GREAT PERSONALITIESTelugu Cinema

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ఆస్థానకవి… దాశరథి కృష్ణమాచార్య…

తెలంగాణ మాగాణుల్లో ఉద్యమాలకు తన కవితల ద్వారా ఊపిరులూది, స్వయంగా ఉద్యమంలో పాల్గొని జైలు గోడల మీద అక్షరమై మెరిసి, నిజాం నిరంకుశ పాలనను తన కవితలతో చీల్చి చండాడిన అద్భుతమైన సాహితీవేత్త, సినీ గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ఆవేశంలో, ఆలోచనలో ఆయన కవితలు కత్తి అంచుపై కదం తొక్కాయి. తన అభ్యుదయ భావాలతో, సమాజంలోని అనేక సమస్యసలపై అలుపెరుగని పోరాటం చేశారు దాశరథి గారు.

సాహిత్యంలో తనదొక విశిష్టమైన శైలి. తన రచనలో వైవిధ్యం, తన గీతాల్లో మాధుర్యం తొణికిసలాడుతుంటుంది. తెలుగు సినిమా పాటలను పరిపుష్టం చేసిన మహాకవుల్లో దాశరథి గారు ఒకరు. ఎటువంటి సాహిత్యమైన దాశరథి గారి కలానికి గులాము కావాల్సిందే.

ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్‌స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా రకరకాల ఉద్యోగాలు చేసారు దాశరథి గారు. సాహిత్యంలో తాను అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. నిజాం రాజు పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయిన దాశరథి గారు పీడిత ప్రజల గొంతుగా మారి నినదించారు.

“రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.

దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్”

అని నిజాము రాజును సూటిగా గద్దిస్తూ రచనలు చేసారు దాశరథి గారు. జీవితంలో, పోరాటంలో, కవిత్వంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా జీవించడం తనకే సొంతం. నిజాం పాలనలో దుర్భేధ్యమైన జైలు జీవితం అనుభవించి, నిజాం పాలన అంతమయ్యాక సినీ కవిగా అందరి అభిమానాలు చూరగొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణను కీర్తించారు దాశరథి కృష్ణమాచార్య గారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    దాశరథి కృష్ణమాచార్య 

ఇతర పేర్లు  :  దాశరథి

జననం    :     22 జులై 1925    

స్వస్థలం   :    చిన్న గూడూరు, వరంగల్ జిల్లా, తెలంగాణ

వృత్తి      :      కవి, రచయిత, వక్త 

తండ్రి    :   వెంకటాచార్యులు 

తల్లి     :   వెంకటమ్మ 

పురస్కారాలు   :    1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి

మరణం  :   05 నవంబరు 1987

నిజాం వ్యతిరేక ఉద్యమం లోకి…

1941 ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్ర మహాసభలు అత్యధిక ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడుతూ హైదరాబాద్ రాష్ట్రాన్ని మద్రాసులో కలపడానికి ప్రయత్నిస్తున్నాయి.  నిజాం రాజు కబంధ హస్తాల నుండి హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడడానికి, వారు (నిజాం రాజు, సామంతులు) చేసే ఆకృత్యాలను ఆపేదిశగా కృషి చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ ఈ రెండు పార్టీలను నిషేధిస్తూ నిజాం రాజు ఫర్మాన జారీ చేయడంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారు అజ్ఞాతంలో ఉండి కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విపరీతమైన కృషి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దాశరథి గారు ఈ ఉద్యమంలోకి వచ్చారు. తాను ఎంత తీవ్రమైన సాహిత్యాన్ని సృష్టించారంటే, ఆ రోజుల్లో అలవోకగా సాహిత్యాన్ని వ్రాస్తుండేవారు. తాను వ్రాసే పద్యాలు, పాటలు అన్నీ కూడా నైజాం రాజుకు వ్యతిరేకంగా ఉండేవి.

అప్పట్లో జనాలు పడుతున్న కష్టాలను ప్రతిబింబించేటటువంటి పద్యాలు, పాటలు, దాశరథి గారు నైజాం రాజుకు వ్యతిరేకంగా వ్రాసినటువంటి గేయాలు ఎంత తీవ్రంగా ఉండేవంటే అప్పట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ల భావాలు, వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా గాని దాశరథి గారి పాటలు మాత్రం తప్పకుండా పాడుకుంటూ ఉండేవారు.  ముఖ్యంగా తీవ్రవాదులు అయితే దాశరథి గారు వ్రాసిన పాటల్ని తాను లేని సమయంలో పాడుకుంటూ ప్రజల్లోకి వెళుతుండేవారు. ఉదాహరణగా “అనాదిగా జరుగుతోంది అనంత సంగ్రామం, ఆగర్భ శ్రీమంతుడికి అనాథుడికి మధ్య”, “రక్తారుణ వైజయంతి, రమ్మన్నది పోతున్నాం రణ జన రణ జన రణ దడ”,  “అనాధకర్షక అభాగ్య కార్మిక అహిత్యేయ మహోజ్వల అరుణ ప్రభతో “, “కారు మేఘములు కరిగిపోయే రా” ఇంత తీవ్రంగా వ్రాస్తుండేవారు.

ఆంధ్ర మహా సభ మొదటి వార్షికోత్సవంలో…

ఒకప్రక్క ఇలా రెచ్చగొట్టే సాహిత్యం వ్రాస్తూనే, మరోప్రక్క నేరుగా ఉద్యమంలో పాల్గొనేవారు. 1944 సంవత్సరంలో దాశరథి గారు అప్పటికే ఉద్యమంలో ప్రవేశించే దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది. “ఆంధ్ర మహాసారస్వత పరిషత్” మొదటి వార్షికోత్సవం వరంగల్ లో జరిగినప్పుడు అనేకమంది సాహితీవేత్తలు, చాలా మంది కవులు అక్కడికి వచ్చారు. ఆ కార్యక్రమం కోసం వేసిన పందిళ్లను రజకారులు తగలబెట్టారు. దాశరథి, దేవులపల్లి రామానుజ రావు గార్ల లాంటి వారు వేదికపై ఉన్నారు. ఒకవైపు మంటలు చెలరేగుతుంటే జనాలు భయంతో అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. తెలుగు భాష సంరక్షకులు, కవులు వేదికపై ఉన్నారు. ఎదురుగుండా మంటలు చెలరేగుతున్నాయి, వారి కాళ్లకు వేడి తలుగుతుంది.

అయినా కూడా వారెవ్వరూ వేదిక దిగడానికి సిద్ధపడలేదు. ఈ జ్వాలలో నైనా అహుతి అవుతాము గాని, కవి సమ్మేళనం మాత్రం జరిపే తీరుతాము అని ఎలుగెత్తి చాటిన వాళ్ళలో దాశరథి గారు కూడా ఒకరు. ఆ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు కూడా ఒక పక్క మూలకు నిలబడి అంతా గమనిస్తూనే ఉన్నారు. అంత తీవ్రమైన పరిస్థితులలో దాశరథి గారు తాను వ్రాసిన పద్యాలు చదువుతునే ఉన్నారు. “ఓ పరాధీన మానవా ఓపరాని దాస్యము విదల్చలేని శాంతము మాని తలుపులను ముష్టిబంధాన కలచివేసి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురమ్ము” అని ధారాళంగా అశోక పద్యాలను చదవడం మొదలుపెట్టారు. అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి గారు దాశరథి గారి ధైర్యాన్ని చూసి సింహగర్జన చేశావు నాయనా అని మెచ్చుకున్నారు. అప్పటికి దాశరథి గారి వయస్సు 19 సంవత్సరాలు.

అది చూసి వేదిక మీదున్న మిగతా కవులు కూడా విజృంభించారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న రజాకార్లు వారిపై రాళ్లు వేయడం ప్రారంభించారు. అందులో ఒక రాయి వచ్చి అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి గారి మీద పడింది. దాంతో తాను “ఇవి రాళ్లు కాదు పువ్వులు”, మీరు చదవండి అన్నారు. ప్రజలు వేదిక దగ్గరకు వస్తున్నారు, పడే రాళ్ళను ఆపుతున్నారు, రజాకార్లను ఎదుర్కొంటున్నారు. ఇంత బీభత్సమైన భయానక వాతావరణంలో రజాకార్లు వెనుదిరిగి వెళ్ళిపోయారు. సగం కాలుతున్న పందిళ్ళలో ఇంత మంది జనావాహిని మధ్య దాశరథి గారు విప్పిన గళం ముందు కవులందరూ కూడా తమ తమ కవితలతో ఆ సభను కొనసాగించారు.

