
సినిమా నిర్మించడం ఒక ఎత్తైతే, దానిని థియేటర్లలో విడుదలచేసి విజయం సాధించడం మరో ఎత్తు. సినిమా తయారైన తరువాత అది థియేటర్ లలో ప్రదర్శింపబడే మధ్యలో సినిమాకు తెరచాటుగా ఉండి సినిమా నష్టాలలో కానీ, సినిమా ఘనవిజయంలో కానీ పాలు పంచుకునే వారిని పంపిణీదారులు అనవచ్చు. ప్రేక్షకుల వీక్షణకు సినిమాను అందుబాటులో ఉంచే ప్రక్రియను సినిమా పంపిణీగా ఉదాహరించవచ్చు. పంపిణీదారుడు, ఒక పంపిణీ సంస్థ ద్వారా సినిమాను కొనుగోలు చేసి లేదా అద్దెకు తీసుకొని, ఆ తరువాత, ఆ సంస్థ ఆ సినిమాను మార్కెటింగ్ చేయడం మరియు ప్రదర్శించడం వంటి చర్యలు తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్రారంభం నుండే పంపిణీ సంస్థలతో అనుబంధం కలిగి ఉంటాయి. ప్రధాన స్టూడియోలు నిర్మించే చిత్రాలను వారు అనుబంధం కలిగిన పంపిణీ సంస్థలతో వారి ఒప్పందం ప్రకారం పంపిణీచేయబడతాయి. అలా “క్వాలిటీ పిక్చర్స్” అనే ఒక పంపిణీ సంస్థను స్థాపించి, దాని ద్వారా రెండు వందల పైగా సినిమాలను పంపిణీ చేయించిన ఘనతను దక్కించుకున్నారు పూర్ణ మంగరాజు. ఈయనను జి.కే. మంగరాజు లేదా గ్రంథి కామరాజు మంగరాజు అని పిలుస్తారు.
పూర్ణ మంగరాజు అనగానే మనకు గుర్తొచ్చేది పూర్ణ థియేటర్, విశాఖపట్నం. దానిని పూర్ణ మార్కెట్ ప్రాంతం అని కూడా అంటారు. అంతగా ప్రసిద్ధి రావడానికి కారణం మంగరాజు నిర్మించిన పూర్ణ థియేటర్. 1925 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య, జీ.కే. మంగరాజు భాగస్వామ్యంలో శ్రీకృష్ణ టూరింగ్ టాకీసుగా ప్రారంభించి, ఆ తరువాత భాగస్వామ్యం వీడిపోవడంతో సొంతంగా మార్పులు చేసి పూర్ణ థియేటర్ గా మార్చారు మంగరాజు. ఒకవైపు థియేటర్ మూగ సినిమాలు ప్రదర్శిస్తూనే మరోవైపు శబ్ద చిత్రాలను నిర్మించాలనే తపనతో 1932 వ సంవత్సరంలో మాణిక్ పటేల్ సహకారంతో హెచ్.యం.రెడ్డి తో కలిసి భక్తప్రహ్లాద (1932) టాకీ సినిమా నిర్మాణంలో ఒక భాగమయ్యారు. “క్వాలిటీ పిక్చర్స్” పతాకంపై “దశవతారాలు” (1937) అనే ఒక సినిమాను నిర్మించి బాగానే లాభాలు గడించారు. ఆ సినిమా తరువాత నిర్మాణం నుండి వైదొలిగిన మంగరాజు అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు పెట్టుబడి పెడుతూ వచ్చారు. సినిమా నిర్మాణంలో వెనకడుగు వేస్తున్న నటులు చిత్తూరు నాగయ్య లాంటి వారికి ప్రోత్సాహం అందించి, త్యాగయ్య (1946) అనే చిత్రానికి కొంత పెట్టుబడి పెట్టి, ఆ చిత్రనిర్మాణానికి చేదోడువాదోడుగా నిలిచారు పూర్ణ మంగరాజు.
వ్యాపారంలో బాగా పేరుప్రఖ్యాతులు గడించిన పూర్ణ మంగరాజు మొదటినుండి కూడా సేవాదృక్పథం కలవారు. ఆయన ఎన్నో దానధర్మాలు చేశారు. కళల పట్ల, కళాకారుల పట్ల ఎంతో అభిమానం ఉన్న ఆయన సంస్కృతిక కార్యక్రమాలకు అధ్యక్షులుగా వ్యవహరించేవారు. ఆర్య సమాజంలో చేరి, వాటి నియమానుసారం తన పిల్లలకు కట్నాలు ఇవ్వకుండా, కట్నాలు తీసుకోకుండా పెళ్లిళ్లు చేసిన అభ్యుదయవాది పూర్ణ మంగరాజు. శారద చట్టాన్ని అనుసరించి తమ ఆడపిల్లలకు 14 సంవత్సరాలు నిండిన తరువాత పెళ్లిళ్లు చేశారు. తెలుగు సినిమారంగం అభివృద్ధి చెందడానికి, తెలుగు సినిమారంగంలో శబ్ద చిత్రాలు రావడానికి, తెలుగు సినిమా నిర్మాతలకు థియేటర్ యాజమాన్యానికి మధ్య పంపిణీదారుల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎంతగానో కృషిచేశారు మంగరాజు.
