HISTORY CULTURE AND LITERATURE

ఈజిప్టు ప్రజల మన్ననలను అందుకున్న టోలమిక్ రాజవంశ రాణి.. క్లియోపాత్ర..

ప్రపంచ రాజరికపు చరిత్రలో ఈజిప్టుది ప్రత్యేకమైన స్థానం. జాతీయ గుర్తింపులో ఈజిప్టుకు సుదీర్ఘమైన సాంస్కృతిక వారసత్వం అంతర్భాగంగా ఉంది. ఇది గ్రీకు, రోమను, పర్షియను, ఒట్టోమను, అరబు, టర్కీ, నూబియనులతో పలు విదేశీ సంస్కృతులను ప్రభావితం చేసి తరచూ సమ్మిళితమైంది. అదేవిధంగా ఇక్కడ గిజా నెక్రోపోలిసు దాని గ్రేటు స్పింక్సు వంటి స్మారక కట్టడాలు, కర్నాకు, మెంఫిసు, కింగ్సు, తెబెసు, లోయ శిథిలాలు ఈ వారసత్వాన్ని, శాస్త్రీయదృక్పథాన్ని తరుచూ ప్రతిబింబిస్తాయి. 16 వ నుండి 20 వ శతాబ్దం ప్రారంభం వరకు, ఈజిప్టు విదేశీ సామ్రాజ్య శక్తులు, ఒట్టోమను సామ్రాజ్యం, బ్రిటీషు సామ్రాజ్యం పాలించాయి.

1952 తిరుగుబాటు తరువాత ఈజిప్టు బ్రిటీషు సైనికులను, బ్యూరోక్రాట్లను బహిష్కరించడంతో బ్రిటీషు ఆక్రమణ ముగిసింది. యునైటెడు అరబు రిపబ్లికును రూపొందించడానికి 1958 లో సిరియాలో విలీనం అయ్యింది. 20 వ శతాబ్దపు రెండవ సగభాగంలో ఈజిప్టు 1948, 1956, 1967 ఇజ్రాయెలుతో పలు సాయుధ పోరాటాలు చేస్తూ సామాజిక, మత కలహాలు, రాజకీయ అస్థిరతలను ఎదుర్కొంది. ఇటీవల 2011 విప్లవం పరిణామాలతో రాజకీయ అశాంతితో, దేశం తీవ్రవాదం, ఆర్థికాభివృద్ధి క్షీణతకు దారితీసింది. 2016 లో ఈజిప్టు దక్షిణాఫ్రికాను అధిగమించి, నైజీరియా తరువాత ఆఫ్రికా రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఐక్యరాజ్యసమితి, నాన్-అలైండ్ ఉద్యమం, అరబు లీగు, ఆఫ్రికా యూనియన్, ఇస్లామికు సహకార సంస్థ వ్యవస్థాపక సంస్థగా ఉంది.

అయితే క్రీస్తుపూర్వం 332 నుండి 30 వ సంవత్సరం వరకు గల టోలమిక్ రాజవంశ చరిత్ర ఈజిప్టుకు ప్రత్యేకమైనది. టోలమిక్ 1 నుండి టోలమిక్ 14 వరకు, క్లియోపాత్ర 1 నుండి క్లియోపాత్ర 7 వరకు ఈజిప్టు రాజ్యాన్ని పరిపాలించిన విధానం, రాజ్యం కోసం సొంత తమ్ముడినే అక్క పెళ్లిచేసుకోవడం, సొంత అన్ననే చెల్లెలు పెళ్లిచేసుకోవడం, రాజ్యం కోసం ఒకరినొకరు చంపుకోవడం లాంటివి ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. తండ్రి టోలమిక్ 12 పరిపాలన దుర్వినియోగంతో ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని రూపుమాపడానికి క్లియోపాత్ర 7 సుపరిపాలన అందించారు.

ఆమె పరిపాలనలో రాజ్యం యొక్క ఆర్థికస్థితి మెరుగుపడింది, పంటలు సమృద్ధిగా పండాయి, దేవాలయాలు పునరుద్దరణ జరిగాయి, విద్యావ్యవస్థ గాడిలో పడింది. ఆమె మాతృభాష కోయిన్ గ్రీకు అయినా కూడా ఆమె ఈజిప్షియన్ భాషను నేర్చుకుని, ఈజిప్షియన్ భాషలోనే పరిపాలన చేసిన ఏకైక టోలెమిక్ పాలకులు క్లియోపాత్ర. తాను ఈజిప్టు సింహాసనాన్ని ఎలా అధిరోహించింది? అలెగ్జాండ్రియా సింహాసనాన్ని ఎలా కోల్పోయింది? తిరిగి అధికారం దక్కించుకోవడానికి జూలియస్ సీజర్ తో ఎలా జతకట్టింది? రెండవసారి రాణిగా సింహాసనం ఎక్కి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చింది? పరిపాలన ఎలా సాగింది? కథనం మీకోసం..

టోలమిక్ రాజవంశ చరిత్ర..

