CINEMATelugu Cinema

అనాధగా జీవితం మొదలై,అనాధగానే కన్నుమూసిన నాట్య తార లక్ష్మీకాంత.

అనాధగా జీవితం మొదలై, అనాధగానే కన్నుమూసిన నాట్య తార.. లక్ష్మీకాంత. వగలోయి వగలు! తళుకు బెళుకు వగలు! లలలూ లలలూ!!” అంటూ అందంగా ఆడుతూ పాడుతుంది పాతాళభైరవి (1951) సినిమాలో. నేపాళ మాంత్రికుడు తన మాయతో ఆ అందమైన తారను సృష్టిస్తాడు. రాజనగర వీధులలో తన మాయలు ప్రదర్శిస్తూ హఠాత్తుగా సృష్టించిన ఒక అందమైన ఆడపిల్లకు “మహా జనానికి మరదలు పిల్ల” అని పేరు పెట్టి మరీ నాట్యం చేయిస్తాడు. ఆ పాత్రలో జీవించిన నృత్య తార పేరు లక్ష్మీకాంత. ఆమె జీవితం హృదయాలను కదిలించే ఒక విషాద గాధ. ఆమె ప్రేమించి, ఆదరించిన వ్యక్తి ఒకానొక రోజు ఆమె ఇంట్లో ఉన్న సొమ్ముతో పరారైపోయాడు. అందువలన తాను కథానాయికగా సినిమాలు నిర్మించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ సినిమాలు పూర్తికాకపోవడంతో ఆమె డబ్బు నష్టపోయారు. చివరికి బతుకుతెరువు కోసం ఆమె కొన్ని ఆవులను కొనుక్కుని పాల వ్యాపారం చేశారు. అందులో తగినంత లౌక్యం లేకపోవడంతో పాల వ్యాపారంలో ఆమె నష్టపోయి, తన పశువులన్నింటినీ అమ్మేసి, తన నివాసాన్ని ఒక గుడిసెలోకి మార్చారు. అలా జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను అనుభవించారామె.

లక్ష్మీకాంతం ఒక అనాథ. కర్ణాటక లోని బళ్లారి వీధులలో రెండేళ్ల చిన్నారిగా ఒంటరిగా ఏడుస్తూ బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ ఉన్న ఆమెను ఒక వృద్ధురాలు చేరదీసింది. ముద్దుముద్దుగా అందంగా ఉన్న ఆమెను తానే పెంచుకోవాలనుకుంది. ఆమె ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుందనిపించి “లక్ష్మీకాంత” అని పేరు పెట్టింది. బళ్లారిలోనే ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు, పాఠశాలలోని అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బళ్లారి రాఘవను కలుసుకుని వివిధ నాటకాల ద్వారా నిధులు సేకరించి యుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆ తరువాత నృత్యగురువు సత్యనారాయణ వద్ద చేరి నృత్యంలో ప్రాథమిక మెళకువలు నేర్చుకున్నారు. ఆయన కలకత్తాలో ఉన్న ఉదరు శంకర్‌ కు ఆమెను పరిచయం చేయగా, ఆమెను ఆయన కల్పన (1948) సినిమాలో వేశ్య పాత్ర ద్వారా పరిచయం చేశారు. మనదేశం (1949), పల్లెటూరి పిల్ల (1950), మాయాలమారి (1951), పాతాళభైరవి (1951), మరదలు పెళ్లి (1952) తదితర చిత్రాలలో నటించారు.