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వాస్తవ్యులై ఉండి, విశాఖపట్నం వలస వెళ్లి, విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే వ్యాపారాన్ని నిర్వహిస్తూ సముద్రంలో ప్రయాణించి బాంగ్లాదేశ్, దక్షిణ చైనా లాంటి దేశాలలో బియ్యం వ్యాపారం చేసిన పూర్ణ మంగరాజు, ఇటు చలనచిత్రరంగ ప్రవేశం చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సినిమా రంగం అభివృద్ధికై తనవంతు కృషి జరపడం మాములు విషయం కాదు. తన యవ్వన వయస్సులో సినిమాల పంపిణీతో మొదలైన తెలుగు చలనచిత్ర భాగస్వామ్యం తన జీవన మలిసంధ్య వరకు కొనసాగి తన పేరును సినిమా చరిత్రలో లిఖించబడ్డదన్న సంతోషంతో ఈ లోకం నుండి నిష్క్రమించారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
నేపథ్యం…
పూర్ణ మంగరాజు అలియాస్ గ్రంథి కామరాజు మంగరాజు (జి.కె. మంగరాజు) పూర్వికుల స్వస్థలం పెద్దాపురం. పూర్ణ మంగరాజు నాన్న గ్రంధి కామరాజు వ్యాపార రీత్యా విశాఖపట్నానికి వలస వచ్చారు. గ్రంధి కామరాజు మూడవ కుమారుడు జి.కె.మంగరాజు. నాన్న మీద అభిమానం, గౌరవంతో జీ.కే.మంగరాజును అని పేరు పెట్టుకున్నారు. ఆయన 11 డిసెంబరు 1896 నాడు విశాఖపట్నంలో జన్మించారు. ఇంట్లో వ్యాపార వాతావరణం ఉండడం వలన కాబోలు బాల్యంలో పాఠశాలకు వెళ్లినా కూడా ఆయన పెద్దగా చదువుకోలేదు. కానీ పట్టుదల మరియు స్వయంశక్తితో ఆంగ్లభాషలో పట్టు సాధించారు. చిన్నతనంలోనూ చదువు మానేసిన తాను వ్యాపార రంగంలో బాగా రాణించారు. వాళ్ళ నాన్నకు కలిసొచ్చిన బియ్యం వ్యాపారాన్నే మంగరాజు కూడా కొనసాగించారు. మన దేశంలోనే కాకుండా బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి అక్కడ కూడా బియ్యం వ్యాపారం చేస్తుండేవారు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తరువాత అంటే తన 20 సంవత్సరాల వయస్సులో సముద్రయానం చేసి, సముద్ర మార్గంలో ప్రయాణించి దక్షిణ చైనా, బర్మా లాంటి దేశాలకు వెళ్లి అక్కడి వారికి బియ్యం ఎగుమతి చేసే వ్యాపారం చేసేవారు.
పూర్ణ థియేటర్ (1925) నిర్మాణం…
ఒకవైపు వ్యాపారం చేస్తూనే మరోవైపు ఆయన లలిత కళలను ప్రోత్సాహించేవారు. లలిత కళలపై ఉన్న అభిమానం కొద్దీ ఆయనకు చాలా మంది కళాకారులతో పరిచయాలు ఏర్పడేవి. అలా ఆయనకు ఏర్పడిన పరిచయాలలో 1925 లో కాకినాడ నుంచి వచ్చిన ఒక కుర్రవాడితో మంగరాజుకు మంచి అనుబంధం ఏర్పడింది. అతడే తరువాత రోజులలో గొప్ప దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య. ఆయన మంగరాజుకు పరిచయం అయ్యేనాటికి ఆంధ్రదేశంలో మూగ సినిమాలు నడుస్తున్నాయి.
