HISTORY CULTURE AND LITERATURE

పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేసిన తర్కజ్ఞాని.. సోక్రటీస్.

ఈ సృష్టిలో జనన మరణాలు సర్వసాధారణమైనవి. పుట్టుక, మరణం అనేవి మన చేతులలో లేనివి. మరణం అనేది సంభవిస్తుందని ముందుగా తెలిస్తే భయభ్రాంతులకు లోనవుతాం. అట్టి విషయాన్ని సంతోషంగా స్వీకరించలేం. కానీ సోక్రటీస్ మాత్రం చావును నవ్వుతూ స్వీకరించారు. తన తప్పులేదని తెలిసినా న్యాయ నిర్ణేతల బృందం వేసిన మరణశిక్షను సంతోషంగా అంగీకరించారు. కళ్ళలో బెరుకు, భయం లేకుండా ధైర్యంగా చేయని తప్పుకు, వేసిన శిక్షను అనుసరించి నవ్వుతూనే విషం త్రాగి ధైర్యంగా చావును ఆహ్వానించారు సోక్రటీస్. పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేసినవారు సోక్రటీసు. నీతి నియమాలు, తర్క శాస్త్రంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యులు. ముఖ్యంగా ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వారిపై ఆయన ప్రభావం ఎంతో ఉందని చెప్పవచ్చు. సోక్రటీస్ ఒక పురాతన గ్రీకు తత్వవేత్త. అలాగే ఆయన మొదటి పాశ్చాత్య నైతిక తత్వవేత్త మరియు పాశ్చాత్య తత్వశాస్త్ర సంప్రదాయాన్ని ఎక్కువగా స్థాపించిన తన విద్యార్థి అయిన ప్లేటోకు ప్రధాన ప్రేరణగా నిలిచారు.

అలోపీస్ అనే ఏథీనియన్ డెమ్‌లో వరుసగా రాతి కార్మికుడు మరియు మంత్రసాని అయిన సోఫ్రోనిస్కస్ మరియు ఫెనారెట్ దంపతులకు జన్మించిన సోక్రటీస్ ఏథీనియన్ పౌరుడు, సాపేక్షంగా సంపన్న ఏథీనియన్లకు జన్మించారు సోక్రటీస్. ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ ఆలోచనలో , ముఖ్యంగా మానవతావాద ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన సోక్రటీస్, కళ, సాహిత్యం మరియు ప్రసిద్ధ సంస్కృతిలో చిత్రణలు ఆయనను పాశ్చాత్య తాత్విక సంప్రదాయంలో విస్తృతంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా చేశాయి. ఏథెన్స్ సమాజంలో ధ్రువణ వ్యక్తి అయిన సోక్రటీస్ పై, క్రీస్తుపూర్వం 399లో యువతను భ్రష్టుపట్టించాడని అభియోగాలు మోపబడ్డాయి. ఒక రోజు పాటు జరిగిన విచారణ తర్వాత, అతనికి మరణశిక్ష విధించబడింది. ప్లేటో చెప్పినట్లుగానే శిక్ష తప్పించుకోవడానికి మిత్రుల నుండి వచ్చిన అవకాశాలను తిరస్కరించిన తరువాత అతనికి విషం ఇచ్చి మరణశిక్ష విధించారు. దోషిగా తేలిన తర్వాత తనకు తానుగా ప్రత్యామ్నాయ శిక్షలు వేసుకునే అవకాశం సోక్రటీస్‌కు లభించినా కూడా ఏథెన్స్ నుండి పారిపోయి ప్రవాసంలో నివసించడానికి అనుమతిని తిరస్కరించిన సోక్రటీస్ ను, న్యాయమూర్తులు ఒక కప్పు హెమ్లాక్ (విషపూరిత ద్రవం) తాగించడం ద్వారా మరణశిక్షకు మద్దతు ఇవ్వగా, ఆనందంగా విషాన్ని తీసుకుని చరిత్రలో చెప్పుకోదగ్గ మరణాన్ని కౌగిలించుకున్న ధైర్యశాలి సోక్రటీస్.

