాటకానుభవం లేదు. కానీ ఆయన ఏక సంతాగ్రాహి, బెరుకు లేకుండా మాట్లాడేవారు అని చండిక చిత్రీకరణలో వారికి తెలిసింది. సంభాషణోచ్ఛారణ కూడా చాలా బావుండడంతో చిత్రీకరణ జరిగినన్ని రోజులు విశ్వంతో నటింపజేయడం సులువైపోయింది. 12 ఏప్రిల్ 1940 లో “చండిక” చిత్రం విడుదలైంది. ఈ సినిమాను ఆద్యంతం తన భుజాల మీద వంటి చేత్తో నిలబెట్టిన కన్నాంబ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. సినిమా విజయవంతం అవ్వడంతో విశ్వం కు బాగా పేరొచ్చింది. తిరిగి జగ్గయ్యపేట వెళ్లకుండా మాస్టర్ విశ్వాన్ని మద్రాసులోనే ఉండేలా చేసింది చండిక (1940).
రెండో చిత్రం భూకైలాస్ (1940)…
చండిక (1940) తరువాత మాస్టర్ విశ్వం నటించిన చిత్రం భూకైలాస్ (1940). సుందరరావు నాదకర్ణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో ఆర్.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి లాంటి వారు కన్నడకు చెందిన వారు కావడం విశేషం. సరస్వతి సినీ ఫిల్మ్స్ నిర్మాణంలో నిర్మాతగా వ్యవహరించిన ఏ.వి.మెయ్యప్పన్ తమిళులు కాగా, దర్శకులు సుందరరావు నాదకర్ణి మరాఠీవారు కావటం మరో విశేషం. ఇందులో నటించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, మాస్టర్ విశ్వం ఇద్దరు మాత్రమే తెలుగు వారు. ఇందులో మాస్టర్ విశ్వం “బాల గణపతి” గా నటించారు. “నడవరే ఆవుల్లారా పొద్దూకిపోయింది పోరే”, “దరియేదో చూచుకోరా మేల్కోరా తరింతువురా” లాంటి పాటలను పాడారు.
రావణుడిగా ఎం.వి.సుబ్బయ్య నాయుడు, నారదుడిగా నటించిన ఆర్. నాగేంద్రరావు లతో మాస్టర్ విశ్వం సంభాషించే సన్నివేశాలు భూకైలాస్ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి. హేమహేమీలైన కన్నడ రంగస్థలం నటులు సుబ్బయ్య నాయుడు, ఆర్.నాగేంద్రరావు సమక్షంలో ఏమాత్రం బెదురు లేకుండా తన పాత్రకు న్యాయం చేకూరుస్తూ సంభాషణలు చెబుతున్న తీరు బాలనటులకు ఏమాత్రం తీసిపోరు. తన అపూర్వ నటనతో తన రెండో సినిమాకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మాస్టర్ విశ్వం. డిసెంబరు లో విడుదలైన భూకైలాస్ (1940) సినిమా అద్భుతమైన విజయం సాధించింది. రెండో సినిమాకే కొడుకుకి ఎనలేని గుర్తింపు రాడంతో తండ్రి పుల్లయ్య ఆనందానికి అవధులు లేవు. చిన్నతనం లోనే కొడుకుకు సంగీతం చెప్పించడం ఎంత ఉపయోగకరమో అభ్యాసాత్మకంగా ఆయనకు అర్థమైంది. మాస్టర్ విశ్వం రెండు సినిమాలు 1940 లోనే విడుదలయ్యాయి.
నిరాశపరిచిన మూడవ చిత్రం “జీవన్ముక్తి” (1942)…
1942 వ సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధ సమయం. మద్రాసులోని సినీ నిర్మాణం కూడా మందకొడిగా సాగుతుండేది. దానికి గల కారణం ముడి ఫిలిం కొరత ఎక్కువగా ఉన్న సమయం. మాస్టర్ విశ్వం నటించిన మూడవ చిత్రం “జీవన్ముక్తి” (1942) చిత్రాన్ని జెమినీ పిక్చర్స్ వారు నిర్మించారు. జెమినీ పిక్చర్స్ బ్యానరులో ఎస్.ఎస్.వాసన్ నిర్మించిన మొదటి సినిమా, అది కూడా తెలుగులోనే నిర్మించారు. ఈ సినిమాకు దర్శకులుగా టి.వి.నీలకంఠం పేరు వేశారు కానీ, నిజానికి తెరవెనుక దర్శకత్వం వహించిన వారు లంక సత్యం. ఇది పౌరాణిక మరియు జానపద ఛాయలున్న చిత్రం. పువ్వుల సూరిబాబు జీవుడు అనే ప్రధాన పాత్రలో నటించగా, సూరిబాబు భార్య సేవగా నటించినది “బెజవాడ రాజరత్నం”.