ప్రపంచదేశాలలో సుదీర్ఘ చరిత్రకలిగిన దేశాలలో ఈజిప్టు ఒకటి. ఈజిప్టు నాగరికత ఒకానొక నాగరికతకు జన్మస్థానంగా పరిగణించబడుతుంది. ప్రాచీన ఈజిప్టు రచన, వ్యవసాయం, పట్టణీకరణ, వ్యవస్థీకృత మతం, కేంద్ర ప్రభుత్వం, ప్రారంభ అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి. అలాంటి ఈజిప్టు రాజవంశంలో కొన్ని విలక్షణమైన ఆచారాలు ఉండేవి. ఈజిప్టును పరిపాలించిన వారిలో ప్రముఖులు క్లియోపాత్ర – 7. ఈమె టోలమిక్ రాజవంశంలో జన్మించారు. “అలెగ్జాండర్ ది గ్రేట్” చక్రవర్తి ఈజిప్టుని పర్షియన్ల ఆక్రమణ నుండి రక్షించిన క్రీస్తుపూర్వం 332 నుండి క్లియోపాత్ర మరణించిన క్రీస్తుపూర్వం 30 వ సంవత్సరం వరకు సుమారు 300 సంవత్సరాలు పరిపాలనా చరిత్ర కలిగి ఉంది. ఆ టోలమిక్ రాజవంశంలో కొన్ని తరాలపాటు విచిత్రమైన ఆచారాలు ఉండేవి.  టోలమిక్ రాజవంశం రక్తం కలుషితం కాకూడదని వారు ఇతరులను వివాహం చేసుకునేవారు కాదు. అందువలన అక్కచెల్లెలు, అన్నదమ్ములు, తండ్రి సవతి కూతురు ఒకరినొకరు పెళ్లిళ్లు చేసుకునేవారు, అలాగే పిల్లలను కూడా కనేవారు. అందుకే టోలమిక్ రాజవంశాన్ని గానీ, ఆ వంశవృక్షాన్ని గానీ అర్థం చేసుకోవడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారంగా ఉండేది. వారిలో వారే కొంతమంది తల్లులు మేనత్తలు అవ్వొచ్చు, కొంతమంది అమ్మమ్మలు కొందరికి పిన్నిలు కావచ్చు, కొంతమంది తండ్రులే వారికి మేనమామలు కూడా అయ్యే అవకాశం ఉండేది. అదొక గందరగోళమైన ఆచార వ్యవహారాలు గలిగిన సంబంధబాంధవ్యాలు. ఇదంతా కేవలం వాళ్ళ రాజ్యాధికారం కాపాడుకోవడం కోసం మాత్రమే.

అధికారం కోసం ఒకరినొకరు చంపుకునే ఈజిప్టు రాజులు..

ఈజిప్టును పరిపాలించే రాజులను ప్రజలు దేవుళ్ళలాగా భావించేవారు. అందుకే వాళ్ళను ఆ రాజవంశ రాజుల్ని “ఫెరోస్” అనేవారు. మనకు చరిత్ర తెలిపిన రాజుల కంటే ఫెరోస్ శక్తివంతమైన వాళ్ళని, వారు కూడా రాజులే అయినా, రాజులకు మించి దేవుళ్ళని ప్రజలు ఊహించేవారు. “ఫెరో” అంటే దైవ సంబంధీకులు, దైవాంశ సంభూతులు అని అప్పటి ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం. ఫెరోస్ అనేవారు కేవలం రాజ్యానికి రాజులుగా మాత్రమే కాకుండా, మత గురువులుగా, మత బోధకులుగా, అన్నిటికీ మించి ప్రజలకి, దైవానికి అనుసంధాన కర్తలుగా ప్రజలు విశ్వసిస్తుండేవారు. అలాగే ఈజిప్టు రాజవంశంలో మహిళలు క్లియోపాత్ర, పెరినిస్, ఆర్సినో ఇలా మూడు పేర్లు మాత్రమే కలిగి ఉండేవారు. ఆ తరువాత జన్మించిన వారికి క్లియోపాత్ర 1, క్లియోపాత్ర 2, క్లియోపాత్ర 3 ఇలా ఉండేవి. పురుషులలో టోలమిక్ 1, టోలమిక్ 2, టోలమిక్ 3 ఇలా ఉంటూ ఉండేవి. ఈజిప్టు రాజవంశం ఎక్కువగా రక్తచరిత్రను కలిగి ఉంది. రాజ్యాధికారం కోసం సొంత కుటుంబ సభ్యులలో ఒకరినొకరు హతమార్చుకోవడం చేసేవారు. టోలమిక్ రాజవంశం మూడు వందల సంవత్సరాల చరిత్రలో ఇది తరుచూ కనిపిస్తుంది. మధ్యధరా సముద్రానికి ఒకవైపు ఈజిప్టు, మరొకవైపు రోమ్, దాని పక్కన గ్రీసు రాజ్యాలు ఉండేవి. ఈజిప్టుకు ఒకవైపు సిరియా ఉంటుంది. క్లియోపాత్ర కథనం ఈజిప్టు, రోమ్ అనే రెండు దేశాల మధ్య సాగుతుంది.

