Telugu Special Stories

జానపద జగన్మోహనుడు.. బి.విఠలాచార్య..

బి. విట్టలాచార్య (28 జనవరి 1920 – 28 మే 1999)

చందమామ కథలకి వెండితెర రూపం అనదగిన జానపద చిత్రాలను సృష్టించిన జానపద బ్రహ్మ బి.విఠలాచార్య గారూ. కళాత్మక దృష్టి, సామజిక దృక్పథం, ప్రేక్షకులకు ఎదో ఒక సందేశం అందించడం ఇలాంటివి వేటిని కూడా, రేఖా మాత్రంగా గానీ స్పృశించడానికి ఇష్టపడని దర్శకులు బి.విఠలాచార్య గారూ. మంత్ర నగరాల మాయల చిత్రాలకి, తర్క వితర్కాలతో పని లేని ఊహలోక పాత్రలకి చిరునామా  బి. విఠలాచార్య గారూ. సినిమా వినోదం కోసమేనని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా జనరంజకాలయ్యాయి. బి.విఠలాచార్య సినిమాల్లో కథనాయకులు కొండలనైనా పిండి చేస్తారు. నువ్వులు పిండి నూనె తీస్తారు. సప్తసముద్రాలను సైతం అవలీలగా దాటేస్తారు. బ్రహ్మరాక్షసుల యొక్క భరతం పడతారు. రామ చిలకలో దాగివున్న మాంత్రికుడి ప్రాణాలు తీస్తారు.

బి. విఠలాచార్య గారూ నిరంతర శ్రామికులు. నిత్యశోధకులు. తెలుగు చిత్ర సీమలో జానపదాలపై తిరుగులేని ఆధిపత్యం చలాయించినవారు. అద్భుతమైన మాయా ఛాయగ్రహణంతో ప్రేక్షకాభిమానులను కొత్త బంగారులోకాల్లో విహరింప చేసిన ఘనాపాటి. ఆయన మంత్ర నగరికి మహారాజు. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు. వెండితెరపై బి. విఠలాచార్య గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర. ఆయన జానపద బ్రహ్మ. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. పెద్దల కోసం పిల్లల సినిమాలు తీయడంలో ఆయన కొట్టిన పిండి. తెర ముందు హీరో ఎన్ని వేషాలేసినా. తెరవెనుక కథనాయకుడు మాత్రం బి.విఠలాచార్య గారే. జానపదాలను జనపదాల్లోకి తీసుకెళ్లిన ఆద్యుడు, చివరివాడు కూడా బి.విఠలాచార్య గారే.

జననం..

బి.విఠలాచార్య గారి మాతృభాష కన్నడం.. 28 జనవరి 1920 తేదీన కర్ణాటక రాష్ట్రములోని ఉడిపి దగ్గరలో గల బెల్లి లో జన్మించారు. వీరి తండ్రి పద్మనాభాచార్య గారూ, తల్లి సీత గారూ. వాళ్లకు జన్మిచించిన సంతానంలో 7వ వారు బి.విఠలాచార్య గారూ. వీరి నాన్న గారూ ఉద్యోగం చేస్తూ, తీరిక సమయంలో ఆయుర్వేదం మందులు కూడా ఇస్తూ ఉండేవారు. చిన్నప్పుడు రాజులు, మాంత్రికులు, కథలంటే చాలా ఆసక్తిగా ఉండేది. రాజుల చరిత్ర పుస్తకాలు, కథల పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవారు. నాటకాలు అన్నా కూడా విపరీతంగా ఆసక్తిగా ఉండేవారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత పాఠశాలలో చదువుకునేటప్పుడు చుట్టుప్రక్కల ఉండే పిల్లలందరిని పోగేసి వీధి నాటకాలు వేస్తుండేవారు.

బాల్యం..

