Telugu Cinema

కాలం మడతల్లో నలిగిపోని చలనచిత్రం.. “మంచి మనసులు”

మంచి మనసులు..   (విడుదల 11 ఏప్రిల్ 1962)

“నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే.. పూవు లేక తావి నిలువలేదులే.. ఏ..ఏ.. లేదులే”.. ఈ పాటలో పూవు లేక తావి నిలువలేదులే.. తావి లేని పూవుకు విలువ ఉండదు. అలాగే చక్కటి కథ లేని సినిమా పరిస్థితి కూడా అంతే. మంచి సినిమా అని చెప్పుకోవడానికి, పదే పదే ఆ అనుభూతులు స్మరించుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి.

ముఖ్యంగా ఆ సినిమా కాలాతీతంగా నిలబడాలి. ఎప్పుడు చూసినా కూడా ఆ సినిమా కొత్తగా అనిపించాలి. ముఖ్యంగా పాటలు మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఉండాలి. కాలం మడతల్లో నలిగిపోకుండా ఒక సినిమా చిరంజీవిగా నిలబడింది అంటే కచ్చితంగా అది మనసున్న కథతో మనసుల్ని హత్తుకునేలా మనస్ఫూర్తిగా తీసి ఉండాలి. ఇవన్నీ అక్షరాల పుణికిపుచ్చుకొన్న చిత్రం “మంచి మనసులు”..

అక్కినేని గారూ, సావిత్రి గారి కలయికలో చాలా మంచి చిత్రాలు వచ్చాయి. ఆ జాబితాలో ముందు వరుసలో ఉండే చిత్రం “మంచి మనసులు”.. అదుర్తి గారి దర్శకత్వ ప్రతిభ, కె.వీ. మహదేవన్ గారి సంగీత ఝరి ఈ చిత్రానికి ఎనలేని వన్నె తెచ్చాయి. బాబు మూవీస్ పతాకంపై సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు. 11 ఏప్రిల్ 2023 నాటికి ఈ చిత్రం విడుదలయ్యి 61 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్కినేని గారి సినీ ప్రస్థానంలో 98 వ సినిమానే అయినా అద్భుతమైన విజయం నమోదుచేసింది..

తారాగణం..

అక్కినేని నాగేశ్వరరావు…    (వేణు)

సావిత్రి….                     (శాంతి)

షావుకారు జానకి..          (రాధ)

ఎస్వీ రంగారావు..  (ఆనందరావు)

గుమ్మడి…           (రంగయ్య)

రమణారెడ్డి…    (శంకరయ్య)

నాగభూషణం..     (కుమార్‌)

అల్లు రామలింగయ్య  (భీమన్న, సాక్షిగా)

వంగర…       (వైకుంటం)

సూర్యకాంతం..    (సూర్యకాంతమ్మ)

వాసంతి…      (జయ)

పొట్టి ప్రసాద్…     జోగులుగా (కుమార్ పక్కింటివాడు)

చిడతల అప్పారావు..

సూర్యకళ..

చిత్ర కథ సంక్షిప్తంగా…

కథానాయకుడు వేణు (నాగేశ్వరరావు) కళాశాల విద్యార్థి. తన అన్న గారు (గుమ్మడి) వడ్రంగి. అతడు కష్టపడుతూ, తమ్ముడిని పట్టణంలో బి.ఏ. చదివిస్తూ ఉంటాడు. హాస్టల్ లో ఉంటే ఖర్చు బాగా అవుతుందని భావించిన వేణు, అన్న గారి భారం తగ్గించాలని పబ్లిక్ ప్రాసిక్యుటర్ ఆనందరావు గారి (ఎస్.వి.రంగారావు) ఇంట్లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావు భార్య కాంతానికి (సూర్యకాంతం) నోటిదురుసు ఎక్కువ. కాని చాలా మంచి మనిషి. వారి కూతురు శాంతి (సావిత్రి) లా చదువుతూ  ఉంటుంది. పెళ్లీడు వచ్చిన కూతురు ఉందని పెళ్ళి కాని వారికి ఇల్లు అద్దెకివ్వనంటుంది కాంతం. ఆనందరావు మంచి విద్యార్థికి సాయం చేయాలనే సదుద్దేశంతో వేణుతో పెళ్ళి అయిందని అబద్ధం ఆడమంటాడు. శాంతి అతడికి పెళ్ళికాలేదని తెలిసి ఆట పట్టిస్తుంది.