జీవుడి కొడుకు భావుడి పాత్రలో మాస్టర్ విశ్వం నటించారు. భావుడి పాత్రలో విశ్వం పాడిన పాట “జోడు కొంటారా బాబూ జోడు కొంటారా” పాట రెండు దపాలుగా వస్తుంది. అలాగే మరో పాట “బాలుడే గోపాల బాలుడే మాపాలి దేవుడు” అనే పాటను కూడా విశ్వమే పాడారు. బాల గాయకుడిగా మాస్టర్ విశ్వాన్ని విస్తృతంగా ఉపయోగించుకున్న చిత్రం “జీవన్ముక్తి” దురదృష్టవశాత్తు ఈ సినిమా విజయం సాధించలేదు. విశ్వం నటన, ఆయన పాడిన పాటలు బూడిదలు పోసిన పన్నీరైపోయింది. ఆ తరువాత జెమినీ వాసన్ కసిగా తీసిన సినిమా “బాలనాగమ్మ” (1942) ఇందులో మాస్టర్ విశ్వం బాలవర్ధిని రాజుగా నటించారు. ఇది ఆయన చివరి చిత్రం.
గుర్తింపుతెచ్చిన బాల నాగమ్మ (1942)…
జీవన్ముక్తి (1942) పరాజయం పాలవ్వడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన చిత్రం “బాలనాగమ్మ” (1942). దీనికి దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య. తెలుగు ప్రజలల్లో బాగా పేరుగాంచిన బుర్రకథ “బాలనాగమ్మ”. ఇది జెమిని స్టూడియో వారి రెండవ తెలుగు చిత్రం. ఇందులో బాల నాగమ్మ గా అలనాటి అందాల తార కాంచనమాల, మాయల మరాఠిగా డా. గోవిందరాజుల సుబ్బారావు, మాయల మరాఠి ప్రియురాలు (ఉంపుడుగత్తె) రాణి సంగు గా పుష్పవల్లి , బాలనాగమ్మ భర్త కార్యవర్ధిరాజు గా రాజుగా బందా కనకలింగేశ్వరరావు, బాలవర్ధిరాజు గా మాస్టర్ విశ్వం నటించారు. జీవన్ముక్తి (1942) సినిమాకు తెర వెనుక దర్శకత్వం వహించిన లంకసత్యం ఈ సినిమాలో చాకలి తిప్పడిగా నటించారు. ఈ కథలో బాలవర్ధి రాజు పాత్ర చాలా కీలకమైనది. ఒకరకంగా చెప్పాలంటే హీరో స్థాయి పాత్ర.
చూడడానికి మాస్టర్ విశ్వం బాల నటుడైనా కూడా నటనలో బాగా అనుభవమున్న నటుడు స్థాయి పరిణితి కనబరిచారు. అప్పటికి ఆయన నటించినవి కేవలం మూడే మూడు చిత్రాలైనా, చలనచిత్ర పరిశ్రమకు వచ్చి రెండు సంవత్సరాలే అయినా తాను అద్భుతమైన ప్రతిభతో ఎన్నో ఏళ్ల నటనానుభవం ఉన్న నటుడిగా నటించడం వలన ప్రేక్షకులకు అత్యంత అభిమాన పాత్రులయ్యారు. 17 డిసెంబరు 1942 నాడు బాలనాగమ్మ చిత్రం విడుదలైంది. ఈ సినిమా జెమినీ వారి బాక్సాఫీసును ఓ కుదుపు కుదిపేసింది. కాసులు వరదలై ప్రవహించాయి. ఈ చిత్రం అప్పట్లో అత్యంత ప్రేక్షకాదరణ పొంది జెమిని వారికి చాల పెద్ద మొత్తంలో లాభాలు అందించింది. ఆ లాభాలతో వారు తర్వాత చంద్రలేఖ సినిమా తీశారు. ఈ బాల నాగమ్మ చిత్రానికి ముందు, ఈ చిత్రం తరువాత ఎన్ని బాల నాగమ్మ లు వచ్చినా అన్నింటిని మిన్నగా నిలబడిన స్థాయిలో నిలిచిపోయింది 1942 లో చిత్తజల్లు పుల్లయ్య తెరకెక్కించిన బాల నాగమ్మ.
