
వారిది తెలుగు చలనచిత్ర రంగానికి మూకీ సినిమాలను పరిచయం చేసిన కుటుంబం. సినిమా నిర్మాణం, సినిమా వ్యాపారం, చలనచిత్ర పరిశ్రమలోని అన్ని శాఖల గురించి ఎరిగిన కుటుంబం. అది రఘుపతి వెంకయ్య నాయుడు కుటుంబం. మూకీ చిత్రాలను తెచ్చి తెలుగుదేశంలో ప్రదర్శించడం, ముడి ఫిలిం తెచ్చి మూకీ చిత్రాలను స్వయంగా నిర్మించడం చేసి సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి, తెలుగు చలనచిత్ర పితామహులుగా పేరు గాంచడం రఘుపతి వెంకయ్య కుటుంబానికి దక్కింది. ఆ కుటుంబంలోని తృతీయ తరం వ్యక్తి నటి దేవిక. ఆమె స్వయానా రఘుపతి వెంకయ్య కు మనుమరాలు. నటి దేవిక తల్లికి ఆయన చిన్నాన్న అవుతారు. దేవికను సినిమా నటిని చేయాలనేది అమ్మమ్మ కనకం బలమైన కోరిక. ఆ కోరికతోనే మనుమరాలికి సంగీతం, నాట్యం, గానం నేర్పించింది. వారు ఉండేది మద్రాసు లోనే గనుక సినిమా అవకాశాల కోసం తెలిసిన వారి సిఫారసు కోరింది. అలా టి.ఆర్. మహాలింగం రూపంలో మొట్టమొదటి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. అందుకు కారణం సంభాషణల ఉచ్చారణ సరిగ్గా లేకపోవడమే.
తొలి అవకాశం చేజారినా కూడా దేవిక నిరాశ చెందలేదు అందుకు కారణం ఆమె వయస్సు అప్పటికి పన్నెండేళ్ళే. ఆ తరువాత తనకు నాట్యం నేర్పిన నృత్య దర్శకుడి సిఫారసుతో గరికపాటి రాజారావు రూపంలో తొలి అవకాశం లభించింది. ఆయన దర్శకత్వంలో పుట్టిల్లు సినిమాలో తొలిసారి తెరమీద కనిపించారు నటి దేవిక. ఆ తరువాత పక్కింటి అమ్మాయి చిత్రంలో మరో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ అవేమీ కూడా తన సినిమా ప్రస్థానాన్ని ముందుకు నెట్టలేకపోయాయి. చక్కటి రూపంతో ఉన్న ఆవిడ ఛాయా చిత్రాలను తీయించి తెలిసిన వారందరికీ పంపించి ప్రయత్నాలు ముమ్మరం చేసింది అమ్మమ్మ కనక. “రేచుక్క” సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో అవకాశం దక్కింది.
సినిమా కూడా విజయవంతం అయ్యింది. అయినా రావాల్సిన పేరు మాత్రం రాలేదు. ఆమెకు అందం ఉంది, నాట్యం ఉంది. కానీ నటన లేదు. తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. విమర్శించిన వారితోనే ప్రశంసలు పొందాలని పనిగట్టుకుని తమిళ నాటకరంగంలో చేరి శివాజీ గణేశన్ లాంటి పెద్ద పెద్ద నటులతో నటించి, తన సంభాషణోచ్ఛారణతో తమిళ ప్రేక్షకులను మెప్పించి, రెండు సంవత్సరాలలో తనను తాను అద్భుతమైన నటిగా మలుచుకుని “మొదలాలి” అనే తమిళ చిత్రంతో అద్భుతమైన విజయంతో పునరాగమనం చేసి నటిగా తాను ఏమిటో ప్రేక్షకులకు తెలియజేశారు దేవిక.
