
మనిషి జీవనయానంలో ఆరోగ్యం అనేది ఒక మహా సముద్రం వంటిది. పైన కనిపించే అలలు శారీరక ఆరోగ్యమైతే, లోతుల్లో ఉండే నిశ్శబ్దం మానసిక శ్రేయస్సు. దురదృష్టవశాత్తు, నేటి ఆధునిక సమాజం అలల ఆర్భాటాన్ని చూసి మురిసిపోతోందే తప్ప, లోతుల్లో పెరుగుతున్న అశాంతిని గుర్తించడం లేదు. గడిచిన దశాబ్ద కాలంలో సాంకేతికత పెరిగినప్పటికీ, మనిషి అంతర్గత ప్రశాంతత క్రమంగా క్షీణిస్తోంది. శరీరం రోగగ్రస్తం కాకముందే మనసు కుంగిపోవడం నేటి విషాదకర పరిణామం.
*ఆరోగ్య నిర్వచనం – మారుతున్న ప్రాధాన్యతలు:*
ఆరోగ్యం అంటే కేవలం శరీరానికి ఎటువంటి రోగము లేకపోవడమే కాదు.’ శారీరక పటిష్టతతో పాటు మానసిక ప్రశాంతత, సామాజిక సామరస్యం ఉన్నప్పుడే ఆ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పరిగణించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. శరీరానికి, మనసుకు మధ్య ‘సైకోసోమాటిక్’ సంబంధం ఉంటుంది. “సుస్థిర మనస్సు సుస్థిర శరీరంలో ఉంటుంది” అనే మాట నేడు అక్షర సత్యం. మనసులో కలిగే తీవ్రమైన ఆందోళనలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, దీర్ఘకాలంలో రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు మూలకారణం అవుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం 40% పెరుగుతుందని, మనసులోని అలజడి నేరుగా రోగనిరోధక శక్తిని తగ్గించి, మనిషిని ఇతర వ్యాధుల బారిన పడేలా చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*గణాంకాలు- ఆర్థిక ప్రభావం:
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మనదేశంలో ఏడాదికి సుమారు 1.71 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో అత్యధికం 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు వారే కావడం గమనార్హం. వీరిలో రోజువారీ కూలీలు 25%, గృహిణులు 14%, విద్యార్థులు 9% ఎక్కువగా ఉండటం సామాజిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఆత్మహత్యలకు అధిక శాతం ఒత్తిడే కారణం అని విశ్లేషకుల అభిప్రాయం. మానసిక సమస్యల వల్ల ఉద్యోగుల పనితీరు తగ్గడం, సెలవులు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే దశాబ్ద కాలంలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. అంటే మానసిక ఆరోగ్యం కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, అది దేశాభివృద్ధిని కుంగదీసే ఆర్థిక సంక్షోభం కూడా.
*సమాజం – పని వాతావరణం:
మానవుడు సంఘజీవి. సమాజంలో జరిగే మార్పులు వ్యక్తి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కేవలం వ్యక్తిగత బలహీనతలు మాత్రమే మానసిక జబ్బులకు కారణం కావు. వీటితోపాటు అన్యాయం, హింస, పేదరికం, ఆస్తుల దురాక్రమణ, అప్పుల బాధ, విపరీతమైన పోటీతత్వం మనిషిని నిరాశలోకి నెడుతున్నాయి. సామాజిక రుగ్మతలు మనిషిని నిరంతరం అభద్రతా భావంలో ఉంచుతున్నాయి. వలసలు, పట్టణీకరణ వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై, సామాజిక మద్దతు కరువైంది. నేడు పని ప్రదేశాల్లో ఎనిమిది గంటల పని విధానం మృగ్యమైంది. టార్గెట్లు, డెడ్లైన్ల మధ్య ఉద్యోగి ‘రోబో’గా మారుతున్నాడు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అటు ఆఫీసు బాధ్యతలు, ఇటు ఇంటి పనులు నిర్వహిస్తూ ‘డబుల్ బర్డెన్’కు గురవుతున్నారు. ఆఫీసులో వివక్షను, ఇంట్లో బాధ్యతలను సమన్వయం చేసుకోలేక ‘క్రానిక్ ఫెటీగ్’ అంటే తీవ్ర అలసటకు గురవుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం పెరిగిన తర్వాత ఒంటరితనం మరింత పెరిగింది. వర్చువల్ ప్రపంచంలో వేలమంది మిత్రులున్నా, బాధను పంచుకోవడానికి పక్కన మనిషి లేని స్థితి నేటి యువతది. ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు.