“బాల నాగమ్మ” (1942) చిత్రమే అఖరు…
బాలనాగమ్మ (1942) సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలో మధ్యలో అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయిన కళాదర్శకులు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు (యస్.వి.యస్. రామారావు) “బాలనాగమ్మ శాంత” సినిమా నిర్మించి జెమినీ వారి బాలనాగమ్మ కంటే నెల రోజుల ముందే విడుదల చేశారు. కానీ “బాలనాగమ్మ శాంత” సినిమా ఘోర పరాజయం పాలయ్యింది. ఇందులో బాలవర్ధిని రాజుగా సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు నటించారు. ఆయన అప్పటికే జెమినీ వారి బాలనాగమ్మ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తూనే, “బాలనాగమ్మ శాంత” లో బాలవర్ధిని రాజుగా నటించడం విశేషం. ఒకవైపు బాలనాగమ్మ (1942) సినిమాలో మాస్టర్ విశ్వానికి పద్యాలు నేర్పుతూనే మరోవైపు, “బాల నాగమ్మ శాంత” లో బాలవర్ధిని రాజుగా సాలూరి రాజేశ్వరరావు నటించారు.
అదేవిధంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన బాల నాగమ్మ (1959) సినిమా లో బాలవర్ధిని రాజు గా మాస్టర్ సత్యనారాయణ, 1985 లో విడుదలైన “బాలనాగమ్మ” లో బాలవర్ధిని రాజుగా మాస్టర్ రాజు నటించారు. అదేవిధంగా ఎనభై లలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన “బాలనాగమ్మ” సినిమాలో బాలవర్ధిని రాజుగా మాస్టర్ రాము నటించారు. వీటిల్లో ఏ సినిమా కూడా 1942లో విడుదలైన “బాలనాగమ్మ” ను అధిగమించకపోవడం, అలాగే మిగతా బాల నటులెవ్వరికీ మాస్టర్ విశ్వం కి వచ్చినంత పేరు రాకపోవడం విశేషం. మాస్టర్ విశ్వం యొక్క ఇంతటి చిత్రరంగ ప్రయాణం “బాల నాగమ్మ” (1942) తోనే ముగిసిపోయింది. ఇదే ఆయన అఖరు చిత్రం. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యేనాటికి రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం తీవ్రతరమైంది. దీంతో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. దాంతో తండ్రి ఉప్పాల పుల్లయ్య తన కుమారుడు మాస్టర్ విశ్వంను తీసుకొని మద్రాసు నుండి జగ్గయ్యపేటకు వచ్చేసారు.
సినిమా అవకాశాలను తిరస్కరించిన తండ్రి…
రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. మళ్ళీ సినిమా నిర్మాణాలు పునః ప్రారంభమయ్యాయి. దర్శకుల నుండి పిలుపులు వచ్చాయి. అదే సమయంలో విశ్వంను సినిమాలకు పంపించి ఉంటే బాగుండేది. కానీ తండ్రి పుల్లయ్య అందుకు తిరస్కరించారు. అందుకు కారణం ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలే. సినిమాలకు వెళితే కొడుకు దూరం అవుతాడని వారు చెప్పేవారు. అది నిజమే అని నమ్మి విశ్వంను సినిమాలకు పంపించకూడదని నిర్ణయించుకున్నారు తండ్రి పుల్లయ్య. పన్నెండేళ్ల వయస్సులో తండ్రిని ఎదిరించే ధైర్యం చేయలేదు మాస్టర్ విశ్వం. 1943 వ సంవత్సరంలో “బాలనాగమ్మ” విజయోత్సవం సిల్వర్ జూబ్లీ జరిపినప్పుడు కబురు పెడితే విశ్వంను తన తండ్రి తీసుకెళ్లలేదు. ఆ వేడుకలో మాస్టర్ విశ్వానికి ఇవ్వాల్సిన వెండి బహుమతిని పోస్టులో పంపించారు.
