CINEMATelugu CinemaTelugu Special Stories

భారతీయ అభినయ, నాట్య మయూరం నటి శోభన

శోభన చంద్రకుమార్ పిళ్ళై (21 మార్చి 1970)..

విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం. అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా కూడా, తెలుగు చిత్రసీమలో రాణించిన నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన గారి స్థానం ప్రత్యేకమైనది.

మిగతా భాషలలో కన్నా కూడా తెలుగు చిత్రాలతోనే శోభన గారూ మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన శోభనకు తెలుగునాట విశేషమైన ఆదరణ ఉంది. తన నటనతో అశేష ప్రేక్షకులకు దగ్గరైన శోభన గారూ నటిగా కాకుండా, నృత్యకారిణి గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం శోభన గారూ కళారాధనకే అంకితం అయ్యారు. పూర్తిగా తన నాట్యకళకే జీవితాన్ని అంకితం చేసిన వీరు చెన్నైలో కళార్పణ అనే పేరుతో ఒక నాట్య శిక్షణాలయాన్ని కూడా స్థాపించి ఎంతోమందికి భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. వారితో కలిసి విదేశాల్లో అనేక నాట్య ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు.  సినీ పరిశ్రమలో శోభనకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. అలనాటి నటీమణులు లలిత, పద్మిని, రాగిణి లు ఈమెకు బంధువులు. నటుడు వినీత్ కూడా ఈవిడ గారికి దగ్గరి బంధువే అవుతారు.

ఆమె నటించిన మణిచిత్రతాజు (తెలుగులో చంద్రముఖి) చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఫాజిల్, ప్రియదర్శన్, ఆదూర్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేసింది. సినీ, నృత్య రంగాలకు సేవలందిస్తున్నందుకు గాను శోభన గారిని పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. విలక్షణ నటి, ప్రముఖ నృత్యకారిణి శోభన గారూ తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర రంగాలకు సుపరిచితులు. సినీ పరిశ్రమలో చాలా సీనియర్ నటి. శోభన గారి వయస్సు దాదాపు 53 సంవత్సరాలు. అయితే ఆవిడ గారూ వివాహానికి దూరంగా ఉండటం గత కొద్దికాలంగా మిస్టరీగా మారింది.

జీవిత విశేషాలు..

  • జననం..   21 మార్చి 1970
  • స్వస్థలం..    తిరువనంతపురం , కేరళ , భారతదేశం
  • తల్లిదండ్రులు…   ఆనందం చంద్రకుమార్, చంద్రకుమార్ పిళ్ళై..
  • కుటుంబం…     ట్రావెన్‌కోర్ కుటుంబం
  • వివాహం…         అవివాహిత
  • వృత్తులు..   నటి.. నర్తకి.. నృత్య దర్శకురాలు..
  • పిల్లలు :          నారాయణి చంద్రకుమార్ ( దత్తత పుత్రిక )..
  • నివాసము…   తిరువనంతపురం , కేరళ , భారతదేశం
  • నటించిన సినిమాలు..  దాదాపు 200 పైచిలుకు చిత్రాలు..
  • నటించిన భాషలు :   తమిళ, కన్నడ , తెలుగు, మలయాళం,
  • హిందీ, ఇంగ్లీష్ 
  • పురస్కారాలు…   పద్మశ్రీ (2006)
  • కలైమామణి (2011)

జననం…

శోభన చంద్రకుమార్ పిళ్ళై గారూ 21 మార్చి 1970 నాడు కేరళ లోని తిరువనంతపురం లో “ట్రావెన్ కోర్” కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఆనందం చంద్రకుమార్, చంద్రకుమార్ పిళ్ళై. శోభన గారూ ట్రావెన్‌కోర్ సోదరీమణుల (లలిత , పద్మిని మరియు రాగిణి) మేనకోడలు.  లలిత , పద్మిని మరియు రాగిణిలు భారతీయ శాస్త్రీయ నృత్యకారిణులు మరియు నటీమణులు.

