
కథానాయకులు తమకు ప్రేక్షకుల నుండి విపరీతమైన జనాధరణ పొంది డబ్బు , పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత వ్యాపారరంగం లోకి రావడం పరిపాటి. అందులో భాగంగానే కొందరు సినీపరిశ్రమలో సంపాదించిన డబ్బులు సినిమా రంగములోనే ఖర్చుచేస్తూ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అలా తెలుగునాట అగ్ర కథానాయకులు సొంత నిర్మాణ సంస్థలతో జనాన్ని ఆకట్టుకొనే చిత్రాలను నిర్మించారు. ఈ రకమైన పంథా తెలుగు చిత్రసీమలో టాకీలు మొదలైన నాటి నుండి ఉంది. ముందుగా చిత్తూరు నాగయ్య, ఆ తరువాత వారి దారిలోనే పయనిస్తూ ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్, కృష్ణ లాంటి వారు తమ సొంత నిర్మాణ సంస్థలతో తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు.
నందమూరి తారకరామారావు గారు తమ “యన్.ఏ.టి” పతాకంపై తొలి ప్రయత్నంగా “పిచ్చిపుల్లయ్య’” సినిమాను నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు పొందినా కూడా ఈ సినిమా ఆర్థికంగా నష్టాన్ని చవిచూసింది. అదే తరహాలో సూపర్ స్టార్ కృష్ణ గారు తమ సొంత సంస్థ పద్మాలయా స్టూడియోస్ పతాకంపై మొదట సినిమాగా “అగ్నిపరీక్ష” రూపొందించారు. అది కూడా ఆర్థికంగా నష్టాన్ని చవిచూసింది. చిరంజీవి గారు తమ సొంత సంస్థ “అంజనా ప్రొడక్షన్స్” పతాకంపై తొలి ప్రయత్నంగా చిత్రంగా “రుద్రవీణ” ను నిర్మించారు. ఈ సినిమా పురస్కారాలను దక్కించుకుంది కానీ, ప్రేక్షకుల నుండి నిరాశ ఎదురై ఆర్థికంగా నష్టాన్ని చవిచూసింది.
రుద్రవీణ (1988) సినిమా కె.బాలచందర్ గారు రచించి దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా సంగీత నాటక చిత్రం. చిరంజీవి గారిని ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె.బాలచందర్ గారు కూడా ఉన్నారు. బాలచందర్ గారు తెరకెక్కించిన “ఇదికథకాదు”, “47 రోజులు”, “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” వంటి సినిమాలలో చిరంజీవి గారు విలక్షణమైన పాత్రలలో కనిపించారు. ఆ గురుభక్తితోనే చిరంజీవి గారు తన తొలి సొంత చిత్రానికి కె.బాలచందర్ గారిని దర్శకునిగా ఎంచుకున్నారు. చిరంజీవి గారు సమర్పకునిగా రూపొందిన ఈ చిత్రానికి సహనిర్మాతగా చిరంజీవి గారి చిన్న తమ్ముడు కె.కళ్యాణ్ కుమార్ (పవన్ కళ్యాణ్) పేరు వేశారు. రుద్రవీణ సినిమాకు నిర్మాతగా నాగబాబు గారు వ్యవహరించారు.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారి అంబులపొదిలో బ్రహ్మాస్త్రాలైన నృత్యాలు, పోరాటాలు ఉంటాయి. అలాంటి వాటిని, మెగాస్టార్ హోదాని ప్రక్కన పెట్టేసి ఓ సామాన్యుడిలా సినిమా కథలో ఒదిగిపోయి చిరంజీవి గారు చేసిన ఒక అసామాన్య చిత్రం “రుద్రవీణ”. చిరంజీవి గారి మిగతా సినిమాలు బాక్సాఫీసును ముంచెత్తిన సునామీలైతే, “రుద్రవీణ” సినిమా ఓ నయాగరా జలపాతం. మసిబట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురెొడ్డి నిలిచి చాందసాన్ని చేదించడమే ఒక విప్లవమైతే “రుద్రవీణ” సినిమా కచ్చితంగా ఒక ఎర్ర సినిమానే పరిగణించవచ్చు. చిరంజీవి గారికి నచ్చిన టాప్ టెన్ సినిమాలలో “రుద్రవీణ” సినిమాదే అగ్రతాంబూలం.