నేపథ్యం…

గ్రీసు అనేది ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. అది ఐరోపా, ఆసియా, ఆఫ్రికా కూడలి వద్ద ఉంది. గ్రీసు దేశంలోని వివిధ రాష్ట్రాలు వేటికవే స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేవి. ఏ రాష్ట్రానికి, ఆ రాష్ట్రమే స్వంత రాజ్యాంగం, స్వయం పరిపాలన, స్వంత సైన్యం, స్వంత చట్టాలు ఉండేవి. అందువలన తమ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం ఒక్కో రాష్ట్రం, తన ప్రజాభిమానాన్ని, తమ ప్రాభవాన్ని విస్తరించడానికి తమ పక్క రాష్ట్రాలతో యుద్ధాలు చేస్తుండేవి, పోరాటాలు జరిపేవి. అలాంటి గ్రీసు దేశంలో క్రీస్తుపూర్వం 300 – 400 సంవత్సరాల మధ్య అత్యంత శక్తిమంతమైన రాష్ట్రం ఏథెన్స్. మధ్యధరా సముద్రంలో ఒక ముఖ్యమైన తీరప్రాంత పట్టణ ప్రాంతం ఏథెన్స్ పట్టణం. వీటితోబాటు స్పార్టా, కొరింత్, హార్గోస్ మొదలైన ఇతర రాష్ట్రాలు కూడా తమ తమ ప్రాభవాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసేవి. క్రీ.పూ 3 మరియు 4 శతాబ్దాలలో ఈ రాష్ట్రాలు ముఖ్యంగా తత్వవేత్తలకు నిలయమయ్యాయి. ఏథెన్స్ నగరంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య పాలన ఉండేది. చట్టాన్ని పరిరక్షించడంలో, చట్టాలను రూపొందించడంలో ప్రజలే ప్రముఖ పాత్ర పోషించేవారు.

పైన చెప్పిన అంశాలన్నీ తత్వవేత్త సోక్రటీస్ ను ప్రభావితం చేశాయి. ఇలాంటి వాతావరణం లో ఏథెన్స్ నగరంలో క్రీస్తు పూర్వం 460 సంవత్సరంలో జన్మించారు సోక్రటీస్. సోక్రటీస్ తండ్రి సోఫ్రోనిస్కస్ ఒక రాతి కార్మికుడు, తల్లి రియుఫెనారెట్ మంత్రసాని. వీరు సంపన్న దంపతులు, అందువలన ఏథీనియన్ పౌరుడైన సోక్రటీస్ కూడా సాపేక్షంగా సంపన్నుడే అని చెప్పాలి. ఆయన పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల వద్ద కాకుండా తన తండ్రి బంధువుల వద్ద నివసించారు. దాంతో ఆచారం ప్రకారం, తన తండ్రి ఎస్టేట్‌లో కొంత ఆస్తిని వారసత్వంగా పొందడం వలన ఆయన ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు లేకుండా సహేతుకంగా జీవితాన్ని పొందారు. అతని విద్య ఏథెన్స్ యొక్క చట్టాలు మరియు ఆచారాలను అనుసరించి జరిగింది. ఆ విద్యలోనే అతను చదవడం మరియు వ్రాయడం యొక్క ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకున్నారు. బాల్యంలో చదువుతో పాటుగా సంగీతం, సాహిత్యం లాంటి విద్యలు నేర్చుకున్నారు. శిల్పాలు చెక్కడంలో తండ్రికి సహాయం చేశారు. నాన్న నుండి శిల్పాలు చెక్కడం, అమ్మ నుండి మంత్రసాని తనం నేర్చుకొని కొత్త కొత్త భావాలకు పురుడు పోస్తుండేవారు సోక్రటీస్. ఆయన ఆకారంలో పెద్ద అందగాడేమీ కాదు. చప్పిడి ముక్కు, ముందుకు పొడుచుకుని వచ్చిన తలదొప్ప చెవులు కలిగిన అనాకారి. శరీరధారుడ్యం పెంచుకోవడానికి సోక్రటీస్ కొన్నాళ్లు శరీర వ్యాయామశాలకు వెళ్లేవారు.

ఐదేళ్లు సైనికుడిగా…

గ్రీకు దేశంలో పాతికేళ్ళుగా కొనసాగుతున్న యుద్ధం పేరు “పెలుపునేసియన్ వార్”. ఏథెన్స్ మరియు స్పార్టా మధ్య సుదీర్ఘ కాలంగా ఈ యుద్ధం కొనసాగుతూ వచ్చింది. గ్రీకు ప్రజల మీద ఏథెన్స్ ప్రభావం ఎక్కువవ్వడాన్ని స్పార్టా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజాస్వామ్యం పాలన ఉన్న ఏథెన్స్ కి మరియు మిలిటరీ పాలన ఉన్న స్పార్టాకు మధ్యన జరుగుతున్న “పెలుపునేసియన్ వార్” లో పాల్గొనడం ఏథెన్స్ ప్రజల యువత తప్పనిసరి బాధ్యత అయ్యింది. దాంతో 35 ఏళ్ల వయసున్న సోక్రటీస్ సైనికుడై యుద్ధరంగంలో దూకారు. యుద్ధంలో ఏమాత్రం భయం లేకుండా దూసుకుపోతూ ఉండేవారు. అప్పటినుండే మరణానికి కూడా భయపడని మనస్తత్వం సోక్రటీస్ కు జీవితాంతం కొనసాగింది. ఆ యుద్ధంలో “అలిసిబియాడిస్” అనే సైనికాధికారిని శత్రు సైన్యం నుండి రక్షించారు సోక్రటీస్. అలా మొదలైన సోక్రటీస్ మరియు అలిసిబియాడిస్ ల పరిచయం ఆ తరువాత చాలా రోజులు కొనసాగింది. అలిసిబియాడిస్ తన చాతుర్యంతో ఏథెన్స్ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రధాన పాలకులలో ఆయన కూడా ముఖ్యడయ్యారు. ఆయన సోక్రటీస్ కు శిష్యుడు కూడా అయ్యారు.

