ఆధునిక మల్లయోధులు, కలియుగ భీమ.. కోడి రామ్మూర్తి నాయుడు. ఏప్రిల్ 1882 – 16 జనవరి 1942అత్యంత పురాతనమైన పోరాట క్రీడారూపాలలో “కుస్తీ” ఒకటి. కుస్తీ అనేది ఒక యుద్ధ కళ, వినోద రూపంలో ఉన్న ఒక పోరాట క్రీడ. కుస్తీ పోటీలో నిర్దిష్ట నియమాల పరిధిలో, ప్రత్యర్థితో పెనుగులాడుతూ, వివిధ రకాల విసిరే పద్ధతులు లేదా సాంకేతికత ద్వారా అనుకూలమైన స్థానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కుస్తీకి ఉన్న మరోపేరు మల్లయుద్ధం. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు.
ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. హనుమంతి, జంబువంతి, జరాసంధి, భీమసేని మొదలైనవి. ఒక రాజ్యంలోని మల్లయోధుల సంఖ్యను, వారు సాధించిన విజయాలనుబట్టే ఆ రాజ్య సంపదనూ, కీర్తినీ నిర్ణయించే ఆనవాయితీ అప్పట్లో ఉండేది. రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే సమయంలో, ప్రాణనష్టం నివారించడానికి ఇరు దేశాల వీరుల మధ్య మల్లయుద్ధం నిర్వహించి, గెలిచిన వారికి పీఠం స్వాధీన పరిచిన ఉదంతాలెన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలి, తన సోదరుడైన భరతుడితో మల్లయుద్ధం చేసి విజయం సాధించాడని జైన సాహిత్యం తెలుపుచున్నది.
మల్లయుద్ధం అనేది అత్యంత శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఇందులో పాల్గొనే వారు సరైన పోషక పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి. లేదంటే ఒక్కోసారి ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. పల్నాటి వీరచరిత్రలోని కాటమరాజు కథలో మల్లయుద్ధం ప్రస్తావన ఉంది. మల్లయుద్ధ వీరులను జెట్టీలు అంటారు. తిక్కన తెలుగులో అనువదించిన మహాభారత “విరాటపర్వం” లోనూ మల్లయోధుల గురించి వివరించారు. తాను వ్రాసిన “విరాటపర్వం”లో ఆంధ్రదేశంలో మధ్యయుగ కాలంలో ఉపతాయి, తోరహత్తము, ఒత్తొరువు, జలికి బట్టుట మొదలైన మల్లయుద్ధ విధానాలు వ్యాప్తిలో ఉన్నట్లు వర్ణించాడు. పురుషుల మల్లయుద్ధాన్ని “రెజ్లింగ్” అని, మహిళల మల్లయుద్ధాన్ని “గాఫ్లింగ్” అనీ వ్యవహరిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2015 వ సంవత్సరంలో ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రారంభించింది. ప్రొఫెషనల్ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) రాకతో ప్రస్తుతం ఇదొక క్రీడగా మారింది. అయితే మల్లయుద్ధ సంప్రదాయ నియమాలను మార్చకుండా, కొద్దిపాటి మార్పులు చేసి దానిని వృత్తిపరమైన క్రీడగా రూపొందించారు.
అయితే ఈ మల్లయోధులలో ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదూ, మల్లయోధులు కోడి రామ్మూర్తి నాయుడు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో కోడి రామ్మూర్తి నాయుడు పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు అంతటి బలశాలి ఆయన. ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని అలాగే ఐదు నిముషాల పాటు నిలిపేవారు. రెండు కార్లను ఒకేసారి వాటికి కట్టిన తాళ్ళు తన రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు. ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు కోడి రామ్మూర్తి నాయుడు. నాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, “ఇండియన్ హెర్క్యులెస్” అనే బిరుదును ఆయనకు ప్రసాదించారు. ఇవేగాక మల్ల మార్తాండ, కలియుగ భీమ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా కోడి రామ్మూర్తి నాయుడు సొంతం చేసుకున్నారు.