చిత్ర విశేషాలు….
దర్శకత్వం : కె.బాలచందర్
నిర్మాణం : కె.నాగేంద్రబాబు
కథ : కె.బాలచందర్, గణేశ్ పాత్రో
చిత్రానువాదం : కె.బాలచందర్
తారాగణం : చిరంజీవి, శోభన, జెమినీ గణేశన్, దేవి లలిత, బ్రహ్మానందం, పి.ఎల్.నారాయణ,
ప్రసాద్ బాబు
సంగీతం : ఇళయరాజా
నేపథ్య గాయకులు : కె.ఎస్.చిత్ర, ఎస్.జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, కె.జె.జేసుదాసు, మనో
కథ, మాటలు, పాటలు : సముద్రాల రాఘవాచార్య,
నృత్యాలు : ఎస్.రఘురాం, గిరిజ
గీతరచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం : లోక్ సింగ్
సంభాషణలు : గణేశ్ పాత్రో
కూర్పు : గణేష్ కుమార్
నిర్మాణ సంస్థ : అంజనా ప్రొడక్షన్స్
నిడివి : 170 నిమిషాలు
విడుదల తేదీ : 04 మార్చి 1988
భాష : తెలుగు
కథ సంక్షిప్తంగా…
సంగీతమలో ప్రావీణ్యుడైన గణపతి శాస్త్రి (జెమిని గణేశన్) కి గౌరవప్రథమైన “బిళహరి” బిరుదు ఉంటుంది. గణపతి శాస్త్రికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె తంబూరా వాయిద్యంలో ప్రావీణ్యురాలు. పెద్ద కుమారుడు (ప్రసాద్ బాబు) మూగవాడు. తాను మూగవాడు అయినా కూడా సన్నాయి నాదం వాయించడములో దిట్ట. చిన్నకుమారుడు సూర్యనారాయణ శాస్త్రి (చిరంజీవి) తండ్రి వద్దనే సంగీతంలో శిక్షణ పొందుతున్నాకూడా తాను అభినవ భావాలు గల వ్యక్తి.
నాట్యంలో ప్రావీణ్యం ఉన్నాలలిత శివజ్యోతి (శోభన), కేవలం అధమ సామాజిక వర్గానికి చెందినది అమ్మాయి కావటం వలన, గుడిలోకి తనకు ప్రవేశం ఉండదు. తనకు ప్రవేశం నిషిద్ధం కావటం వలన, గుడికి దూరంగా, కొండపై నాట్యం చేస్తూ ఉంటుంది. లలిత నాట్యానికి ముగ్ధుడైన సూర్యం ఆమెతో పరిచయం పెంచుకొంటాడు. లలితకు జరుగుతున్న అన్యాయానికి బాధపడతాడు. లలిత తండ్రి (పి. ఎల్. నారాయణ) ఒక లాయరు.
ఒకరోజు తండ్రితో కలిసి సాధన చేస్తున్న సూర్యానికి తలుపు వద్ద ఒక స్త్ర్రీ భిక్షాటన వినిపిస్తుంది. ఆ భిక్షగత్తె దీన గళంతో ఏకాగ్రతని కోల్పోయిన సూర్యాన్ని మందలిస్తాడు తండ్రి గణపతి శాస్త్రి. తరువాత జరిగే సంగీత కచేరీలో “మానవ సేవే మాధవ సేవ” అని అర్థం వచ్చేలా సూర్యం పాడటంతో తనని శిష్యునిగా ధిక్కరిస్తాడు గణపతి శాస్త్రి. ఆ క్రమంలో చారుకేశ (రమేష్ అరవింద్) అనే మరో యువకుడిని శిష్యునిగా స్వీకరిస్తాడు. తండ్రి ధిక్కరింపుకు గురి అయిన సూర్యం, లలిత ఇంటిలో తలదాచుకొంటాడు.