మురికి దుస్తులు ధరించిన మేధావి…

ఆయన సోక్రటీస్ గురించి అనేక సభలలో బహిరంగంగా ప్రశంసించేవారు. అయిదు సంవత్సరాల సైనిక జీవితం పూర్తయిన తరువాత తనకు కలిగిన వారసత్వ సంపదతో జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. వ్యాపారం, ఉద్యోగం, వృత్తి లాంటివి ఏమి చేయలేదు. రోజు మొత్తం ఏథెన్స్ నగరమంతా పర్యటిస్తూ అన్ని వర్గాల వారిని పలకరిస్తూ, అన్ని తరగతుల వారితో, అన్ని రకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ కూడా శారీరక శుభ్రత గురించి గానీ, వేసుకునే బట్టల గురించి గానీ ఎప్పుడూ పట్టించుకునే కానే కాదు. ఎన్ని రోజులకొకసారి స్నానం చేసేవాడో తనకే తెలిసేది కాదు. ఆయన అందరికీ కూడా మురికి దుస్తులు ధరించిన మేధావిగా సుపరిచితుడే. ఉదయాన్నే లేచి ఇంటి నుండి బయలుదేరిపోయి, రోడ్లమీద కనిపించే వారిని ఆపి మాట్లాడుతుండేవారు. దుకాణాల దగ్గర, వ్యాయామశాలలో ఖాళీగా ఉన్న వారితో గంటల తరబడి ఆయన మాట్లాడేవారు. ఆయన సంభాషించే వ్యక్తి ధనవంతుడా, పేదవాడా, చదువుకున్నవాడా, నిరక్షరాస్యుడా, కూలీనా, ఉద్యోగస్తుడా, ఇవేమీకూడా పట్టించుకునే వారు కాదు. మాట్లాడే ప్రతీ వ్యక్తిలో ఆయనకు స్నేహితుడు కనిపించేవారు, వారితో స్నేహం చేసేవారు.

ప్లేటో ద్వారా ప్రపంచానికి తెలిసిన సోక్రటీస్…

సోక్రటీస్ వాక్ఛాతుర్యం అద్భుతంగా ఉండేది. ఆయన సంధించే ప్రశ్నలు ఎదుటివారిని ప్రశ్నించడంలా కాకుండా తెలియని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అన్నట్లు ఉండేవి. అందుకే అందరూ ఆయనతో మాట్లాడడానికి ఉత్సాహం చూపించేవారు. వారు చెప్పే సమాధానం బట్టి మరికొన్ని ప్రశ్నలు సంధించేవారు, అవి వాళ్లలో ఆలోచనలు ప్రేరేపించి వారిచ్చే సమాధానాల ద్వారా తాను కొత్త భావాలను ఏర్పరచుకోవడం, మిగిలిన వారిని కలుసుకుని వారితో పంచుకోవడం లాంటివి కొనసాగించే వారు. ఆయన ఇతరులకు ప్రశ్నలు వేయడం, వాటి జవాబులు విశ్లేషణ చేయడం ఇదే తనకు దినచర్యగా ఉండేది.

తన సంభాషణలు ఒక్కోసారి ఒక్కో అంశం చుట్టూ కొనసాగుతుండేవి. దేవుడు, మతం, జీవితం, మృత్యువు, నీతి, నిజాయితీ మొదలగు తన బోధనలన్నీ కూడా సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో అక్షరబంధం చేశారు. ఎక్కువగా ప్లేటో వ్రాసిన సంభాషణల వలన సోక్రటీస్ తత్వం ప్రపంచానికి తెలిసింది, ప్రపంచంలో నిలిచింది, చరిత్రలో రికార్డు కూడా చేయబడింది. రోజంతా కూడా సోక్రటీస్ నగరం అంతటా పర్యటిస్తూ అందరితో సంభాషించే క్రమంలో ఆయన ఎవరినీ వ్యతిరేకించే వారు కాదు. ఆయనకు తెలియకుండానే, ఆయన ఆహ్వానించకుండానే తనకు ప్రత్యేక బృందం ఏర్పడింది. అందులో ధనికులు, పేదవారు, నిరక్షరాస్యులు, చదువుకున్న వారు, రాజకీయ నాయకులు అందరూ ఉండేవారు. సోక్రటీస్ రోజంతా ఏథెన్స్ నగరంలోని వీధులలో తిరుగుతూ ఉంటే, శిష్యులు కూడా ఆయనతో పాటే వెళ్తూ ఉండేవారు.