సినిమారంగంలో నటిగా ఉత్థాన పతనాలు చవిచూశారు. నటిగా ఒకానొక సందర్భంలో ఓ వెలుగు వెలిగారు, ఒక సమయంలో శూన్యంగా ఉండిపోయారు. అలా శూన్యంగా ఉన్న సమయంలో నటుడు చంద్రశేఖర్‌ను కలిసినప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం మెరుగుపడింది. ఆయనతో కలిసి “ప్రియురాలు”, “పేరంటాలు”, “నిర్దోషి”, “సంక్రాంతి”, “లక్ష్మమ్మ కథ”, “మేనరికం”, “చక్రపాణి” వంటి చిత్రాలలో ఆమె నటించారు. చంద్రశేఖర్‌ తో కలిసి ఆమె సహజీవనం చేశారు. కానీ వారిద్దరి సినిమా వృత్తి కుప్పకూలిపోవడంతో వారి సహజీవనం కూడా స్వల్పకాలికంగానే ముగిసింది. ఆ తరువాత ఆమె 1955 వ సంవత్సరంలో ఒక పహిల్వాన్‌ను నమ్మి అతని సహచర్యంలో బతకడానికి నిర్ణయించుకున్నారు. కానీ తాను చేసిన మోసానికి బలైపోయి ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆర్థిక పరిస్థితి చితికిపోయిన దశలో ఆమె వైజయంతిమాల ఇంటికి వెళ్లి ఆమె కొడుకుకి ఆయాగా పనిచేశారు. అనంతరం అనుమానాస్పద పరిస్థితులలో ఆ ఇంటిని విడిచిపెట్టి ఆమె ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రారంభ జీవితాన్ని ఒంటరిగా అనాధగా జీవితం ప్రారంభించిన లక్ష్మీకాంత ఒంటరిగానే పాండిచ్చేరిలో ఆఖరి రోజులను గడుపుతూ కన్నుమూశారు లక్ష్మీకాంత.

నేపథ్యం…

లక్ష్మీకాంత ఒక అనాథ. తల్లి తండ్రి ఎవరో తెలియదు. ఆమెది కర్ణాటక రాష్ట్రములోని బళ్ళారి. చిన్నప్పటినుంచి నాట్యం అంటే ఆమెకు ఇష్టం ఉండేది.  సినిమాలు చూసినప్పుడు అందులోని నాట్యాలను చూసి గుర్తు తెచ్చుకొని సాధన చేస్తూ ఉండేవారు. ఆమెను చేరదీసిన వృద్ధురాలు ఆమెకు ప్రముఖ నృత్యకారులు కె. సత్యనారాయణ మూర్తి వద్ద నృత్యం నేర్పించారు. ఆయన వద్ద నేర్చుకున్న నృత్యాలను బృందంతో కలిసి మిలిటరీ క్యాంపులో ప్రదర్శిస్తుండేవారు. ఆమె నాలుగవ తరగతి చదువుతుండగా ఉదయ శంకర్ ఆల్మోరాలో నడిపే నాట్య పాఠశాలకు సంబంధించిన ప్రకటన పత్రికలలో వచ్చినప్పుడు అది చూసి అందులో చేర్చుకోమని ఆమె నాట్య గురువు కె.సత్యనారాయణ సిఫారసు లేఖ వ్రాశారు. అయితే ఉదరశంకర్ నాట్య శిక్షణ కేంద్రం నిలిపివేసి మద్రాసుకు వచ్చి “కల్పన” (1948) చిత్రం నిర్మాణం తలపెట్టినట్టి మద్రాసుకు వచ్చారు. లక్ష్మీకాంత తన పెంపుడు తల్లితో కలిసి ఉదరశంకర్ వద్దకు మద్రాసుకు వచ్చారు. ఆయన వద్ద ఒక ఏడాది పాటు ప్రతిరోజు శిక్షణ పొందారు. ఆమెకు పారితోషికంగా నెలకు రెండు వందల రూపాయలు జీతం ఇచ్చేవారు. అలా ఉదరశంకర్ వద్ద నాట్యం కోసం చేరిపోయారు.