తన కూతురినే ప్రేమించటం హర్షించిన గణపతి శాస్త్రి, కూతురు పెళ్ళికి ఒప్పుకుంటాడు. దాంతో చారుకేశ వరకట్నంగా తన బిళహరి బిరుదుని ఇవ్వమంటాడు. చేసేది లేక ఇచ్చిన గణపతి శాస్త్రికి తర్వాత చారుకేశ అసలు బ్రాహ్మణుడే కాదని తెలుస్తుంది. ఇల్లు వదలి సమాజసేవ బాటని పట్టిన సూర్యం యొక్క సంఘ సంక్షేమ ప్రయత్నాలని గుర్తించి ప్రధాన మంత్రి అతనిని సత్కరించటానికి తమ ఊరికి వస్తున్నాడని గణపతి శాస్త్రికి తెలుస్తుంది. ఆ సభలో కుమారుడిని దగ్గర నుండి చూడాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవటం గమనించిన సూర్యం అతను తన తండ్రి అని, సభా వేదిక పై అతనిని తీసుకు వచ్చి, తండ్రిగా అతనిని సత్కరించటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
కథ కు బీజం…
మాములుగానే నాగబాబు గారు వెళ్లి బాలచందర్ గారిని కలిశారు. దానికి బాలచందర్ గారు కూడా సరేనన్నారు. ఎప్పటినుండో బాలచందర్ గారికి మనసులో ఒక ఆలోచన ఉంది. ఓ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే హీరో కథ సినిమాగా చేయాలని కొంత కాలంగా ఆలోచిస్తున్నారు. అన్నా హజారే అప్పుడే మిలటరీలో నుంచి వచ్చి మహారాష్ట్రలోని ఖాళీగా ఉన్న గ్రామాన్ని డెవలప్ చేసి దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. అది తనకు ప్రేరణ అయ్యింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఐ.పీ.ఎస్ అధికారి కూడా ఇలాగే తన సొంత ఊరిని అభివృద్ధి చేశారు. ఈ రెండు వార్తలు చదివాక బాలచందర్ గారికి ఆ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనిపించింది. తెలుగువాడైన గణేష్ పాత్రో ఒకరకంగా బాలచందర్ గారికి ఆస్థాన రచయిత. పాత్రయొక్క ఉద్దేశ్యం చెబితే ఏముంది కథలో కొత్తదనం అనిపించింది పాత్రో కు. కానీ బాలచందర్ గారి దృక్కోణం ఎలాంటిదో పాత్రోకి బాగా తెలుసు కాబట్టి తాను ఏమీ మాట్లాడలేదు.
ముందుగా అనుకున్న పేరు “బిలహరి”…
ఏ సినిమా నిర్మాణానికైనా ముందు కథ అనేది ప్రాముఖ్యమైనది. దీనికి కథ మాటలు వ్రాసినది గణేష్ పాత్రో. రుద్రవీణ కథని బాలచందర్ గారు గణేష్ పాత్రో గారికి చెప్పగానే అందులో ఏముంది కొత్తగా అనుకున్నారు. అప్పట్లో తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాలు ఇలాంటివి చాలానే వచ్చాయి అనుకున్నారు తాను. కానీ కథ బాలచందర్ గారికి ఇవ్వాలి. కనుక తనను తక్కువ అంచనా వేయగలమా అన్న సందేహం పాత్రో గారికి కలిగింది. బాలచందర్ గారి మాటలలో కన్నా కూడా తన మనసులో భావం ఎక్కువగా ఉంటుంది.