పర్షియన్లను ఈజిప్టు నుండి తరిమి కొట్టిన అలెగ్జాండర్…

క్రీస్తుపూర్వం 330 సంవత్సర ప్రాంతాలలో ఈజిప్టు రాజ్యం అనేది పర్షియన్ల ఆక్రమణలో ఉండేది. అయితే వాళ్ళు పర్షియన్లు మాత్రం ఈజిప్షియన్ వంశీయుల మత విశ్వాసాలని గౌరవించేవారు కాదు. వారు ఈజిప్షియన్ల దేవాలయాలను ధ్వంసం చేశారు, ఈజిప్షియన్ల సంస్కృతి, సంప్రదాయాలను కూడా సర్వనాశనం చేసేశారు. ఆ సమయంలో ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను, తమ విశ్వాసాలను కాపాడడానికి  తమను కాపాడడానికి ఎవరైనా వస్తే బావుండు అని ఎదురుచూస్తున్న సమయంలో, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ తమ ఈజిప్టు మీద దండయాత్ర చేశారు. గ్రీకు రాజ్యానికి పర్షియన్ల నుండి ప్రమాదం ఉందని గ్రహించిన అలెగ్జాండర్, తమ రాజ్యాలకు పర్షియన్లు రాకుండా ఉండాలంటే, వారిని ఈజిప్టు రాజ్యం నుండి వెళ్లగొట్టాలని ఉద్దేశంతో క్రీస్తుపూర్వం 332 లో ఈజిప్టు మీద దండయాత్ర చేసి, ఏమాత్రం కష్టపడకుండా పర్షియన్లను తరిమికొట్టారు అలెగ్జాండర్. ఆ సమయంలో అలెగ్జాండర్ విజయం సులభం కావడం కోసం ఈజిప్టు ప్రజలే అలెగ్జాండర్ సైన్యానికి సహాయం చేశారు. పర్షియన్లను తరిమికొట్టడంలో తమవంతు తోడ్పాటును అందించారు. ఈజిప్షియన్ల సాంప్రదాయాలను, మత విశ్వాసాలను, సంస్కృతులను పునరుద్ధరిస్తారని అలెగ్జాండర్ హామీ ఇచ్చారు. ఈజిప్టు రాజ్యంలో అరేబియా సముద్రానికి ప్రక్కన కొత్త పట్టణాన్ని నిర్మించారు, అందువలన అలెగ్జాండర్ పేరు మీదనే ఆ నగరానికి అలెగ్జాండ్రియా అని పేరు వచ్చింది. ఆ తరువాత అలెగ్జాండ్రియా నగరం సమీప రాజ్యాలకు ప్రతిష్టాత్మక సాంస్కృతిక నగరంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది పుస్తకాలకు ఆ నగరం గ్రంథాలయంగా మారింది.

టోలమిక్ రాజవంశం ప్రారంభం..

అప్పటికే అలెగ్జాండర్ దగ్గర అంగరక్షకుడిగా పనిచేస్తున్న “షోటర్” అనే సైనికాధికారి క్రీస్తు పూర్వం 331 వ సంవత్సరంలో ఈజిప్టుకు రాజయ్యాడు. షోటర్ తోనే “టోలమిక్” రాజవంశం మొదలైంది. ఆయనను “టోలమిక్ 1” అని పిలవడం మొదలుపెట్టారు. ప్రాథమికంగా టోలమిక్ రాజ వంశస్థులు ఈజిప్టుకి చెందినవారు కాదు, వారు “గ్రీకు” దేశానికి చెందినవారు. టోలమిక్ రాజులలో టోలమిక్ 1 దేవాలయాలన్నింటిని పునరుద్ధరించారు, మత గురువులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందువలన ఆయన మంచితనాన్ని ప్రచారం చేస్తూ మూడు భాషలలో శిలాఫలకాలు తయారు చేశారు.  దానిని రోసెట్టార్ స్టోన్ అంటారు. అలనాటి ఈజిప్ట్ చారిత్రాత్మకతను అధ్యయనం చేయడానికి రోసెట్టార్ స్టోన్ కీలకమైన పాత్ర పోషించింది. టోలమిక్ 1 తన రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి సిరియా రాజ కుమార్తెలను పెళ్లాడారు. ఆమె క్లియోపాత్ర 1. టోలమిక్ 1 మరియు క్లియోపాత్ర 1 లతో మొదలైన ఈజిప్టు టోలమిక్ రాజవంశ  రాజులు తమ ప్రక్కనున్న రాజ్యాల నుండి దండయాత్రలు, దాడులు జరగకుండా సుమారు 300 సంవత్సరాల పాటు కాపాడుతూ వచ్చారు.