అప్పట్లో చిత్రప్రదర్శన శాలలు (సినిమా థియేటర్లు) లేకపోవడంతో టెంట్ వేసి మూగ సినిమాలను ప్రదర్శింపజేసేవారు. వాటిని టెంట్ థియేటర్లు అనేవారు. అయితే ఇలా టెంట్ థియేటర్లు కాకుండా శాశ్వత సినిమా థియేటర్లు నిర్మించాలని కృతనిశ్చయంతో ఉన్న చిత్తజల్లు పుల్లయ్య, పూర్ణ మంగరాజు కలిసి, ఇరువురి భాగస్వామ్యంలో శ్రీ కృష్ణ టూరింగ్ టాకీసును ప్రారంభించారు. ఇలా రెండేళ్లు భాగస్వామ్య కొనసాగిన తరువాత 1927 వ సంవత్సరంలో ఆ థియేటర్ ను మంగరాజు కు అప్పగించి, చిత్తజల్లు పుల్లయ్య సినిమా నిర్మాణం కోసం మద్రాసుకు వెళ్లి, అక్కడి నుండి కలకత్తా వెళ్ళిపోయారు. అప్పటినుండి మంగరాజు ఒక్కరే శ్రీకృష్ణ టూరింగ్ టాకీసుని నడుపుతూ 1930 వ సంవత్సరం నాటికి దానిని శాశ్వత థియేటర్ గా చేసి, దాని పేరును పూర్ణ థియేటర్ గా మార్చేశారు. పూర్ణ థియేటర్ ఇప్పటికీ విశాఖపట్నంలో ఉంది.
టాకీ సినిమాకు తెరవెనుక బీజం వేసిన మంగరాజు…
1930 వ సంవత్సరం కృష్ణా టూరింగ్ టాకీసు పూర్ణ థియేటర్ గా మారే సమయానికి ఇంకా మూగ సినిమాలే నడుస్తున్నాయి. ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంటే 1932 నాటికి తెలుగులో శబ్ద చిత్రాలు వచ్చాయి. అయితే అంతకుముందే కలకత్తా నుండి మద్రాసు వరకు కేవలం ఒకే ఒక థియేటర్ లో శ్రవణ పరికరాలు మొదటిసారిగా ఏర్పాటు చేసింది కూడా పూర్ణ థియేటర్ లోనే. భారతదేశంలో అప్పటికింకా శబ్ద చిత్రాలు రాలేదు. మంగరాజు ఒకవైపు పూర్ణ థియేటర్ మొదలుపెట్టినప్పటికీ, ఆయనకు తెలుగులో శబ్ద చిత్రాలు మొదలుపెట్టాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అలా టాకీ సినిమాలు తీయాలానే ఆలోచన వచ్చినప్పుడు వ్యాపారరీత్యా ఎవరెవరినో కలుసే మంగరాజుకు మాలిక్ పటేల్ అనే ఒక వ్యక్తి తారసపడ్డారు. ఆయనతో మాట్లాడిన మంగరాజు తెలుగులో కూడా సినిమాలు తీస్తే బాగుంటుందని మాణిక్ పటేల్ కు చెప్పారు.
మంగరాజు ప్రతిపాదన మాణిక్ పటేల్ కు నచ్చింది. ఆయన హెచ్.ఎం.రెడ్డి కలిసి తెలుగులో భక్తప్రహ్లాద (1932) అనే శబ్ద చిత్ర నిర్మాణానికి కృషి చేశారు. ఈ నిర్మాణానికి తెరవెనక బీజం వేసింది జి.కె.మంగరాజు. ఆ సినిమా నిర్మాణానికి తెరవెనుక బీజం వేయడమే కాకుండా, ఆ సినిమాకు కొంత పెట్టుబడి కూడా పెట్టారు జీ.కే.మంగరాజు. ఆయన ప్రోత్సాహంతోనే మొట్టమొదట శబ్ద చిత్రం “భక్త ప్రహ్లాద” థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా విజయంతో ఆగకుండా పూర్ణ మంగరాజు కలకత్తాకు వెళ్లి వేర్వేరు భాషలలో సినిమాలు తీస్తున్న “ఈస్ట్ ఇండియా కంపెనీ” వారిని కలిసి మద్రాసు వచ్చి సినిమాలు తీయాల్సిందిగా కోరారు. ఆ సినిమాలలో తాను కూడా పెట్టుబడి పెడతానని చెప్పి వారిని ఒప్పించి, తెలుగు సినిమాలు నిర్మించడానికి బాటలు వేశారు పూర్ణ మంగరాజు. మరోవైపు ఈస్టిండియా పిలిమ్స్ ద్వారా సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించబడిన సతీ సావిత్రి (1933), లవకుశ (1934) మోతీలాల్ ఛబ్రియా నిర్మాతగా వస్తున్న సినిమాలను చూసి పూర్ణ మంగరాజుకు కూడా సినిమాలు నిర్మించాలనే ఆలోచన వచ్చింది.