నిజానికి ఆయనకు ఎవ్వరికీ కథ చెప్పడం అలవాటు లేదు. తన ఆలోచన ఒక స్వభావం, ఒక స్పందన. అది చిలువల పలువలై అల్లసాని అల్లిక జిగిబిగిని మించిపోతుంది. వాస్తవానికి “రుద్రవీణ” అనే పేరు పెట్టడానికంటే ముందే, గణపతి శాస్త్రి “బిలహరి” రాగంలో నిష్ణాతుడని “బిలహరి” అని పేరు పెట్టాలనుకున్నారు. ఆ రోజుల్లో రాగల పేర్లతో చాలా సినిమాలు వచ్చాయి. “శివరంజని”, “శంకరాభరణం”, “ఆనంద భైరవి” వగైరా అలా వచ్చిన్నవే. అందువలన “బిలహరి” పేరు వద్దనుకుని గణపతి శాస్త్రి స్వభావం రుద్రావతారమే కాబట్టి “రుద్రవీణ” అని పేరు పెట్టారు.
నటీనటుల అభినయం…
బిలహరి రాగంలో మంచిపట్టు ఉండి, సంగీత ధ్యానం మాత్రమే ఉండి, కులాలు ఆచారాలను గట్టిగా నమ్ముతూ ఆ అంశాలపై కఠినంగా వ్యవహరించే పాత్ర పేరు బిలహరి గణపతి శాస్త్రి. కొత్త శిష్యుని చేరదీయడంలో, అల్లుడిని తన సంగీత వారసుడిగా ప్రకటించే సందర్భంలో, శుభలేఖ ఇవ్వడానికి పి.ఎల్.నారాయణ వచ్చిన సన్నివేశంలో గణపతి శాస్త్రి పాత్ర తీరు అద్భుతంగా ఉంటుంది. తాగుబోతులను రెచ్చగొట్టడంలో, కుమారుని ప్రాభవం చూడడానికి ముందు ఇష్టపడకపోయినా మనసు ఆపుకోలేక సభా ప్రాంగణంలోకి రావడం తదితర సన్నివేశాలలో గణపతి శాస్త్రి పాత్రలో జెమినీ గణేషన్ గారు అద్భుతంగా నటించారు.
సంగీతం విషయంలో తండ్రికి శిష్యుడే అయినా కూడా కులాలు, అస్పృశ్యత వంటివి పట్టించుకోకుండా ఆర్తులని ఆదుకోవడానికి పెద్దపీట వేస్తూ, ఈ ఆంశంలో తండ్రిని ధిక్కరించిన వాడిగా సూర్యం పాత్ర కూడా అద్బుతమైనదనే చెప్పాలి. కుటుంబంలో పరాయివాడిగా ఉండాల్సిన పరిస్థితిలోనూ, నిమ్నజాతి వారితో కలిసిపోయినవాడుగా, తాగుబోతుల మాటలకు ప్రేమను, పెళ్లిని త్యాగం చేసి సమాజ సేవపై దృష్టిపెట్టిన వానిగా సూర్యనారాయణ (సూర్యం) పాత్రలోను, పాటలున్న సన్నివేశాలనూ మంచి నటన ప్రదర్శించారు చిరంజీవి గారు. అంతే కాదు తన నటజీవితంలో ఉత్తమ చిత్రాలలో ఒకటిగా చిరంజీవి గారు ఈ సినిమాను పేర్కొన్నారు.
“లలిత” గా శోభన గారు చక్కని నటన ప్రదర్శించడంతోపాటు తాను తన నాట్య కౌశల్యాన్ని కూడా చూపే అవకాశం బాలచందర్ గారి పుణ్యమంటూ ఈ చిత్రంలో ఆ పాత్రతో లభించింది. ప్రసాద్ బాబు నటించిన మూగవాని పాత్ర తన నటజీవితంలో గొప్ప పాత్ర. శోభన తండ్రిగా, సూర్యంకి ఆశ్రయం కల్పించిన వానిగా, గణపతి శాస్త్రికి శుభలేఖ సందర్భంలో గణపతి శాస్త్రి పంపిన పది రూపాయల నోటు చూసి “మీ నోటికే కాదు నోటికే కాదు, మీరు పంపించిన నోటుకు కూడా చిల్లుపడింది” చిల్లు పడినవి చెల్లవండి అనడం, రండి రండి పాటలో వాయిదాల వరాలయ్య గా పి.ఎల్.నారాయణ అభినయం చాల బావుంది. తాగుబోతు పాత్రలో బ్రహ్మానందం, ప్రసాద్ బాబు భార్య పాత్ర ఇలా సినిమాలోని అన్ని పాత్రలు పాత్రోచిత్యాన్నిపాటించి నటించడం వలన అన్నిరకాల భావోద్వేగాలు , మానసిక భావనలు చాలా చక్కగా పండాయి.
