
ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ పెరుగుదల గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. 2023 నుండి 2024 మధ్య ప్రపంచ సగటు కార్బన్ డయాక్సైడ్ స్థాయి రికార్డు స్థాయిలో 3.5 పీపీఎం పెరిగింది. 1957లో కొలవడం మొదలుపెట్టిన తర్వాత ఇంత భారీ పెరుగుదల ఇదే తొలిసారి. దీనితో 2024లో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వాయువు స్థాయి గత 8 లక్షల సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 423.9 పీపీఎంకు చేరుకుంది.
1960ల నుంచి కాలుష్యం పెరిగే వేగం దాదాపు మూడు రెట్లు ఎక్కువైంది. గతంలో నెమ్మదిగా పెరిగేది కానీ ఇప్పుడు ఒక్కసారిగా 3.5 పీపీఎంకు పెరగడం మరింత భయాన్ని కలిగిస్తోంది. దీనికి తోడు, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి ఇతర వేడిని పెంచే వాయువులు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ఈ వాయువులన్నీ కలిసి 1990 నుంచి భూమిపై వేడిని నిల్వ చేసే శక్తిని 54 శాతం పెంచాయి.
మానవ తప్పిదాలు – ప్రకృతి బలహీనత
ఈ అతిపెద్ద పెరుగుదలకు ముఖ్యంగా రెండు ప్రమాదకరమైన కారణాలు ఒకటి మనం చేసే పనుల వల్ల విడుదలయ్యే కాలుష్యం, రెండు ప్రకృతిలో కాలుష్యాన్ని పీల్చుకునే శక్తి తగ్గడం. ఇది భూమిపై ఉన్న కార్బన్ చక్రంలో ఒక పెద్ద సమస్య ఏర్పడిందని సూచిస్తుంది. బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను వాడకాన్ని తగ్గిస్తామని ప్రపంచ దేశాలు ప్రమాణాలు చేసినప్పటికీ వాటిని మండించడం ఆగలేదు. కార్బన్ డయాక్సైడ్ వాయువు పెరుగుదలలో ఎక్కువ భాగం ఇంకా ఈ శిలాజ ఇంధనాల నుంచే వస్తుంది. సాధారణంగా సముద్రాలు, అడవుల వంటి ప్రకృతి వ్యవస్థలను ‘కార్బన్ సింక్‌లు’ అంటారు.
ప్రతి సంవత్సరం మనం విడుదల చేసే కాలుష్యంలో దాదాపు 50 శాతం వరకు ఇవి పీల్చుకుంటాయి. అయితే 2024లో వీటి కాలుష్యాన్ని పీల్చుకునే సామర్థ్యం తగ్గిందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది. వీటికి తోడుగా తీవ్రమైన వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి. 2024లో రికార్డు స్థాయి వేడి, ఎల్ నినో ప్రభావం వల్ల అమెజాన్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో భయంకరమైన కరువులు, పెద్ద అటవీ మంటలు వచ్చాయి. ఈ మంటల ద్వారా అడవుల్లో నిల్వ ఉన్న భారీ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు తిరిగి గాలిలోకి విడుదలవ్వడం ఈ పెరుగుదలను మరింత వేగవంతం చేసింది.
ప్రకృతి సహకరించడం లేదు:
ఈ రికార్డు పెరుగుదల చూస్తుంటే.. వాతావరణ సంక్షోభం నెమ్మదిగా జరగడం లేదు. ఇది తనకై తాను వేగాన్ని పెంచే ప్రమాదకరమైన వలయంలోకి మారుతోందనే హెచ్చరిక ఇస్తుంది. ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కాలుష్యాన్ని పీల్చుకునే కార్బన్ సింక్‌లు బలహీనపడటం. ఉష్ణోగ్రత పెరిగిన సముద్రాలు తక్కువ కార్బన్ డయాక్సైడ్ వాయువును పీల్చుకుంటాయి. అదే సమయంలో అవి ఆమ్లంగా మారి సముద్రంలోని జీవులకు ప్రమాదంగా మారుతాయి.
భూమిపై కూడా, విపరీతమైన వేడి, కరువుల వల్ల మొక్కలు ఒత్తిడికి గురై కాలుష్యాన్ని తక్కువగా పీల్చుకుంటాయి. ఈ ఒత్తిడి తీవ్రమైతే భారీగా చెట్లు చనిపోతాయి, అరణ్యాలు కాలిపోతాయి. దీనివల్ల నిల్వ ఉన్న కార్బన్ తిరిగి గాలిలో కలిసి, ఆ అటవీ ప్రాంతం కాలుష్యాన్ని పీల్చుకోవడం మానేసి, కాలుష్యాన్ని విడుదల చేసే ప్రాంతంగా మారుతుంది. ఈ వలయం మనకు ఏం చెబుతోందంటే మనం కాలుష్యాన్ని తగ్గించినా లేదా ఆపినా, ప్రకృతి కూడా తన శక్తిని కోల్పోయి నిల్వ ఉన్న కార్బన్‌ను విడుదల చేయడం మొదలుపెడితే మొత్తం వాతావరణ వ్యవస్థ మరింత వేగంగా వేడెక్కుతుంది.