“క్వాలిటీ పిక్చర్స్” స్థాపించి…
సినిమా పరిశ్రమలోని మూడు స్తంభాలలో సినిమా పంపిణీ ఒకటి. మొదటి స్థంభం సినిమా నిర్మాణం అయితే రెండవ స్థంభం సినిమా పంపిణీ మరియు మూడవది సినిమా ప్రదర్శన అంటే సినిమాను ప్రేక్షకులకు చూపించడం. అప్పటికే పూర్ణ మంగరాజుకు సినిమా పంపిణీ సమస్య గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. దానిపై పూర్తి విశ్లేషణ చేశారు. అప్పటికే మద్రాసులో చమ్రియా టాకీసు వారు పంపిణీదారులుగా ఉన్నారు. వాళ్ళు అన్ని ప్రాంతాలకు సినిమా పంపిణీ చేస్తుంటారు. విశాఖపట్నం పట్టణం చుట్టుప్రక్కల ప్రాంతాల సినిమా థియేటర్లకి పంపిణీ ఇవ్వడానికి ఒక పంపిణీ సంస్థ ఉంటే బాగుంటుందని భావించిన మంగరాజు 1937 వ సంవత్సరంలో “క్వాలిటీ పిక్చర్స్” అనే పేరుతో పంపిణీ సంస్థను స్థాపించి, కొంతమంది భాగస్వాములు చేర్చుకొని విశాఖపట్నంలో పంపిణీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అలాగే ఎప్పటినుండో సినిమా నిర్మించాలనే కుతూహలం ఉన్న పూర్ణ మంగరాజు సినిమా నిర్మాణానికి పూణే వెళ్ళి అక్కడ దాదాబాయి ధర్ణే అనే వ్యక్తి సహకారంతో “సరస్వతి టాకీస్” పతాకంపై మంగరాజు స్వీయ నిర్మాణంలో “దశావతారాలు” (1937) అనే చిత్రాన్ని నిర్మించారు. ఎం.వి. రమణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పారుపల్లి సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, తీగెల వెంకటేశ్వర్లు, ఎం. సుబ్బారావు, రాధాకృష్ణమూర్తి తదితరులు నటించగా, వి.జె. గోపాల్ సింగ్ సంగీతం అందించారు. 11 ఏప్రిల్ 1937 నాడు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా చక్కటి లాభాలు తెచ్చిపెట్టింది. అయినా కూడా ఎందువలనో ఆ తరువాత రోజులలో మంగరాజు సినిమా నిర్మాణంలో కొనసాగలేదు. కానీ సినిమా నిర్మాణానికి పెట్టుబడులను కొనసాగిస్తూ వచ్చారు.
“త్యాగయ్య” (1946) సినిమా నిర్మాణానికి బీజం వేసి…
క్వాలిటీ పిక్చర్స్ స్థాపించిన తరువాత రెండు సంవత్సరాలకు ముందు చూపుతో దానిని విజయవాడలో కూడా దాని అనుబంధ కార్యాలయం నెలకొల్పారు. 1940 వ సంవత్సరంలో “క్వాలిటీ పిక్చర్స్” పేరును పూర్ణ పిక్చర్స్ గా మార్చి, దానిని పంపిణీ సంస్థగానే కొనసాగించారు. అలా సినిమా పంపిణీ చేస్తూనే పూర్ణ పిక్చర్స్ దాదాపు 50 సంవత్సరాల పాటు కొనసాగింది. పూర్ణ మంగరాజు జీవించి ఉన్నంత వరకు సుమారు 200 సినిమాలను పూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదల చేశారు. ఆ రోజుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన భరణి పిక్చర్స్, రోహిణి పిక్చర్స్ ప్రతిభ పిక్చర్స్ మొదలగు వారందరికీ వెనకాల బలం, ప్రోత్సాహం ఇచ్చింది పూర్ణ మంగరాజు. పూర్ణ పిక్చర్స్ పంపిణీలో హిందీ సినిమాలను కూడా వారు విడుదల చేస్తూ ఉండేవారు. ప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు త్యాగరాజు జీవిత కథ ఆధారంగా శ్రీ రేణుకా ఫిల్మ్స్ వారు నిర్మించిన సినిమాను చిత్తూరు నాగయ్య రూపొందించారు. ఈ చిత్రం రూపొందించేందుకు తడబడుతున్న చిత్తూరు నాగయ్యను ప్రోత్సహించి “త్యాగయ్య” అనే సినిమాకు బీజం వేయడానికి మూల కారణం పూర్ణ మంగరాజు. అలాగే “త్యాగయ్య” సినిమాకు కొంత పెట్టుబడి పెట్టి సినిమా నిర్మాణం అయ్యేవరకు కూడా ఆయన నాగయ్యకు చేదోడువాదోడుగా ఉన్నారు.