పాత్రల తీరుతెన్నులు…
కొడుకులు ఉదయం పాత్రలో ప్రసాద్ బాబు, సూర్యం పాత్రలో చిరంజీవి అద్భుతమైన ప్రదర్శన చేశారు. సూర్యంతో జట్టు కట్టడానికి లలిత పాత్రలో శోభనను తీసుకున్నారు. కర్ణాటక సంగీతంలో లలిత అనే ఒక అద్భుతమైన రాగం ఉంది. ఆ రాగం పేరు శోభన పాత్రకు పెట్టారు. అప్పట్లో తెలుగు సినిమా యుగంలో “లవకుశ”, “రహస్యం” సినిమాలతో చాలా ప్రచారం పొందిన “లలిత శివ జ్యోతి” అనే నిర్మాణ సంస్థ ఉండేది. కాబట్టి లలిత అనే పేరుకు అదనంగా “శివజ్యోతి” అనే పేరును చేర్చాను. అయితే సూర్యంను ఆమె ఆటపట్టించడానికి లలిత పేరు “పెంటమ్మ” అని చెబుతుంది. ఆమెకు ఆ పేరు పెట్టిన తల్లిదండ్రులు కలవడానికి సూర్యం వెళ్ళగా వాయిదాల వరాలయ్య పాత్రలో పి.ఎల్.నారాయణ రండి రండి అని తన సంగీత అభిమానాన్ని చాటుకుని స్వాగతిస్తాడు.
అడవిలో గొడ్డలి చప్పుళ్ల శృతిలయలు విన్న సూర్యం శ్రామికుల వినోదం కోసం ఒక జానపద గీతం పాడుతాడు. అది విన్న గణపతి శాస్త్రి ఏ రాగం అని అడిగితే సూర్యాన్ని అడిగితే “హంసధ్వని” అని సూర్యం చెప్పగా తండ్రి “హింసధ్వని” అని కోపంగా కసురుకుంటాడు. అలా తండ్రీ, కొడుకుల మధ్య విభేదాలు మొదలవుతాయి. నువ్వు నా కొడుకు అని ఎప్పుడు చెప్పుకోకూడదని శాసిస్తాడు సూర్యం తండ్రి. నేను నీ తండ్రిని అని గర్వపడి చెప్పాల్సిన రోజు వస్తే అప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను. “పుత్రగాత్ర పరిష్యంగ సుఖాన్ని అనుభవిస్తానని” ఒక రకమైన సవాలు చేస్తాడు గణపతి శాస్త్రి. ఆ సవాలుకు సూర్యం ఇచ్చిన జవాబే మిగిలిన కథాంశం.
భావోద్వేగాల సంగమం…
ఈ సినిమాలో తండ్రీ కొడుకులు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు దాన్ని సంగీతంతో చల్లబరిచే చికిత్స చాలా గొప్ప ఆలోచన. తండ్రి అభోజనంలో ఉండగా సూర్యం తినేస్తానని విస్తరి మీద కూర్చుని కూడా తినలేక కళ్ళు తుడుచుకొని చేయి కడుక్కోవడం, పెంటమ్మ పేరు విని ఆ రూపు ఏంటి, ఆ పేరు ఏంటి అని సూర్యం మదనపడడం, ఒక తల్లీ కూతుర్ల యోగక్షేమాలు విచారించడానికి వెళ్లిన సూర్యానికి ఇద్దరు ఒకేసారి కనిపించక ఒక చీర కట్టుకొని ఒకరు, అదే చీర కట్టుకుని తర్వాత మరొకరు వచ్చి పోవడం కూతురు పెద్ద పిల్లల కాకుండానే ఏకవస్త్ర కావడం లాంటి అనేక భావోద్వేగాల సంగమం ఈ సినిమా.
