GREAT PERSONALITIES

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం.. 24 ఏళ్లకే ఉరికంబం

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ధైర్యశాలి, వీరుడిగా గుర్తుండిపోయే ధీశాలి మదనలాల్ థింక్రే. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన వీరుడు ఆయన. పుట్టిన గడ్డకు అంత సేవ చేసిన ఆయన జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం ఒక పోస్టర్ స్టాంపును విడుదల చేసింది. అంతేకాదు సావర్కర్ వంటి హిందీ సినిమాల్లో సైతం ఆయన పాత్రను చిత్రీకరించారు.

బ్రిటిష్ పాలకుల చేత ఉరితీయబడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ లాల్. ఆయన ఫిబ్రవరి 18, 1883న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఓ ధనిక కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి దిట్ట మల్ ప్రభుత్వ సివిల్ సర్జన్‌గా పదవీ విరమణ చేశారు. కాట్రా షేర్ సింగ్‌లో 21 ఇళ్ళులు, GT రోడ్‌లో ఆరు పెద్ద బంగ్లాలు కలిగి ఉన్నారు. దిట్ట మల్ 1850లో ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సర్గోధ జిల్లాలోని తన గ్రామం సాహివాల్ నుండి అమృత్సర్ కు మారారు. ఆయన పూర్వీకుల గ్రామంలో 10 బిఘా భూమి, ఒక హవేలీని కలిగి ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన రాయ్ సాహెబ్ బిరుదును కూడా కలిగి ఉన్నారు ఆయన. ధింగ్రా తండ్రికి ఆ కాలంలోనే

ఆరు బగ్గీలు, కారు ఉండేవి. నగరంలో ఈ హక్కు పొందిన మొదటి భారతీయుడు కూడా ఆయనే అని చెప్పవచ్చు. ఆయనకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారులలో ముగ్గురు శిక్షణ పొందిన వైద్య వైద్యులు,  ముగ్గురు న్యాయవాదులు-బార్ అట్ లా. అతని సోదరులలో ఒకరైన బిహారీ లాల్ ధింగ్రా, జింద్ రాష్ట్రానికి ప్రధాన మంత్రిగా చేశారు. అలాంటి కుటుంబంలోనే తిరుగుబాటుదారుడైన మదన లాల్ జన్మించాడు. 

అతను లాహోర్‌లో సైన్స్ చదువుతున్నప్పుడు అక్కడ  లాలా లజపతి రాయ్, భగత్ సింగ్ మామ అయినటువంటి అజిత్ సింగ్ యొక్క ” పగ్డి సంభాల్ జట్టా ” ఉద్యమంతో ప్రభావితమయ్యాడు. ఆ తరువాత మదన్ లాల్ ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ నుండి 2 నెలలు ఓడలో ప్రయాణించి లండన్ చేరుకున్నారు.

అక్కడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడే మదన్లాల్ స్వాతంత్ర ఉద్యమ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు.

“ఒక హిందువుగా నేను నా దేశానికి జరిగిన హానిని భగవంతునికి జరిగిన అవమానంగా భావిస్తాను. దేశమాత కార్యమంటే శ్రీ రాముడి కార్యమే. ఆమెకు చేసే సేవ అంటే శ్రీకృష్ణుడు కి చేసే సేవయే’ అని నమ్మిన వ్యక్తి థింక్రే.

మదన్ లాల్ స్వేచ్ఛా ప్రియుడు. ఎంతటి స్వేచ్ఛా ప్రియుడంటే తన చదువులకయ్యే ఖర్చులను తండ్రి నుంచి తీసుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు.  చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించి తన సొంత ఖర్చులు, చదువుకయ్యే ఖర్చులు చూసుకునేవాడు. స్నేహితులతో  ఉల్లాసంగా గడపటం ఆయనకు అత్యంత ఇష్టమైన విషయం. అలంకార ప్రియుడు. ఖరీదైన దుస్తులు ధరించి, వివిధ రకాలైన అత్తరు సువాసనలను వెదజల్లుతూ స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడే వాడు. అదే సమయంలో భారతీయ ఆచార వ్యవహారాల పట్ల, భారతీయుల నిరంతర పోరాటము, శౌర్య పరాక్రమాలను వివరించే భారతదేశ చరిత్ర మరియు పురాణేతిహాసాల పట్ల అత్యంత గౌరవం కలిగినవాడు.

1906 జులై నెలలో ఇంజనీరింగ్ చదువు నిమిత్తం  లండన్ చేరిన ఆయనకు అప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. ఇంగ్లండులో పరిచయమైన కొందరి స్నేహితుల ద్వారా ఢీంగ్రా “ఇండియా హౌస్” కు వెళ్ళాడు. ఇండియా హౌస్ లండన్లోని స్వాతంత్య్ర సమర యోధులకు కేంద్రంగా ఉండేది. ఇంగ్లాండుకు విద్య, ఉద్యోగాల నిమిత్తం వచ్చే భారతీయ యువకులలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి వారిని సాయుధ స్వతంత్య్ర పోరాటంలో భాగస్వాములను చేసే మహత్కార్యం అక్కడ జరుగుతూండేది. వారందరికి నాయకుడుగా వినాయక దామోదర సావర్కర్ వ్యవహరించేవాడు.