టోలమిక్ 12 అసమర్థ పాలన…

మూడు శతబ్దాల కాలంలో ఈజిప్టు ప్రజలకు వ్యవసాయం మెరుగ్గా సాగి, పంటలు సమృద్ధిగా  పండుతూ వచ్చాయి. విలువైన బంగారు గనులు కూడా బయటపడడం వలన ఆరోజుల్లో ఈజిప్టు శక్తిమంతమైన రాజ్యమైపోయింది. అలా ఆ వైభవం 250 సంవత్సరాలు కొనసాగింది. క్రీస్తుపూర్వం 80 వ సంవత్సరంలో టోలమిక్ 12 రాజ్యాధికారం చేపట్టిన తరువాత ఈజిప్టు పరిస్థితులు తారుమారయ్యాయి. తాను ఎప్పుడూ పిల్లనగ్రోవి వాయిస్తూ ఉండేవాడు తప్ప రాజ్యం గురించి పట్టించుకునేవాడు కాదు. ఆయన ఒక అసమర్ధ పాలకుడిగా ప్రతిష్ట దిగజార్చుకున్నాడు. పన్నులు ఎక్కువగా వేయడం వలన తనపై అసంతృప్తి పెరిగిపోయింది. దాంతో అతనిపై తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటును అదుపులో పెట్టడం టోలమెట్ 12 వల్ల కాలేదు. అందువలన ఆయన తన ప్రక్క రాజ్యం అయిన రోమ్ రిపబ్లిక్ పాలకుల సహాయం అడిగారు. తనకు రాజ్య పరిపాలనలో సాయం చేస్తే, తన రాజ్యంలో వసూలు చేసిన పనుల్లో కొంత భాగం ఇస్తానని రోమ్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు అంగీకరించిన రోమ్ పాలకులు టోలమిక్ 12 కు అవసరమైనప్పుడల్లా సైన్యం పంపించి ఆయన పదవికి అండగా నిలిచారు.

క్లియోపాత్ర జననం…

టోలమిక్ రాజవంశాన్ని పాలించేందుకు అవసరమైనప్పుడల్లా సైన్యాన్ని పంపించి “టోలమిక్ 12” పదవికి అండగా నిలిచిన రోమ్ సైనిక అధికారి పేరు “పాంపే”. ఈ రోమ్ పాలకులకు లంచాలు ఇవ్వడంకోసమని బ్యాంకుల వద్ద “టోలమిక్ 12” అప్పులు కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. “టోలమిక్ 12” కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆయనకు ముగ్గురు భార్యలు, వారి ద్వారా ఐదుగురు సంతానం జన్మించారు. పెద్ద కూతురు పేరు పెరినిస్ ఫోర్, రెండో కూతురు క్లియోపాత్ర 7. క్లియోపాత్ర 7 కు ఇద్దరు తమ్ముళ్ళు టోలమిక్ 13, టోలమిక్ 14, ఒక చెల్లెలు. క్రీస్తుపూర్వం 69 వ సంవత్సరంలో క్లియోపాత్ర జన్మించారు. ఆమె చిన్నతనం నుండే అత్యంత ప్రతిభాశీలి, తెలివైనది.

మేధావుల నగరంగా పేరొందిన “అలెగ్జాండ్రియా” నగరంలో ఉన్న గొప్ప గొప్ప పండితుల వద్ద విద్య నేర్చుకునే అవకాశం క్లియోపాత్రకు లభించింది. అంతకుముందు ఎన్నడూ కూడా, ఏ బాలిక కూడా నేర్చుకోనటువంటి పాఠ్యాంశాలను ఆమె నేర్చుకున్నారు. పురాతన ఈజిప్టు చరిత్ర, ఖగోళ శాస్త్రం, వైద్యశాస్త్రం, రసాయన శాస్త్రాలతో పాటు ఏడు, ఎనిమిది భాషలను కూడా ఆమె నేర్చుకున్నారు. అంతకుముందు ఈజిప్టును పరిపాలించిన రాజులు ఎవ్వరూ కూడా ఈజిప్షియన్ల భాషలో పరిపాలన కొనసాగించలేదు. వాళ్ల పూర్వీకుల భాష అయిన గ్రీకులోనే పాలనా వ్యవహారాలను నడిపిస్తూ ఉండేవారు. ఈజిప్షియన్ల భాషను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ఘనత క్లియోపాత్ర 7. ఆమెలోని పరిపాలన రాజ్య లక్షణాలను చిన్నప్పటి నుండే గమనించిన తండ్రి, ఆమెకు బహిరంగ స్థలాలలోనే రాజనీతి శాస్త్రంలో గురించి శిక్షణ ఇచ్చేవారు.

పెరినిస్ 4 చేతికి ఈజిప్టు పగ్గాలు..

విద్యలోనూ, ధైర్యసాహాసాలలోనూ, రాజనీతి శాస్త్రం లోనూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండగా తన 18 సంవత్సరాల వయస్సు నాటికి తన తండ్రి టోలమిక్ 12 పాలన అధ్వానం అయ్యింది. దాంతో ఈజిప్టు రాజ్యాంలోనూ ప్రజలు అలెగ్జాండ్రియా కోటను ముట్టడించారు. టోలమిక్ 12 ను రాజ్యం విడిచి వెళ్లిపొమ్మని హెచ్చరించారు. గత్యంతరం లేక ఆయన తన కూతుళ్లు అయిన క్లియోపాత్రను మరియు ఆమె చెల్లెల్ని తీసుకొని గ్రీసు మీదుగా రోమ్ కు పారిపోయారు. ఆ సమయంలో రోమీ ఇంకా రిపబ్లిక్ రాజ్యం గానే ఉండిపోయింది. రాజ్య పరిపాలన లేదు. అక్కడ కొంతమంది సభ్యులున్న సేనెట్ సభ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండేది. అక్కడ జనరల్ లు ఉండేవారు. వారు తమ సైనిక అధికారులను అదుపులో ఉంచుకొని, పక్క రాజ్యాలను ఆక్రమించేవారు. అలాంటి జనరల్y లలో ముఖ్యులు జూలియస్ సీజర్, పాంపే, క్లాసెస్. టోలమిక్ 12 అప్పట్లో పాంపే కు లంచాలు పంపిస్తుండేవారు. తనను మళ్ళీ ఈజిప్టుకు రాజును చేస్తే మిమ్ములను నేరుగా పన్ను వసూలు చేసుకునే అవకాశం ఇస్తానని టోలమిట్ 12 జనరల్ పాంపే కు చెప్పారు.