కల్పన (1948) సినిమాతో చిత్రరంగ ప్రవేశం…

అయితే లక్ష్మీకాంత గురువు ఉదరశంకర్ వద్ద శిక్షణ నేర్చుకుంటూ ఉండగా ఆమె శ్రద్ధ పెట్టడం లేదని ఆమె మీద ఉదరశంకర్ కోప్పడ్డారు. నీవు శుద్ధ ఎద్దు మొద్దు స్వరూపానివి, నీది ఒట్టి మట్టిబుర్ర. నీకు ఎన్నిసార్లు చెప్పినా గ్రహించుకొనే నేర్పు, ఓర్పు లేదు. నీకు నాట్యం నేర్పడం నావల్ల కాదు, సరికదా ఆ బ్రహ్మ తరం కూడా కాదు అని చీవాట్లు పెట్టి బయటకు వెళ్ళగొట్టారు. ఏడుస్తూ బయటకు వచ్చేశారు. బాధపడ్డారు, రోదించారు. అవకాశం దక్కినట్టే దక్కి చేజారిపోయేసరికి ఏం చేయాలో ఆమె తోచలేదు. అదృష్టం ఆమెకు నరకంగా గోచరించింది. చేసేదిలేక గురువు ఉదరశంకర్ నే ఆమె ప్రాధేయపడ్డారు. ఆమె బాధను చూసిన ఉదరశంకర్ భార్య అమల శంకర్ ఆమెను దగ్గరికి తీసుకుని మళ్లీ నెలలు ప్రయత్నించి చూడమని సలహా ఇచ్చింది. ఈ అమ్మాయికి నేర్చుకోవాలనే అభిలాష ఉంది కదా! పర్లేదు మరొక్కసారి ఆమెకు శిక్షణ ఇచ్చి చూడమని భర్తకు సర్దిచెప్పింది. దాంతో లక్ష్మీకాంతంను గురువు ఉదరశంకర్ తిరిగి శిక్షణకు తీసుకుని నటనలో మెలకువలు నేర్పి, ఉదయ్ శంకర్ మరియు అతని భార్య అమలా శంకర్ ప్రధాన పాత్రలలో నటించిన నృత్య ప్రధానంగా తీసిన హిందీ భాషా చిత్రం కల్పన (1948) చిత్రంలో కామిని అనే వేశ్య పాత్రలో లక్ష్మీ కాంతను తీసుకున్నారు.

మనదేశం (1949) లో నరసి (నౌకరు) పాత్రలో…

కల్పన అనే హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో నటించడానికంటే ముందే ఆమె నాటకాలలో వేషాలు వేశారు. పలు నాటకాలలో ఆమె పాత్రలు పోషించారు. ఆమెకు నటన కొత్త కాదు. మద్రాసు రావడానికి ముందే లక్ష్మీకాంతం నాటకాలు వేషాలు. బళ్లారి రాఘవ   నాటకం అయిన “పాదుకా పట్టాభిషేకం” లో సీత పాత్ర ఆమె ధరించారు. “వీరాభిమన్యు”, “అపోహ” మొదలైన నాటకాలలో కూడా నటించిన ఆమెకు నటన కంటే కూడా నాట్యం పైననే మక్కువ ఎక్కువ. అయితే ఉదరశంకర్ తెరకెక్కించిన “కల్పన” చిత్ర నిర్మాణం సుమారు నాలుగేళ్ల సమయం తీసుకున్నా కూడా అందులో లక్ష్మీకాంత పోషించిన కామినీ పాత్రకు సరిపోయే నటులు ఎవ్వరూ దొరకలేదు.

యస్.వరలక్ష్మి, పుష్పవల్లి, యోగం మంగళం, బొంబాయి హిందీ తార ఉషాకిరణ్ ఇలా ఎంతో మందిని ఈ పాత్రకు ఎంపికచేసుకున్నారు. కానీ కుదరలేదు. ఆఖరుకు సుమిత్రానందన్ పంత్ అనే రచయిత సిఫారసు వల్ల వేశ్య పాత్ర లక్ష్మీకాంతంను వరించింది. అలాగే మీర్జాపురం రాజా సతీమణి అయిన సి.కృష్ణవేణి నిర్మాణంలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ తొలిచిత్రం మనదేశం (1949) లో వంగర వెంకటసుబ్బయ్య పోషించిన నందయ్య (నౌకరు) పాత్రను ఏడిపించే నరసి (నౌకరు) పాత్రను లక్ష్మీకాంతం పోషించారు. “మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి పోలీసెంకటస్వామి” అనే పాటలో వంగరను ఏడిపిస్తూ ఉండే పాత్రలో లక్ష్మీకాంతం నటించారు.

