
ఈ భూమి మీద నిర్మాణాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది పునాది. ఇది నిర్మాణపు బరువును భూమిలోనికి పంపిస్తుంది. పునాదులు రెండు రకాలుగా చెప్పవచ్చును. లోతు తక్కువ పునాదులు, లోతైన పునాదులు. భూమి లోపల ఎంత లోతులో పునాదులు ఉంటే, వాటి పైన కట్టే భవంతులు కూడా అంతే ధృడంగా ఎల్లకాలం ఉంటాయి. భూమి పైన ఏ కట్టడం నిర్మించాలన్నా కూడా వాటికి బలమైనవి పునాదులే. ఈ రోజులలో పునాదులను కంకర రాళ్ళు, ఇసుక, సిమెంటు, కాంక్రీటు వేసి బలంగా నిర్మిస్తున్నారు. సిమెంటు లాంటివి దొరకని ఆ రోజులలో సున్నం, పుట్ట మట్టి, ఇసుక, కంకర రాళ్ళు మొదలగునవి ఉపయోగించి కట్టడాలను నిర్మించేవారు. పునాది లేకుండా ఏ కట్టడం కట్టినా కూడా అది ఎక్కువ రోజులు ఉండకుండా ఏ వర్షాలకో, వరదలకో, ప్రకృతి వైపరిత్యాలకో నేలమట్టం అవుతుంది.
ప్రాచీన కాలంలో కట్టిన దేవాలయాలు కూడా ఇంచుమించు ఇదేవిధంగా పునాదులతో నిర్మించేవారు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలంలో హిందూ, బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. అప్పటి రాజులు, చక్రవర్తులు ఎన్నో ఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. అప్పట్లో ఎక్కువగా రాతి కట్టాడాలే కనుక, వాటి నిర్మాణాలలో ఇసుక, రాయి, సున్నం వంటి వాటితో దేవాలయ నిర్మాణాలు చేపట్టారు. అయితే కొందరు రాజుల కాలంలో ఆలయాలకు పునాదులు లేకుండా నేలను గట్టిపరిచి, భూమట్టం పై నుండే నిర్మించేవారు. తూర్పు చాళుక్య, కళ్యాణి చాళుక్యుల కాలంలో కూడా పునాదులు లేకుండానే ఆలయాలు నిర్మించారు. కానీ క్రీ.శ. 2 వ శతాబ్దం ముందు నుండే దేవాలయాలకు పునాదులు నిర్మించడం విశేషం అని చెప్పవచ్చు. దేవాలయ పునాదులకు సంబంధించి కృష్ణా – తుంగభద్ర నదుల సంగమ స్థానమైన కూడలి సంగమేశ్వర ఆలయం అరుదైన ఆధారాలను అందించింది.
సంగమేశ్వర దేవాలయం…
సంగమేశ్వర దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. ఇది కృష్ణా నది, భవనాసి నదుల సంగమం వద్ద “ముచ్చుమర్రి” సమీపంలో, శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సంగమేశ్వరం అనేది ఏడు నదులు కలిసే ప్రదేశం. ఈ దేవాలయం సంవత్సరం కాలంలో 8 నెలలపాటు నీటిలోనే ఉండి, కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం ఈ దేవాలయం. ఇది ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.
ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఇది కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. ఈ నదులలో కేవలం భవనాసి నది మాత్రమే పురుషుడి పేరు కలిగినది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే, మిగిలిన నదులన్నీ కూడా పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ కలగలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి తూర్పున బంగాళాఖాతంలో కలసిపోతాయి.