ఢీంగ్రా అక్కడికి వెళ్ళిన మొదటిరోజే వీర సావార్కర్ ప్రసంగం విని ముగ్ధుడయ్యాడు.అంతులేని ప్రేరణ పొందాడు. దేశమాత దాస్య శృంఖలాలను త్రెంచడానికి జరుగుతున్న పోరాటంలో తాను కూడా భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆ పోరాటంలో తన ప్రాణాలను సమర్పించటానికి కూడా  సిద్ధమయ్యాడు.

సావార్కర్ అన్నయ్య గణేష్ దామోదర్ సావర్కర్ కూడా తీవ్రవాది. అందరూ ఆయనను ఆత్మీయతతో బాబారావ్ అని పిలిచేవారు. ఆంగ్లేయులు ఆయనను బంధించి “కాలాపానీ” దండన విధించారు. కాలాపానీ అంటే సముద్రము అవతలి వైపునున్న అండమాన్ ద్వీపంలో నిర్బంధించి ఉంచడం. ఈ ద్వీపం పాములు, తేళ్ళు, క్రూర జంతువులలో ఉండేది.

బాబారావ్ సావర్కర్ కు విధించిన శిక్షను గురించి సమాచారం విన్న ఢీంగ్రా తన కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఒక  భారతీయ యువకుని ప్రతీకారేచ్ఛ ఎలావుంటుందో ఆంగ్లేయులకు రుచి చూపించాలనుకున్నాడు. తన లక్ష్యాన్ని సఫలీకృతం చేసుకోవటానికి ఒక పిస్తోలు కొని దానిని ఎలా ఉపయోగించాలో అభ్యాసం చేయసాగాడు.

బ్రిటిష్ ఉన్నతాధికారి కర్జన్ విల్లీని చంపటానికి పథకం రచించాడు మదన్ లాల్. కర్జన్ భారత్ లో ఉన్నత పదవుల్లో పనిచేసినప్పుడు మదన్ లాల్ తండ్రికి మంచి స్నేహితుడు కూడా. భారతీయ రైతులను పేదరికంలోకి నెట్టిన అనేక నిర్ణయాల్లో కర్జన్ భాగస్వామి. అందుకే ఆయన్ను చంపాలని  నిర్ణయించుకున్న మదన్ లాల్ 1909 జులై 1న ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ ఏర్పాటు చేసిన విందుకు కర్జన్ తో పాటు చాలామంది బ్రిటిష్ ప్రముఖులు హాజరయ్యారు. విందు ముగిసి వెళ్లిపోతుండగా  దాడిచేసి కర్జన్ ను మదన్ లాల్ కాల్చి చంపాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఓ పార్శీ డాక్టర్ కావస్ జీ లాల్ కాకా కూడా కాల్పులలో మృతి చెందాడు. మదన్ ను అరెస్టు చేసి లండన్లోని సెంట్రల్ క్రిమినల్ కోర్టులో విచారణ జరిపారు. దీంతో భారత్ లో కుటుంబం మదన్ లాల్ ను  పూర్తిగా వెలివేసింది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు. కానీ దేశభక్తులైన కొందరు భారతీయులు మాత్రం మదన్   భావించి చేసిన పనికి గర్వించారు. అతను భారతమాత ప్రియ పుత్రుడిగా అభివర్ణించి, భరతమాత గౌరవ ప్రతిష్ఠలు పెంచారని గొప్పగా చెప్పుకున్నారు.

లండనులోని ఉన్నత న్యాయస్థానంలో ఢీంగ్రాపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా 1909 జులై 10న ఢీంగ్రా ఇచ్చిన వాగ్మూలం చారిత్రాత్మకమైనది.

“జర్మనీ మీ బ్రిటన్‌ను ఆక్రమించుకొని దోచుకుంటే జర్మన్లతో పోరాడటం మీకు దేశభక్తి ఎలా అవుతుందో…. మా భారత్‌ను దోచుకుంటున్న మీతో పోరాడుతున్న మాదీ దేశభక్తే. మీరిక్కడికి తెస్తున్న ప్రతి పౌండ్ ఎంతోమంది భారతీయుల ప్రాణాలను తోడి తెస్తున్నది. బ్రిటన్‌ను ఆక్రమించుకునే హక్కు జర్మనీకి లేనట్లే… భారత్‌ను ఆక్రమించుకునే హక్కు మీ బ్రిటిషర్లకూ లేదు. చచ్చే ముందు మీ బ్రిటిష్ వారి ద్వంద్వనీతిని ప్రపంచానికి చాటడానికే ఈ ప్రకటన చేస్తున్నా.

