
ఆ రోజుల్లో శాస్త్రీయ నృత్యానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. నాటక రంగంలో కానీ, సినిమా రంగంలో గానీ ఎక్కువ భాగం నాట్యంలో ప్రావీణ్యం ఉన్న వాళ్లే ఎక్కువగా ఉండేవారు. అలా చిన్నప్పటి నుండి నాట్యం నేర్చుకుని, వేదికల మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చి, వాటి ద్వారా తరువాత రోజులలో సినిమా రంగంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో లలిత, పద్మిని, రాగిణి అనే అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. వీరినే ట్రావెన్ కోర్ సిస్టర్స్ అంటారు. చలన చిత్రసీమలో వీరు వెండితెరపై చేసిన సందడి మాములుగా లేదు. కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావెన్ కోర్ సంస్థానంలోని తిరువనంతపురంలో తంగప్పన్, సరస్వతి అమ్మాళ్ దంపతులకు ఈ ముగ్గురు సోదరిమనులు జన్మించారు. వీరు నాట్యంలో ప్రావీణ్యులైన గురువు గోపినాథ్ వద్ద నాట్యంలో శిక్షణ పొంది అప్పుడప్పుడు వేదికపై ప్రదర్శనలు కూడా ఇస్తూవచ్చారు. తన గురువు ద్వారా వచ్చిన సినిమా అవకాశాన్ని వినియోగించుకుని ముగ్గురు సినిమారంగ ప్రవేశం చేశారు.
ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలో మొదటి సోదరీమణి లలిత ముందుగా 1938 వ సంవత్సరంలో “అదిథన్ కనవు” అనే తమిళ చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. తన సోదరీమణులకంటే ముందుగా లలిత సినిమా రంగంలో ప్రవేశించి తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించినా 1953 లో వచ్చిన అక్కినేని నాగేశ్వరావు “దేవదాసు” చిత్రంలో చంద్రముఖి పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందారు. ట్రావన్‌కోర్ సిస్టర్స్ లో రెండవ సోదరీమణి పద్మిని తన 14వ యేట తొలిసారి వెండితెరపై “కల్పన” అనే హిందీ చిత్రంలో నర్తకిగా కనిపించి, ఆ తరువాత 30 సంవత్సరాల పాటు వెండితెరపై తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించారు. శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి అగ్రతారలతో కలిసి నటించారు. పద్మిని ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించారు.
రామచంద్రన్ అనే డాక్టరును వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడి నటనకు విరామం ఇచ్చిన పద్మిని ఎక్కువగా కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించారు. 1977లో అమెరికా లోని న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక నృత్య పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాల అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. అలాగే ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలో చివరి సోదరీమణి రాగిణి. అక్కలు లలిత, పద్మినిలతో పాటు ఈమె కూడా నర్తకులుగా, తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో సినీనటిగా రాణించారు. మాధవన్ థంపిని ఇష్టపడి వివాహం చేసుకున్న రాగిణి దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు జన్మించారు. పద్మిని భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళిపోయి, ఈమె కేన్సర్ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. భర్త చెడు అలవాట్లకు బానిసవ్వడంతో మానసికంగా బాధపడుతూ, తరువాత రోజులలో ఈమె రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచెందారు. ఒక్కసారి ట్రావెన్ కోర్ సిస్టర్స్ జీవిత విశేషాలలోకి వెళితే…
మలయా కాటేజ్ భవనం…
ప్రస్తుత ఆధునిక కేరళలోని దక్షిణ భాగం 1729 నుండి 1949 వరకు ట్రావన్‌కోర్ రాజ్యంగా ఉండేది. ఆధునిక కేరళ లోని ఇడుక్కి, కొట్టాయం, అలప్పుళా, పతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం జిల్లాలు, ఎర్నాకులం జిల్లాలోని ప్రధాన భాగాలు, త్రిసూర్ జిల్లాలోని పుతేన్‌చిర గ్రామం, ఆధునిక దక్షిణ తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లా, తెన్‌కాశి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పొరుగున ఉన్న కొచ్చిన్ రాజ్యంలోని ఇరింజలకుడ కూడల్మాణిక్యం దేవాలయానికి చెందిన తాచుడయ కైమల్ ఎన్‌క్లేవ్‌లు ఈ రాజ్యంలో భాగంగా ఉండేవి. ఈ రాజ్యాన్ని ట్రావన్‌కోర్ సంస్థానం అంటారు. ఈ ట్రావన్‌కోర్ రాజకుటుంబం రాజ్యాన్ని పాలించింది. ట్రావన్‌కోర్ రాజ్యం లోని తిరువనంతపురానికి ఆత్మగా పిలువబడే పూజప్పురాలో మలయ కాటేజ్ అనే అత్యద్భుతమైన భవనం ఉండేది. ఆ రోజుల్లో వివిధ రకాల ఆకృతులతో ఉండే పెద్ద పెద్ద గదులతో, విశాలమైన సభా మందిరం, సుందరమైన బాల్కనీతో ఆ రోజులలో దానిని ప్రత్యేకంగా నిర్మించారు. ఒక్కసారైనా ఆ భవంతిని చూస్తే బావుండు అని ప్రజలు అనుకునే వారు. నిర్మాణ విజ్ఞానం అద్భుతం (ఆర్కిటెక్చర్ వండర్) అని ఆరోజుల్లో ప్రజలు ప్రశంసిస్తూ ఉండేవారు. అర్థ ఎకరం పైగా ఉన్న ఆ భూమిలో, మూడు వేల చదరపు అడుగుల పైగా స్థలంలో నిర్మించిన ఆ ఇల్లు ప్రత్యేకత సంతరించుకుంది. పద్మనాభ పిళ్ళై, కాత్యాయని అనే దంపతులు దానిని నిర్మించుకున్నారు. కేవలం కాత్యాయనీ కోసమే ఆ భవంతి నిర్మాణం చేపట్టారు.
నేపథ్యం…
నిజానికి పద్మనాభ పిళ్ళై దంపతులు ఎప్పుడో మలేషియా వెళ్లి రబ్బరు తోటలు కొనుక్కుని స్థిరపడ్డారు. ఆ రోజుల్లోనే వారికి నెలకు పదివేల రూపాయల ఆదాయం వస్తూ ఉండేది. ఇప్పటితో పోల్చి చూస్తే సుమారు కొన్ని కోట్ల రూపాయలతో సమానం. పద్మనాభ పిళ్ళై, కాత్యాయని అనే దంపతులకు ఆరుగురు అబ్బాయిలు సంతానం. అనుకోకుండా కాత్యాయనికి క్యాన్సర్ జబ్బు రావడం వలన, ఆమె తన చివరి రోజులు తిరువనంతపురంలోనే గడుపుతానని తెలిపింది. దాంతో పద్మనాభ పిళ్ళై కట్టిన ఆ భవంతి పేరే మలయా కాటేజ్. మలేషియా నుండి వచ్చిన పద్మనాభ పిళ్ళై, కాత్యాయనీ కుటుంబం తిరువనంతపురంలో ఉన్నారు. కాత్యాయనీకి సంతానంగా ఆడపిల్లలు లేరు. అందువలన తన చెల్లెలు సరస్వతి అమ్మాళ్ మరియు భర్త తంగప్పన్ లను తన మలయా కాటేజ్ కు పిలిపించి తన భవంతి లోనే నివాసం ఉండాల్సిందిగా కోరారు.
సరస్వతి అమ్మాళ్, తంగప్పన్ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కాత్యాయనికి ఆడపిల్లలు లేకపోవడంతో చెల్లెలు సరస్వతి ముగ్గురు కూతుళ్ళతో ఒకరిని పెంచుకుంటానని చెప్పడంతో, సరస్వతి అమ్మాళ్, తంగప్ప దంపతులు తమ నలుగురు పిల్లలను తీసుకువచ్చి మలయా కాటేజ్ లోనే నివసించేవారు. వారి ముగ్గురు కూతుళ్లు ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పిలువబడే లలిత, పద్మిని, రాగిణి. వీరి బాల్యమంతా మలయా కాటేజ్ లోనే గడిచింది. వీరిది కూడా సంపన్న కుటుంబమే. మరోవైపు పెద్దమ్మ కాత్యాయనీ కుటుంబం కూడా వారికి అండగా ఉంది. ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలో పెద్దమ్మాయి పేరు లలిత. ఈమె 08 జనవరి 1931 లో జన్మించారు. రెండవ కుమార్తె పేరు పద్మిని, 14 డిసెంబరు 1932 లో జన్మించారు. వీరిద్దరి తరువాత ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రకుమార్ (నటి శోభన తండ్రి). నాలుగో సంతానం మూడవ కుమార్తె పేరు రాగిణి. ఈమె 27 మార్చి 1937 లో జన్మించారు.
నృత్యం లో శిక్షణ…
పెద్ద కుమార్తె లలిత ఆరవ సంవత్సరంలో అడుగుపెట్టగానే ఆమెను నృత్య శిక్షణలో చేర్పించారు. ఆ తరువాత రెండేళ్లకు పద్మినిని కూడా నృత్యశిక్షణ లో చేర్పించి వారికి శిక్షణ ఇప్పించారు. వారి గురువు గోపీనాథ్. ఆయన ట్రావెన్ కోర్ సంస్థానంలో నాట్యాచార్యులు. ఆయన స్వయంగా మలయా కాటేజ్ కు వచ్చి కథాకళిలో శిక్షణ ఇచ్చేవారు. నాట్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన వారి చదువులు సారిగా సాగలేదు. 1937 ప్రాంతంలో ఒకసారి పూజాపురాకు దసరా సమయంలో త్రివాన్కోర్ మహారాజు వచ్చి వారం రోజులు పాటు బసచేశారు. ఆ సమయంలో చిన్నపిల్లలుగా లలిత, పద్మినిలు రాజావారి సమక్షంలో నాట్యం చేశారు.
రాధ కృష్ణల నాట్యప్రదర్శనలో రాధ పాత్రలో అప్పటికే ఏడు సంవత్సరాల వయసున్న లలిత, కృష్ణుడి పాత్రలో అప్పుడప్పుడే నాట్యం నేర్చుకున్న ఐదేళ్ల పద్మిని నటించి నాట్య ప్రదర్శన చేశారు. కృష్ణుడి పాత్రధారి పెద్దగా నాట్యం వేయాల్సిన అవసరం లేదు, వేషం వేసుకొని అలా నిలబడితే చాలు. నాట్యం చేసేది అంతా రాధ పాత్రధారినే. నాట్యం మొదలవ్వగానే చుట్టూ ఉన్న జనాలు చూసి భయమేసి కృష్ణుడి వేషంలో ఉన్న పద్మిని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళమ్మ సరస్వతి మరియు గురువు గోపినాథ్ ఆమెను సముదాయించి నాట్య ప్రదర్శన చేయించి పరవాలేదు అనిపించారు. ఇది వారి మొట్టమొదటి నృత్య ప్రదర్శన. అక్కలిద్దరూ నాట్య ప్రదర్శన చేసే సమయానికి రాగిణి ఇంకా చిన్న పిల్లనే.
“కన్నిక” సినిమాతో తొలిసారి వెండితెరపై…
లలిత మరియు పద్మినిలతో రాగిణి కూడా నృత్య శిక్షణలో చేరిపోయింది. నాట్యం బాగానే నేర్చుకుంటున్నారు, పిల్లల బాల్యం బాగానే సాగుతుంది అనుకుంటుండగా ఉన్నట్టుండి 1942 వ సంవత్సరంలో భర్త తంగప్పన్ మరణించారు. చేసేది లేక సరస్వతీ అమ్మాళ్ తన నలుగురు పిల్లల్ని తీసుకుని మద్రాసుకు బయలుదేరింది. 1943 వ సంవత్సరంలో సుప్రసిద్ధ నాట్య గురువు వట్లూరి రామయ్య పిళ్ళై వద్ద పిల్లలకు భరతనాట్యంలో శిక్షణను కొనసాగించింది. వట్లూరి రామయ్య పిళ్ళై వద్ద ఆ రోజుల్లో ఇ.వి.సరోజ, పద్మ సుబ్రహ్మణ్యం, వైజయంతీ మాల, రీటా, రాజసులోచన మొదలగు వారు నృత్యం నేర్చుకున్నారు. ట్రావెన్ కోర్ సోదరీమణులైన లలిత, పద్మిని, రాగిణిలు సుమారు నాలుగు సంవత్సరాలు రామయ్య పిళ్ళై వద్ద నాట్యం నేర్చుకున్నారు.
ఒకవైపు నాట్యం నేర్చుకుంటూనే, మరోవైపు వారు మద్రాసు, తమిళనాడు, శ్రీలంకలో రంగస్థలం ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా రంగస్థల ప్రదర్శనలు వారి జీవనశైలిలో ఒక భాగమైపోయాయి. అలా నాట్య ప్రదర్శనలు కొనసాగుతుండగా గురువు రామయ్య పిళ్ళైకి 1947 లో “కన్నిక” అనే తమిళ సినిమాకి నృత్య ప్రదర్శన చేసే అవకాశం వచ్చింది. యం.యస్. సరోజిని, టి.ఇ. వరదన్ మరియు యం.ఆర్. సంతానలక్ష్మి నటించిన ఈ సినిమాలో ఒక సందర్భంలో శివ మోహిని నృత్యం చేయాలి. దానికోసం తన శిష్యురాళ్ళు లలిత, పద్మలను ఎంపిక చేసుకున్నారు రామయ్య పిళ్ళై. అలా వెండితెరపై తొలిసారి లలిత, పద్మనిలు కనిపించిన సినిమా “కన్నిక”. ఇందులో నాలుగు నిమిషాల పాటు వారు నృత్యం చేశారు. ఆ సినిమా 11 నవంబరు 1947 నాడు విడుదలైంది. దీనిని పక్షిరాజా స్టూడియో అధినేత ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మించి, దర్శకత్వం వహించారు. “కన్నిక” సినిమా చిత్రీకరణ అయిపోయాక, తిరిగి గురువు రామయ్య పిళ్ళై వద్ద యధావిధిగా నాట్యంలో శిక్షణ కొనసాగించారు.
రెండు సంవత్సరాలు ఇరవై సినిమాలు…
ఆ రోజుల్లో ఉదయ శంకర్ అనే ఒక భారతీయ నృత్యకారుడు మరియు నృత్య దర్శకుడు, “కల్పన” (1948) అనే హిందీ సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒక భారతీయ శాస్త్రీయ నృత్యకారిణిని ప్రధాన పాత్రలో చూపించిన మొదటి చిత్రం “కల్పన”. దీనిని పూర్తిగా నృత్య ప్రధానం మరియు ఫాంటసీగా చిత్రీకరించారు. ఈ సినిమాలో ఉదయ్ శంకర్ మరియు ఆయన భార్య అమలా శంకర్ ప్రధాన పాత్రలుగా నటించారు. నాట్య ప్రధానంగా ఉన్న ఆ చిత్రంలో నృత్య కళాకారులు కావాలని ప్రకటన ఇచ్చారు ఉదయ శంకర్. ఆ ప్రకటన చూసి బొంబాయిలో ఉండే ఆయన మిత్రుడు, ట్రావెన్ కోర్ సిస్టర్స్ మామయ్య (సరస్వతి అమ్మాళ్ కు అన్నయ్య) తన కోడళ్ళు లలిత, పద్మినిల గురించి ఉదయ్ శంకర్ కు చెప్పాడు.
ఆ మాటలు విని మద్రాసు వెళ్లిన ఉదయ్ శంకర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, వారిని ఎంపిక చేసుకున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని “కల్పన” హిందీ చిత్రం 01 జనవరి 1948 నాడు విడుదలైంది. ఈ సినిమా విడుదల తరువాత వారికి నృత్య కళాకారులుగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతో వారికి 1948 సంవత్సరాలలో “వేదాల ఉలగం” (1948), మోహిని (1948), అధితన్ కనవు (1948), భక్త జన (1948) ఇలాసుమారు ఎనిమిది చిత్రాలలో నృత్యం చేశారు. అలాగే 1949 వ సంవత్సరంలో పది తమిళ చిత్రాలు, భానుమతి “లైలా మజ్ను” (1949) అనే ఒక తెలుగు చిత్రంలో వారు నృత్యం చేశారు. ఈ విధంగా లలిత, పద్మినిలు ఇద్దరు కలిసి తమ సినీ రంగప్రవేశం చేసిన రెండేళ్లలో 20 తమిళ, ఒక తెలుగు, ఒక హిందీ చిత్రంలో నృత్యం చేశారు. అప్పటికి రాగిణి ఇంకా నాట్య శిక్షణలోనే ఉంది.
మాతృభాషా చిత్రం “ప్రసన్న”లో తొలిసారి ముగ్గురు…
1950 వ సంవత్సరంలో చెల్లెలు రాగిణి కూడా వారితో జత కలిసింది. అక్కడినుండి వెండితెరపై ముగ్గురు అక్కచెల్లెళ్ల హవా మొదలైంది. కేవలం నాట్య సంబంధిత పాత్రలే కాకుండా సినిమాలలో ప్రధాన పాత్రలను, వివిధ భాషలలోని వివిధ సినిమాల్లో ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. లలిత, పద్మినిలకు తొలిసారి వెండితెరపై అవకాశం ఇచ్చిన పక్షిరాజు స్టూడియోస్ అధినేత ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు దర్శకత్వం చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రం “ప్రసన్న” ద్వారా మాతృభాష మలయాళం చిత్రసీమలోకి ట్రావెన్ కోర్ సిస్టర్స్ ప్రవేశించారు. అప్పటివరకు లలిత, పద్మినిలు ఎక్కువగా తమిళ చిత్రాలకే పరిమితం అవుతూ వచ్చారు.
తొలిసారి వారు సొంత భాషా మలయాళ చిత్రం “ప్రసన్న” లో లలిత, పద్మినిలతో పాటు చెల్లి రాగిణిని కూడా మాతృభాష మలయాళానికి పరిచయం చేసిన ఘనతను పక్షిరాజు స్టూడియో అధినేత ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు దక్కించుకున్నారు. వీరితోపాటుగా ప్రముఖ తమిళ నటులు టీ.ఎస్.బాలయ్య, గాయని ఎం.ఎల్. వసంత కుమారి, రాధ జయలక్ష్మి, పెరియ నాయకి మొదలగు వారందరినీ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది “ప్రసన్న” చిత్రమే. 17 ఆగస్టు 1950 నాడు విడుదలైన “ప్రసన్న” ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా ముగ్గురు మలయాళానికి పరిచయమైతే, చెల్లెలు రాగిణి మాత్రం పూర్తిగా మలయాళ చిత్రాలకు పరిమితమైంది. పద్మిని తక్కువ మలయాళ చిత్రాలలో నటిస్తే, ఇంకా తక్కువ మలయాళ చిత్రాలలో లలిత నటిస్తూ వచ్చారు. లలిత, పద్మినిలు మాతృభాషా చిత్రాల కన్నా, ఇతర భాషా చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ వచ్చారు.
ముగ్గురు కలిసి నటించిన చిత్రాలు కొన్ని…
లలిత, పద్మిని, రాగిణిలు ముగ్గురు కలిసి తమిళంలో “ఎఝై పాదుం పాదు” (1950) సినిమాలో నటించారు. దీనిని తెలుగులో కె.రామనాధ్ దర్శకత్వంలో బీదలపాట్లు (1950) గా తెలుగులో కూడా అనువాదించారు. పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య, లలిత, పద్మిని ప్రధాన పాత్రల్లో నటించారు. 09 డిసెంబరు 1950 నాడు విడుదలైన తెలుగు చలనచిత్రం చక్కని విజయం సాధించింది. తమిళం మరియు తెలుగు రెండు చిత్రాలలో కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్య.
1950లో తమిళం, మలయాళం, తెలుగు ఇలా మూడు భాషల చిత్రాలలోనూ లలిత, పద్మినిలు నటిస్తూ వచ్చారు. అలాగే లలిత, పద్మిని, రాగిణి ఇలా ముగ్గురు కలిసి నటించిన చిత్రాలలో కొన్ని చెప్పుకోదగ్గవి ఎం.జీ.ఆర్ నటించిన “మంత్రి కుమారి” (1950), “మరుతనద్ ఎలవరసీ” (1950) (ఎం.జి. రామచంద్రన్, వి.ఎన్. జానకి నటించారు), పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన “తిరుగుబాటు” (1950), తెలుగులో నటులు గుమ్మడి మొదటి చిత్రం ఐన “అదృష్టదీపుడు” (తమిళనాడు టాకీస్ బ్యానర్‌పై ఎస్.సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కింది) మొదలైనవి చిత్రాలు ఉన్నాయి.
అదేవిధంగా 1951 లో అక్కినేని నాగేశ్వరావు నేరుగా నటించిన తమిళ చిత్రం ఓర్ ఇరవు (పళనియాండి నీలకంఠన్ దర్శకత్వం), కథానాయిక లలిత కాగా, నృత్య పాత్రలో పద్మిని నటించారు. అలాగే మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజలీ కథలు పుస్తకం ఆధారంగా తీసిన “నవ్వితే నవరత్నాలు” (1951). ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి కృష్ణకుమారి పరిచయం చేయబడ్డారు. ఇందులో లలిత పద్మనీలు కలిసి రాధాకృష్ణ నృత్యం చేశారు. 1952 వ సంవత్సరం నుండి లలిత, పద్మిని, రాగిణి కలిసి నటించిన చిత్రాలు ఉన్నప్పటికీ వారు విడివిడిగా నటించిన సినిమాలు పెరుగుతూ వచ్చాయి.
1962 వరకు ముగ్గురు కలిసి నటించారు…
అరుళ్ సూసై ఆంథోనీ సామి మరియు చిత్తజల్లు శ్రీనివాసరావు సంయుక్త నిర్మాణంలో వచ్చిన “పొన్ని” (1953) అనే తమిళ సినిమా, తెలుగు అనువాదం “ఒక తల్లి పిల్లలు” అదే సంవత్సరం విడుదలైంది. ఇందులో లలిత, పద్మనిలు ప్రధాన పాత్రలుగా నటిస్తే, చెల్లెలు రాగిణితో పాటు అంబికా, సుకుమారిలు కూడా నృత్యపాత్రలో కనిపిస్తారు. డి.యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మలక్కలు (1953) చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకులు. దీనిని తమిళంలో మరుమగల్ (1953) గా తీశారు. ఇందులో పద్మిని, లలిత ప్రధాన పాత్రలలో నటించారు. డి.యోగానంద్ దర్శకత్వంలో కృష్ణ పిక్చర్స్ పతాకంపై 1955 వ సంవత్సరంలో వచ్చిన జానపద చిత్రం విజయగౌరి. ఇందులో ఎన్.టి.రామారావు, పద్మిని ప్రధాన పాత్రలలో నటించారు. లలిత, రాగిణి లు ఇతర పాత్రలలో నటించారు. లలిత, పద్మిని, రాగిణిలు కలిసిన నేరుగా నటించిన తెలుగు చిత్రం ఇది.
ఆర్.ఎం. కృష్ణస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం “తూక్కు తూక్కి” (1955). ఇందులో శివాజీ గణేషన్ కథానాయకులు కాగా, సుందరాంగతన్ భార్య ప్రేమగా లలిత, రాజకుమారి మాధవిగా పద్మిని, మంత్రి కుమార్తె మల్లికగా రాగిణి నటించారు. ఇదే సినిమా తెలుగులో “అంతా ఇంతే” పేరుతో అనువాదం అయ్యింది. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో 1956 లో తెరకెక్కిన చిత్రం “చరణదాసి”. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, అంబికా సుకుమారన్ మొదలగు వారు నటించారు. ఈ సినిమాలో అంబికతో కలిసి రాగిణి నృత్యం చేశారు. ముగ్గురి కలయికలో వచ్చిన చిట్టచివరి చిత్రం విక్రమాధితన్ (1962). ఇందులో ఎం.జీ.ఆర్ కథానాయకులు. ఇందులో యువరాణి రత్నమలైగా పద్మిని, రాకుమారి వైరమలైగా రాగిణి నటించారు. విక్రమాధితన్ (1962) సినిమా తరువాత ముగ్గురి కలయికలో సినిమాలు రాలేదు. ఎవరికి వారే విడివిడిగా నటిస్తూ వచ్చారు. మద్రాసులో “ఎలియాడ్స్ రోడ్” లో ఒకే కాలనీలో పక్కపక్కనే ఇల్లు కట్టుకున్నారు. ప్రముఖ గాయని యం.యల్. వసంత కుమారి కూడా అదే కాలనీలో నివాసం ఉండేవారు.
లలిత…
ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలో మొదటి వ్యక్తి లలిత. ఈమె పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా అక్కినేని దేవదాసు. తెలుగు సినిమా మంచి ఉచ్ఛదశలో ఉన్న 1950 దశకంలో విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. ఇందులో చంద్రముఖి పాత్ర కోసం ఎంతోమందిని వెతికి చివరికి ఆ పాత్రకు లలితను ఎంచుకున్నారు. ఆ పాత్రకు నృత్యం తప్పనిసరి గనుక లలితను ఆ పాత్రలో నటింపజేశారు. దేవదాసు (1953) సినిమాలో అక్కినేని, సావిత్రి పాత్రలు ఎలా చిరస్థాయిలో నిలిచిపోయాయో! చంద్రముఖి పాత్ర కూడా అలాగే చిరస్థాయిగా నిలిచిపోయింది. అక్కినేని, సావిత్రిల మాదిరిగానే లలిత కూడా తాను నటించిన తెలుగు సినిమాలలో బరువైన సుదీర్ఘమైన పాత్ర చంద్రముఖి.
అలాగే హెర్బీ సెనెవిరత్నే, కాంతి గుణతుంగ నాయకా, నాయికలుగా నటించిన సింహళ భాష చిత్రం “సూరసేన” (1957) లో కూడా నటించారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే లలిత 1957 వ సంవత్సరంలో శివశంకరన్ నాయర్ ని వివాహం చేసుకున్నారు. వెండితెర జీవితపు చివరి సంవత్సరాలలో 1962లో పద్మిని కథానాయికగా వచ్చిన “చింతామణి” అనే తమిళ సినిమాలో మరో సోదరి రాగిణితో కలిసి ఒక పాత్రలో లలిత నటించారు. 1962 తరువాత ఆమె సినిమాలు బాగా తగ్గించేశారు. లలిత నటించిన చిట్టచివరి చిత్రం తమిళంలో వచ్చిన “దిల్” (1967). ఈ చిత్రం తరువాత కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యారు. 1982 వ సంవత్సరంలో లలిత తన 52 ఏళ్ళ వయస్సులో క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు.
రాగిణి..
ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలో మూడవ వ్యక్తి అయిన రాగిణి 1950 దశకం మొదట్లో ఇద్దరు అక్కయ్యలు లలిత, పద్మినిలతో కలిసి నటిస్తూ వచ్చారు. ఆమె ఎక్కువగా మలయాళం, హిందీ చిత్రాలలో నటించారు. పెద్ద అక్కయ్య లలితతో పోల్చుకుంటే రాగిణినే ఎక్కువ హిందీ చిత్రాలలో నటించారు. సి.పి. దీక్షిత్ దర్శకత్వంలో 1956 లో ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం “నయా ఆద్మీ”, దీనికి తెలుగు చిత్రం జూపిటర్ పిక్చర్స్ వారి “సంతోషం” (1955) లో రాగిణి ఒక్కరే నృత్యం చేశారు. 1963 లో మహమ్మద్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం “షికారి” (1963) లో కథానాయికగా రాగిణి నటించారు. వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో నందమూరి తారకరామారావు, దేవిక కలయికలో వచ్చిన “ట్యాక్సీ రాముడు” చిత్రంలో కూడా రాగిణి ఒక పాత్రలో కనిపిస్తారు. ఆమె నటిగా కనిపించిన చిట్టచివరి చిత్రం 1976 లో వచ్చిన మలయాళ చిత్రం “ఆలింగనం”.
ఇక కుటుంబ విషయానికి వస్తే 1965 వ సంవత్సరంలో రాగిణి తనకంటే చిన్నవాడైన మాధవన్ తంపిని పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లినాటికి ఆమె వయస్సు 28 సంవత్సరాలు. వివాహం అనంతరం నాలుగు, ఐదు సినిమాలలో మాత్రమే నటించారు. రాగిణి భర్త మాధవన్ తంపి మద్యం, జూదం అలవాటు చేసుకున్నారు. ఆ చెడు వ్యసనాలకు లోనయ్యి భార్య రాగిణిని బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఇష్టపడి, ఆమె కావాలని పెళ్లి చేసుకునే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసయ్యేసరికి ఆమె మానసికంగా బాగా చితికిపోయారు. అప్పటికే ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. అనుకోకుండా ఆమెకు 1971లో క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. తన 39 సంవత్సరాల వయస్సులో 1976 వ సంవత్సరంలో తన ఇద్దరు అక్కల కంటే చిన్నదైన రాగిణి స్వర్గస్తులయ్యారు. ఇద్దరు అక్కచెల్లెళ్లతో కలిపి సినిమాలను నటించిన రాగిణి, మిగతా ఇద్దరి జీవితాలతో పోల్చుకుంటే ఆమె విషాదాంత జీవితాన్ని గడిపారు. రాగిణి మరణించిన తరువాత ఆరు సంవత్సరాలకే 1982 వ సంవత్సరంలో పెద్దక్క లలిత మరణించారు.
పద్మిని…
ట్రావెన్ కోర్ సిస్టర్స్ లో రెండో వ్యక్తి పద్మిని. ఆమెకు వెండితెరపై 1953 నుండి కథానాయికగా అవకాశాలు వచ్చాయి. ఒకవైపు కథానాయికగా నటిస్తూనే, ఆమెకు వీలున్నప్పుడల్లా చెల్లలు రాగిణితో పాటు నటిస్తూ వచ్చారు. అక్క లలిత, చెల్లెలు రాగిణితో పోల్చుకుంటే ఎక్కువ శాతం హిందీ సినిమాలలో నటించే అవకాశం పద్మినికి దక్కించుకుంది. ఈమెకు హిందీలో విజయవంతమైన చిత్రాలు దక్కాయి. ఉదయ శంకర్ దర్శకత్వంలో 1948 వ సంవత్సరంలో కల్పన అనే హిందీ చిత్రంలో ఒక నృత్య పాత్రలో నటించినా కూడా హిందీలో రాగిణి నటనకు తగ్గ హోదాను ఇవ్వలేకపోయింది.
సుబ్రమణ్యం శ్రీనివాసన్ (ఎస్.ఎస్. వాసన్) దర్శకత్వంలో “మిస్టర్ సంపత్” అనే హిందీ చిత్రంలో మోతీలాల్ రాజ్‌వంశ్ కు జంటగా పద్మిని కథానాయికగా నటించారు. “మిస్టర్ సంపత్” అనే ఈ హిందీ చిత్రంలో పద్మిని పూర్తిస్థాయి కథానాయిక పాత్రలో నటించారు. 25 డిసెంబర్ 1952 లో విడుదలైన ఈ చిత్రంలోని రాగిణి నటనకు ప్రశంసలు లభించినప్పటికీ, ఆ చిత్రం వాణిజ్యపరంగా విఫలమైంది.
ఎన్.ఎస్. కృష్ణన్ దర్శకత్వంలో 1952 లో వచ్చిన తమిళ చిత్రం “పనం”. శివాజీ గణేషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా పద్మిని నటించారు. అప్పటి వరకు నాట్య తారగానే నటించిన ఆమె ఈ సినిమాతో అద్భుతమైన నటిగా నిరూపించుకున్నారు. ఒకవైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నాట్య ప్రదర్శనలు కూడా ఇస్తూ వచ్చారు. బొంబాయి సినిమా తారలకు, మద్రాసు సినిమా తారలకు మధ్య చెన్నైలో 1953 లో నిర్వహించిన స్నేహపూర్వక క్రికెట్ పోటీలో, బొంబాయి తరుపున నటి నర్గీస్ ఎక్కువ పరుగులు చేయగా, మద్రాసు నుండి పద్మిని ఎక్కువ పరుగులు చేశారు. దాంతో నర్గీస్, పద్మినిల మధ్య స్నేహం కుదిరింది.