కుటుంబం…

సోక్రటీస్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మిర్టో. ఆమె అసలు పేరు డయోజెనెస్ లార్టియస్ మిర్టో. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. ఆయన రెండవ భార్య క్శాంతిప్పే, సోక్రటీస్ లకు ఒక అబ్బాయి సంతానం కలిగింది. ఇది ఒక కథనమైతే, మరొక కథనం ప్రకారం సోక్రటీస్ చాలా వయసు వచ్చాక వివాహం చేసుకున్నారు. సోక్రటీస్ ద్వారా క్శాంతిప్పేకు ముగ్గురు అబ్బాయిలు సంతానం. డయోజెనెస్ లార్టియస్ మిర్టో అనే మహిళ వితంతువు. ఆమెకు సోక్రటీస్ ధన సాయం చేస్తూ ఉండేవారు తప్ప ఆమెను వివాహం చేసుకోలేదని మరొక వాదన. ధనిక కుటుంబం నుండి వచ్చిన క్శాంతిప్పే వయస్సులో సోక్రటీస్ కంటే 40 సంవత్సరాలు చిన్నది. మొదట్లో ఆమె సామ్యంగా ఉండేది.

క్శాంతిప్పే భర్త సోక్రటీస్ ఇంటి పట్టున ఉండకుండా ఊరు మొత్తం తిరగడం, శిష్యులతో నగర సంచారం, మతతత్వం తప్ప లౌకిక విషయాల గురించి పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉండడం వలన క్రమక్రమంగా ఆమె కఠిన మనస్కురాలైంది అనే విషయాన్ని చరిత్రకారులు వ్రాశారు. ఆమె గయ్యాలి అని కొందరు అతిశయోక్తిని జోడించారు. ఎప్పుడు ఆమె అరుస్తూ, వాదిస్తూ ఉండేది. అందువలన సోక్రటీస్ మాత్రం ఆమె గయ్యాళితనాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవారు. ఆమె అంత అంత కరుకుగా, ఘాటుగా మాట్లాడుతుండడం వలననే తాను రాటుదేలుతున్నానని, ఆమె అంత గట్టిగా మాట్లాడం భరించడం అలవాటయింది గనుకే తాను బయటికెళ్ళినప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితోనైనా సంభాషించగలుగుతున్నాననే నిజాయితీని, నిర్భయత్వాన్ని సోక్రటీస్ ప్రదర్శించేవారు.

న్యాయ నిర్ణేతల బృందంలో ఒకడిగా…

అప్పట్లో సైన్యాధికారులు అవినీతిపరులని, రాజ ద్రోహులనే ఆరోపణలు వచ్చాయి. అత్యధికుల అభిప్రాయాన్ని బట్టి సైన్యాధికారులకు మరణశిక్ష విధించడం న్యాయ నిర్ణేతల బృందం నిర్ణయించింది. ఆ న్యాయ నిర్ణేతల బృందంలో ఉన్న అందరినీ సంప్రదించి సైనిక అధికారులకు మరణ శిక్ష వేయాల్సిందేనన్నారు. అప్పట్లో సమాజంలో కాస్త పేరున్న వ్యక్తులను కూడా న్యాయ నిర్ణేతల బృందంలో చేరుస్తూ ఉండేవారు. ఆ విధంగా సోక్రటీస్ కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా ఎంపికయ్యారు. అందరూ మరణశిక్ష వేయాలని సూచిస్తే, సోక్రటీస్ మాత్రం సైనిక అధికారుల మీద వచ్చిన ఆరోపణలన్నీ తప్పుని చెప్పారు. వాళ్లు రాజ్యాన్ని పరి రక్షించండం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఏ తప్పూ చేయని వాళ్ళకు మరణశిక్ష విధించడం నేను అంగీకరించను అని మిగతా వారు ఏకీభవించిన నిర్ణయాన్ని తాను తోసిపుచ్చాడు. న్యాయ నిర్ణేతల బృందంలో అందరూ అంగీకరించాలి, ఏ ఒక్కరూ అంగీకరించకపోయినా శిక్ష ఉండదు. ఆ బృందంలో ఉన్న సోక్రటీస్ అంగీకరించలేదు కాబట్టి ఆ సైనికాధికారులకు మరణ శిక్ష తప్పిపోయింది.

తత్వశాస్త్రం బోధించే సోక్రటీస్ బోధనలను నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేనినైనా ప్రశ్నించి ఋజువు చేసుకున్నాక నమ్మాలి అనే సోక్రటీస్ సిద్ధాంతాలలో భాగంగా ఆనాటి సమాజంలో అందరూ నమ్మే గ్రీకు దేవుళ్ళను కూడా మిథ్య అన్నారు సోక్రటీస్. ప్రతీ మనిషికి కూడా అంతర్వాణి అనేది ఒకటుంటుంది, దానిని సరిగ్గా వినటం నేర్చుకుంటే ఎవరు దేవుడు? ఎవరు కాదు అనేది తెలుస్తుందనేది సోక్రటీస్ వాదన. ఎవరి అంతర్వాణి వారికి దైవం అన్నారు సోక్రటీస్. ఈ బోధనలు అప్పటి సాంప్రదాయవాదులకు నచ్చలేదు. సోక్రటీస్ బోధనలకు ప్రభావితమవుతున్న యువతరం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో సెక్రటీస్ కు శత్రువులు పెరుగుతూ వచ్చారు. అలాంటి వాళ్ళలో ఒక ముగ్గురు వ్యక్తులు సోక్రటీస్ చేసే బోధనలు, చర్యలు సంఘ వ్యతిరేకం అని అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