“సీతారామ జననం” (1944) చిత్రంలో రాముడి పాత్రలో నటించడానికి మాస్టర్ విశ్వానికి పిలుపొచ్చింది. ఘంటసాల బలరామయ్య నుండి విశ్వంకు టెలిగ్రామ్ అందింది. కానీ తండ్రి పుల్లయ్య ఎటువంటి సమాధానం సన్మానం ఇవ్వలేదు. ఆ సమయంలో మాస్టర్ విశ్వం గనుక వెళ్లి ఉంటే శ్రీరాముని పాత్ర అక్కినేని నాగేశ్వరావుని వరించేది కాదు. ఆయన లక్షణుడి పాత్రతో సరిపెట్టుకునేవారు. ప్రతిభా పిక్చర్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య నిర్మాణ దర్శకత్వంలో “ముగ్గురు మరాఠీలు” (1946) చిత్రంలో, అలాగే సారథి ఫిల్మ్స్ పతాకం పై గూడవల్లి రామబ్రహ్మం దర్శక, నిర్మాణం లో “మాయాలోకం” (1945) చిత్రాలలో మాస్టర్ విశ్వాన్ని నటింపజేయడానికి ప్రయత్నించారు. వారు టెలిగ్రామ్ కూడా పంపించారు. కానీ ఉప్పాల పుల్లయ్య నుండి వారికి స్పందన రాలేదు. అందువలన మాస్టర్ విశ్వం వెండితెర జీవితానికి ఇనుప తెర పడింది.
సినిమాలు మన్పించి, బడిలో చేర్పించి…
బాల నాగమ్మ (1942) సినిమా తరువాత మద్రాసు నుండి రాగానే మాస్టర్ విశ్వాన్ని బడిలో చేర్పించారు తండ్రి ఉప్పాల పుల్లయ్య. ఆంధ్ర దేశమంతటా ప్రాచుర్యం పొందిన విశ్వాన్ని గుర్తించి జగ్గయ్యపేట లోని వారు గానీ, బంధువులు గానీ విశ్వంను బాలనాగమ్మ సినిమాకు సంబంధించిన గురించిన ప్రశ్నలు వేస్తూ ఉండేవారు నువ్వు పులితో నిజంగానే పోరాటం చేసావా? భయం వేయలేదా గరుడ పక్షిని ఎలా ఎక్కావు? మర్రిచెట్టు తొర్రలో ఎలా దూరావు? కాంచనమాల నిన్ను ఎలా దగ్గరికి తీసుకున్నారు? అని వారు అడిగిన ప్రశ్నలకు, అలాంటి సన్నివేశాలు ఎలా చిత్రీకరించేవారో ఆయన కూడా వివరంగా సమాధానం చెబుతూ వచ్చారు.
రెండు సంవత్సరాలు, నాలుగు సినిమాలు, అవి తెచ్చి పెట్టిన విజయాలు, పత్రికలలో ప్రకటనలు అలాగే నిలిచిపోయాయి. విశ్వానికి అవకాశాలు ఇచ్చిన జెమిని వాసన్, ఏ.వి.మెయ్యప్పన్ లు సినిమా రంగంలో ఎదుగుతూ వచ్చారు, ఎన్నో సినిమాలు నిర్మించారు. మాస్టర్ విశ్వం తో బాటు చండికా (1940) చిత్రంలో పనిచేసిన కన్నాంబ కూడా ఎన్నో చిత్రాలలో నటించారు, మరెన్నో చిత్రాలు నిర్మించారు. మాస్టర్ విశ్వానికి పద్యాలు నేర్పిన సాలూరు రాజేశ్వరరావు దశాబ్దాల తరబడి సంగీత దర్శకులుగా వెలుగొందారు. విశ్వంతో నటించిన కాంచనమాల సినిమా నుంచి వైదొలిగి తెనాలిలో అజ్ఞాతవాసంలో గడిపారు. వారెవ్వరినీ ఆ తరువాత రోజులలో విశ్వం కలుసుకున్న దాఖలాలు లేవు.
