
మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు దక్షిణ ద్వీపకల్పంలోని ఉత్తర ప్రాంతాలు, వాయువ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. 1901 తర్వాత అత్యంత వెచ్చని సంవత్సరంగా 2024ని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ఐఎండి సమాచారం మేరకు గత 124 సంవత్సరాలలో ఈ ఫిబ్రవరి అత్యంత వేడిని నమోదు చేసింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ. మొదటిసారిగా దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత వెచ్చని నెల. సగటు గరిష్ట ఉష్ణోగ్రత పరంగా ఫిబ్రవరి 2025 రెండవ అత్యంత ఉష్ణోగ్రత నెలగా మారింది.
మార్చి నెలలో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని కొన్ని దక్షిణ ప్రాంతాలలో తప్ప సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని, ఈ కాలంలో వాయువ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ నెలవారీ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉండొచ్చని, ఇక్కడ సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశులు ఉనికి ఎలా ఉంటుందో, ఏమో అనే సందేహం కలుగుక మానదు.
వీటికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ కారకుడు మాత్రం వంద శాతం మనిషే ! వాడి సుఖం కోసం పర్యావరణాన్ని కాలుష్యం చేసి ప్రకృతి పట్ల తీసుకొన్న అనాలోచిత చర్యలు ఫలితమే ఈ విపత్తులు. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పటి నుండో శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. కర్ణుడు చావుకి కోటి కారణాలు అన్నట్లు ఈ భూతాపానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైంది అన్ని రకాల కాలుష్యం అన్నది కాదనలేని వాస్తవం. ధరణికి ఈగతి పట్టడానికి అగ్రదేశాల ఆగడాలే. ఎలా అంటారా అయా దేశాలు వాతావరణానికి చేస్తున్న హానే ఎక్కువ. పారిశ్రామికీకరణ రాకతో భూఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయి. కర్మాగారాల నుండి వెలువడే హానికరమైన ఉద్గారాలు భూతాపాన్ని పెంచుతాయి. మానవ, సహజ కారకాలు రెండూ భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
గ్లోబల్ వార్మింగ్ కారణమా !
భూమి వేడెక్కడాన్ని భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనికి కారణం వాతావరణంలో పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులే ! వాతావరణంలో వేడిని బంధించే వాయువులను గ్రీన్‌హౌస్ వాయువులు అంటారు.
పగటిపూట సూర్యుడు భూవాతావరణాన్ని వేడి చేస్తాడు. రాత్రి సమయంలో భూమి చల్లబడినప్పుడు వేడి తిరిగి వాతావరణంలోకి ప్రసరిస్తుంది. ఈ ప్రక్రియలో భూ వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల ద్వారా వేడిని గ్రహించబడుతుంది. ఇది భూమి ఉపరితలం వేడెక్కేలా చేస్తుంది. సూర్యుని నుండి ఉష్ణశక్తి భూమికి చేరినప్పుడు భూమి ఈ శక్తిలో కొంత భాగాన్ని గ్రహిస్తుంది. మిగిలిన భాగాన్ని వేడిగా అంతరిక్షంలోకి ప్రసరిస్తుంది. భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ శక్తి మధ్య ఈ సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. శక్తి సమతుల్యతలో మార్పు భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత వెచ్చగా లేదా చల్లగా మారుతుంది. ఇది దిగువ వాతావరణంలో భూమిపైన, మహాసముద్రాలలో అనేక ఇతర మార్పులకు దారితీస్తుంది.
గ్రీన్హౌస్ లేదా హరిత వాయువులు :
కార్బన్డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్లను గ్రీన్హౌస్ వాయువులనంటారు. మానవ కార్యకలాపాల కారణంగా పారిశ్రామిక విప్లవం నుండి కీలకమైన గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు పెరిగాయి. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ సాంద్రతలు గత ఎనిమిది లక్షల సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు భూమి వాతావరణంలో అధికంగా ఉన్నాయి. పారిశ్రామిక పూర్వ కాలంలో ఉష్ణోగ్రతతో పోలిస్తే ” రెండు డిగ్రీల సెల్సియస్ పెరుగుదల సహజ పర్యావరణం, మానవ ఆరోగ్య శ్రేయస్సుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపడంతోపాటు వాతావరణంలో ప్రమాదకరమైన మార్పులు సంభవించే ప్రమాదం ఉంది. ” ఈ కారణాన ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని అంతర్జాతీయంగా నిర్ణయించడం జరిగింది. మానవ ప్రేరిత భూతాపం ప్రస్తుతం దశాబ్దానికి 0.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతోంది. ఏడాదికి సుమారు 30 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదలవుతుంది. పారిశ్రామిక పూర్వ కాలం నుండి ప్రస్తుతానికి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువుల సాంద్రతలు వరుసగా 48శాతం, 250 శాతం, 20 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఈ వాయువులు వరుసుగా
18 వ శతాబ్దం నుండి దాదాపు 280 పార్ట్స్ పర్ మిలియన్ (పిపియం) నుండి 414 పిపియంకి, 722 పార్ట్స్ పర్ బిలియన్( పిపిబి ) నుండి 1867 పిపిబి కి, 270 పిపిబి నుండి 332 పిపిబి కి పెరిగాయి.