ఇదిలా ఉంటే మరోవైపు తన తండ్రి టోలమిక్ 12 పారిపోగానే ఈజిప్టు రాజ్యాన్ని పెద్ద కూతురు పెరినిస్ 4 ఆక్రమించుకుంది. అసమర్థుడైన తండ్రి టోలమిక్ 12 కన్నా మిన్నగా ఈమె పరిపాలిస్తే తప్పు లేదని ప్రజలు కూడా భావించారు. ఈజిప్టు రాజ్య చట్టం ప్రకారం స్త్రీ ఒక్కరే రాజ్యాన్ని పరిపాలించకూడదు, పక్కన ఒక మగవాడు ఉండి తీరాల్సిందే. అందుకే సిరియా రాజకుమారుడిని పెళ్లి చేసుకునన్నారు ఆమె. కొద్ది కాలంలోనే అతడు అసమర్థుడు అని, అతడిని తిరిగి సిరియా పంపివేసింది పెరినిస్ 4. రాజాస్థానంలోని మంత్రులు చెప్పినా వినకుండా, పెరినిస్ 4 తాను ఒక్కతినే పరిపాలన కొనసాగించారు. నేను కావాల్సిన అంత ధనం మీకు ఇస్తాను మా నాన్నను మళ్ళీ ఇక్కడికి పంపించవద్దు అని ఆమె రోమ్ పరిపాలకులకు వర్తమానం పంపించారు. అది తెలిసిన ఆమె తండ్రి టోలమిక్ 12 కోపోదృక్తుడయ్యారు. తన పదవికి సొంత కూతురే ఎసరుపెడుతుందని, తన కూతురు రాయబారానికి పంపించిన 100 మంది బృందానికి నాయకత్వం వహించిన వాడిని విషయం పెట్టి చంపించారు టోలమిక్ 12. మిగతా వారిని రోమ్ చేరడానికి ముందే ఆయన హతమార్చేశారు.

ఈజిప్టు రాణిగా క్లియోపాత్ర…

అయితే టోలమిక్ 12 అప్పులు ఇచ్చిన రోమన్ లు, జనరల్ పాంపే మీద ఒత్తిడి తీసుకొచ్చి తనను ఎలాగైనా సింహాసనం ఎక్కించాలని రోమ్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. దాంతో జనరల్ పాంపే తమ రోమ్ సైన్యాన్ని అలెగ్జాండ్రియా పంపించి, ప్రతిఘటించబోయిన క్లియోపాత్ర చెల్లెలు పెరినిస్ సైన్యాన్ని ఓడించి, ఆమెను గద్దెదించి టోలమిక్ 12 కు ఈజిప్టు రాజ్యాన్ని అప్పగించారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే అణచివేయడం కోసం ఆయనకు అండగా రెండు వేల మంది రోమ్ సైన్యాన్ని అక్కడే ఉంచారు. ఈజిప్టు రాజ్యానికి మంత్రులుగా రోమన్ అధికారులను నియమించి పన్ను వసూలు చేసుకోవలసిందిగా అజ్ఞాపించారు టోలమిక్ 12.  కూతురు పెరినిస్ 4 జీవించి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని గ్రహించిన ఆయన, పెరినిస్ 4 గొంతు కోయించి ఆమెను హత్య చేయించారు.

టోలమిక్ 12 తదనంతరం క్లియోపాత్ర 7, టోలమిక్ 13 లు రాజ్యపాలకులుగా నిలుస్తారని తన వీలునామాలో వ్రాశారు టోలమిక్ 12. ఆ తరువాత కొన్నాళ్ళకు క్రీస్తు పూర్వం 51 వ సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మరణించారు. అప్పటి క్లియోపాత్ర వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణాంతరం చాలా చిన్న వయస్సులోనే ఈజిప్టు రాజ్యానికి రాణి అయ్యింది. ఆమె తరువాత జన్మించిన టోలమిక్ 13 కి పది సంవత్సరాలు. తన తండ్రి వ్రాసిన ఈజిప్టు రాజవంశం ప్రకారం స్త్రీ పరిపాలనలో పక్కన పురుషుడు ఉండాలి, కాబట్టి క్లియోపాత్ర తన తమ్ముడిని పెళ్లి చేసుకున్నారు. ఆ రోజుల్లో వయస్సు వ్యత్యాసం ప్రకారం ఆమెతో కాపురం చేయకపోయినా ఆమెను తాళి కట్టిన మొదటి భర్త టోలమిక్ 13. కేవలం రాజ్యాధికారం కోసమే ఆవిడ తన సొంత తమ్ముడిని పెళ్లి చేసుకున్నారు.

