
తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, ప్రతినాయకుడిగా.. ఎన్నో పాత్రలకు జీవం పోశారు.
పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలనిజం చూపించి ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు..
మధ్యతరగతికి చెందిన తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలు ఆయన నటనకు నిదర్శనాలుగా నిలిచాయి.
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ కానీ మన నుంచి అక్కడికివెళ్లిన వారు అరుదుగా ఉంటారు. వారిలో ఈయన ఒకరు!
ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి అలనాటి మేటి నటుల శకం ముగిసిన తర్వాత ఆ చోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు. కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కాగా గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని సొంత నివాసంలో 83 ఏళ్ల వయసులో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన జీవిత, సినీ విశేషాలను స్మరించుకుందాం:
1912 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకిద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు.
దర్శక నిర్మాత అయిన క్రాంతికుమార్.. వెండితెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. అలా 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారు. తొలుత రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ‘ప్రాణం ఖరీదు’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు.
సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి ఇలా తరతరాల నాటి మేటి టాలీవుడ్ ప్రధాన హీరోలతో కలిసి ఆయన పనిచేశారు.
‘ఆహా నా పెళ్ళంట!’, ‘ప్రతిఘటన’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం:186’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ లాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.
కోట శ్రీనివాసరావు జీవితంలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోయిన ప్రతిఘటనలో… ‘నమస్తే తమ్మీ…’ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్యగా అదరగొట్టారాయన. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేసిందీ పాత్ర ఆ డైలాగ్స్ ను పండించేందుకు పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారంటే నమ్ముతారా..?
‘ప్రతిఘటన’ విడుదలైన ఏడాదిలోనే సూపర్ హిట్ సాధించిన మరో చిత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆహా నా పెళ్లంట’. ఇందులో రాజేంద్రప్రసాద్, రజనీ హీరో హీరోయిన్లుగా నటించారు. పిసినారి లక్ష్మీపతిగా కోట నటనను ఒక్కమాటలో వర్ణించలేం. అంత అద్భుతంగా నటించారు. నాటి నుంచి కోట, బ్రహ్మానందం కామెడీ కాంబో ఎన్నో సినిమాల్లో రిపీట్ అయి కడుపుబ్బా నవ్వించాయి.
కోటశ్రీనివాసరావు, బాబు మోహన్ లను సూపర్ హిట్ కాంబినేషన్ అని మనందరికీ తెలుసు. వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడీ హిట్టయింది. దాదాపు 50 సినిమాలకు పైగా వీరిద్దరూ ఒకే కేమియోలో కనిపించి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించారు. మామగారు, ఏవండీ ఆవిడ వచ్చింది.. వంటివి మచ్చుకు నేటికీ యూట్యూబ్ లో విడిగా చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ కామెడీ టైమింగ్ అలాంటిది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బొమ్మరిల్లు సినిమాల్లో తండ్రిగా మెప్పించాడు. ‘గబ్బర్ సింగ్’లో శ్రుతిహాసన్ తండ్రిగా.. ఆ పాత్రకు తగ్గట్టు.. తాగుబోతుగా అలరించి.. ‘మందు బాబులం’ అనే పాటకు గాత్రం ఇచ్చి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
తెలుగులో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు. ఇతర భాషలైనా తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు.
ఆయన సినీ కెరీర్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నంది పురస్కారాలు అందుకోవడం విశేషం.
ప్రతిఘటన (1985),గాయం (1889), తీర్పు (1991), లిటిల్ సోల్జర్స్ (1996), గణేష్ (1998), చిన్న (2000), ప్లైళ్లైనకొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ (2012) చిత్రాలకు నంది ఆవార్డులు వరించాయి.
2012లో చిత్రం వందే జగద్గురుమ్ సినిమాకు సైమా అవార్డు,
2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగానూ పనిచేశారు.










