
అమెరికాలో పోలీసు వాహనం ఢీకొన్న ఘటనలో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేకూర్చే దిశగా కీలక అడుగు పడింది. ఆమె మృతికి పరిహారంగా 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.262 కోట్లు) చెల్లించేందుకు సియాటెల్ నగరం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సెటిల్మెంట్ ద్వారా ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి, నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతుండగా, 2023 జనవరి 23న ఈ విషాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆమెను పోలీస్ అధికారి కెవిన్ డవే అతివేగంతో (గంటకు 119 కి.మీ.) నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించగా, ఆ సమయంలో ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఈ కేసులో పోలీసు అధికారి వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. జాహ్నవి మృతిని అవహేళన చేస్తూ, ఆమె ప్రాణానికి విలువ లేదన్నట్లుగా సదరు అధికారి బాడీ కెమెరాలో రికార్డైన వ్యాఖ్యలు భారత్‌తో పాటు అమెరికాలోనూ తీవ్ర నిరసనలకు దారితీశాయి. విమర్శల నేపథ్యంలో ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు. ఈ తాజా పరిహార ఒప్పందం ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం కోర్టు ఆమోదంతో ఖరారైంది.