అవకాశాలు వెల్లువలా…

మన దేశం సినిమా పూర్తయ్యేలోపు విదేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడానికి గురువు ఉదర శంకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో లక్ష్మీకాంతంకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ తనను పెంచిన తండ్రి మండ్లూరి అంజనప్ప మరణం ఆమెను కృంగదీసింది. ఆమెకు విదేశీ నృత్య ప్రదర్శన చేసే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పెంపుడు తండ్రి మరణంతో వారి కుటుంబం మొత్తానికి ఆమెనే ఆధారమయ్యారు. అందువలన లక్ష్మీకాంతం మద్రాసులోనే ఉండిపోవాల్సి వచ్చింది. “మనదేశం” చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్ వారు తమ చిత్రాలలో నాట్యం చేయడానికి రెండు సంవత్సరాలు లక్ష్మీకాంతంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ వాటివల్ల ఆమెకు ఏ విధమైన గుర్తింపు రాలేదు. ఏదో గుంపులో గోవింద అన్నట్టు నలుగురితో పాటు నాట్యం చేయాల్సివచ్చేది. ఈలోగా దర్శకులు బి.ఏ.సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన “పల్లెటూరి పిల్ల” (1950) చిత్రంలో కంపన దొర ప్రేయసి పాత్రను పోషించారు. “ధీరకంపనా మహవీర కంకణా వీరులకంటే వేరు దైవములు లేరు” అనే పాటకు ఆమె నాట్యం చేశారు. మాయలమారి (1951) లో టైటిల్ పాత్ర పోషించిన ఆమె “ఓ పరదేశి ప్రేమ పిపాసి యవ్వనరాశి రావోయీ” అంటూ, పాతాళభైరవి (1951) చిత్రంలో “వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు”, మరదలు పెళ్లి (1952) సినిమాలో “పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు” లాంటి పాటలతో లక్ష్మీకాంతం ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

తగ్గిన అవకాశాలు…

లక్ష్మీకాంతం ను ముద్దుగా ఇటలీ ఏజెంట్ అని పిలిచే త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన “పేరంటాలు” (1951) అనే చిత్రంలో పీడించే భార్య (శాడిస్ట్ భార్య) పాత్రలో నటించారు. భారతలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించి, నిర్మించిన “ప్రియురాలు” (1952) చిత్రంలో కొంగర జగ్గయ్య కథనాయకుడుగా నటించగా, మోహిని పాత్రలో లక్ష్మీకాంతం నటించారు. అదే సంవత్సరం అదే నిర్మాణంలో వచ్చిన “పాలేరు” (1952) చిత్రం నిర్మాణ దశలో ఆగిపోయింది. అయితే ప్రియురాలు చిత్రం కూడా పరాజయం పాలైంది. ప్రియురాలు చిత్రం కొంగర జగ్గయ్యకు మొదటి చిత్రం. ఆయనకు ప్రియురాలుగా నటించారు లక్ష్మీకాంతం. కానీ ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే ఒక్కసారి కథానాయిక పాత్ర పోషించిన తరువాత చిన్న చిన్న వేషాలు ఎందుకు అని దర్శకులు గోపీచంద్ హెచ్చరిక వల్ల కొన్ని సినిమాలు “గుమస్తా”, “పరమానందయ్య శిష్యులు” మొదలైన చిత్రాలలో వచ్చిన చిన్న చిన్న పాత్రలను వదులుకున్నారు. జెమినీ వారు హిందీలో పునర్నిర్మాణం చేసిన పాతాళభైరవిలో లక్ష్మీకాంతం నటించకపోవడంతో నటనా నైపుణ్యం తగ్గిపోయింది అని ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి.