సోక్రటీస్ పై అభియోగం…

సోక్రటీస్ పై ఫిర్యాదు చేసిన ముగ్గురిలో ఒకరు మిలేటస్, ఆయన కవి మరియు నాటక రచయిత. మరొకరు ఎనిటస్, ఒక రాజకీయవేత్త మరియు సనాతన వాది. మూడో వ్యక్తి లైకన్. వీరు ముగ్గురు కలిసి సోక్రటీస్ గ్రీకు పురాణంలోని దేవుళ్లను సోక్రటీస్ నమ్మడం లేదు, అలాగే తాను నమ్మడమే కాకుండా గ్రీకు ప్రజలు కూడా నమ్మొద్దు అని ప్రచారం చేస్తున్నాడు. ఆయన తన బోధనలతో యువతరాన్ని చెడగొడుతున్నాడు అని ఫిర్యాదు చేశారు. ఆ రోజుల్లో ఏథెన్స్ ప్రజలు ఎవరు ఎవరి గురించైనా ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ళు చేసిన అభియోగంలో నేరం చేసిన వ్యక్తి కనిపించని నేరమే చేయాల్సిన అవసరం లేదు. గ్రీకు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఫిర్యాదు చేయొచ్చు. నిజానికి సోక్రటీస్ పై అభియోగం మోపిన ముగ్గురు కూడా ఏథెన్స్ పౌరులే కనుక సోక్రటీస్ గురించిన ఫిర్యాదులు న్యాయ నిర్ణేతల బృందానికి చేరింది.

సోక్రటీస్ పై అభియోగం మోపేనాటికి అంటే క్రీస్తుపూర్వం 399 సంవత్సరంలో సోక్రటీస్ 70 నుండి 71 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాడు. అప్పటి న్యాయ నిర్ణేతల బృందం సోక్రటీస్ ను న్యాయస్థానానికి పిలిచింది. ఎంత పెద్ద సమస్యకైనా చలించకుండా, స్థితప్రజ్ఞుడయిన సోక్రటీస్ ఎప్పటిలానే ఏమాత్రం భయమూ, బెదురూ లేకుండా, కంగారు లేకుండా న్యాయస్థానానికి హాజరయ్యారు. న్యాయ నిర్ణేతల బృందం ఆయన మీద ఉన్న అభియోగాలను చదివి వినిపించింది. ఆయనపై గల అభియోగాల మీద చర్చ జరిగింది. న్యాయస్థానికి హాజరైన వాళ్లలో కొంతమంది మాత్రం సోక్రటీస్ పై వచ్చిన ఆరోపణలు సరైనవేనని నిర్ధారణకు వచ్చి, సోక్రటీస్ శిక్షార్హుడు అన్నారు. మరి కొంతమంది ఈ అభియోగాలలో నిజం లేదు, సోక్రటీస్ నిరపరాధి అన్నారు. న్యాయ నిర్ణేతల బృందం సోక్రటీస్ ను నిజం చెప్పమన్నారు.

తనపై అభియోగానికి సోక్రటీస్ వివరణ…

తనపై నేరారోపణకు సాక్రటీస్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నేను అడిగే ప్రశ్నలు కానీ, నేను చేస్తున్న బోధనలు కానీ ఏథెన్సు సమాజానికి మేలు చేసేవే తప్ప, మీరు అనుకున్నట్లు కీడు చేసేవి కాదు. మనిషి యొక్క మనసులోని ఆలోచనా శక్తిని పదునుపెట్టమని చెబితే నేరం ఎలా అవుతుంది? నేను చేసిన వ్యాఖ్యల వల్ల నన్ను అనుసరిస్తున్న వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. తమ నిత్య జీవిత సమస్యలకు పరిష్కారం కనుక్కోగలుగుతున్నాము అని చెబుతున్నారు. అలాంటిది నేనే వారిని చెడగొడుతున్నానని మీరు ఎలా అంటున్నారు? సత్యాన్వేషణ చేయడం సంఘవిద్రోహం ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. మీరు పూజించే దేవుళ్లను నేను నమ్మకపోవచ్చు, కానీ నేను చేసే పని కూడా దైవ కార్యము లాంటిదే. అంతరాత్మ అనే దైవం నాకు ఇలా చెబుతున్నాడు, నేను అలానే చేస్తున్నాను. అక్కడి నుండి వచ్చే ఆజ్ఞ మీరు చెప్పే దానికంటే బలమైనది గౌరవనీయమైనది. కాబట్టి నా అంతరాత్మ బోధనను అనుసరించే ప్రసంగిస్తున్నాను. నన్ను ప్రశ్నించడం, నేర్చుకోవడం, నేర్చుకున్నది పదిమందికి చెప్పడమనే ప్రక్రియను మానేయమంటున్నారా? అది మాత్రం కుదరని పని. ఇలా చేయడం నేరమని అంటూ ఉంటే నేను నేరస్తుడిగా నేను నిలిచిపోతాను, కానీ తత్వబోధనని నా వేదాంత మార్గాన్ని నేను మర్చిపోలేను. జీవితమంతా ఇదే పని చేస్తాను. ప్రజలను చైతన్యవంతులు చేయడం, మేధావులను చేయడం మీకు నచ్చకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు” ఇలా సాగింది సోక్రటీస్ ఉపన్యాసం.