వేణు, శాంతి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. వేణు యొక్క మంచి నడవడిక కాంతాన్ని కూడా కట్టి పడేస్తుంది. వేణు అన్నయ్య మరణిస్తాడు. వేణు అన్న గారి కుమార్తె జయ (వాసంతి ) కుమార్ (నాగభూషణం) అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడు చాలా స్వార్థ పరుడు. అతని తల్లి దండ్రులు వేణుతో తమ గుడ్డి కుమార్తె (షావుకారు జానకి) ని వేణు వివాహమాడాలని నిబంధన ఉంచుతారు కుమార్ తల్లి దండ్రులు. తప్పని పరిస్థితులలో వేణు ఆ నిబంధనకు తల ఒగ్గుతాడు. అతని నిర్ణయాన్ని ఆనందరావు, శాంతి సమర్ధిస్తారు. కాని కాంతమ్మ తమ కుటుంబానికి అది అవమానంగా భావిస్తుంది. శాంతిని మర్చిపోలేక వేణు భార్యకు దగ్గరకు కాలేక పోతాడు. కాని శాంతి ప్రోద్బలంతో భార్యాభర్తల మధ్య అనురాగం ఏర్పడుతుంది. కుమార్ కు వివాహానికి ముందే ఒకామెతో పరిచయమవుతుంది. ఆమె కుమార్ కు ధన సహాయం కూడా చేస్తూ ఉంటుంది. కుమార్ వివాహ విషయం తెలిసి అతడిని నిలదీస్తుంది. ఆమెను హంపీ విజయనగరానికి తీసుకు వెళ్తాడు.

యాదృచ్ఛికంగా వేణు, గర్భవతి అయిన భార్యను తీసుకొని హంపీ, విజయనగరానికి వస్తాడు. కుమార్ ని నిలదీస్తున్న తన ప్రేయసిని కుమార్ హత్య చేసి పోతూ పోతూ చెల్లెలి కాలి తొక్కి పారిపోతాడు. కుమార్ తలపెట్టిన ఆ అఘాయిత్యాన్ని చూసిన వేణు, అన్న కూతురు పసుపు కుంకుమ నిలబెట్టడానికి ఆ హత్యను తనమీద వేసుకుంటాడు. ఈ కేసును డిఫెన్స్ లాయర్ శాంతి వేణు తరఫున వాదిస్తుంది. కుమార్ చెల్లెలు కుమార్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. కుమార్ హత్యకు వాడిన ఆయుధం, రక్తపు దుస్తులు కుమార్ భార్య కంటబడతాయి. ఆ సాక్ష్యాలు తీసుకొని కోర్టుకు వస్తుంది. ఒక మంచి మనిషిని కాపాడడానికి ఇంతమంది చేసిన ప్రయత్నం చూసి కుమార్ లో మార్పు వచ్చి తన నేరాన్ని ఒప్పుకుంటాడు.

సాంకేతిక నిపుణులు…

దర్శకత్వం….   ఆదుర్తి సుబ్బారావు

వ్రాసిన వారు…  ఆచార్య ఆత్రేయ (డైలాగ్స్)

స్క్రీన్ ప్లే…    ఆదుర్తి సుబ్బారావు

ఆచార్య ఆత్రేయ

కథ…       K.సరే. గోపాలకృష్ణన్

ఆధారంగా…   కుముదం (1961)