శివాజీ గణేశన్, యం.జి.ఆర్ లాంటి దిగ్గజ సినిమాల నడుమ విడుదలైన “మొదలాలి” అద్భుతమైన విజయం సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పేరు తెచ్చిపెట్టిందంటే నటిగా తన నటనలో ఎంత పరిణితి చెందారో ఇట్టే అర్థమైపోతుంది. తొలి రోజులలో ప్రమీలగా చిత్రరంగానికి పరిచయమైన, “మొదలాలి” సినిమాతో దేవిక గా మారి తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో పదిహేను సంవత్సరాల పాటు నటనతో, నృత్యంతో తనదైన ముద్రవేశారు. ప్రతీ యేడు తమిళంలో, తెలుగులో సమాంతరంగా చిత్రాలు చేసుకుంటూ, నటనను మెరుగు పరుచుకుంటూ 150 చిత్రాలకు పైగా చిత్రాలలో నటించారంటే తాను నటన పరంగా ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు, జగ్గయ్య, శోభన్ బాబు లాంటి అగ్ర కథనాయకులతో, అలాగే తమిళంలో యం.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ముత్తురామన్ లాంటి దిగ్గజ నటులతో నటించి చలనచిత్ర రంగంలో తిరుగులేని నటిగా కొనసాగారు దేవిక. కొత్త తరం తారల రావడం, తన శరీరంలో మార్పులు వచ్చి స్థూలకాయం రావడంతో అవకాశాలను తగ్గించుకుని, సహాయ పాత్రలు, తల్లి పాత్రలతో సరిపెట్టుకున్నారు దేవిక. సినిమా రంగానికే చెందిన దర్శకులు యస్.యస్. దేవదాసు ను వివాహమాడిన దేవిక “కనక” అనే కూతురుకు జన్మనిచ్చారు. కనక కూడా తరువాత రోజులలో సినీ నటి కావడం విశేషం.
జీవిత విశేషాలు…
జన్మనామం : ప్రమీలా దేవి
ఇతర పేర్లు : దేవిక
జననం : 25 ఏప్రిల్ 1943
స్వస్థలం : మద్రాసు, తమిళనాడు, భారతదేశం
వృత్తి : సినిమా నటి
జీవిత భాగస్వామి : దేవదాసు
తండ్రి : గజపతి రావు నాయుడు
పిల్లలు : కనక
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 02 మే 2002
నేపథ్యం…
దేవిక 25 ఏప్రిల్ 1943 నాడు మద్రాసులో జన్మించారు. వాళ్ళ తాత ముత్తాతలు చిత్తూరు జిల్లాకు చెందినవారు. తెలుగు చిత్రపరిశ్రమలో మొట్టమొదటి మూకీ చిత్రం నిర్మించినది, మద్రాసులో మొట్టమొదటి శాశ్వత చిత్ర ప్రదర్శనశాలను నిర్మించినది రఘుపతి వెంకయ్య నాయుడే. ఆయన దేవిక తల్లి కి బాబాయి అవుతారు. ఆ విధంగా ఆయన దేవికకు తాత అవుతారు. దేవిక తాతలు వృత్తి వ్యవసాయం. వంశపారపర్యంగా సంక్రమించిన దేవాదాయ భూములను వారు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. దేవిక తండ్రి గజపతి రావు నాయుడు విద్యుత్తుశాఖలో ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు వాసుదేవ రావు నాయుడు న్యాయశాస్త్రం చదువుకొని న్యాయవాదిగా పనిచేశారు. చిన్న తమ్ముడు పోలీసు విభాగంలో పనిచేస్తూ ఉండేవారు.
దేవికకు ముందుగా మోహనకృష్ణ అని పేరు పెట్టారు. కానీ అబ్బాయిల పేరులా ఉండడం వలన ఆమె పేరు ప్రమీలగా మార్చారు. ఇంట్లో తనను గారాబంగా రాణి అని పిలుచుకుంటూండేవారు. ప్రమీల చిన్నప్పటి నుండి తర్కం వాదించేవారు. వాళ్ళ నాన్నకు కూడా తర్కం వాదించడం ఇష్టంగా ఉండేది. ప్రమీలకు చిన్నప్పటి నుండి తన బాబాయి లాగా చదువుకుని న్యాయవాది అవ్వాలనుకునేవారు. ప్రమీల అమ్మమ్మ కనకం మంచి గాయని కూడా. ఆమె ఐదు భాషలు నేర్చుకున్నారు. అమ్మమ్మకు లలిత సంగీతంలో ప్రావీణ్యం ఉండటం వలన ఆమె పిల్లలకు కూడా సంగీతం నేర్పించేవారు. కానీ సంగీతం నేర్చుకోవడం దేవికకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ అమ్మమ్మ పోరు తట్టుకోలేక ప్రమీల సంగీతం పాఠాలకు కూర్చునేవారు.