సినీ ప్రస్థానం & బాలనటిగా.

shobana

శోభన గారూ సినిమాలలో తన ఆరంగ్రేటాన్ని బాల నటిగానే ప్రారంభించారు. శోభన గారూ రెండేళ్ళ ప్రాయంలో రాజేశ్ ఖన్నా ‘అమర్ ప్రేమ్’ చిత్రంలో ఓ సన్నివేశంలో కొన్ని క్షణాలు మాత్రమే తెరపై కనిపించారు. 1980లో కృష్ణన్-పంజు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం “మంగళ నాయగి”లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో శ్రీకాంత్ మరియు కె.ఆర్.విజయ నటించారు. ఇది హిందీ చిత్రం “సాజన్ బినా సుహాగన్” యొక్క రీమేక్. ఈ చిత్రంలో ప్రదర్శించిన నటనకు గానూ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత పన్నెండేళ్ళ వయసులో 1982లో బహుముఖ ప్రజ్ఞాశాలి, మహానటి అయిన భానుమతీ రామకృష్ణ గారి దర్శకత్వంలో అందరూ పిల్లలతో రూపొందించిన “భక్త ధ్రువ మార్కండేయ” అనే తెలుగు సినిమాలోనే తొలిసారి శోభన గారూ నటించారు. ఇది తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ రూపొందించబడి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం.

తొలి సినిమా మలయాళంలో “ఏప్రిల్ 18”..

శోభన గారూ కథానాయికగా తన అరంగ్రేటాన్ని మలయాళం చిత్రంతో మొదలుపెట్టారు. బాలచంద్ర మీనన్ రచన మరియు దర్శకత్వంలో తీసిన ఏప్రిల్ 18 అనే మలయాళం చిత్రంలో బాలచంద్ర మీనన్ గారూ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో శోభన , అదూర్ భాసి మరియు భరత్ గోపీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 1984లో   విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రక్కింటి అమ్మాయిగా సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. అదే సంవత్సరంలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శోభన గారూ, యస్.పి.ముత్తురామన్ గారూ దర్శకత్వం వహించిన ఎనక్కుల్ ఒరువన్‌లో నటించారు. ఎనక్కుల్ ఒరువన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది.

శోభన గారూ 90వ దశకం ప్రారంభంలో సత్యరాజ్ గారితో ( మల్లు వెట్టి మైనర్ , వాతియార్ వీటు పిళ్లై ), భాగ్యరాజ్ గారితో ( ఇది నమ్మ ఆళు ) మరియు విజయకాంత్ గారితో ( పొన్మన సెల్వన్ , ఎన్ కిట్ట మొత్తతే ) నటించారు.

తెలుగులో తొలిచిత్రం “విక్రమ్”..

శోభన గారూ తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన విక్రమ్ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. 1986లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి వి.మధుసూధనరావు గారూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ చిత్రం హీరో (1983) కి రీమేక్. అక్కినేని నాగార్జున హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం కూడా విక్రమ్ కావడం విశేషం. ఈ చిత్రం ఆర్థికంగా అద్భుతమైన విజయం సాధించింది.

మాములుగానే భరతనాట్యం కళాకారిణి అయిన శోభన గారూ సినిమాలలో హీరో ప్రక్కన్న అవలీలగా డ్యాన్స్ వేసేవారు. అద్భుతమైన అభినయాన్ని కనబర్చేవారు కూడనూ. శోభన గారూ ముఖ్యంగా ప్రముఖ కథానాయకులతో నటించిన సినిమాల విషయానికి వస్తే కె.బాలచందర్ గారి దర్శకత్వంలో చిరంజీవి గారూ హీరోగా నటించిన “రుద్రవీణ” సినిమా ద్వారా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత చిరంజీవి సరసన రౌడీ అల్లుడు చిత్రంలో కూడా నటించింది. అలాగే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కొక్క హీరోతో రెండేసి చిత్రాలలో నటించి మెప్పించడం గమనార్హం.