ఉత్పత్తి చేయబడింది.. సి. సుందరం

నటించినవారు.. అక్కినేని నాగేశ్వరరావు

సావిత్రి

సినిమాటోగ్రఫీ…   పి.ఎల్.రాయ్

సవరించబడింది…    టి.కృష్ణ

సంగీతం అందించినవారు… కేవీ మహదేవన్

ఉత్పత్తి సంస్థ…   బాబు ఫిల్మ్స్

పంపిణీ చేయబడింది…   శ్రీ ఫిల్మ్స్

విడుదల తారీఖు…   11 ఏప్రిల్ 1962

నడుస్తున్న సమయం…  163 నిమిషాలు

భాష….     తెలుగు

చిత్రంలో పాత్రల తీరుతెన్నులు…

అక్కినేని గారూ సినిమాల ఎంపికలో గానీ, కథల ఎంపికలో గానీ ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటారు. కేవలం తన పాత్ర మాత్రమే బావుంటే సరిపోదు. తన చుట్టూ ఉండే పాత్రలు కూడా అద్భుతంగా రావాలి. ఇలాంటి శైలినే అక్కినేని గారిని విజయవంతమైన కథనాయకుడిగా నిలబెట్టింది. సావిత్రి గారూ, యస్వీ.రంగారావు గారూ, గుమ్మడి గారూ, నాగభూషణం గారూ, సూర్యకాంతం గారూ వీరంతా నటనలో ఉద్ధండులే. బాధ్యత గల తమ్ముడిగా, ప్రేమికుడిగా అక్కినేని గారూ పలికించిన హావభావాలు ఎప్పటికీ మరువలేము.

ముఖ్యంగా చేయని నేరాన్ని తనపై వేసుకున్న ముద్దాయిగా అక్కినేని గారూ కనబరచిన అభినయం అనిర్వచనీయం. సావిత్రి గారూ శాంతి పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశంలో యస్వీయార్ గారితో పోటీ పడి నటించారు. సంభాషణలు పలుకడంలో, పదాలు విరచడంలోనూ నాగభూషణం గారి శైలి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సూర్యకాంతం తన నటనా స్వభావంకు విరుద్ధంగా తనకు అలవాటైన గయ్యాళి పాత్రలను వదిలేసి ఈ సినిమాకోసం సాత్వికంగా నటించారు.

దర్శకులు అదుర్తి సుబ్బారావు గారూ…

మంచి మనసులు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు  గారూ దర్శకత్వం వహించారు. మానవీయ విలువలకి, కుటుంబ బాంధవ్య సంబంధాలకి విలువలనిచ్చే సాంఘిక చిత్రాలకు అదుర్తి గారూ దర్శకత్వం వహించారు. వీరు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సాంఘిక చిత్రాలు (ఒకటి, రెండు చిత్రాలు మినహా) ఘనవిజయం సాధించాయి. అదుర్తి గారూ మనసున్న చిత్రాలకు మార్గదర్శి, మనసుల్ని కదిలించే కథలకు దిక్సూచి. అదుర్తి గారూ అక్కినేని గారూ కథనాయకులుగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అదుర్తి గారూ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు ఇరవై ఆరు. అందులో అక్కినేని నాగేశ్వరావు గారు గారూ కథనాయకుడుగా పదిహేడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కుటుంబ గాథ చిత్రాలకు నిలువెత్తు సంతకం. నవలా చిత్రాలకు రూపకల్పనకు పునాదివేసిన దర్శక చక్రవర్తి. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, వెలుగు నీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, డాక్టరు చక్రవర్తి, పూలరంగడు లాంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కేవలం దర్శకత్వమే కాకుండా సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్, ఎడిటర్ మరియు సినీ నిర్మాత గా అనేక బాధ్యతలు నిర్వర్తించేవారు. అదుర్తి గారూ తన చిత్రాల ద్వారా ఏడు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందారు.

అదుర్తి సుబ్బారావు గారికి తెలుగులో ఎంత పేరుందో, తమిళంలో కూడా అంతే పేరుంది. మోడరన్ థియేటర్స్ పతాకంపై అదుర్తి గారూ తమిళంలో తీసిన “కుముదం” అద్భుతమైన విజయం సాధించింది. నిజ జీవితంలో భార్య భర్తలైన విజయకుమారి, యస్.యస్. రాజేంద్రన్ ఇందులో కథానాయిక, కథానాయకులు గా నటించారు. మరో కథానాయికగా “షావుకారు జానకి” నటించారు. ఈ చిత్ర కథతో తెలుగులో కూడా సినిమా చేయాలని అదుర్తి గారూ మంచి కసితో ఉన్నారు. ఆ చిత్ర కథ తనను పదే పదే వెంటాడింది.