సవ్యంగా సాగిన క్లియోపాత్ర పాలన..

రాజ్యాధికారం కోసం తన సొంత తమ్ముడిని పెళ్లిచేసుకున్న క్లియపాత్ర, తాను సింహాసనము అధిరోహించినప్పటికీ ఈజిప్టు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కరువు కోరల్లో చిక్కుకొన్న ఈజిప్టు రాజ్యం లోతట్టు ప్రాంతాలంతా కూడా వరదలతో నిండిపోయి పంటలు నాశనం అవుతున్నాయి. ఆమె తండ్రిని కాపాడడానికి వచ్చి ఈజిప్టులో తిష్ట వేసిన రోమన్ అధికారుల అరాచకాలు మరీ ఎక్కువైపోయాయి. దానికి తోడు ఆమె తండ్రి టోలమిక్ 12 రోమన్ల దగ్గర చేసిన కోట్లాది నాణేల అప్పు ఆమె పరిపాలన భారంపై పడింది.  దానికి తోడు ప్రజలలో తండ్రి పట్ల సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం పునరుద్ధరించడం తనముందు ఉన్న అతిపెద్ద సమస్యగా భావించింది. ఒక దేవాలయం పునరుద్ధరణ కోసం ఉత్సవాన్ని నిర్వహించడానికి వెళ్ళినప్పుడు క్లియోపాత్ర పురుష వేషం ధరించిన రాజు లాగా వెళ్ళింది. ఆమెను చూసిన ఈజిప్టు ప్రజలకు తన తండ్రి లాగా తమతో తమలో ఒకరిగా కలిసిపోతుందని ఆమె పట్ల గౌరవం పెరిగింది. ఒకవైపు ఆమె పరిపాలనను చక్కబెట్టుకుంటూ వస్తుంటే, తన తమ్ముడి సలహాదారులు మాత్రం అవి నచ్చడం లేదు. ఇది గమనించిన క్లియోపాత్ర వారిని కట్టడిచేస్తూ, నాణేల మీద తమ్ముడు బొమ్మ ముద్రణ తీసేయించింది. రాజముద్రపైన అతని సంతకాలు ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది.

పదవీచ్యుతురాలై సిరియా పారిపోయిన క్లియోపాత్ర…

ఒకవైపు క్లియోపాత్ర పరిపాలన సవ్యంగా సాగుతుండగా అది రుచించని ఆమె తమ్ముడు, భర్త అయిన టోలమిక్ 13 సలహాదారులు, ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండేవారు. ఆమె రెండేళ్ల పరిపాలన సవ్యంగా సాగుతూ రాజ్యంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉండగానే క్రీస్తుపూర్వం 49 వ సంవత్సరంలో భర్త, తమ్ముడు అయిన టోలమిక్ 13 సలహాదారుల కుట్రకు లొంగిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. తమ్ముడు సలహాదారులు క్లియోపాత్ర సైన్యాన్ని మట్టుపెట్టాలని చూశారు. దాంతో క్లియోపాత్ర, తన చెల్లెలు మరియు ఆమె మద్దతుదారులను వెంటబెట్టుకుని ఒకనాటి అర్ధరాత్రి అలెగ్జాండ్రియా కోటను  తప్పించుకుని దేశం వదిలి పారిపోయారు.

అడవులు దాటి, నదులు దాటి మైళ్ళకు మైళ్ళు నడిచి సిరియా చేరుకున్నారు. సిరియాలోని భూభాగం రోమన్ల ఆధీనంలో ఉంది. రోమన్ పాలకులతో క్లియోపాత్రకు సత్సంబంధాలే ఉన్నాయి. సిరియా దేశం కూడా తన తల్లి దేశమే కాబట్టి అక్కడ ఆమె కొంతమంది మద్దతుదారులను మూటగట్టుకున్నారు. అలా కొన్ని నెలల గడిచిన తరువాత తనకు బలం పెరిగిందని నమ్మకం కలగడంతో ఆమె ఈజిప్టు మీద దండయాత్ర చేసింది. తనను తరిమేసిన భర్త, తమ్ముడు టోలమిక్ 13 ను గద్దె దించడానికి ప్రయత్నం చేసింది. కానీ టోలమిక్ 13 యొక్క సైన్యం క్లియోపాత్ర సైన్యాన్ని ఈజిప్టు సరిహద్దులలోకి రాకుండా నిరోధించగలిగింది.

గూఢచారులతో రహస్యాలు ఛేదించి..