మగవాళ్ళ చేత తాగుడు మానిపించడానికి మహిళా మండలి సమావేశపరిచి మందుకి, మంచానికి లలితకు ముడిపెట్టడం, పతాక సన్నివేశంలో రాజీవ్ గాంధీ గారి రాక ఒక అపూర్వ సృష్టి. తద్వారా కథకి బాలచందర్ గారు సాధించిన కథనం అనితర సాధ్యం. నిజానికి బాలచందర్ గారికి తెలుగు భాష అంటే ఇష్టం. తెలుగు పాట అంటే ఇష్టం. తెలుగు ప్రజలుఅన్నా కూడా చాలా ఇష్టం. అందుకే “పాడుతా తీయగా” కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో తిరుపతిలో ప్రేక్షకులందరి సమక్షంలో మరు జన్మలో తెలుగువానిగా పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ బాలచందర్ గారు ప్రకటన చేశారు.
నిర్మాత…
చిరంజీవి గారి పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు గారు అప్పుడే న్యాయవాద చదువు పూర్తి చేశారు. తనని కూడా సినిమా రంగంలోకి తీసుకురావాలనేది చిరంజీవి గారి ఆకాంక్ష. వారి అమ్మ పేరు మీద బ్యానరు పెట్టి మన మనసుకి నచ్చిన సినిమాలు చేద్దామన్నారు చిరంజీవి గారు. రాముడి మాట జవదాటిని లక్ష్మణునిలా బుద్ధిగా తలవూపేశారు నాగేంద్రబాబు గారు. నిజానికి నాగేంద్రబాబు గారికి సినిమాలు అంటే ఇష్టం. కానీ తనకు చిత్ర నిర్మాణంపై పెద్దగా అవగాహన లేదు. అందుకే గీత ఆర్ట్స్ లో రూపొందుతున్నఓ చిత్రానికి పనిచేసి కొంచెం పట్టు సంపాదించుకున్నారు. అన్నయ్యతో ఎలాంటి సినిమా చేయాలని నిత్యం నాగేంద్రబాబుకి ఒకటే ఆలోచన. అప్పట్లో చిరంజీవితో సినిమా చేస్తే తక్కువలో తక్కువ ఐదు లక్షల లాభం తప్పనిసరి. డబ్బు కోసమని అన్నయ్యతో అల్లాటప్పా సినిమా చేసేయకూడదు, అమ్మ పేరు పెట్టే బ్యానర్ అమ్మ పేరు నిలిచేలా ఉండాలన్నది నాగబాబు గారి వాంఛ.
మాములుగానే నాగబాబు గారికి శంకరాభరణం, సింధు భైరవి లాంటి సినిమాలంటే ఇష్టం. వాటిని ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. అయితే అలాంటి కథలు చిరంజీవి గారికి ఉన్న పెరుప్రతిష్టలకు సరిపడవు. కళాత్మకంగా ఉండాలి , దానికి తోడు వాణిజ్య అంశాలు కూడా ఉండాలి . అలాంటి సినిమాలు తీయగల సమర్థులు కేవలం కే.బాలచందర్ గారు మాత్రమే అని బాలచందర్ గారి దర్శకత్వంలో సినిమా చేద్దామని నాగేంద్రబాబు గారు చెప్పగానే చిరంజీవి గారి మొహం మతాబులా వెలిగిపోయింది. తమ్ముడు నాగేంద్రబాబు గారి వైపు శెభాస్ అన్నట్టుగా చూశారు చిరంజీవి గారు. వాస్తవానికి అంతకుముందు బాలచందర్ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు రెండు సినిమాలు చేశారు. ఇది కథ కాదు, 47 రోజులు. ఈ రెండు సినిమాలలోనూ ప్రతినాయక ఛాయలున్నపాత్రలే. కనుక తన దర్శకత్వంలో కథానాయకుడిగా చేయాలననే కోరిక చిరంజీవి గారి మనసులో బలంగా ఉంది.
