CINEMATelugu Cinema

అందానికి భాష్యం అపురూప లావణ్యవతి జయప్రద

భారతీయ తెరపై అత్యంత అందమైన ముఖం జయప్రద నహత (లలిత రాణి)

(జననం.. 3 ఏప్రిల్ 1962)

అందానికి భాష్యం చెప్పిన అపురూప లావణ్యవతి.. దక్షిణాదిన మొగ్గ తొడిగి ఉత్తరాది సినీ ఉద్యాన వనంలో  వికసించి పరిమళించిన నవ పారిజాతం. సినీ రంగంలో జయప్రదం గా విజయపథం లోకి దూసుకెళ్లి నటనలో తిరుగులేని తారగా వెలుగొందిన నట సౌరభం. అభినయంలో అవలీలగా హావభావాలు పలికిస్తూ, శాస్త్రీయ నృత్యంతో మనోల్లాసాన్ని కలిగించగల నట, నాట్య మయూరి. ఆమె ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉప్పెన.. ఉరకలెత్తుతూ పడి లేచిన కెరటం. కష్టాల సుడిగుండంలోకి జారి, కన్నీటి సంద్రంలో మునిగి జయకేతనం ఎగురవేసిన “జయప్రద” ఆమె.

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి డాక్టరుగా ప్రస్థానాన్ని కొనసాగాంచాలని కలలు గని, యాక్టరుగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయవేత్త గా తన మజిలీని పొడిగించుకుంటూ ప్రజా సేవకురాలిగా, సినీ నటిగా, యువకుల ఆరాధ్య దేవతగా, తన అందంతో, అభినయంతో, నాట్యంతో, నటనతో బహుముఖ ప్రతిభను చూపుతూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు నటి జయప్రద గారూ.

పుట్టింది తెలుగునాట అయినా తన సినీ ప్రస్థానంలో మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా చిత్రాలలో నటించారు జయప్రద గారూ. నటనా ప్రాధాన్యమున్న చిత్రాలు (అంతులేని కథ), నాట్య ప్రాధాన్యమున్న చిత్రాలు  సిరి సిరి మువ్వ, మేఘసందేశం), కళాత్మక చిత్రాలు (సాగర సంగమం), చారిత్రాత్మక చిత్రాలు (సింహాసనం), పౌరాణిక చిత్రాలు (సీతా కళ్యాణం) ఇలా అనేక అభినయ ప్రాధాన్యమున్న చిత్రాలలో నటించి మెప్పించారు.

భారతీయ చలన చిత్ర దిగ్గజ దర్శకులు “సత్యజిత్ రే” గారూ జయప్రద గారిని ప్రపంచంలోని అందమైన మహిళల్లో ఒకరిగా అభివర్ణించారు.

జననం.

జయప్రద గారూ 3 ఏప్రిల్ 1962 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి రజక కుటుంబములో కృష్ణారావు, నీలవేణి దంపతులకు జన్మించారు. ఈవిడ అసలు పేరు లలితా రాణి. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నటులు ప్రభాకర్ రెడ్డి గారూ లలితా రాణి పేరును “జయప్రద”గా మార్చారు. ఆమె తండ్రి కృష్ణారావు గారూ తెలుగు చిత్రాలకు ఫైనాన్షియర్ గా ఉండేవారు. ఆమె తల్లి నీలవేణి గృహిణి. లలిత  రాణి రాజమండ్రిలోని తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నారు. చిన్న వయస్సులోనే నృత్య మరియు సంగీత తరగతులలో కూడా చేరి సంగీతంతో బాటు నాట్యం కూడా నేర్చుకున్నారు.

సినీ ప్రస్థానం.

జయప్రద గారూ తన పాఠశాలలో చదువుతున్నప్పుడు, ఆమె తన పాఠశాల వార్షిక కార్యక్రమంలో నృత్యం చేసింది.  ఆ నృత్యాన్ని తిలకించే ప్రేక్షకుల్లో ఉన్న ఒక సినిమా దర్శకుడు ఆమెకు తెలుగు చిత్రం “భూమి కోసం” (1974) లో మూడు నిమిషాలు డ్యాన్స్ చేసే పాత్రలో అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె అందులో నటించడానికి వెనుకాడింది. కానీ వాళ్ళ నాన్న గారూ ఫిల్మ్ ఫైనాన్సియర్ కావడంతో తాను ఏమీ వద్దనకుండా జయప్రదను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. సినిమాలో ఆమె చేసిన ఆ పాత్రకు తొలి పారితోషికం గా 10 రూపాయలు మాత్రమే చెల్లించారు. కానీ ఆ మూడు నిమిషాల సినిమా హడావిడిని తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులకు చూపించారు.