చిత్ర రంగం…
ఒకసారి అమ్మమ్మ కనకం తన మనవరాలుతో కలిసి పెళ్లికి వెళ్ళినప్పుడు ప్రమీల చేయి చూసిన జ్యోతిష్యుడు ఈమె చిత్రరంగంలో ఉన్నత స్థాయికి వెళుతుంది. అమ్మాయికి సంగీతం, నృత్యం నేర్పించండి అని ఆయన చెప్పారు. అప్పటినుండి అమ్మమ్మ కనకకు మనవరాలు భవిష్యత్తు పట్ల విశ్వాసం పెరిగింది. తన మనుమరాలుకు సంగీతంతో పాటు నృత్యం, వయోలిన్ కూడా నేర్పించారు. ప్రమీలకు సంగీతం పట్ల మొదట్లో అయిష్టంగా ఉన్నప్పటికీ పోను పోను ఆమెకు ఆసక్తి పెరిగిపోయింది. 1950 ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో సినిమాల ప్రభావం పెరగడంతో ప్రమీలను సినిమాలలో నటింపజేయాలని అమ్మమ్మ కనకం పట్టుబట్టారు. వాళ్ళు మద్రాసులోనే ఉండడం వలన అప్పటికే తమిళంలో బాగా పేరున్న నటులు, గాయకులు, సంగీత దర్శకులు టి.ఆర్.మహాలింగం ను కలుసుకొని విషయం చెప్పారు. ఆయన తాను పనిచేసే దర్శకునికి దేవికను పరిచయం చేశారు. అప్పటికి ఆమె వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. ఆమెకు ఏదో ఒక వేషం ఇవ్వాలని దర్శకుడు అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ప్రమీలకు సంభాషణలు చెప్పడం రాలేదు. దాంతో ఆ సినిమాలో నటించే అవకాశం చేజారింది.
తొలి చిత్రం “పుట్టిల్లు” (1953)..
తొలి ప్రయత్నంలో విఫలమయినా అమ్మమ్మ కనకం మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు, నాటకరంగ ప్రముఖులు, తెలుగు సినిమా దర్శకులు గరికపాటి రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి, దర్శకత్యం వహించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశారు. పుట్టిల్లు సినిమాకు నృత్య దర్శకులుగా పనిచేస్తున్న వ్యక్తి, ప్రమీలకు నృత్యంలో శిక్షణ ఇచ్చే వ్యక్తి ఒక్కరే అవ్వడంతో ఆయనే ప్రమీలను తీసుకెళ్లి గరికపాటి రాజారావుకు పరిచయం చేశారు. ఆమెను పరిశీలించిన రాజారావు ప్రమీలకు ఒక వేషం ఇచ్చారు.
ఆ విధంగా మొట్టమొదటిసారిగా ప్రమీల వెండితెరపై కనిపించిన చిత్రం పుట్టిల్లు (1953). ఇందులో ప్రమీలకు ఇచ్చిన వేషం చాలా చిన్నది. పుట్టిల్లు సినిమా 19 ఫిబ్రవరి 1953లో విడుదలైంది. ఆ రోజులలో నవరసాల్లో హాస్యానికి సముచిత స్థానం కల్పించిన తెలుగు సినిమా “పక్కయింటి అమ్మాయి” (1953). చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రేలంగి, అంజలీదేవి నటించిన ఈ చిత్రంలో కూడా ప్రాధాన్యత లేని పాత్రలో నటించారు ప్రమీల. ఈ సినిమా డిసెంబరు 1953లో విడుదలైంది. ఆమె సినీ ప్రస్థానానికి ఏమంత ఉపయోగపడకపోయినా కూడా అమ్మమ్మ ఏమాత్రం పట్టు వదల్లేదు. అప్పట్లో ఫోటో స్టిల్స్ ను చూసి నటీనటులను ఎంపిక చేసేవారు. దాంతో అమ్మమ్మకు కూడా మెకో స్టూడియోస్ లో స్వామినాథన్ వద్ద ప్రమీలను ఫోటో స్టిల్స్ తీయించి వాటిని స్టిల్స్ సత్యంకు చూపించారు. ఆ ఛాయా చిత్రాలను చూసిన పోలుదాసు పుల్లయ్య ప్రతిభా పిక్చర్స్ నిర్మాణంలో 1955 లో తెరకెక్కించిన “రేచుక్క” సినిమాలో ప్రమీలను ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటింపజేశారు.
నాటక రంగం…
గుడిమెట్ల అశ్వత్ధామ సంగీతాన్నందించిన “రేచుక్క” (1955) సినిమా లో ప్రాధాన్యమున్న పాత్రలో నటించినా కూడా ప్రమీలకు రావాల్సినంత పేరు రాలేదు. “ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం” అనే పాటలో ఆమె నృత్యం చేశారు. 25 మార్చి 1955లో విడుదలైన “రేచుక్క” ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు కేంద్రాలలో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. దీని శతాబ్ది ఉత్సవాలు విజయవాడలో నిర్వహించబడ్డాయి. అందం, అభినయమున్న పాత్రలో ఆమె నటించినా, అందాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు, కానీ ఆమె అభినయానికి మాత్రం విమర్శలు వచ్చాయి. విమర్శించిన వారితోనే ప్రశంసలు పొందాలనుకున్న ప్రమీల తన నటనను రంగస్థలంపై నిరూపించుకోవాలి అనుకున్నారు.
తమిళ సినిమా రంగంలో అప్పుడప్పుడే దూసుకుపోతున్న శివాజీ గణేషన్ బృందం “రెయిన్ బో” అనే నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో నటించాల్సిన నటి ఎం.ఎన్.రాజ్యం అదే సమయానికి సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ప్రమీల కూడా నాటకాల కోసం ప్రయత్నం చేస్తుండడంతో ఎం.ఎన్.రాజ్యం నటించాల్సిన ఆ పాత్రకు ప్రమీలను తీసుకున్నారు. అలా ప్రమీల”రెయిన్ బో” నాటకంతో రంగస్థలం ప్రవేశం చేశారు. ఆ విధంగా శివాజీ గణేశన్ తోనూ, “సహస్ర నామం సేవా స్టేజి కంపెనీ” నాటకాలలో రంగస్థలంపై నటిస్తూ, తన నటనకు తుది మెరుగులు దిద్దుకుంటూ సాగుతున్నారు ప్రమీల. అలా ప్రమీల నాటక ప్రదర్శనతో తమిళ పేక్షకుల గుర్తింపు తెచ్చుకున్నారు.
కథానాయికగా నిలబెట్టిన “ముధలాలి” (1957)…
నిర్మాత ఎం.ఏ. వేణు “ముధలాలి” అనే రంగస్థల నాటకం హక్కులను కొనుగోలు చేసి, ముక్తా శ్రీనివాసన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ “ముధలాలి” (1957) అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. అప్పటివరకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న ముక్తా శ్రీనివాసనికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు నిర్మాత ఎం.ఏ. వేణు. ఇందులో కథానాయకుడిగా “సేదపట్టి సూర్యనారాయణ రాజేంద్రన్” (ఎస్.ఎస్. రాజేంద్రన్) ను తీసుకున్నారు. ఆయన తరువాత రోజులలో డీ.ఎం.కే, అన్నా డి.ఎం.కె పార్టీలకు పేరు మోసిన నాయకులు అయ్యారు. అలాగే కథానాయికగా ప్రమీలను ఎంచుకున్నారు. తమిళంలో ప్రేక్షకులకు ప్రమీల పేరు పలకడం కష్టంగా ఉంటుందని ఆమె పేరును దేవిక గా మార్చారు.