శోభన, మోహన్ బాబు గార్ల జంట అప్పట్లో ఉత్తమమైన జోడిగా మంచి పేరు తెచ్చుకుంది. వారిద్దరి కలయికలో వచ్చిన అల్లుడుగారు, రౌడీ గారి పెళ్ళాం లాంటి చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేస్తున్నాయి. శోభన నటించిన తెలుగు చిత్రాలు.. విక్రమ్, విజృంభణ, అజేయుడు, త్రిమూర్తులు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడుగారు, కోకిల, టైగర్ శివ, నారీ నారీ నడుమ మురారి, అల్లుడు దిద్దిన కాపురం, ఏప్రిల్ 1 విడుదల, కీచురాళ్లు, రౌడీ అల్లుడు, రౌడీగారి పెళ్ళాం, అప్పుల అప్పారావు, అహంకారి, హలో డార్లింగ్, రక్షణ, నిప్పురవ్వ, సూర్యపుత్రులు, గేమ్, పరిణయం

దాదాపుగా 200 పైచిలుకు చిత్రాల్లో నటించిన శోభన గారూ రాను రాను సినిమాలు తగ్గించేసింది. 2006 లో మోహన్ బాబు గారి గేమ్ సినిమా తరువాత శోభన గారూ 2013లో విడుదలయిన “తీరా” చిత్రంలో నటించారు. తరువాత ఆమె 2020 లో “వరనే అవస్యముండన్” అనే సినిమాలో ఒంటరి తల్లి పాత్రను పోషించారు. ఆ తరువాత సినిమాల్లో నటించలేదు.

శాస్త్రీయ నృత్యం…

శోభన గారిని భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను, నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న కళాకారిణి శోభన గారూ. భరతనాట్యం అంటే విపరీతమైన మక్కువ కలిగిన శోభన గారూ, తమిళనాడులోని చెన్నైలోని “చిదంబరం అకాడమీ”లో చిత్రా విశ్వేశ్వరన్ గారి ఆధ్వర్యంలో భరతనాట్యంలో నృత్య శిక్షణ కూడా పొందారు. శోభన గారూ తన స్వంత నృత్య పాఠశాల “కలిపిన్య”ను ప్రారంభించారు. 1994లో ఆమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్య వార్షికోత్సవాలు నిర్వహించడం.

ప్రస్తుతం శోభన గారూ కళారాధనకే అంకితం అయ్యారు. పూర్తిగా తన జీవితాన్ని నాట్యకళకే అంకితం చేసిన శోభన గారూ  భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ వారితో కలిసి విదేశాల్లో అనేక నాట్య ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు.

వివాహం..

ప్రతీ మనిషి జీవితంలో ఒక కల నెరవేరడానికి ఎంత కష్ట పడాల్సి వస్తుందో, నెరవేరిన అదే కలని చిదిమేసుకోవడానికి ఒక్క తప్పుడు నిర్ణయం సరిపోతుంది. జీవితం మనకు పాఠాలు నేర్పినా నేర్పకపోయినా, ఒక్కోసారి మన జీవితమే విషాదపు పాఠంగా ప్రజల ముందు మిగిలిపోతుంది. సినిమా తారల జీవితాలు ఇందుకు చాలా ఉదాహరణలుగా మిగిలిపోయాయి. అందరికీ వినోదాన్ని పంచి, ఉన్నతమైన రంగుల జీవితాన్ని సాధించి, విపరీతమైన జనాభిమానాన్ని సొంతం చేసుకుని వీటన్నిటికోసం కాలంతో పోటీపడి పరుగులు తీస్తారు సినీ తారలు.

ఒక్కసారి స్థాయి అందుకున్న తరువాత ఎదురయ్యే ఓటమిని తట్టుకునే శక్తిని చాలా మంది అలవర్చుకోలేరు. శోభన గారూ పెళ్లి చాలా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఓ మలయాళ నటుడితో ఆమెకు ఉన్న ప్రేమ వ్యవహారమే అనేది అప్పట్లో బలంగా వినిపించింది. వారి ప్రేమ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందని అందరూ భావించారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా అనూహ్యంగా వారిద్దరూ విడిపోయారట. దాంతో మనస్తాపానికి గురైన శోభన గారూ వివాహానికి దూరంగా ఉన్నారనే వదంతులు ఉన్నాయి.