చదువు మీద పెద్దగా ధ్యాస ఉండడం లేదు. ఇది తెలిసి వాళ్ళ నాన్నకు కోపం వచ్చేది. అప్పుడప్పుడూ గట్టిగా బి.విఠలాచార్య గారిని మందలిస్తూ ఉండేవారు. 8వ తరగతి వచ్చేసరికి చదువు తన వల్ల కాదని నిర్ధారణకు వచ్చిన బి.విఠలాచార్య గారి మనసులో ఏదో సాధించాలని బలీయమైన కోరిక మెదులుతూ ఉండేది. ఒకరోజు వాళ్ళ నాన్న గారూ గట్టిగా మందలించేసరికి తట్టుకోలేకపోయిన బి.విఠలాచార్య గారూ, వాళ్ళ నాన్న గారికి గానీ, వాళ్ళ అమ్మ గారికి గానీ, ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా కొన్ని రొట్టెలు ఒక సంచిలో వేసుకుని వాళ్ళ వూరికి 150 మైళ్ళ దూరంలో అరిసికరైలో ఉండే వాళ్ళ అన్నయ్య దగ్గరికి కాలినడకన బయలుదేరారు.

13 సంవత్సరాల వయస్సున్న బి.విఠలాచార్య గారూ 150 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ అన్నయ్య ఊరు చేరడానికి సుమారు వారం రోజులు పట్టింది. అరిసికరై అనే ఊరుకు మూడు మైళ్ళ ముందే మాలెకల్లు తిరుపతి అనే ఒక కొండమీద వెంకటేశ్వర స్వామి కొలువై వున్నాడు. మాలెకల్లు తిరుపతి నుండి, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గల తిరుపతికి భూగర్భ సొరంగ మార్గం ఉంది అని అప్పట్లో ప్రచారంలో ఉండేది. దారిలో ఉన్న మాలెకల్లు తిరుపతిని దర్శించుకుని, అక్కడినుండి అరిసికరైలో ఉన్న వాళ్ళ అన్నయ్య దగ్గరికి చేరుకున్నాడు. వాళ్ళ అన్నయ్యకు ఒక రెస్టారెంట్ లాంటిది ఉంది. అందులో పనిచేసుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గిరే ఉండిపోయారు.

ఇది తెలిసిన వాళ్ళ నాన్న గారూ, ఎక్కడైతేనేమి ఉన్నాడు కదా అనుకున్నారు. ఒకవైపు హోటల్ లో పనిచేస్తూనే, మరోవైపు కత్తిసాము, గారడీ, కుస్తీ పోటీలు లాంటివి నేర్చుకునేవారు. హనుమాన్ వ్యాయమశాలను కూడా ప్రారంభించారు బి.విఠలాచార్య గారూ. నాటకాలపై ఆసక్తి ఉన్న బి.విఠలాచార్య గారూ అక్కడ కూడా నాటకాలు వేస్తూండేవారు. ఒకవైపు హోటల్ లో పనిచేస్తూనే, ఇంకోవైపు సాము, గారడీలు నేర్చుకోవడం, మరోవైపు హనుమాన్ వ్యాయామశాల, నాటకాలు వేయడం. తన 16 సంవత్సరాల వయస్సులోనే ఇవన్నీ చేసేవారు బి.విఠలాచార్య గారూ.

స్వాతంత్ర్య ఉద్యమంలో తనవంతు పాత్ర..

