
కేంద్ర ప్రభుత్వ మద్దతు, హామీ కలిగిన పథకాల్లో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF) ఒకటనీ అందరికీ తెలుసు. ఈ పథకంలో పెట్టుబడులు, వడ్డీ, మెచ్యూరిటీ.. సెక్షన్ 80సీతో పాటు ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు బెనిఫిషరీస్ కు లభిస్తుంది. రిటైర్మెంట్ తరువాత సేవింగ్స్, పిల్లల భవిష్యత్ కోసం పెద్ద మొత్తంలో జమ చేయాలనుకునేవారికి ఈ స్కీం బెస్ట్ అని చెప్పవచ్చు.
ఈ పథకాన్ని మెచ్యూరిటీ (15ఏళ్లు) తర్వాత కొనసాగిస్తే మంచిదేనా? అంటే మంచిదే అండి..
దాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తే ఎంతొస్తుంది? ఎలా ఉంటుందనే వివరాలు మనం తెలుసుకుందాం:
పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులోగానీ, ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోగానీ తెరవొచ్చు. వీటి పూర్తి కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఇయర్లీ కనీస డిపాజిట్ కింద రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. వడ్డీ ఏడాదికి ప్రస్తుతం 7.10% వరకు లభిస్తోంది. ఈ డిపాజిట్‌కు, వడ్డీకి ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి 100% రిస్క్ లేనిది.
ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ డిపాజిట్‌పై పొందిన వడ్డీపై ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. దీనివల్ల బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే, పీపీఎఫ్ ఖాతా ద్వారా అధిక రాబడి అనేది మీరు పొందవచ్చు. బ్యాంకు ఎఫ్డీలు, డెట్, మ్యూచువల్ ఫండ్లపై వచ్చే రాబడిపై పెట్టుబడిదారుడు ఆదాయ పన్ను శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఖాతాను ఎన్నేళ్లు పొడిగించుకోవచ్చు..?
పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. గడువు తర్వాత మూసేయవచ్చు. కావాలంటే పొడిగించుకోవచ్చు. అయితే ఈ పొడిగింపు ఐదేళ్ల బ్లాక్ చొప్పున ఎన్నిసార్లు అయిన పొడిగించుకునే వీలుంది. ఖాతాను పొడిగించాలంటే మెచ్యూరిటీకి ఏడాదిలోపు దరఖాస్తు తప్పక చేసుకోవాలి. పొడిగించే కాలానికి డిపాజిట్ అనేది చేయవచ్చు లేదంటే చేయకుండా కూడా కొనసాగించొచ్చు. కావాలంటే ఈ 5 ఏళ్ల పొడిగింపు పూర్తయ్యేలోపు పెట్టుబడిదారుడు అవసరాల నిమిత్తం ఒక బ్లాక్‌లో గరిష్ఠంగా 60% బ్యాలెన్స్‌ని విత్‌డ్రా చేసుకునే వీలుంది. పీపీఎఫ్‌లో జమ చేసేవారు నెలలో 1 నుంచి 5వ తేదీలోపు డిపాజిట్ చేస్తే ఆ నెలలో డిపాజిట్ అయిన మొత్తానికి వడ్డీ పొందొచ్చు.
అలా చూస్తే.. ఎంత వడ్డీ వస్తుంది..?
ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాలో జమయ్యే మొత్తాలపై 7.1% వడ్డీ వస్తుంది. 15ఏళ్ల పాటు ఈ ఖాతాలో గరిష్ఠ డిపాజిట్ మొత్తం అయిన రూ.1.50 లక్షలు చొప్పున జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.40.68 లక్షలు వస్తుంది. ఇందులో మీ అసలు 22.50 లక్షలు కాగా.. వడ్డీ రూ.18.18 లక్షలు వస్తుంది.
ఒకవేళ మీరు మీ పీపీఎఫ్ ఖాతాను 5 సంవత్సరాలు పొడిగించి సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడిని కొనసాగిస్తే 20 ఏళ్ల తర్వాత సుమారు రూ.67 లక్షలు వరకు పొందొచ్చు. మరో 5 ఏళ్లు అంటే, 25 ఏళ్ల వరకు ఇదే పెట్టుబడితో కొనసాగిస్తే మెచ్యూరిటీ విలువ రూ.1.03 కోట్లుగా ఉంటుంది.
ఒకవేళ మీరు మెచ్యూరిటీ తర్వాత ఎలాంటి పెట్టుబడులు కొనసాగించకుండా 5 ఏళ్ల పాటు పీపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే.. అసలూ వడ్డీ కలిపి 20 ఏళ్లకు రూ.57.32 లక్షలు వస్తుంది. పొడిగించిన ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.16 లక్షలు వడ్డీ వస్తుంది.
ఒకవేళ మీకు ఎటువంటి ఆర్థిక అవసరాలు లేవు అనుకుంటే గనుక మీ ఖాతాను మెచ్యూరిటీ తర్వాత కూడా పొడిగించడమే మంచిది. అప్పుడే చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. తక్కువ వయసులోనే ఈ ఖాతాను తెరవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి.