Telugu Featured NewsTelugu Politics

మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే: చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు.. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మార్చే కీలక తరుణమిదని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలని తెలిపారు. 

వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని చెప్పారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. కేంద్ర సహకారం కూడా రాష్ట్రానికి అవసరమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల మేలు కోసమే తాము కూటిమిగా ఏర్పడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమకు అండగా నిలబడాలని కోరారు. ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానిలు ఉన్నారని.. వారు తమను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బందరు అభివృద్ధికి ఏం చేశారో చెప్పే ధైర్యం వారికి ఉందా? అని ప్రశ్నించారు. బందరు అభివృద్ధి బాధ్యత తమదేనని చంద్రబాబు వెల్లడించారు. 

అలాగే, రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. కచ్చితంగా రానున్నది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కచ్చితంగా నూతన శకానికి నాంది పలుకుతారనే నమ్మకం ఉందని బాలకృష్ణ ఆశా భావం వ్యక్తం చేశారు.

మచిలీపట్నంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ ఆకు రౌడీలకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. జగన్‌కు గాయమైతే వైసీపీ నాయకులు రాష్ట్రానికి గాయమైందని అంటున్నారు, మరి యువతకు ఉపాధి లేకపోతే గాయం కాదా? అని ప్రశ్నించారు. సొంత బాబాయ్‌నే వదిలిపెట్టలేదని, సొంత చెల్లి వ్యక్తిత్యాన్ని రోడ్లపై పెట్టాడంటూ ధ్వజమెత్తారు. చెల్లిని గోడకేసి కొట్టిన వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ల్యాండ్, శాండ్ మాఫియా చేసి ప్రజలను దోచుకున్నారని విరుచుకుపడ్డారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని షర్మిల వ్యాఖ్యానించారు.

Show More
Back to top button