దేవాలయం చరిత్ర…
సంగమేశ్వర దేవాలయాన్ని బాదామి చాళుక్యులు నిర్మించారు. చాళుక్య రాజవంశం అనేది 6 నుండి 12 శతాబ్దాల మధ్య దక్షిణ మరియు మధ్య భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను పరిపాలించిన ఒక సాంప్రదాయ భారతీయ రాజవంశం. “బాదామి చాళుక్యులు” అని పిలువబడే తొలి రాజవంశం 6వ శతాబ్దం మధ్యకాలంలో వాతాపి (ఆధునిక బాదామి ) నుండి పరిపాలించింది. బనవాసిలోని కదంబ రాజ్యం క్షీణించినప్పుడు బాదామి చాళుక్యులు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం ప్రారంభించారు. అలాగే రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు . రెండవ పులకేశి మరణం తరువాత, తూర్పు చాళుక్యులు తూర్పు దక్కన్‌లో స్వతంత్ర రాజ్యంగా మారారు . వారు వేంగి నుండి దాదాపు 11వ శతాబ్దం వరకు పరిపాలించారు.
8వ శతాబ్దం మధ్యలో పశ్చిమ దక్కన్ లో, రాష్ట్రకూటుల ఆవిర్భావం “బాదామి చాళుక్యుల” ను మరుగున పడేసింది. ఆ తరువాత 10వ శతాబ్దం చివరిలో వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు వారిని పునరుద్ధరించారు. ఈ పశ్చిమ చాళుక్యులు కళ్యాణి (ఆధునిక బసవకళ్యాణ్ ) నుండి 12వ శతాబ్దం చివరి వరకు పాలించారు. ఈ “బాదామి చాళుక్యులు” అనబడే సామాన్య శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో తుంగభద్ర నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు. బాదామి ప్రస్తుతం కర్ణాటక లోని బాగల కోట్ జిల్లా లో ఉంది. నిర్మాణాలకు అవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలించే వారు. ఆ ఎడ్ల బండ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. ఆ కందెన మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది.
సంగమేశ్వర దేవాలయానికి దారి…
కర్నూలు పట్టణం నుండి 55 కిలోమీటర్లు దూరం, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ సంగమేశ్వర క్షేత్రానికి రకరకాల మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న “మచ్చుమర్రి” గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని, అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వర దేవాలయానికి ఆటోలు మరియు జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. ఎవరైనా ప్రయాణికులు స్వంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి సంగమేశ్వర ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్.టి.సి.వారు బస్సులను కూడా నడుపుతారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి, అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.
క్రీ.శ. 6వ శతాబ్దానికి ముందే దేవాలయ పునాదులు…
తెలుగు నేలపై దేవాలయ కట్టడాలకు కొద్దిపాటి పునాదులు కలిగి ఉన్న ఆధారాలు (శాతవాహన కాలం నాటికి చెందినవి) బయల్పడ్డాయి శాలిహుండం (శ్రీకాకుళం జిల్లా), తొట్లకొండ (విశాఖపట్నం జిల్లా), బావికొండ (విశాఖపట్నం జిల్లా) మొదలైన బౌద్ధారామాల వద్ద సున్నం, చిన్న కంకర రాళ్లు కలిపిన కాంక్రీటు పై స్థూపాలు, చేత్యాలు, విహారాలను ఇటుకలతో కట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద శాతవాహన కాలం నాడు (క్రీ.శ రెండో శతాబ్దంలో) మిగతా దేవాలయాల కంటే ముందుగా భూమికి లోపల ఒక వరుస రాళ్ళతో పునాదులు ఏర్పాటు చేసి, ఆ పైన ఇటుకలతో విహారాల గోడలు నిర్మించారు. బాదామీ చాళుక్యుల కాలంలో కృష్ణ – తుంగభద్ర నదుల సంగమ స్థానమైన కూడలి సంగమేశ్వరాలయం (మహబూబ్ నగర్ జిల్లా) దేవాలయ పునాదులకు సంబంధించి మన దేశంలోనే అరుదైన ఆధారాలను అందించింది.
