
ప్రస్తుతం చాలామంది వాలెట్లో క్రెడిట్ కార్డ్ ఉంటోంది. దీనితోనే ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారు. అయితే, పలుసార్లు క్రెడిట్ కార్డు పోవడమో.. చోరీకి గురి కావడమో లాంటివి జరుగుతాయి. అలాంటి సమయంలో మీ డబ్బుని సురక్షితం చేయడానికి పలు పనులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది.
కార్డు బ్లాక్ చేయడం: ఒకవేళ మీ దగ్గర వైఫై క్రెడిట్ కార్డు ఉంటే పిన్ లేకుండానే సులువుగా రూ.5 వేల వరకు లావాదేవీలు చేయవచ్చు. కాబట్టి, మీ క్రెడిట్ కార్డు పోయిన వెంటనే దానిని బ్లాక్ చేయండి. దీనివల్ల ఎలాంటి డబ్బు నష్టం ఉండదు.
బ్యాంకుకు చెప్పాలి: మీ క్రెడిట్ కార్డు పోయిన వెంటనే మీ బ్యాంకు వారిని సంప్రదించి జరిగిన విషయం చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల వారు మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసి కొత్త కార్డును ఇస్తారు.
FIR ఫైల్ చేయాలి: మీ బ్యాంకు వారికి సమాచారం అందించిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి FIR ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ క్రెడిట్ కార్డు మీద ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే క్లెయిం చేసుకోవడానికి వీలు ఉంటుంది.
క్రెడిట్ బ్యూరోని సంప్రదించాలి: క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్న విషయాన్ని క్రెడిట్ కార్డ్ బ్యూరోకు కచ్చితంగా తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.
అలాగే, మీ క్రెడిట్ కార్డు లావాదేవీలను గమనించండి. మీ కార్డు పోయినప్పటి నుంచి దానిని బ్లాక్ చేసే వరకు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే బ్యాంకు వారికి ఫిర్యాదు చేయండి. ఇలా మీరు మీ డబ్బును దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు.