మరణ శిక్ష ఖరారు చేసిన న్యాయ నిర్ణేతలు…

సోక్రటీస్ చెప్పిన మాటలను బట్టి ఆయన చేసేది తప్పు కాదని తెలిసి, తప్పు చేశాడని ఒప్పించలేక న్యాయ నిర్ణేతల బృందం అపహాస్యానికి గురైంది. నీవు ఇలా తలబిరుసుగా ప్రవర్తిస్తే నీకు శిక్ష వేయడం ఖాయం అన్నారు న్యాయ నిర్ణేతల బృందం. దానికి సమాధానంగా మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నారు సోక్రటీస్. నీవు ఏ శిక్ష అయినా కోరుకునే అవకాశం ఇస్తున్నాం, లేదంటే నీకు మరణశిక్ష విధిస్తాం అన్నారు న్యాయ నిపుణులు. నిజానికి మీరు నాకు శిక్ష విధించడం కాదు, నేను చేస్తున్న సామాజిక సేవకు మీరే నన్ను గౌరవించాలి, దానితో పాటు బహుమతులు కూడా ఇవ్వాలి. మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, జరిమానా విధిస్తే బంగారు నాణెం చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు సోక్రటీస్.

సోక్రటీస్ వేసిన మరణశిక్ష విన్న తన శిష్యులు ఆయనను శిక్ష నుండి తప్పించడానికి 30 బంగారు నాణేలు చెల్లిస్తాము మరణ శిక్ష రద్దు చేయమని అడుగుదామన్నారు. అందుకు సోక్రటీస్ ఒప్పుకోలేదు. మరణశిక్షకైనా సిద్ధమే కానీ, వాళ్లకు మాత్రం నేను లొంగేది లేదు, ఈ నేరం చేశానని నేను అంగీకరించేది లేదు అన్నారు సోక్రటీస్. చివరికి ఊరు విడిచి వెళ్ళిపోతానని అడిగే అవకాశం ఉన్నా కూడా అందుకు సోక్రటీస్ ఒప్పుకోలేదు. దాంతో న్యాయ నిర్ణేతల బృందానికి మరింత కోపం వచ్చింది. సంప్రదింపులకు ఆస్కారం లేకుండా వారు సోక్రటీస్ కు విషం ఇచ్చి మరణశిక్ష అమలు పరుస్తామన్నారు. అందుకు బదులుగా “నన్ను మృత్యులోకంలోకి పంపి మీరు హాయిగా జీవిద్దాం అనుకోవడం హాస్యాస్పదం అన్నారు. మీరు నమ్మే దైవం గనుక నిజంగా ఉంటే మీరు చేస్తున్న అన్యాయాన్ని ఊరుకోడు అన్నారు” సోక్రటీస్. విచారణ అంతా ఒకే ఒక్క రోజులో జరిగింది. ఆ రోజు సాయంకాలం సోక్రటీస్ కు మరణ శాసనం ఖరారైంది. ఆయన శిష్యులందరూ ఆ నిర్ణయం అన్యాయం, అక్రమం అన్నారు. కానీ లాభం లేకపోయింది.

నెల రోజులు జైలు జీవితం…

నిజానికి మరణ శిక్ష వెంటనే అమలు జరపాల్సింది. కానీ ఆ నెల మొత్తం కూడా ఏథెన్సు నగరంలో మతపరమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు పూర్తయిన తర్వాతనే మరణ శిక్ష అమలు చేయాలి. అప్పటివరకు సోక్రటీస్ జైలులో ఖైదీగా ఉండాలని న్యాయ నిర్ణేతల బృందం తీర్పు చెప్పింది. జైలులో ఉన్న నెల రోజులు సోక్రటీస్ ఇబ్బందిగా ఉన్నారు. ఆయన దేహాన్ని సంకెళ్ళతో బంధించి ఉన్నది. ప్రజలకు మరియు సమాజానికి ప్రశ్నించడం నేర్చుకోండి, మీ జీవితాలకు మీరు బాగు చేసుకోండి అని చెప్పినందుకు సోక్రటీస్ కు గ్రీకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి నెల రోజులు సంకెళ్ళతో కూడిన జైలు జీవితం, చివరి రోజు విషయం త్రాగాలి అనే నిబంధన.