నేను ఒక హిందువును. నేను నా దేశానికి జరిగిన అవమానాన్ని నా దైవానికి జరిగిన అవమానంగా భావిస్తాను. నా మాతృభూమికి నా రక్తాన్ని తప్ప నేను ఇంకేమి సమర్పించుకోగలను? అందుకే మాతృభూమి సేవలో నేను నా రక్తాన్ని సమర్పిస్తున్నాను. నా దృష్టిలో తల్లి భారతమాత సేవయే శ్రీరామ సేవ, శ్రీ కృష్ణుని సేవ. అందుకే నేను నా ప్రాణాలను త్యాగం చేస్తున్నాను. నాకు నా ఈ చర్య పట్ల గర్వంగా ఉంది. నా కోరిక ఏంటంటే…… నా తల్లి భారతి దాస్య శృంఖలాల నుంచి విముక్తమై స్వతంత్రురాలయ్యే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ పవిత్ర భరతభూమిలోనే జన్మించాలి. నా మాతృభూమి భరతమాత కొరకు నేను మళ్ళీ మళ్ళీ ప్రాణత్యాగం చెయ్యాలి. ఆ అవకాశం కోసం నేను ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ పరమేశ్వరుడు నా ఈ కోరికను తప్పక తీర్చాలి. వందేమాతరం.”

అంటూ ఆయన ఇచ్చిన తన మరణ వాంగ్మూలం సంచలనం సృష్టించింది.

విచారణ జులై 24న పూర్తయింది. మదన్ లాల్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆగస్టు 18,1909. పెంటోన్ విలే కారాగారం వద్ద ఉరికొయ్య దగ్గరకు నడచి వస్తున్న వేళలో సైతం మదన్ ముఖంపై చిరునవ్వు చెరిగిపోలేదు. ఎన్నాళ్ళ తర్వాతో అమ్మ ఒడి చేరనున్న చంటిపాపాయిలా నవ్వులు చిందిస్తూ ఒక చేత భగవద్గీత, రామకృష్ణుల నామ స్మరణతో ఉరికంబమెక్కాడు.

మదన్ లాల్ ని ఉరి తీసే రోజు భారతదేశంలోని ఎందరో దేశభక్తుల హృదయాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయ్. ఖరీదైన దుస్తులు ధరించి, రకరకాల సువాసనలు వెదజల్లే అత్తరులు చల్లుకుని స్నేహితులతో కలిసి పార్టీలు, విందులు చేసుకుంటూ లండన్ వీధులలో విలాసంగా తిరిగిన ఓ యువ కెరటం భరతమాత పవిత్ర చరణాల వద్దకు చేరింది. కోట్లాది హృదయాలలో ఒక అగ్నికణంలా  ప్రజ్వరిల్లింది. ఆయన కోరుకున్నట్లుగానే ఆయన మరణం కోట్లాది దేశభక్తుల హృదయాలలో స్వాతంత్ర్యేచ్ఛను రగుల్కొలిపింది. ఆ తర్వాతికాలంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల బలిదానాలకు మదన్ లాల్ ఢీంగ్రా బలిదానమే ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు. ఆయన మృతదేహాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఖననం చేశారు. డయ్యర్ ను చంపిన ఉద్ధంసింగ్ అస్థికల కోసం వెతుకుతుంటే మదన్ లాల్ అస్థికలు కూడా బయటపడ్డాయి. 67 సంవత్సరాల తర్వాత 1976లో అవి భారత్ కు వచ్చాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా హాజరై ఆయన ఆత్మకు నివాళి అర్పించారు.

అతి చిన్న వయస్సులో మదన్ లాల్ చేసిన త్యాగం మరువలేనిది. దేశ స్వాతంత్ర్య సాధన కోసం కుటుంబానికి,  భార్యా పిల్లలకి దూరమై దేశమాత దాస్య శృంఖలాలను తెంచడానికి ప్రాణాలను అర్పించిన మదన్ లాల్  చిరస్మరణీయుడు. భారతీయుల హృదయకమలాలలో చిరస్థానం సంపాదించుకున్న అమరుడు.

ఉరి తీసే సమయానికి మదన్ లాల్ వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. అతని బ్రిటీష్ వ్యతిరేక మొగ్గు కారణంగా అతని కుటుంబం అతన్ని పూర్తిగా తిరస్కరించింది. ఎంతగా అంటే అతని మరణం తరువాత కూడా అతని కుటుంబం అతని మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. దేశం కోసం కుటుంబాన్ని వదిలి పోరుబాట పట్టిన మదన్ లాల్ గొప్పతనం చాలా మందికి తెలీదు. ఎందుకంటే చరిత్రలో దాయబడ్డ ఎంతోమంది ఇలాంటి యువ కెరటాలు ఉన్నారు. ఇలాంటి వారందరి గురించి పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తే నేటి యువతరానికి కూడా ప్రేరణ గా నిలుస్తారు ఆ మహానుభావులు.

Show More
Back to top button