అవరోధంగా నిలిచిన చంద్రశేఖర్…

హెచ్.ఎం. రెడ్డి నిర్మించి, దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం నిర్దోషి (1951) లో నటించిన చంద్రశేఖర్ తో లక్ష్మీకాంతం కు సహజీవనం ఏర్పడింది. ఇద్దరూ కలిసి “ప్రియురాలు’, “నిర్దోషి”, “పేరంటాలు”, “సంక్రాంతి”, “మేనరికం”, “లక్ష్మమ్మ కథ”,  “చక్రపాణి” వంటి చిత్రాలలో వారు కలిసి నటించారు. కానీ వారిద్దరి సినిమా వృత్తులు కుప్పకూలిపోవడంతో వారి సహజీవనం కూడా స్వల్పకాలికంగానే ముగిసింది. ఆయనను హీరోగా నిలబెట్టాలని తాపత్రయంతో ఆమె తన సినీ జీవితం పాడు చేసుకున్నారు. అతనితో కలిసే ఆమె “ఆరాధన” అనే నాటకాన్ని సొంత ట్రూప్ తో ప్రదర్శించారు, కానీ బెడిసికొట్టింది. అదే సమయంలో వేరే వాళ్ళ నాటక సమాజం తరుపున నాటకాలు మొదలుపెట్టారు. నాగభూషణం “రక్త కన్నీరు”, పద్మనాభం నాటక సమాజం తరుపున “శాంతి నివాసం” నాటికలు వేశారు. ఇవన్నీ ఆమెకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా కూడా ఆమెకు శాశ్వతంగా మాత్రం లాభం చేకూరలేదు. నాకు వేషం ఇస్తేనే లక్ష్మీకాంతం సినిమాలు చేస్తుంది అని చంద్రశేఖర్ అభ్యర్థన చేయడం నిర్మాతలకు విసుగు తెప్పించి లక్ష్మీకాంతంకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఆమెకు అవకాశాలు సన్నగిల్లిపోయేసరికి ఆమెను పెంచిన తల్లి జాగ్రత్త పడింది. బంగారాన్ని, నగల్ని మూడవ కంటికి తెలియకుండా మూట కట్టేసింది. ఇలా ఎవరి దారి వారు చూసుకుని, ఆమెను నడిరోడ్డులో నిలబెట్టేసారు.

మరణం…

తేనాంపేట ఎల్దామ్స్ రోడ్డులో ఉన్న పెద్ద భవంతిని ప్రముఖ నటులు ఎమ్.ఆర్. రాధాకు అమ్మేశారు. 

తన కారును కూడా అప్పలవాళ్ళు పట్టుకుపోయారు. అప్పటివరకు ఆమెను అంటిపెట్టుకుని ఉన్న బంధువులు ఆమెను ముఖం చాటేశారు. ఆమె ఆర్థికంగా చితికిపోయారు. గేదెల వ్యాపారం చేశారు, కానీ అదీ కలిసి రాలేదు. మరికొందరు సాయం చేయగా పొలం కొనుక్కోవడానికి కొంత బయనా ఇచ్చారు, కానీ మిగతా సొమ్ము పుట్టించలేకపోయేసరికి అది కూడా నట్టేట్లో కలిసిపోయింది. ఆకలి తీర్చుకోవడం కోసమే అన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో ఒక మారుమూల గుడిసెలో నివసించాల్సి వచ్చింది. చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ అవకాశాలు ఇచ్చి సాయం చేయలేకపోయారు.

ఆమె విషయం తెలుసుకున్న కొంగర జగ్గయ్య కనికరించి ఆమె అడగకుండానే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్ ద్వారా ప్రతినెల 500 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేశారు. ఆమె గత వైభవాన్ని ఎరిగి ఉన్న ఎం.జి చక్రపాణి (ఎం.జీ.ఆర్ తమ్ముడు) ఆమెకు ఒక ప్రభుత్వ ఇల్లు నిర్మించారు. కానీ ఆమె అది కూడా నిలుపుకోలేకపోయారు. చివరకు కన్నతల్లిలా ఆదరించిన మద్రాసు మహా నగరాన్ని వదిలేసి కట్టు గుడ్డలతో పాండిచ్చేరి వచ్చేసి కేవలం పొట్టకూటి కోసమే ఒక క్రైస్తవ శరణాలయంలో తల దాచుకున్నారు. ఎంతో డబ్బు, ఎంతో బంగారం, మేడలు మిద్దెలు అన్నీ పోయాయి. కానీ అన్నీ కూడా ఆమె స్వయంకృతాపరాధాలే. ఒంటరిగా అనాధగా జీవితం ప్రారంభించిన లక్ష్మీకాంతం, ఎంతో వైభవంగా బ్రతికినా కూడా చివరికి ఒంటరిగానే పాండిచ్చేరిలో ఆఖరి రోజులను గడుపుతూ 2014 వ సంవత్సరంలో కన్నుమూశారు.

ఇతర కథనాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి… నందమూరి తారకరామారావు.

తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి… సి.కృష్ణవేణి…

వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్అందుకున్నభౌతిక శాస్త్రవేత్త.సర్ సి.వి.రామన్!

Show More
Back to top button