బాదామీ చాళుక్యుల రాజైన రెండో పులకేసి తుమ్మయనేరు రాగిరేకు శాసనం విడుదల చేశారు. ఆయన విడుదల చేసిన ఆ రాగిరేకు శాసనంలో రెండో పులకేసి క్రీ.శ. 620 వ సంవత్సరంలో సంగమేశ్వరాలయాన్ని సందర్శించి అభిషేకం చేసిన సందర్భంగా ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. దీనిని బట్టి సంగమేశ్వరాలయం క్రీ.శ. 620 కంటే ముందే నిర్మించారని తెలుస్తుంది. ఆలంపూరు లోని నవబ్రహ్మాలయాల మాదిరిగానే సంగమేశ్వరాలయం రేఖా నాగర ప్రసాద వాస్తు రీతిలో నిర్మించబడింది. శ్రీశైలం జలాశయం ముంపులకు గురైన ఈ ఆలయం గర్భాలయ అర్థమంటప మహా మంటపం చుట్టూ ప్రదక్షిణాపదం, దాని చుట్టూ ప్రాకారం, ముందు ప్రవేశ మంటపం కలిగి ఉంది. ఈ ఆలయాన్ని ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయం నిలువుగా అధిష్టానం, స్తంభ వర్గం, ప్రస్తరం, దానిపైన రేఖానాగర పద్ధతిలో నిర్మించిన ఐదంతస్థుల విమానం, దానిపై ఉసిరికాయని పోలిన శిఖరం, బాదామి చాళుక్య వాస్తుకు అద్దం పడుతుంది.
భూమట్టం లోపల పది మీటర్ల పునాదులు..
చదునుగా చెక్కిన “ఆధారశిల” అనే రాళ్ళ వరుసను భూమట్టంలో ఏర్పరచి, దానిపైన గర్భాలయ అర్థమంటప, మహామంటప స్తంభాలు, చుట్టూ ప్రాకారానికి కావలసిన గోడలు, ఎత్తాల్సిన స్తంభాల కోసం, మానసూత్రం, విన్యాస సూత్రాలను ఉలితో చెక్కిన ఆధారాలు ఆ ఆలయ ప్రాంగణంలో లభించాయి. భూమట్టం నుండి కప్పురాళ్ళ వరకు ఉన్న బరువు, 15 మీటర్ల ఎత్తులో ఉన్న విమానం బరువు తట్టుకునేటట్లుగా భూమట్టం నుండి క్రిందికి 10 మీటర్ల లోతు గల గుంటలు త్రవ్వి, ఆ మట్టిని ఎత్తి బయట పారబ్రోసి, గుంట అడుగున పుట్టమట్టితో నింపి, దిమ్మెచ కొట్టి దానిపై రాళ్ళని పరిచారు. దానిపైన మళ్లీ పుట్టమట్టిని, రాళ్ళను కలిపి తరువాత ఏడు మీటర్లు నింపారు.
పై విధంగా భూమట్టం నుంచి కిందికి పది మీటర్ల పునాదులు ఏర్పాటు చేయడం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కూడా. ఇది తెలంగాణ దేవాలయ కౌశలానికి ప్రతీక. కేవలం తెలంగాణకే కాదు, యావత్ తెలుగు నేలకి గర్వకారణం. మరొక విషయం ఏమిటంటే క్రీ.శ. 8 – 9 శతాబ్ద కాలంలో ఆలంపూరు శివారులోని పాపనాశి దగ్గర రాష్ట్ర కూటుల కాలంలో నిర్మించిన పాపనాశేశ్వర దేవాలయ సముదాయంలో కూడా కొన్ని దేవాలయాలకు ఐదు అడుగుల లోతులో పునాదులు వేశారు. అలంపూరు లోని నవబ్రహ్మాలయాలను మాత్రం ఎలాంటి పునాదులు లేకుండానే నేలను గట్టిపరిచి, ఆ నేల మీదే భూమట్టం పైనుంచే నిర్మించారు. తూర్పు చాళుక్య, కళ్యాణీ చాళుక్యుల కాలంలో కూడా పునాదులు లేకుండానే దేవాలయాల నిర్మించడం విశేషం.