తన సినిమాకు తానే టికెట్లు అమ్మిన దుస్థితి…
జీవితమే ఒక వైకుంఠపాళి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములూ ఉంటాయి అన్నారు సి.నారాయణరెడ్డి. పడదోసే పాములంటే వ్యక్తులే కాదు, కొన్నిసార్లు పరిస్థితులు కూడా ఉంటాయి. మాస్టర్ విశ్వం జీవితంలో జరిగింది అదే. సినిమాలు మానేసి బడికి వెళుతున్నారు మాస్టర్ విశ్వం. సరిగ్గా మూడేండ్ల తరువాత ఉప్పాల పుల్లయ్య హోటళ్ళ వ్యాపారం దెబ్బతింది. భారీగా నష్టాలు పేరుకుపోయాయి. సినిమాల్లో నటించడానికి తీసుకెళ్ళమని తండ్రిని ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. తండ్రి మాట జవదాటలేడు. తప్పనిసరియై బడికి వెళ్లిన మాస్టర్ విశ్వాన్ని పాఠశాల మాన్పించిన తన తండ్రి ఆయనను బస్తా లెక్కలు చేయడానికి తీసుకెళ్లేవారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రావాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ పుల్లయ్య ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఒకానొక సందర్భంలో విశ్వాన్ని బెజవాడలో తెలిసిన వారికి దత్తత ఇవ్వడానికి సిద్ధపడ్డారు తండ్రి పుల్లయ్య. కానీ భార్య కనకరత్నం గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ప్రయత్నాన్ని ఆయన విరమించుకున్నారు. తాను టికెట్లు అమ్మిన జగ్గయ్యపేట టూరింగ్ టాకీసులో కొడుకుతో కూడా టికెట్లు అమ్మించేవాడు తండ్రి పుల్లయ్య. ఆ టూరింగ్ టాకీసులో మాస్టర్ విశ్వం నటించిన సినిమా ప్రదర్శితం అవుతుంటే, విశ్వం తన సినిమాకు తానే టికెట్లు అమ్మిన సందర్భాలు ఉన్నాయి.
బాల్య వివాహం…
అప్పట్లో బాల్య వివాహాలు సర్వసాధారణం. అమ్మాయిని కాపురానికి పంపడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టేది. మాస్టర్ విశ్వంకు సూర్యాపేట దగ్గర ఎండ్లపల్లికి చెందిన సావిత్రి అనే తొమ్మిది సంవత్సరాల బాలికతో 1945 వ సంవత్సరంలో పెళ్లి చేశారు. అప్పటికి విశ్వం వయస్సు పదమూడు సంవత్సరాలు. సినిమాలు మానేసిన విశ్వానికి చదవంటే ఆసక్తి. తండ్రి చదువు మాన్పించేశారు. చిన్న చితకా పనులు చేయించేవారు. తండ్రితో ఘర్షణపడిన విశ్వం బయటకు వచ్చి చదువును కోనసాగించారు. ఆ సమయంలో తాను నేర్చుకున్న సంగీతం ఇతరులకు నేర్పించడం మొదలుపెట్టారు మాస్టర్ విశ్వం. కథానాయకులు కాంతారావు భార్య హైమావతి కి కూడా తొలి సంగీత గురువు మాస్టర్ విశ్వం. అలాగే కొన్ని రోజులు వారాలబ్బాయి గా కూడా ఉన్నారు. చిత్రలేఖనం నేర్చుకున్నారు. చీరలపై బొమ్మలు గీసి డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో చదువుకునేవారు.
తాను ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు వ్రాసే సమయంలో తన తండ్రి క్షయ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ తరువాత కొద్ది కాలానికి క్షయ వ్యాధితో తండ్రి మరణించారు. తండ్రి మరణించే నాటికి విశ్వం వయసు పదిహేడు సంవత్సరాలు. అప్పుడు తన తమ్ముడు నరసింహారావు వయస్సు పదకొండు సంవత్సరాలు, పెద్ద చెల్లి సరస్వతి ఎనిమిదేళ్ల వయస్సులో ఉండగా, మరో చెల్లి లలితకు ఐదు సంవత్సరాలు. తండ్రి మరణించిన సమయంలో తల్లితో పాటు తమ ఇంట్లోనే ఉంటున్న ఇద్దరు మేనత్తలు, తన భార్యతో కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబం సభ్యులు. తండ్రి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని దుస్థితి. గతంలో సంగీత కచేరిలో నిర్వాహకులు ఇచ్చిన ఉంగరం, అమ్మ మెడలో గొలుసు అన్ని అమ్మి తన తండ్రి అంత్యక్రియలు చేశారు. అప్పటినుండి పదిహేడు సంవత్సరాల వయసున్న మాస్టర్ విశ్వంకు కుటుంబ బాధ్యతలు పూర్తిగా చుట్టుముట్టాయి. సినిమా జీవితం అంతా తనకు ఒక కలలా మిగిలిపోయింది.