జాతీయ పురస్కారాన్ని అందించిన “ఎధిర్ పరధాతు”…
రాజ్ కపూర్ మరియు నర్గీస్ కలిసి చోరీ చోరీ అనే ఒక హిందీ సినిమా చిత్రీకరణ కోసం మద్రాసు వచ్చినప్పుడు పద్మిని తల్లి సరస్వతి అమ్మాళ్, నటి నర్గీస్ కోసం తమ ఇంటి పక్కనే ఒక ఇల్లును కొద్దిరోజుల నివాసానికి ఇప్పించారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు పద్మిని, రాగిణి, లలిత, నర్గీస్ అందరు కలిసే ఉన్నారు. 1954 లో “స్నేహసీమ” అనే మలయాళ చిత్రంలో సత్యన్ పక్కన కథానాయికగా నటించారు రాగిణి. 30 డిసెంబర్ 1954 నాడు విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమా 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మెరిట్ సర్టిఫికేట్‌ను అందుకుంది.
శివాజీ గణేశన్ కథానాయకుడిగా 1954 లో వచ్చిన “ఎధిర్ పరధాతు” సినిమాలో పద్మిని కథానాయిక. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. దీనినే తెలుగులో “ఇలవేల్పు” పేరుతో వచ్చింది. “ఎధిర్ పరధాతు” సినిమా ఉత్తమ తమిళ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సినిమా తరువాత కూడా పద్మిని, శివాజీ గణేషన్ కలయికలలో మరెన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వివిధ భాషలలో 20 సంవత్సరాలు వెండితెర జీవితాన్ని, అద్భుతమైన నటనతో కొనసాగించిన పద్మిని నట జీవితం శరవేగంగా కొనసాగింది. డి.యోగానంద్ దర్శకత్వంలో యం.జి. రామచంద్రన్, పి.భానుమతి, పద్మిని కలిసి జంటగా నటించిన “మధురై వీరన్” (1956), రష్యన్ మరియు హిందీ భాషలలో కలిపి ఇండో రష్యన్ చిత్రంగా వచ్చింది. 1957 వ సంవత్సరంలో “పరదేశి” అనే చిత్రంలో నటించారు. సునీల్ దత్ హీరోగా వచ్చిన హిందీ చిత్రం “పాయల్” (1957) లోను ఆయన నటించారు.
హీరోతో సమానంగా పారితోషికం…
అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్న పద్మిని 1957 వ సంవత్సరం నాటికి తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో ఊపిరి తీసుకోలేనంత తీరికలేని నటి అయిపోయారు. ఆమె నటించిన సినిమాలకు అన్ని భాషలలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. 1958 వ సంవత్సరంలో ఎన్టీఆర్ తమిళంలో నటించిన పౌరాణిక చిత్రం “సంపూర్ణ రామాయణం”లో సీత పాత్రలో పద్మని నటించి మెప్పించారు. అలా ప్రతీ సంవత్సరం విజయవంతమైన చిత్రాలలో ఆమె నటిస్తూ వచ్చారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు ఇండియన్ ఎయిర్ లైన్స్, లక్స్ సబ్బు లాంటి ప్రకటనలలో కూడా నటిస్తూ వచ్చారు. సినిమాలో కథనాయకుడితో పోటీపడి మరీ నటించే పద్మిని, కథనాయకుడితో సమానంగా పారితోషికం తీసుకునేవారు. అరుళ్ సూసై ఆంథోనీ సామి దర్శకత్వంలో శివాజీ గణేషన్, పద్మినిల కలయికలో 1959 లో వచ్చిన “థంగా పధుమై” సినిమాలో కథానాయకుడు శివాజీ గణేశన్ తో సమానంగా పారితోషికం తీసుకున్నారు. ఆ సినిమాలో శివాజీ గణేషన్ 60 వేల రూపాయల పారితోషికం తీసుకుంటే, పద్మిని కూడా సమానంగా 60 వేల రూపాయల పారితోషికం పుచ్చుకున్నారు.
