Telugu News

వర్షా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దచ్చి కొడుతున్నాయి. అయితే ఈ వర్షా కాలం మనసుకు ఆహ్లాదాన్నిచ్చినా, కొన్ని అనారోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. ఈ కాలంలో వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ముందుగా, మన ఇంటి చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలి. ఎందుకంటే నిలిచి ఉన్న నీళ్లలో దోమలు, ఈగలు పెరిగిపోతాయి. అవి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలకు కారణమవుతాయి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంటి లోపల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ తడిస్తే వెంటనే పొడి బట్టలు వేసుకోవాలి. వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తాయి. వీధిలో అమ్మే ఆహార పదార్థాలు, ముఖ్యంగా నీటితో కలిపి తయారుచేసే పానీయాలు, జ్యూస్‌లు, కట్ చేసిన పండ్లు తినకుండా ఉండాలి. ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు ఉండే అవకాశం ఉంది. శుభ్రమైన, వేడి చేసిన ఆహారం తినడం మంచిది. అలాగే, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.

చెప్పులు లేకుండా బయట తిరగకూడదు. ఎందుకంటే వర్షపు నీటిలో ఉండే బ్యాక్టెరియా వల్ల కాళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వర్షా కాలాన్ని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

Show More
Back to top button