1957 దీపావళికి శివాజీ గణేషన్, ఎం.జీ.ఆర్ సినిమాల మధ్య విడుదలైన “ముధలాలి” అద్భుతమైన విజయం సాధించింది. ప్రమీలను దేవిక గా మార్చిన చిత్రం, ఆమెను పూర్తిస్థాయిలో కథానాయికగా నిలబెట్టిన చిత్రం “ముధలాలి”. ఈ చిత్రం ఆమెకు ఉత్తమ నటి బహుమతి తెచ్చిపెట్టింది. ఈ సినిమా దేవికను ఒక్కసారిగా తారాపథానికి తీసుకెళ్ళింది. నాటకాలలో పేరుపొందిన దేవికను తమిళ ప్రేక్షకులు కథానాయికగా అంగీకరించారు. ఈ సినిమా విజయం దేవికను 15 సంవత్సరాలు తెలుగు సినిమా ప్రేక్షకులకు తీరికలేని నటిని చేసింది. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాని మరుసటి సంవత్సరం 1958 లో జగ్గయ్య, జానకి లతో “ముందడుగు” అనే పేరుతో పునర్నిర్మించారు.
“అత్తా ఒకింటి కోడలే” (1958)…
తమిళంలో 1957 లో విడుదలైన “మొదలాలి” సినిమా కంటే ముందుగానే భరణీ పిక్చర్స్ బ్యానర్‌పై భానుమతి సొంత చిత్రం “వరుడు కావాలి” (1957) విడుదలైంది. ఇది తెలుగు మరియు తమిళంలో సమాంతరంగా నిర్మాణం చేశారు. తెలుగులో భానుమతి, జగ్గయ్య ప్రధానపాత్రలో నటిస్తే, తమిళంలో “మనమగన్ తేవై” (1957) పేరుతో భానుమతి, శివాజీ గణేషన్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ రెండింటిలోనూ హీరో చెల్లెలు పాత్ర పోషించారు “దేవిక”. ఇది విడుదలైన నాలుగు నెలల తరువాత ఆమె కథానాయికగా నటించిన “మొదలాలి” విడుదలై ఘనవిజయం సాధించింది.
కొంగర జగ్గయ్య, హేమలత, దేవిక, రమణమూర్తి, ముఖ్య తారాగణంతో కె.బి.తిలక్ దర్శకత్వంలో తెరకెక్కిన “అత్తా ఒకింటి కోడలే” (1958) ప్రమీల పేరుతో నటించిన అఖరు చిత్రం. అప్పటికే రెండు సంవత్సరాలు తమిళ నాటకాలలో తమిళ ఉచ్ఛారణ ఉండడంతో దేవికకు తెలుగు పలకడం సరిగ్గా రాలేదు. అందువలన “అత్తా ఒకింటి కోడలే” చిత్రానికి గుణచిత్ర నటి హేమలత, నటి దేవికకు తెలుగు సంభాషణ ఉచ్ఛారణలో సహాయం చేశారు. “అశోకవనమున సీతా శోకించె వియోగము” పాటలో కూడా అద్భుతంగా అభినయించారు దేవిక. తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఇది. దీనిని తమిళంలో “మామియరుమ్ ఒరు వీటు మరుమగలే” (1961) గా తెరకెక్కించారు. తెలుగులో ఉన్న పాత్రధారులే, తమిళంలో అవే పాత్రలు పోషించారు. ఇలా ఆమె ఐదు సంవత్సరాలలో తెలుగులో ఐదు సినిమాలలో నటించారు. ఆ తరువాత ప్రమీలను తెలుగులో దేవికగా మార్చి కథానాయికగా మార్చిన చిత్రం “శభాష్ రాముడు” (1959).
ఎన్టీఆర్ తో”శభాష్ రాముడు” (1959)…
రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహాతా, అశ్వత్ధ నారాయణ 1959 లో నిర్మించిన తెలుగు చలనచిత్రం “శభాష్ రాముడు”. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక జంటగా నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం చిత్తజల్లు శ్రీనివాసరావు నిర్వహించగా, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు. తెలుగులో “శభాష్ రాముడు”, తమిళంలో “శభాష్ రాము” (డబ్బింగ్ వర్షన్) ఓకే రోజు విడుదల చేశారు. ఈ సినిమా ఘనవిజయం తరువాత దేవికను తమిళ, తెలుగు ప్రేక్షకులు సమాదరించారు. అదే రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహాతా, అశ్వత్ధ నారాయణలు నిర్మాతలుగా చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకులుగా “శాంతినివాసం” (1960) సినిమాను తెరకెక్కించారు.