కోడి రామ్మూర్తి నాయుడు నేపథ్యం…
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా (పాత శ్రీకాకుళం జిల్లా) వీరఘట్టంలో కోడి వెంకన్న నాయుడు, కన్నాంబ దంపతులకు ఏప్రిల్ 1882 లో కోడి రామ్మూర్తి నాయుడు జన్మించారు. తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి. ఆ వంశానికి చెందిన రామ్మూర్తి నాయుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. తన ఐదు సంవత్సరాల వయస్సులో ఇరుగుపొరుగు వారితో కలిసి చిలిపిగా, చలాకీగా ఆటలాడేవారు. కుమారుని అల్లరి పనులు చూసి తండ్రి సహించలేకపోయారు. దాంతో చేసేది లేక తన తమ్ముడు కోడి నారాయణస్వామి (పోలీస్ ఇన్స్పెక్టర్) వద్దకు కొడుకును చదువు కోసం విజయనగరం పంపించారు. అయితే తప్పనిసరియై తన తండ్రి ప్రొద్భలంతో తన పినతండ్రి దగ్గర రామ్మూర్తి నాయుడు పెరిగారు. చిన్నప్పటి నుండి అల్లరి పిల్లవాడిగా పెరిగిన ఆయన కేవలం మూడో ఫారం వరకు మాత్రమే చదివారు.
ఆయన వయస్సు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి తండ్రి చనిపోవడంతో కోడి రామ్మూర్తి అల్లరి మరింత ఎక్కువైపోయింది. విజయనగరంలో ఉన్నప్పుడు ఆయన ఉబ్బసం వ్యాధితో పీడించబడ్డాడు. వ్యాయామం చేస్తే తప్ప తాను కోలుకునే పరిస్థితి లేకపోవడంతో తాను వ్యాయామం చేయడం మొదలుపెట్టారు. తాలింఖానాలో చేరి శరీర వ్యాయామం అభ్యసించారు. కుస్తీ పట్లు అన్నీ నేర్చుకున్నారు. దాంతో పినతండ్రి కోడి నారాయణ స్వామి, తన అన్న కుమారుడు రామ్మూర్తి నాయుడుని మద్రాసులో ఉన్న సైదాపేటలోని వ్యాయామ శిక్షణ కళాశాలకు పంపించారు. అలా ఏడాది శిక్షణ తరువాత వ్యాయామ ఉపాధ్యాయుడిగా ధృవీకరణ పత్రం అందుకుని విజయనగరంలో తాను చదివిన పాఠశాలలో వ్యాయామ శిక్షకుడిగా చేరారు కోడి రామ్మూర్తి నాయుడు.
మద్రాసు లో సర్కస్ ఏర్పాటు చేసి…
ఒకరోజు జమీందారు పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందు ఉన్న పెద్ద కాలువలో ఒక ఎద్దు పడిపోయింది. అది పైకి రావడానికి చాలా అవస్థ పడుతుంటే దానిని బయటికి తీయించడానికి రామ్మూర్తి శెట్టి కొంతమందిని పెట్టి నానా అవస్థలు పడ్డారు. అటువైపుగా వస్తున్న కోడి రామ్మూర్తి నాయుడిని చూసి కొందరు స్నేహితులు అదుగో వస్తాదు వస్తున్నారు బయటకి తీసారు అన్నారు. ఆ సమయంలో రామ్మూర్తి నాయుడు తోకని తన కాళ్ళతో పట్టుకొని దాన్ని రెండు కాళ్లు గట్టిగా పైకి ఎత్తడంతో ఆ ఎద్దు కాలువలో నుండి బయటకు వచ్చేసింది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూసిన జమీందారు పేర్ల రామ్మూర్తి శెట్టి నీవు ధైర్యవంతుడివి, నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి పదిమందికి తెలిసేలా ఆదర్శంగా నిలుపుకోమని ఆశీర్వదించారు. కేవలం తన కండర శక్తితో రెండు కార్లను ఆపడం, తన ఛాతీపై ఏనుగు బరువును తట్టుకోవడం వంటి అతని అసాధారణమైన పరాక్రమాలకు అతను ప్రసిద్ధి చెందారు.
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహాకారంతో, తుని రాజా గారి నుండి సంపూర్ణ సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పారు. కోడి రామ్మూర్తి సర్కస్ సంస్థ తెలుగు రాష్ట్రములో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాలలో ప్రదర్శన పూర్తయిన తరువాత 1912 వ సంవత్సరంలో మద్రాసు చేరారు. రామ్మూర్తి చేసే ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును ఛాతిలోకి విపరీతమైన గాలిని పూరించుకుని గొలుసును ముక్కలు ముక్కలుగా తుంచి వేసేవారు. కారుకు రెండు గొలుసులను కట్టి వాటిని కాళ్ళ సందుల గుండా రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవారు. కారును వేగంతో నడపవనేవారు. దాంతో కారు కదలకుండాపోయేది. అలాగే తన ఛాతి రొమ్ముపై పెద్ద ఏనుగుని ఎక్కించుకుని అయిదు నిమిషాల పాటు రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవారు. ఇలాంటి ప్రదర్శనలను జనాలు తండోపతండాలుగా వచ్చి ఆ ప్రదర్శనలు చూసేవారు.