*గ్రామీణ భారతం – నిశ్శబ్ద వేదన:
గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య స్థితి అత్యంత జటిలంగా ఉంది. నగరాల్లో మానసిక వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, గ్రామాల్లో ఈ సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఇక్కడ మానసిక సమస్యలను వైద్యపరమైన ఇబ్బందిగా చూడకుండా ‘దెయ్యం పట్టిందని’ లేదా ‘దిష్టి తగిలిందని’ మూఢనమ్మకాలతో చూడటం వల్ల రోగులకు సరైన సమయానికి చికిత్స అందడం లేదు. ముఖ్యంగా రైతులు ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన సాగు ఖర్చులు, గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్రమైన మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. సామాజిక గౌరవం పోతుందన్న భయంతో వీరు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యల వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
*పల్లెల్లో సామాజిక మద్దతు- మార్పు:
ఒకప్పుడు పల్లెల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మానసిక ఒత్తిడికి విరుగుడుగా ఉండేది. కష్టసుఖాలను పంచుకోవడానికి పెద్దలు ఉండేవారు. కానీ నేడు గ్రామాల్లో కూడా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడటం వల్ల ఒంటరితనం పెరిగిపోయింది. గ్రామీణ యువతలో నిరుద్యోగం, నగరాలకు వలసలు వెళ్లడం వల్ల వృద్ధులు గ్రామాల్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు. దీనివల్ల వారిలో మానసిక ఆందోళనలు పెరిగి శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది.
*పరిష్కార మార్గాల అన్వేషణ:
మానసిక సమస్యల నుంచి గట్టెక్కడానికి బహుముఖ వ్యూహం అవసరం. చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం, పోలికలు మానుకోవడం ముఖ్యం. ‘నో’ చెప్పడం నేర్చుకోవడం వల్ల అనవసరపు బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు. వ్యాయామం వల్ల శరీరంలో ‘ఎండార్ఫిన్’, ‘డోపమైన్’ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజసిద్ధమైన స్ట్రెస్ రిలీజర్లుగా పనిచేస్తాయి. నిద్రలేమి వల్ల చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. అందువలన రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. ఇది మెదడును రీఛార్జ్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించి, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
హోలిస్టిక్ అప్రోచ్ పద్ధతి అంటే కేవలం మందుల ద్వారానే కాకుండా యోగా, ధ్యానం, శ్వాస క్రియల ద్వారా మనసును నియంత్రించవచ్చు. ప్రకృతితో సమయం గడపడం ‘నేచురల్ హీలింగ్’లా పనిచేస్తుంది. మానసిక వైద్యుడిని సంప్రదించడం అంటే ‘పిచ్చి’ అని భావించే అపోహ తొలగాలి. గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం నేటి అత్యవసర అవసరం. మూఢనమ్మకాల నుంచి ప్రజలను బయటకు తీసుకువచ్చి, శాస్త్రీయ చికిత్స పట్ల నమ్మకం కలిగించాలి. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లినట్టే, మనసు బాగోలేనప్పుడు థెరపీ తీసుకోవడం సాధారణ విషయంగా మారాలి. పాఠశాల స్థాయి నుంచే ‘మెంటల్ హెల్త్ కరికులమ్’ను ప్రవేశపెట్టాలి. ఒత్తిడిని ఎలా జయించాలి? విఫలమైనప్పుడు ఎలా నిలబడాలి? అనే విషయాలను పిల్లలకు నేర్పాలి. అలాగే ప్రతి కార్యాలయంలో ‘ఎంప్లాయీ వెల్నెస్ ప్రోగ్రామ్స్’ తప్పనిసరి చేయాలి.
శారీరక ఆరోగ్యం పునాది అయితే, మానసిక శ్రేయస్సు ఆ పునాదిపై నిర్మించబడిన అందమైన భవనం. ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదు, అది మనిషి తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగల శక్తిని కలిగి ఉండటం. “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది”. మనసును గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. కాబట్టి, శరీరాన్ని కదిలిద్దాం. మనసును ప్రశాంతంగా ఉంచుదాం. మనిషి తనను తాను ప్రేమించుకున్నప్పుడే ఇతరులను ప్రేమించగలడు, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడుతుంది.










