
పిల్లల్లో ఇటీవల కాలంలో పెరుగుతున్న నేరప్రవృత్తి, హింసాత్మక చర్యలు సమాజానికి ఒక పెద్ద సవాలుగా పరిణమించాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పిల్లలు పాల్పడుతున్న అకృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు ఈ వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిల్లలు తాము చేసే పనుల పట్ల అవగాహన లేకపోవడం, క్రమశిక్షణ లోపం, మత్తు పదార్థాల వినియోగం, లేదా సోషల్ మీడియా ప్రభావం వంటి పలు కారణాల వల్ల చెడు మార్గంలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా, మంచి చెప్పడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడటం లేదా మత్తులో క్లాస్ రూమ్‌లోకి రావడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడపిల్లలపై లైంగిక దాడులు, ఉపాధ్యాయులు మందలించారనే నెపంతో ఆత్మహత్యా ప్రయత్నాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పిల్లలు పాల్పడుతున్నారు. కొంతమందిలో ఈ విధమైన చెడు ప్రవర్తన శృతిమించిపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
స్మార్ట్‌ఫోన్, నిర్లక్ష్యం
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి స్మార్ట్‌ఫోన్ల ప్రభావం, తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయుల వైపు నుంచి కొంత అలసత్వం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కలిసి నేటి పిల్లలు చెడు పంథాలో వెళ్లడానికి, ఆకతాయి పనులు నిత్యకృత్యంగా చేసుకోవడానికి దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ధోరణి మరీ మితిమీరిపోవడం గమనించదగిన విషయం. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు అపరిమితంగా స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల అందులోని అసాంఘిక కంటెంట్‌కు పిల్లలు త్వరగా ప్రభావితమవుతున్నారు. అలాగే, ఉపాధ్యాయులు సైతం తమ గురుతర బాధ్యతను విస్మరించి పిల్లలను కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం చేయడంలో లోపాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన తరుణంలో, పరస్పర నిందారోపణలకు తావు లేకుండా పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. పిల్లలను సరైన మార్గంలో పెట్టడానికి సమిష్టి ప్రయత్నం అవసరం.
ఉపాధ్యాయులపై దాడులు
పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని దండించడం అనేది ఉపాధ్యాయుల విధి, బాధ్యతగా చాలామంది భావిస్తారు. అయితే, విచక్షణ కోల్పోయిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు చేసిన తప్పును అంగీకరించి, వారికి నచ్చజెప్పాల్సింది పోయి, దండించిన ఉపాధ్యాయుల మీదికే దాడికి వెళ్లడం ప్రస్తుతం సమాజంలో ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి వైఖరి ఎంతవరకు భావ్యమో, సమంజసమో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. తమ పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పును సరిదిద్దేందుకు ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వాల్సిన తల్లిదండ్రులు, వారిపై ఎదురుదాడికి పాల్పడటం వల్ల పాఠశాలల్లో క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతింటుంది. పిల్లలు కూడా తాము తప్పు చేసినా తమకు అండగా తల్లిదండ్రులు ఉంటారనే ధైర్యంతో మరింతగా చెడు పనులకు పాల్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రుల వివేకానికే వదిలేయాలి, కానీ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం తల్లిదండ్రులు తమ బాధ్యతను గుర్తించాలి.
కక్ష సాధింపులు
మరోవైపు, ఉపాధ్యాయులు సైతం తమ గురుతర బాధ్యతను మరచి కొంతమంది పిల్లలపై చిన్న చిన్న విషయాలకే పదే పదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కూడా కొన్నిచోట్ల చూస్తున్నాం. దీని మూలంగా ఆ పిల్లల హృదయాలు తీవ్రంగా గాయపడి, వారిలో ఉపాధ్యాయుల పట్ల, వ్యవస్థ పట్ల వ్యతిరేక భావం పెరుగుతుంది. ఈ విధంగా తమ మనసు గాయపడిన పిల్లలు తమ కోపాన్ని, ఆవేదనను అదుపు చేసుకోలేక క్రమంగా నేరస్థులుగా మారే ప్రమాదం పొంచి ఉంది అనే మాటలో ఎంతో కొంత వాస్తవం ఉంది. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా, మానసిక మద్దతుని ఇచ్చేవారుగా ఉండాలి తప్ప.. వారిని భయభ్రాంతులకు గురిచేయకూడదు. కేవలం పాఠ్యాంశాలు చెప్పడమే కాకుండా.. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తేనే పిల్లలు సరైన దిశలో పయనిస్తారు. కక్ష సాధింపులు వారిని చెడు మార్గానికి ప్రేరేపించే అవకాశం ఉంది.
