
సా.శ. 12వ శతాబ్దం వరకూ (సా.శ. అనగా సామాన్య శకం. ఇది”క్రీస్తు శకం”కు నవీన రూపం) భారతదేశం అంతటా ఒకే రకమైన సాంప్రదాయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేది. కాలక్రమేణా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం పరిపాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వీరు సా.శ. 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు పరిపాలించారు. వీరి కాలంలో ఆయా ప్రాంతాలలోని “సాంప్రదాయ సంగీతం” పర్షియన్ కళలచే విపరీతంగా ప్రభావితమైంది. ఇక 14వ శతాబ్దం వచ్చే సరికి ఈ సాంప్రదాయ సంగీతం “హిందుస్థానీ సంగీతం మరియు కర్ణాటక సంగీతం” అని రెండు భాగాలుగా చీలిపోయాయి.
కర్ణాటక సంగీతాన్ని 18వ శతాబ్దం నుంచీ, 20వ శతాబ్దం వరకూ మైసూర్ మహారాజులు, ట్రావెంకూర్ మహారాజులు ఎక్కువగా ఆదరించి పోషించారు. మేళకర్త రాగాల వర్గీకరణ పద్ధతిని కనుగొన్న “వేంకటమఖి”, దానిని తన సంస్కృత గ్రంథం, “చతుర్దండి ప్రకాశిక”లో పొందుపరిచాడు. “గోవిందాచార్య” ప్రస్తుతం వాడుకలో నున్న సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను తయారు చేశాడు. ట్రావెంకూర్, మైసూర్ రాజులు సంగీతకర్తలు. వీరు వీణ, రుద్రవీణ, వేణువు, వయొలిన్, ఘటం, మృదంగం వంటి వాయిద్యాలలో నిష్ణాతులు. వారి ఆస్థాన సంగీత విద్వాంసులలో వీణా శేషన్న, వీణా సుబ్బన్నలు ముఖ్యలు.
స్వాతంత్ర్యం తరువాత కర్ణాటక సంగీతం…
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కర్ణాటక సంగీతం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గాయనీ, గాయకులు సభల్లో పాడేవారు. శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని వినేవారు. ఆ విధంగా మద్రాసు పట్టణం కర్ణాటక సంగీతానికి కేంద్ర బిందువుగా వెలసింది. నేడు కర్ణాటక సంగీతం సంగీతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ప్రతీ సంవత్సరం డిసెంబరు, జనవరి మధ్యలో కర్ణాటక సంగీత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచీ కళాకారులు విశేషంగా హాజరవుతారు. అలాంటి కర్ణాటక సంగీతంలో మహిళల ప్రాధాన్యం కూడా పురుషులతో సమానంగా ఉంటూ వస్తుంది. కర్ణాటక సంగీతానికి మహిళల విభాగంలో త్రిమూర్తులు “ఎం.ఎస్. సుబ్బులక్ష్మి”, “ఎం.ఎల్. వసంత కుమారి”, “డి.కె.పట్టమ్మాళ్”. ఈ సంగీత త్రయం ప్రధాన స్రవంతి కర్ణాటక సంగీతంలోకి మహిళల ప్రవేశానికి నాంది పలికింది. భారతీయ స్త్రీ లు, అందులోనూ ఉన్నత వర్గాలలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీ లు పదిమంది గుమిగూడిన పురుషుల ముందు ఆడకూడదు, పాడకూడదు, మాట్లాడకూడదు అని ఆంక్షలున్న ఆ రోజులలో అలాంటి సామాజిక కట్టుబాట్లను అధిగమించి, శాస్త్రీయ సంగీత ప్రపంచంలో అత్యున్నత కళాకారిణిగా ఎదిగిన కళాకారిణి డీ.కె. పట్టమ్మాళ్.
అయిదేళ్లకే నాటక ప్రదర్శన…
“నాకు మీ భాష గానీ, మీ సంగీతం గానీ అర్థం కావు. కానీ మీ గానంలో ఉండే మాధుర్యం, మనసు లోతులను స్పృశించి ఆత్మని మేలుకొలిపి ఏవేవో కొత్తలోకాలకు తీసుకెళ్లింది. ఇటువంటి అనుభూతి నాకెప్పుడూ కలగలేదు” అని ఓ జర్మన్ మహిళ “డి.కె.పట్టమ్మాళ్” తో స్వయంగా చెప్పిందంటే పట్టమ్మాళ్ సంగీతంలోని వైశిష్ట్యాన్ని కొనియాడడానికి ఆ జర్మన్ మహిళ చెప్పిన మాటలు సరిపోతాయి.