అది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మన్మథలీలలు లో కమలహాసన్ తో తమిళంలో నటించిన జయప్రద గారూ, 1976 లో దర్శకుడు కె.బాలచందర్ యొక్క నలుపు-తెలుపు చిత్రం అంతులేని కథ (1976) లో ఆమె అద్వితీయమైన నటనను ప్రదర్శించింది. కె.విశ్వనాథ్ కలర్ ఫిల్మ్ “సిరి సిరి మువ్వ” (1976) లో ఆమె అద్భుతమైన నృత్య నైపుణ్యాలు కలిగిన మూగ అమ్మాయిగా నటించింది.

అలాగే భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం “సీతాకళ్యాణం” (1976) లో సీతగా ఆమె ప్రధాన పాత్ర పోషించి తన బహుముఖ ప్రజ్ఞను తెలియజేసింది. 1977లో, జయప్రద గారూ “అడవి రాముడు” లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిడంతో పాటు ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా సుస్థిరం చేసింది. చిత్ర నిర్మాత విజయ్ 1977 లో “సనాది అప్పన్న” చిత్రంతో ఆమెను కన్నడ సినిమాకు పరిచయం చేశాడు.

జయప్రద గారూ 1979 లో కె.బాలచందర్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్‌ గార్ల సరసన “నినైతలే ఇనిక్కుమ్” అనే తమిళ చిత్రంలో నటించారు. ఇందులో ఆవిడ గారూ అనారోగ్యంతో బాధపడుతున్న రోగిగా నటించారు. ఆమె 70 మరియు 80లలో ఎన్టీఆర్, ANR , కృష్ణ , కృష్ణం రాజు మరియు శోభన్ బాబు వంటి అగ్ర నటుల సరసన నటించారు. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976), భలే కృష్ణుడు (1980), ఊరుకి మొనగాడు (1981), ముందడుగు (1983) వంటి చిత్రాలు కృష్ణ గారితో కలిసి నటించారు.

తొలి విజయం బాలచందర్ “అంతులేని కథ”.

జయప్రద గారూ తన 14 వ యేటనే తొలిసారి నటిగా, కథానాయికగా నటించిన చిత్రం “అంతులేని కథ”. 1976 లో కె.బాలచందర్ గారి దర్శకత్వం వహించిన తెలుగు భాషా చిత్రం. 1974 తమిళ చిత్రం “అవల్ ఒరు తొడర్ కథై” ని తెలుగులో పునర్నిర్మించారు. తమిళంలో నటి సుజాత పోషించిన పాత్రను తిరిగి తెలుగులో జయప్రద గారూ పోషించారు.

ఇందులో జయప్రద తో పాటు ఫటాఫట్ జయలక్ష్మి , రజనీకాంత్ గారూ మరియు శ్రీ ప్రియ సహాయక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ గారూ అతిథి పాత్రలో నటించారు. ఇది జయప్రద గారూ నటించిన మొదటి పాత్ర. 

ఆవిడ గారూ నటించిన ఉత్తమ చిత్రాలలో “అంతులేని కథ” ఒకటి. రజనీకాంత్‌ గారికి ఇదే మొదటి ప్రధాన పాత్ర.

ఈ చిత్రాన్ని నలుపు, తెలుపు రంగులలో చిత్రీకరించారు. ఈ చిత్రంలోని నటనకు గానూ జయప్రద గారిని “ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్” నుండి “ప్రత్యేక అవార్డు” వరించింది.

విశ్వనాథుని సిరి సిరి మువ్వ.

జయప్రద గారూ నటించిన అద్భుతమైన చిత్రం “సిరి సిరి మువ్వ”. 1976 లో విడుదలయిన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం. దీనిని కె. విశ్వనాథ్ గారూ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో జయప్రద మరియు చంద్ర మోహన్ గార్లు జంటగా నటించారు. కె.విశ్వనాథ్ గారూ 1979 లో జయప్రద గారితో సర్గం పేరుతో ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించారు. “సిరి సిరి మువ్వ” చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, మరియు మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో నాట్యంపై విపరీతమైన మక్కువ కలిగిన మూగ అమ్మాయి పాత్రలో అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. నటిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. బాల్యంలోనే సంగీతం, నాట్యం నేర్చుకున్న జయప్రద గారికి అవి ఈ చిత్రంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.