ఉపాధ్యాయునిగా ఉద్యోగం…
కష్టాల నుండి బయటపడడానికి మాస్టర్ విశ్వం 1949 వ సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. మొదటగా నల్లగొండ జిల్లా హుజుర్ నగర్ దగ్గరలో గల గణపవరంలో ఉపాధ్యాయులుగా చేరారు. తన కుటుంబ సభ్యులను జగ్గయ్యపేటలోనే ఉంచి తాను గణపవరం గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉండేవారు. నెలకు 60 రూపాయలు జీతం వస్తుండేది. ఆ డబ్బులతోనే ఆయన తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. ముఠా తగాదాలు ఎక్కువగా ఉన్న గణపవరంలో ఒకసారి తాను ఉంటున్న ఉంటున్న ఇంటి ముందు పడుకున్న ఒక వ్యక్తిని తీసుకెళ్లి కొందరు హత్య చేశారు. దాంతో ఆ గ్రామంలో ఉండలేక సూర్యపేటకు బదిలీ చేయించుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు నల్లగొండ చుట్టుప్రక్కల పనిచేశారు.
ప్రాథమిక పాఠశాలలో తెలుగు, హిందీ రెండు విషయాలను బోధిస్తూ ఉండేవారు. కుటుంబ సభ్యులను పోషించాలంటే ఆ ఆదాయం సరిపోయేది కాదు. అదనపు ఆదాయం అవసరమయ్యేది. దానికోసం ఆయన ఛాయాగ్రహణం నేర్చుకున్నారు. నల్లగొండ చుట్టుప్రక్కల ఫోటోలు తీయడం వంటి పనులు చేసేవారు. తమ్ముడు నరసింహారావును వెంటబెట్టుకుని వెళ్లి ఫోటోలు తీసి, రాత్రిళ్ళు వాటిని కడిగించేసి ఇచ్చేవారు. వాటి ద్వారా వచ్చిన కొంత ఆదాయాన్ని కుటుంబ అవసరాలకు వాడేవారు. అలాగే డెక్కన్ రేడియోలో పాటలు పాడే ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. నాలుగైదు నెలలకు ఒక కాంట్రాక్టు వచ్చేది. డాక్టర్ సి.నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచర్యులు వంటి కవులకు తానే స్వయంగా బాణీలు కట్టి ఆకాశవాణిలో పాడుతుండేవారు. అలా ఆ కాంట్రాక్టులు దశాబ్దాల పాటు కొనసాగాయి.
సంతానం…
డెక్కన్ రేడియోలో సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వచ్చే కాంట్రాక్టు వలన పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. కాకపోతే తనలో మరుగున పడ్డ గాయకుడిని సజీవంగా ఉంచేది. కుటుంబాన్ని పోషించడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ఉన్న ఆ రోజులలో తమ్ముడు నరసింహారావు పాఠశాల ఉన్నత పరీక్షలలో తప్పిపోతే అతడిని చివాట్లు పెట్టారు విశ్వం. దాంతో నరసింహారావు అలిగి ఇంట్లోంచి పారిపోయాడు. దాంతో ఊరూరా వెతికి తమ్ముడుని తీసుకువచ్చి నల్లగొండలో ఫోటో స్టూడియో పెట్టించారు. అలా తమ్ముడి జీవితానికి దారి చూపించారు.
మాస్టర్ విశ్వం తన ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్లు చేశారు. మాస్టర్ విశ్వం దంపతులకు కూడా సంతానం కలిగింది. ఇన్ని రకాల కుటుంబ బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరి అయిన మాస్టర్ విశ్వం జీవితం సినిమాల వైపు ఆలోచించే తీరిక కానీ, సినిమాల గురించి ఆలోచించే సమయం గానీ లేకుండా చేసింది. మాస్టర్ విశ్వం, సావిత్రిలకు నలుగురు సంతానం. శ్రీనివాసరావు, సూర్యకుమారి, సంధ్యా రాణి, నిర్మలా దేవి. శ్రీనివాసరావు, సంధ్యారాణిలు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. సూర్యకుమారి హైదరాబాదులో నివసిస్తూండగా, నిర్మలా దేవి సూర్యపేటలో ఉంటున్నారు.