పట్టమ్మాళ్ ప్రతిభను గుర్తించిన ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల వార్షికోత్సవంలో ఒక గేయ నాటకంలో ఆమెతో ఓ పాత్రను పోషింపజేశారు. ఆమె అప్పటికే తన తండ్రి వద్ద వందల కొద్ది శ్లోకాలను బాణీలతో సహా నేర్చుకుని ఉంది. అది 1924వ సంవత్సరం అప్పటికి ఆమె వయస్సు అయిదు సంవత్సరాలు. పాఠశాలలో ఆమె ప్రదర్శించిన ఆ నాటక ప్రదర్శనకు వచ్చిన ఒక వ్యాపారి ఆమె నటనకు ముగ్దుడై స్వర్ణ పతకం బహుకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇట్టి విషయాన్ని ఫోటోతో సహా హిందూ పత్రికలో మొదటి పేజీలో ప్రచురించారు. అయితే ఇది చూసిన పట్టమ్మాళ్ తండ్రి ఆందోళన చెంది పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడితో “ఇది పెద్ద కళంకం. ఇప్పడు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? (అప్పట్లో అమ్మాయిలకు బాల్య వివాహం చేసేవారు). మా అమ్మాయి జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేశారు” అంటూ చిందులు తొక్కేశారు. దానికి ప్రధానోపాధ్యాయుడు “మీ అమ్మాయి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించే వరాల పంట” అన్నారు. ఏ సమయంలో ఆయన ఆ మాటలు పలికారో, నlఆ మాటలు నిజమవుతాయి అని వారు ఎంత మాత్రం ఊహించి ఉండరు. ఆ తరువాత కాలంలో తన 75 సంవత్సరాల సంగీత జీవితంలో ఆమె సాధించిన విజయాలు ప్రధానోపాధ్యాయుడి మాటలను అక్షర సత్యం చేశాయి.
జీవిత విశేషాలు…
జన్మనామం : డామల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్
ఇతర పేర్లు : డి. కె. పట్టమ్మాళ్
జననం : 28 మార్చి 1919
స్వస్థలం : కాంచీపురం, మద్రాసు ప్రెసిడెన్సీ, ఇండియా
వృత్తి : గాయకురాలు
సంగీత శైలి : కర్ణాటక సంగీతం, ప్లే బేక్ సింగర్
తండ్రి : దామల్ కృష్ణస్వామి దీక్షితార్
తల్లి : కాంతామణి
జీవిత భాగస్వామి : ఆర్. ఈశ్వరన్
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 16 జులై 2009, మద్రాసు
నేపథ్యం…
దామల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ (డి.కె. పట్టమ్మాళ్) 28 మార్చి 1919 నాడు భారతదేశంలోని తమిళనాడులో గల కాంచీపురంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి దమల్ కృష్ణస్వామి దీక్షితార్, ఆమె తల్లి కాంతిమతి (రాజమ్మాళ్). తల్లి స్వయంగా ప్రతిభావంతులైన గాయనీమణి అయినప్పటికీ ఆ రోజులలో ఉండే కఠినమైన సనాతన సంప్రదాయానికి అనుగుణంగా పాటలు పాడటానికి, కచేరీలు చేయడానికి స్నేహితులు, బంధువుల నుండి ఆమెకు అనుమతి లేదు. పట్టమ్మాళ్ అసలు పేరు “అలమేలు” అని పెట్టారు. కానీ ఆమెకు ఉన్న బాల ప్రతిభ కారణంగా ఆమెను “పట్టా” అని ముద్దుగా పిలిచేవారు. ఆమె తండ్రికి సంగీతంపై ఉన్న విపరీతమైన ఆసక్తి ఉండేది. నారాయణ పిళ్ళై వంటి ప్రముఖ సంగీత విద్వాంసులందరితో తండ్రికి పరిచయాలు ఉండడం వలన ఆమెను కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి ప్రేరేపించారు.