దాసరి నారాయణ గారి మేఘసందేశం.

జయప్రద గారూ నటించిన అద్భుతమైన చిత్రాలలో “మేఘసందేశం” ఒకటి. 1982 లో విడుదలైన ఈ తెలుగు భాషా నాటక చిత్రాన్ని దాసరి నారాయణరావు గారూ తన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు , జయప్రద , జయసుధ గార్లు నటించగా రమేష్ నాయుడు సంగీతం అందించారు. “ఆకాశ దేశానా” , “ఆకులో ఆకునై” , “ముందు తెలిసేనా ప్రభు”, “నవరస సుమ మాలిక” , “నిన్నటి దాక శిలనైనా”, “పాడనా వాణి కళ్యాణిగా” , “ప్రియే చారుశీలే” , “సిగలో అవి విరులో” లాంటి పాటలు వినసొంపుగా మనోల్లాసాన్ని కలిగిస్తాయి.

సహజీవనం అనే కథాంశంతో నలభై యేండ్ల క్రిందటే తెరకెక్కించిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. సహజీవనం వల్ల కాపురాల్లో, మనసుల్లో ఎలాంటి సంఘర్షణలు తలెత్తుతాయో హృద్యంగా చూపించిన చిత్రం “మేఘసందేశం”. అక్కినేని నాగేశ్వరరావు గారి 200వ సినిమా ఇది. ఈ చిత్రం 9వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా , మరియు మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌ లలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది. 30వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ చిత్రం నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం తొమ్మిది నంది అవార్డులను కూడా గెలుచుకుంది..

విశ్వనాథుని “సాగర సంగమం”..

జయప్రద గారూ నటించి, జీవించిన గొప్ప చిత్రం “సాగర సంగమం”. 1983 లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నృత్య ప్రధాన చలనచిత్రం. కళాతపస్వి గా ప్రసిద్ధిగాంచిన కళాత్మక దర్శకులు కె.విశ్వనాథ్ గారి రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కించబడింది. దీనిని తెలుగు సినిమాకు నాగాభరణం లాంటి వారు అయిన “ఏడిద నాగేశ్వరరావు” గారూ నిర్మించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ , జయప్రద , శరత్ బాబు , ఎస్పీ శైలజ , చక్రి తోలేటి నటించారు.

ఇందులో పాత్రదారులు నటించారు అనడం కన్నా జీవించారు అనడం సబబుగా ఉంటుంది. కమలహాసన్, జయప్రద గార్లు చాలా వైవిధ్య భరితంగా, అత్యద్భుతంగా నటించారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సానుకూల సమీక్షలను అందుకుంది. బాక్స్ ఆఫీస్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు (కాంస్య) అందుకుంది. CNN-IBN యొక్క ఆల్ టైమ్ 100 గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా స్థానం సంపాదించుకోవడం ఈ చిత్ర విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ గారితో

విజయనిర్మల గారి తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారితో అత్యధిక చిత్రాల్లో జయప్రద గారే నటించారు. జయప్రద, కృష్ణ గార్ల కలయికలో  45 చిత్రాలు రూపొందాయి. విజయా సంస్థ నిర్మాణంలో బాపు గారూ దర్శకత్వం వహించిన “శ్రీ రాజేశ్వరి విలాస్ క్లబ్” చిత్రంలో వీరిద్దరూ తొలిసారిగా జంటగా నటించారు. మొదటి సినిమాతోనే విజయవంతమైన జంటగా వీరికి ముద్ర పడిపోయింది. దీంతో ఈ జంటతోనే ఎక్కువగా సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించేవారు. ఆవిధంగా ఈనాటి బంధం ఏనాటిదో, మనవూరి కథ, ఊరికి మొనగాడు లాంటి, దొంగలకు దొంగ, అల్లరి బుల్లోడు లాంటి విజయవంతమైన చిత్రాలు వీరి కలయికలో రూపొందాయి. కృష్ణ, శ్రీదేవి గార్ల జోడి కి అప్పట్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ కూడా కృష్ణ, జయప్రద గార్ల జంట కు కూడా ప్రేక్షకులు జేజేలు పలికారు. అయితే ఒకటి, రెండు చిత్రాల్లో కృష్ణ గారికి జయప్రద గారూ చెల్లెలిగా నటించడం ఆ రోజుల్లో అభిమానులకు రుచించలేదు. కాలక్రమంలో వీరిద్దరూ లోక్సభకు ఎంపీలుగానూ ఎన్నిక కావడం యాదృచ్ఛికం.

