Telugu News

సీఎం చంద్రబాబు విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, దేశంలోని ఐఐటీ, ఐఐఎం, నిట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ఈ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో పాటు, కేవలం 4% వడ్డీకే ఇవ్వాలని, ఈ మొత్తాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించాలని తెలిపారు. బీసీ విద్యార్థులకు జేఈఈ, నీట్‌లో మెరుగైన శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి విద్యాసంస్థల మౌలిక వసతులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వసతిగృహాలన్నింటినీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేయాలని, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతోపాటు మరమ్మత్తులను ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

గురుకులాల్లో పరిశుభ్రమైన పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించేందుకు అనుమతి ఇచ్చారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1,700 కోట్లలో సుమారు రూ. 800 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

అన్ని వర్గాలకూ సమన్యాయం జరిగేలా సంక్షేమ ఫలాలు అందరికీ దక్కాలని సీఎం సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదరణ-3 కింద ఇచ్చే పరికరాలు ఆధునికంగా, కులవృత్తులకు ఉపయోగకరంగా ఉండాలని స్పష్టం చేశారు. మైనారిటీల సంక్షేమంపై తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, ఇమామ్‌లు, మౌజమ్‌లకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, హజ్ యాత్ర దరఖాస్తు గడువు పెంచేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టెలు, రాయితీ సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వెనుకబడిన వర్గాల ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. పురోగతిలో ఉన్న నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Show More
Back to top button