“హిందూ” పత్రికలో వచ్చిన వార్త పట్టమ్మాళ్ కు ఎనలేని ప్రచారం తెచ్చిపెట్టింది. ప్రతిభావంతులైన గాయనీ, గాయకుల కోసం అన్వేషిస్తున్న కొలంబియా సంస్థ తమకు తాముగా కాంచీపురం కి వచ్చి అప్పటికే గొప్పగా ప్రచారంలో ఉన్న పట్టమ్మాళ్ గానాన్ని రికార్డు చేస్తామని అడిగారు. కానీ ఈ విధంగా ఆమె రచ్చకెక్కడం తండ్రికి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు పీ.ఎస్.శ్రీనివాసన్ ముందు ప్రస్తావించారు. అప్పుడు “నీ బెంగ అంతా మీ అమ్మాయి పెళ్లి గురించే కదా! అదే అయితే మీ అమ్మాయికి పెళ్ళీడు వచ్చినప్పుడు నేను నా మేనల్లుడు ఈశ్వరన్ కు ఇచ్చి వివాహం జరిపిస్తాను” అని పీ.ఎస్.శ్రీనివాసన్ భరోసా ఇచ్చారు. నిజంగానే ఆయన అన్నట్టుగానే ఆ తరువాత 1939 వ సంవత్సరంలో ఈశ్వరన్ తో డి.కె. పట్టమ్మాళ్ వివాహం జరిగింది. ఆ రోజులలో బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న కట్టుబాట్లను కాదని, ఆమె సంగీత సాధనకు సహకరించడమే కాకుండా ఈశ్వరన్ ఆమె సంగీత జీవితానికి మార్గదర్శకుడిగా మారేందుకు తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు.
అంబి దీక్షితార్ అయ్యర్ వద్ధ శిష్యరికం…
ప్రొఫెసర్ పి.సాంబమూర్తి, జస్టిస్ టి.యల్ వెంకటరామ అయ్యర్ వంటి సంగీతజ్ఞుల వద్ద పట్టమ్మాళ్ శిష్యరికం చేసి శిక్షణ పొందారు. సంగీత పరీక్షలకు పర్యవేక్షకుడు (ఇన్విజిలేటర్) గా వచ్చిన అంబి దీక్షితార్ అయ్యర్ (ముత్తుస్వామి దీక్షితార్ మనవడు), పట్టమ్మాళ్ గానానికి పరవశించిపోయి తనకు తానుగా ఆమెకు కీర్తనలను బోధిస్తానని ఆమెను శిష్యురాలిగా స్వీకరించారు. నిజానికి ఇది అందరికీ అందని అరుదైన అవకాశం. గురువుల వద్ద మెప్పు పొందిన పట్టమ్మాళ్ మద్రాస్ సంగీత అకాడమీలో చేరి తన గానంతో సంగీత ప్రియులను మైమరిపించారు. ఇలా తొలినాళ్ళలో ఆమె గానమాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి అంబి దీక్షితార్ అయ్యర్ ఎంతగానో దోహదపడ్డారు. సంగీతంలో పరిపూర్ణత్వం అనేది లేదని గ్రహించి ఆమె అయిదేళ్ల పాటు తన గానంతో సంగీత ప్రపంచాన్ని పరవశింపజేసి, ప్రసిద్ధి చెందిన కర్ణాటక సంగీత గాయకులు అరియకుడి రామానుజ అయ్యంగార్ వద్దకు వెళ్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరారు. ఆమె గానం విన్న ఆయన ఆనందంతో తన ప్రియ శిష్యుడు అయిన వైద్యనాథన్ చేత ఆమెకు ప్రత్యేక శిక్షణను ఇప్పించారు.
కుటుంబంతో మద్రాసుకు మకాం..