“శాంతినివాసం” చిత్రంలో కాంతారావుకు భార్యగా, అక్కినేని నాగేశ్వరావుకు వదినగా దేవిక నటించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. దీని ద్వారా దేవిక సంసారపక్షమైన పాత్రకు సరిగ్గా సరిపోతారని పేరొచ్చింది. శభాష్ రాముడు, శాంతినివాసం సినిమాలు దేవికకు దశాబ్దంన్నర తెలుగు సినిమా ప్రస్థానానికి పునాదులు వేశాయి. ఆవిధంగా తెలుగుతో సమాంతరంగా తమిళంలో కూడా తన ప్రస్థానాన్ని ఏర్పరచుకుంటూ తమిళ చిత్రాలలో దూసుకెళ్లారు దేవిక. 1960 వ సంవత్సరంలో దేవిక నటించిన సినిమాలు నాలుగు విడుదలయితే, తమిళంలో రెండు సినిమాలు “కలతుర్ కన్నమ్మ” (1960), ఇవాన్ అవనేతన్ (1960) విడుదలయ్యాయి. వాటిలో 1960 ఆగస్టులో విడుదలైన “కలతుర్ కన్నమ్మ” జెమినీ గణేషన్, సావిత్రి ప్రధాన పాత్రులో నటించిన ఈ సినిమాతో కమలహాసన్ బాలనటుడిగా రంగప్రవేశం చేశారు. ఈ చిత్రంలో దేవిక కథానాయిక కాకపోయినా సావిత్రితో సమాన పాత్ర పోషించారు. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రంలో దేవికకు కూడా కొంత భాగం దక్కుతుంది.
“పావ మన్నిప్పు” (1961)…
1961 వ సంవత్సరంలో దేవిక నటించిన ఆరు తమిళ చిత్రాలు విడుదలయితే, తెలుగులో ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. వాటిల్లో చెప్పుకోదగిన సినిమా “పావ మన్నిప్పు” (1961). శివాజీ గణేషన్, దేవిక, జెమిని గణేషన్, సావిత్రి, ఎం.ఆర్.రాధా తదితరులు నటించారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. జాతీయ స్థాయిలో ద్వితీయ పురస్కారం అందుకున్న తొలి దక్షిణాది చిత్రంగా “పావ మన్నిప్పు” సినిమా నిలిచింది. ఆ తరువాత చాలా సంవత్సరాలకు “ఒకే కుటుంబం” (1970) గా పునర్నిర్మానం అయ్యింది. తమిళంలో దేవిక నటించిన పాత్రను “ఒకే కుటుంబం” (తెలుగు) లో నటి లక్ష్మీ పోషించారు.
1962 వ సంవత్సరంలో దేవిక తమిళంలో ఎనిమిది సినిమాలలో నటిస్తే, తెలుగులో ఆరు సినిమాలలో నటించారు. వీటిలో చెప్పుకోదగింది “మహామంత్రి తిమ్మరుసు” (1962). కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మూడు ప్రధానమైన స్త్రీ పాత్రలు ఉంటాయి. ఇందులో తిరుమల దేవిగా ఎస్.వరలక్ష్మి, చిన్నాదేవిగా ఎల్.విజయలక్ష్మి, అన్నపూర్ణ దేవిగా దేవిక నటించారు. ఈ సినిమాలో ఎస్.వరలక్ష్మి పాటలతో, ఎల్.విజయలక్ష్మి తన నృత్యాలతో అలరించగా, దేవిక సానుభూతి పొందే పాత్రతో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. 1962 వ సంవత్సరపు జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పతకం అందుకుంది.
