Telugu Featured NewsTelugu Politics

ఆ వేధింపుల వల్లే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నా: ఎంపీ గల్లా జయదేవ్‌ 

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఈ నెల 28న 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నాననే భావన ఉండడం వల్లే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన, స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లో ముందుకు వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై పార్లమెంట్‌లో తాను గళమెత్తినట్లు చెప్పారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో ఈడీ తనను రెండుసార్లు పిలిచి విచారించిందని, తన వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నట్లు తెలిపారు. సీబీఐ, ఈడీ తన ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నాయని వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులని మౌనంగా ఉండలేను, పార్లమెంట్‌లో మౌనంగా కూర్చోవడం తనవల్ల కాదని చెప్పారు. అందుకే తనను ఓ పక్క కేంద్రం, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం పరంగా దెబ్బతీస్తున్నాయన్నారు. అమరావతి రాజధానిని భారత చిత్రపటంలో చేర్చడం కోసం పార్లమెంట్‌లో కొట్లాడినట్లు తెలిపారు. ఏదైనా వ్యాపారం పెట్టాలంటే 70 అనుమతులు కావాలి. అవన్నీ తెచ్చుకున్నా.. ప్రస్తుత ప్రభుత్వాల నుంచి వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొట్టినా.. తిట్టినా.. జైలుకు పంపినా పర్లేదు, అంతేగాని మాట్లాడకుండా కూర్చోమంటే తనవల్ల కాదని చెప్పారు. తన బలాలైన నిజాయితీ, ఆర్థిక స్వాతంత్య్రం, సామర్థ్యాలు రాజకీయాల వల్ల బలహీనతలుగా మారుతున్నాయన్నారు. దీనిని ఏం మాత్రం సహించలేకే ఈ ఎన్నికల్లో తప్పుకుంటున్నట్లు గల్లా వెల్లడించారు. 

ప్రస్తుతం ఉన్న ‘అమర్‌రాజా కంపెనీ టర్నోవర్‌ను వచ్చే ఐదేళ్లలో రూ.58వేల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పుడు 25 వేల మందికి ఉద్యోగాలు, రాష్ట్రానికి పన్నుల రూపంలో రూ.5 వేల కోట్లు, కేంద్రానికి రూ.16,500 కోట్లు చెల్లించే స్థాయికి చేరుకుంటాం. ఒకప్పుడు వ్యాపారాలను చూసుకోవడానికి నాన్నగారు ఉండేవారు. ప్రస్తుతానికి ఆయన రిటైర్డ్‌ అయ్యారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టి పెడతానని’ గల్లా అన్నారు. ‘భవిష్యత్‌లో కేంద్రంపైన, రాష్ట్రంపైన ఆధారపడకుండా ఉండాలనేదే లక్ష్యం. రెండేళ్ల క్రితమే నా తండ్రి రిటైరయ్యారు. నా పిల్లలు చిన్న వయసులోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బిజినె‌స్‌లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈసారి వస్తే.. కచ్ఛితంగా సంపూర్ణమైన రాజకీయవేత్తగానే తిరిగి వస్తా’ అని ప్రకటించారు.

ఇక ఎంపీ గల్లా జయదేవ్‌ నిర్ణయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్వాగతిస్తూ.. ఆయన్ను కొనియాడారు. ‘గుంటూరు ఎంపీ టికెట్‌కు టీడీపీలో విపరీతమైన పోటీ ఉంది. ఆయన మళ్లీ పోటీ చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో మూడోసారీ గెలుస్తారు. అయినప్పటికీ కొంతకాలం రాజకీయాల నుంచి విరామం కోరుకుంటున్నారు. ఈ నిర్ణయం ఎంతో బాధిస్తున్నా జయదేవ్‌ ఆలోచనను ప్రతి ఒక్కరం గౌరవించాలి’ అని లోకేశ్‌ తెలిపారు.

Show More
Back to top button