ఆ రోజులలో మద్రాసు నగరం సంగీత కళారంగాలకు నిలయం. ఆ నగరంలోనే సంగీతభ్యాసం చేసిన పట్టమ్మాళ్ కోసం వారి కుటుంబం అంతా కూడా మద్రాసుకు మకాం మార్చారు. ఆమె మద్రాసులో స్థిరపడిన దగ్గర నుండి ఆమెకి ఎందరో సంగీతజ్ఞులతో పరిచయాలు ఏర్పడడం, వారితో గోష్టులు, చర్చలు, కచేరీలు చేసి ఆముష్మిక సంగీత సాధన చేశారు. విద్యల నరసింహానాయుడు, ధనమ్మాళ్ కూతురు రాజ్యలక్ష్మి, అప్పాదురై ఆచారి, కృష్ణ స్వామి అయ్యర్ మొదలుగు మహానుభావులందరూ ఆమె జరిపే నిరంతర సంగీత కలాన్వేషణలో ఆమెకు సలహాలు, సహాయ సహాకారాలు అందిస్తూ వచ్చారు. పట్టమ్మాళ్ గానం పట్ల ప్రజలలో, ప్రేక్షకులలో, సంగీతాభిమానులలో పెరిగిన అభిమానాన్ని రికార్డు కంపెనీలు, సినిమా రంగాలు, రేడియోలు వ్యాపారం చేసి లాభాలు గడించాయి. సినీ రంగంలో నేపథ్య గానం చేసి తొలి శాస్త్రీయ గాయనీమణులలో పట్టమ్మాళ్ గానంలో విలక్షణత్వం గోచరిస్తుంది. ఆమె కంఠంలో గమకాలు, సంగతులు మనోహరంగా పలుకుతాయి. తన సమకాలీనులు తమిళ కీర్తనలు ఆలపించినప్పటికీ చివర్లో మాత్రం పాడేవారు కాదు. దీంట్లో పట్టమ్మాళ్ మార్పులు తీసుకొచ్చారు. ఈ విధంగా తన గానంలో ఒక క్రొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు.
సినిమా రంగం…
సినిమాలలో నేపథ్య గానం చేసిన తొలి కర్ణాటక సంగీతకారులలో డి.కె.పట్టమ్మాళ్ ఒకరు. ఆమెను “పాపనాసం రామయ్య శివన్” సినీ రంగానికి పరిచయం చేశారు. ఆమెకు సినిమాలలో పాడటానికి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ, భక్తి మరియు దేశభక్తి గీతాలతో కూడిన పాటలను మాత్రమే ఆమె అంగీకరించేవారు. ప్రేమ గీతాలను పాడటానికి ఆమె ఒప్పుకునేవారు కాదు. పట్టమ్మాళ్ నేపథ్య గానం చేసిన మొదటి చిత్రం త్యాగభూమి (1939). మద్రాస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పొరేషన్ అధినేత గోపాలకృష్ణన్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణసామి సుబ్రమణ్యం దర్శకత్వం వహించారు. ఈ సినిమా చివరలో ఒక సన్నివేశంలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల బృందం ఊరేగింపులో కవాతు చేస్తున్నట్లు చూపించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని పట్టమ్మాళ్ “దేశ సేవై సెయ్య వారిర్” అనే గేయాన్ని ఆలపించారు. కల్కి (ఆర్. కృష్ణమూర్తి) వ్రాసిన ఈ పాటను “పాపనాసం శివన్” స్వరపరిచారు. ఈ పాట స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉధృతం చేసింది. దాంతో ఆమె పాడిన పాటతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని నిషేధించడానికి దారితీసింది.
చివరి చిత్రం “హే రామ్” (2008)…
“నామ్ ఇరువర్” (1947) అనే తమిళ సినిమా లో పట్టమ్మాళ్ “వెట్రి ఎట్టు దిక్కుం ఎట్ట” మరియు “ఆడువోమే పళ్ళు పాడువోమే” అనే పాటలను ఆలపించారు. స్వేచ్ఛా భారతదేశాన్ని జరుపుకునే అసాధారణమైన పూర్వాపరాలతో కూడి ఉన్న ఈ పాటలను సుబ్రమణ్య భారతి వ్రాయగా బాగా ప్రాచుర్యం పొందాయి. రామరాజ్యం (1948) లో సుబ్రమణ్య భారతి వ్రాసిన “తూండిర్ పుజ్వినై – ప్ – పోల్” ని పట్టమ్మాళ్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. వెధల ఉలగం (1948) లో సుబ్రమణ్య భారతి వ్రాసిన “తీరద విలయట్టు పిళ్ళై” పాటను ప్రేక్షకులు మైమరచి పోయేలా పట్టమ్మాళ్ ఆలపించారు. వైజయంతిమాల చలనచిత్ర నటనకు పరిచయమైన ఏ.వి.యం వారి వాఝ్కై (1949) సినిమాలో పట్టమ్మాళ్ “భారత సముదాయం వాఙ్గవే”ని పాడారు. అంతే కాకుండా “మహాత్మా ఉరంగార్” (1947), “పిజైక్కుమ్ వాజి” (1948), “లావణ్య” (1951) వంటి ఇతర చిత్రాలలో పట్టమ్మాళ్ నేపథ్య గానం చేశారు. పట్టమ్మాళ్ సినిమాలలో తన చివరి పాట 80 ఏళ్ల వయసులో తమిళ చిత్రం “హే రామ్” (2000) లో పాడారు. ఇళయరాజా మరియు కమల్ హాసన్ లు పట్టమ్మాళ్ ఇంటికి రికార్డింగ్ సామగ్రిని బండిని తీసుకెళ్లారు. ఈ సినిమాలో ఆమె మహాత్మా గాంధీకి ఇష్టమైన “వైష్ణవ్ జనతో” గేయాన్ని ఆలపించారు.