చిత్ర పరిశ్రమలో హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గారూ అయితే, హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శోభన గారూ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయిదు పదుల వయసు దాటినప్పటికి కూడా శోభన గారూ వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అగ్ర కథనాయకుల సరసన నటించి మెప్పించిన శోభన గారూ వివాహానికి దూరమైందని తెలిసి ఆమె అభిమానులు సైతం ఎంతో మనోవేదన వ్యక్తం చేశారు.

ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత ఓ అమ్మాయిని 2001లో దత్తత తీసుకొన్నారు. తాను దత్తత తీసుకొన్న అమ్మాయికి అనంత నారాయణి అనే పేరు పెట్టారు. ఆ బాలిక యొక్క సంరక్షణ బాధ్యతలను ఎత్తుకొని తనలోని బాధను దూరంగా పెట్టుకొన్నారు. నృత్య రంగానికి సేవలందిస్తూ కాలం గడుపుతున్నారు. కానీ ఒంటరి జీవితమే నాకు సంతృప్తినిచ్చింది అని పలుమార్లు చెప్పుకొచ్చారు.

పురస్కారములు.

  • 2000 సంవత్సరానికి గానూ దూరదర్శన్ వారు “గ్రేడ్ A టాప్” బహుమతి ఇచ్చి సత్కరించారు..
  • శోభన గారూ భరత నాట్యనికి చేసిన సేవలకు గానూ 2006  సంవత్సరంలో భారత ప్రభుత్వం “పద్మశ్రీ” అవార్డునిచ్చి సత్కరించింది..
  • 2011 వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం “కలైమామణి” బిరుదునిచ్చి సత్కరించారు..
  • 2012 వ సంవత్సరంలో  ఆల్ ఇండియా అచీవర్స్ కాన్ఫరెన్స్ వారు ఆర్చ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డునిచ్చి గౌరవించారు..
  • 2013 వ సంవత్సరంలో  కేరళ సంగీత నాటక అకాడమీ  వారు కళారత్న బిరుదునిచ్చి సన్మానించారు..
  • 2019 సంవత్సరంలో  MGR ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్  వారు గౌరవ డాక్టరేట్ ( D.Litt ) డాక్టర్బిరుదునిచ్చి గౌరవించారు..

ఇతర అవార్డులు.

  • 1990 సంవత్సరంలో మలయాళం చిత్రం ఇన్నాలే లో నటించినందుకు గానూ ఉత్తమ నటి పురస్కారం గెలిచుకుంది.
  • 1993 వ సంవత్సరంలో మలయాళం చిత్రం మణిచిత్రతాఝు చిత్రానికి  జాతీయ చలనచిత్ర  ఉత్తమ నటి అవార్డు గెలుపొందింది.
  • 1993 వ సంవత్సరంలో మలయాళం చిత్రం మణిచిత్రతాఝు చిత్రానికి గానూ కేరళ రాష్ట్ర చలనచిత్ర  ఉత్తమ నటి  అవార్డు గెలిచుకుంది.
  • 1994 వ సంవత్సరంలో తేన్మావిన్ కొంబత్ అనే మలయాళం చిత్రానికి గానూ ఉత్తమనటి అవార్డు  అందుకుంది.
  • 2002 సంవత్సరంలో మిత్ర, ఆంగ్ల చిత్రానికి గానూ జాతీయ చలనచిత్ర  ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు.
  • 2013 వ సంవత్సరంలో  “తీరా” చిత్రానికి గానూ వనిత ఫిల్మ్ అవార్డ్స్ నుండి ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుపొందారు. 
  • 2021 సంవత్సరానికి గానూ వారనే అవశ్యముండ్ అనే మలయాళం చిత్రానికి గానూ 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వారి ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుపొందారు.

Show More
Back to top button