తక్షణ అవసరం
పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ, పర్యవేక్షిస్తూ ఉండాలి. పిల్లల వ్యవహారశైలిలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే.. ముఖ్యంగా హింసాత్మకత, ఏకాంతం లేదా తరచుగా అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వారిని అనుభవజ్ఞులైన సైకాలజిస్టుల దగ్గరకు తీసుకువెళ్లాలి. వారి చెడు ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు తీవ్రమైన కృషి చేయాలి. తమ పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువంటి వెబ్‌సైట్‌లను సందర్శిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవాలి. వారిపై నిఘా ఉంచడం కాకుండా, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకోవాలి. పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండటం, వారిని పట్టించుకోకపోవడం వారిలో చెడు ఆలోచనలను పెంచుతుంది. కాబట్టి, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
కఠిన చట్టాల అమలు
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగకుండా నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కఠినమైన చట్టాలను అమలులోకి తేవాల్సిన గురుతర బాధ్యత వారి భుజస్కంధాలపై ఉంది. మేధావి వర్గాల సూచనల మేరకు, పిల్లలకు మద్యం, సిగరెట్లు, బీడీలు వంటి మత్తుపదార్థాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. బాగా అభివృద్ధి చెందిన చైనా, ఆస్ట్రేలియా దేశాల మాదిరిగా, మైనర్లకు అశ్లీల సైట్‌లు, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లు వంటివి అందుబాటులో లేకుండా చాలా కఠినమైన నిబంధనలను రూపొందించాలి. నేటి కాలంలో సాంకేతికత అందుబాటులోకి రావడం మంచిదే అయినప్పటికీ, అది పిల్లల మానసిక స్థితిని, ప్రవర్తనను పాడుచేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి నిబంధనలు అమలు చేయడం ద్వారా పిల్లలు చెడు మార్గానికి వెళ్లకుండా, వారి దృష్టి చదువు, ఆరోగ్యకరమైన కార్యకలాపాల వైపు మళ్లేలా చేయవచ్చు. చట్టాలను అమలు చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదు.
మానవతా విలువలు పెంపొందించడం ముఖ్యం
పిల్లల్లో రోజురోజుకు అడుగంటిపోతున్న మానవతా విలువలను తిరిగి వారిలో పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. తమ పిల్లలకు ఏమైనా చెడు స్నేహాలు, వ్యసనాలు ఉంటే వాటిని సత్వరమే వదిలించుకునేలా వారి మనస్సులను ప్రక్షాళన చేయాల్సిన కర్తవ్యం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులపై ఉంది. కేవలం నేరాన్ని నిందించడమే కాకుండా, పిల్లల మనసులో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. వారికి మంచి అలవాట్లు, నైతిక విలువలు, ఇతరులను గౌరవించే తత్వం గురించి నేర్పాలి. ఉపాధ్యాయులు పాఠశాలల్లో నైతిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతల గురించి పిల్లలకు వివరించాలి. చెడు పంథాలో వెళుతున్న పిల్లల నడవడికలో మార్పు తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఒక వైపు పిల్లల తల్లిదండ్రులు.. మరో వైపు ఉపాధ్యాయులు తీవ్ర కృషి చేయాల్సిన తక్షణ అవసరం ఆసన్నమైంది. ఈ సమిష్టి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సమిష్టి బాధ్యత
పిల్లల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగించి, వెలుగులు నింపే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ప్రజానీకం ఓ మానవతావాదులుగా వారికి ఓ ఉజ్వల భవిష్యత్‌ను ప్రసాదించేందుకు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. సమాజం వారి పట్ల సానుభూతితో, అర్థం చేసుకునే విధంగా వ్యవహరించాలి. చెడు మార్గంలో ఉన్న పిల్లలకు శిక్ష మాత్రమే కాకుండా, పునరావాసం, మార్పు చెందే అవకాశాన్ని కల్పించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తే, ఖచ్చితంగా, తప్పక నూటికి నూరు పాళ్లు ఓ మంచి ఫలితం దక్కి తీరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి పిల్లలు ఓ బాధ్యత గల రేపటి భారత పౌరులుగా ఎదగాలి కానీ.. ఓ విధ్వంసకర శక్తులుగా అసలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎదగకూడదు. వారి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడటం మనందరి సామాజిక బాధ్యత.