“సంగీత కళానిధి” పురస్కారం…
కర్ణాటక సంగీతానికి కేంద్ర బిందువుగా పేరు గాంచిన మద్రాసు సంగీత అకాడమీలో అప్పట్లో ఎక్కువగా పురుషాధిక్యత ఉండేది. ఎప్పుడైతే యం.యస్. సుబ్బలక్ష్మి, డీ.కే. పట్టమ్మాళ్, యం.యల్. వసంత కుమారి లు కర్ణాటక సంగీత గాయని త్రయంగా పేరుగాంచారో, అప్పటి నుండి అకాడమీ వారు ఆ ముగ్గురిని ఆహ్వానించి కచేరీలు ఏర్పాటు చేసి, సముచిత రీతిన సత్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజులలో సంగీత అకాడమీ వారు ప్రతీ యేటా ఇచ్చే సంగీత కళానిధి పురస్కారాన్ని యం.యస్. సుబ్బలక్ష్మి, డీ.కే. పట్టమ్మాళ్ లలో ముందుగా ఎవరికి ఇవ్వాలనే చర్చ మొదలైంది. పట్టమ్మాళ్ వైపు కొందరు, యం.యస్. సుబ్బలక్ష్మి వైపు మరి కొందరు వాదించగా చివరికి యం.యస్. సుబ్బలక్ష్మి కే దక్కింది. ఆ మరుసటి సంవత్సరం మధురై అయ్యంగార్ పేరు ఈ పురస్కారం కోసం పరిశీలనకు రావడంతో, పట్టమ్మాళ్ స్వయంగా పోటీ నుండి తప్పుకున్నారు. ఇలా వివాదాలకు అతీతంగా వ్యవహరించడంలో ఆమె నిరాడంబరత్వం, కీర్తి విముఖత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పట్టమ్మాళ్ కు 1970 వ సంవత్సరంలో సంగీత అకాడమీ వారు “సంగీత కళానిధి” అనే పురస్కారం ఇచ్చి తనకు తాను గౌరవించుకుంది.
బ్రిటీషు వారి బెదిరింపులకు బెదరని ధీశాలి…
తన తొలి కచేరి 1933 వ సంవత్సరంలో మొదలుపెట్టిన పట్టమ్మాళ్, తన గాత్ర కచేరిల నిమిత్తం యాభై సంవత్సరాల పాటు నెలలో మూడు వారాల పాటు ప్రయాణాలు చేస్తూనే ఉండేవారు. 1990 వ సంవత్సరం తరువాత కచేరీలు తగ్గించారు. పట్టమ్మాళ్ సంగీతంలో మూడు ప్రధాన అంశాలు మనకు గోచరిస్తాయి. క్రమశిక్షణ, పరిపూర్ణ పరిజ్ఞానం, హూందాతనం. తొలినాళ్ళలో ఆమె దేశభక్తి గీతాలను ఆలపించారు. బ్రిటిష్ పాలన కాలంలో తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్ వ్రాసిన దేశభక్తి గీతాలను ధైర్యంగా పాడి ప్రచారం చేశారు. ఆమెను ఖైదు చేస్తామని హెచ్చరికలు చేసినా కూడా ఖాతరు చేయని ధైర్యశాలి. ఆమె “మానస గురుగుహ”, “శివే పాహిమామ్”, “అక్షయ లింగవిభో”, “కామాక్షి లోకసాక్షి”, “బ్రోవనమ్మ”, “రామా నీపై తనకు ప్రేమపోదు”, “ఎన్రుకు వరుమో శివకృప”, “పరాత్పరా పరమేశ్వరా”, “శాంతి నిలువ వేండుం”, “చెలినేనట్లు సైరింతువే” వంటి కీర్తనలు పట్టమ్మాళ్ కంఠంలో జీవం పోసుకున్నవే.