1937-38 ఆ సంవత్సరాలలో మహాత్మాగాంధీ గారి స్వాతంత్య్ర ఉద్యమం మంచి శిఖరాగ్ర స్థాయిలో ఉంది. యువకులు అందరూ కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఊర్రూతలూగేవారు. బి.విఠలాచార్య గారూ అందుకు మినహాయింపు కాదు. మహాత్మాగాంధీ గారి పిలుపునందుకుని బి.విఠలాచార్య గారూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. 1938 నుండి 1943 వరకు సుమారు అయిదు సంవత్సరాలలో మూడు సార్లు జైలుకు వెళ్లారు. తాను 18 సంవత్సరాల వయస్సులో కల్లుగీత నిరోధ సత్యాగ్రహంలో పాల్గొని కొన్ని నెలలు జైలులో ఉండి వచ్చారు. దక్షిణ కెనరా జిల్లాను మైసూరు రాష్ట్రములో విలీనం చేయాలని జరిగే పోరాటంలో పాల్గొని ఇంకోసారి జైలుకెళ్లి వచ్చారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడవ సారి జైలుకెళ్లి వచ్చారు.

సినీ ప్రస్థానం..

కన్నడ చిత్ర పరిశ్రమలో..

1942-43 లో తన మిత్రుడు శంకర్ సింగ్ తో కలిసి ఒక టూరింగు టాకీసును ప్రారంభించారు బి.విఠలాచార్య గారూ. కొద్దిగొప్ప లాభాలు ఆర్జించిన బి.విఠలాచార్య గారూ ఇంకో మూడు టూరింగు టాకీసులు నిర్మించారు. మొత్తం నాలుగు టూరింగు టాకిసులో ఆడించే సినిమాలు చూస్తూ ప్రేక్షకులు ఏవి నచ్చుతున్నాయో ఒక అవగాహనకు వచ్చారు బి.విఠలాచార్య గారూ. నాలుగు సంవత్సరాలు గడిచాక బి.విఠలాచార్య గారూ తన మిత్రుడు శంకర్ సింగ్ తో కలిసి సొంతంగా సినిమాలు నిర్మించాలని మైసూరు వెళ్లారు. మహాత్మా పిక్చర్స్ ను స్థాపించిన బి.విఠలాచార్య గారూ కన్నడ సినిమా “శ్రీనివాస కళ్యాణం”తో మొదలుపెట్టి అయిదు సంవత్సరాలలో 16 సినిమాలు తీశారు. కొన్ని చిత్రాలు మంచి విజయం సాధిస్తే, మరికొన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. మొత్తం మీద 2 లక్షల రూపాయలు నష్టపోయారు. దాంతో బి.విఠలాచార్య గారూ ఆ మహాత్మా పిక్చర్స్ ను మిత్రుడు శంకర్ సింగ్ కు వదిలేసి తాను భాగస్వామ్యం నుండి బయటకు వచ్చేశారు బి.విఠలాచార్య గారూ.

2 లక్షల రూపాయలు నష్టపోయినా కూడా, సినిమాలు ఎలా తీయాలో అనుభవం వచ్చింది. ఈ అనుభవంలో ఒకటి గమనించారు బి.విఠలాచార్య గారూ. భారీ సెట్టింగులు ఉన్న తెలుగు చిత్రాలు కన్నడంలో బాగా ఆడుతున్నాయి. కన్నడంలో తీసిన చిత్రాలు చాలా వరకు పరాజయం పాలయ్యేవి. తెలుగులో తీసిన చిత్రాలు మంచిగా ఆడుతుండేవి. ఇది బి.విఠలాచార్య గారూ బాగా గమనించారు. తనకు జ్యోతిష్యం మీద బాగా నమ్మకం ఉండేది. కన్నడ భాషలో కన్నా కూడా ఇతర భాషలలో చిత్రాలు తీస్తే కలిసివస్తుందని చెప్పిన జ్యోతిష్యుడి మాటలతో తన మనసు మార్చుకుని తెలుగులో చిత్రాలు తీయాలని నిర్ణయించుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో..

