
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. తొలుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. విభజన హామీల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటాకు అనుగుణంగా కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని విన్నవించారు. రాష్ట్ర నీటి భద్రత దృష్ట్యా కేంద్ర-రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సీఎం, ఏపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా రాష్ట్రానికి గరిష్ఠంగా సహాయం అందించాలని విన్నవించారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా (ఉద్యానవన కేంద్రం) తీర్చిదిద్దేందుకు రాబోయే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. అలాగే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.
చివరగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమై రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిపై చర్చించారు. ‘చిప్ టు షిప్’ విజన్‌లో భాగంగా దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఫేజ్-1లో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్రం నుండి రావాల్సిన రూ.590.91 కోట్ల బకాయిలను త్వరగా విడుదల చేయాలని విన్నవించారు. ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.