మహాత్మాగాంధీ జిందాబాద్ నినాదంతో…

భారతదేశానికి స్వతంత్ర్యం తీసుకురావడం, తెలుగువారి కి ఒక ప్రత్యేకమైన భాషా ప్రాతిపదిక రాష్ట్రం తీసుకురావడం. ఈ రెండు అంశాలపై పోరాడడం కోసమే 1913లో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవాలు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే కార్యకర్తలు అందరూ కలిసి వరంగల్ లో ఒక చోట కలుసుకున్నారు. 1944 ప్రాంతంలో వరంగల్ జిల్లా మానుకోట తాలూకా జయ్యవరం అనే గ్రామంలో “ఆంధ్ర మహాసభ” కార్యకర్తలు ఒక సభ నిర్వహించారు. ఆ సభను “నిజాం మురాదాబాద్” అని మొదలుపెట్టారు. ఇది విన్న దానికి దాశరథి గారు నిజాం రాజు ఎలాగూ పోతారు. సభను ఆదిలోనే ప్రతికూలాత్మకంగా మొదలు పెట్టడం బాగాలేదని, “మహాత్మాగాంధీ జిందాబాద్” అనే నినాదంతో సభను ప్రారంభింపజేశారు.

ఆ తర్వాత పిల్లలందరూ వేదిక మీదికి వచ్చి దాశరథి గారు వ్రాసిన ఒక పాట పాడారు. “పల్లెటూరి ప్రజలనంతా కొల్లగొట్టిన నిజామోడ, కింగ్ కోటి మీద రేపే రంగు జెండా ఎగురు లేరా” అనే పాట పాడారు. నిజాం రాజు హైదరాబాదులోనే ఉండేవారు. వారికి సామంతులుగా ఉన్న జమీందారులు చిన్న చిన్న ఊర్లలోనే ఉండేవారు. ఆ సభ ముగిసే సమయానికి అర్ధరాత్రి అయ్యింది. జయ్యవరం ప్రక్కనే గూడూరు అనే గ్రామం ఉంది. అక్కడ దాశరథి గారి అమ్మమ్మ, తాతయ్య లు ఉండేవారు. వారిని కలుద్దామని రెండు మైళ్ళు నడుచుకుంటూ తెల్లవారే సమయానికి దాశరథి గారు గూడూరు చేరుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ వడ్డించిన భోజనం చేస్తూ సగంలో ఉండగా ఆ వూరి జమీందారు గారి ఆజ్ఞ మేరకు వచ్చిన పోలీసులు దాశరథి గారిని అరెస్టు చేసి పక్కన ఊరిలో వున్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుండి ఉదయం జమీందారు గారి బంగ్లాకు దాశరథి గారిని తీసుకువచ్చి కాల్చి చంపాలనేది ప్రణాళిక. కానీ మర్నాడు పోలీసులు నెల్లికుదురుకు లోని పట్టణ పోలీస్ స్టేషన్ కు  తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకుని…

ఆ స్టేషను యొక్క ఉన్నత అధికారి పెద్ద క్రూరుడు. దాశరథి గారి జేబులో ఉన్న కవితను తీసి చూసిన ఆ అధికారికి దాశరథి గారిపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దాంతో దాశరథి గారికి చేతికి ఉన్న బేడీలు, నడుముకున్న తాడును విప్పదీసి జమిందారు ఇంటికి పంపకుండా వరంగల్ జైలుకు తీసుకెళ్ళమని పోలీసులకు ఆదేశించారు. ఆ స్టేషన్ కు సబ్ ఇన్స్పెక్టర్ కూతురు, అల్లుడు వచ్చేసరికి వారికి మర్యాదలు చేసే హడావిడిలో పోలీసులు ఉండగా దాశరథి గారు పోలీస్ స్టేషను నుండి తప్పించుకుని అడవుల గుండా పారిపోయినారు. “ఏ పొలమున నిరుపేదకు దొరకదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి” అనే ఇక్బాల్ అహ్మద్ వ్రాసిన కవితల్ని చదువుకుంటూ అడవుల గుండా వెళుతూ నాగారం అనే ఊరిలోకి చేరుకున్నారు. అక్కడ తన మిత్రులు కలిసి అడవుల గుండా నడిచి నడిచి అలసిపోయిన తనకి చికిత్స చేయించారు.