సంగీతం…

మంచి మనసులు (1962) చిత్రానికి కె.వి.మహదేవన్ గారూ సంగీతం సమాకూర్చారు. ఈ చిత్రం తమిళ వర్షన్ “కుముదం”లో కూడా సంగీతం దర్శకులు కె.వి.మహదేవన్ గారే. తెలుగులో కూడా వీరికే సంగీతం సారథ్య బాధ్యతలు అప్పగించేశారు. తమిళంలో ఉపయోగించిన బాణీలనే తెలుగులో ఊయోగించారు. వీరు స్వరపరచిన స్వరాలతో వచ్చిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఆరుద్ర గారూ ( ఏవండోయ్ శ్రీవారు ), దాశరథి గారూ ( నన్ను వదిలి నీవు పోలేవులే ), కొసరాజు ( మావా మావా మావా,  ఎంత టక్కరి వాడు ), ఆత్రేయ ( ఓహో ఓహో పావురమా, శిలలపై శిల్పాలు చెక్కినారు ), శ్రీశ్రీ ( త్యాగం ఇదియేనా ) లాంటి పాటలు వ్రాయగా  కె.వి.మహదేవన్ గారు అందించిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుండే కె.వి.మహదేవన్ గారిని “మామా” అని పిలువడం మొదలుపెట్టారు. 

1…  “ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట”         …

2…          “నన్ను వదిలి నీవు పోలేవులేఅది నిజములే”..

3…          “మావా మావా మావా”..

4…          “ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా”…

5…          “శిలలపై శిల్పాలు చెక్కినారు” …

6…          “త్యాగం ఇదియేనా”…

7…  “ఎంత టక్కరి వాడు”… లాంటి పాటలైతే ఒక ఊపు ఊపేశాయి. ఈ పాటల వల్లే సినిమా చాలా బాగా విజయవంతమైందని అన్న ప్రేక్షకులు కూడా ఉన్నారు. కె.వి.మహదేవన్ స్వరపరిచిన ఈ బాణీలు చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందాయి.

చిత్ర నిర్మాణం..

అదుర్తి సుబ్బారావు గారూ తమిళ నిర్మాతలు సి. సుందరం, సి. చక్రవర్తి అయ్యాంగార్ లతో బాబూ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి తమిళంలో విజయవంతమైన “కుముదం” ని తెలుగులో “మంచి మనసులు” పేరుతో చిత్రికరణ మొదలుపెట్టారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ పెద్ద దిక్కుగా నిలిచినారు. అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి, యస్వీ రంగారావు, షావుకారు జానకి, నాగభూషణం, సూర్యకాంతం, వసంత, గుమ్మడి లాంటి అతిరథ, మహారథులు నటించారు. చిత్రికరణలో ఎక్కువ భాగం విజయనగరం, హంపీ, మద్రాసు పరిసర ప్రాంతాలలో చిత్రికరించారు. 1962 వ సంవత్సరంలో నిర్మాణ వ్యయం సుమారు “ఐదు లక్షల రూపాయలు” ఖర్చు అయ్యింది.

విడుదల…

అదుర్తి సుబ్బారావు గారూ తెరకెక్కించిన ఈ “మంచి మనసులు” చిత్రం 11 ఏప్రిల్ 1962 లో విడుదలయ్యింది. అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం 23 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కొన్ని కేంద్రాలలో రజతోత్సవం కూడా జరుపుకుంది. ప్రేమ, అనురాగం, వైరాగ్యం, పెళ్లి ఇత్యాది భావోద్వేగాల చుట్టూ కథానాయకులు అక్కినేని గారి పాత్ర తిరుగుతుంది. సన్నివేశాలలో సంఘర్షణ కనబరచడంలో ఆయన తనదైన శైలిని చూపించారు. సావిత్రి గారి నటన గురించి చెప్పాల్సిన పని లేదు. గుండెల్లో సముద్రాన్ని దాచుకుని పైకి నిండు గోదావరిలా కనిపిస్తూ ఇప్పటికీ మనల్ని వెంటాడుతూ వున్నట్లే అనిపిస్తుంది. నాగభూషణం గారి సినీ ప్రస్థానానికి ఈ చిత్రం ఎంతో దోహదం చేసింది. అంధురాలి పాత్రలో షావుకారు జానకి గారూ అదరగొట్టారు. అదుర్తి సుబ్బారావు గారి అద్భుతమైన చిత్రాలలో “మంచి మనసులు” చిత్రం కూడా ఒకటి.

Show More
Back to top button