1953 లో తనకు 33 సంవత్సరాల వయస్సులో మద్రాసులో అడుగుపెట్టారు. ఒక సంవత్సరం పాటు తెలుగు భాష మీద అభ్యాసం చేసి, తెలుగులో పట్టు సంపాదించాక సినిమాలు తీయడం మొదలుపెట్టారు. జానపద చిత్రాలంటే ఆసక్తి ఎక్కువగా ఉన్న బి.విఠలాచార్య గారూ పాతాళభైరవి, కీలుగుర్రం లాంటి చిత్రాలు మంచి విజయం సాధించడం చూశారు. తాను కూడా వాటిమీదే ఆసక్తి కనబర్చాలని చూశారు. కానీ అక్కినేని, ఎన్టీఆర్, యాస్వీయర్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిస్తే బడ్జెట్ చాలా ఖర్చవుతుంది. కానీ బి.విఠలాచార్య గారూ తక్కువ ఖర్చుతో తెరకెక్కించి ఎక్కువ లాభాలు ఆర్జించడమే తన ధ్యేయం. కనుక ఆలోచనలో పడ్డారు బి.విఠలాచార్య గారూ. కొత్త నటీనటులు కాంతారావు గారూ, షావుకారు జానకి, సి.యస్.ఆర్, టి.యన్.బాలకృష్ణ లాంటి తారాగణంతో “కన్యాదానం” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 1955 సెప్టెంబరు 1 వ తేదీన విడుదలయిన ఈ చిత్రం పరాజయం పాలయ్యింది.

రెండవ సాంఘిక చిత్రంగా “వద్దంటే పెళ్లి” (1957) చిత్రం తీశారు బి.విఠలాచార్య గారూ తెరకెక్కించారు. అమర్ నాథ్, చలం, రాజనాల, శ్రీరంజని , కృష్ణకుమారి, రమణారెడ్డి, సి.ఎస్.ఆర్ లాంటి తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా పరాజయం పాలయ్యింది. దాంతో ఇలా కాదని జానపద చిత్రాలు నిర్మించి విజయం సాధించాలని  మూడవ చిత్రంగా కాంతారావు గారూ కథనాయకుడిగా “జయ విజయ” (1959) చిత్రం తీసి విడుదల చేశారు. ఈ సారి  బి.విఠలాచార్య గారిని విజయం వరించింది. 1960లో “కనకదుర్గ పూజ మహిమ” అనే చిత్రం తీశారు. ఇది కూడా అద్భుతమైన విజయం సాధిచింది. దాంతో జానపద చిత్రాలనే ఎంచుకుని వరుస విజయాలు సాధించారు.

గురువును మించిన శిష్యుడు, బందిపోటు, మంగమ్మ శపథం, అగ్గిపిడుగు, పిడుగు రాముడు, అగ్గి బరాటా, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, అలీబాబా 40 దొంగలు, అగ్గి వీరుడు లాంటి చిత్రాలను తెరకెక్కించారు. 1959 నుండి 1977 వరకు అద్భుతమైన జానపద చిత్రాలను అందించారు. 1978 లో తీసిన “జగన్మోహని” చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. 1992 లో తీసిన “కరుణించిన కనకదుర్గ” బి.విఠలాచార్య గారూ తీసిన చివరి చిత్రం. ప్రేక్షకుల అభిరుచులు మారడం వలన 1978 నుండి 1992 వరకు తీసిన చిత్రాలు చాలా వరకు పరాజయం పాలయ్యాయి. మధ్య మధ్యలో బి.విఠలాచార్య గారూ తీసిన సాంఘిక చిత్రాలు మాత్రం విజయాన్ని ఇవ్వలేకపోయాయి.

బి. విఠలాచార్య , ఎన్టీఆర్ గార్ల కాంబినేషన్..