అజ్ఞాతం లో ఉన్నా ఆపని పోరాటం…

దాశరథి గారు అజ్ఞాతంలో ఉండి సుమారు మూడు సంవత్సరాల పాటు నైజాం వ్యతిరేక కార్యక్రమాలపై పనిచేస్తూ వచ్చారు.  స్వాతంత్ర్యం రావడానికి ముందే అరెస్టై జైలులో 16 నెలల పాటు ఉండి తీవ్రమైన, దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు.  1947లో నిజాం రాజు మతమార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వామి రామానంద తీర్థ గారి నాయకత్వానికి అజ్ఞాతంలో ఉన్న దాశరథి గారు మద్దతుగా నిలిచారు. తన సాహిత్యంతో ఎంత ఘాటుగా విమర్శిస్తూ వ్రాసేవారంటే “ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను, కదం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను, దగా కోరు బడా చోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళకు ఊళ్ళు అట్టి పెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి, తల్లి పిల్ల కడుపు కొట్టి మెక్కిన దుర్మార్గమంతా నీ బాధ్యత, కోటిన్నర నోటి వెంట పాటలుగా మాటలుగా, దిగిపొమ్మని దిగిపొమ్మని ఈ మాట అనేస్తాను” అని వ్రాస్తుండేవారు.

జైలు జీవితం…

చిట్ట చివరకి 1947 ఏప్రిల్, మే ప్రాంతంలో దాశరథి గారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మొట్టమొదటిసారిగా తనని వరంగల్ జైల్లో పెట్టారు. సుమారు 16 నెలల పాటు జైల్లోనే మగ్గిపోయారు. అక్కడ దెబ్బలు తిన్నారు. ఆరోగ్యం దెబ్బతింది. ఒళ్లంతా రక్తం బీభత్సం. జైల్లో ఉండి కూడా బొగ్గుతో జైలు గోడల మీద కవిత్వం వ్రాసేవారు. “ఓ నిజాము పిశాచము కానరాడు నిన్ను పోలిన రాజు మాకు ఎన్నడేని, తీగలను తెంపి అగ్గిలోకి దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని వ్రాసేవారు. మరునాడు జైలు గోడలను శుభ్రపరిచే వారు. వాటిని మళ్ళీ తన వ్రాస్తుండేవారు. వీరికి జైల్లో ఎప్పుడో ఒక్కసారి వరి అన్నము పెట్టేవారు. ఉడికీ ఉడకని జొన్న రొట్టెలు పెట్టేవారు. ఖైదీల ఆరోగ్యం చెడిపోవాలని జొన్న రొట్టెలలో సిమెంట్ కలిపి రొట్టెలను కాల్చి ఇచ్చేవారు. దాంతో దాశరథి గారి జీర్ణకోశం కూడా దెబ్బతింది.

నిజామాబాదు జైలుకు…

ఏడు నెలలు జైలు జీవితం గడిచినాక 1947 డిసెంబరు ప్రాంతంలో 30 మందిని వేరే జైలుకు తరలిస్తూ రాత్రి 10 గంటలకు చలిలో వ్యానులో ఎక్కించారు. ఆ చలిలో “చలిగాలి పలుకు వార్తలు చెలి గాలిని పోలి వలపు చిరు వెచ్చదనంబు గుండెలలో నింపెను చెలికాడా జైలు బయట చిత్తం అలరెన్” అనే పద్యంతో వరుసగా 30 పద్యాలు చెప్పారు. ఆ ఖైదీల వ్యానును కాజీపేట రైల్వే జంక్షన్ వద్ద ఆపి వాళ్ళందరినీ రైలులో ఎక్కించారు. ఆ సమయంలో కూడా దాశరథి గారు “చలిగాలి పీల్చి చెలి కౌగిలిలో శయనించినట్లు కేవల భావోజ్వల వీధులలో పయనించగ వినిపించగనేల భీతి విడుము మిత్రా” అనే పద్యం చెప్పారు. ఆ రైలు నిజామాబాదులో ఆగింది. ప్లాట్ ఫామ్ మీద వరుసగా 30 మంది ఖైదీలను నిలబెట్టి ఉండగా వారు “వందేమాతరం” అంటూ నినాదాలు చేయడం చూసి అక్కడ ఉన్న మహిళలు ఖైదీల మీద పూలు చల్లారు. వారికి పండ్లు ఇచ్చారు. కొందరు మహిళలు వారికి వీర తిలకం దిద్దారు.