ముక్కోణపు ప్రేమ కథ “నెంజిల్ ఓర్ ఆలయం” (1962)…
శ్రీ విజయ గోపాల్ ప్రొడక్షన్స్ పతాకంపై జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన తారాగణంతో కె.బి. తిలక్ దర్శకత్వంలో 1962 వ సంవత్సరంలో “చిట్టి తమ్ముడు” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో జగ్గయ్య, దేవికల మీద ఒక పాట ఉంటుంది. ఈ చిత్రంలో జగ్గయ్య అర్జునుడిగా, దేవిక సుభద్రగా కనిపిస్తారు. నిజానికి ఆ కలయికలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, కె.బి.తిలక్ “సుభద్రార్జున”, “కృష్ణార్జున” సినిమాలు తెరకెక్కించాలని అనుకున్నారు. అనివార్య కారణాల వలన అవి కార్యరూపం దాల్చకపోవడం తో జగ్గయ్య, దేవికల మీద చిత్రీకరించిన ఆ పాటను “చిట్టి తమ్ముడు” సినిమాలో వాడుకున్నారు.
సుభద్ర పాత్రలో కనిపించిన దేవిక అందాన్ని చూసి ప్రేక్షకుల ముగ్ధులైపోయారు. అప్పటివరకు చిలిపి పాత్రలు, అందాల పాత్రలు, పోషించిన దేవిక తమిళంలో కరుణరసం ఉప్పొంగే పాత్రలో దేనిక నటించారు. ఆ చిత్రం పేరు “నెంజిల్ ఓర్ ఆలయం” (1962). ఆ చిత్రాన్ని సి.వి. శ్రీధర్ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ కుమార్, ఆర్.ముత్తురామన్, దేవికల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తుంది. ప్రియుడికి, భర్తకు మధ్య నలిగిపోయే ప్రేమ కథా చిత్రం. దీనినే తెలుగులో “మనసే మందిరం” (1966) గా “సి. వి. శ్రీధర్” తెరకెక్కించగా దేవిక పాత్రలో సావిత్రి నటించారు.
యం.జి.ఆర్ తో “ఆనంద జోధి” (1963)…
నటి దేవిక 1959 వ సంవత్సరం నుండి అటు తమిళంలో, ఇటు తెలుగులో రెండింటిలోనూ ఏడాదికేడాది సినిమాలను పెంచుకుంటూ ఇరు భాషల అభిమానుల్ని, అభిమానాన్ని కూడా పెంచుకుంటూ తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగించారు. అలాగే 1963 వ సంవత్సరంలో తెలుగులో మూడు సినిమాలలో నటిస్తే, తమిళంలో పది సినిమాలలో నటించారు దేవిక. వీటిల్లో హరిహరన్ ఫిల్మ్స్ పతాకంపై వి..యన్. రెడ్డి మరియు ఏ.యస్.ఏ సామి దర్శకత్వంలో ఎం.జీ.ఆర్ కథానాయకుడిగా తమిళంలో వచ్చిన “ఆనంద జోధి” (1963) సినిమాలో దేవిక నటించారు.
తమిళంలో జెమినీ గణేషన్, శివాజీ గణేషన్, ముత్తురామన్ లతో ఎన్నో సినిమాలలో దేవిక నటించినప్పటికీ ఎం.జీ.ఆర్ తో మాత్రం ఒకే ఒక్క సినిమా “ఆనంద జోధి” అనే తమిళ సినిమాలో నటించారు దేవిక. ఇది తెలుగులో “దొంగ బంగారం” అనే పేరుతో డబ్బింగ్ అయింది. 1964 సంవత్సరం తరువాత సినిమాల వేగం తగ్గిపోయింది. ఆ సంవత్సరం దేవిక తమిళంలో మూడు సినిమాలలో నటిస్తే, తెలుగులో ఒకే ఒక్క సినిమా “దేశ ద్రోహులు” (1964) అనే సినిమాలో నటించారు దేవిక. అదే సంవత్సరం తమిళంలో వచ్చిన ఆండవన్ కట్టలై (1964) సినిమాలో శివాజీ గణేషన్ తో దేవిక నటించారు. ఇలా దేవిక ప్రస్థానం 1970 వరకు కొనసాగింది.