“సిరి సిరి మువ్వ” రీమేక్ “స్వర్గం” తో హిందీ లోకి…

కె. విశ్వనాథ్ గారూ సిరి సిరి మువ్వ (1976) ని హిందీలో “సర్గం” పేరుతో పునర్నిర్మించి, 1979 లో జయప్రద గారిని బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్నందుకుంది. దాంతో జయప్రద గారూ హిందీలో కూడా స్టార్ అయ్యింది. 1981లో, ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం “47 నాట్కల్‌” లో నటించింది. అదే సమయంలో చిత్ర నిర్మాత K. బాలచందర్ 47 రోజులు అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన “సాగర సంగమం” ఆమె సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. ప్రకాష్ మెహ్రా తీసిన షరాబి (1984)లో అమితాబ్ బచ్చన్ యొక్క ముద్దుల ప్రియురాలిగా నటించింది. 1990 లలో జయప్రద గారూ అమితాబ్ మరియు జీతేంద్ర గార్ల తోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఆమె కథానాయికగా కొన్ని ముఖ్యమైన కన్నడ చిత్రాలలో కూడా నటించారు. 1994 నుండి జయప్రద గారూ తన సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. తన సహనటులు ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు రాజకీయాలలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

ఆ తరువాత 2000 లో, జయప్రద గారూ సిబి మలైల్ దర్శకత్వంలో మోహన్‌లాల్ గారూ నటించిన మలయాళ చిత్రం “దేవదూతన్‌” లో నటించింది. ఈ చిత్రం విమర్శకుల నుండి విపరీతమైన ప్రజాదరణను, అనుకూల సమీక్షలను పొందింది. కానీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆవిడ గారూ చివరిసారిగా కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ “రాజ్ కుమార్” సరసన శబ్దవేదిలో కూడా నటించారు. 2002లో, ఆవిడ గారూ ఆధార్ చిత్రంలో అతిథిగా నటించడం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు జయప్రద గారూ ఎనిమిది భాషల్లో నటించారు. తన 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 300 చిత్రాలలో నటించారు.

2011లో, ఆమె మోహన్‌లాల్ మరియు అనుపమ్ ఖేర్‌లతో కలిసి “ప్రణయం” చిత్రంలో నటించారు. బలమైన పాత్రతో మలయాళ సినిమాకి తిరిగి దర్శనమిచ్చారు. ఈ చిత్రంలో ఆమె “గ్రేస్” గా నటించింది. దాంతో జయప్రద గారూ విమర్శకుల ప్రశంసలు మరియు అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆమె 2012 లో కన్నడ చిత్రం “క్రాంతి వీర సంగొల్లి రాయన్న” ( సంగొల్లి రాయన్న ) లో ధైర్యవంతురాలైన కిత్తూరు చెన్నమ్మ యొక్క చారిత్రాత్మక పాత్రను ధరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 రోజులు పూర్తి చేసుకుంది.

వ్యక్తిగత జీవితం.

జయప్రద గారూ తన సినీ ప్రస్థానంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన చిత్ర దర్శకులు, నిర్మాత శ్రీకాంత్ నహతాను 22 ఫిబ్రవరి 1986 నాడు వివాహం చేసుకుంది. శ్రీకాంత్ నహతా ప్రముఖ చిత్ర నిర్మాత దివంగత సుందర్ లాల్ నహతా కుమారుడు. శ్రీకాంత్ నహతాకు అప్పటికే మొదటి భార్య చంద్ర నహతాతో వివాహం జరిగి ఉంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ వివాహం చాలా వివాదాలకు దారితీసింది.