హైదరాబాదు జైలుకు…

వారిని అక్కడ నుండి నిజామాబాద్ జైలుకు తీసుకెళ్లే క్రమంలో నిజామాబాదు రైల్వే స్టేషన్ నుండి జైలుకు మధ్య రెండు మైళ్ళ దూరం ఆ 30 మంది ఖైదీలను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ కొట్టే క్రమంలో వారి పెదాలు పగిలి రక్తం కారుతుంటే తమ చేతిలో ఉన్న పేపర్లతో రక్తం తుడుచుకున్నారు. ఆ నిజామాబాదు జైల్లో 700 మందిని రాజకీయ ఖైదులు ఉండేవారు. ఆ నిజామాబాదు లో రెండు నెలలు ఉంచి తర్వాత వీరిని హైదరాబాదుకు మార్చారు. 8 నెలల అష్ట కష్టాలు పడ్డారు. సెప్టెంబర్ 1948 లో నిజాం రాజు హైదరాబాదుని భారతదేశంలో కలిపేయడానికి ఒప్పుకోవడం, భారత సైన్యం హైదరాబాదులో ప్రవేశించడం, నిజాం రాజును బంధించడం, ఆ తర్వాత హైదరాబాదుని భారతదేశంలో కలపడం జరిగిపోయాయి. 17 సెప్టెంబర్ 1948 లో హైదరాబాదును కలిపేశారు. ఆ సందర్భంగా వీళ్ళందరినీ విడుదల చేసినారు. దాశరథి గారు ఏప్రిల్ 1947లో మొదలుకొని 1948 సెప్టెంబరు వరకు 16 నెలలు జైలులోనే మగ్గిపోయారు. దాశరథి గారు 1941 నుంచి 1948 వరకు నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

చిత్ర రంగ ప్రవేశం…

1952లో హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి  ఈవినింగ్ కళాశాలలో చేరిన దాశరథి గారు “ఇంగ్లీష్ లిటరేచర్” లో బి.ఏ పట్టా తీసుకున్నారు. తాను కొన్ని రోజులు గ్రామీణ అభివృద్ధి పంచాయతీ అధికారి గా పని చేశారు. ఆ తర్వాత 1956 లో తనకు ఆకాశవాణి లో ఉద్యోగం వచ్చింది. 1956 నుండి 1963 వరకు హైదరాబాదు లోనూ, 1963 నుండి 1971 వరకు మద్రాసులోనూ ఆకాశవాణి లో పనిచేశారు. ఆకాశవాణి లో పనిచేస్తూ అదే పని మీద మద్రాసు కు వెళ్తుండేవారు. తాను అజ్ఞాతంలో ఉన్నప్పుడు పరిచయం అయిన మిత్రులు, రచయిత ఆరుద్ర గారు 1959 లో సినీ వాలీ అనే పుస్తకం వ్రాశారు. దానికి మిత్రులు దాశరథి గారిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో దాశరథి గారి ప్రసంగం లోని కవితాధార ను అక్కినేని నాగేశ్వరావు గారు, దుక్కిపాటి మధుసూదన రావు గారు విన్నారు. దాశరథి గారు వ్రాసిన “గాలిబ్ గీతాల” ను అక్కినేని గారికి అంకితం ఇస్తూ హైదరాబాదులో ఏర్పాటు చేసిన సభలో అక్కినేని గారు దాశరథి గారికి ఒక పెన్నును బహుకరించారు.

