
ప్రపంచ దేశాల అగ్రనేతలు, కుబేరులు మరియు సెలబ్రిటీల ముసుగులను తొలగిస్తూ ‘జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్’ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాల పాటు సాగిన మైనర్ల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల వెనుక ఉన్న భయంకరమైన నిజాలను ఈ రహస్య కోర్టు పత్రాలు బహిర్గతం చేశాయి. అసలు ఏంటి ఈ ఎప్స్టీన్ ఫైల్స్? చివరికి ఏమైంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? సామాన్యుడి నుండి బిలియనీర్ వరకు
జెఫ్రీ ఎప్స్టీన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే ఒక పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే, అతని అసాధారణ తెలివితేటలు, మాటకారితనం అతన్ని వాల్ స్ట్రీట్ ప్రపంచానికి పరిచయం చేశాయి. తక్కువ కాలంలోనే బిలియనీర్ల డబ్బును మేనేజ్ చేసే స్థాయికి ఎదిగి, తనకంటూ ఒక రహస్య ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. న్యూయార్క్, పారిస్ వంటి నగరాల్లో విలాసవంతమైన భవంతులు, ప్రైవేట్ జెట్ విమానాలు, చివరికి కరీబియన్ సముద్రంలో ‘లిటిల్ సెయింట్ జేమ్స్’ అనే ఒక సొంత ఐలాండ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రపంచం అతన్ని ఒక గొప్ప ఫైనాన్షియర్‌గా చూస్తున్నప్పుడు, ఆ వెనుక ఒక భయంకరమైన నేర ప్రపంచం దాగి ఉందన్న విషయం ఎవరూ ఊహించలేదు.
చీకటి సామ్రాజ్యం
ఎప్స్టీన్ తన అధికారాన్ని, డబ్బును ఉపయోగించి వందల మంది మైనర్ అమ్మాయిలను లోబరుచుకున్నాడు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన, చదువుకునే చిన్న పిల్లలను టార్గెట్ చేసి, ‘మసాజ్’ చేస్తామని చెబితే గంటకు భారీగా డబ్బు ఇస్తామని ఎర వేసేవాడు. ఈ క్రమంలో అతనికి కుడిభుజంగా గిస్లేన్ మాక్స్వెల్ (Ghislaine Maxwell) వ్యవహరించింది. ఈమె ఆ అమ్మాయిలను నమ్మించి, ఎప్స్టీన్ దగ్గరకు చేర్చేది. ఒకసారి ఆ వలలోకి వచ్చాక, వారిని తన ప్రైవేట్ ఐలాండ్‌కు తీసుకెళ్లి, అక్కడ వారి పాస్‌పోర్ట్‌లు, ఫోన్లు లాక్కుని బానిసలుగా మార్చేవాడు. అక్కడ ఆ పసిపిల్లలపై ఎప్స్టీన్ మరియు అతని స్నేహితులు దారుణమైన లైంగిక అకృత్యాలకు పాల్పడేవారు.
‘లిటిల్ సెయింట్ జేమ్స్’ – పాపాల దీవి రహస్యాలు
ఎప్స్టీన్కు చెందిన సొంత ఐలాండ్ ‘లిటిల్ సెయింట్ జేమ్స్’ను స్థానికులు ‘పాపాల దీవి’ (Island of Sin) అని పిలిచేవారు. అక్కడ అతను ఒక వింతైన ఆలయం లాంటి భవనాన్ని నిర్మించి, దాని కింద అండర్ గ్రౌండ్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. ఆ ఐలాండ్‌లో చట్టం, పోలీసులు ఉండరు; కేవలం ఎప్స్టీన్ మాటే శాసనం. అక్కడ జరిగే అరాచకాలు బయటకు తెలియకుండా కట్టుదిట్టమైన భద్రత ఉండేది. కేవలం ఎప్స్టీన్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులకు కూడా ఆ ఐలాండ్ ఒక హాలిడే స్పాట్‌గా ఉండేది. అక్కడ ఆ పెద్ద మనుషుల కోసం అమ్మాయిలను సప్లై చేయడమే కాకుండా, వారు చేసే పనులను సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎప్స్టీన్ వాడుకునేవాడని కొన్ని కథనాలు తెలియజేస్తున్నాయి.
ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? అవి ఎలా బయటపడ్డాయి?