కాంతారావు గారూ, ఎన్టీఆర్ గారూ వీరిద్దరే బి.విఠలాచార్య గారి చిత్రాలలో కథనాయకులు. ఎన్టీఆర్ గారూ, బి. బి.విఠలాచార్య గారి కలయికలో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వీరి కలయికలో 16 చిత్రాలు వచ్చాయి. బందిపోటు, అగ్గి బరాట, మంగమ్మ శపథం,  అగ్గిపిడుగు, పల్లెటూరు చిన్నోడు, రాజకోట రహస్యం, విజయం మనదే, లక్ష్మీ కటాక్షం, అలీబాబా 40 దొంగలు ఇలా అన్నీ చిత్రాలు అద్భుతమైన విజయాన్ని సాధించి వీరిది తిరుగులేని కాంబినేషన్ గా ముద్ర పడిపోయింది. బి.విఠలాచార్య గారి చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. వీరు తీసినవి ఎక్కువగా జానపద చిత్రాలు. వీటికి లాజిక్ ఏమి ఉండదు. కల్పిత పాత్రలు. మాంత్రికుడు ఉంటాడు. ఒక పాత్ర ఇంకొక పాత్రగా మారిపోతుంది. రాజుగారు, రాణి, మాంత్రికుడు, విలన్ మేనమామ, దెయ్యాలు, జ్వాలాద్వీపలు వీటి చుట్టూనే కథ ఉంటుంది.

బి.విఠలాచార్య గారూ ఒకే సెట్ ని రకరకాలుగా వాడుతుండేవారు. అవే ఆభరణాలు అందరికీ వాడేవారు. దాంతో ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. ఇదే సూత్రం బి.విఠలాచార్య గారిది. వీరి చిత్రాలకు ఛాయాగ్రహకులు ముఖ్యం. రవికాంత్ నాగాయిచ్ గారూ, హెచ్.యస్.వేణు గారూ బి.విఠలాచార్య గారి చిత్రాలకు ఛాయాగ్రహకులుగా ఉండేవారు. పారితోషికం తక్కువగా ఇచ్చినా కూడా చెప్పిన సమయానికి ఇచ్చేవారు. బి.విఠలాచార్య గారి చిత్రాలను కేవలం తెలుగులోనే కాకుండా డబ్బింగ్ చేసి థాయ్ లాండ్, మలేసియా, సింగపూర్, బర్మా, దక్షిణ ఆఫ్రికా లాంటి దేశాలలో విడుదల చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నారు.

బి. విఠలాచార్య గారి చిత్రాలలో పాత్రల తీరుతెన్నులు విచిత్రంగా ఉండేవి. కదలడు వదలడు లో చైనా సుందరి, అగ్గి పిడుగు లో ఫ్రెంచి వైద్యుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఉండేవి. బి.విఠలాచార్య గారూ తనదైన శైలిలో, దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అత్యద్భుతమైన జానపద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తాను నమ్మిన సూత్రాలను, విజయ రహస్యాలను పాటిస్తూ, ఆచరిస్తూ చక్కటి జానపద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు కలకాలం నిలిచిపోయేలా అందించారు. బి.విఠలాచార్య గారికి తన జీవిత కాలంలో ఎలాంటి పురస్కారాలు రాలేదు. ప్రేక్షకులు వారి చిత్రాలకు ఇచ్చిన ఆదరణనే వారికి లభించిన అవార్డులు అనుకోవచ్చు. కాంతారావు గారిని కత్తుల కాంతారావు గా, ఎన్టీఆర్ గారిని ఎన్టీవోడు గా మార్చిన ఘనత కూడా బి.విఠలాచార్య గారిదే.

మరణం..

ఇరవై సంవత్సరాల పాటు జానపదాలలో తిరుగులేని దర్శకులుగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించిన బి.విఠలాచార్య గారూ తన సినీ ప్రస్థానం చివరి దశలో ఆ ఊపును కొనసాగించలేకపోయారు. జగన్మోహని తరువాత ఎంత ప్రయత్నించినా కూడా విజయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 1992 లో కరుణించిన కనకదుర్గ తో తన సినీ ప్రస్థానానికి ముగింపునిచ్చిన బి.విఠలాచార్య గారూ 28 మే 1999 నాడు ఈ లోకం నుండి నిష్క్రమించారు.

Show More
Back to top button