విద్యార్హతలు పెంచుకుంటూ…
ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం, సాయంత్రం ఇంటికి వచ్చాక ట్యూషను, అది అయిపోయాక పెయింటింగ్ పని, ఇవే కాకుండా పిల్లలతో నాటకాలు వేయించడం, ఎక్కడ పాటలు పోటీలు జరిగినా వెళ్లి న్యాయ నిర్ణేతగా వెళ్లడం. ఈ విధంగా ఇంటిలో, బయట ఒక్క క్షణం తీరిక లేకుండా గడిపేవారు మాస్టర్ విశ్వం. ఇన్ని బాధ్యతలతో సతమాతమవుతూనే, ప్రైవేటుగా పరీక్ష వ్రాసి 1954 వ సంవత్సరంలో బీ.ఏ. పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అలాగే చదువుకుని 1957లో ఎం.ఏ తెలుగు డిగ్రీ తెచ్చుకున్నారు. ఆ తరువాత సంవత్సరం బి.ఎడ్ పూర్తి చేశారు. ఆ తరువాత పదిహేను సంవత్సరాలకు యం.ఏ.ఇంగ్లీష్ డిగ్రీలు సాధించారు.
ఇలా అర్హతలు పెంచుకుంటూనే తన ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ కళాశాల అధ్యాపకులు అయ్యారు. మధ్యలో ఎస్.ఇ.ఓ, బి.డి.ఓ పదవులలో కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూనే, మరోవైపు తన ప్రవృత్తిలో కూడా తన ప్రతిభను కనబరుస్తూ వచ్చారు. యువజన వారోత్సవాల్లో భాగంగా 1954 వ సంవత్సరం ప్రధానమంత్రి నెహ్రూ గారి సమక్షంలో ఢిల్లీలో జరిగిన పాటల పోటీల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ తరుపున రెండవ బహుమతి అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన చిత్రకళ పోటీల్లో కూడా పాల్గొని బహుమతి గెలుచుకున్నారు.
నిష్క్రమణం…
నాటకాలు వేయడం, హార్మోనియం వాయించడం, సినిమాలలో నటించడం వలన మాస్టర్ విశ్వం గా పిలవబడ్డ ఆయన, పాఠశాలలో పాఠాలు చెప్పడం వలన అక్కడ కూడా మాస్టర్ విశ్వం గానే పిలవబడ్డారు. తీరికలేని బాధ్యతలతో వృత్తిరీత్యా తన గతం తెలుసుకొని సినిమాలకు వెళ్లలేకపోయానని గానీ, ఒకప్పుడు తాను సూపర్ స్టార్ అని కానీ ఏనాడు అనుకోలేదు. ఒకప్పుడు సినిమా నటుడు అనే ఆయన మర్చిపోయినా గానీ ఆయనను ఎరిగిన వారు మర్చిపోయావారు కాదు. తన గత సినిమా చరిత్ర ఇతరులకు చెప్పినప్పుడు ఏమాత్రం భావోద్వేగాలు ఆయనకు కలిగేవి కావు. అలాంటి స్థితప్రజ్ఞత కలిగి ఉన్నారు మాస్టర్ విశ్వం.
మాస్టర్ విశ్వం ఉద్యోగరీత్యా 1990లో పదవీ విరమణ చేసి ప్రశాంత జీవితం గడిపారు. 1999 వ సంవత్సరంలో కాలి వ్రేలు కింద ఒక చిన్న గాయం అయ్యి, మధువేహం వలన ఆ కాలు గాయం మోకాలు వరకు పెరుగుతూ వచ్చింది. దాంతో మోకాలు వరకు తీసేయవలసి వచ్చింది. అలాంటి స్థితిలో మంచం పైన ఐదు సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. 2006 మార్చిలో అనారోగ్యం తీవ్రతరమై కోమాలోకి వెళ్లిపోయిన మాస్టర్ విశ్వం 08 ఏప్రిల్ 2006 నాడు ఈ లోకం నుండి నిష్క్రమించారు. అప్పటికి మాస్టర్ విశ్వం అలియాస్ ఉప్ప ల విశ్వనాథ్ వయస్సు 72 సంవత్సరాలు.