సోక్రటీస్ జైలులో ఉన్న ఆ నెలరోజులలో ప్రతీ రోజూ తన శిష్యులు వస్తుండేవారు. వారితో సోక్రటీస్ ఎప్పటిలాగే వేదాంత చర్చలు చేస్తుండేవారు. వారితో సోక్రటీస్ ఎక్కువగా మృత్యువు, జీవితం, ఆత్మ అంతరాత్మ గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మేము ఎక్కువ జరిమానా కట్టిస్తామని తన శిష్యులలో కొంతమంది బ్రతిమిలాడారు. అందుకు సోక్రటీస్ ఒప్పుకోలేదు. కొంతమంది మాత్రం ప్రభుత్వ అధికారులకు తెలియకుండా మిమ్ములను జైలు నుండి తప్పిస్తామన్నారు. దానికి సోక్రటీస్ నవ్వేశారు. నేను చట్టబద్ధంగా జీవించాను, చట్టబద్ధంగానే మరణిస్తాను, నాకు మరణశిక్ష విధించడం అనేది చట్టబద్ధం అంటే, దానిని నేను గౌరవిస్తాను అన్నారు.

భోరుమని విలపించిన భార్య…

సోక్రటీస్ కు చివరి ఘడియలు సమీపిస్తున్నాయి. దాంతో ఆయన శిష్యులకు బాధ ఎక్కువైంది. కానీ సోక్రటీస్ మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఏమి జరగనట్టే సాధారణంగా ఉండేవారు. చివరి రోజున ఆయనను చూడడానికి భార్య, పిల్లలు వచ్చారు. ఉదయాన్నే సోక్రటీస్ శరీరానికి ఉన్న సంకెళ్ళను తొలగించారు. ఆయన మిత్రులు గ్రెటో, సిమియాస్, సెబెస్, ఫెడో వచ్చారు. మామూలుగానే వాళ్ళతో సంభాషణ మొదలుపెట్టారు సోక్రటీస్. ఇన్నాళ్లు చేస్తున్న సత్యశోధనలు కొనసాగించమని మిత్రులకు చెప్పారు సోక్రటీస్. ప్రజలను చైతన్యవంతులం చేసే ప్రక్రియ ఆపవద్దు అని వారితో అన్నారు. ఆరోజే భర్త చివరి క్షణాలు అని తలుచుకుని భోరున ఏడ్చింది భార్య. కొడుకుకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలియని వయసు. భార్య మరియు కొడుకును ఓదార్చడానికి చూశారు సోక్రటీస్. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, కుర్రాడు భయపడుతున్నాడు, ఇంటికి వెళ్ళండి అన్నాడు సోక్రటీస్. వాళ్ళిద్దరినీ ఇంటికి పంపే ప్రయత్నం చేయండి అని సోక్రటీస్ తన మిత్రులకు చెప్పారు. భార్య, కొడుకు ఇద్దరూ కూడా సోక్రటీస్ ను విడిచి వెళ్లలేకపోయారు. తన కాళ్లు, చేతులను నిమురుకున్నారు సోక్రటీస్. ఆయన ఎప్పటిలాగే పడక మీద మిత్రులతో ఏమీ ఎరగనట్టే సంభాషణ కొనసాగించారు.

నవ్వుతూ విషం త్రాగేసిన సోక్రటీస్…

సాయంకాలం అయ్యింది. సోక్రటీస్ స్నానం చేసి వచ్చారు. సూర్యాస్తమయం తరువాతనే విషం ఇచ్చి సోక్రటీస్ కు మరణశిక్ష అమలు చేస్తారు. మిత్రులను వెళ్ళిపోమన్నారు సోక్రటీస్, కానీ వాళ్లు వినలేదు. మరణశిక్ష అమలుజరిపే అధికారి విషం పాత్రతో వచ్చాడు. నామీద కోపం తెచ్చుకోకండి, నా బాధ్యతను నేను నిర్వర్తించాలని బాధస్వరంతో సోక్రటీస్ కు చెప్పి భావురుమన్నాడు. అధికారి సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉన్నా కూడా అధికారి దగ్గర నుంచి విషం పాత్ర తీసుకున్నారు సోక్రటీస్. కొంత భాగం దేవతలకు ఇచ్చినట్లుగా చేసి, మిగతాదంతా ఒక్క గుక్కలో త్రాగేశారు. సోక్రటీస్ విషం త్రాగుతున్నంతసేపు ఆయన చుట్టే ఉన్న మిత్రులు నలుగురు ఒక్కసారిగా బావురుమన్నారు. సమయమనంతో ఉన్న సోక్రటీస్ అయ్యో మీరు ఇలా ఏడుస్తారా? ఇలాంటి పరిస్థితి రాకూడదనే భార్య, పిల్లోడిని ఇంటికి పంపించాను. మీరైనా ధైర్యవంతులు అని మీరు ఇక్కడ ఉండడానికి అనుమతిచ్చాను. మీరు కన్నీళ్లు పెట్టవద్దు, మీకు దుఃఖం వద్దు, బాధపడవద్దు. నేను నీతిగా జీవించాను, నీతిగానే వెళ్ళిపోతున్నాను వెళ్ళండి. నేను లేని తనానికి బాగా అలవాటు పడండి అన్నారు సోక్రటీస్.