ముఖ్యంగా శ్రీకాంత్ నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ నహతా ఏజెంట్ గోపి (1978), హైసియాత్ (1984), వఫాదార్ (1985), మరియు సిక్కా (1989) వంటి అనేక చిత్రాలను నిర్మించారు. 1989 లో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, శక్తి కపూర్ లు మొదలగు వారు నటించిన “గురు” అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. జయప్రద గారితో వివాహం తరువాత కూడా శ్రీకాంత్ నహతా తన మొదటి భార్య చంద్ర నహతాతో ఒక కొడుకును కన్నారు. తన కాపురం సమస్యాత్మకమైన తరువాత జయప్రద గారూ శ్రీకాంత్ నహతా నుండి విడాకులు తీసుకున్నారు. తన సోదరి కుమారుడైన సిద్ధూను దత్తత తీసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం.

1974 నుండి 1994 వరకు చలనచిత్ర రంగంలో తిరుగులేని కథానాయికగా రాణించిన జయప్రద గారూ 1994 తరువాత సినిమాలు బాగా తగ్గించేసి తన సహా నటులు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయప్రద గారూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ సమయంలోనే జయప్రద గారూ ఎన్నికలకు పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే నందమూరి తారకరామారావు గారూ ఆమెకు అసెంబ్లీ సీటు కేటాయించినప్పటికీ, జయప్రద గారూ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరుపున ప్రచారం చేశారే తప్ప ఎన్నికల అరంగేట్రం మాత్రం చేయలేదు.

జయప్రద గారూ 1994 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 1994 సంవత్సరంలో నందమూరి తారకరామారావు గారూ ముఖ్యమంత్రి అయినప్పుడు, తన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారూ రెవెన్యూ మంత్రిగా నియమించబడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారూ మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని తాను ముఖ్యమంత్రిగా నియమించబడి తన మామగారి పై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో చాలా మంది శాసనసభ్యులు చంద్రబాబు వైపు వెళ్ళారు. ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముద్ర చంద్రబాబు నాయుడు వర్గానికి చేరింది. ఈ క్రమంలో జయప్రద గారూ కూడా చంద్రబాబు నాయుడు వర్గంలోనే చేరిపోయారు. దాంతో ఆవిడ గారిని 1996లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకు నామినేట్ చేశారు.  ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరుపున తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

ఆ తరువాత కొద్ది కాలానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో విభేదాల నేపథ్యంలో జయప్రద గారూ టీడీపీని వదిలి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన జయప్రద గారూ దాదాపు 85,000 ఓట్ల అధిక్యంలో గెలుపొందారు. 11 మే 2009న, సమాజ్‌వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ జయప్రద గారి నగ్న చిత్రాలను బహిరంగం చేశారని జయప్రద గారూ ఆరోపించారు. ఆ సమయంలో పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసిన జయప్రద గారూ దాదాపుగా 30,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికయ్యారు.

సమాజ్‌వాదీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి “అమర్ సింగ్‌” కి బహిరంగంగా మద్దతు పలికిన తర్వాత , పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు, పార్టీ లౌకిక ప్రతిష్టను దెబ్బతీసినందుకు గానూ జయప్రద గారిని 2 ఫిబ్రవరి 2010న పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. అమర్ సింగ్, జయప్రదతో కలిసి 2011లో తన సొంత రాజకీయ పార్టీ “రాష్ట్రీయ లోక్ మంచ్‌” ని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని 403 స్థానాల్లో 360 స్థానాల్లో “రాష్ట్రీయ లోక్ మంచ్‌” పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో అమర్ సింగ్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. తర్వాత ఆమె, అమర్ సింగ్‌తో కలిసి 10 మార్చి 2014 న RLD లో చేరారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజ్నోర్ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆమెకు టిక్కెట్ లభించింది. కానీ జయప్రద గారూ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

చివరిగా జయప్రద గారూ 26 మార్చి 2019న జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు..

అవార్డులు.

నంది అవార్డులు.

1976 వ సంవత్సరంలో అంతులేని కథ చిత్రానికి గానూ జయప్రద గారూ ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు..

దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు

  • సిరి సిరి మువ్వ & అంతులేని కథ చిత్రాలకు గానూ 1976 వ సంవత్సరంలో ప్రత్యేక పురస్కారాన్ని స్వీకరించారు..
  • 1983 సంవత్సరంలో సాగరసంగమం తెలుగు చిత్రంలో అద్భుతమైన అభినయానికి గానూ ఉత్తమ నటి పురస్కారం వరించింది..
  • 2007 సంవత్సరంలో చలనచిత్ర సీమకు చేసిన సేవలకు గానూ దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ నుండి “జీవితకాల సాఫల్య పురస్కారం” అందుకున్నారు..