బాల్కనీ మొదటిసారి కట్టింది పూర్ణ థియేటర్ లోనే..
విశాఖపట్నంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని చోట్ల సినిమా ధియేటర్లు ఉండాలనే సంకల్పంతో పార్వతీపురం, విజయనగరం, రంపచోడవరంలలో సినిమా థియేటర్లు కట్టించారు. పూర్ణ థియేటర్ ను అభివృద్ధి చేస్తూ వచ్చిన మంగరాజు 1949లో మొదటిసారి బాల్కనీని కట్టారు. 1930 వ సంవత్సరంలో థియేటర్ కట్టినప్పుడు బాల్కనీ ఉండేది కాదు. బాల్కని కట్టిన తరువాత ప్రముఖ నటిమణి భానుమతి ని విశాఖపట్నం తీసుకువచ్చి, ఆమె నటించిన “లైలా మజ్ను” సినిమాతో బాల్కనీని ప్రారంభం చేయించారు. ఆ తరువాత సినిమాస్కోప్ నెలకొల్పింది కూడా విశాఖపట్నంలోని పూర్ణ థియేటర్లోనే కావడం విశేషం. చాలా సంవత్సరాలు పూర్ణ థియేటర్ ను నడిపిన మంగరాజు ఆ తరువాత దానిని పిల్లలకి ఇచ్చారు. పిల్లలు కూడా ఆ థియేటర్ ను నిరంతర అభివృద్ధిచేస్తూ వచ్చారు. తర్వాత 1980 లో ఒకసారి, 1993 లలో మరొకసారి పూర్ణా థియేటర్ ను పునరుద్ధరించారు. వ్యాపారంలో ఎంతో ఆదర్శప్రాయంగా ఉండే మంగరాజు, తన 35 సంవత్సరాల వయస్సులో అంటే 1925 వ సంవత్సరంలో ఆర్య సమాజంలో చేరడమే కాకుండా, ఆయన ప్రోద్భలంతో కొంతమంది మహమ్మదీయులను కూడా ఆర్యసమాజంలో చేరేటట్టు చేశారు. మంగరాజు తన పిల్లలెవ్వరికీ కట్నాలు ఇవ్వకుండా, తీసుకోకుండా పెళ్లిళ్లు చేశారు.
చివరి కోరిక తీరకుండానే నిష్క్రమించిన మంగరాజు…
పూర్ణ మంగరాజు తన కూతుర్లకు శారదా చట్టాన్ని అనుసరించి 14 సంవత్సరాల వయస్సు దాటిన తరువాతనే పెళ్లిళ్లు చేశారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశం యాత్ర కోసం 1932 నుండి ఒక ప్రత్యేక రైలులో యాత్రికులను ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకెళ్తూ ఉండేవారు. పూర్ణాయాత్ర స్పెషల్ అని ప్రారంభించిన ఆ రైలులో ఉత్తర భారతదేశం వెళ్లి యాత్రస్థలాలు చూసొచ్చిన వారందరూ ఆ యాత్ర స్థలాలను పొగడమే కాకుండా, పూర్ణ మంగరాజు ఆతిథ్యం గురించి పదేపదే గొప్పగా చెప్పుకునేవారు. అలా ఆ యాత్ర దాదాపు పది సంవత్సరాలు కొనసాగింది. పది రైళ్లను ఆ యాత్ర స్థలాలకు వినియోగించారు.
అనారోగ్యం కారణంగా 23 మార్చి 1964 నాడు తన 70 సంవత్సరాల వయస్సులో పూర్ణ మంగరాజు మరణించారు. ఆయన తదనంతరం సినిమా పంపిణీ వ్యవహారాలను ఆయన కుమారులు పూర్ణ కామరాజు కొనసాగించారు. పూర్ణ మంగరాజు బ్రతికున్నంత కాలం దానధర్మాలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలకు అధ్యక్షత వహించడం వంటివి చేసేవారు. ఆయన విశాఖపట్నంలో ఒక కళ్యాణమండపం కట్టాలనుకున్నారు. అలాగే సంపూర్ణ మహాభారతం సినిమా చేయాలని స్క్రిప్టు కూడా తయారుచేసుకున్నారు. ఈ రెండు కోరికలు తీరకుండానే ఈ లోకాన్నుండి నిష్క్రమించారు.