2019లో ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాక (దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి), అతని కేసు ముగిసిందని అందరూ భావించారు. కానీ, 2024 ఆరంభంలో కోర్టు ఆదేశాల మేరకు వేల పేజీల డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాయి. ఇవే ‘ఎప్స్టీన్ ఫైల్స్’. ఇవి ఎప్స్టీన్ డైరీ కాదు. బాధితురాలు వర్జినియా జుఫ్రీ ఒకప్పుడు గిస్లేన్ మాక్స్‌వెల్‌పై వేసిన కేసులోని కోర్టు పత్రాలు. ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచబడిన ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ నెట్‌వర్క్‌లో ఉన్న సుమారు 150 నుండి 180 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు బయటకు రాగానే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే అందులో ఉన్నవి సామాన్యుల పేర్లు కాదు.
రాజవంశం నుండి అధ్యక్షుల వరకు
ఈ ఫైల్స్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన పేరు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూ (Prince Andrew). బాధితురాలు వర్జినియా ఇచ్చిన సాక్ష్యం ప్రకారం, ప్రిన్స్ ఆండ్రూ తనను వేర్వేరు ప్రాంతాల్లో లైంగికంగా వాడుకున్నాడని ఆధారాలతో సహా బయటపడింది. దీనివల్ల ఆయన తన రాజరిక హోదాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలాగే అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పేరు కూడా ఈ పత్రాల్లో అనేకసార్లు ప్రస్తావించబడింది. క్లింటన్ ఎప్స్టీన్ ఐలాండ్‌కు వెళ్లేవాడని, చిన్న వయసు అమ్మాయిల పట్ల అతనికి ఆసక్తి ఉందని ఎప్స్టీన్ అన్నాడని సాక్షులు పేర్కొన్నారు. ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, మెజిషియన్ డేవిడ్ కాపర్ ఫీల్డ్ వంటి పేర్లు కూడా ఈ ఫైల్స్‌లో కనిపించడం సంచలనం సృష్టించింది.
డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్ మధ్య సంబంధం
ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రస్తుత రాజకీయ నాయకుడైన డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. 1980, 90వ దశకాల్లో ట్రంప్ మరియు ఎప్స్టీన్ చాలా సన్నిహితంగా ఉండేవారని, కలిసి పార్టీలు చేసుకునేవారని ఆధారాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్వయంగా ఎప్స్టీన్ను ‘టెర్రిఫిక్ గాయ్’ అని పొగుడుతూ, అతనికి కూడా తనలాగే అందమైన అమ్మాయిలంటే ఇష్టమని, అందులోనూ చిన్న వయసు అమ్మాయిలను మరింత ఇష్టపడతాడని అనడం గమనార్హం. అయితే, బాధితుల సాక్ష్యం ప్రకారం ట్రంప్ ఆ ఐలాండ్‌కు వెళ్లినట్లు లేదా నేరాల్లో పాల్గొన్నట్లు నేరుగా ఆధారాలు లభించలేదు. 2004లో ఆస్తి గొడవ కారణంగా వీరిద్దరూ విడిపోయారు. కానీ వారి మధ్య దశాబ్దాల కాలం ఉన్న స్నేహం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సైకాలజీ మరియు న్యాయం
ఈ కేసు కేవలం ఒక సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు. అధికారం మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుందనేదానికి నిదర్శనం. ‘హెడానిక్ అడాప్టేషన్’ అనే సైకాలజీ ప్రకారం, అపరిమితమైన అధికారం, డబ్బు ఉన్నవారికి సాధారణ ఆనందాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. అప్పుడు వారు మరింత షాకింగ్, నిషేధిత పనుల వైపు మొగ్గు చూపుతారు. ఎప్స్టీన్ మరణం వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు ఉన్నప్పటికీ, గిస్లేన్ మాక్స్‌వెల్‌కు 20 ఏళ్ల శిక్ష పడటం బాధితులకు కొంత ఊరటనిచ్చింది. ఈ ‘ఎప్స్టీన్ ఫైల్స్’ మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఎంతటి శక్తివంతులైనా తమ పాపాలను ఎక్కువ కాలం దాచలేరు. నేటి డిజిటల్ యుగంలో చీకటి నిజాలు ఏదో ఒక రోజు వెలుగులోకి రాక తప్పదు..