ఇతర అవార్డులు.

  • 2016వ సంవత్సరంలో 14వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లలో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియా బహుమతిని అందుకున్నారు..
  • 2008 సంవత్సరానికి గానూ అక్కినేని నాగేశ్వరావు అచీవ్‌మెంట్ పురస్కారాన్ని స్వీకరించారు..
  • 2011 సంవత్సరానికి గానూ TSR TV9 ఫిల్మ్ అవార్డ్స్ నుండి వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని తీసుకున్నారు..
  • “ప్రణయం” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నానా ఫిల్మ్ అవార్డును అందుకున్నారు..
  • 2012 సంవత్సరానికి గానూ “ప్రాణాయామం” చిత్రంలో నటించినందుకు గానూ ఉజాలా ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ నుండి ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు..
  • 2012 వ సంవత్సరంలో ప్రణయం చిత్రానికి గానూ అమృత ఫిల్మ్ అవార్డ్స్ నుండి ఉత్తమ నటి అవార్డు స్వీకరించారు..
  • 2012 వ సంవత్సరంలో ప్రణయం చిత్రానికి గానూ మాతృభూమి కళ్యాణ్ సిల్క్స్ ఫిల్మ్ అవార్డ్స్ నుండి ఉత్తమ పాత్ర నటి అవార్డును కైవసం చేసుకున్నారు..
  • 2012 వ సంవత్సరంలో “ప్రాణాయామం” చిత్రం కోసం కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సూర్య టీవీ ఫిల్మ్ అవార్డ్స్  నుండి అత్యుత్తమ ప్రదర్శన పురస్కారాన్ని అందుకున్నారు..
  • 2011 వ సంవత్సరంలో “ప్రాణాయామం” చిత్రం కోసం ఆసియా విజన్ మూవీ అవార్డ్స్ నుండి అత్యుత్తమ ప్రదర్శన పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు..
  • కళాశ్రీ అవార్డు..
  • కిన్నెర సావిత్రి అవార్డు..
  • నర్గీస్ దత్ గోల్డ్ మెడల్..
  • ఉత్తమ్ కుమార్ అవార్డు..
  • కళా సరస్వతి అవార్డు..
  • శకుంతల కళా రత్నం అవార్డు..
  • రాజీవ్ గాంధీ అవార్డు..

సశేషం…

సినీ జీవితం రంగుల ప్రపంచం. కోట్లలో పారితోషికం, విలాసవంతమైన జీవితం, అంతులేని అభిమాన గణం, బిందాస్‌ జీవితం. ఇదీ సహజంగా సినిమా తారల గురించి సగటు జనాల ఊహ. సమాజంలో అత్యధిక శాతం వ్యక్తులు ఇలాగే ఆలోచిస్తారు. అయితే ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. దిగే వరకు లోతు తెలియదని చెబుతుంటారు పెద్దలు. ఇది నిజం. మహానటి సావిత్రి గారూ నటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. వైభవాన్ని చవిచూశారు. ఒక తప్పుడు నిర్ణయంతో పాతాళానికి పడిపోయారు. జెమినీ గణేశన్ కు మొదటి భార్య ఉండగా, రెండవ భార్యగా సావిత్రి గారూ జెమినీని వివాహం చేసుకున్నారు. దాంతో తన సినీ ప్రస్థానంతో పాటు తన జీవన ప్రస్థానం కూడా దారుణంగా ముగిసిపోయింది.

ఇలా ఎంతో మంది జీవితాలు దారుణంగా ముగిసిపోయాయి. కొందరి జీవితాలు విడాకులతో ఒంటరిగా మిగిలిపోయాయి. జయప్రద గారి జీవితంలో కూడా అలానే జరిగింది. శ్రీకాంత్ నహతా కు అప్పటికే పెళ్లయ్యింది. జయప్రద గారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ మొదటి భార్యతోనే ఎక్కువ సమయం వెచ్చించి జయప్రద గారిని నిర్లక్ష్యం చేశాడు. ఫలితం విడాకులు. జయప్రద గారూ ఒంటరి జీవితం. ఎంతో స్టార్ డమ్ అనుభవించిన జయప్రద గారూ నిజ జీవితంలో వైవాహిక జీవితం ప్రశ్నార్థకంగా మారి ఏకాకి జీవితాన్ని అనుభవించాల్సి రావడం అత్యంత బాధాకరం..

Show More
Back to top button