సోక్రటీస్ మహాభినిష్క్రమణం…

సోక్రటీస్ కు విషం ఇచ్చిన అధికారి ఆయనను అటూ ఇటూ నడవమని చెప్పాడు. విషం శరీరం అంతటా నెమ్మది నెమ్మదిగా ప్రాకుతుంది. ఎప్పుడైతే మీరు నడవలేకపోతున్నారో అప్పుడు మీరు పడక మీద పడుకోండి, అప్పుడు మీ కాళ్లు నేను నొక్కుతూ ఉంటాను. ఎప్పుడైతే మీకు స్పర్శ తెలియదో అప్పుడు మీరు నిస్క్రమించినట్టే అని జరగబోయే క్షణాల గురించి వివరించాడు ఆ అధికారి. దాంతో సోక్రటీస్ నెమ్మదిగా అటూ ఇటూ నడవడం ప్రారంభించారు. మిత్రులు కూడా ఆయన వెంట జైలు గదిలోనే ఉన్నారు. ఒకవైపు నడుస్తూ మరోవైపు తిరిగినప్పుడల్లా సోక్రటీస్ ఒక మిత్రుడిని భుజం తట్టి సంభాషణ కొనసాగించేవారు.

కొద్ది క్షణాల తరువాత నడవలేకపోయారు సోక్రటీస్. దాంతో పడక మీద చేరారు. శరీరమంతా మొద్దు బారుతుంది. సోక్రటీస్ పడుకున్నారు. జైలు అధికారి సోక్రటీస్ కాలు నొక్కడం మొదలుపెట్టారు. సోక్రటీస్ ను మాట్లాడుతూ ఉండమన్నాడు అధికారి. ఆ స్థితిలో కూడా మిత్రుడితో చెప్పిన చివరి వాక్యం “నేను దేవుడికి కోడిపుంజు ఒకటి ఇవ్వాలి, ఆ బాకీ తిరిగి ఇచ్చేసేయ్ అన్నారు నవ్వుతూ. చివరి క్షణంలో కూడా తాను నవ్వుతూ వారిని నవ్వించాలని ప్రయత్నిస్తున్నాడు సోక్రటీస్. స్పర్శ తెలుస్తుందా అని జైలు అధికారి అంటున్నారు. తెలుస్తుంది అంటూనే కళ్ళు మూసేశారు సోక్రటీస్. ఆయన గొంతు ఆగిపోయింది. సోక్రటీస్ లోని అవయవాలు పనిచేయకుండా విషం ఆపేసింది అని జైలు అధికారికి తెలిసింది. ఈ లోకం నుండి ఒక మేధావి మహాభినిష్క్రమణం జరిగిపోయింది.

ప్లేటో వ్రాసిన వాక్యాలు…

సోక్రటీస్ మహాభినిష్క్రమణానికి

ప్లేటో వ్రాసిన ముగింపు వాక్యాలు ఇలా ఉన్నాయి.

“సోక్రటీస్ ఒక గురువు, ఒక మిత్రుడు, ఒక పరిపూర్ణ మానవుడు అస్తమించిన సమయం. మన జీవితకాలంలోనే మనం చూడగలిగిన అత్యంత మేధావి. ఆయన నిజాయితీకి నిలువెత్తు దర్పణం. ప్రశ్నల ద్వారా ప్రపంచానికి పాఠాలు చెప్పిన నిజమైన బోధకులు మనల్ని వదిలి వెళ్ళిపోయారు”.

సోక్రటీస్ ను సమాధి చేశారు. చాలామంది పౌరులు తాము తప్పుచేశామని తెలుసుకున్నారు. పశ్చాత్తాప పడలేని తప్పు చేశామని వాళ్ళకు అర్థమైంది. సోక్రటీస్ కు మరణశిక్ష విధించిన న్యాయ నిర్ణేతల బృందాన్ని సంఘ బహిష్కరణ చేశారు. కొంతమంది ఉరేసుకుని చనిపోయారని కూడా వ్రాసారు. ఆ తరువాత ఏథెన్స్ పౌరులు సోక్రటీస్ విగ్రహాన్ని నగర మంతటా ప్రతిష్టించారు. తత్వశాస్త్రాన్ని, వేదాంతాన్ని, తర్కాన్ని ఆకాశం నుండి భూమి మీదకు దివించిన వాడు సోక్రటీస్. అతి సాధారణమైన ప్రశ్నలతో, అందరికీ అర్థమైన ఉదాహరణలతో, ఎంతో నేర్చుకోవచ్చని, సత్యమైన జీవన విధానాలను ఎవరికి వాళ్లే తెలుసుకోవచ్చని నిరూపించిన వేదాంతి తత్వవేత్త సోక్రటీస్ చరిత్రలో గొప్పగా నిలిచిపోయారు.

Show More
Back to top button