అత్యున్నత పురస్కారాలు అందుకుని…
సంగీతాన్ని నిరంతర తపస్సుగా భావించి తన జీవితాన్ని సంగీత సాధనకు అంకితం చేసినన పట్టమ్మాళ్ కర్ణాటక సంగీతంలోని రహస్యాలను ఆపోసన పట్టారు. ఎన్నో క్లిష్టమైన రాగాలను కరతలామలకం చేసుకున్న ఆమె తనదైన విభిన్న శైలిని రూపొందించుకున్నారు. తన సంగీత బాణీలకు అనుగుణంగా వాగ్గేయకారుల కీర్తనలను మలుచుకున్నారు. సంగీతంలో అనితర సాధ్యమైన పల్లవిని (వివిధ గతులలో ఒక పదాన్ని అనేక సార్లు పాడటం) సాధించారు. భారతదేశ సాంస్కృతిక రాయబారిగా పశ్చిమ జర్మనీలోని బెర్లిన్, బాన్ నగరాలు, ఫ్రాన్స్ లోని రేనస్, స్విట్జర్లాండ్, కెనడా, అమెరికా లలో పర్యటించి తన మధుర గానామృతంను పాశ్చాత్యులకు పంచారు.
డి.కె. పట్టమ్మాళ్ తన సంగీత సేవలకు గానూ అసంఖ్యాక పురస్కారాలు అందుకున్నారు. 1962 వ సంవత్సరంలో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 1971 గాన సరస్వతి, పద్మభూషణ్ బిరుదులు, 1992లో కేంద్ర సంగీత నాటకం పురస్కారం, 1999 పద్మ విభూషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం “కాళిదాస్ సన్మాన్” వంటి పురస్కారాలు ఆమె అందుకున్నారు. ఒకవైపు తీరిక లేని కచేరీలు సాధన చేస్తూ, మరోవైపు తీరిక లేకున్నా సంసారాన్ని ఒంటి చేత్తో నడిపించే గృహిణిగా పట్టమ్మాళ్ తెగువ గర్హనీయం. తన కుమారుడు శివకుమార్ ను మృదంగంలో నిష్ణాతుడిని చేసి, పాల్ఘాట్ మణిఅయ్యర్ వంటి మృదంగ విద్వాంసులకు వియ్యపురాలయ్యారు.
మరణం…
పట్టమ్మాళ్ ఇల్లు ఓ సంగీత సరస్వతి నిలయం. ఉత్తమ శాస్త్రీయ సంగీతానికి రాగం, దానికి తగ్గట్టుగా తాళం మేలవించడమే ప్రాథమిక సూత్రంగా భావించిన పట్టమ్మాళ్ సంగీతం, సాహిత్యాలను అర్థం చేసుకుని దానికి తగ్గ భావంతో, రాగంతో పాడితేనే సంగీతానికి సార్ధకత ఉంటుందని ఆమె అనేవారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో దిగ్దంతులైన ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్, .యస్. సుబ్బలక్ష్మి, అరియకుడి రామానుజ అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యార్ వంటి వారితో సరితూగ గలిగిన పట్టమ్మాళ్ నిబద్దతగల శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుగా జీవితాన్ని పండించుకున్న ఆమె పటాటోపం లేని నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం.
ఆమెకు ఇద్దరు కుమారులు శివ కుమార్ మరియు లక్ష్మణ్ కుమార్. అలాగే ఆమెకు మనవళ్ళు రాజ్‌గురు, చరణ్ లు, మనవరాళ్ళు గాయత్రి, నిత్యశ్రీ ఉన్నారు. “కాలం సమీపించినప్పుడు పెదవుల మీద పాటతోనే నేను వెళ్ళిపోవాలి” అనే పట్టమ్మాళ్ 16 జూలై 2009 నాడు మధ్యాహ్నం 1:30 గంటలకు మద్రాసు లో కొట్టూరుపురం లోని తన స్వగృహంలో సహజ మరణం పొందారు. ఆమె మరణించిన 9 నెలల తరువాత ఆమె భర్త ఆర్.ఈశ్వరన్ 02 ఏప్రిల్ 2010 నాడు తన 95 సంవత్సరాల వయస్సులో మరణించారు.