ఈజిప్టు గద్దెనెక్కడానికి అలెగ్జాండ్రియా సరిహద్దు ప్రాంతాల్లో పహార కాస్తున్న సైన్యాన్ని చేధించడం ఎలా అని ఆలోచనలో పడ్డ క్లియోపాత్రకు అలెగ్జాండ్రియా కోటలో మకాం వేసిన జూలియస్ సీజర్ గురించి తెలిసింది. దాంతో ఆమె వద్ద ఉన్న కొందరు గూఢచారులను అలెగ్జాండ్రియా కోటలో ఉన్న జూలియస్ సీజర్ వద్దకు పంపి తన రహస్యాలను చేధించాల్సిందిగా కోరింది. అప్పటికే పాంపేను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న ఏళ్ల జువెలర్స్ సీజర్ యుద్ధంలో పంపెను ఓడించే ఆత్మవిశ్వాసంతో ఉన్న 52 ఏళ్ళ జూలియస్ సీజర్ కు ఉన్న బలహీనత అందమైన స్త్రీ అని  గూఢచారులు తెలుసుకున్నారు. స్త్రీ కోసం ఏమైనా చేస్తాడని, అప్పటికే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయిన విషయం గూఢచారులు క్లియోపాత్రకు తెలియజేశారు. గూఢచారులు ద్వారా ఇత్యాది విషయాలను తెలుసుకున్న 21 సంవత్సరాల పగబట్టిన పడుచు క్లియోపాత్ర, తన తమ్ముడు, భర్త పరిపాలిస్తున్న ఈజిప్టు రాజ్యాన్ని ఛేజిక్కించుకోవడానికి తన మేధస్సుకు పదును పెట్టింది, తనను తాను సమర్పించుకోవడానికి కూడా సిద్ధపడింది.

తనను తాను జూలియస్ సీజర్ కు అర్పించుకుని..

క్లియోపాత్ర తన సహాచారిణీలలో నమ్మకమైన వారితో ఖరీదైన టర్కీ టవల్ తెప్పించి, తనని అందులో చుట్టి అలెగ్జాండ్రియాలో ఉన్న జూలియస్ సీజర్ కు బహుమతిగా తీసుకెళ్లాలని కోరింది. అలెగ్జాండ్రియా కోట వద్దకు రాగానే ఆ తీవాచీని ద్వార పాలకులు అడ్డగించారు. ఆ సమయంలో క్షణకాలం లోపల శ్వాస రాకుండా తనను తను బంధించుకుని క్లియోపాత్రను మోస్తున్న వారు, అక్కడి భటులతో టర్కీ నుండి జూలియస్ సీజర్ కు  తెస్తున్న ప్రత్యేక బహుమతిగా చెప్పారు. జూలియస్ సీజర్ పేరు చెప్పగానే భటులు మారు మాట్లాడకుండా తివాచీని లోపలికి పంపించారు. 

అక్కడ రాజప్రసాదంలో విడిది ఉన్న జూలియస్ సీజర్ ముందు ఆ తివాచీని భటులు దొర్లించారు. తివాచీ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూలియస్ సీజర్  కు అందులో ఉన్న అందమైన క్లియోపాత్ర కనబడేసరికి అవాక్కయ్యారు. కళ్ళ ఎదురుగా పండు వెన్నెలను పిండిపోసిన అందంతో, వజ్రాన్ని పొదిగిన సౌందర్య శిల్పంలా, మేలిమి బంగారు కాంతులను వెదజల్లిన ఆ అందాల రాశిని చూడగానే జూలియస్ సీజర్ కు మతిపోయింది. నేను నీ దానిని ఆయన ముందు మోకరిల్లింది క్లియోపాత్ర. నీకేం కావాలో తీసుకో, కానీ నా సింహాసనం నాకు తిరిగి దక్కేలా చేయమని జూలియస్ సీజర్ ను క్లియోపాత్ర కోరింది. క్లియోపాత్రను చూడడం జూలియస్ సీజర్ కు అదే మొదటిసారి. అది ఈజిప్టు చరిత్రలో ఒక మలుపు, రోమన్ల చరిత్రలో మరొక మేలిమలుపు అయ్యింది. 

టోలమిక్ 13, జూలియస్ సీజర్ మధ్య యుద్ధం…

తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డ జూలియస్ సీజర్ కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. క్లియోపాత్ర మరియు తమ్ముడు టోలమిక్ 13 ఇద్దరినీ రాజ్యసలహా మండలి ముందు నిలబెట్టారు జూలియస్ సీజర్. క్లియోపాత్ర తండ్రి టోలమిక్ 12 వ్రాయించిన వీలునామా ప్రకారం, ఇద్దరూ కలిసి రాజ్యాధికారం పంచుకోవాలని, వయస్సులో పెద్దదైన క్లియోపాత్ర  రాణిలా కొనసాగాలని, తమ్ముడు మరియు భర్త అయిన టోలమిక్ 13 ఆమెకు తోడుగా ఉండాలని తేల్చిచెప్పగా రాజ్య సలహామండలి ఆమోదించింది. అప్పటికే ఏడాది నుండి సింహాసనం మీద ఉన్న టోలమిక్ 13, తాను మోసపోతున్న విషయాన్ని పసిగట్టి, రాజ్యాధికారం కోల్పోయేందుకు సిద్ధంగా లేక తన సైన్యాన్ని సమీకరించి, తన తండ్రికి సహాయపడ్డ రోమన్ల సైన్యాన్ని కలుపుకుని జూలియస్ సీజర్ పైకి యుద్దానికి వెళ్ళాడు.