తొలి అవకాశం…

దాశరథి గారి కవితధార ను గమనించిన దుక్కిపాటి మధుసూదన రావు గారు దాశరథి గారికి “ఇద్దరు మిత్రులు” సినిమాలో పాటలు వ్రాయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆత్రేయ గారు తాను తీస్తున్న “వాగ్దానం” సినిమాకు దాశరథి గారిని పాటలు వ్రాయడానికి ఒప్పించారు. దాశరథి గారు మొదట పాటలు వ్రాసిన సినిమా “వాగ్దానం” అయితే, ముందుగా విడుదలైన చిత్రం “ఇద్దరు మిత్రులు”. ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా, దాశరథి గారు “ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా” అనే పాటను చాలా తొందరగా వ్రాశారు. ఇది గమనించిన సాలూరు రాజేశ్వరరావు గారు దాశరథి గారిని అఖండుడు అని మెచ్చుకున్నారు.

“ఇద్దరు మిత్రులు” లో “నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే” అనే కవాలి పాటను దాశరథి గారు వ్రాశారు. 1960లో దాశరథి గారు చిత్ర రంగ ప్రవేశం చేసినాక 1980 వరకు దాదాపు 600 పాటలు వ్రాశారు. తాను వ్రాసిన పాటలు తక్కువే అయినా ఎక్కువ శాతం ప్రజాదరణ పొందాయి. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో (రంగులరాట్నం), నన్ను పాలింపగ నడచీ వచ్చితివా (బుద్ధిమంతుడు) లాంటి భక్తి గీతాలు చాలా వ్రాశారు. ఆవేశం రావాలి ఆవేదన కావాలి (మనసు మాంగళ్యం) సినిమాలో శ్రీశ్రీ గారి మార్కు పాటను వ్రాశారు దాశరథి గారు.

పదండి ముందుకు, కాలం మారింది సినిమాలలో విప్లవ గీతాలు వ్రాసే అవకాశం వచ్చింది. అలాగే ఎన్నో చక్కటి యుగళ గీతాలు వ్రాశారు. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే (ఆత్మీయులు), వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమ ఘుమలు (మనసు మమత), ఆదుర్తి సుబ్బారావు గారి చివరి సినిమా “మహాకవి క్షేత్రయ్య” లో “జాబిల్లి చూసెను నిన్ను నన్ను” లాంటి యుగళగీతాలు వ్రాశారు. దీపాలు వెలిగె పరదాలు తొలగె ప్రియురాలు పిలిచె రావోయీ (పునర్జన్మ), నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకు ఇవ్వాలి (ఇద్దరు మిత్రులు), అందాల ఈ రేయి నీతోనే (లేత మనసులు) లాంటి కవాలి పాటలు వ్రాశారు. కుటుంబ బాంధవ్యాల గురించి “అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం” (ఆడపడుచు), బాపు వినరా అన్నదమ్ముల కథ ఒకటి (పండంటి కాపురం) లాంటి చక్కటి పాటలు వ్రాశారు.

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే (ఆత్మీయులు), పాడెద నీ నామమే గోపాల (అమాయకురాలు), నేనే రాధనోయి గోపాల (అంతా మనమంచికే), “వేణుగానలోలుని గన వేయికనులు చాలవులే” (రెండు కుటుంబాల కథ), మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన (జమీందారు గారి అమ్మాయి) లాంటి పాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా అనేక హిట్ పాటలను 1980 వరకు చాలా చక్కగా వ్రాస్తూ వచ్చారు దాశరథి గారు. సినిమాల్లోకి రాకముందు సి.నారాయణ రెడ్డి గారితో పూల పాటలు, తేనె పాటలు అన్నీ లలిత గేయాలు వ్రాశారు. దాశరథి గారు ఒక్కరే నవమంజరి అనే గేయాలు కూడా వ్రాశారు.

ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవిగా….

ఇవి కాక 32 సంపుటాలు వ్రాశారు. తాను వ్రాసిన గాలిబ్ గీతాలకు ఉత్తమ అనువాద గ్రంథం బహుమతి వచ్చింది. 1965లో “కవిత పుష్పకం” అనే కవితా సంపుటికి “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు” వచ్చింది. “తిమిరంతో సమరం” కవితకు “కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు” (1974) వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు “కళాప్రపూర్ణ” బిరుదు ఇచ్చారు. ఆగ్రా విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డి.లిట్ ఇచ్చారు. 15 ఆగస్టు 1977 నాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు దాశరథి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థానకవిగా నియమించారు. ఆ పదవిలో 1977 నుండి 1983 వరకు కొనసాగారు. 1983లో నందమూరి తారకరామారావు గారు ఆస్థాన కవి పదవిని రద్దు చేసే వరకు ఆ పదవిలో దాశరథి గారు కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ఆస్థాన కవి కూడా దాశరథి గారే.