డాక్టరును పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడి…
రాజ్ కపూర్ తో కలిసి 1960 లో నటించిన హిందీ చిత్రం పద్మినిని మరో మెట్టు ఎక్కించిందని చెప్పాలి. అదే సంవత్సరం ఆమె ఆరు హిందీ చిత్రాల్లో నటించారు. ఒకవైపు హిందీ చిత్రాల్లో నటిస్తూ, మరోవైపు తమిళ చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్న రోజులలో 1961 వ సంవత్సరంలో అమెరికాలో వైద్యులుగా పనిచేస్తున్న డాక్టరు రామచంద్రన్ ను వివాహం చేసుకున్నారు. వారి తల్లి సరస్వతీ అమ్మాల్ ముగ్గురికి సరైన సమయంలోనే పెళ్లిళ్లు చేశారు. వివాహాం అనంతరం అమెరికాలో నివాసం ఉన్నారు. అయినా కూడా 10 సంవత్సరాల పాటు సినిమాల చిత్రీకరణకు భారతదేశం వస్తూ, వెళుతూ ఉండేవారు. 1962 వ సంవత్సరంలో భారతదేశానికి, చైనాకు మధ్య జరిగిన యుద్ధం సమయంలో సైనికుల కోసం పద్మిని నృత్య ప్రదర్శనలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి కోరిక మేరకు ఆమె నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఆమెకు 1963 వ సంవత్సరంలో ఒక కుమారుడు జన్మించారు. నటనను కొనసాగిస్తూనే 1960 వ దశాబ్దంలో కూడా మరికొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించారు. 1968లో అక్కంపెట్టై పరమశివన్ నాగరాజన్ దర్శకత్వంలో శివాజీ గణేషన్, పద్మిని కలయికలో “తిల్లాన మోహనాంబాల్” అనే తమిళ చిత్రం వచ్చింది. 27 జూలై 1968 నాడు విడుదలైన ఈ సినిమా ఐదు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. తమిళ సినిమాలలో కల్ట్ హోదాను పొందింది. అందులో నాదస్వర వాద్యకారుడు షణ్ముగసుందరంగా శివాజీ గణేశన్, భరతనాట్య నృత్యకారిణి మోహనాంబాల్ గా పద్మిని పోటాపోటీగా నటించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఈ సినిమా సుమారు 175 రోజులు ఆడింది. అదేవిధంగా 1970 లో వచ్చిన కల్ట్ సినిమా “మేరా నామ్ జోకర్”. రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన “మేరా నామ్ జోకర్” నాటికి ఆమెకు ఏడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆ సమయంలో అమెరికా నుండి భారతదేశానికి వస్తూ, వెళుతూ ఈ సినిమాను పూర్తిచేశారు.
పద్మిని భర్త మరణం…
1970 వ దశకం నుండి సినిమాలను తగ్గించేసిన పద్మిని 1971 నుండి పూర్తిగా అమెరికాలోని స్థిరపడ్డారు. న్యూజెర్సీలోని హిల్స్‌డేల్ ప్రాంతంలో ఆమె ఆవాసం ఉండేవారు. అమెరికాలో ఆమె1974 వ సంవత్సరంలో భారతీయ నృత్య శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు. అతి కొద్ది రోజుల్లోనే అది శాఖలుగా విస్తరించింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే, దురదృష్టవశాత్తు 1981 లో పద్మిని భర్త అకాలమరణం చెందారు. అప్పటికి ఆమె కుమారుడి వయస్సు 18 సంవత్సరాలు. ఆ తరువాత పాతిక సంవత్సరాలు ఆమె అమెరికాలోనే నివసించారు. అయితే అప్పుడప్పుడు గానీ, మధ్యమధ్యలో గానీ భారతదేశం వచ్చినప్పుడు పద్మిని ఏదో ఒక సినిమాలో గుణచిత్ర నటిగా అవకాశం ఇవ్వడం వలన ఆమె ఎక్కువగా తల్లిపాత్రలే ధరిస్తూ వచ్చారు.భర్త మరణించినా కూడా భర్త వైపు బంధువులతో కూడా పద్మిని బంధుత్వాలు నడుపుతూ వచ్చారు. తన భర్త సోదరుడి కొడుకులో ప్రతిభను గమనించి అతడికి నాట్యం నేర్పించమని సలహా కూడా ఇచ్చింది. ఆ కుర్రాడే ఆ తరువాత రోజులలో ప్రేమదేశం లాంటి తెలుగు సినిమాలలో నటించిన వినీత్.
పద్మినికి స్వర్గప్రాప్తి…
అమెరికాలోనే ఉన్న పద్మినిని చూడడానికి వచ్చిన అక్క లలిత, చెల్లెలు రాగిణి లతో అమెరికాలోనే వృత్తిపరమైన నృత్య ప్రదర్శనలు చేసేవారు. అదేవిధంగా మేనకోడలు మరియు ప్రముఖ నటి శోభన అమెరికా వచ్చినప్పుడు ఆమెతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తన 35 సంవత్సరాల అమెరికా జీవితానికి వీడ్కోలు పలికిన పద్మిని 2006 వ సంవత్సరంలో మద్రాసుకు మకాం మార్చేశారు. ఆమె మద్రాసుకు విచ్చేసిన వారం రోజులకు వినీత్ ఇంట్లో జరిగిన ఒక వేడుకకు హాజరయ్యారు. తన వెండితెర జీవిత ప్రయాణంలో సుమారు 250 పైగా చిత్రాలలో నటించారు. ఎన్నో పురస్కారాలను, మరెన్నో బహుమతులను అందుకున్నారు. 74 ఏళ్ల వయసున్న అనుభవం ఆమెది. ఆవిడ తన వృత్తి జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ ఎంతో నిబద్ధతతో వ్యవహారించారు.
23 సెప్టెంబరు 2006 రాత్రి ముఖ్యమంత్రి కరుణానిధికి సన్మానం చేయడానికి చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మినిని ప్రత్యేకంగా పిలిచిన కరుణానిధి, ఆమె రాగానే గౌరవంగా లేచి నిలబడి ఆమెకు తన పక్కన కుర్చీని కేటాయించారు. ఎందుకంటే పద్మని తొలి రోజులలో నటించిన సినిమాలకు కరుణానిధి సంభాషణలు వ్రాశారు. ఆ సన్మానం కార్యక్రమం జరుగుతుండగానే ఉన్నట్టుండి పద్మిని స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. 24 గంటలు గడిచిన తరువాత 24 సెప్టెంబరు 2006 రాత్రి అత్యద్భుత నృత్య కళాకారిణి, వెండితెర నటీమణి పద్మిని గుండెపోటుతో కన్నుమూశారు.