దీర్ఘకాలిక ప్రభావం – ప్రపంచ దేశాలకు హెచ్చరిక
కార్బన్ డయాక్సైడ్ వాయువు చాలాకాలం వాతావరణంలో ఉండే కాలుష్య వాయువు. ఇది గాలిలో శతాబ్దాల పాటు ఉంటుంది. అందుకే 423.9 పీపీఎం స్థాయి అనేది తాత్కాలికం కాదు. ఇది రాబోయే తరాలకు కూడా అధిక ప్రపంచ ఉష్ణోగ్రతలకు దీర్ఘకాలిక కట్టుబాటును సూచిస్తుంది. ఈ వాయువులు పట్టి ఉంచే వేడి, మనం ఉద్గారాలను వెంటనే తగ్గించినా కూడా, భవిష్యత్తులో కరువులు, వరదలు లాంటి వాతావరణ మార్పులను, తీవ్రమైన విపత్తులను పెంచుతూనే ఉంటుంది. ఈ డేటా ప్రకారం పారిస్ ఒప్పందంలో నిర్ణయించిన 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిమితిని చేరుకోవడం మరింత కష్టమని తెలుస్తోంది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక అంతర్జాతీయ విధానాలకు ‘రెడ్ అలర్ట్’గా పనిచేస్తుంది. కాలుష్యాన్ని కేవలం ‘తగ్గిస్తాం’ అనే మాటలు చాలవు. శిలాజ ఇంధనాలను తక్షణమే పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. ప్రపంచ లక్ష్యాలను పెంచడంతో పాటు, కాలుష్యాన్ని పీల్చుకునే అడవులు, సముద్రాలను కాపాడడానికి కూడా ప్రయత్నాలు చేయాలి.
భారతదేశానికి సవాల్:
ఈ రికార్డు స్థాయి బొగ్గుపులుసు వాయువు పెరుగుదల మన దేశానికి చాలా పెద్ద ప్రమాద ఘంటిక. ప్రపంచ దేశాలు కలిసి కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలం కావడం వల్ల, వాతావరణం మరింత వేడెక్కి, తీవ్రమైన వాతావరణ మార్పులు మొదలయ్యాయి. ఈ మార్పుల వల్ల మన దేశంలోనే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఊహించని వరదలు, భరించలేని ఎండలు, రుతుపవనాలలో మార్పులు వంటివి పెరిగి మన వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయి. ఇది పేద ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వాతావరణ న్యాయం కోణంలో చూస్తే ఈ పెరుగుదల మనకు అన్యాయం. మన దేశంలో ఒక్కొక్క మనిషి చేసే కాలుష్యం అంటే తలసరి కాలుష్యం ధనిక దేశాల కంటే చాలా తక్కువ. కానీ పాత కాలం నుండి ఎక్కువ కాలుష్యం చేసిన ధనిక దేశాల తప్పుల వల్ల, ఇప్పుడు ఈ మార్పుల కష్టాన్ని మాత్రం మనమే ఎక్కువ భరించాల్సి వస్తోంది.
ఈ పరిస్థితి మన ముందు ఒక పెద్ద సవాలును ఉంచుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా మనకు విద్యుత్, పరిశ్రమల కోసం శక్తి చాలా అవసరం. అందుకే మన మొత్తం కాలుష్యం పెరుగుతోంది. దీనిని తగ్గించడానికి మనం 2030 నాటికి 50 శాతం విద్యుత్తును సోలార్, పవన శక్తి వంటి కాలుష్యం లేని వనరుల నుండి పొందాలని అలాగే 2070 నాటికి పూర్తిగా కాలుష్యం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ ప్రయత్నాలు గొప్పవే. కానీ ప్రపంచ స్థాయిలో కాలుష్యం చాలా వేగంగా పెరుగుతోంది. కాబట్టి ధనిక దేశాలు తమ చారిత్రక తప్పులకు పరిహారంగా, మనకు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధులు, కొత్త టెక్నాలజీ వెంటనే ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయాల్సిన సమయం ఇది.
ఇకపై భారతదేశం వీటిని ఎదుర్కోడానికి చాలా గట్టిగా చేయాలి. కాలుష్యం లేకుండా వేగంగా కొత్త ఇంధన వనరులకు మారాలి. ప్రజలను కాపాడడానికి కరవును తట్టుకునే విత్తనాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు వంటివి నిర్మించాలి. వాతావరణ మార్పులకు ప్రపంచ వేదికపై పోరాడాలి. ధనిక దేశాలను బాధ్యులను చేయాలి. ‘కాలుష్యం ఎవరు ఎక్కువ చేశారో, వారే ఎక్కువ తగ్గించాలి’ అనే సిద్ధాంతాన్ని గట్టిగా నిలబెట్టాలి. ఈ రికార్డు కాలుష్యం పెరుగుదల అనేది మనమందరం మారాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.