పునాదులు లేని ఆలయాలు కృంగిపోయి…
క్రీ.శ. 750 నుండి క్రీ.శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను కాకతీయులు అనే రాజవంశము పరిపాలించింది. గణపతి దేవుడు,
రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు మొదలగు కాకతీయుల కాలంలో తెలంగాణలో నిర్మించిన దేవాలయాలు చాలా వరకు కృంగిపోయాయి. అందుకు గల కారణం వాటికి పునాదులు సరిగ్గా లేకపోవడమే అని చెప్పాలి. ఆ దేవాలయ పునాదుల్లో కేవలం ఇసుక మాత్రమే నింపడం వలన, కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వర్షపు నీటికి, పునాదులలో ఉన్న ఇసుక రేణువులు కాలక్రమంలో బయటికి వెళ్లిపోవడం వలన దేవాలయ పునాదులు కృంగిపోయాయి. వాటికి ఉదాహరణగా క్రీ. శ.. 13వ శతాబ్దం నాటి కాలంలో నిర్మింపబడిన దేవాలయాలు వరంగల్ జిల్లాలో ఉన్న “ఘనపురం”, “జాకారం”, “నిడికొండ” మొదలగు దేవాలయాలు కృంగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని 1990 ల్లోనే ప్రొఫెసర్ పాండురంగారావు తన పరిశోధనలలో తేల్చేశారు.
పునాదుల గూర్చి శిల్పాశాస్త్రం లో…
మానసార శిల్పశాస్త్రం, విశ్వకర్మీయ శిల్పాశాస్త్రం, శిల్ప రత్నం అనే వాస్తు శిల్ప గ్రంథాలలో వారు తమ అనుభవసారంతో ఆలయ పునాదులను గురించి వివరంగా వ్రాశారు. దేవాలయాల పునాదులు ఏ విధంగా నింపాలో, ఆ విధానాన్ని గ్రంథాలలో చాలా బాగా వివరించారు. క్రీ.శ 13వ శతాబ్దానికి చెందిన విశ్వకర్మీయ శిల్పాశాస్త్రంలో మనిషి తన చేతిని పైకెత్తి నిలబడితే ఎంత ఎత్తులో ఉంటాడో, అంత లోతులో భూమిని త్రవ్వాలి. లేదంటే దేవాలయం యొక్క అధిష్టానం లేదా భూమిపైన నిర్మించే దేవాలయ పీఠం యొక్క ఎత్తు ఎంత ఉంటుందో, అంత లోతున భూమిని త్రవ్వాలి. లేదంటే భూమిని తవ్వుతున్నప్పుడు రాయ లేదా ఇసుక లేదా నీరు పడేంత వరకు భూమిని త్రవ్వి, ఆ త్రవ్విన గుంట లోతును ఐదు భాగాలు చేయాలి.
ఆ లోతు భాగంలో పునాది కింది నుండి మొదటి భాగం అంతా ఇసుక తోనూ, రెండో భాగం అంతా నేరేడుపండు పరిమాణంలో ఉన్న కంకర రాళ్లతోనూ, కాంక్రీట్ తోనూ నింపేసెయ్యాలి. మూడో భాగం కోతి తలంత సైజు రాళ్ళు మరియు కాంక్రీట్ తోనూ, నాలుగో భాగం కొబ్బరికాయ ప్రమాణం గల రాళ్లతోనూ, మిగిలిన ఐదో భాగం ఏనుగు తలంత పరిమాణం గల రాళ్లతోనూ, నీరు, ఇసుక, బంకమన్ను కలిపి దిమ్మెచ వేసి, పునాదులను ధృడంగా చేయాలి. ఆ తరువాత ముందుగా నిర్ణయించిన కొలతల ప్రకారం దేవాలయాన్ని నిర్మించాలని ఆ విశ్వకర్మీయ శిల్పాశాస్త్రంలో చెప్పబడింది. మిగతా రెండు శిల్ప శాసనాలలో కూడా పునాదులు ఈ విధంగానే వేయాలని చెప్పబడింది. ఏ గ్రంథంలో చెప్పనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్న తెలుగు – కన్నడ శిల్పలు క్రీ.శ. 7 వ శతాబ్దంలో కూడలి సంగమేశ్వర ఆలయానికి పునాదులు వేయడం ఆశ్చర్యకరమైనదే అని చెప్పవచ్చు.










