NRI NewsTelugu News

అమెరికా వదిలి వెళ్లిపోతే రూ.2.68 లక్షలు ఇస్తాం: ట్రంప్

అమెరికాలో అక్రమ వలసదారులను ఏరివేసేందుకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలతో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా, స్వచ్ఛందంగా దేశాన్ని వీడి వెళ్లేందుకు సిద్ధపడే అక్రమ వలసదారులకు అందించే స్టైఫండ్‌ను భారీగా పెంచింది. గతంలో 1,000 డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ప్రస్తుతం 3,000 డాలర్లకు (సుమారు రూ.2.68 లక్షలు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ఉచిత విమాన ప్రయాణ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అయితే, ఈ ప్రత్యేక ‘హాలీడే ఆఫర్’ ఈ ఏడాది చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.

అక్రమ వలసదారులు ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని భావిస్తే (Self deport), వారు వెంటనే ‘సీబీపీ హోమ్’ (CBP Home) యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ముందుకొచ్చే వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించబోమని, బలవంతపు బహిష్కరణ జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) పేర్కొంది. అంతేకాకుండా, వారిపై గతంలో ఉన్న జరిమానాల నుంచి మినహాయింపు ఇస్తామని వెల్లడించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులపై వేట కొనసాగుతోందని, ఇప్పటికే వందలాది మందిని అరెస్టు చేసి నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నామని యంత్రాంగం హెచ్చరిస్తోంది.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని వినియోగించుకోని పక్షంలో, అరెస్టు మరియు శాశ్వత బహిష్కరణ తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వారు భవిష్యత్తులో తిరిగి అమెరికాకు వచ్చే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని స్పష్టం చేశారు. అనధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడగా, వేల సంఖ్యలో ప్రజలు సీబీపీ యాప్‌ను ఆశ్రయించారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే దాదాపు 1.5 లక్షల మందిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఇక హెచ్‌-1బీ వీసాల కేటాయింపులో కూడా వేతనం ఆధారంగా లాటరీ పద్ధతిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.

Show More
Back to top button