దాశరథిని మెచ్చిన వేటూరి…

దాశరథి గారి దస్తూరిని వర్ణిస్తూ వేటూరి గారు “ఆకుపచ్చని సిరాతో, లేత కొత్తిమీర ఆకుల వంటి అక్షరాలతో, ధీమాగా నిలిచే తలకట్టుతో, ఆయన తెలుగు అక్షరాలను కనువిందు చేసేవి” అని వేటూరి గారు వ్రాశారు. దాశరథి గారి జన్మదినానికి వేటూరి గారు “కవితాశరథికి నవయుగ కవి దాశరథికి నిత్య కళ్యాణమగున్, రవికుల దాశరథికి వలె మా కవికుల దాశరథి పరిధి కడలి కొలనులన్” అని వేటూరి గారు ఒక పద్యం చెప్పారు. దానికి దాశరథి గారు వెంటనే కృతజ్ఞతా భావమును తెలుపుతూ “ఎందరు లేరు మిత్రులు మరెందరు లేరు సాహితుల్ హితుల్ చందురు వంటి చల్లనయ సాహితీ సౌహి వృద్ధగొన్నవారెందరు అందరూ దిగచి ఈ కవిడెందము మా సుందర రామమూర్తికి సుందరలో ఉపమానమున్నది” అని వేటూరి గారికి ఒక ఉత్పలమాల పద్యం చెప్పారు.

శివైక్యం…

దాశరథి గారు జీవిత మలి దశలో అనారోగ్యంతో చాలా రోజులు బాధపడ్డారు. పది రోజులు పూర్తిగా ఆసుపత్రిలో ఉన్నారు. ఇంటికి వస్తాను, మళ్ళీ ఎప్పటిలానే సాహిత్యం వ్రాస్తానని తన తమ్ముడుతో చెప్పారు. చనిపోయే రోజు కూడా ఆయన పొద్దున్నే రక్త పరీక్షకు వెళ్లొచ్చారు. రెండు ఇడ్లీలు తిని కాసేపు నిద్రపోయారు. మళ్ళీ నిద్ర లేచి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నారు. బాత్రూం కి వెళ్లారు. బాత్రూం లో నీళ్ల బకెట్ మీద పడిపోయారు. ఆ శబ్దం విన్న వాళ్ళ అమ్మాయి నాన్న నాన్న అని లోపలికి వెళ్ళారు. ఆమె వెళ్లేసరికి విగతజీవి గా పడివున్నారు. 05 నవంబరు 1987 కార్తీక పౌర్ణమి నాడు దాశరథి గారు శివైక్యం చెందారు.

“మా అన్నయ్య మృత్యువుని గెలిచిన మహాయోధుడు. అగ్నిధార లో ఉన్నాడు, రుద్రవీణ లో ఉన్నాడు, తిమిరంతో సమరంలో ఉన్నాడు. గాలిబ్ గీతాలలో ఉన్నాడు,  మిత్రులందరిలో ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, ఉంటాడు, ఉండి తీరుతాడు” అని వాళ్ళ తమ్ముడు గారు చెప్పారు. రాజకీయ పోరాటంలో ముందు వరుసలో ఉండి పోరాడి, ఆ పోరాటాన్ని దాశరథి గారు అణువణువునా ఆవహించుకొని ఆ స్ఫూర్తితో ఎన్నో కవితలు వ్రాసినటువంటి కవిగా, చక్కటి సినిమా పాటలు వ్రాసిన కవిగా మనందరి హృదయాలలో దాశరథి గారు కలకాలం నిలిచిపోతారు.

ఆయన పాట తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతుంది. పాటలు వ్రాసినందుకు చాలా మందికి వచ్చినటువంటి ప్రాచుర్యం తనకు రాకపోవచ్చు. కానీ తన పాటలు శ్రోతల హృదయాలలో, తన కవితలు అభిమానుల హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.

Show More
Back to top button