వివాహం…
దేవిక తెలుగులో నటించిన చిత్రాలు దక్షయజ్ఞం (1962), ఆడ బ్రతుకు (1965), భామ విజయం (1967), నిండు మనసులు (1967), కంచు కోట (1967), నిలువుడు దోపిడీ (1968), గండికోట రహస్యం (1969), చిన్ననాటి స్నేహితులు (1971), రాజకోట రహస్యం (1971), పాపం పసివాడు (1972) లాంటి చిత్రాలు నటిగా దేవిక నటనకు నిదర్శనాలు. 1970 సంవత్సరాలలో దర్శకులు భీమ్ సింగ్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న ఎస్.ఎస్.దేవదాస్ అనే వ్యక్తిని దేవిక పెళ్లి చేసుకున్నారు. వారికి వివాహం జరిగిన తరువాత దేవిక ప్రధాన పాత్రలో నటిస్తూ దేవదాసు దర్శకత్వంలో నటించిన చిత్రం “వేగులి పెన్” (1971). అది జూలై 1971 లో విడుదలైంది.
తమిళ భాషా మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయకులు జెమినీ గణేషన్. ఈ సినిమాకు నిర్మాత ఎస్.ఎమ్. అబ్దుల్ గఫార్, కానీ దేవిక పెట్టుబడి పెట్టారు. ఎన్టీఆర్ ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టగా, భర్తను దర్శకత్వం వహించారు. తన భర్తను దర్శకుడిగా నిలబెట్టడానికి ఆమె చేసిన ప్రయత్నం విజయవంతమైనది. అద్భుతమైన వసూళ్లను ఈ సినిమా సాధించి పెట్టింది. ఈ చిత్రం కూడా తమిళంలో ఉత్తమ ప్రాంతం చిత్రంగా కేంద్ర ప్రభుత్వం పురస్కారం అందుకుంది. ఆ పురస్కారం అందుకోవడానికి దేవిక, దేవదాసు దంపతులు కలకత్తా వెళ్లారు. ఆ సినిమాని మూడు సంవత్సరాల తర్వాత తెలుగులో “స్త్రీ గౌరవం” పేరు తో పునర్నిర్మించారు. కృష్ణంరాజు, దేవిక, చంద్రమోహన్, వెన్నిరాడై నిర్మల నటించిన ఈ సినిమా 21 మార్చి 1974లో విడుదలైంది. కానీ తెలుగులో ఈ సినిమా నిరాశపరిచి దేవిక దంపతులకు నష్టాలను మిగిల్చింది.
మరణం…
వివాహం తరువాత దేవిక సినిమాలలో నటించడం తగ్గిస్తూ వచ్చారు. అందుకు గల కారణం అప్పటికే కొత్త తరం తారలు వస్తుండడం, దేవిక కూడా కాస్త ఒళ్ళుచేయడం. దాంతో ఆమె కథానాయికగా సినిమాలు తగ్గించుకొని “పండంటి కాపురం”, “పాపం పసివాడు”, “నిప్పులాంటి మనిషి” సినిమాలలో గుణచిత్ర నటిగా నటించారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం “రాజకోట రహస్యం” (1971). తమిళంలో శివాజీ గణేషన్ తో నటించిన చిట్టిచివరి చిత్రం సత్యం (1976) అనే తమిళ సినిమా.
అదేవిధంగా రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే తమిళంలో దేవిక నటించిన చిట్టచివరి చిత్రం “నానుమ్ ఓరు తొజిలాలి” (1986). కమలహాసన్, అంబిక నాయకా, నాయికలుగా నటించిన ఈ సినిమాలో దేవిక తల్లి పాత్రలో నటించారు. అదే సినిమాను తెలుగులో సమాంతరంగా “అందరికంటే ఘనుడు” (1987) అని పునర్నిర్మించారు. దేవిక కనిపించిన ఆఖరి చిత్రం ఎన్టీఆర్ “శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర” (1984). ఆ తరువాత దశబ్దంన్నర సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఛాతీ నొప్పితో బాధపడుతుండగా దేవికను మద్రాసులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత కొన్ని రోజులకు 02 మే 2002 నాడు తన 59 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో దేవిక మరణించారు.