విదేశాల్లో ప్రదర్శనలు…
లోకమాన్య తిలక్ కోరిక మేరకు పూనాలో ప్రదర్శనలు ఇచ్చారు రామ్మూర్తి నాయుడు. ఆయనకు మల్ల మార్తాండ, మల్లరాజ తిలక్ అనే బిరుదములు ఇచ్చారు లోకమాన్య తిలక్. అదేవిధంగా భారతదేశ ప్రతిభను విదేశాల్లో ప్రదర్శించమని ప్రోత్సహించారు. హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు రామ్మూర్తి నాయుడుకు ఘనసత్కారం చేసి జగదేకవీర అనే బిరుదమిచ్చారు. మద్రాసులో సర్కస్ కంపెనీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత 1600 మంది గల తన బృందంతో కలిసి లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు కోడి రామ్మూర్తి నాయుడు. అయితే ఆ బృందంలో సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్ బక్షీ వుండేవాడు.
కోడి రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి లండన్ రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, తన్మయులయ్యారు. వారు ఆయనను బక్కింగి హామ్ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత ఆయనకు “ఇండియన్ హెర్కులస్” అనే బిరుదంతో సత్కరించారు. దాంతో కోడి రామమూర్తి నాయుడు బ్రిటిష్ రాజదంపతులచే గౌరవింపబడిన భారతీయులలో మొదటి వారయ్యారు. లండన్ లోనే కాకుండా ఆయన జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో పలు రకాల ప్రదర్శనలిచ్చారు. “కోడె పోరాటం” (బుల్ ఫైట్) కు ప్రసిద్ధమైన స్పెయిన్ దేశంలో అలవాటు లేకున్నా బుల్ ఫైట్ లో పాల్గొన్న రామ్మూర్తి నాయుడు అట్టి పోరాటంలో ఎలాంటి అనుభవం లేకున్నా రంగంలో దూకి దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడె చిత్తుగా పడిపోయింది. దాంతో వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆ స్టేడియం మార్మోగిపోయింది. అలాగే జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.
మత్తుమందును (క్లోరోఫామ్) లేకుండా శస్త్ర చికిత్స…
కోడి రామ్మూర్తి నాయుడు విదేశీ ప్రదర్శనలో భాగంగా బర్మాలో వున్న రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. ఆయనంటే గిట్టని కొందరు అసూయగ్రస్తులు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఆ విషయాన్ని పసిగట్టి తన ప్రదర్శనను ఆపి మరుసటి రోజే ఆయన మాతృదేశం వచ్చేశారు. ఆయన అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ కుదరలేదు. భారతదేశం అంతటా రామమూర్తి పేరు ప్రతిధ్వనించింది. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తి నాయుడు పై ప్రశంసలుండేవి. ఆయన పండిత మదన మోహన మాలవ్యా అతిథిగా వెళ్లి సుమారు ఏడాదిపాటు బెనారస్ లో ఉన్నారు. రామ్మూర్తి నాయుడు మాములుగానే శాకాహారి. విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావు (వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాల రచయిత) మల్లయోధులు కోడి రామమూర్తికి ఆప్త మిత్రులు. ఆయనను ప్రశంసిస్తూ “సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి” అన్నారు కాళ్ళకూరి.
మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్రదేశంలో రామ్మూర్తి నాయుడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంతకంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రయత్నం ఫలించలేదు. కీ.శే. మేడేపల్లి వరాహ నరసింహ స్వామి చెప్పిన దానిని బట్టి రామమూర్తి నాయుడు కాలిపై రాచపుండు లేచినందున ఆయన కాలు తీసివేయవలసి వచ్చింది. దాంతో ఆయన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి అలాగే నిబ్బరంగా వుండిపోయారు. కేవలం తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయులు, దేశభక్తులు, “కలియుగ భీమ” అను బిరుదు కలవారు కోడి రామమూర్తి నాయుడు చివరిరోజులలో బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16 జనవరి 1942 నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
ఇతర కథనాలు:
తెలుగు వెండితెరపై తొలి ద్విపాత్రాభినయం చేసిన నటి.. నగరాజకుమారి..
తెలుగు సినిమా రంగానికి ఏకైక స్క్రిప్టు రచన చేసిన విశ్వనాథ సత్యనారాయణ.
తెలుగులో జానపద చిత్రాల నిర్మాణానికి ఆద్యులు.. కాళ్ళకూరి సదాశివరావు..