జూలియస్ సీజర్ చేతిలో పరాభవం పాలైన పాంపే పంపిన సైనికులే గనుక, జూలియస్ సీజర్ కి వ్యతిరేకంగా పోరాడడానికి వారు సిద్ధమయ్యారు. అలా 20,000 మంది సైనికులు అలెగ్జాండ్రియా రాజప్రసాదాన్ని ముట్టడించారు. 4000 మంది సైన్యంతోనే వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం ప్రారంభించిన జూలియస్ సీజర్ పోరాటం కొన్ని వారాల పాటు సాగిపోయింది. జూలియస్ సీజర్, క్లియోపాత్రలు అలెగ్జాండ్రియా రాజప్రసాదంలోనే  బందీలు అయ్యారు. అలా బందీలు అయిన వారి అనుబంధం రానురాను శారీరక సంబంధంగా మారిపోయింది. జూలియస్ సీజర్ ద్వారా సంతానం కలిగితే రోమ్ నగరంలో కూడా భాగం దక్కుతుందని క్లియోపాత్ర భావించింది. జూలియస్ సీజర్ కు భార్య కాని భార్యగా కొనసాగడానికి క్లియోపాత్ర సిద్ధపడింది.

నదిలో మునిగిపోయిన టోలమిక్ 13…

ఒకవైపు అలెగ్జాండ్రియా రాజభవనం చుట్టూ పోరాటం జరుగుతుండగా, కొంతమంది సైనిక అధికారులు క్లియోపాత్ర చెల్లెలు ఆర్సినో కు మద్దతు ఇచ్చి ఆమెను ఈజిప్టు రాణిగా కూర్చోబెట్టారు. మరోవైపు టోలమిక్ 13 సైన్యంతో తలపడడానికి  జూలియస్ సీజర్ తన రోమ్ నగరం నుండి అదనపు బలగాలని రప్పించారు. ఒకవైపు టోలమిక్ 13 సైన్యం, మరోవైపు ఆర్సినో సైన్యాలు నైలు నది తీరం వైపు మళ్ళించగా, అక్కడే జూలియస్ సీజర్ సైన్యం కూడా ఉండి తలపడుతున్నారు. అదే సమయంలో క్లియోపాత్ర రాజభవనంలోనే ఉండిపోయింది. క్రీస్తుపూర్వం 47 వ సంవత్సరంలో నైలు నది వద్ద జరిగిన ఈ యుద్ధాన్ని నైలు నది యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో జూలియస్ సీజర్ సైన్యం ముందు టోలమిక్ 13, ఆర్సినో సైన్యాలు ఓటమి పాలయ్యాయి. టోలమిక్ 13 పారిపోయే క్రమంలో నైలు నదిలో మునిగిపోయారు. ఆమె చెల్లెలు ఆర్సినోను బంధించి ఆమెను రోమ్ కు తీసుకెళ్లిన జూలియస్ సీజర్, ఆమెను సంకెళ్ళతో ఊరేగించి, రోమ్ నగరం అంతా తిప్పించి, దేశ బహిష్కరణ చేయించాడు.

మళ్ళీ ఈజిప్టు గద్దెనెక్కిన క్లియోపాత్ర…

తమ్ముడు, భర్త టోలమిక్ 13 నదిలో కొట్టుకుపోవడం, చెల్లెలు ఆర్సినో దేశ బహిష్కరణ జరుగుతున్న క్రమంలో క్లియోపాత్ర ఈజిప్టు రాజభవంలోనే ఉండిపోయింది. అప్పటికే ఆమె గర్భవతి. ఆటంకాలన్నీ తొలగిపోయిన తరువాత క్రీస్తు పూర్వం 40 వ సంవత్సరంలో క్లియోపాత్రను ఈజిప్టు సింహాసనంపై కూర్చోబెట్టాడు జూలియస్ సీజర్. అప్పటికి క్లియోపాత్ర వయస్సు 22 సంవత్సరాలు. ఆమె ఈజిప్టుకు  రాణి మాత్రమే కాదు, రోమన్ పాలకుడైన జూలియస్ సీజర్ కు సహచారిణి కూడా. ఆమెకు సహాయకుడిగా టోలమిక్ 14 ను రాజుగా నియమించారు. ఆచారం ప్రకారం రాజ్యాధికారం కోసం 12 ఏళ్ల టోలమిక్ 14ను క్లియోపాత్ర పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లి కేవలం రాజ్యం కోసం మాత్రమే. 

ఎప్పటిలాగే ఆమె జూలియస్ సీజర్ తో సంబంధం కొనసాగించింది. తన పరిపాలనలో ప్రజలతో ఆమె ఈజిప్టు భాషలో  మాట్లాడేవారు. ఈజిప్టు రాజ్య విద్యా విధానంలో పలురకాల సంస్కరణలు తీసుకువచ్చారు. ఆమెకు జూలియస్ సీజర్ తో ఉన్న శారీరక అనుబంధం రీత్యా రోమ్ నగరానికి కోట్ల రూపాయల అప్పు పంపించే అవసరం లేదు. అందువలన ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వంలో అవినీతిని ఆమె రూపుమాపారు. వ్యవసాయరంగంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఆమె ఈజిప్టు ప్రజల మన్ననలను అందుకోవడమే కాకుండా పది సంవత్సరాలలో ఆమెకంటే ముందు పరిపాలన చేసిన రాజుల కంటే క్లియోపాత్ర మిన్నగా పరిపాలన చేశారు.

Show More
Back to top button