కారణాలు:
బొగ్గు, చమురు, శిలాజ ఇంధనాలను కాల్చడం వలన కార్బన్డయాక్సైడ్ , నైట్రస్ఆక్సైడ్లు, ఆవులు గొర్రెలు తమ ఆహారాన్ని జీర్ణం చేసేటప్పుడు మీథేన్, నైట్రోజన్ ఎరువులు నైట్రస్ఆక్సైడ్లును, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లునుండి క్లోరో ఫ్లోరో కార్బన్లు, ఫోమింగ్ ఏజెంట్లు, మంటలు ఆర్పే యంత్రాలు, ద్రావకాలు, పురుగుమందులు , ప్రోపోలెంటలు నుండి క్లోరోఫ్లోరో కార్బన్‌లు, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్‌లు, హైడ్రోఫ్లోరోకార్బన్‌లు, పెర్ఫ్లోరోకార్బన్‌లు, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్‌లు వంటి ఎఫ్ – గ్యాస్లు కారణమవుతున్నాయి. అటవీ నిర్మూలన, వాహనాల అధిక వినియోగం, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ కార్యకలాపాలు గ్లోబల్ వార్మింగ్కు కారణాలు. సూర్యుని హానికరమైన రేడియేషన్ల నుండి భూ ఉపరితలాన్ని రక్షించడానికి ఓజోన్ పొర బాధ్యత వహిస్తుంది. కానీ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్‌ల నుండి విడుదలయ్యే క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొర క్షీణతకు కారణమై సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరి తద్వారా భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
వాతావరణంలోని ఏరోసోల్స్ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఏరోసోల్‌లు చాలా చిన్నవిగా ఉండే సూక్ష్మ (ఘన లేదా ద్రవ) కణాలు. ఇవి పెద్ద కణాల వలె త్వరగా ఉపరితలంపై పడకుందా రోజుల నుండి వారాల వరకు గాలిలో ఉండిపోతాయి. శిలాజ ఇంధనాలు జీవపదార్ధాలను కాల్చడం వంటి మానవ కార్యకలాపాలు ఈ పదార్ధాల ఉద్గారాలకు దోహదం చేస్తాయి. గ్రీన్‌హౌస్ వాయువుల వలె కాకుండా ఏరోసోల్‌ల వాతావరణ ప్రభావాలు అవి దేనితో తయారు చేయబడ్డాయి, అవి ఎక్కడ విడుదలవుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటాయి. వాటి రంగు ఇతర కారకాలపై ఆధారపడి ఏరోసోల్స్ సూర్యరశ్మిని గ్రహించవచ్చు లేదా ప్రతిబింబిస్తాయి.
సూర్యరశ్మిని ప్రతిబింబించే ఏరోసోల్‌లు, అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి కణాలు, బొగ్గును కాల్చడం నుండి వెలువడే సల్ఫర్ ఉద్గారాలు వంటివి శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. నలుపు కార్బన్ (మసిలో ఒక భాగం) వంటి సూర్యరశ్మిని గ్రహించేవి వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది జాతీయ అంతర్జాతీయ వాతావరణ రాజకీయాలలో పారదర్శకతను ప్రారంభించడానికి ఒక సాధనం. ఇటీవల విడుదల చేసిన క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (సిసిపిఐ) 2024లో మనదేశం 7 వ స్థానంలో ఉంది. గత యేడాది 8వ స్థానంలో ఉండేది. డెన్మార్క్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్ దేశాలు వరుసగా 4వ, 5వ, 6వ స్థానాలలో నిలిచాయి. మొదటి మూడు స్థానాలు ఏ దేశానికీ కేటాయించ లేదు. సిసిపిఐ యూరోపియన్ యూనియన్తో కలిపి 64 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తుంది.
పరిష్కారాలు :
పారిస్ ఒప్పందంలో నిర్ణయించిన విధంగా మనం గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ కి పరిమితం చేయాలి. శిలాజ ఇందనాలతో నడిచే వాహనాల స్థానంలో బ్యాటరీ వాహనాలను వాడాలి. ఇందుకు ప్రజలను ప్రోత్సహించాలి. సోలార్, గాలి మరలునుపయోగించి విద్యుత్తును తయారు చేసుకోవాలి. గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే పరిశ్రమలను మూసివేయాలి. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు బదులుగా బయో ఫెర్టిలైజార్స్ వాడాలి. వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యం కారకాలను గుర్తించి వాటిని అపే ప్రయత్నాలు కొనసాగించాలి. కార్బన్ పన్నులను పెంచాలి. ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటాలి. ప్లాస్టిక్లలకు ప్రత్యామ్నాయాలు వెతకాలి. అవసరం మేరకే ఇంట్లో విద్యుత్తును వాడాలి. అధికంగా ఎసిలు వాడకూడదు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించాలి. అత్యవసరం అయితేనే విమానాల్లో ప్రయాణించాలి. ప్రజలందరికీ గ్లోబల్ వార్మింగ్ గురించి చైతన్య పరచాలి. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా భూతాపాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి.