
“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినా కూడా తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా శ్రీ కృష్ణదేవ రాయలు పలికిన పలుకులు ఇవి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి దక్షిణ హిందూస్థానపు చరిత్రలో స్వర్ణయుగమును ఆవిష్కరించిన ఆయన భారతీయులెల్లరికీ ప్రాతఃస్మరణీయులు. అతని శౌర్యపరాక్రములు జగద్విఖ్యాతములు. యుద్ధరంగము నందు సైన్యమును ముందుండి నడిపించి విజయం దక్కించుకోవడమే కాకుండా, శత్రువుల నుండి మరియు మిత్రుల నుండి ప్రశంసలు అందుకొన్న మహావీరులు శ్రీకృష్ణదేవరాయలు.
యోధునిగానూ, యుద్ధ వ్యూహ రచన విశారదుడిగాను ఆయనకు పేరుంది. అత్యంత నిరుత్సాహ పరిస్థితులలో కూడా విజయాన్ని సాధించడంలో నేర్పరియైన వ్యూహ రచనా చతురుడు. ఆయన పరిపాలన కాలంలో అపజయం అన్నది ఎరుగడు. యుద్ధ రంగంలో రాజు అగ్రభాగాన ఉండి నేతృత్వం వహించవలనని భావించినవారు శ్రీకృష్ణ దేవరాయలు. తాను స్వయంగా నేతృత్వం వహించిన ప్రతీ యుద్ధంలోనూ వైరి సైన్యాలను చీల్చి చెండాడేవారు.
శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు. ఆయన దక్షిణ భారతదేశాన్ని ఏకతాటి మీద పరిపాలించడానికి, రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి, రాజ్యాన్ని విస్తరించడానికి ఎంతో కృషి చేశారు. అయితే నిజానికి రాయలవారి పరిపాలనలో తొలి పదేళ్ల కాలం కేవలం యుద్ధాలతోనే గడిచింది. విజయనగర సామ్రాజ్యానికి పునః వైభవం తీసుకురావాలని ఆయన ఎంతగానో ఆశించారు. అందువలన ఆయన యుద్ధపిపాసిగా మారలేదు. ఒకవైపు యుద్ధాలు చేస్తున్నప్పటికీ తన పరిపాలనలో ప్రజా సంక్షేమానికి పట్టం కట్టారు. ఆయన ఆలోచనలు, సృజనాత్మక జీవితం తన ప్రత్యేకతకు మూలాలుగా నిలిచాయి.
శ్రీకృష్ణదేవరాయలు బాగా చదువుకున్నారు. తెలుగునాట రాజ్యమేలిన రాజులలోకెల్లా అత్యంత ఉత్తముడైన కళాపోషకుడు, కళాబంధు. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై మంచి పట్టు గడించారు. కవులను, కవిత్వాలను ఆదరించారు. కళ, సాహిత్యాలకు విశిష్టమైన స్థానం కల్పించారు. భువన విజయం శ్రీకృష్ణదేవరాయల వారి ఘనవైభవాన్ని, కీర్తిని చాటుతుంది. ఆయన అష్టదిగ్గజాలను (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు) సగౌరవంగా పోషించారు, ఆదరించారు. ఆయన పాండిత్యానికి విలువనిచ్చారు, భాషలకు గౌరవం ఇచ్చారు, వాటి ఉన్నతకి సహకరించారు. ఆయన స్వయంగా నాటకాలు, కావ్యాలు రచించారు. దక్షిణ భారత దేశంలో ఇంతటి సృజనాత్మకత, చరిత్ర నేపథ్యం ఉన్న చక్రవర్తులు శ్రీకృష్ణరాయలు తప్ప మరొకరు లేరు.
నేపథ్యం…
04 ఫిబ్రవరి 1509 నుండి 17 అక్టోబరు 1529 వరకు విజయనగర సామ్రాజ్య పరిపాలన చేసిన శ్రీకృష్ణదేవరాయలు 17 జనవరి 1471 నాడు తుళువ వీర నరసింహా రాయలు, నాగలదేవి దంపతులకు జన్మించారు. వీర నరసింహా రాయలు తండ్రి తుళువ నరసనాయకుడు అప్పటి విజయనగర రాజైన సాళువ నరసింహదేవ రాయలు వద్ద మహాదండ నాయకుడుగా పని చేశారు. తుళువ నరసనాయకుడికి ముగ్గురు భార్యలు. పెనుకొండలో ఉండగానే ఆయన రెండో భార్య నాగలాంబకు. ఆమె గండికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడచు. సాళువ నరసింహారాయులు వద్ద తుళువ నరసనాయకుడు ప్రధాన దండనాయకుడిగా పనిచేస్తూ పెనుగొండలో ఉండేవాడు. నాలుగేళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన తరువాత సాళువ నరసింహారాయులు మరణించాడు.
సాళువ నరసింహారాయులు మరణించడంతో వారి పుత్రులకు తుళువ నరసనాయకుడు అండగా నిలబడి రాజ్యపాలనకు సహకరించారు. కానీ ఆయన మరణం తరువాత తుళువ నరసనాయకుడి పెద్ద కుమారుడు వీర నరసింహారాయులు సాళువ వంశాన్ని కూలదోసి తానే చక్రవర్తిగా ప్రకటించుకుని ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఆయన కూడా మరణించారు. ఆయన మరణించే నాటికి ఆయన కుమారుడైన శ్రీకృష్ణదేవరాయలు బాలుడే. అయినప్పటికీ మహామంత్రి తిమ్మరుసు 1509 సంవత్సరం ఆగస్టులో శ్రీకృష్ణదేవరాయలును విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిశక్తులను చేశారు. అప్పటినుండి 1530 వ సంవత్సరం వరకు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగలదేవి. శ్రీకృష్ణదేవరాయలకు ముగ్గురు భార్యలు.
వ్యవసాయానికి పెద్ద పీట…
శ్రీకృష్ణదేవరాయలు వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమాన్ని కోరి ఏలుబడి నిర్వహించిన చక్రవర్తి. ఆయన పరిపాలనాదక్షులు, దూరదృష్టి కలవారు. ఈనాడు కరువు సీమగా పేర్కొంటున్న రాయలసీమ ప్రాంతంలో, రాయలవారు వందలాది చెరువులను త్రవ్వించారు. రాయలసీమలో ఆయన త్రవ్వించిన చెరువులు ఈనాటికి కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయంటే వ్యవసాయం పట్ల గానీ, ప్రజల సంక్షేమం పట్ల గానీ ఆయనకున్న దూరదృష్టి ఏపాటిదో మనకు అర్థమైపోతుంది. వ్యవసాయం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన ఎన్నో ఆచరణాత్మకమైన పథకాలను అమలు చేశారు.
వర్షాలు కురవక, పంటలు పండని కరువు కాలంలో రైతులకు పన్నుల నుంచి మినహాయింపునిచ్చారు. వ్యవసాయానికి నీటి వసతులను కల్పించారు. చిత్తూరు జిల్లా ప్రాంతంలో నీవా నదిపై ఉన్న పురాతన చెరువు రాయల కాలం నాటిదే అని చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ కూడా దానిని శ్రీకృష్ణదేవరాయల చెరువుగా పిలుస్తున్నారు. అది పూర్తిగా శిథిలమై కేవలం నామమాత్ర కట్టడం మాత్రమే కనిపిస్తోంది. రాష్ట్రంలో రాయల చెరువంత కట్టడం, శ్రీకాళహస్తి రాజగోపురమంత నిర్మాణం లేదనేది తెలుగు నానుడి. అప్పట్లో యాదమరి వరదరాజల స్వామి ఆలయం నిర్మించిన సమయంలోనే, ఆ చెరువు నిర్మాణం చేపట్టినట్లు పెద్దలు చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఇటుకలు, సున్నంతో కట్టిన భారీ కట్టడం మాత్రమే నీవా నది మధ్యలో కనిపిస్తోంది. ఈ కట్టడం రాయలవారి చరిత్రకు సజీవ సాక్ష్యంగా గ్రామస్తులు చెబుతారు.
త్రాగునీటి కోసం చెరువులు నిర్మాణం…
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం లోని రాయల చెరువు, శ్రీకాళహస్తి లోని రాజగోపురాలను ఏక కాలంలో నిర్మించారు. రామచంద్రాపురం మండలం లోని రైతుల సాగునీటి సమస్యలను తొలగించడానికి అక్కడ ఉన్న రెండు కొండల మధ్య సుమారు 1500 ఎకరాలలో పెద్ద చెరువును నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు. 150 అడుగుల వెడల్పు, వంద అడుగుల లోతు విస్తీర్ణంలో ఆ చెరువుకు కట్టను ఏర్పాటు చేశారు. ఆ చెరువు యొక్క నీటి మట్టం తెలుసుకోవడానికి ఆ రోజులలో రాయలవారు ఏడు మిద్దెలను నిర్మించారు. చెరువు పూర్తి స్థాయిలో నిండితే, ఆరు మండలాలకు సాగు నీటికి, త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈనాడు రాజకీయ నాయకులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల వత్తిళ్లకు తలొగ్గిన రెవెన్యూ అధికారులు, రాయల వారు ఆనాడు నిర్మించిన చెరువులో రైతులకు ముంపు పట్టాలిచ్చారు.
ప్రస్తుతం చెరువు విస్తీర్ణం 47 ఎకరాలు మాత్రమే వుంది. క్రమక్రమేణా చెరువులో పూడిక పేరుకుపోతోంది. నీటిని కొలవడానికి ఆనాడు రాయలవారు నిర్మించిన ఏడు మిద్దెలో ప్రస్తుతం రెండు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. చెరువు నుండి నీటి సరఫరా చేసే ప్రధాన తూము పూడిక ముళ్ళ పొదలలో నిండి శిథిలావస్థకు చేరుకుంది. అలాగే చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం లో నిర్మించిన రాయల వారి చెరువులో శతస్తంభ మంటపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. చెరువు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు దీనిని రాయల వారు కట్టించారు. శతస్తంభ మండపం కూడా కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2008 వ సంవత్సరంలో రాయల వారి చెరువుకట్ట క్రింద శతస్తంభ మండపాన్ని నిర్మించారు. అలాగే మండప వద్ద వంటశాల, ఉద్యానవనం, కోనేరును ఏర్పాటు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం చర్యలు తీసుకుంది.
వైష్ణవ భక్తులు, కానీ పరమత సహనశీలురు…
శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాధీశులందరిలోకి చాలా గొప్పవారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞులు, సైనికాధికారి, భుజబల సంపన్నులు, ఆర్థిక వేత్త. ఆయన మత సహనము కలవారు, మంచి వ్యూహ నిపుణులు, పట్టిన పట్టు విడువని వారు. ఆయన కవి పోషకులు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవారు కూడా. గజపతులపై విజయం సాధించినందుకు విజయ ప్రస్థాన ప్రతీకగా 1516 వ సంవత్సరంలో రాయల వారు శ్రీకాళహస్తిలో రాజగోపురాన్ని నిర్మించినట్లు అక్కడి స్థలపురాణాలు చెబుతాయి.
కృష్ణదేవరాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవులు. కానీ పరమతసహనశీలురు. ఆయన అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు 1513 వ సంవత్సరం నుండి 1521 వరకు తిరుమల తిరుపతి కి ఎనిమిది పర్యాయాలు వచ్చారు. రాయల వారు వచ్చిన ప్రతీసారి శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలా సందర్శించిన క్రమంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లే శ్రీకాళహస్తిలో ఏడంతస్తుల గోపురాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు.
విజయనగర సామ్రాజ్య సాంప్రదాయాలను, శిల్పం, సాహిత్యం, సైనిక సంపత్తిని కళ్ళకు కట్టేలా రాజగోపురాలపై శిల్పాలను మలిచారు. నూరు కాళ్ళ మండపం నిర్మాణం అనేది విజయనగర సాహితీ, సంప్రదాయాన్ని మేళవించి నిర్మించిన మరో అద్భుత కట్టడం. వంద స్తంభాలతో అత్యంత అద్భుతంగా దానిని నిర్మించారు. అందులోని ప్రతీ స్తంభం వైవిద్యభరితంగా ఉండడం, వాటిపై మలచిన నర్తకీమణుల విన్యాసాలు, హరిత సోయగాలు, ప్రకృతిని ప్రతిబింబించేలా చెక్కిన తీగలు, విజయనగర రాజుల రాజ ఠీవీ, రాజసం, దేవతామూర్తుల ప్రతిరూపాలు ఇవన్నీ ఈ నూరుకాళ్ళ మండపంలో కనిపించేలా రూపొందించారు. ఆ మండపం చుట్టూ అమర్చిన రాతి కట్టడంపై చెక్కిన వందల సంఖ్యలో ఏనుగులు, అశ్వాలు, విజయనగర సామ్రాజ్య సైనిక సంపత్తిని మరియు గజ బలాన్ని చెప్పకనే చెబుతాయి.
అద్భుత కట్టడం “జల వినాయకుని ఆలయం”…
శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన జల వినాయకుని ఆలయం ప్రత్యేక ఆకర్షణ కలిగినది. ఈ ఆలయం స్వర్ణముఖి నదీ తీరంలో నిర్మించారు. ఈ జల వినాయకుని ఆలయాన్ని స్వర్ణముఖి నదికి వచ్చే వరద నీటి మట్టాన్ని ప్రజలకు తెలుసుకునేందుకు వీలుగా నిర్మించినట్లు చెబుతారు. స్వర్ణముఖి నదికి నిండుగా నీళ్లు వచ్చిన ప్రతీసారి వినాయకుని ఆలయంలోకి నీళ్లు వచ్చి వినాయకుడి పాదాన్ని స్పర్శించేలా ఆలయాన్ని రూపొందించారు. దీని ఆధారంగానే నది యొక్క ఉగ్రరూపం జనం తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికీ స్వర్ణముఖీ నదికి వరద వస్తే జల వినాయకుని ఆలయం లోకి నీళ్లు రావడం విశేషం. వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలన సాగించేందుకు శ్రీకృష్ణదేవరాయలు శ్రమించారు. ప్రజల వెతల్ని విని పరిష్కారాలు చూపాల్సిందిగా తన యంత్రాంగాన్ని ఆదేశించే శ్రీకృష్ణదేవరాయలు, ఆయా ప్రాంతాల ముఖ్య అధికారులుగా ఉన్న అమర నాయకుల్ని ప్రతీ మూడేళ్లకోసారి భిన్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ పరిపాలనలో సారళ్యం సాధించడానికి ప్రయత్నించేవారు. యుద్దాల వల్ల ఆయన కష్ట, నష్టాలను ఎదుర్కొన్నప్పటికినీ, మొత్తం మీద చూసుకుంటే రాయలవారి రాజ్యపాలన ప్రజాసంబంధంగా ఉందన్నది ప్రముఖ చరిత్రకారుల విశ్లేషణ.
భార్య తిరుమల దేవిపై రాయల వారి అలక..
శ్రీకృష్ణదేవరాయలు తన రాచకార్యాలు చూసుకొని భార్యల దగ్గరికి వెళ్లేసరికి పొద్దుపోయేది. అదేవిధంగా ఒకనాడు రాయలవారు తన రాచకార్యాలు చూసుకొని పొద్దుపోయాక ఆలస్యంగా తన భార్య తిరుమల దేవి శయన మందిరానికి వచ్చారు. అప్పటివరకు ఎదురుచూసిన భార్య తిరుమలదేవి నిద్రపోయింది. ఆ నిద్రపోవడంలో తన మంచంపై ఉన్న తలగడ వైపున కాళ్ళు పెట్టుకుని పడుకుంది. మామూలుగా ఎప్పటిలాగే రాయలవారు వచ్చి యథాప్రకారం పడుకున్నారు. ఆ సమయంలో తిరుమలదేవి కదలిక వల్ల, ఆమె పాదం రాయలవారి శిరస్సుకు తగిలింది. ఇంకేముంది అప్పుడు రాయల వారికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంతటివాడిని ఇలా చేస్తుందా అని రాయలవారు ఆ శయన మందిరం విడిచి వెళ్ళిపోయారు.
ఆ తరువాత చాలా రోజులు తిరుమలదేవి శయన మందిరానికి రాయలవారు రాలేదు. ఇది గ్రహించిన తిరుమలదేవి తన బాధను ప్రముఖ కవులు నంది తిమ్మనతో మొరపెట్టుకుంది. ఆ కవి మాత్రం ఏం చేస్తాడు. రాయలవారి సొంత విషయంలో తల దూర్చటమా! అమ్మో ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచించి, చేసేది లేక పారిజాతాపహరణ కావ్యం వ్రాశాడు నంది తిమ్మన. ఆ కావ్యాన్ని సభలో చదివి వినిపించాడు తిమ్మన. సత్యభామ కాలు తన శిరస్సును తాకితే శ్రీకృష్ణుడు అలిగాడా? లేదే? సత్యభామను సముదాయించాడు, బుజ్జగించాడు. అంతే కానీ సత్యభామపై కినుక వహించలేదు. అక్కడ నంది తిమ్మన చెప్పాడు ఈ పద్యం.
“జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్
తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే !!
అప్పుడు రాయల వారికి అర్థమైంది. ఓరి పిడుగా అనుకున్నారు. అప్పటి నుండి అలుక మాని తిరుమలదేవి శయన మందిరానికి వచ్చి యథావిధిగా రాసానందంలో మునిగారు శ్రీకృష్ణదేవరాయలు. రాయలవారికి గుణపాఠం చెప్పడానికే నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యం వ్రాశాడు అంటారు.
“ఆముక్తమాల్యద” కావ్యం…
ప్రజల రాజాధిరాజు, వీర ప్రతాప, రాజపరమేశ, మూరు రాయరగండ వంటి అని ప్రశంసలెన్నో పొందిన శ్రీకృష్ణదేవరాయలు కేవలం రాజరిక సింహాసనానికి పరిమితం కాలేదు. శ్రీకృష్ణదేవరాయలులో విభిన్న పార్శ్వాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం బహుముఖీనమైనది. పాండిత్యంలోనూ ఆయన ప్రతిభ అనన్యం. శ్రీకృష్ణదేవరాయలు అక్షరానికి ఉన్న విలువ తెలిసిన చక్రవర్తి. ఒక జాతి నిర్మాణానికి భాషా, సంస్కృతులు ఏ విధంగా ఉపకరిస్తాయో గ్రహించగలిగే నేర్పున్న చక్రవర్తి. రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనాదక్షునిగా, సృజనశీలిగా ఆయన ప్రభావం అపారం. ఆయన లోక పరిశీలన అద్భుతం. ప్రజా జీవితాన్ని కళ్లారా చూసిన చక్రవర్తి. సామాన్యుల జీవిత విధానాన్ని ఆకలించుకున్న రాజు. ఆయన రచించిన “ఆముక్తమాల్యద” కావ్యంలో ఆయనకున్న సామాజిక అవగాహన అంతా వివరించారు.
కలమపుటెండుగు ల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
డెలపయి కమ్మ, గ్రామ్యతరుణీతతి డించిన వేఁప గంపలం
దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబున్
కళ్ళంలో వాన పడటం వలన వడ్లు తడిశాయి. ఆ వడ్లను ఇంటి ముందు చాప వేసి అందులో ఎండబెట్టారు. ఆ వడ్లను గొడ్లు తినిపోకుండా ఆ ఇంటి కన్య కాపలాగా బయట కూర్చున్నది. అక్కడికి గొడ్లు రావడంలేదు, కానీ ఒక జింక పిల్ల వచ్చి సారె సారెకూ వడ్లు బొక్కిపోతున్నది. “జలరుహనాభగేహ రురుశాబము” దేవాలయపు జింక పిల్ల. ఎద్దులో, గేదెలో అయితే కర్రతో ఒక దెబ్బ వేయవచ్చు. కానీ అది సున్నితమైన జింక పిల్లాయె, పైగా దేవాలయపు జింక పిల్లాయె, ఊరి మీద పడి గింజలు తినే హక్కు దానికున్నదాయె! కర్రతో ఆ జింక పిల్లను కొట్టడానికి చేయి రాదు. సరిగ్గా ఆ సమయానికి చెంగల్వ దండలను వేపగంపలో పెట్టుకొని, అమ్ముకోడానికి పల్లెటూరినుంచి వచ్చిన స్త్రీలు గంపను ఆ అమ్మాయి కాపలా ఉన్న ఇంటి ముందు దించారు. ఆ అమ్మాయి, గంపలోని చెంగల్వ పూదండను తీసుకొని దానితో ఆ జింక పిల్లను అదిలిస్తున్నదట, అదీ ఈ పద్య భావం.
సమకాలీన సామాజిక వ్యవస్థకు ప్రతిబింబం “ఆముక్తమాల్యద”…
శ్రీకృష్ణదేవరాయలు విల్లిపుత్తూరు వర్ణనలో ద్రవిడ స్త్రీల సమాచారాన్ని వివరంగా ఇచ్చారు. ఉద్యానవనంలోని వారు బావులలో పసుపు రాసుకొని స్థానాలు చేయడం, బిందెలలో నీరు నింపుకొని దివ్య ప్రబంధాలు పాడుకోవడం, ద్రవిడ స్త్రీలు ముంగిట్లో ఆరబోసిన కలమపు వడ్లకు కాపలాగా ఉండటం మొదలైన విశేషాలన్నీ “ఆముక్తమాల్యద” కావ్యంలో తెలిపారు. ఆనాటి వంట పదార్థాలను విడమరచి వెల్లడించారు. ఇంటి ముందు కొబ్బరి చెట్లు ఉన్నప్పుడు, కొబ్బరి పూలు రాలి పడుతున్నప్పుడు, సూర్యకిరణాలు కొబ్బరాకుల సందులోంచి ప్రసరిస్తున్నప్పుడు ముగ్గు వేసినట్టు ఉందని వర్ణించడంలో రాయల నిశీత పరిశీలన తెలుస్తుంది. పూరిళ్ళు వాన కాలంలో కంచాలు కడిగే తీరు, కాకులు గూడుకట్టుకోవడానికి గడ్డి పరకలు తీసుకెళ్లడం ఇవన్నీ రాయలకు తెలుసు.
రైతులు పొలాల మడిలో బురద తొక్కుకుంటూ వారి పాదాలను చుట్టుకున్న బురద, దుక్కియందు ధరించిన గండ పెండేరం లాగా ఉన్నదటంలో రైతు శ్రమను కీర్తించడమే. ఆటవిక స్త్రీలు ధరించే ముక్కెరను కూడా చూసి తన కావ్యంలో స్థానం కల్పించారు. విష్ణుచిత్తుని భార్య వంటలలో నేర్పుకలది, ఆతిథ్యం ఎనలేనిది. ఆవిడ వండిన పదార్థాల పేర్లను రాయలు ఒక సీస పద్యంలో తెలిపారు. పారివళంకాయలు, పంబారపు చింతపండు, ఆవునేతితో వండిన కూచిమూతి పిడతలు, పెరుగు వడియాలు, పచ్చి వరుగులు, చాయ పప్పు ఆనాటి పదార్థాలలో కొన్ని. అలాగే దోచుకు తినే అధికారులు ఉంటే రాజుకి సమృద్ధి అనేది ఉండదని వ్రాశారు. రాజు ఉన్నదే ప్రజా సంక్షేమం కోసం అని చాటి చెప్పారు రాయలవారు. తెలుగు నుడులు, పలుకుబడులు వాడారు. ఈ విధంగా “ఆముక్తమాల్యద” సమకాలీన సామాజిక వ్యవస్థకు ప్రతిబింబం.