పురస్కారాలు…
రుద్రవీణ సినిమా జాతీయస్థాయిలో జాతీయ సమైక్యతను ప్రబోధించే “నర్గీస్ దత్” ఉత్తమ చిత్రం పురస్కారాన్నిఅందుకుంది. ఇళయరాజా గారికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం లభించింది. ఇది ఇళయరాజా గారికి మూడవ జాతీయ పురస్కారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడుగా ఇది నాలుగవ జాతీయ పురస్కారం. రాష్ట్రస్థాయిలో నంది అవార్డులలో ఈ చిత్రం ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. గణేష్ పాత్రోకి మాటల రచయితగా నంది పురస్కారాన్ని తీసుకువచ్చింది రుద్రవీణ సినిమా.
అంజనా ప్రొడక్షన్స్ పథకముపై చిరంజీవి, నాగబాబు గార్లు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో పలు అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రులకు స్ఫూర్తినిచ్చి ఈ చిత్రంలోని అంశాలను పథకాలుగా ప్రవేశపెట్టి, అమలు చేసి ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగారు. వాటిలో మద్యపానం నిషేధించడం, గ్రామాల్లో స్వయం సమృద్ధికి సంబంధించి డ్వాక్రా పథకం ప్రవేశ పెట్టడం, స్త్రీ విద్య, స్వయం ఉపాధి, జన్మభూమి పథకం, కులాంతర వివాహం చేసుకున్న వారి విషయంలో సహాయ పథకాలు, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి తొలుత లక్ష రూపాయలు, తర్వాత యాభై వేల రూపాయలుగా మార్చారు. సహాయం ఎందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
విడుదల…
గణేశ్ పాత్రో సంభాషణలు వ్రాసిన ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇళయరాజా గారి బాణీలకు అనువుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇందులోని “లలిత ప్రియకమలం” , “తరలిరాద తనే వసంతం” , “చెప్పాలని ఉంది”, “నమ్మకు నమ్మకు ఈ రేయిని”, “మానవసేవయే”, “చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా” , “రండి రండి” , “తులసీ దళములచే” అంటూ సాగే పాటలు అలరించాయి.
రుద్రవీణ సినిమాను ఎక్కువగా మద్రాసు , కాంచీపురం , కుర్తాళం మరియు శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ సినిమా సుమారు 80 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించబడింది. 70 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సినిమా 04 మార్చి 1988న విడుదలైంది. ఆ సమయానికి చిరంజీవికి భీభత్సమైన మాస్ ఇమేజ్ ఉంది. ఆ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. చిరంజీవి అంటేనే మాస్ కు మరోపేరులా సాగుతున్నా రోజుల్లో ఆయన కమర్షియల్ సినిమాల నడుమ “రుద్రవీణ” పగిలిపోయింది.
వాణిజ్యపరంగా పరాజయం పాలైన ఈ చిత్రం ఆర్థికంగా 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. కానీ ఆ వీణ పలికించిన రాగాలు సంగీతప్రియులను అలరించాయి. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజాకు నంది అవార్డుతో పాటు, నేషనల్ అవార్డు కూడా లభించింది. బాలచందర్ గారు రూపొందించిన ఉత్తమ చిత్రాలలో “రుద్రవీణ” ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సినిమా చిరంజీవి గారికి ప్రత్యేక జ్యూరీ అవార్డుతో సహా నాలుగు నంది అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం బాలచందర్ గారు ఈ చిత్రాన్ని తమిళంలో “ఉన్నాల్ ముడియుమ్ తంబి” గా శివాజీ గణేశన్‌తో మరియు కమల్ హాసన్ గార్లతో తిరిగి రూపొందించారు.



