
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంకేతంగా జనవరి 4న ఉదయం ఢిల్లీ నుంచి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం చేరుకున్నారు. ఉదయం 11:01 గంటలకు ఈ విమానం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. విమానం భూమిని తాకగానే దానికి వాటర్ సెల్యూట్ ద్వారా ఘన స్వాగతం పలికారు. రన్‌వే పరీక్ష విజయవంతం కావడం అంటే ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయినట్లేనని మంత్రి అభివర్ణించారు. పైలట్ విమానంలో “మరికొద్ది సేపట్లో మనం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతున్నాం” అని చేసిన ప్రకటన తన జీవితంలో మర్చిపోలేని క్షణమని మంత్రి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కేవలం ఒక విమాన ల్యాండింగ్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం కావడానికి వేసిన బలమైన అడుగు.
శంషాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు దీటుగా..
భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక ప్రాంతీయ విమానాశ్రయం మాత్రమే కాదు. ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబడుతున్న అద్భుత కట్టడం. శంషాబాద్ (హైదరాబాద్) మరియు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, గత 18 నెలల్లో పనులు యుద్ధప్రతిపాదికన జరిగాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 23 శాతం పనులు మాత్రమే పూర్తవగా, ప్రస్తుతం 96 శాతం పనులు పూర్తి చేసి దేశంలోనే అత్యంత వేగంగా నిర్మించిన విమానాశ్రయంగా భోగాపురం రికార్డు సృష్టించింది. రాబోయే నాలుగు ఐదు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేసి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చే Economic Corridor
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక భారీ ఆర్థిక నడవాగా (Economic Corridor) మారబోతోంది. ఇది కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ముఖ్యంగా ఇక్కడ విమానాల నిర్వహణ మరియు మరమ్మతుల కేంద్రం (MRO – Maintenance, Repair and Overhaul) దేశంలోనే అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుంది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలలోని ఎంఆర్ఓ కేంద్రాలకు దీటుగా ఇక్కడ సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. యువత కేవలం ఉద్యోగాల కోసం వెతకడమే కాకుండా, విమానయాన రంగ అనుబంధ విభాగాలలో తమకు తాముగా ఉపాధి సృష్టించుకునే స్థాయికి ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక స్థితిగతులు వేగంగా మారుతాయని, ఈ ప్రాంతం ప్రపంచ అగ్రశేణి నగరాల జాబితాలో నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఎడ్యూ సిటీ మరియు విమానయాన అనుబంధ విభాగాలు
విమానాశ్రయానికి అనుబంధంగా విద్యా మరియు పారిశ్రామిక రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. జీఎంఆర్ (GMR) మరియు మాన్సాస్ (MANSAS) సంయుక్త భాగస్వామ్యంతో సమీపంలోని అన్నవరం వద్ద 136 ఎకరాలలో భారీ ‘ఎడ్యూ సిటీ’ (Edu City) ఏర్పాటు కానుంది. ఇది విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. విమానాశ్రయం కోసం కేటాయించిన 2,203 ఎకరాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 500 ఎకరాలను విమానయాన అనుబంధ విభాగాల కోసం కేటాయించింది. ఈ అదనపు స్థలంలో విమానయాన శిక్షణ సంస్థలు, లాజిస్టిక్స్ హబ్స్ మరియు ఇతర సాంకేతిక కేంద్రాలు వెలుస్తాయి. ఫలితంగా భోగాపురం ఒక సమగ్ర అభివృద్ధి కేంద్రంగా మారి, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించనుంది. దేశంలోనే ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘స్టార్ ఎయిర్’ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆక్వా, ఫార్మా రంగాలకు ఊతం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సరకు రవాణాకు (Cargo) అత్యంత అనుకూలమైనది. ఉత్తరాంధ్రలో కీలకమైన ఫార్మా మరియు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు ఇది కేంద్ర బిందువుగా మారుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి ఏటా ఐదారు వేల టన్నుల సరకు రవాణా జరుగుతుండగా, భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చాక ఇది 20 వేల టన్నులకు పైగా పెరుగుతుందని అంచనా. పశ్చిమ ఆసియా మరియు తూర్పు ఆసియా దేశాలకు నేరుగా కనెక్టివిటీ పెంచేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుండి 33 విమాన సర్వీసులు నడుస్తుండగా, భోగాపురం ప్రారంభమైన తర్వాత దేశీయ మరియు అంతర్జాతీయ సర్వీసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పర్యాటక రంగం పుంజుకోవడమే కాకుండా, స్థానిక రైతులకు తమ వ్యవసాయ మరియు ఆహారోత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు నేరుగా ఎగుమతి చేసుకునే సదుపాయం కలుగుతుంది.
బీచ్ కారిడార్ మరియు పలాస ఎయిర్పోర్ట్
మంత్రి రామ్మోహన్ నాయుడు కేవలం భోగాపురంతోనే ఆగకుండా, ఉత్తరాంధ్ర అంతటా కనెక్టివిటీని పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను వివరించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా విశాఖ-భోగాపురం బీచ్ కారిడార్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఇప్పటికే చర్చించారని తెలిపారు. ఇది పర్యాటక రంగానికి పెను మార్పును ఇస్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణానికి అనుబంధంగా, పలాసలో కూడా ఒక కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఉత్తరాంధ్రలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. భోగాపురం విమానాశ్రయం స్థిరాస్తి (Real Estate) వ్యాపారానికి కూడా పెద్ద దిక్కుగా మారుతుందని, తద్వారా స్థానిక ప్రజల ఆస్తుల విలువ పెరిగి ఆర్థికంగా బలపడతారని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీభరత్, సీఎం రమేష్ తదితర ప్రముఖులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.










